- తిరుమల శ్రీనివాసాచార్యులు
‘సాహితీ సుధానిధి’ బిరుదాంకితులు బహుగ్రంథకర్త, ప్రముఖకవి, రచయిత, వక్త ఆచార్య తిరుమల శ్రీనవాసాచార్యులు గారితో మయూఖ ముఖాముఖి
సహృదయతామూర్తి, స్ఫురద్రూపి, నిరంతర అధ్యయన శీలి, నిత్య సాహిత్య పిపాసితులు అయిన ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యులు గారి జీవిత వివరాలను, సాహిత్య కృషిని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్
1 ప్ర. మా మయూఖ పాఠకులకు ఈరోజు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.
మొదటగా మీ జననం, విద్యా విశేషాలను తెలపండి.
నేను స్వస్తిశ్రీ బహుధాన్య సంవత్సరం, మాఘశుద్ధ పంచమి నాడు (జనవరి 1, 1938) సిరిసిల్ల దగ్గర ఉన్న నారాయణపురం అనే చిన్న గ్రామంలో పుట్టాను. అప్పుడు సిరిసిల్ల తాలూకాగా ఉండేది. మా అమ్మ వేంకటమ్మ, నాన్న మనోహరాచార్యులు గారు. మా ఇంటిపేరు కారంచేడి తిరుమల వాళ్ళు. కానీ నేను మొత్తం రాయకుండా తిరుమల అని రాస్తుండడంతో అదే స్థిరపడిపోయింది(నవ్వుతూ). మేము ఐదుగురం అన్నదమ్ములం. ఇప్పుడు రమణాచారి ఉన్నాడు కదా! ఆయన తండ్రి మా పెద్దన్న రాఘవాచారి గారు. రెండవ అన్న పార్థసారథి గారు, మూడవ అన్న నర్సింహాచార్యులు గారు, నాల్గవవాడిని నేను. మా తమ్ముడు వెంకటరమణ డాక్టరుగా చేసేవాడు. చనిపోయినాడు. మా ఊళ్ళో మూడవ తరగతి వరకు మాత్రమే ఉండేది. పన్నెండు సంవత్సరాల వరకే ఆలయాల్లో చదివే తిరువాయు మొళి, తిరుప్పావైలతో పాటు పద్యాలు, శ్లోకాలు ఎన్నో నేర్చుకున్నాను. మా ఊరిపక్కనే ఉన్న ఎల్లారెడ్డి పేటలో నాలుగవ తరగతి, ఆ తర్వాత సిరిసిల్లలో అయిదు, ఆరు తరగతులు చదువుకున్నా. మా అన్నయ్య మెదక్ లో టీచరుగా పనిచేస్తుండేవాడు. అక్కడ మల్టీ పర్పస్ హైస్కూల్లో ఏడవతరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎమ్.పి.సి ఆప్షనల్ గా తీసుకోవాలనుకున్నా. కానీ కాలేజీకి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. పేదరికం వల్ల వెళ్లలేకపోయాను. ఏదైనా ఉద్యోగం చేస్తూ చదువుకోమని, ముఖ్యంగా టీచరు ఉద్యోగం చేయుమని మా అన్న సలహా ఇచ్చాడు.
మీ అన్నయ్య గారు టీచరు జాబ్ మాత్రమే బాగుంటుందని, అదే చేయమనడానికి కారణం ఏమిటి? మీరు ఆ కారణంగానే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారా?
అంటే… నాకు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సైన్స్ సబ్జెక్టు కాలేజీకి వెళ్లి చేయడం కుదరలేదు అన్నాను కదా! మిగతా ఉద్యోగాల్లో కాకుండా గవర్నమెంట్ టీచరుగా వెళితే వాళ్లే చదువు కొరకు పర్మిషన్ ఇస్తారు కాబట్టి నాకు చదువు మీద ఉన్న ఆసక్తితో అన్నయ్య ఆ సూచన చేశారు. నేను కూడా ఇష్టంతోనే ఆ వృత్తిలోకి వెళ్ళాను. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం ఏ విధంగా సంపాదించారు?
ముందుగా ఒక ప్రయివేట్ స్కూల్లో చేరాను. వాలీబాల్ ఆడడం నా హాబీ. నేను గ్రౌండ్ లో ఆడుతుంటే ఐ.జి.దేవేందర్ అని ఎమ్. ఏ. ఇంగ్లీష్ . ఆయనతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. వెంకటాపురంలో ఉద్యోగం ఉందని చెప్పాడు. కానీ అది కల్వకుర్తి దగ్గర ఉన్న
వెంకటాపురం. నేను వెళ్ళలేదు. రెండు మూడు నెలలు దేవేందర్ దగ్గర ఉన్నాను. వెంకటాపురం వాళ్ళు “మాకు టీచరును అపాయింట్ చేసినా ఇంతవరకు రాలేద”ని కంప్లయింట్ ఇచ్చారు. బిడిఓ సీతారాం దేవేందర్ కు నోటీస్ పంపాడు. దాంతో వెంకటాపురం స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటికక్కడ ఒక భార్యాభర్తల జంట ప్రయివేటుగా ఆ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నేను వెళ్ళగానే వాళ్ళు వెళ్లిపోయారు. అక్కడినుండి చిన్న శంకరంపేట దగ్గర సూరారం అనే ఊరుకు ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ రెండేళ్ల తరువాత చేగుంటకు వేశారు. ప్రయివేటుగా బిఏ కట్టి పాసయినాను. అప్పుడు ప్రైమరీ టీచరు నుండి హై స్కూల్ టీచరుగా ప్రమోట్ చేస్తూ రామాయంపేటకు ట్రాన్స్ ఫర్ చేశారు. రామాయంపేటలో ఎమ్.ఏ. తెలుగుకు కట్టాను.

సైన్స్ గ్రూపులో వెళ్లాలనుకున్న మీకు ఎమ్.ఏ. తెలుగు వైపు దృష్టి ఎందుకు మళ్లింది? అటు తరువాత ఉద్యోగ ప్రస్థానం ఎట్లా కొనసాగింది?
ఎంపిసి లో లెక్కలు, ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ లేకుండా ఉండాలంటే బిఏ చేయాలన్నారు. ముందు చెప్పాను కదా! నేను పద్యాలు, శ్లోకాలు నేర్చుకున్నానని. తెలుగంటే ముందు నుండీ ఇష్టం ఉండేది. అందువల్ల మోడల్ లాంగ్వేజెస్ బేసిస్ మీద ఎమ్.ఏ. చేయాలనుకున్నా. ఈ లోపు దుబ్బాకకు ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడే ఎమ్.ఏ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఆ తర్వాత కాలేజీ సర్వీసుకు వెళ్ళమన్నారు. ఆరేండ్ల సర్వీసుకు రాజీనామా పెట్టేశాను. ఖమ్మంలో ఫ్రెష్ గా ఈవెనింగ్ కాలేజీలో చేరాను. అక్కడ రెండేళ్లు ఉన్నాను. శ్రీకాకుళం బదిలీ చేశారు. అప్పటికి తెలంగాణా ఉద్యమం నడుస్తున్నది(1969). ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఆంధ్రాకు ఎందుకు బదిలీ చేస్తున్నారని అడగడానికి నా బిడ్డను ఎత్తుకొని వాళ్ళ దగ్గరకు పోయిన. అప్పుడు డైరెక్టర్ గా ప్రతాపరెడ్డి గారున్నారు. “ఈ పిల్ల తోటి ఎట్ల వోత సార్ అంతదూరం?” అని అడిగాను (పెద్దగా నవ్వుతో). ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకొని సరేనని సిద్దిపేటకు బదిలీ చేశారు. అక్కడ మళ్ళీ రెండేళ్లు. అదే సమయంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ (OGA) వాళ్ళు సికింద్రాబాద్ పద్మానగర్ లో సర్దార్ పటేల్ కాలేజ్, వరంగల్ లో లాల్ బహదూర్ కాలేజీలు రెండు పెట్టారు. నేను ఇంటర్వ్యూకు వెళ్ళాను. “గవర్నమెంట్ కాలేజీ వదిలి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?” అని అడిగారు. నా భార్య ఇక్కడే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో డెమోన్ స్ట్రేటర్ గా పనిచేస్తున్నదని అందువల్ల రావాల్సి వస్తున్నదని చెప్పాను. వెంటనే జాయిన్ చేసుకున్నారు. అక్కడనే 1995 రిటైర్మెంట్ వరకు చేశాను. ఆ తరువాత కూడా టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి రికమెండ్ చేయడం వల్ల దిల్ సుఖ్ నగర్ అనిబిసెంట్ కాలేజీలో ఒక సంవత్సరం ప్రిన్సిపాల్ గా చేశాను.
ఇటువంటి భిన్న పరిస్థితుల్లో సాహిత్యం వైపు ఎట్లా దృష్టి సారించారు? లలితగీతాలపై ‘గంగాతరంగాలు’ రాయడంలో మీకు కలిగిన ఆసక్తి ఎటువంటిది?
నాకు మొదటినుండీ రాయడం, చదవడం ఇష్టం ఉండేది. పాటలు రాయాలని ఉత్సాహంగా ఉండేది. మాకు దగ్గరలో తిరుమల అనే కొండ ఉండేది. ప్రతిదినం
అక్కడికి వెళ్లి పాట రాసుకునేవాణ్ణి. అట్లా ‘గంగాతరంగాలు’ అని పాటలు రాసుకున్నాను. కరీంనగర్ లో పని చేసినప్పుడు గరేపల్లి సత్యనారాయణ అని నన్ను ఏదైనా రాయుమని ప్రోత్సహించేవాడు. దాంతో ‘ఉదయరాగం’ పుస్తకం రాశాను. అది చూసి ధోరణి బాగుందని మెచ్చుకున్నాడు. సిద్దిపేటకు వచ్చిన తరువాత గొప్పకవి వేముగంటి నరసింహాచార్యులు గారితో ఏర్పడిన స్నేహం వలన ఇద్దరం కలిసి చెరి పది కవితలు వేసి ‘జీవనస్వరాలు’ అని సంయుక్త రచన చేశాము. అదే వరుసలో కిరణాలు-కెరటాలు, కావ్య పుష్కరిణి, ప్రపంచ విపంచి ఇట్లా కావ్యాలు రాశాను.
“మన మనస్సు, మంచుకొండలా నిలవాలి
మన తలపులు, గంగానదిలా పారాలి
ప్రతి గుడిసె గోపురమ్ములా లేవాలి
ప్రతిపల్లె సురపురమ్ముగా మారాలి” ఇట్లా ఎన్నో అంశాలతో ‘గంగాతరంగాలు’ సాగుతుంది
పరిశోధనకు కావల్సిన విషయ సమీకరణ, నిశిత విశ్లేషణ, సమృద్ధిగా ఉన్నాయ”ని సినారె గారితో ప్రశంసలు పొందిన మీ సిద్ధాంతగ్రంథం “తెలుగులో గేయ నాటికలు” లో అంశాలలోని వైవిధ్యాలను ఎట్లా చూపించారు?
డా. సి.నారాయణరెడ్డి గారి మార్గదర్శకత్వంలో నేను “తెలుగులో గేయ నాటికలు” అనే అంశంపై పిహెచ్ డి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించాను. తెలుగు సాహిత్యంలో ప్రాచీన ప్రక్రియ గేయ నాటికలు. ఇవి పాశ్చాత్య ప్రభావంతో వచ్చినవే అయినా ప్రాచ్య మూలాలు ఉన్నాయని నిరూపించాను. దేశి, మార్గ, ఆధునిక మూడు విభాగాల్లో వీటిని అధ్యయనం చేశాను. ఛందో దృష్టితోను, వస్తు దృష్టితో విభజించాను. అందులోనూ పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, అనుసరణాత్మక, ప్రకృతి సంబంధ, ప్రతీకాత్మ, ప్రబోధాత్మక, బాల సంబంధ, చలన చిత్ర రంగ సంబంధాలుగా అంశాలను తీసుకున్నాను. ప్రతీ వర్గంలో పద్య గేయ వచన మిశ్ర నాటికలు, పద్య గేయ నాటికలు, గేయ నాటికలుగా ఉప వర్గీకరణ చేశాను.
వాటిలో గ్రాంథిక వ్యావహారిక భాషా ప్రయోగాలే కాక అన్యభాషా ప్రయోగాలు కూడా ఉన్నాయి. తెలుగులో వెలువడినటువంటి 318 గేయ నాటికల స్వభావాలను పరిశోధించి వాటిని వర్గీకరించి పదమూడు అధ్యాయాలుగా వివరించాను. 14 వ అధ్యాయంలో ‘గేయనాటికల భవితవ్యం’ పేరుతో ఉపసంహారం ఉంటుంది. తమిళం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పాశ్చాత్య భాషలలో ఉన్నటువంటి గేయ నాటికల సమాచారాన్ని ఆయా భాషా పండితుల నుండి, విజ్ఞాన సర్వస్వాల నుండి సేకరించి ఒక అధ్యాయంగా కూర్చాను. దీన్ని సినారె గారు “ఆధునికాంధ్రలో వెలువడిన సమస్త గేయ నాటికలకు పట్టిన నిలువెత్తు అద్దం ఈ గ్రంథం” అని మెచ్చుకోవడం చాలా సంతోషం కలిగించింది.
డా. సి. నారాయణ రెడ్డి గారి ప్రభావం మీమీద చాలా ఉందని చెబుతుంటారు. ఆ వివరాలు చెప్తారా?
నాకు మొదటి నుండీ దాశరథిగారు, సినారె గారు అంటే ఎంతో అభిమానం. పద్యం విషయంలో దాశరథి గారు, గేయం విషయంలో నారాయణరెడ్డి గారి ప్రభావం నామీద చాలా ఉంది. సినారె గారు త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు ఏవి రాసినా పాట లాగా పాడుకుంటూ రాసేవారు. అది నాకు ప్రేరణనిచ్చింది. నేను సినారె గారు రచించిన 45 పుస్తకాల మీద ఒక పుస్తకం రాశాను. అప్పుడు ‘యువ భారతి’ ప్రెసిడెంట్ గా ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఆయనతో స్నేహం ఏర్పడింది. ఆ పుస్తకాన్ని ఆయనకు చదివి వినిపిస్తే దాన్ని సంక్షిప్తం చేశారు. ఆ తరువాత అది పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకాన్ని చూసి సినారె గారు చాలా మెచ్చుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. తిరుపతిలో పద్మావతీ విశ్వవిద్యాలయం వారు సినారె గారిని ఒక పాట రాయమన్నారు. ఆయన ఆ పని నాకు అప్పగించారు. విశ్వవిద్యాలయం వారు బాగుందని మెచ్చుకొని ఖర్చులు పెట్టుకొని నన్ను తీసుకువెళ్లి తిరుపతిలో సన్మానం చేశారు. అంత నమ్మకం ఆయనకు నా మీద ఉండేది.
పాటలంటే ఎంతో ఇష్టపడే మీరు, సినారె గారి పట్ల అత్యంత ఆదరణ కలిగిన మీరు సినిమాలకు పాటలు రాయాలని ఎప్పుడైనా అనుకున్నారా?
(నవ్వుతూనే)….అనుకున్నాను. కానీ కుదరలేదు. పాటలు రాసి కె.విశ్వనాథ్ కు అంకితం కూడా ఇచ్చాను. వాటిని చూసి ఏమైనా అవకాశం ఇస్తాడేమో అనుకున్నా. ‘గంగాతరంగాలు’ పాటలను ఏదైనా సినిమాలోకి తీసుకుంటాడనుకున్నా. అదీ చేయలేదు. అందువల్ల సినిమాల మీద ధ్యాస వదిలేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వాడిని కావడం వలన ఇవ్వలేదని అర్థమైంది. కానీ ‘గంగాతరంగాలు’ క్యాసెట్ గా వచ్చింది. గోపీరాధ సంగీతంలో 1995 లో వెలువడింది. ఎమ్.కె రాము అని ఏవైనా సభలు జరిగినప్పుడు ఆ క్యాసెట్ తీసుకువచ్చి పాటలు వేసేవాడు.
మీ రచనల్లో ఎక్కువ భాగం ‘రుబాయీలు’ చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇందులో మీరు ఎంచుకున్న వస్తు వైవిధ్యం ఎటువంటిది?
రుబాయీలు, గజళ్ళ ప్రక్రియలను తెలుగులోకి తీసుకు వచ్చినవారు దాశరథి గారు. ఆ కాలంలో ఉర్దూ, ఇంగ్లీష్ చదువుకున్నవాడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కవిసమ్మేళనం పెట్టేవారు. అక్కడ రుబాయీలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎటువంటి లక్షణాలను పాటించకుండానే వారు చెప్పిన ధోరణిని పట్టుకొని రాసి సినారె గారికి చూపించాను. అప్పుడాయన దానికి ఉండే లక్షణాలను చెప్పారు. రుబాయీల్లో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, రెండు, నాలుగు పాదాలు అంత్యప్రాసలతో ఉండాలి. మూడవ పాదానికి కవి స్వతంత్రత ఉంటుంది. ఉదాహరణకు….
“మార్పు మంచిదే కాని శిల్పం శిల కావద్దు
మార్పు గొప్పదే కాని పువ్వు మొగ్గ కావద్దు
మార్పు తప్పదెపుడైన చెయి చెంచా కావద్దు
మార్పు తోసుకుని రానీ నీతి బూతు కావద్దు”
“మహిళా మణులెవరున్నా మాతృమూర్తి గొప్ప కదా
మాన్య భూములెన్నున్నా మాతృభూమి గొప్పకదా
ఘన సంస్కృతులెన్నున్నా తన సంస్కృతి వరణీయం
మహా భాషలెన్నున్నా మాతృభాష గొప్ప కదా”
ఈ విధంగా చివర్లో చెప్పే విషయం కోసం మిగతా మూడు పాదాలను మనం నిర్మించుకోవాలి. అనేక కవిసమ్మేళనాల్లో, సభల్లో నా రుబాయీలను విని దాశరథి గారు ఎంతో ప్రశంసించేవారు. వ్యక్తిత్వ పరమైనవి, సందేశాత్మకమైనవి, హాస్యప్రధానమైనవి, ప్రాకృతికమైనవి, ప్రగతిశీలమైనవి, రాజకీయమైనవి, శృంగార సంబంధమైనవి, దేశభక్తి యుతాలు, ప్రగతిశీలాలు, ప్రకృతి ప్రబోధాలు వంటి ఎన్నో అంశాలతో రాశాను. దాశరథి గారంటే ఎంతో అభిమానం నాకు. అందుకే ఆయన వ్యక్తిత్వ, జీవిత, సాహిత్యాలను వివరిస్తూ ‘దాశరథి’ పేరుతో పుస్తకం రాశాను. కేంద్రసాహిత్య అకాడెమీ వారు 2006వ సంవత్సరంలో దీనిని ప్రచురించారు. “భారతీయ సాహిత్య నిర్మాతలు” పరంపరలో వెలువడిన పుస్తకమిది. ఎంతోమంది ప్రశంసలు పొందింది.
‘కావ్యపుష్కరిణి’ కావ్యమంతా మీలోని ప్రగతిశీల భావాలకు దర్పణంగా భాసించింది. అందులోని పద్యాలు మచ్చుకు ఏవైనా తెలపండి.
సనాతన ధర్మంతో పాటు ఆధునిక అభ్యున్నతిని నేను కోరుకుంటాను. సంప్రదాయ వాదినే కాదు, అభ్యుదయ వాదిని కూడా. అందుకే వివిధ అంశాలున్నప్పటికీ ఇందులో ప్రగతిశీల ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీని గురించి “ఈ సంపుటిలో వస్తువేదైనా మానవీయ దృక్పథమే ప్రఫుల్ల రూపంలో అగుపిస్తుంది” అని సినారె గారు ప్రశంసించారు.
“ప్రకృతి జీవాత్మ ఘోషయే భాష నాకు
హితము సేయుటే ఏకైక మతము నాకు
భూరి విశ్వ గోళము జన్మభూమి నాకు
జీవకోటియే ఆరాధ్య దేవి నాకు”
“సాయము సహజీవనమున
కాయము కాయమ్ము గలుపగా నభ్యుదయ
శ్రీ యింకెచటికి పోవును?
మాయలు గాయాలు లేక మనుగడ సాగున్” ఈ విధంగా ఇందులోని పద్యాలు సాగుతుంటాయి.
మీ అనుసృజనాత్మకత శైలీ నిపుణతకు ప్రతీకగా నిలిచిన ‘జాతీయ కవితా సౌరభాల’ను గురించి చెప్పండి.
ప్రతీ సంవత్సరం ఆకాశవాణి కేంద్రం వారు ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా భారతీయ భాషల్లో జాతీయ కవిసమ్మేళనాలను నిర్వహించడం మీకందరికీ తెలిసిందే. అట్లా ప్రసారం అయిన పన్నెండు కవితలను నేను తెలుగులోకి అనువదించాను. వాటిని ‘జాతీయ కవితా సౌరభాలు’ అనే పుస్తకంగా వెలువరించాను. ఇతర భాషలలోనివి అనువాదం చేయాలంటే యథాతథంగా చేస్తే అది రక్తి కట్టదు. ఒక్కోచోట కొత్త పదబంధాలను చేర్చాలి. కొన్నిసార్లు భావానికనుగుణమైన అదనపు పంక్తి చేర్చాలి. అంతేకాదు తెలుగు నుడికారపు సొంపు అందులో ప్రతిఫలించాలి. ప్రాసలు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ ఇందులో ప్రాధాన్యం వహించేవే. కొన్నిచోట్ల ఇతర భాషలోని కవిత ఏ ప్రక్రియా రూపంలో ఉంటే అట్లాగే తెనిగించాను. ఉదాహరణకు గుజరాతీ లోని ఒక గజల్ ను గజల్ గానే అనువదించాను. ఛందోసంబంధమైన లక్షణంతో అప్పుడే దాని సౌందర్యం ఇనుమడిస్తుంది. మూల భాషాకవి హృదయానుగుణంగా ఆంధ్రీకరణ చేశాను. దానితో పాటు తెలుగు అనువాదం రమ్యంగా, సహృదయ గమ్యంగా ఉండడానికి యథాశక్తి ప్రయత్నించాను.
భాస్కర శతకానికి మీరు రచించిన వ్యాఖ్య ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆ నేపథ్యం ఏమిటి?
“శ్రీ పావని సేవాసమితి” వారు తెలుగులో ప్రసిద్ధి చెందిన శతకాలకు పండితులచేత వ్యాఖ్యలు రాయించి ప్రచురించారు. అందులో భాగంగా నన్ను భాస్కర శతకానికి వ్యాఖ్య రాయమన్నారు. ‘భాస్కర శతకము- సుదర్శన వ్యాఖ్య’ పేరుతో చేశాను. ఇందులో భాస్కర శతక కర్త గురించి, ఆ శతక ప్రత్యేకతను గురించి విపులంగా వివరించాను. రెండు చోట్ల ఔచిత్యాన్ని అనుసరించి సవరణలు చేశాను. పద్యం, దాని అర్థ తాత్పర్యాలు, పదాలకున్న విశేష అర్థాలు, ఆ పదప్రయోగంలోని పరమార్థాన్ని వివరించాను. సందర్భాన్ని బట్టి పౌరాణిక కథలను, కొన్ని న్యాయాలను, కొన్ని సామెతలను తెలిపాను. పూర్వకవుల నీతి పద్యాలను, శ్లోకాలను ఉదాహరణగా చూపాను. ఈ శతకంలోని పద్యాలకు దాదాపు 500 కు పైగా శ్లోకాలను ఉదాహరించాను.
వానమామలై వరదాచార్యుల గారి జీవితాన్ని గురించి పుస్తకం రాయడమే కాకుండా ఆయన శతక పద్యాలకు వ్యాఖ్య కూడా రాశారు కదా? ఆయనకు మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది?
వానమామలై వరదాచార్యులు గారు అద్భుతంగా ‘పోతన చరిత్రము’ రాశారు. ‘అభినవ పోతన’గా బిరుదు గడించారు. ఆ పుస్తకం బాగా చదివాను. ఆయన గురించి వ్యాసాలు రాశాను. బాగా రాశావని ఆయన మెచ్చుకున్నారు కూడా. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కు నేను వెళ్ళే వాడిని. నేను రాసిన వ్యాసాలు చూపించేవాణ్ణి. ఏమైనా తప్పులుంటే చర్చించి సరిదిద్దేవారు. ఆయనకు చూపించిన తరువాతే అచ్చు వేసుకునే వాడిని. అట్లా ఆయనతో అనుబంధం ఏర్పడింది. ఆయన మహోన్నత వ్యక్తి. ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని వివరిస్తూ పుస్తకం రాశాను. అట్లాగే ఆయన రచించిన గ్రంథాలలోని కొన్ని ముఖ్య పద్యాలను తీసుకొని ఆయన శత జయంత్యుత్సవ సందర్భంగా ‘వానమామలై శతపద్య పారిజాతాలు పరిమళ వ్యాఖ్య’ పేరుతో భాస్కర శతకానికి రాసినట్టు పుస్తకం రాశాను. దానిని అభినవ పోతన శతజయంత్యుత్సవ సమితి ప్రచురించింది.
నటనా రంగం పట్ల ఆసక్తి ఎట్లా కలిగింది? అందులో కూడా అనుభవజ్ఞులైన మీరు ఏ ఏ పాత్రలను ధరించేవారు?
దివాకర్ల వేంకటావధాని గారి అవధానాలు ఎన్నో విన్నాను. యువభారతి పక్షాన నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన, దాక్షిణాత్యయుగం, ప్రబంధాలకు సంబంధించిన ఉపన్యాసాలు చేసేవారాయన. యువభారతి వారు లహరి ఉపన్యాసాల పరంపర అని నడిపించేవారు. దానికి నేను ఒక్కోసారి ప్రస్తావన రాసి చదివేవాడిని. కొన్నిసార్లు ఉపసంహారం చదివేవాడిని. అట్లా నాకు దివాకర్ల వేంకటావధాని గారి ప్రభావం పడింది. ఆయన నిలబడి కదలకుండా రెండు మూడు గంటలు ఉపన్యాసాలు చెప్పేవాడు. అది దైవశక్తి అనుకోవాలి. ఆయన అవధానాల్లో కూడా పృచ్ఛకునిగా పాల్గొన్నాను. ఆయన ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున భారతం ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి నేతృత్వంలో తిరిగి ప్రింట్ చేస్తున్నారు. దివాకర్ల వారు నన్ను ప్రూఫులు చూడమన్నారు. ప్రతిరోజూ ఆయన ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు కూర్చొని చూసేవాణ్ణి. ఆ తరువాత విశ్వ విద్యాలయం వాళ్ళు దాన్ని ప్రచురించారు. అటువంటి సమయంలో వేంకటావధాని గారు వాళ్ళు ‘భువన విజయం’ నాటకం వేస్తుండేవారు. నన్ను ఒకసారి పద్యం చదువుమని అడిగారు. రాగయుక్తంగా చదవడంతో నాటకానికి సరిపోతుందని అన్నారు. అట్లా మాదయగారి మల్లన, పింగళి సూరన, మొదలైన పాత్రలు ఇచ్చేవారు. పింగళి సత్యనారాయణ అని ఆయన సూరన పాత్రలు వేసేవాడు. మంచి గొంతు ఉండేది ఆయనకు. ఆయన తరువాత ఆ పాత్రను నేను వేశాను. గుంటూరు శేషేంద్రశర్మ గారు ఉన్నన్నాళ్ళు శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఆయనే వేసేవారు. అయ్యదేవర పురుషోత్తమ రావు గారు కూడా ఉండేవారు. అవధాని గారు లేనప్పుడు అల్లసాని పెద్దన పాత్ర నాకే ఇచ్చారు.
మీ సతీమణి స్వరాజ్యలక్ష్మి గారి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని గురించి చెప్పండి.
అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు గొప్ప సంస్థ. దేవులపల్లి రామానుజరావు గారి అధ్యక్షతన అనేక సమావేశాలు జరిగేవి. అందులో జరిగే కవిసమ్మేళనాల్లో నేను పాల్గొనేవాడిని. అట్లా ఆయనతో ఒక అనుబంధం ఏర్పడింది. నా ఊహకొద్దీ రాసి చదివేవాడిని. ఈ రాసే నేపథ్యంలో నా భార్య స్వరాజ్యలక్ష్మి సహకారం చాలా ఉండేది. తను కూడా ఉద్యోగిని కావడం వల్ల ఇంటిని నడిపే బాధ్యత తాను తీసుకుంటానని, నాకు వచ్చే జీతం డబ్బులతో పుస్తకాలు వేసుకోమని ప్రోత్సహించేది. ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ప్రముఖ కవులు, రచయితల పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. నేను ఇన్ని పుస్తకాలు రాయడానికి కారణం ఆమె సహకారమే. అందువల్ల ఆమె మరణానంతరం ఆమె పేరుమీద సాహితీసేవ చేస్తున్న ప్రముఖులకు ఒకరికి పురస్కారాన్ని ఇస్తున్నాను. అదేవిధంగా నా పేరు మీద, మా అన్న రాఘవాచార్యుల పేరు మీద కూడా పురస్కారాలు ఇస్తున్నాను.
సాహిత్య ప్రయోజనాన్ని వివరిస్తూ ఆధునిక రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
సాహిత్యమంటే దీంట్లో అన్నీ వస్తాయి. భాష, సారస్వతం, సాహిత్యం. ఈ మూడింటిలో భాష అందరూ మాట్లాడుకునేది. మన భావాలను వెల్లడించేది. సారస్వతం కొంత కవిత్వానికి సంబంధించినది. ఇక సాహిత్యం రస భావాదులతో కూడినది. “స హితస్య భావః సాహిత్యం”. ఇందులో చెప్పదలచుకొన్న దానిని ధ్వనిమంతంగా, అన్యాపదేశంగా చెప్పాలి. చెప్పే విషయం పైకి కనబడినట్లుగా కాక లోతుగా పరిశీలించేదిగా ఉండాలి. దానికి ఊహాశక్తి చాలా అవసరం. సృజనాత్మకత అవసరం. ఆధునిక సాహిత్యంలో వచన కవిత్వం వచ్చిన తరువాత పద్యం, గేయం పడిపోయాయి. గణ చందస్సులు, మాత్రా ఛందస్సులు ఈ నిబంధనలన్నీ ఎందుకని ఇవేవీ లేని వచన కవిత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పద్యం ఎవరైనా రాస్తే వాళ్లే చదువుకోవాలి (నవ్వుతూ). మానవుడు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటాడు. సాహిత్యంలో అన్నీ ఆశించదగ్గ పరిణామాలే. కానీ అధ్యయనం చేయకుండా రాసే రాతల్లో భావ గాఢత లోపిస్తుంది. అందుకే ఎవ్వరైనా అధ్యయనం చేయాల్సిందే.
చాలా సంతోషం సార్. మీ సమయంలో కొంత మాకు కేటాయించి, ఇంత వివరంగా మీ జీవన, సాహిత్య విశేషాలను తెలిపినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన మీకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.

1 comment
https://shorturl.fm/tbLWx