తొలి నాళ్లలో ఆటవిక నేపధ్యంగా వెలుగు చూసిన సంగీతం వేదాల ఆధారంగా దేవాలయాల కారణంగా సమాజంలో కొత్త రూపులో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మతంగ మహర్షి పేరు తప్పక స్మరించాలి. నేడు మనం వింటున్న అనేక రాగాల నేపధ్యం ఈ మహర్షి తనరచన అయిన బృహత్ దేశి ఆన్న గ్రంధంలో వివరించారు. వాటిని ఆయా స్థానిక పేర్లతోనే స్థిరపరచారు. ఉదాహరణకి ఆంధీ, కాంభోజ,మలహార్ ,సారంగ,మార్వ, సౌరాష్ట్ర, ఘుర్జరీ, గౌడ మొదలైన రాష్ట్రాల పేర్లు రాగాలుగా దర్శన మిస్తాయి.
కాలక్రమేణా సంగీతం అనేక మార్పులు, చేర్పులు చేసుకొని ఒక శాస్త్రంగా రూపు దిద్దుకుంది. క్రమంగా సంగీత శాస్త్రంలో గాయకులకు,వాగ్గేయ కారులకు , లక్షణ కారులకు ఒక ముఖ్య స్థానం ఏర్పడింది. అందునా ముఖ్యంగా వాగ్గేయ కారులకు వారికి గల అత్యంత విలక్షణ మైన ప్రతిభ కారణంగా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సంగీత రత్నాకర కర్త సారంగ దేవుడు వాగ్గేయకార లక్షణాలను చాలా విపులంగా చెప్పాడు. ఈ లక్షణాలన్నీ ప్రాచీన వాగ్గేయకారులలో కనిపిస్తాయి. వీరు తమ రచనలలో ఈ లక్షణాలను ఏ రకంగా ప్రదర్శించారు అన్నది గమనిస్తే వారి అపూర్వ పాండిత్యం మనని అబ్బురపరుస్తుంది. అయితే వీరు తమ పాండిత్యాన్ని ప్రజల మీద రుద్దలేదు . భావం ఎంత జటిలమైనా జనానికి అర్థం అయ్యే విధంగానే సామాన్యమైన భాషను ఉపయోగించి వారికి వేదాంతాన్ని సులువుగా అందించారు. ఇన్ని వందల సంవత్సరాల తరవాత కూడా ఆ కీర్తనలు నిలిచి ఉన్నాయంటే వారి భాష ఒకకారణం. కీర్తనలలో వారు చెప్పిన భావాలు భక్తి ప్రపూరితమైనవి. ఇది రెండవ కారణం.ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోకుండా ప్రజల మధ్య తిరుగుతూ తమ కీర్తనలను గానం చేయడం వలన అవి జన సామాన్యానికి అందుబాటలో ఉండేవి. ఈ మౌఖిక ప్రచారం మూడవ కారణం. తమ రచనలలో వీరు ఉపయోగించిన పదబంధాలు, సామెతలు, నానుడులు, ఉపమానాలు నాటి నుంచి నేటి వరకు ప్రజల నోళ్లలో నిత్యం నానుతున్నవే . ఉదాహరణకి: ఎందరో మహాను భావులు.., నిధి చాలా సుఖమా … పలుకే బంగారమాయెనా…ఏ తీరుగా నన్ను దయ చూసేదవో.., బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే.., శాంతము లేక సౌఖ్యము లేదు వంటివి చెప్పుకుంటూ పోతే జీవితం సరిపోదు.
వాగ్గేయకారులకు గల ప్రత్యేక లక్షణాల కారణంగానే నేటికీ ఈ కీర్తనలు పదిలంగా ఉండడానికి దోహదప డ్డాయి.
‘శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం”
ఆనే తొమ్మిది భక్తి మార్గాలలో వీరు తమ రచనలను చేసి సమాజంలో ఒక కొత్త వరవడిని సృష్టించారు. కృష్ణమాచార్యులు, అన్నమయ్య, సారంగపాణి, క్షేత్రయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ,సదాశివ బ్రహ్మేంద్రులు మొదలైన వారు మాత్రమే గాక అనేక ఇతర వాగ్గేయకారుల గురించి, వారి రచనలలోని ప్రత్యేక అంశాల గురించి సోదాహరణ పూర్వకంగా ఈ వ్యాస పరంపరలో వరుసగా తెలుసుకొందాం. 13 వ శతాబ్దికి చెందిన కృష్ణమాచార్యుల వారు చరిత్ర కందినంత వరకు తొలి వాగ్గేయ కారుడు. అక్షరబద్ధమైన సాహిత్యం మనకు వీరితోనే మొదలైంది. సింహాచల నరసింహా స్వామికి అంకితంగా వీరు రచించిన “సింహగిరి వచనములు’ చాలా ప్రసిద్ధమైనవి. తెలుగు దేశంలో వచన రచనకు, భజన సంకీర్తన పద్ధతులకు వీరే ఆద్యులు. ఇందులో కొన్ని వచనాలు తాళానికి లొంగవు.
కానీ కాకువులో వచన కవిత్వం చదివే పద్ధతి ఉపయోగిస్తే ఆ వచనాలు బాగుంటాయి.అయితే పైన చెప్పినట్లు నవవిధ భక్తి మార్గాలలో వీరి రచనలు దొరకలేదు. కానీ వందనం, దాస్యం అనే భావాలు విరివిగా కనివిస్తాయి. ముఖ్యంగా వైష్ణవ భక్తి వీరి రచనలలో బాగా కనివిస్తుంది. కేవలం భక్తి వచనాలు చెప్పి ఊరుకోలేదు, సంఘంలో సాధారణంగా జరిగే అన్యాయాలు, అక్రమాల ను ఎత్తి చూపుతూ వీరు రాసిన వచనాలు సహజ సుందరాలు.దేవదేవునికి విన్నవించినట్లున్న ఈ వచనాలు చదువుతే వారి రచనలలో గల ఉత్తమ వాగ్గేయకారత్వం అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చూడండి.
“దేవా!ద్వయమునకు అధికారి ఎంతటి వాడు?
కోపము, శాంతము, నిర్లజ, ఇంద్రియ జయాపరుండు కావాలెం గాక
ద్వయాధి కారి తన్ను తానెరుగక దూషించు
కపటాచార డాంబిక పరుండు ద్వయాధి కారి యవునే?
ఇందులో కృష్ణమాచార్యుల వారి సామాజిక స్పృహ అర్థమవుతుంది కదా!
ఆ తర్వాత దాదాపు వంద సంవత్సరాల వరకు అక్షర బద్ధమైన ఎవరి కీర్తనలు లభించ లేదు. తొలి వాగ్గేయకారుడైన కృష్ణమాచార్యులకు ,పద కవితా పితామహుడైన అన్నమయ్యకి చాలా పెద్ద అగాధం ఉంది. ప్రతిభా వంతులైన వాగ్గేయకారులు లేరని చెప్పలేము కదా! మనకు వారి రచనలు లభించలేదు.కారణాలు మాత్రం మృగ్యం.
అన్నమయ్య రంగ ప్రవేశం చేసిన తర్వాత సంగీతం, సాహిత్యం ,భక్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. అంతవరకు సుషుప్తిలో ఉన్న పదాలను , భావాలను విరివిగా ప్రయోగించాడు అన్నమయ్య. దేశీ కవితను మళ్ళీ ప్రజల మధ్యన నిలిపాడు. నభూతో నభవిష్యతి అన్నట్లు తన కవితను అజరామరం చేశాడు అన్నమయ్య. తర్వాతి కాలంలో అన్నమయ్య ప్రభావం లేని కవితలు గాని వాగ్గేయ కారులు గాని లేరంటే అతిశయోక్తి లేదు. తర్వాతి కాలంలో ప్రసిద్ధులైన సారంగపాణి , క్షేత్రయ్య, త్యాగరాజు -అన్నమయ్య ప్రభావంలో మునిగిన వారే. కవితను సంగీతంలో సమాసం చేసి అతి మనోహరమైన వాగ్గేయకార సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన అన్నమయ్య పదాల అనంత రూపాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందించడం మాత్రమే కాదు, భక్తి, సంగీతం, సాహిత్యం అనే త్రివేణి సంగమంలో ప్రజలను మునకలు వేయించాడు. పద లక్షణాలను వివరించడంతో పాటు లక్షణ గ్రంధాలను కూడా రచించాడు. ఎన్నింటికో ఉదాహరణలుగా రచనలు చేశాడు.
ఈ ఉదాహరణ చూడండి. రాగం- పాడి, ఆది తాళం లోని ఈ కీర్తన గమనించండి.
పల్లవి: పాప పుణ్యముల పక్వ మిదెరుగరు
నా పాలిట హరి నమో నమో!
చరణం : మానస వాచక కర్మంబుల
తానకముగా నీ దాసుడను
పూని త్రి సంధ్యల భోగ భాగ్యముల
నానా గతులను నమోనమో!
ఇందులో నవవిధ భక్తి మార్గాలలోని దాసత్వం గోచరిస్తుంది. ఇందులో కొన్ని పదాలు మనకీనాడు అర్థం కావు.
కానీ ఆ కాలంలో ఇవి సామాన్యులు మాట్లాడే పదాలే . సమాజం గాని, భాష గాని, జీవన విధానం గాని మార్పులకు లోను గావడం సహజం కదా ! అదే విధంగా వందనం అన్న భావనకు ఈ ఉదాహరణ చూడండి. రాగం: సామంతం, ఝంప తాళం.
పల్లవి: నీ యంత వాడనా నేను నేరము లేమెంచెవు
యీ యెడ నిరుహేతుక కృప జూడు నన్నును
చరణం: నిరతి నిన్నెరుగను నీవు నన్నెరుగుదువు
ధర యాచకుడ నేను దాతవు నీవు
వరుస యాచకుడ నేను వైకుంఠ పతివి నీవ
నరుడ నేను నీవు నారాయనుండవు.
అతి సులువు అయిన భావజాలం అన్నమయ్య సొంతం. అన్నమయ్య ప్రతీ పదం అత్యంత మనోహరమైన భావాలతో ఉంటాయి. వచ్చే సంచికలో మరి కొన్ని ఉదాహరణ లతో అన్నమయ్య పాండిత్యం తో బాటు భక్తి ప్రపత్తులు, వారి సామాజిక దృక్పథం విశ్లేషించుదాం. ప్రతిభావంతుడైన కవి విశ్వరూపం వీక్షించుదాం.