ప్రతి మనిషికి జన్మతః కొన్ని హక్కులుంటాయి. వాటికి తోడు బాధ్యతలూ ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఒకే నాణానికి రెండు వైపులు. విడదీయలేనివి. తరాజుకు కుడి ఎడమల్లా ప్రాథమిక సహజాలు. మనసా, వాచా, కర్మణా ఆచరించేవి, అనుభవించేవి. ప్రేమ, గౌరవంలా ఇచ్చిపుచ్చుకునేవి.
మనిషి సంఘజీవి. సమాజమనే కొలనులో తోటివారితో కలిసిపోయి ఈదాలి. అలలను ఆస్వాదించాలి, లోతులను గౌరవిస్తూ ఆటుపోట్లను ఆకళింపు చేసుకోవాలి. కట్టుబాటులను అనుసరిస్తూ పరిధుల్లో జీవించాలి. మనిషి ఎంత స్వతంత్ర జీవి అయినా బతుకుదెరువుకు విచ్చలవిడి విధానం దరువు కాకూడదు. ఒక దేశ పౌరుడిగా చట్టబద్దంగా నడచుకోవాలి. మనిషికి హక్కులు జన్మతో సిద్ధించినా, బాధ్యత లేని స్వాతంత్ర్యం గమ్యం లేని ప్రయాణంతో సమానం. మాటల్లోనైనా, చేతల్లోనైనా ఇతరులకు హాని జరగనంత వరకే హక్కులకు చెల్లుబాటని గమనించాలి. ఎవరి జీవితాన్ని వారే చిత్రించుకునే చిత్రకారుడిలాగా, ఎవరి ప్రపంచాన్ని వారే చెక్కుకునే శిల్పిలాగా సహకరించేవే హక్కులు, బాధ్యతలు. మానవ హక్కులు అందరికీ సమానమే. హక్కుల అనుభవంలో కాని, బాధ్యతల నిర్వహణలో కాని లింగ భేదం ఉండదు, ఉండకూడదు. నో జెండర్ డిఫరెన్సియేషన్! సృష్టిలో అందరూ సమానమే.
ప్రతి చలనం వెనుక నిశ్శబ్దంగా నడిచే కాలంలా, ప్రతి హక్కు వెనుక ఓ బాధ్యత దాగి ఉంటుంది. చలికాలం తరువాత వసంతం వచ్చినట్లు, హక్కుతో స్వాధీనం చేసుకున్న దాన్ని రక్షించుకునే బాధ్యతను కూడా ప్రకృతి నిర్దేశిస్తుంది. నిజానికి బాధ్యతతో సంరక్షించుకునేవే హక్కులు. బాధ్యత మనిషి సమర్థతకు, గొప్పతనానికి ఆంతరంగిక విలువ. ఒక నమ్మకానికి గుర్తు. ఆదర్శ దాంపత్యంలా హక్కులు, బాధ్యతలు కలగలిపిన అందమైన ఉయ్యాల జంపాలలు. పాట ప్రాభవానికి రాగం, పల్లవిలా, ఎగిరే పక్షికి రెండు రెక్కల్లా, మనిషి మనుగడకు ఈ రెండింటి సమతుల్యత ఎంతో అవసరం. ఎంత నల్లబడినా బరువెక్కని మేఘం వర్షించదు. అలాగే ఎన్ని హక్కులకు అర్హతలున్నా, బాధ్యతలు గుర్తెరిగి నడుచుకున్నంత కాలమే వాటికి గౌరవం, సాఫల్యం (చెల్లుబాటు). చెట్టు పైకి ఎంత ఎదగాలంటే దాని వేళ్లు అంత లోతుగా చొచ్చుకొని వెళ్లాలి. హక్కులకు సాధికార క్షేత్రం బాధ్యతల వక్షస్థలమైనా, హక్కు అధికారమూ కాదు, బాధ్యత బానిస కాదు!
హక్కులు, బాధ్యతలు సమానమేనా?
సందర్భాన్ని అనుసరించి బేరీజు వేయాల్సిన విషయం ఇది. ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది కనుక సంఖ్యాపరంగా సమానం కావచ్చు. రెండింటిని విడదీయడం అసాధ్యమైనా, వాటి ప్రాధాన్యతలో కుడి ఎడమలవడం సహజం. అలా అయితేనే మనిషి మనుగడకు అర్థం, పరమార్థం ఉంటుంది. బీజగణిత సూత్రాలు నిజ జీవితానికి ఎల్లప్పుడు నూటికి నూరుపాళ్లు వర్తించవు. అటు ఇటు అయితే అసమానత అనో, అన్యాయమనో వ్యవహరించడం అర్థరహితం.
బాధ్యతను బరువు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, హక్కును అధికారమనుకోవడం అంతే అవివేకం. చెట్టుకు ఎవరూ నేర్పించరు ఏ కొమ్మకు ఎన్ని పూలు పూయాలో, ఎన్ని కాయలు కాయాలో, ఎంత బరువును మోయాలో. అది ప్రకృతి ఆపాదించే బాధ్యత. అలాగే, బాధ్యతనెరిగి నడుచుకునే మనిషికి హక్కులు వాటికవే మోకరిల్లుతాయి. రెండింటికీ తూకం వేయడం అసంబద్దం. ఏ బాధ్యతా లేని ఏకాంత జీవికి ఏ హక్కులూ ఉండవు. సమాజంలో ఎదుగుదలకు మరో మనిషి తోడ్పాటు అనివార్యం. ఇచ్చి పుచ్చుకునే దృక్పథం ప్రకృతి అనుసరించే సూత్రం. అది ప్రకృతి బిడ్డలందరికీ శిరోధార్యం.
హక్కుల కొరకే ఏర్పరుచుకున్న సంఘాలకు గుర్తింపు అర్థరహితం. కుల, మత, జాతి, జాతీయ, ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక, లింగ, వైకల్య, రూపురేఖల వివక్ష లేకుండా విశ్వ వ్యాప్తంగా జన్మించిన మనుషులందరికి హక్కులు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యమూ సమానమే. ఆయా దేశాల చట్టాలూ, పేదా గొప్ప తేడా లేకుండా సమానంగా వర్తించేవే. నాగరిక సమాజంలో ఎవరు ఎవరికీ తక్కువా కాదు ఎక్కువా కాదు.
హక్కులు.. బాధ్యతల సంచుల్లో ఒ(పొ)దిగిన బహుమానాలు!
బాధ్యత అంటే హక్కు అనుభవించే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యకు పరిష్కారం వెదకడం. అవసరమైన చోట ఆపన్న హస్తం అందించడం. సందర్భాన్ని బట్టి త్యాగం చేయడం. చేపట్టిన కార్యాన్ని నిర్వర్తించడంలో నిబ్బరం ప్రదర్శించడం. క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం. బాధ్యతకు కొలత పరిమాణంలో కాదు ఓర్పులో ఉంటుంది. అదొక స్థితిస్థాపకత. హక్కు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధం.. ఓ పొదుగు. హక్కుకు దున్నే గుణముంటే, మైదానానికుండే పొక్కిలి గుణం బాధ్యతకు ఉంటుంది. కత్తిలాంటి హక్కుకు బాధ్యత ఒక ఒర.. ఓ రక్షణ కవచం! హక్కు బాణమైతే, బాధ్యత ఒక విల్లు. హక్కులనే బహుమానాలకు అవసరమైన ‘గిఫ్ట్ రాప్’ బాధ్యత!
షరతులు వర్తిస్తాయి!
హక్కు అంటే సమాజంలో ప్రతి మనిషికి తనదైన జీవన విధానంతో మనుగడ సాగించడానికి లభించే స్వేచ్ఛ. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు వర్తించని స్వతంత్రత. అది ఆరోగ్యం, విద్య, వాక్కు విషయాలలో స్వేచ్ఛా కావచ్చు. కాని షరతులు వర్తిస్తాయి. పైన పేర్కొన్నవన్నీ దేశ పౌరుడిగా రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులైనా ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లనంత వరకే వర్తిస్తాయి. చట్టపరమైన హక్కులు అందరికీ సమానం కనుక హద్దులు వర్తిస్తాయి. అది వేరొకరిని బాధించేదైతే నవ్వడమే కాదు, ఏడ్వడం కూడా నిషేధమే!
బాధ్యతలతో సరితూగేవే అనుభవించాల్సిన హక్కులు! హక్కు అధికారం కాదు. అది బాధ్యతకు సమాంతరం. బాధ్యతను విస్మరించిన హక్కు, చర్మం ఒలిచిన మృత కళేబరంలా విలువ కోల్పోతుంది. ‘రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కాంప్లిమెంటరీ!’ హక్కులు, బాధ్యతలు ఒకదానిపై ఒకటి పరస్పర ఆధారితాలు. పరిపూరక సమాంతరాలు. ‘వైన్ అండ్ డైన్’ లా పరస్పర అనుబంధం కలిగి ఉండేవి. కేశాలంకారానికి వేసే జడకు రెండు పాయల్లా, రెంటికీ విడదీయరాని అల్లిక. మనిషి వ్యక్తిత్వానికి అవసరమైన గుర్తింపు, గౌరవం దక్కాలంటే ఈ రెండింటి నడుమ సమతుల్యత అవసరం. పుట్టగానే అన్ని పువ్వులు పరిమళించనట్లు, పుట్టుకతోనే రావు అందరికీ అన్ని హక్కులు. రాని వాటిని బాధ్యతతో శ్రమించి సాధించుకోవాలి.
హక్కును అధికారంలా భావించే వారికి అదొక ‘మత్తు’ ఆవరించిన శక్తి. తమ చుట్టూ ఉన్న పర్యావరణంపై, జీవితాలపై కొంత నియంత్రణ ఉండాలనే సహజమైన కోరిక. సరైన అర్హతలు లేని వారికి అదొక బలమైన ఆకర్షణ! ‘హోదా’ అనే భ్రమలో పడేసే మానసిక ప్రేరణ. మనుషుల తత్వాలను బట్టి, కొందరు ఆకర్షితులౌతారు, మరికొందరు దానికి దూరంగా ఉంటారు. అధికారం, హోదా తరచుగా కలిసే ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఇతరులకన్న ఎక్కువగా గౌరవించబడతారని అపోహ. గౌరవం సంగతేమో కానీ, వారిని జనాలనుండి మాత్రం వేరు చేస్తుంది. అధికారానికి రెండు పార్శ్వాలు. ఒక వైపు సానుకూల మార్పుకు దోహదం చేస్తూ పురోగతిని తీసుకురావడం. మరో వైపు అవినీతితో కూడిన అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పూనుకోవడం లాంటి చీకటి కోణం.
బహు పాత్రాభినయం
ఒంటరి కాదు మనిషి. పుట్టిన నుంచి గిట్టే దాకా కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, సమాజ పరంగా ఎన్నో పాత్రల్లో జీవించాలి. ఆయా పాత్రలకు ప్రత్యేకించిన విధులను (బాధ్యతలను) సంపూర్ణంగా నెరవేర్చే దిశలో తలమునకలవుతేనే అధికారికంగా కొన్ని హక్కులకు అర్హుడవుతాడు. గెలుస్తేనే కదా ‘పథకం’ వరించేది! నెరవేర్చిన బాధ్యతలకు గుర్తింపుగా సిద్ధించేవే హక్కులు. ఏవీ అప్రమేయంగా లభించవు. ప్రతి ఒక్కరి జీవితానికి ఇవి అనుభవేకవేద్యమే. హక్కు అంటే దండించే అధికారం కాదు, సంస్కరించే ఆయుధం, సాటి మనిషికి సహకరించే సంప్రదాయం. హక్కు అంటే మనిషి మనిషిని కలిపి నడిపే శక్తి.. విడదీసి విసిరివేసే కుయుక్తి కాదు. నీటిలో దిగని వాడెప్పుడూ ‘గజ ఈతగాడు’ కాలేడు! బాధ్యతలనుండి పారిపోయినవాడికి ఏ హక్కులుండవు. ఆ రెండింటి నడుమ నిత్యం జరిగే వరుస ఘర్షణలను సమన్వయించుకుంటూ వెళ్లడమనేదే మనిషి వ్యక్తిత్వానికి అసలైన నిర్వచనం, జీవితానికి లిట్మస్ పరీక్ష. అప్పుడప్పుడు ఈ రెంటికీ సమతుల్యత కుదరక పోయినా భుజంపై ఆనించిన ‘కావడి బద్దను’ అటు ఇటుగా జరుపుతూ తులనాత్మకంగా వ్యవహరించే మెలకువలను జీవితం నేర్పిస్తుంది ప్రతి మనిషికి. ఇది అందరికి తెలిసినా, తెలియనట్టుండే అతి పెద్ద రహస్యం!
కుటుంబం – బాధ్యతలు – హక్కులు
కుటుంబమంటూ ఏర్పరచుకున్నాకా బిడ్డల బాగోగులకు సతతం పాటు పడడమే భార్యాభర్తల బాధ్యత. అందులో అవసరాన్ని బట్టి త్యాగమూ ఉంటుంది, అందమైన స్వార్థమూ ఉంటుంది. హక్కులున్నా.. అవి నిద్రాణంగా ఉంటాయి. పరిస్థితులు చేయిదాటి పోకుండా వాడుకునేవే ఆ హక్కులు. ఏది సూచించినా మాటల్లోనే కాక చేతల్లోనూ నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. ప్రేమ, గౌరవాలే ప్రమాణంగా కుటుంబానికి రక్షణ కల్పించే దిశలో, కుటుంబ విలువలు కాపాడే ప్రయత్నంలో కొన్ని ప్రత్యేక హక్కులను ఉపయోగించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి యెడల ఇంకొకరికి ఉండాల్సిన బాధ్యతలను సంపూర్ణంగా వివరించడం అసాధ్యం. కుటుంబాన్ని బట్టి కాలానుగుణంగా ఉత్పన్నమయ్యె పరిస్థితులను అనుసరించి వాటి ప్రామాణికతతో పాటు పరిమాణం నిర్ధారించబడుతుంది.
ఇష్టమున్న చోటే బాధ్యత, బాధ్యతతో ఉంటేనే ఇష్టం పుట్టుకొస్తుంది. రెండింటికి అవినాభావ సంబంధం. జీవితం ఒక ప్రయాణం. శిశువుగా ప్రారంభించి క్రమంగా ఎన్నో దశలు దాటుకుంటూ వెళ్తాడు మనిషి. తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, ఇంకా ఇతరత్రా బంధాల పాత్రల్లో ప్రతి మనిషికి తప్పదు జీవితంలో బహు పాత్రాభినయం. ప్రవేశం చేసిన పాత్రను బట్టి బాధ్యతలు, హక్కులు సంక్రమిస్తాయి. వ్యక్తిగత ప్రవర్తనకు సమాజం కొన్ని ప్రమాణాలను ఏర్పరచుతుంది. వాటి ప్రాముఖ్యతను అంగీకరించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఆయా ప్రమాణాల ప్రకారం నడుచుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత.
హక్కులు, బాధ్యతలు రైలు పట్టాలలా ప్రక్క ప్రక్కనే ఉంటాయి ఎప్పుడూ సమాంతరంగా. సర్వసాధారణంగా అవి ఒక దానితో మరొకటి అవిభక్తంగా అనుసంధానించబడి ఉంటాయి. పదవులు, అధికారం హోదాల లాగా, హక్కులు సంపాదించుకునేవి.. ఇవ్వబడవు. ఆడే ఆటను బట్టి మైదానానికి హద్దులు. అలాగే హక్కులకు ఎల్లలు లేదా హద్దులుంటాయి. ఆ హద్దుల రూపాలే బాధ్యతలు. పుట్టిన ప్రతి మనిషికి బ్రతికే హక్కుంది.. కానీ ఇతరుల గొంతు నొక్కుతూ కాదు. జీవించే హక్కును ప్రాథమిక హక్కులన్నింటికీ ‘గుండె’గా భారత సర్వోత్తమ న్యాయస్థానం అభివర్ణించింది. ‘రైట్ టు లైఫ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్!’ నవ్వే హక్కుంది.. ఇతరులను అపహాస్యం చేస్తూ కాదు. ఏడ్చే హక్కుంది.. ఇతరులకు నరకం చూపించడానికి కాదు. మాట్లాడే హక్కుంది.. సాటి వారిని చిన్నబుచ్చడానికి కాదు. చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కులకైనా పరిమితులుంటాయి. చట్టం ముందు అందరు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యం అందరికి సమానమే. ఎలాంటి వివక్షకు తావు లేదు. ముందుకు వెళ్లే హక్కుందంటే.. దారిలో ఉన్నవారి అడ్డు తొలగించుకొని కాదు. నీకంటూ ఒక దారిని సృష్టించుకొని వెళ్లమని అర్థం. హక్కుల విలువ ఇతరుల హక్కులకు భంగం వాటిల్లనంత వరకే. బాధ్యత లేని హక్కు వినాశకరం కావచ్చు. అందుకే ఏ పౌరుడైనా తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది.