Home ధారావాహిక నవల అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)

by Sompaka Seetha

మా ఫ్రెండ్స్‌లో మేమిద్దరమే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించు కోలేకపోయాము. ముఖ్యంగా మరీ నేను అన్ని యోగ్యతలు ఉండి కూడా చిరుద్యోగిగా మిగిలిపోయా. ఎదుగు బొదుగూలేని జీతం తెచ్చుకుంటూ సమాజం చూపించే నికృష్టమైన చూపుల తాకిడికి చాలా మానసికమైన క్రుంగుబాటుకు లోనైన రోజులెన్నో. అవన్నీ గుర్తుకొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది. మాలినివైపు చూశాను. ఒక మాత్ర, నిద్రకోసంగా వేసుకుంటానని చెప్పింది. బహుశా అందుకేనేమో నిద్రలోకి జారిపోయింది. నేనేమో గత జ్ఞాపకాల పుట్టకు చుట్టుకుపోయాను నా ప్రయత్నం లేకుండానే.

ప్రైవేట్‌ కళాశాలలంటే తెలవనిది ఏముంది? చాకిరీ ఎక్కువ, జీతాలు తక్కువ జీవితాంతం చేసినా. తరగతిలో విద్యార్థులు ఎక్కువ. వారం వారం పరీక్షలు. వాటిని మూల్యాంకనం చేయడం. అదనపు తరగతులు ఎక్కువ. సెలవులు తక్కువ. వెట్టిచాకిరీ లాగానే అన్పించేది ఒక్కోసారి. పుట్టింటి వేడుకలు, పెండ్లిండ్లకు కూడా ఓ అతిథిగా వెళ్ళినట్లుండేది. వేడుకకు ముందురోజు వెళ్లటం, వేడుక చూసుకోవటం, మళ్ళీ తెల్లారే వచ్చేయటం. ఇక ఇరుగు పొరుగు అమ్మలక్కల వింత మాటలు ‘ఆమెకేం హాయిగా పొద్దున్నే వెళ్లిపోతుంది. ఎప్పుడో పొద్దుగూకే సమయానికి వస్తుంది’ అన్నట్టుగా చాటుమాటు మాటలు ఒక్కోసారి చెవినపడి చాలా బాధ అన్పించేది. మావారు (కూడా) ఉద్యోగే ఆఫీసర్‌ స్థాయి. రోజూ వెళ్ళివస్తూండేవారు. ఇంటికి, మా కాలేజీకి మధ్య చాలా దూరం. పిల్లలిద్దరికీ, మా వారికి, నాకు క్యారేజీలు సర్దుకోవాలి. ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇల్లు సర్దుకోవాలి. ఎంత సర్దుకుంటే మహిళలు ఎనిమిది గంటలకల్లా బైటపడగలరు. ఎంతటి మానసికమైన వత్తిడిని ఎదుర్కోవాలి ప్రతిరోజూ. ఇవ్వేమీ తెలవవు ఆ వాగుడ్లు వాగేవారికి. నేనేదో దర్జాగానే వెళ్తున్నట్లుంది చూసేవారికి. తలొంచుకుని నా దారిన పోతుంటే. ఎంత పొగరోననే చూపులు గుచ్చుకునేవి. పోనీ ఒకే వీధిలో ఉంటున్నాం గదాని పలకరిస్తే, ఏం మీకు ఈ రోజు సెలవు కాదా? అనే వెటకారపు మాటలు. ఎప్పుడైనా దొరకక దొరకక ఒక సెలవు రోజు దొరికి, ఏ షాపింగ్‌కో వెళ్తుంటే ‘మీరివాళ కాలేజీకి పోలేదా?’ అనే మాటలు ఇవే ఉంటాయి వెక్కిరింపుల మాటలు దొర్లుతాయి. ఇలాంటి మాటలు వింటుంటే చాలా ఎంబ్రాసింగ్‌గా, ఇరిటేటింగ్‌గా ఉండేవి.

ఇక బంధువర్గం నుంచి మాటలు మరోరకంగా బాణాలై చురుక్కుమని గుచ్చుకుంటాయి. ‘ఓ ఇంకా ప్రభుత్వ ఉద్యోగం రాలేదా నీకు? అయినా గవర్నమెంటు ఉప్పుతినే అదృష్టం ఉండాలి ఎవరికైనా?’ అంటూ మొహం మీదే సామెత చెప్పినట్లుగా చెపుతూ, వేళాకోళపు చూపులు, ఇంట్లోనేమో ఇంకా ప్రత్యేకంగా… ‘బోల్డంత మందికి ఉద్యోగాలొస్తున్నాయి. టిక్కుటిక్కుమంటూ నువ్వింకా అదే చేస్తున్నావు. సంవత్సరానికి బోడి రెండొందలు పెరుగుతుంది. మీరేమో గట్టిగా అడగరు మేనేజ్‌మెంట్‌ని, ఆ ఇచ్చేది కూడా పదో తారీఖు దాటిన తర్వాతనే అనే సణుగుళ్లు. ఇలాంటి మాటలు విని వినీ రాయిలాగా అయిపోయిన మనసు మౌనంగా కన్నీళ్లు కార్చేది.

అత్తగారు లేనేలేరు. ఆమె వంతుగా వినొచ్చే మాటల్ని కూడా మా ఆడబడుచులే మూటకట్టుకుని నానెత్తిమీద గ్రుమ్మరిస్తూ ఈసడిరపుగా పలికే మాటల్ని అటుంచితే భర్తనుంచే వినాల్సిరావటం ఆడవారికెవరికైనా బాధగానే ఉంటూ గుర్తొచ్చినప్పుడల్లా ములుకుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి.

పట్టుదలగా నా మెతుకు నేనే సంపాదించుకోవాలనే ఆకాంక్షతో చిన్న

ఉద్యోగమైనా విడువకుండా సుమారుగా 35 ఏండ్ల పాటు వెట్టిచాకిరీనే చేశా. ఇన్నేళ్లు ఎట్లా చేశారాంటీ? అని తెలిసినవాళ్లు ఎవరైనా అడిగితే ఇంట్లో కూర్చుని ఏం చేస్తామమ్మా మనం నేర్చుకున్న చదువు వృధా పోకుండా నల్గురికీ పంచటమే నాకిష్టమని చెప్పేదాన్ని. దీనికి వెనుకవున్న అసలు ఉద్దేశ్యం మీకు తెలవటమే నాకు కావలసినది.

సెలవులు ఎక్కువగా లభించవుగదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి. మన దగ్గిర ముస్లిం పిల్లలు ఎక్కువ లేరని వారి పండుగలకు సెలవు లేకుండా చేయటం. పరీక్షా ఫలితాలు బాగా రావాలని ప్రైవేటు తరగతులతో రుద్దటం, కఠినంగా ఉన్న సబ్జెక్టుకు ఎక్స్‌ట్రా క్లాసులంటూ సమ్మర్‌లో కూడా మాకివ్వాల్సిన సెలవులను కుదిస్తూ మొత్తంమీద ఓ పదిరోజులివ్వటం గగనమైపోయేది. ఇక ఇలాంటి సందర్భంలో తీవ్రమైన వాగ్భాణాలు సంధింపబడేవి ఇంట్లో. ‘వాళ్ళిచ్చే ఇంతోటి జీతానికి సెలవురోజు కూడా కాలేజీకి పోవాలా? నువ్వే పోతున్నావా? ఇంకెవరైనా వస్తున్నారా లేదా? ఒకచో అనుమానపు చూపులు…

‘అదేంటండీ… అందరికీ సెలవులిచ్చారు గదా! ఐనా మీరు

వెళ్తున్నారెందుకంటూ…’ ఏదో నామీద లేనిపోని సానుభూతి ఒలకపోస్తూ చేసే కొందరి ఇచ్చకాల మాటలు… ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నా… అందరి చేతా మాటలు శూలాలై గ్రుచ్చుకుంటున్నా, క్లాసుకు వెళ్లగానే, బోధనలో పడగానే మనసు దూదిపింజలా తేలిపోయేది. అసలు పనిచేస్తున్న కాలేజీలోకి అడుగు పెట్టగానే ఓ ఓ పవిత్రభావన నన్ను అలుముకునేది. ఇదంతా ఆ సరస్వతీ మాత అందించిన దీవెనలా భావిస్తుంటాను ఇప్పటికీ. కానీ ఒక్కోసారి మనసు మరీ బాధపడేదెందుకంటే పదో తారీఖు వచ్చేసింది. ఇంకా జీతమడిగి తీసుకోరా, అడగటం కూడా చేతకాదా? అనే పదునైన ప్రశ్నలు ప్రతినెలా వినాల్సి రావటం. అసలు చదువుకోకుండా ఉంటే ఎంత బాగుండేది? ఒకవేళ చదువుకున్నా ఏ పదో తరగతి తోటో ఆపేస్తే ఎంత బాగుండేది! నేను కళాశాల నుండి స్టడీ అవర్‌ గానీ లేదా అదనపు క్లాసుగానీ ముగించుకుని వచ్చే సమయానికి సూర్యాస్తమయం దాటిపోయేది. సూర్యోదయానికి ముందే అంట్ల గిన్నెలతో కుస్తీలు, వంటింట్లో తలమునకలయ్యే పనులు… నాలుగున్నర ఐదింటికి ఠంచనుగా లేస్తేనే అట్లాట్లా టైము సరిపోయేది. ఒంట్లో నలతగా ఉండి ఏరోజైనా లేవటం ఆలస్యమైపోతే ఇక ఆరోజు చెప్పనే అక్కర్లేదు. ఈ ఇబ్బందులతోటి పోల్చుకుంటే ఇంట్లో హౌజ్‌ వైఫ్స్‌గా ఉంటారే వాళ్లపని చాలా బెస్ట్‌ అన్పిస్తుంది. పైగా భర్త జీతాన్ని తాము అందుకుంటూ ఇంట్లో వాళ్లందరి మీదా పెత్తనం చెలాయించటం, ఇంట్లో అన్నింటికి వాళ్ళ మాటే చెల్లుబాటులోకి తెచ్చుకోవటం ఇవన్నీ గమనిస్తుంటే… నాలాంటి చిరు ఉద్యోగినులందరికీ మిగిలేది ఏంటయ్యా అంటే ఏతావాతా చీవాట్లు, ఈసడిరపులు, పని ఒత్తిడిలో నలిగిపోవటం మినహా ఏం మిగిలిందనీ అనిపిస్తుంది నాకు. కానీ ఓపిక ఉన్నంతవరకు చిన్నదైనా సరే జాబ్‌ చేస్తూ స్వాభిమానంతో బ్రతకటమే ఎంతో మేలుగదా! ఆలోచిస్తూ… ఆలోచిస్తూ… గతాన్ని నెమరు వేసుకుంటూ నేను కూడా ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో తెలవదు.

మెలకువ వచ్చి చూస్తే తెల్లారి ఏడన్నరయింది గోడమీద ఉన్న గడియాం చూసేసరికి. నా చెయ్యి మాలినిని చుట్టుకుని ఉంది. పంక్షన్‌లో అలసిపోవటం మూలానో, ఆలోచనలకు నిద్రకు బ్రేకు వేయటమో… మొత్తానికి ఏమైందో తెలియదు గాని, తర్వాత గాఢ నిద్రే నన్ను వరించినట్లుగా అర్థమైంది. మనసు చాలా తేలికయినట్లన్పించింది.

***

ఆలోచనలను, బాధలను దులుపుకున్న మనసులు రాత్రిని కూడా దులుపుకున్నాయి. కప్పుకున్న దుప్పట్లను మడత పెట్టి, వాటి స్థానాల్లో సర్దేసి, బ్రెష్‌, స్నానం పూర్తిచేసుకుని, దేవుని దగ్గర దీపం పెట్టుకుని, టిఫిన్లు పని పూర్తిచేసుకుని ఇద్దరూ తయారవటం మొదలుపెట్టాము. ఎందుకంటే ఈరోజు ఆమని వాళ్ళింటికి వస్తామని తనకు మాటిచ్చాం. నిన్నంతా ఫంక్షన్‌కి వచ్చిన గెస్టులను రిసీవ్‌ చేసుకోవటం, భోజనాలకు తీసుకువెళ్ళటం, మళ్ళీ వాళ్లని సాగనపంటం. మధ్యమధ్యలో ‘మీరు కూడా రావాలి ఫోటోకి’ అని కోరే బంధువులతో, వచ్చిన ఫ్రెండ్స్‌తో స్టేజీ మీదకి ఫోటో దిగటానికి వెళ్ళాల్సి రావటం… ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ కూడా కుదిరినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి బాగా అయినవారిని మాకు పరిచయం చేయటం లాంటి పనులతో ఆమని హడావుడి పడుతోంది. మా పిల్లల చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేమంతా కలిసి ప్రైవేట్‌ కాలేజీలో పని చేశామని వారికి చెప్పటంతో ‘ఆ… ముప్ఫై, ముప్ఫై ఐదేండ్ల స్నేహమా మీది?’ అని వాళ్ళు ఆశ్చర్యపోవటం చూస్తుంటే చెప్పద్దూ… మాకు ఒకింత గర్వంగా

ఉండేది. అది ఆమని వాళ్ళ మనవడి బర్త్‌డే ఫంక్షను, పెండ్లిండ్లు, ఎంగేజ్‌మెంట్లు వాటితో పోల్చి చూస్తే ఇది చిన్నదే గదా!

అందుకే వాళ్ళు ‘ఈ ఫంక్షన్‌కి అంత దూరం నుండి వచ్చారా’ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే మా మధ్య పాదుకొని ఉన్న స్నేహ మాధుర్యం నా మనసునిండా సుధలు చిమ్మించేది. ఇదీ అని చెప్పలేని, ఎంత చెప్పినా తనివితీరని, ఎప్పటికీ మాసిపోని మా స్నేహబంధమిది అని వాళ్ళకు ఏం తెలుస్తుంది? అనుకున్నా నా మనసులో.

మొహమాటాన్కి వచ్చేవాళ్లు కొందరు, పరిచయాన్ని పురస్కరించుకుని రాకపోతే ఫీలవుతారని వచ్చేవాళ్లు కొంతమంది, మనింటికి వచ్చారుగదా, మనం కూడా వెళ్ళాలి, బాగోదని కొందరు, దాన్ని బాధ్యతగా భావించి కొందరు, పనిచేసివున్న ఆఫీసు కాబట్టి మొక్కుబడి కోసం వచ్చేవారు ఇంకొందరు, ఒకే అపార్టుమెంటులో ఉండేవాళ్ళము తెల్లారి లేస్తే ఒకరి మొఖాలొకరు చూసుకోవాలి… ఇది తప్పనిసరి అని భావించి అటెండయ్యేవారు కొంతమంది… వాళ్లకూ, మనకూ అంతగా మాటల్లేక పోయినా పిలిచారు కాబట్టి వెళ్ళొద్దాం. వెళ్ళకపోతే మనింటికి మళ్ళీ పిల్చినా వాళ్లు రారు అని మొక్కుబడిగా వచ్చేవాళ్ళు… ఇలా హాలంతా నిండిపోయి మొత్తానికి సందడి సందడిగా, కోలాహలంగా ఉంటే, తిండి కోసమే వచ్చామన్నట్టుగా ఆబగా ప్లేటునిండా వడ్డించుకుని, ఆపై తినలేక వృధాగా పారేసే వేస్టురాయుళ్లు.. ఇందరి మధ్యన వెలుగుతున్న స్నేహ బంధం గొప్పదనం వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది చెప్పండి.

అందర్నీ గమనిస్తూ భోజనం చేస్తున్న మమ్మల్ని ‘‘ఆ కర్రీ వేయించుకోండి చాలా బాగుంది. ఇదిగో ఈ కర్రీ రోటీలోకి బావుంటుదని మా పిల్లలు స్పెషల్‌గా చేయించారని, తానే స్వయంగా తెచ్చి వడ్డించటంతో నేనే వారించా ఆమనిని.

‘‘మేమేమన్నా కొత్త చుట్టాలమా? ఏంటి చెప్పు. మాకు కావాల్సింది మేము పెట్టించుకుంటాంలే! అని చెప్తూ అతిథులను చూసుకో ఆమనీ’’ అని ఒకింత గట్టిగా చెప్పటంతో అయిష్టంగానే కదలటం తప్పింది కాదు తనకు. ఆ కబుర్లూ, ఈ  కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి, తలా ఓ కప్పు ఐస్‌క్రీము తినే పనిలో పడ్డాం. మాకు తెలిసిన వారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కంటూ మధ్యమధ్యలో మా మా హ్యాండ్‌ బ్యాగ్‌ల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాం. తప్పదుగదామరి! జనం తొక్కిడిలో వున్నప్పుడు మన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేగదా!

అతిథుల తాకిడి క్రమక్రమంగా తగ్గుతోంది. నిండుగా ఉన్న ఆ హాలు పలచబడుతూ, పొందికగా వేయబడ్డ కుర్చీలు అయిష్టంగా ఉన్న వ్యక్తులు ప్రక్క ప్రక్కనే ఉన్నా ఎలా పెడమొఖంగా ఉంటారో అట్లా ఉన్నాయి. బఫే మూలంగా అక్కడక్కడా వాటర్‌ తాగిన గ్లాసులు, ఫంక్షన్‌ మధ్యలో సర్వ్‌చేసిన కూలింగ్‌ డ్రిరక్‌ బాటిల్సు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఇంట్లో ఏదన్నా అభిప్రాయ బేధాలు లేదా గొడవలు జరిగినపుడు కుటుంబంలో ఏదో కష్టపడిపోయినట్లు. ‘ఇక మేం వెళ్లొస్తామండీ!’ అంటూ ఆమని దంపతులకు చెప్పి వెళ్తున్నారు వచ్చిన అతిథులు.

ఎక్కడి వాళ్లక్కడ స్తబ్దుగా ఉన్నట్లుగా తోచసాగాయి వాటిని చూస్తుంటే. సందడి సద్దుమణిగింది. మేం కూడా ఆమని దంపతులకు వెళ్లొస్తామని చెప్పి బైల్దేరాం అక్కడి నుండి.

మాలిని, నేనూ ఆటోలో వెళ్తున్నామన్న మాటేగానీ కందిరీగల్లా ఆలోచనలు ముసురుకోసాగాయి నా మనసులో.

‘‘ఆమని ప్రొద్దున్న కాల్‌ చేసింది నాకు. చూసుకోలేదు. ఇటురావటానికి తయారయ్యే ధ్యాసలోపడి’’ అంది నవ్వుతూ మాలిని నాతో.

వింటున్నట్లుగా తనని చూసి తలపంకించాను నేను.

‘‘ఈ పూట భోజనానికి రావాలి తప్పకుండా’’ అని మెజేస్‌ పెట్టింది. నేను ఫోన్‌ చూసుకోలేదని’’ అంది మాలిని మళ్ళీ.

మళ్ళీ ‘ఊ’ అన్నాను తల ఊపుతూ.

ఫంక్షన్‌ కొచ్చిన కొంతమంది అట్నుంచి అటే వెళ్లినా దగ్గిర బంధువులు కొందరైనా ఇంటికొచ్చి బస చేస్తారుగదా! వద్దంటే వినదు.

అసలు తననోసారి కలిసి కాసేపుండి ఆ బర్త్‌డే బుడ్డోడ్ని మరోసారి ఎత్తుకొని మురవాలని నా ఆశ. మాలినిది కూడా అదే ఆశ. ఆ ఆలోచనతోటే ఉన్న మాకు భోజనానికి ఇక్కడికే రావాలన్న ప్రేమ పూర్వక ఆదేశంలాంటిది అందటంతో తప్పించుకోలేకపోయాము మేమిద్దరం. మాలిని మనసులోని భావాలు కూడా ఇవే సాగుతున్నట్లుగా అర్థమవుతున్నాయి తన ముఖ కవళికలను చూస్తుంటే.

‘‘అవునబ్బా మైథిలి… రామారావు అన్నయ్యగారు చాలా మారిపోయారు. మునుపటిలాగా కాదు. నిప్పులోంచి పుటం పెట్టి బైటికి తీసిన వ్యక్తిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో మెరిసిపోతుంటారు’’ నిండైన మనసుతో తొణికిసలాడుతుంటారు’’ అంది నాతో.

‘‘అవును భార్యభర్తలిద్దరూ చాలా హెల్పింగ్‌ నేచర్‌ ఉన్న సహృదయాలు అంటూ గతంలోని ఒక సంఘటనను ఇలా పంచుకుంది మైథిలి మాలినితో.

మా పెద్ద మనవరాలు పుట్టినపుడు హాస్పిటల్‌లో…

మా పెద్దమ్మాయి కిరణ్మయిని కాన్పు కోసం హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు మా ఇంటి చుట్టూతా ఉన్న ఆడపడుచులూ, మా తోటికోడలు అందరూ వచ్చారు రావటానికైతే. దానికి తొలిచూలు. నాకూ క్రొత్త. ఏదో భయంతో కూడిన హడావుడి. కాలూ చెయ్యి ఆడట్లేదు నాకు కంగారులో. ఉమ్మనీరు పడిపోవటంతో కాన్పు కష్టమయ్యేట్లుందని డాక్టరమ్మ సిజేరియన్‌ చెయ్యాలని చెప్పి మావారితో సంతకం తీసుకున్నారు. సర్జరీకి కావలసిన ఫార్మలిటీస్‌ ఏవో ఉంటాయి గదా! చకచకా ఆ పనులు పూర్తవుతున్నాయి ఒక ప్రక్కనుంచి. రెండోవైపు పిల్లని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు నర్సులు. నాకేమో ఇంకా భయం పెరిగిపోతోంది మనసులో. ఎట్లా బైట పడుతుందో ఏమోనని ఆదుర్దా మావారి మొహంలో స్పష్టంగా కన్పడుతోంది. ఎప్పుడూ ధైర్యం చెదరని వ్యక్తి ఆయన గంభీర వదనంలో కూడా కంగారు స్పష్టంగా కనబడుతోంది. ఏమి చెయ్యడము. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అప్పుడు మా చిన్నపాప హరిణి అక్కడే ఉంది. ముందుగా ఈ  విషయం వెంటనే ఆమనికి ఫోన్‌ చేసిందట తను. కబురందిన వెంటనే ఆఘమేఘాలమీద వచ్చి వాలారు ఆమని దంపతులు. ఇక్కడొక విషయం చెప్పాలి. తను ఒక్కతే వస్తే చాలు నాకు సాయం చేయటాన్కి. కానీ తనతోపాటుగా వాళ్ళ వారు రామారావు అన్నయ్యగారు కూడా వచ్చి చాలా సేపటి వరకూ అక్కడే ఉండిపోయారు మాతోపాటుగా. మా బంధుగణం వాళ్ళల్లోవాళ్ళు ఛలోక్తులు వేసుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారుగానీ, ఒకళ్లైనా వచ్చి ‘భయపడకు మైథిలీ, ఏం కాదు కిరణ్మయికి. తేలికగానే బయటపడుతుంది అని ఒక్కరు కూడా నాకు ధైర్యం చెప్పటం కాదుగదా, కట్టకట్టుకున్నట్టుగా అందరూ ఓ ఫ్యాన్‌ కింది చేరిపోయారు. నేను, మావారు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాము, థియేటర్‌ బయట తలుపులకు దగ్గరగా నిలబడి. నర్సులు బైటకి వచ్చి కొబ్బరినూనె, ఇంకా పాత క్లాతులు ఇట్లా ఏవేవో అడుగుతుంటే మా చిన్నపాపే అందిస్తోంది వాళ్లకు. నా ప్రక్కనే నిలబడి ఆమని నా చెయ్యి పట్టుకుని ‘ఏంకాదండీ… కంగారు పడకండి’ అంటూ ఉపశమనపు మాటలు చెబుతోంది. తన మాటలకు కాస్త ఊరట లభించింది నాకు. కొంచెం తెప్పరిల్లాను. ఈలోపులో థియేటర్‌లో నుండి అప్పుడే పుట్టిన చంటిపాప ఏడుపు కేర్‌కేర్‌ మని (పెద్దగా) వినపడటంతో అందరి మొహాల్లో నవ్వులు విరబూశాయి. ఈలోగా ఒక నర్సు తలుపు కొద్దిగా తెరిచి, ‘మీకు మనవరాలు పుట్టింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నార’ని చెప్పటంతో, ఇంతవరకూ పడ్డ ఆ కంగారూ, ఆదుర్దా ఎటు ఎగిరిపోయాయో తెలియదు. నా మనసు ఆనంద తరంగమైంది. మావారి మొహంలో సంతోషం ఎగిసిపడుతోంది.

ఇంతలో పాపను హాస్పిటల్‌ డ్రస్సప్‌తో చలిగాలి తగలకుండా భద్రంగా చుట్టి నాకు తెచ్చివ్వబోతుంటే, చటుక్కుమని ఆమని తన రెండు చేతులను చాచి పదిలంగా అందుకుంది. నాకేమీ అర్థం కాలేదు.

‘‘రండి మైథిలీ… మనమిప్పుడు పీడియాట్రిషన్‌ దగ్గరకు వెళ్ళి వ్యాక్సిన్‌ వేయించాలి బేబీకి’’ అంటూ అన్నయ్యగార్ని ఆటో తెమ్మని పురమాయించింది.

మావారు, మా చిన్నపాప కిరణ్మయిని చూసుకుంటానికి అక్కడే ఉన్నారు. బంధువుల కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. హరిణీ అక్కను జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ, మావారి నుండి నేను కొంత డబ్బు అడిగి తీసుకుని, ‘జాగ్రత్తగా చూసుకోండి కిరణ్మయిని’ అని చెబుతూ, ఆమనితోబాటుగా నేనూ నెమ్మదిగా మెట్లుదిగి, అన్నయ్యగారు రెడీగా తెప్పించి ఉంచిన ఆటోలో జాగ్రత్తగా ఎక్కి, పిల్లల హాస్పిటల్‌కు చేరుకుని, పాపాయికి వ్యాక్సిన్‌ వేయించుకుని తిరిగి హాస్పిటల్‌కు నేను, ఆమని చేరుకున్నాము. రిసెప్షన్లో రూం నెంబరు కనుక్కుని రూమ్‌లోకొచ్చాము. మత్తు

ఉంటుందిగా కొద్దిపాటి మూలుగుతో మంచం మీద పడుకో పెట్టబడి ఉంది కిరణ్మయి. మావారు మెడిసిన్స్‌ తీసుకోవటాన్కి క్రింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్ళినట్లుగా చెప్పింది హరిణి. ఎంతో పదిలంగా ప్రేమతో పాపాయిని కిరణ్మయి ప్రక్కన జాగ్రత్తగా పడుకోబెట్టి, అంతే జాగ్రత్తగా బెడ్‌షీట్‌ను కప్పింది ఆమని, చలిగాలి తగలకుండా. మనసులో ఏ మారుమూలో దాగివున్న కంగారు, భయం క్రమేపీ తగ్గసాగాయి నాలో. ఆమని లేకపోతే నేను పాపాయిని వ్యాక్సిన్‌కి తీసుకెళ్లటం, తీసుకురావటం ఖచ్చితంగా చేయలేననిపించింది. తను ఉండబట్టి సరిపోయింది. అప్పుడే పుట్టిన బేబీస్‌ను ఎలా ఎత్తుకోవాలో తెలవదు నాకు. ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా ఆమని రెండు చేతులూ పట్టుకుని `

‘‘థ్యాంక్స్‌ ఆమనీ’’ అన్నా నిండైన మనసుతో, ఆనంద భాష్పాలు నిండిన కండ్లతో. గద్గదమైన కంఠం నుండి ఎక్కువ మాటలు వెలువడలేదు నాకు.

‘‘ఇవేం మాటలు. ఇలాంటి మాటలుండకూడదు ఫ్రెండ్స్‌ మధ్యలో’’ అంటూ నా వీపు నిమిరి, ఎనలేని ధైర్యాన్నిచ్చిన ఆపన్న ధైర్య హస్తం ఆమనిది.

బంధుగణం అనబడే మావాళ్లు నెమ్మది, నెమ్మదిగా ఒక్కొక్కరు మెచ్చుకోళ్ళుగా అభినందనలు చెబుతూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోవటానికి తిరుగు ముఖం పడుతున్న సమయంలో, మావారు పెద్ద మందుల పెట్టెతో వచ్చారు రూంలోకి. ఆ వెనుకే వచ్చిన నర్సు ఇంజక్షన్‌ని లోడ్‌ చేసుకుంటూ, ‘పాపాయికి మధ్య మధ్యలో దూదితో డిస్ట్రిల్‌ వాటర్‌ని చప్పరించేటట్లు చేయండి’ అంటూ కొంచెం దూదిని, డిస్ట్రిల్‌ వాటర్‌ బాటిల్‌ను నాకు ఇవ్వబోతే, ‘మీరాగండి’ అంటూ తనే అందుకుంది ఆమని.

ఆ వెళ్తున్న వాళ్లను చూస్తూ ఎవరన్నా ఇక్కడుండండి మైథిలికి తోడుగా అని మావారు అనబోతండగా, అది వినిపించుకునే స్థితిలో లేని వాళ్ళ కదలికలు ‘వెళ్ళొస్తాం మైథిలీ’ అని తిరుగుటపా కట్టారు. చేసేదిలేక వాళ్ళ వాళ్ళు కదా! పైగా మాతోపాటు వచ్చారాయె! బాగోదని క్రిందిదాకా వెళ్ళి వాళ్లు వెళ్ళిన తర్వాత పైకి రూంకి వచ్చారు మళ్ళీ మావారు.

‘‘మీకు తోడుగా నేనుంటాను ఈ నైట్‌కి ఇక్కడ. ఇద్దరం కల్సి తల్లి పిల్లల్ని చూసుకుందాం’’ అంది ఆమని నాతో.

ఎంతో భరోసానిచ్చిన తన మాటలను, తోడుండి తెల్లవార్లూ కిరణ్మయినీ, పాపాయినీ చూసుకున్న తీరుని నేను ఈ జన్మలో మర్చిపోలేను.

‘‘ఓయ్‌, మైథిలీ!’’ అని గట్టిగా మాలిని నా భుజాన్ని కుదపటంతో నేను గతంలోంచి వాస్తవంలోకి వచ్చిపడ్డాను. ఆటోనేమో ఆమని వాళ్ళ అపార్ట్‌మెంటు ముందుకొచ్చి ఆగింది.

డబ్బులిచ్చి ఆటోవాణ్ణి పంపేసి, ఇద్దరమూ లోపలికెళ్ళి లిఫ్ట్‌ సాయంతో పైకి చేరుకుని సరాసరి ఆమని వాళ్ళ పోర్షన్‌ ముందు ఆగాము.

ఇంకా కొంతమంది బంధువులున్నారు. చిన్నపిల్లలు బొమ్మలతో ఒకరిద్దరు పిల్లలు కార్టూన్‌ నెట్‌వర్క్‌ చూస్తూ ఒకింత హడావుడిగా ఉంది, మెస్‌ డోర్‌ లోంచి చూస్తుంటే. కాలింగ్‌ బెల్‌ నొక్కింది మాలిని. వెంటనే మా కోసమే ఎదురు చూస్తోందేమో… బెల్‌ మ్రోగిన వెంటనే సంతోషంగా వచ్చి మెస్‌ డోర్‌ తీసింది ఆమని నవ్వుతూ. తన వెనకే అన్నయ్యగారు కనపడ్డారు. ఇద్దర్నీ విష్‌ చేసి అక్కడున్న సోఫాలో కూర్చున్నాము. వాటర్‌ కావాలా? కాఫీగానీ, టీ గానీ తాగుతారా అని అడిగింది మమ్మల్ని.

‘‘అయ్యబాబోయ్‌! కాఫీ, టీలు ఏమీ వద్దు. అన్నీ అయ్యాయి. ఇప్పుడేం వద్దు. కాసేపయ్యాక భోజనాలు చేసేద్దాం’’ అన్నా ఆమనితో. సరేనని తనుకూడా తలవూపుతూ మాతోపాటు కూర్చుంది కాసేపు. ఎంత కేటరింగ్‌ అయినా, ఫంక్షన్‌ జరిగిందంటే ఆ ఇంట్లో అదేనండీ ఫంక్షన్‌ హాలయినా చేసిన వారికి అలసట అన్ని వస్తువులు సర్దుకునేవరకు హడావుడి మామూలే. దీనికేమాత్రం విరుద్ధంగా లేదు ఆ ఇల్లు.

‘‘ఇప్పుడీ భోజనాలు, గీజనాలూ పెట్టుకోకపోతే ఏమైంది ఆమనీ’’ అన్నా.

‘‘ఆ… ఇక్కడున్న మేమంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. నువ్వు మాత్రం రాలేకపోతున్నావుగా. ఇప్పుడొచ్చావు ఎలాగో! మళ్ళీ ఎన్నాళ్లకో’’ అంది కొంచె నిష్ఠూరం నిండిన స్వరంతో.

‘‘ఆ… ఇక అలాంటిదేమీ లేదోయ్‌! కనీసం రెండు నెలలకొకసారయినా వస్తుంటాను’’ అన్నాను నమ్మకంగా. కొంచెం అనారోగ్యం బారినుండి కోలుకున్నాననే ధైర్యం వచ్చింది కాబట్టి.

‘‘అవును… ఇకనుండీ తప్పకుండా వస్తుంది మనల్ని కలవటాన్కి’’ అని నా అభిప్రాయాన్ని సమర్థించింది మాలిని.

నైటీ మీద ఉంది ఆమని. పాపం ఇంతసేపూ వంటపనిలో ఉందిగదా. ఇప్పుడే డ్రస్‌ ఛేంజ్‌ చేసుకుని వస్తా, మాట్లాడుతుండండి’’ అంటూ లోపలికి వెళ్ళింది.

మేమొచ్చిన అలికిడిని తెలుసుకున్నట్లుంది. నిన్నటి వేడుకకు కర్త, కర్మ, క్రియలుగా వెలిగిన జంట బర్తడే బాబుతో హాల్లోకి వచ్చారు. అసలు వాళ్లమ్మ చంకలో ఉండట్లేదు వాడు. కిందకి దిగి పరుగెత్తాలని వాడి ఆలోచన. ఇక లాభం లేదనుకుని తల్లి బాబుని కిందకి దింపింది. అసలు నిన్నే బాబు ఫంక్షన్‌ హాల్లో పరుగులు పెడుతుంటే ఎక్కడ పడిపోతాడో ఆ కార్పెట్లూ, కుర్చీలూ తగిలి, అనే భయంతో వెనుకెనుకే తిరిగారు బాబు తాతైన రామారావుగారు. ముందు వచ్చిన చెవులు కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటారు ఇదేగదూ అంటే చంద్రిక పగలబడి నవ్వింది. ఆ నవ్వుతో శృతి కలిపారు హాసిని, పద్మిని, మాలినులు. ‘అంతేగదా’ అంటూ.

అలా కిందికి దింపిందో లేదో తల్లి… బాబు హాలంతా తిరుగుతూ నన్నెవరూ చూడట్లేదులే అని గమనించినప్పుడల్లా పరుగులు తీస్తున్నాడు.

సంవత్సరమన్నా వెళ్లిందో లేదో ఆ బుడతడు అలా వేగంగా నడుస్తూ ఎవరికీ అందకుండా పరుగెత్తాలనే ఆ చిన్ని బుర్ర ఆలోచనకు నాకెంతో ముద్దొచ్చి, అమాంతం దగ్గిరగా వెళ్లి ఎత్తుకున్నాను. నవ్వు మొహం బాబుది. ఎవర్ని చూసినా కిలకిలా నవ్వుతాడు. బాబు మొహాన్ని మరింత అందంగా మారుస్తోంది వాడి చలాకీదనం.

అన్నయ్యగార్కి ఫోటోలు తియ్యమని సైగ చేశాం. వెంటనే దాదాపు ఓ ఐదారు ఫొటోలు ఫాస్ట్‌గా క్లిక్‌ చేశారు. బాబుని వాళ్లమ్మ కిచ్చాను. ఇంతలోకి లోపలనుంచి వచ్చిన ఆమని డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనాలు సిద్ధం చేస్తూ, రమ్మని పిలవటంతో సింక్‌ దగ్గిరకు వెళ్లి చేతులు కడుక్కుని మాలిని, నేను డైనింగ్‌ డేబుల్‌ దగ్గరకు చేరుకున్నాము. ‘నువ్వు కూడా మాతోపాటు కూర్చో ఆమనీ’ అని పిలవటంతో తనూ మాతో చేరింది టేబుల్‌ దగ్గరకు. అన్నయ్యగారు కూడా వచ్చి కూర్చున్నారు భోజనానికి. పప్పు, చిక్కుడుకాయ కూర, పచ్చడి, సాంబారు, వడియాలు, ఒక ఆకుకూర… అన్నీ మా నల్గురికీ అందుబాటులో ఉండేవిధంగా అమర్చింది ఆమని.

* * *

మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్‌ కట్‌ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్‌ పీరియడ్లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.

మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్‌ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్‌ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.

ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్‌ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.

***

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.

టిక్కెట్‌ అన్న కండక్టర్‌ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్‌ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.

వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.

ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.

ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్‌ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్‌ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్‌ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.

మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.

మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.

మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.

వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్‌ పేజీని క్రాస్‌ చేసిన చదువరులమే!

ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.

తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్‌ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.

అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.

‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.

దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్‌ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్‌ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.

గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.

గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.

‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్‌ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.

గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.

‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.

‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్‌ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్‌ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్‌ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.

యోగా సెషన్‌లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్‌ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్‌ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్‌ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్‌. మనమే కుక్స్‌. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్‌. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్‌ సలాడ్స్‌ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్‌ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్‌, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్‌ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.

ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో

ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?

‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే

వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.

‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్‌?’’ అన్నా.

‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.

‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.

‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్‌ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.

నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.

ఇలాగా మాకీరోజు సెషన్‌ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్‌ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్‌ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా

ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్‌ టేబుల్‌ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.

వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా

శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి

ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.

‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్‌ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్‌ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.

మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.

‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్‌ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.

‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’

‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్‌ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్‌ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.

‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.

‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.

‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.

ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో

ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.

అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?

మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?

నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.

ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో

వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్‌ వాష్‌ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్‌ వాష్‌ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.

‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.

‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.

నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.

సశేషం

You may also like

27 comments

Julian3621 July 31, 2025 - 4:36 pm Reply
Sylvia1715 July 31, 2025 - 5:11 pm Reply
Mae3276 July 31, 2025 - 5:39 pm Reply
Gabriela1313 July 31, 2025 - 10:43 pm Reply
Chance195 August 1, 2025 - 6:06 am Reply
Colton4867 August 1, 2025 - 7:10 am Reply
April4460 August 1, 2025 - 10:13 am Reply
Nikita2935 August 1, 2025 - 2:47 pm Reply
Lincoln2388 August 1, 2025 - 11:57 pm Reply
Roberto4505 August 2, 2025 - 1:34 pm Reply
Annette2374 August 3, 2025 - 6:08 am Reply
Darryl3952 August 3, 2025 - 9:53 am Reply
Duncan1178 August 3, 2025 - 1:20 pm Reply
Barry3664 August 4, 2025 - 3:28 am Reply
Logan3857 August 4, 2025 - 7:56 am Reply
Harvey1008 August 12, 2025 - 12:31 am Reply
Haleigh3379 August 12, 2025 - 6:20 am Reply
Leland1459 August 12, 2025 - 6:27 am Reply
Aurora4692 August 12, 2025 - 8:23 am Reply
Cheryl1824 August 15, 2025 - 5:01 am Reply
Reid1669 August 19, 2025 - 1:40 am Reply
Dion2957 August 23, 2025 - 7:48 am Reply
Lorelei76 August 24, 2025 - 10:53 pm Reply
Drake4868 August 30, 2025 - 12:24 pm Reply
Teagan2142 August 30, 2025 - 11:55 pm Reply
Holly1441 August 31, 2025 - 9:27 am Reply
Darwin785 September 4, 2025 - 6:49 pm Reply

Leave a Reply to Julian3621 Cancel Reply