ప్రసిద్ధ కథకులు, కవి, రచయిత, విమర్శకులు, వక్త, నాటకకర్త విహారి గారితో మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి
*******************************************
నమస్కారం సార్. మా మయూఖ పాఠకులకు మీ సాహితీ ప్రస్థానాన్ని పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది.
మీ జననం, బాల్యం, కుటుంబాన్ని, విద్యాభ్యాసాన్ని గురించి చెప్పండి.
జ: నమస్కారం అమ్మా! నేను అక్టోబర్ 15, 1941వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను. మా అమ్మగారు జొన్నలగడ్డ శ్రీదేవి, మా నాన్నగారు జొన్నలగడ్డ మేధా దక్షిణామూర్తిగారు. ఆయన ఆ రోజుల్లో గుంటూరు,కృష్ణా జిల్లాల్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్లీష్ అకౌంటెంట్. నాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య, నలుగురు చెల్లెళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా అన్నయ్యను ప్రభల రామబ్రహ్మం గారికి దత్తత ఇచ్చారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ ‘ఏకవీర’ నవలను అంకితం ఇచ్చింది ఆ రామబ్రహ్మం గారికే. మా నాన్నగారు మాటకు బాగా విలువ ఇచ్చేవారు. ఆయనకున్న వృత్తి పట్ల ఉన్ననిబద్ధత, ముక్కుసూటిదనంతో ఉన్న పళాన ఉద్యోగం వదిలేశారు. అంతటి ఆత్మాభిమానం కలవారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు, నాన్న అనారోగ్యంతో చిన్నతనంలోనే కష్టాలను అనుభవించాను. 1955 లో నా ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయింది. చదువు కొనసాగలేదు. ఈలోపు మా నాన్నగారి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడింది. అందువల్ల ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేస్తూ సమయాన్ని బట్టి, ఎమ్.ఎ., ఇన్సూరెన్స్ ఫెలోషిప్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, జర్నలిజం వంటి వాటిల్లో డిప్లొమాలు చేశాను.
ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఇంతటి సాహిత్యానురక్తులు కావడానికి నేపథ్యం ఏమిటి?
జ: నేను చిన్నప్పటి నుండీ పద్యాలు, శతకాలు, పాటలు, భగవద్గీత శ్లోక పఠనం, వక్తృత్వం, వంటి అనేక పోటీ పరీక్షల్లో ముందుండే వాడిని. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దానివల్ల పుస్తకాల పురుగునైపోయాను. పఠనాసక్తి కలిగిన వాడిని కావడం వల్ల అక్కడ ఉన్న శాఖా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాను. లైబ్రేరియన్ గా ఉన్న వెలగం వెంకట్రామయ్య గారు “ఏమయ్యా! ఇంకో గ్రంథాలయం చూసుకోరాదూ!” అన్నారు నవ్వుతూ.ఆవిధంగా ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో ఉన్న పుస్తకాలన్నీ చదివాను. ప్రాచీన కావ్యాలన్నీ భారతీ గ్రంథకర్తలు కీ.శే. హరిసాంబశివరావు శాస్త్రి గారి వద్ద, మా పెద్దమ్మ కొడుకు ఉభయ భాషా ప్రవీణ చల్లా శంకరయ్య గారి వద్ద చదువుకున్నాను. మా గోఖలే ( మాధవపెద్ది గోపాలకృష్ణ ), చా.సో, కరుణశ్రీ వంటి సాహితీ దిగ్గజాలెందరూ నాకు స్ఫూర్తి దాతలు. ఉద్యోగరీత్యా మచిలీపట్నం చేరిన తర్వాత నా సాహిత్యాభినివేశం రెట్టింపు అయింది.
మీ ఉద్యోగ జీవితాన్ని ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు?
జ: నేను మీకు ముందు చెప్పినట్లు మా నాన్నగారు పరమపదించిన తర్వాత నేను కుటుంబ పోషణ బాధ్యత మోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చదువు మానేసి ఉద్యోగానికి వెళ్ళాను. ఆ ఉద్యోగం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే పంచవర్ష ప్రణాళికల కింద ప్రారంభించారు. మాలకొండయ్య గారని IAS ప్లానింగ్ ఆఫీసర్. ఆయనను ఒకరి ద్వారా కలుసుకున్నాను. ఆయన కూడా నావంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారవడం వల్ల నన్ను ఆదరించి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఆ కాలంలో సివిల్ ఇంజినీర్ టెస్టులు ఉండేవి. ఇప్పుడు తీసేశారు. అవి పాసయితే డిప్లొమా, డిప్లొమా పాసయితే డ్రాఫ్టింగ్, సూపర్ వైజర్ గా వెళ్ళొచ్చు. అలాగే డిగ్రీ చేసుకోవచ్చు. నేను దాన్ని అతితక్కువ సమయంలో, అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేశాను. LDC క్యాడర్ రూ.67/- ఉండేది. నాకు రూ.84/- ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. పదహారు పేపర్లు పూర్తి చేయాల్సి ఉంటే నేను ఎనిమిది పేపర్లు పూర్తి చేయగానే ప్రమోషన్ ఇవ్వడం గొప్ప విషయం ఆ రోజుల్లో.
LIC లో మీ ప్రవేశం ఎలా జరిగింది? తర్వాత మీ ఉద్యోగ ప్రస్థానం ఎలా కొనసాగింది?
నేను ఎల్.ఐ.సి లో ప్రవేశించడం యాదృచ్చికంగా జరిగింది. బాపట్లలో మాకు దూరపు బంధువు కొండయ్యగారు అందులో పని చేస్తుండేవారు. కొండయ్య గారి తండ్రి గురు గోవింద స్వామి శిష్యుడు. ఆయన ‘కపిల గోసంవాదం’ అని భారతంలోని కథాంశాన్ని తీసుకొని ఆధ్యాత్మిక కావ్యం రాశారు. నా జాబుకి సంబంధించిన అప్లికేషను పంపించారు. అప్పట్లో 55% మార్కులు ఉంటే ఎల్.ఐ. సి. అసిస్టెంట్ అర్హత ఉండేది. నాలుగు సౌత్ స్టేట్స్ కలిపి కాంపిటేషన్ టెస్ట్ నిర్వహించేవారు. ఒక్క మచిలీపట్నంలోనే దాదాపు 2వేల 3 వందల మంది రాశారు. అట్లా పరీక్ష రాసిన లక్షా 28 వేల మందిలో ఎస్.ఎస్.ఎల్.సి.వాడిని నేనొక్కణ్ణే. అటువంటిది ఆ పరీక్ష పాసవడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడం కూడా జరిగింది. ఆ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం 1961 మచిలీపట్నం నుండి ప్రారంభమైంది. కుటుంబాన్ని తీసుకొనివెళ్ళాను. ఆ తర్వాత పి.యు.సి. పాసయినాను. ఎల్.ఐ.సి లో ప్రొఫెషనల్ పరీక్షలుండేవి. నేను లైసెన్సుయేట్ నుండి అసోసియేట్ స్థాయికి వచ్చాను. అక్కడ ఆరు పేపర్లు రాయవలసి ఉంటుంది. అది ఒక్కసారి అయినా రెండుసార్లు అయినా పూర్తి చేసుకునే అవకాశం ఉండేది. నేను ఒకేసారి 6 పేపర్లకు కట్టాను. అందులో Actuarial science అని మేథమేటిక్స్ బేసిస్ పేపర్ ఉంటుంది. ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్స్ ఈనాటికీ గొప్పవిగా భావించబడుతున్నాయి. అందులో ఒకటి ఆర్చురీ, రెండవది చార్టెడ్ అకౌంట్. ఆర్చురీ లండన్ లో ఉంటుంది. చాలా కష్టమైనది. మేథమేటిక్స్ బేసిక్ లేనివాళ్ళకు మరీ కష్టం. నేను ఆరు పేపర్లు ఒకేసారి పాసయ్యాను. మా ఫెడరేషన్ లో ఒక రికార్డు అది. 150 మంది ఉన్న మా డిపార్టుమెంటులో సీనియర్ గా ఉన్న వ్యక్తి రిజల్ట్ తీసుకొచ్చి నన్ను పిలిచి అందరి ముందు నన్ను బెంచీపై నిలబడమని నిలబెట్టి ఆ విషయాన్ని గొప్పగా చెప్పడం మర్చిపోలేను. తర్వాత బి.ఏ, ఎమ్.ఏ లు, ఫెలోషిప్ కూడా పాసయ్యాను. ఆరు పేపర్లు ఒకేసారి పాసయినందుకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. నా తర్వాతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి తో అర్హత తీసేసి కనీస అర్హతగా డిగ్రీ ఉండాలని నిర్ణయించారు (పెద్దగా నవ్వుతూ). ఆ తర్వాత HGA (Higher grade assistant) గా చేశాను. 15 సంవత్సరాలు చేశాను కానీ ప్రమోషన్ల విధానం కోర్టు కేసులతో నడిచి చివరకు 1979 లో ధార్వాడకు సూపరింటెండెంట్ గా వేశారు. తర్వాత కడపలో తొమ్మిదన్నర ఏళ్ళు చేశాను. బొంబాయిలో సంవత్సరం, అటునుండి 1990- 94 వరకు హైదరాబాద్ లో మొదటిసారి చేశాను. మళ్ళీ బెంగుళూరు రెండేళ్ళు, తిరిగి బొంబాయిలో చివరగా హౌసింగ్ ఫైనాన్స్ కి డిప్యూటీగా వేశారు. ఆలిండియా క్యాడర్ లో 101 ఆఫీసులకు హెడ్ గా ఉన్నాను. ఏడేళ్ళు పనిచేసి 2001 వ సంవత్సరం చివర్లో రిటైర్ అయ్యాను. తీసుకోగలిగే పదవి అయినా నేను నా జీవితంలో అవినీతి పనులకు పాల్పడింది ఎప్పుడూ లేదు. “నా బ్యాంక్ పాస్ బుక్, నా జీవితం పాస్ బుక్ ఎప్పుడూ ఓపెన్” అనేది నా స్టేట్ మెంట్. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు ( నవ్వుతూ ). నా పిల్లల్ని కూడా అలాగే పెంచాను.
‘ఆంధ్ర సారస్వత సమితి’ స్థాపనకు దారి తీసిన పరిస్థితులేవి?
ఇంతకుముందే మచిలీపట్నంలో ఉద్యోగం ప్రారంభించానని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళగానే నేనొక భావోద్వేగానికి గురయ్యాను. కారణం విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి కాటూరి కవులు, ముట్నూరు కృష్ణారావు గారు, పట్టాభి సీతారామయ్య గారు వంటి వాళ్ళ పేర్లు వింటేనే ఒడలు పులకరిస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్న నేల అది. “ఇచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ” అని గుర్తుకు వచ్చింది. ఎంత గొప్ప ప్రదేశం? ఆ మట్టి ఆ గాలి కూడా అంతే. ఆ పరిస్థితుల్లో సాయంత్రం పూట పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఆదివిష్ణు, రావూరి సత్యనారాయణ గారు వంటి ప్రముఖులు ఇలా చాలామంది కలుస్తుండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు ఒకసారి “ఏమయ్యా విహారీ! మనం ఎలాగూ అందరం కలుస్తున్నాం కదా! ఒక సంస్థ పెడితే బాగుంటుంది కదా!” అన్నారు. నేను సరేనన్నాను. ఏడుగురం కలిసి రిజిస్ట్రేషన్ చేయించాం. అందులో తొలి సంతకం అద్దేపల్లి వారిదైతే రెండవది నాది. మొట్టమొదటి సభ 11 మందితో టౌన్ హాల్లో పెట్టాము. వేదాల తిరు వెంగళాచార్యులు గారని, అలంకారశాస్త్రంలో దిట్ట. ఆయనను ప్రసంగానికి పిలిచాం. పదకొండు మందిలో కూడా ఏడుగురే వచ్చారు. అదీ పరిస్థితి. కానీ నేను దాన్నుండి బయటకు వచ్చేనాటికి చివరి సభకు లోపలే కాకుండా బయట 300 కుర్చీలు వేయిస్తే ఆ మూడువందల కుర్చీలలో మొత్తం ఆడవాళ్ళు కూర్చోవడం విశేషం. ప్రహరీ గోడ మీద కూర్చొని, నిలుచొని కూడా కొంతమంది విన్నారు. ఆ స్థాయికి దాన్ని తీసుకొచ్చాం.
ఆ సంస్థ ద్వారా మీరు చేసిన కార్యక్రమాలు ఏవి?
ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. ఒకటి మా మెంబర్స్ ప్రతీనెలలో పదిహేను రోజులకు ఒకసారి ఒక తేదీన గోష్ఠి నిర్వహించుకునేవారం. రెండవది సభ ఏర్పాటు చేయడం. అందువల్ల ఊళ్ళో ఒక విధమైన చైతన్యం వచ్చింది. దాదాపు తెలుగునాట ఉన్న ప్రముఖులందరినీ ప్రసంగాలకు పిలిచాము. ఎంతోమంది ఆర్థిక సహకారం అందించారు. త్రివేణి వక్కపొడి ఓనర్ వెంకట సుబ్బారావు అయితే “మీరు ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సిన మొత్తాన్ని నేను ఇస్తాను” అని అనేవారు. నేను గొప్ప సమన్వయ వాదిని అని పేరు నాకు. ఎందుకంటే అన్ని విధాలైన భావ జాలాలను కలుపుకు పోతాను. ప్రాచీన సాహిత్యం లో శ్రీశ్రీ సాహిత్యాన్ని అభిమానించే extrimists ఉండేవారు. అద్దేపల్లి రామ్మోహన్ రావుగారు శ్రీశ్రీ మీద మొట్టమొదటి విమర్శ పుస్తకం రాశారు. ఆ కారణంగా ఆ ఊళ్ళో మా సంస్థ ద్వారా ఎంతో చైతన్యం వచ్చింది.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చివరి సభకు సినారె గారు ప్రధాన వక్త. ఎమ్. వి. ఎల్., కావిలిపాటి విజయలక్ష్మి, మధురాంతకం రాజారావు వీళ్లంతా వేదిక మీద ఉన్నారు. ఎస్.పి గారిని అధ్యక్షునిగా పిలిచాము. అది ఎమర్జెన్సీ పూర్తయిన కాలం. సమయానికి ఎస్.పి.గారికి అర్జెంట్ పని ఉండడం వల్ల రావడం లేదని చెప్పాడు. రామచంద్ర రాజు గారు జిల్లా జడ్జి. ఆయనను పిలిచాము. గతంలో బుచ్చిబాబు నవల మీద లైబ్రరీలో నేను ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈయనే అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ ఆత్మీయతతో అంగీకరించారు. అప్పుడు నారాయణరెడ్డి గారు మాట్లాడిన మొదటి వాక్యం “చట్టం గద్దె దిగింది న్యాయం గద్దె నెక్కింది” అని ఎమర్జెన్సీని ఉద్దేశించి అనడంతో జనమంతా చప్పట్ల హోరు. అదే సభలో కొడాలి ఆంజనేయులు గారూ ఉన్నారు ముందు వరుసలోనే. రెండు నిమిషాలు మాట్లాడతానని వేదిక మీదకు వచ్చారు0 (విశ్వనాథ వారు ఈయన కలిసి సత్యాంజనేయులు అనే పేరుతో అవధానాలు నిర్వహించారు). “నేను పుట్టిన ఈ బందరులో మూడే మూడు సభల్లో ఇంతమంది జనం ఉండడం చూశాను. ఒకటి నీలం సంజీవరెడ్డి గారు వచ్చినప్పుడు, రెండవది అతుల్య ఘోష్, సుచేతా కృపలానీ వచ్చినప్పుడు, మూడవది ఇదే సభ. మొదటి రెండూ రాజకీయ సభలు కాబట్టి జనం రావచ్చు. కానీ ఒక సాహితీసభను గోడలెక్కి చూడడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మేము చేస్తున్న కృషిని అభినందించారు.
అదేవిధంగా ‘స్పందన’ సాహితీ సమాఖ్యను గురించి తెలపండి.
నేను ఆంధ్ర సారస్వత సమితి తరఫున 1972 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీకి ఎన్నుకోబడ్డాను. అక్కడ అందరికంటే నేను వయసులో చిన్నవాడిని. పావలా సభ్యత్వంతో 300 మంది సభ్యులున్నారు దాంట్లో. రూపాయి సభ్యత్వం కోసం మీటింగులలో ప్రయత్నాలు మొదలయ్యాయి. పావలా ఇవ్వడానికే వెనుకాడేవారు రూపాయి ఎలా ఇవ్వగలరు? అప్పటికే సభలకు చందాలు వసూలు చేస్తున్నారు. ఉన్న సభ్యులు కూడా పోతే ఎలా? అందుకే అది అమలు కాలేదు. 11 ఏళ్ళు నేను సంస్థకు అధ్యక్షునిగా చేశాను. ఇక్కడ శివారెడ్డి, కుందుర్తి, శీలా వీర్రాజు గార్లతో పనిచేసిన గుత్తికొండ సుబ్బారావు సంస్థలోకి వచ్చి చేరాడు. ఎప్పుడు సభలు చేయాలంటే మా ఇద్దరి పేర్లే వచ్చేవి. నాకు ఎంతోమంది పరిచయం ఉండడం వల్ల నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. ఒకసారి సినారె గారు సభలో “విహారి పిలవడం వల్ల వచ్చాను. కానీ మద్రాసు నుండి ఊరికే ఎవరైనా వస్తారా?” అన్నారు. అలాగే ఎమ్.వి.ఎల్. కూడా. ఎవ్వరైనా సభల్లో ఆ విషయం చెప్పేవారు. దానిని ‘వ్యక్తి పూజ’ అనుకోవడానికి లేదు కదా! వ్యక్తి లేకుండా సంస్థ ఏముంది? అయితే ఈ కారణంగా ఒక పదిహేను మంది అసంతృప్తి వర్గం తయారయింది. అందులో బోయి వెంకటేశ్వర్లు అనే ఆయన అధ్యక్షునిగా కాదలచుకున్నాడు. నాతో పోటీలో గెలవలేనని తెలుసు కాబట్టి ఉపాధ్యక్షునిగా ఉంటానన్నాడు. అప్పటివరకు ఎన్నికలు లేవు. ఆయన మాట మాత్రంగా చెప్పాడే కానీ నామినేషన్ వేయలేదు. ఈలోగా సరస్వతి అనే ఆవిడ నామినేషన్ వేసింది. ఆయన వచ్చి గొడవ చేశాడు. కనీసం వేస్తానని ఆయన మాకెవ్వరికీ చెప్పలేదు. విత్ డ్రా చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో మేము ఒక ఏడుగురం బయటకు వచ్చి ‘స్పందన సమాఖ్య’ కు రిజిస్ట్రేషన్ చేయించాము.
ఇందులో మేము పుస్తక ప్రచురణను కూడా ఒక భాగంగా చేసుకున్నాం. దాని తరఫున నేను ధార్వాడ వెళ్ళే లోపు 120 పుస్తకాలు వేశాము. అందులో చాలా పుస్తకాలు యూనివర్సిటీలో రెఫరెన్సు పుస్తకాలుగా ఉన్నాయి. కుందుర్తి పీఠికలు లాంటి స్టాండర్డ్ పుస్తకాలు వేశాము. కథలు, నవలలు వేశాము. దాశరథి దగ్గర నుండి తెలుగుదేశంలో ఉన్న కవులందరినీ కలిపి ‘కవిత’ అనే పుస్తకం వేశాము. ఇదేకాక ‘స్పందన’ అనే మ్యాగజైన్ వేశాము. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్ హసన్ శ్రీశ్రీ ముఖచిత్రం ఉన్న ఆ మ్యాగజైన్ పట్టుకొని తిరుగుతుంటాడు ( నవ్వుతూ ). నేను ధార్వాడకు వెళ్ళడం ఆ సంస్థకు తీరని లోటు. ఎంత ప్రయత్నించినా దాన్ని కొనసాగించడం ఎవరివల్లా కాలేదు. అప్పులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఉంటాం.
మీ రచనల్లో కథా సాహిత్యం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమైనా ఉందా?
ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి పాసయిన తరువాత గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాణ్ణి అని చెప్పాను కదా! అందులో నన్ను చాలా ప్రభావితం చేసినవి మధురాంతకం రాజారావు, గోపీచంద్ పుస్తకాలు. దాంతో మిగిలిన వాటికంటే కథా సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అసలు నేను ప్రాథమికంగా పద్య సాహిత్యం, ప్రాచీన సాహిత్యాల పట్ల గట్టి పట్టున్నవాణ్ణి. హరి సాంబశివరావు గారు మా గురువు గారు. నేను ఆయన దగ్గర కావ్యాలన్నీ చదువుకున్నాను. అంతకుముందే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి అని ఆయన మా అమ్మకు కజిన్ అవుతారు. శాస్త్రిగారికున్న ఏకైక చెల్లెలు మా మేనమామకు భార్య. అందుకే పట్టు సాధించగలిగాను. అలాంటివాణ్ణి ఆధునిక సాహిత్యంలోకి వచ్చి ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో కథలు, నవలలు, విమర్శలు చదివాను. ఇదిలా ఉండగా బందరు ఉద్యోగం లోకి వచ్చిన తరువాత నాతో పాటు శాలివాహన ( త్రిపురారి భొట్ల నారాయణ మూర్తి ), నేను కలిసి పనిచేశాము. మా ఇంటి వెనుక పిట్ట గోడ ఉండేది. ఆయన ఇల్లు అటువైపు ఉండేది. అప్పుడేదో సందర్భంలో కథల ప్రస్తావన వచ్చింది. ఆయన అప్పటికే కథలు రాస్తున్నాడు. అయితే నేను కూడా రాద్దామనుకున్నాను. ఇద్దరం కలిసి రాయాలనుకున్నాము. అప్పటికే ఆయన శాలివాహన పేరుతో రాస్తున్నాడు. నేను విహారి అనే పేరుతో ఏవో పద్యాలు, వ్యాసాలు సందర్భోచితంగా రాస్తుండేవాడిని. ఆంధ్రజ్యోతి సాహిత్యానుబంధంలో కూడా రాసేవాడిని. ఇక ఆయన నేను ఇద్దరమూ కలిసి 1977 వరకు ముమ్మరంగా కథలు రాశాము. 1977 లో నేను ధార్వాడ వెళ్ళాను. అప్పటినుండీ సెపరేట్ గా రాయడం ప్రారంభించాము. 1977 – 79 మధ్య ధార్వాడలో ఒక్క రచన కూడా చేయలేదు. 1979లో కడపకు వచ్చాను. అక్కడినుండి మళ్ళీ నా రచనా వ్యాసంగం మొదలైంది. ఒక రకంగా రెండవ సాహితీ జీవనమని చెప్పవచ్చు.
మీరు రాసిన ‘చలనం’ అనే కథ ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నదని విన్నాం. అదేంటో చెప్తారా?
మంచి ప్రశ్న. ‘చలనం’ కథలో ఉన్నది ఏంటంటే Existentialism. మనం అస్తిత్వవాదం అని అంటుంటాం కదా! మన తెలంగాణ, ఆంధ్ర అలాంటి అస్తిత్వ వాదం కాదు. సాహిత్యంలో Existentialism అనే దానికి అస్తిత్వవాదం అని పేరు పెట్టిన వారు మొదట గోపీచంద్ అయితే దాన్ని తెలుగు సాహిత్యలోకానికి పరిచయం చేసింది బుచ్చిబాబు. గోపీచందుని ‘అసమర్థుని జీవయాత్ర’లో, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో దాన్ని వాళ్ళు అప్లై చేశారు. నా కథల్లో Existentialism అనేది ఆకుచాటు పిందె లాగా కనబడుతుంది. అంటే అంతర్లీనంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ ‘చలనం’ కథలో శ్రీనివాస్ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అతను సంప్రదాయ కుటుంబీకుడు. అయినా ఒక్కోసారి వరుసగా 3 రోజులు స్నానం చేయకుండా ఉండడం, ఒక్కోసారి 4 రోజులు నదీ స్నానం చేయడం, బూట్లు, చెప్పులు వేసుకొని పడుకోవడం ఇట్లా. అంటే Chaotic (అస్తవ్యస్తమైన ) person అంటాము. Existentialism ఏం చెబుతుందంటే “A man is a useless person” అనేది అందులో ఒక థియరీ. ఉదా:- ఒక వ్యక్తి మీద అభిమానం కలుగుతుందనుకోండి. అవసరాన్ని బట్టి మారొచ్చు. అతని మీద ద్వేషమూ కలగొచ్చు. రెండవ సూత్రం ఏంటంటే “Exist because you think”. అంటే నేనున్నాను అంటే ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నానంటే నేనున్నాను. నువ్వు చేస్తున్నవన్నీ నీ ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నువ్వు సాధిస్తున్నది కాదు. దానంతట అదే జరుగుతున్నది. దీన్ని ఆధారంగా చేసుకొని రాశాను. ఆ పాత్ర లైఫ్ చిన్నగా, విభిన్నంగా సాగుతుంది. ఆ అస్తవ్యస్తపు వ్యక్తి మతాంతర వివాహం చేసుకుంటాడు. తల్లి, చెల్లి బాధపడతారు. ఇతరుల దృష్టిలో పనికిరాని జీవితాన్ని గడుపుతాడు. పెళ్ళి చేసుకున్న అమ్మాయి మరొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపగలిగావు? కాబట్టి మనచేతుల్లో ఏదీ లేదు. చివరకు ఒక సినిమా పాటలో “ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే ఆట” అన్నట్లు పశ్చాత్తాప పడతాడు. ఆంధ్ర పత్రిక వాళ్ళు ఆ అంతరార్థాన్ని పట్టుకొని పత్రికలో వేశారు.
మీ ‘కథాకృతి’ సంకలనాల ఉద్దేశ్యం ఏమిటి?
కథ రాసేవాళ్ళకి సాహితీ సహృదయత ఉండాలి. సాహితీ సంస్కారం ఉండాలి. నేను 350 మంది కవుల కథలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశాను. అవన్నీ ‘కథాకృతి’ పేర నాలుగు సంపుటాలుగా వచ్చాయి. అందులో చిన్న, పెద్ద, ప్రాంతీయత లాంటి భేదాలు లేకుండా కథ బాగుంటే రాశాను. అందులో దాదాపు 200 మంది ఇవ్వాళ్ళటికీ నాకు తెలియదు. అల్లూరి గౌరీలక్ష్మి అనే ఆవిడ ‘డబ్బింగ్’ అని అద్భుతమైన కథ రాసింది. ఆ కథతోనే మొదలుపెట్టాను. ఒక మీటింగులో ‘నేనేనండీ ఆ కథ రాసింది’ అని పరిచయం చేసుకొంది. “ఎందుకయ్యా వాళ్ళందరికీ కిరీటాలు పెడతావు” అని ఒక పెద్దాయన అన్నారు. కిరీటాలు పెట్టడం కాదు. ఇప్పటివాళ్ళు కూడా రాస్తున్నారు, రాయగలుగుతున్నారని పదిమందికీ తెలియాలి కదా! ఆంధ్రభూమి ఎడిటర్ నేను ఒకావిడ కథను గురించి రాస్తే “అలాంటావిడ కథ ఎలా రాస్తారు?”అన్నారు. “మీరాకథ చదవండి ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలుస్తుంది” అన్నాను. ఆయనే నా ‘మహావిజేత’ నవలను అడిగి తీసుకొని ఆంధ్రభూమిలో వేశాడు. “బాలగంగాధర్ తిలక్ రాసిన ‘దొంగ’ అనే కథను ఎవరో కాపీ చేసి టైటిల్ కూడా మార్చకుండా పంపితే ఈయన చూసుకోకుండా పత్రికలో వేశాడు. అది పెద్ద సంచలనం అయింది. అందుకే సూటిగా ఆయనతో ఎడిటర్ అన్నాక అన్నీ చూసుకోవాలని చెప్పాను. ఆయనే ఒక సందర్భంలో పాలగుమ్మి పద్మరాజు గారి ‘గాలివాన’ లాంటి కథ వస్తే కనుక నేను వేసేవాడిని కాను అన్నాడు. భారతీయ సాహిత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చినవి రెండే రచనలు. అందులో మొదటిది రవీంద్రుని ‘గీతాంజలి’. రెండవది పద్మరాజు గారి ‘గాలివాన’ కథానిక. అలాంటి కథను వేసేవాడిని కాను అనడంతో “అది మీ స్థాయిని తెలియజేస్తుంది” అన్నాను (నవ్వుతూ ). అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే దాంట్లోని విలువలు తెలుసుకోవాలని. అందుకే అటువంటి వాటిని తీసుకొని సంకలనంగా వేశాను.
ఆధునిక పంచకావ్యాల్లో ఒకటిగా పేరొందిన ‘శ్రీ శివభారతం’ రచించిన గడియారం వేంకట శేషశాస్త్రి గారి పేరు మీద మీరిచ్చే అవార్డు గురించి చెప్పండి.
1981లో గడియారం వేంకట శేషశాస్త్రి గారు మరణించారు. అప్పుడు నేను కడపలో ఉన్నానమ్మా! ఆయన రాసిన ‘శివభారతం’ ఎంతో ఆత్మీయంగా అనేక సందర్భాల్లో చదివాను. మా పెద్దమ్మ కొడుకు, నా రెండవ గురువు గారు చల్లా శంకరయ్య గారని చెప్పాను కదా! ఆయన, నేను కలిసి చదివేవాళ్ళం. అందుకే గడియారం వారంటే నాకు ఎంతో అభిమానం. నాతో పాటు నా ముగ్గురు మిత్రులు మేము ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు కలుసుకునేవాళ్ళం. ఎన్నో సాహితీ చర్చలు చేసేవాళ్ళం. గడియారం వారి మరణవార్త విని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని అనిపించింది. అది వాళ్లకు చెప్పగానే వెంటనే అంగీకరించారు. కేవలం దానికోసమే సంస్థ పెట్టాము. పద్యకవికి మాత్రమే ఇచ్చే నియమం పెట్టుకున్నాము. భూతపురి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారని ఆయన రచించిన ‘శ్రీ మదాంధ్ర చరిత్ర’ శ్రీకృష్ణ దేవరాయల కావ్యానికి ఇచ్చాము. అప్పటినుండీ మొన్ననే 42 వ అవార్డు ఇచ్చాము. ఆంధ్ర, తెలంగాణాల్లో ఉన్న ప్రసిద్ధులైన కవులందరికీ ఇచ్చాము. ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి గారు, కరుణశ్రీ గారు, ఉత్పల సత్యనారాయణ శాస్త్రి గారు, వేముగంటి నరసింహాచార్యులు గారు, రావికంటి విశ్వనాథం గారు, అనుమాండ్ల భూమయ్య గారు మొదలైన వాళ్ళందరికీ ఇచ్చాము. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నేను కడప నుండి వచ్చేటప్పుడు 15 వేల రూపాయలు ఖర్చుల కోసం బ్యాంకులో పెట్టి వచ్చాను. మొదట రెండువేలు, తర్వాత అయిదు వేలు, ఆ తర్వాత పదివేలు ఇలా ఆ అవార్డుకు నగదు బహుమతి ఇచ్చాము. మేము పెట్టిన నలుగురిలో ఇద్దరు చనిపోయారు. నేనే ఇస్తున్నాను. శేషశాస్త్రి గారి మనుమలు పొద్దుటూరులో ఉన్నారు. “40 ఏళ్ళుగా ఇస్తున్నారు కదా! మేము కూడా ఇప్పటినుండి భాగస్వాములం అవుతాం” అన్నారు. ఈ రెండు మూడు సంవత్సరాల నుండి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడికి వాళ్ళకు వస్తే నేనే వాళ్ళను పొద్దుటూరుకు తీసుకువెళ్తాను. అట్లా పద్యకవులకు గడియారం వారి అవార్డు ఇస్తున్నాము.
ఎంతోమంది ప్రముఖుల ప్రశంసాపాత్రమైన మీ ‘శ్రీ పదచిత్ర రామాయణం’ గురించి చెప్పండి.
మానవాళికి అనుసరణీయము, ఆచరణీయము, ఆవశ్యకము అయిన మానవ సంబంధాలను వివరించే మహాకావ్యం రామాయణం. వ్యక్తిని ఉన్నతంగా నిలిపే సార్వజనీన సూత్రాలు, వ్యక్తుల ద్వారా సమాజాన్ని సమతుల్యతతో నిలిపే విశిష్టమైన, శాశ్వతమైన విలువలు కలిగినది. అందుకే సర్వ కాలాల్లో పఠనీయమైన కావ్యమని నా అభిప్రాయం. అందుకే దానిని 6500 పద్యాలతో “శ్రీపద చిత్ర రామాయణం” అనే పేరుతో రాశాను. రామాయణం వంటి మహత్తర కావ్యాన్ని పద్యాల్లో రాయడం వల్ల ఒక ఔన్నత్యం, ఔచిత్యం కలుగుతాయన్న భావనతో పద్యాల్లో రాయడం జరిగింది. పద్యాల మీద నాకున్న పట్టు ‘తీరని దాహం’ కావచ్చు (గట్టిగా నవ్వుతూ).
ప్రసిద్ధ ఆలంకారికుడు జగన్నాథ పండితరాయల మీద నవల రాయాలనుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
ఉంది. నేను సినారె గారు రచించిన కర్పూర వసంతరాయలు కావ్యాన్ని నా చిన్నప్పుడు గుంటూరులో ఆయన చెబుతుండగా విన్నాను. అంతకుముందు నేను ప్రాచీన కావ్యాలు గురుముఖత విని ఉన్నాను. దానితో పద్యం మక్కువ ఏర్పడింది. ఈ కావ్యం విన్న తరువాత గేయకావ్యంలో ఇంత మాధుర్యం ఉందా అనిపించింది. కర్పూర వసంత రాయలు ఎవరో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నాకు చరిత్ర అంటే ఇష్టం. కర్పూర వసంతరాయల (కుమారగిరి) చిన్నాన్న అనవేమారెడ్డి. ఆయన అసలు వసంతరాయలు. ఆయన పేరు మీదనే ఉత్సవాలు జరిగేవి. వసంతరాయల గురించి నవల రాద్దామనిపించింది. పరిశోధన చేశాను. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వద్దకు వెళ్ళి ఆయన రాసిన పుస్తకాలతో పాటు మరికొన్ని రెడ్డిరాజుల చరిత్ర పుస్తకాలు మొత్తం వంద పుస్తకాలు చదివాను. ఆ ప్రభావంతో అనవేమారెడ్డి నవల రాశాను. అచ్చులో 170 పేజీల పుస్తకం వచ్చింది (1972). దాన్ని చూసి నోరి నరసింహ శాస్త్రి గారు సాహిత్య అకాడెమీకి ఈ పుస్తకానికి నేను ఓటు వేస్తాను అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం రెకమండ్ చేస్తానని. అప్పటినుండి గేయకావ్యం ఒకటి రాయాలని కోరిక కలిగింది. దాంతో స్పందన సాహితీ సమాఖ్యలో ‘రాబోవు ప్రచురణలు’ అని మొదటిది ఎమ్.వి.ఎల్ గారి సినిమా పాటల్లో సాహిత్యం, రెండవది విహారి గారి జగన్నాథ పండితరాయలు (గేయకావ్యం) అని ప్రకటించాము. 1972 నుండి అది అలాగే ఉంది. ఉద్యోగరీత్యా నాకు రాయడం కుదరలేదు. దాని మీద మనసు పోయింది. ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా జగన్నాథుని రసగంగాధరం మొదలగు కావ్యాలను చదువుతూ నోట్స్ రాసుకునేవాడిని. గేయకావ్యంగా 40 పేజీలు రాశాను కానీ సంఘటనలు, పాత్రల మధ్య అనుసంధానం చేయడం కష్టమవుతున్నదని నవల రాశాను. అలా రాయాలని కోరిక కలగడానికి కారణం ‘లవంగి’ తో ఆయనకు కలిగిన అపప్రథ. దాన్ని రూఢి చేస్తూ కొంతమంది రచనలు చేశారు. అందులో ప్రధానంగా కె. రామలక్ష్మి గారు ‘లవంగి’ పేరుతో రాసిన నవల ‘యువ’ పత్రికలో దీపావళి సంచికలో అనుబంధ నవలగా వచ్చింది. అందులో లవంగికి, ఆయనకున్న సంబంధాన్ని చెబుతూ కొన్ని శ్లోకాలను కూడా కోడ్ చేస్తూ రాసింది. అది చదివిన తరువాత దాన్ని ఎలాగైనా కాదని నిరూపించాలి అనుకున్నాను. అంతేకాదు జగన్నాథ పండితరాయల గేయకావ్యం రాయడానికి కూడా ప్రధానమైన భావన అదే. అంతటి గొప్ప పండితుడు, తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఆయనపై ఇలాంటి నిందలు వేయడం నాకు నచ్చలేదు. అందుకే ఆధారసహితంగా దాన్ని తప్పు అని నిరూపించడానికి ఈ నవల రాశాను.
మీ పద్యకృతులను గురించి చెప్పండి.
మొట్టమొదటిది రామాయణమే. నేను అంతకుముందు రెండు చిన్నకావ్యాలు రాశాను చిన్నప్పుడు. ఒకటి సోరాబ్ రుస్తుం 50, 60 పద్యాలు ఉంటాయి దాంట్లో. రెండవది పన్నా అని ఒక కథను రాశాను. విడివిడిగా కాశీని గురించి వ్యాసకాశి అని. అవేవీ ఇప్పుడు లేవు. మొదటగా వెలుగులోకి వచ్చింది శ్రీ పద చిత్ర రామాయణమే. ‘యోగ వాసిష్ఠ సారం’ అని 400 పద్యాలతో తర్వాత రాశాను. సుమంత్రుని గురించి రాశాను. భూమయ్య గారు నవ్వుతుంటారు “రామాయణాన్ని విడిచిపెట్టరా!” అని. సుమంత్రుడు విశ్వాసపాత్రుడైన మంత్రి. మరియు ఆంతరంగికుడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎటువంటి చిత్తక్షోభను అనుభవించాల్సి వస్తుందో సామాజిక పరిస్థితిని అప్లై చేసి రాశాను. ఇది కాక రామాయణంలోని పాత్రల గురించి ‘భక్తి’ పత్రిక వాళ్ళు 16 వ్యాసాలు రాయించారు. అవి, ఇంకో రెండు వ్యాసాలు కలిపి ‘అంతా రామమయం’ అనే వ్యాస సంకలనాన్ని తెచ్చాను. తర్వాత మా బావగారు (ఇప్పుడు లేరు) మాకు పద్యాలు అర్థం కావు గానీ ఒక్క సుందరకాండ అయినా వచనంలో రాసిపెట్టు అన్నారు. ఆయన కోసం 100 పేజీల పుస్తకం రాశాను. భూమయ్య గారన్నట్టు నా మనస్సులోంచి రామాయణం పోవడం లేదు( గట్టిగా నవ్వుతూ ). అందుకే ఇటీవల ‘రామాయణ సూక్తి సుధ’ అని 200 పద్యాలు కేవలం రామాయణంలోని సూక్తులను తీసుకొని రాశాను. అది అచ్చులో ఉంది. ఇంకో విషయం చెప్పాలి. విజయవాడలో ఒకాయన రామాయణంలో 100 బొమ్మలను వేయించాడు. ఆయన పబ్లిషర్ కూడా. అందుకే ఆ బొమ్మలకు అర్థం వచ్చేటట్లు వచనం రాయించాలనుకొని ఒకరిద్దరితో రాయించాడు కానీ ఆయనకు నచ్చలేదు. ఒకసారి ఏదో సందర్భంలో జి. వి. పూర్ణచందర్ రావు దగ్గరికి వెళ్ళినపుడు ఆయన కూడా కలిసి ఈ విషయం చెప్పాడు. అప్పుడు పూర్ణ చందర్ “మా గురువు గారు రాస్తారు” అన్నాడు. వెంటనే ఆయన మొత్తం పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కేవలం ఆ బొమ్మ అర్థం కాకుండా దాని ముందు వెనుక ఉన్న కథాంశాన్ని కూడా కూర్చి మొత్తం రామాయణం వచ్చేటట్లుగా రాశాను. ఆయనకు బాగా నచ్చి తీసుకువెళ్ళారు. మీ గురువుగారికి 5 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పండి అన్నాడట. డబ్బు విషయం పక్కకు పెడితే దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయారు. ఆ పుస్తకం అచ్చు వేయడం కోసం కుటుంబ సభ్యులను అడిగితే తెలియదన్నారు. ఇది జరిగి 8 సంవత్సరాలు అయింది. వెతుకులాటలో మొన్న కొన్ని దొరికాయి. అన్నీ కలిపి వేస్తున్నాము.
మీ రచనలు మొత్తం ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి? ఆంగ్ల భాషలో ఏవైనా రచనలు చేశారా?
జ: ఇప్పటివరకు నా రచనలలో కథా సంపుటాలు 19, వ్యాస సంపుటాలు 17, రామాయణాలు 11, నవలలు 7, మోనోగ్రాఫులు 2, పద్య సంకలనాలు 4, దీర్ఘ కవితలు 2, రచయితల సమీక్షలు 5, నవీన 1, సప్తపదులు 1, అచ్చులో ఇంకా ఉన్నవి 3…మొత్తం 72 పుస్తకాలు. ఆంగ్లభాషలో రచనలు ఏవీ చేయలేదు. అన్నీ అనువాదాలే. అంతా లిటరేచర్ సంబంధించినవి. ప్రొఫెషనల్ కి సంబంధించిన షేర్ మార్కెట్లు మొదలైనవి మాత్రమే.
‘అజో విభో కందాళం’ ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం పొందిన అనుభూతి ఎటువంటిది?
అప్పా జోస్యుల వారు ఇచ్చే ఈ పురస్కారం చాలా గొప్పది. తెలుగులో జ్ఞానపీఠ అని ప్రసిద్ధి దానికి. నాకు వచ్చిన పురస్కారాల్లో ఎంతో సంతృప్తిని కలిగించిన పురస్కారం అది. డబ్బు దృష్ట్యా కాదు. ఆయన ఎవరిని ఎలా ఎన్నుకుంటారో, ఆయన దృష్టికి ఎవరు ఎలా వస్తారో తెలియదు. ఈ అవార్డు ఇవ్వడానికి ముందు ఆయన నన్ను ఒకసారి చీరాలకు పిలిచారు. ‘శ్రీరామతత్త్వం’ అనే అంశంపై ఉపన్యాసం ఇవ్వమన్నారు. రెండురోజులు వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చారు. రామాయణంలో మీకు నచ్చిన కొన్ని ఘట్టాలను చదవండి అన్నారు. అహల్య ఘట్టంలో చాలామంది ఆమె ఇంద్రునికి కొంగు పరచినట్లుగా రాశారు. అది నాకు మనస్కరించలేదు. ఆధ్యాత్మిక పరంగా వేరే అర్థాలున్నాయి. అదే చదువుతూ వివరించబోయాను. ఆయన నవ్వి వివరణ వద్దు చదవండి అన్నారు. అంటే అంత పట్టు ఉంది ఆయనకి. ఆయన రాసిన పంచభూతాత్మక తారావళుల్లో ‘అంతరిక్ష తారావళి’ ఇటీవలే వచ్చింది. దానికి ముందుమాట నా చేత రాయించారు. 24 పేజీలు వచ్చిందది. గొప్ప పండితులు, సహృదయులు ఆయన.
మీకు వచ్చిన ఇతర పురస్కారాలేవి?
నాకు వచ్చిన పురస్కారాలు అన్నీ కూడా నాకు తెలియకుండా నన్ను వరించి వచ్చినవి. ఏ ఒక్కటి కూడా ఇది వస్తే బాగుండునని అనుకోలేదు. ఒక మరపురాని సంఘటన చెప్పాలి. 1977 లో నా కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత దాని బ్యాక్ గ్రౌండ్ తెలిసింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాశరథి రంగాచార్యుల వారి సభకు ప్రేక్షకునిగా వెళ్ళాను. ఆయన కారెక్కబోతుంటే బి.ఎస్.రాములు అనుకుంటా నన్ను ‘విహారి’ అని ఆయనకు పరిచయం చేశాడు. ” ఓయ్ నువ్వా విహారి అంటే! నీ సంగతి నాకు తెలుసునయ్యా!” అంటూ ఆగి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డుకు నీ పుస్తకం వచ్చినప్పుడు జడ్జీల మధ్య నిర్ణయం వాయిదా పడింది. బెజవాడ గోపాలరెడ్డి గారు నాకు నీపుస్తకం ఇచ్చి చూడమన్నారు. నీ పుస్తకానికే ఇవ్వమని చెప్పాను. ఆయన “ఇతను చిన్నవాడు కదా! ముందు అవకాశం ఉంది కదా!” అన్నాడు. అప్పుడు నేను నువ్వు మనిషిని చూసి అవార్డు ఇస్తావా? పుస్తకం చూసి ఇస్తావా? అని అడిగాను. అప్పుడది నీకు ఇచ్చారు” అన్నారు. ఇన్ని ఏళ్ళ తర్వాత రంగాచార్యుల నోట ఈ విషయాన్ని విని ఎంతో ఆశ్చర్యపోయాను. విజయవాడలో ఒకసారి రామాయణం చెబుతుంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. సభ పూర్తయ్యే ముందు ఒక బుట్టతో వచ్చారు. అయిపోయాక నాకు ఒక ధోవతి, ఉత్తరీయం ఇచ్చి, శాలువా కప్పి గులాబీపూల గజమాలతో సత్కరించారు. ఆ ఇద్దరిలో ఒకవ్యక్తి జానపద బ్రహ్మ లాంటి ఎన్నో పేర్లు కలిగి, వివిధ జానపద కళల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన కర్ణాట లక్ష్మీ నర్సయ్యగారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు గారు అని మంగళగిరిలో గొప్ప సంపన్నుడట. ఆ విషయం తర్వాత తెలిసింది. ఆ తరువాత నాగేశ్వరరావు గారికి అప్పటికి భార్య చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆమె పేరు మీద ఆయన నాటకరంగంలో ప్రతిభ కలిగినవారికి అవార్డు ఇస్తున్నారు. ఇప్పటి నుండీ నాటకాలకు కాకుండా సాహితీ వేత్తలకు ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. ఆ అవార్డు సభను విజయవాడ నుండి గుంటూరుకు వెళ్ళే రహదారిలో ఓపెన్ థియేటర్ లో ఏర్పాటు చేశారు. నా ఫొటోతో పెద్ద ఫ్లెక్సీ వేయించి, స్వాగతించి గొప్ప సన్మానం చేశారు. మరోసారి కడపలో పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్న సభలో నేను మాట్లాడుతుండగా ఒకాయన మధ్యలో లేచి వెళ్ళిపోయి పట్టుబట్టలు తీసుకువచ్చి సన్మానం చేశాడు. నేను వీటికోసమే వెళ్ళాను. ఏమీ అనుకోవద్దని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవి మనకు ఎక్కువ ఆనందాన్నిస్తాయి. అమృతలత గారు ఇచ్చే పురస్కారాలు ఎప్పుడూ మగవాళ్ళకు ఇవ్వలేదు. రచయితలకు ఇవ్వలేదు. మీతోనే మొదలు పెడుతున్నాను అని అమృతలత జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. ఆమెవరో అప్పటికి నాకు తెలియదు. అవార్డులు ఎప్పుడైనానమ్మా! వాటంతట అవే రావాలి. అదే సంతృప్తి. నాకు దాదాపుగా 40 అవార్డుల దాకా వచ్చాయి.
మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఏది?
నేను రాసిన కథల్లో నాకు నచ్చిన కథ ‘స్పృహ’. ఎవరడిగినా అదే చెప్తాను. ‘నవ్య నీరాజనం’ అని నవ్య పత్రికలో వచ్చింది. ఇంటర్వ్యూ కూడా వేశారు. ఈ కథ దాదాపు అనేక పత్రికల్లోనూ, సంకలనాల్లోనూ 8 సార్లు రీ ప్రింట్ అయింది. దాంట్లో నా లైఫ్ ఫిలాసఫీలో అత్యంత ముఖ్యమైన వాక్యాలున్నాయి. “అవి రాలేదని, ఇది కాలేదని జుట్టు పీక్కోకు. నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది” ఇలాంటివి. ఇది లైఫ్ బేస్ డ్ కథ. నా కథలన్నింటిలో తాత్త్వికత ఉంటుంది. ఏలె విజయలక్ష్మి గారు నా రామాయణం మీద నాగార్జున యూనివర్సిటీ లో పి హెచ్ డి చేసింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ యూనివర్సిటీలో. మద్రాసు యూనివర్సిటీలో ఒకతను కథల మీద చేశాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కథల మీద విజయేశ్వరావు పి హెచ్ డి చేశాడు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఎమ్.ఫిల్ చేసినవారున్నారు.
మీ అసలు పేరుతో కాకుండా విహారి పేరుతో రచనలు చేయడానికి కారణం?
నేను చిన్నప్పుడు భాగవతం చదివేవాడిని. మా పెద్దమ్మ కొడుకు గొప్ప పండితుడని చెప్పాను కదా! మా ఇంట్లో ఆ వాతావరణం ఉండింది. కాబట్టి శ్లోకాలు అవన్నీ చిన్నప్పుడే బాగా వచ్చేవి. అయితే భాగవతం చదువుతున్నప్పుడు షష్ఠ్యంత్యాల్లో ” హారికి నంద గోకుల విహారికి…” అనే పద్యం ఉంది కదా! అది రోజూ చదువుతూ ఉంటే విహారి అనే పేరు బాగా నచ్చింది. అందుకే నేను పద్యాలు రాసే మొదట్లోనే ఆ పేరుతో ప్రారంభించాను. నా అసలు పేరు జొన్నలగడ్డ సత్యనారాయణ. జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి పేరుతో గొప్ప పండితుడున్నాడు. జకార త్రయంగా తెలుగుదేశంలో జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, జమ్మలమడుగు మాధవశర్మ , జటావల్లభుల పురుషోత్తం అని ముగ్గురు గొప్ప వక్తలు ఉండేవారు. వాళ్ళని మించిన వాళ్ళు కవులలో కూడా ఎవరూ లేరు. సత్యనారాయణ మూర్తి గారు ఆంధ్రా యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్. ఆంధ్రదేశం నుండి రష్యా వెళ్ళిన మొదటివాడు. అంతటి గొప్పవాడు అని నాకు తెలుసు. ఆ పేరుతో రాస్తే అపభ్రంశంగా ఉంటుందనిపించింది (నవ్వేస్తూ). నా పేరు అదే అయినా ఆయన పేరు చెడగొట్టడం ఎందుకని విహారిగా రాయడం మొదలుపెట్టాను.
సుధామ గారి సృజన ‘సప్తపదుల’ పై కూడా పుస్తకం రాశారు. మీ ఇరువురి అనుబంధాన్ని వివరించండి.
సుధామ గారు మలక్ పేటలో ఉన్నప్పుడు నేను మా అమ్మాయి వాళ్ళింట్లో ఉండేవాడిని. అక్కడే 16 ఏళ్ళు ఉన్నాము. ఆయనతో అక్కడే అనుబంధం ఏర్పడింది. అంతకుముందు విజయవాడ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు రెండుసార్లు చూశాను. మలక్ పేట నుండి ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయిన తరువాత మేమూ ఇక్కడికి షిఫ్ట్ అయినాము. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి రావడం, అలాగే మమ్మల్ని ఇక్కడికే రమ్మని కోరడం వల్ల అనుకోకుండా మళ్ళీ ఒక్కదగ్గరికి చేరాము. మా ఇద్దరికీ అట్లా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆయన సృష్టించిన ‘సప్తపదులు’ ప్రక్రియ చాలా వేగంగా విస్తరించింది. అది మొదలైన కొద్దిరోజులకే నేను పుస్తకం రాశాను.
ప్రాంతీయ భాషా అందాలను ప్రస్ఫుటం చేసే మాండలికాలను రచనల్లో వాడితే ఎలా ఉంటుంది? ఈ విషయంలో మీ అనుభవాలను చెప్పండి.
చాలా బాగుంటుంది. ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. మాండలికాలను మెచ్చుకునే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడిని. మాండలికం అనే కాదు. ఏ భాషలోనైనా ఒక జవం, జీవం అక్కడి మాట మాట్లాడితేనే వస్తుంది. అది ప్రజల భాష కదా! కథల్లో మాండలికం వాడిన వాళ్లలో మా గోఖలే మొట్టమొదటి వాడు. నేను చదివిన ఆయన కథల్లో మొత్తం మాండలికమే ఉంటుంది. తెలంగాణా వాళ్ళు ఆ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. ఏదో న్యూనతా భావం ఉండింది కానీ ఇప్పుడు బాగానే రాస్తున్నారు. నేను కూడా గుంటూరులో పుట్టి కృష్ణాలో 16 ఏళ్ళు ఉన్నవాడిని. మా ఆవిడది బందరు. అయితే నా పలుకుబడి నా రచనల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. చిల్లర భవానీ దేవిగారు ‘నా విగతం’ అనే కథా సంపుటిలో ఒక కథలో ఆ ప్రాంతపు పలుకుబడులు, సామెతలను ఉటంకిస్తూ రాసింది. అందువల్ల మాండలికాలు జీవద్భాష కాబట్టి అవి ఉండాలి. ఉన్నచోట ప్రోత్సహించాలి. నేనెప్పుడో చిన్నప్పటినుండి రాస్తున్నాను. మరి మా గోఖలే ఇంకా ముందు తరం వాడు కదా! ఆయనే ఆ కాలంలో మాండలికాలు ఉపయోగించాడు. కాబట్టి రచయితలు వాటి సౌందర్యాన్ని తరువాతి తరాలకు తెలియజేయాలి.
కథలు రాయడంలో ఏ విధానం పాఠకులను ఆకర్షింపజేస్తుంది?
కథలో ఏది చెప్పాడనేది వస్తువు. ఎలా చెప్పాడన్నది శిల్పం. మూడవది శైలి. శైలిలో మీరన్న మాండలికాలు అన్నీ వస్తాయి. కొంతమంది శిల్పాన్ని ఉత్తమ, ప్రథమ పురుషల్లో రాస్తారు. అయితే ఇవి కథలో ఏది కేంద్రమో దాన్ని ఆధారంగా చేసుకొని వస్తాయి. వస్తువును బట్టి శిల్పం. ఉదా:- ఒక వ్యక్తి స్వానుభవాన్ని చెబుతున్నప్పుడు అది ఉత్తమ పురుషలో రావాలి. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఏ భాషైనా ఉత్తమ పురుషలో రాసిన వాటికి ప్రాధాన్యత ఉంటుంది.
ఇప్పుడొస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో వస్తున్నటువంటి సాహిత్యం గత కాలం వచ్చిన సాహిత్యాల కంటే మెరుగ్గా ఉందనే చెబుతాను. రచయితలు కొత్త జీవితానికి అలవాటు పడడం, జీవితంలో సంక్లిష్టతలను, సంకీర్ణమైన మానవ సంబంధాల విశేషాలను కూడా సాహిత్యంలో ప్రతిఫలింప జేయగలుగుతున్నారు. దీనివల్ల సాహిత్యంలో కృషి చేస్తున్న వారందరూ కూడా వివిధ వర్గాలకు, కులాలకు , వృత్తులకు చెందినవారు, వివిధ జీవన నేపథ్యం కలిగినవారు. దానివల్ల వారి స్వానుభవాలు గాఢంగాను, సాంద్రంగాను ప్రతిఫలిస్తున్నాయి. ఇది ప్రత్యేకమైన అంశం. ఈనాటి సాహిత్యం ఉన్నతమైన స్థానంలో ఉందనే నేను చెబుతాను.
నేటి రచయితలకు మీరిచ్చే సూచనలు ఏవి?
నేటి రచయితలకు నేనిచ్చే సూచనలు ఏమీ లేవు. వాళ్ళంతా కూడా ‘సెల్ఫ్ మేడ్’ సాహితీపరులు. ఆ కారణంగా ఇతరులు సూచనలు ఇవ్వాల్సిన స్థితిలో లేరు. కాకపోతే ముఖ్యమైన విషయం. ఈనాటి రచయితలకు అనుభవం ఉన్నది కానీ అధ్యయన పటిమ లేదు. మన వారసత్వం గానీ, సాహిత్యంలో గతం జరిగినటువంటి ప్రాధాన్యతలు గానీ ఏవీ తెలియవు. అది గనుక తెలుసుకున్నట్లయితే వారు ఆ పునాది మీద లేవ గలిగితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని నా సూచన.
చాలా సంతోషం సార్. మీ వంటి వారి పరిచయం మా పాఠకులకు ఒక చైతన్యదీపం. మీకున్న సమయంలో ఇంత ఓపికగా చాలా సేపటినుండి అడిగిన విధంగా మీ జీవితంలోని సాహితీ సుగంధాన్ని మాకు కూడా పంచినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున ధన్యవాదాలు. సెలవు
1 comment
బహుముఖ ప్రతిభాశాలి గురించి విశేషంగా తెలిపారు. సంతోషం. శుభాకాంక్షలు