Home వ్యాసాలు రాజకీయాలను నలుపు తెలుపులో నిలిపిన పీవీ

రాజకీయాలను నలుపు తెలుపులో నిలిపిన పీవీ

నేరుగా రాజకీయాలతో సంబంధంలేని వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా రాజకీయాల్ని పరిశీలిస్తుంటారు. ఆ రాజకీయాల మీద రచయితలైనవాళ్ళు తమ అభిప్రాయాలను, నిరసనను కొన్ని పాత్రల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు పుట్టించిన ప్రకంపనల ప్రభావాలు అందులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రధానంగా రాజకీయ నాయకులకు ఉండే లక్షణాలు ఏవీ లేని నాయకుడు పీ.వీ. నరసింహారావు. అగ్రశ్రేణి నాయకుడు కావలసిన చారిత్రక సందర్భాలు వచ్చినప్పుడు ఒక మేధావిగా ప్రధాని పదవిని నిర్వహించాడు. తన యవ్వనకాలం నుండి వృద్ధాప్యం వరకు, చిన్న రాజకీయ నాయకుడి నుండి భారత ప్రధాన మంత్రి స్థాయి వరకు ఆయనకు రాజకీయాలకు ఉన్నది తామరాకు నీటిబొట్టు సంబంధమే. తన జీవితకాలపు రాజకీయాలను ఒక రచయితగానే ఆయన చూసాడు. రచయితకుండాల్సిన మూడవ నేత్రాన్ని ఆయన ఎన్నడూ కోల్పోలేదు. ఆ మూడవ నేత్రంతో ప్రభావితమైన ఆయన లోపలి మనిషిని చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే రాజకీయాలు భరించాయి. వాటి కథా కమామిషు పీ.వీ. తన The Insiderలో చిత్రించాడు.

ఇతివృత్తం

The Insider 1998లో విడుదలయింది. ఇందులోని విషయమంతా రాజకీయమే. సంధికాలపు విషయాలను లక్ష్యంగా రాయకపోయినప్పటికీ స్వాతంత్ర్యానంతరపు తొలి, మలి దశల రాజకీయాల్ని చిత్రించిన రాజకీయ నవల ఇది. కుష్వంత్ సింగ్ A Train to Pakistanలో, సల్మాన్ రష్దీ Midnight Childrenలా చిరకాలం గుర్తుంచుకోదగిన రచన. అయితే ఇది పూర్తి వాస్తవిక సంఘటనలతో రాసిన నవల అని చెప్పలేం. కానీ పాఠకుడికి ఆ కాలపు రాజకీయ వాస్తవాలు అర్థం అవుతూ ఉంటాయి. శాతాల్లో చెప్పలేం కానీ పాత్రలు, ప్రదేశాలు పేర్లు మార్చుకోబడ్డ వాస్తవం ఇందులో ఉంటుంది. దీన్ని స్వయంగా పీ.వీ. ఇట్లా చెప్పాడు. ‘ఇది కల్పనాయదార్థాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి, కథాకారుడు, విమర్శకుడు, రచయిత ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాత్రలు నూటికి నూరుపాళ్ళు కాల్పనికం కాదు, నూటికి నూరుపాళ్ళు వస్తుతః శల్య మాంసయుక్తులైన వ్యక్తులూ కాదు. రకరకాల మనుషులు, రచయితకు కానవచ్చిన రకరకాల ప్రవృత్తుల సమ్మిశ్ర (సింథటిక్) సృష్టిజనితులు. ఒక్క ప్రధాన మంత్రులలో కాల్పనికత లేదు.’ దీన్నిబట్టి ఈ నవలేతివృత్తం పేర్లకు పరిమితం కాని వాస్తవం. ప్రధానమంత్రి విషయంలో పేర్లు కూడా వాస్తవమే. నవలలో ప్రధానంగా నాలుగు భాగాల ఇతివృత్తం ఉంది. ఆనంద్ బాల్యం యవ్వనారంభంలో భాగంగా నడిచిన భారత స్వాతంత్ర్యోద్యమం, అఫ్రోజాబాద్ విలీనోద్యమం ఒక భాగం. తొలి స్వాతంత్ర్యపు ప్రజాస్వామ్య పోకడలలో భాగంగా ఎన్నికల అపసవ్యత; మహేంద్రనాథ్-చౌదరిల మధ్య అసమ్మతి, కుర్చీ పోరాటంలో కుట్రలు, కుతంత్రాలు రెండవ భాగం. నెహ్రూ, ఇందిరల స్పూర్తితో, గట్టిపట్టుదలతో ఆనంద్ ముఖ్యమంత్రి కాగానే చేపట్టిన భూసంస్కరణలు, భూస్వామ్య వర్గం కక్ష, ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడం మూడవ భాగం. ఢిల్లీలో అధిష్టానం అభిప్రాయాన్ని ప్రభావితం చేసే బ్రోకర్లు, అసమ్మతి శిబిరాలు, వాళ్లకు ఉండే పరస్పర సంబంధాలు, వాటి పర్యవసానాలు ఈ నవలలోని ప్రధానమైన మరొక భాగం. 750పేజీలకు పైబడిన, విస్తారమైన నిడివి గలిగిన ఈ నవలను కల్లూరి భాస్కరం నవల ఇతివృత్తాన్ని ఇట్లా చెప్పారు. “ఆనంద్ తలపడింది ఒక త్రికోణ నిర్మిత స్థితిలో. దాని అట్టడుగున ఉన్నది, ఎన్నికల్లో ఓటర్లుగా తప్ప ఇంకెలాంటి గుర్తింపూలేని, నోరూవాయీ లేని అసంఖ్యాక ప్రజానీకం. మధ్యలో ఉన్నదీ సిద్ధాంత జ్ఞానం కానీ, నిబద్ధత కానీ, ప్రజాహిత దృష్టి కానీ లేని రాజకీయ దళారుల ప్రపంచం. ఆ త్రికోణ స్థితి పైన ఏకాకిగా నిలబడిన ఒక స్వాప్నికుడు, ఒక తాత్వికుడు, ఒక ప్రజాహితైషి ఆనంద్. అట్టడుగువైపుకు రాజకీయ, శాసనగతిని మళ్ళించడానికి అతడు చేసిన నిర్విరామ, విఫల యత్నాల విషాద గాథే లోపలి మనిషి”. కల్లూరి భాస్కరం అనువాదం తెలుగులో ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. 2002లో అక్టోబర్ లో ‘లోపలి మనిషి’ పేరుతో ప్రింటయింది. ఎమ్మెస్కో ప్రచురించిన ఈ నవలకు స్వయంగా పీ.వీ. ఎడిటింగ్ కూడా ఉండడంతో ఇది ఒక రకంగా స్వతంత్ర రచన కిందే లెక్క.

కథాగమనం
నవల 60 అధ్యాయాలుగా నడుస్తుంది. ఇందులో వచ్చే పేర్లను అవగాహన చేసుకోవడం కోసం ఈ కింది సంకేతనామాలను తెలుసుకోవాలి. అఫ్రోజాబాద్-హైదరాబాద్ నాసిర్ జాషీ-అసఫ్ జాహీ ఖాదీమాన్-రాజాకార్ హషీం అలీ-లాయక్ అలీ రహీం అల్వీ-రాజ్వా ఖాసీం ఆనంద్-పీవీ 10వ నాసిర్ జా పాలిస్తున్న అఫ్రోజాబాద్ లోని అనంతగిరి గ్రామాధికారి కొడుకు ఆనంద్. చదువుకోసం ఆనంద్ ను షెగావ్ లో ఉంటున్న చిన్నాన్న మారుతి ఇంటికి పంపిస్తారు. చిన్నాన్న, చిన్నమ్మ మనోరమాదేవి, వాళ్ళ పిల్లలు రాజు, కమలలతో కలిసి గుల్షన్ పూర్ లో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆనంద్ మొదటిసారి బస్సు ఎక్కి ఆశ్చర్యానికి గురవుతాడు. పాఠశాలలో చురుకైన విద్యార్థిగా రాణిస్తాడు. ఆనంద్ కు పెళ్ళవుతుంది. అనల్ మాలిక్ ఉద్యమం ప్రారంభమవడం వల్ల ఆనంద్ పాఠశాలలో కృష్ణుడి వేషం వేసినా చూడడానికి కరీం రాడు. హఫీజ్, సుదర్శన్ లు ఆనంద్ కు స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్నిచ్చి ప్రేరేపిస్తారు. క్విట్ ఇండియా కాలంలో ఆనంద్ బ్రిటీష్ ఇండియా భూభాగాలలోకి వెళ్లి ప్రేరణ పొందుతాడు. వీరాపురంలో ఖాదీమాన్ (రజాకార్) మూకలు, పోలీసులు చేసే దాడుల్నుండి రక్షించే వాలంటీర్లలో ఆనంద్ పాల్గొంటాడు. భారత్ లో అఫ్రోజాబాద్ విలీనం జరిగిపోతుంది.

మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ కమిటీ చైర్మెన్ రాఘవ్, అరుణ టిక్కెట్ ఆడిగితే పక్కలోకి రమ్మంటాడు. ఆమె ఆనంద్ ను ఆశ్రయించడంతో ఆనంద్ కు గెలవలేని నియోజకవర్గం ఇస్తాడు. అయినా శ్రీరాంపూర్ నుండి ఆనంద్ గెలుస్తాడు. మహేంద్రనాథ్ ముఖ్యమంత్రి అయితే, చౌదరి మంత్రిగా అసమ్మతి పాత్ర పోషిస్తాడు. చౌదరి శిబిరం మనిషి శేఖర్ మహేంద్రనాథ్ పక్షం చేరి కథ రక్తికట్టిస్తాడు. మహేంద్రనాథ్ చేత జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చేయించి చెడ్డపేరు వచ్చేట్లు చేసి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడానికి కారణమవుతాడు. చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు. తటస్తుడైన ఆనంద్ కు మంత్రి వర్గంలో చోటు లభిస్తుంది. అరుణతో ఆనంద్ ప్రేమాయణం నడుస్తుంది.

నెహ్రూ భూసంస్కరణలు చేపట్టమని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తాడు. ఇది ఇష్టంలేని చౌదరి తలపట్టుకుంటాడు. మరో మంత్రి శేఖర్ ఆ శాఖను ఆనంద్ కిమ్మని ఓ పాచిక వేస్తాడు. ఆనంద్ భూసంస్కరణల మంత్రి అవుతాడు. నెహ్రూ మరణానంతరం మొరార్జీ-ఇందిరల మధ్య నాయకత్వ యుద్ధంలో భాగంగా లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం ఇందిర ప్రధాని అవుతుంది. అనేక అంతర్జాతీయ, జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య చౌదరిని దించేస్తుంది ఆధిష్టానం. ఆనంద్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆనంద్ సీ.ఎం. గా భూసంస్కరణలను చర్చకు పెడతాడు. భూసంస్కరణలు చర్చల దశలోనే ఉండగానే కమ్యూనిస్టులు భూ ఆక్రమణలకు పాల్పడతారు. భూ సంస్కరణల చట్టం ఆమోదించబడుతుంది. ఇందుకు పర్యవసానంగా ఇందిరను అశ్లీలంగా చిత్రిస్తూ గోడరాతలు వెలుస్తాయి. అవి ఇందిర దాకా వెళ్తాయి. ఆనంద్ రాజీనామా సమర్పిస్తాడు. ముఖ్యమంత్రి పదవి పోతుంది. కథా గమనంలో మరొక ప్రధానమైన అంశం ఢిల్లీలోని అధిష్టానం. రంజన్ బాబు, లాలా గోపీ కిషన్ లాంటి పవర్ బ్రోకర్లు, జాతీయ పత్రికల కరస్పాండెంట్ల ప్రభావాలతోనే రాష్ట్రంలో నరేంద్రనాథ్, చౌదరి, ఆనంద్ ముగ్గురూ పదవులు కోల్పోతారు. పవర్ బ్రోకర్లను, పత్రికలను ప్రభావితం చేసేది అసమ్మతి. మాధ్యమం-డబ్బు, విలాసాలు.

సామాజిక చిత్రణ
కేవలం 2 శాతం మాత్రమే అక్షరాస్యులున్న 1948కి పూర్వపు హైదరాబాద్ సంస్థానపు స్థితిగతులు మొదటి పది అధ్యాయాలలో వివరంగా పీ.వీ. వివరించాడు. భూ పరిపాలనతో సంబంధమున్న కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి రాజకీయాలకు భూమికి సంబంధాలను సరిగ్గా అంచనా వేయగలిగాడు, సజీవంగా చిత్రించగలిగాడు. ఆనంద్ వాళ్ళ ఊరికే కాకుండా మిగితా గ్రామాలకు కూడా నిర్నీతమైన సరిహద్దులేవీ లేని సంగతి చెబుతాడు. రచయితకు సైకిల్ కూడా అపురూపమే. సినిమా ఆ కాలంలో అరుదుగా దొరికే అవకాశం. హైద్రాబాద్ లో సినిమా ఉందేది కాని, పల్లెటూరి వాళ్ళు సినిమా చూడడం అనేది జీవితకాలపు వింత. ఆనంద్ బండి, గిర్దావర్ బండికి ఎదురైతే ఆనంద్ వెనక్కి వెళ్ళిపోవాలని ఊరంతా హితబోధ చేయడం ద్వారా సర్కారు ఊద్యోగులంటే ఉండే భయభక్తులను తెలియజేస్తుంది. పసిపాపకు పాలివ్వడానికి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళొస్తానన్న ఒక కూలీ స్త్రీని జాగీర్దార్ గుమస్తా అత్యంత దారుణంగా హింసించే సంఘటన చూసి ఆనంద్ చలించిపోతాడు, అడ్డుకుంటాడు. ఆ సందర్భంలో రచయిత చిత్రించిన సన్నివేషాలు ఆనాటి తెలంగాణలో ఊరూరా జరుగుతూనే ఉండేవి. చదువుల కోసం బంధువుల ఇండ్లలో పిల్లల్ని సంవత్సరాల తరబడి ఉంచడం అప్పటి మధ్యతరగతి కుటుంబంలో సాధారణమైన విషయం. ఎడ్లబండి ప్రయాణంలోని దర్పం, ఆనందం నవలా నాయకుడి జ్ఞాపకాలుగా ఇందులో చిత్రించబడ్డాయి. పట్నంలో అప్పటికే అమ్మాయిల స్కూళ్ళుండేవి. అబ్బాయిలు అమ్మాయిల్ని బనాయించడం, వెంటబడడం కూడా ఉన్న వాస్తవాల్ని ఇందులో పీ.వీ. చిత్రించాడు. ఇంకో హాస్యస్ఫోరకమైన విషయాన్ని కూడా పీ.వీ. ఇందులో చిత్రించాడు. రాజుకు కొడుకు పుట్టినప్పుడల్లా స్కూలుకు సెలవిచ్చేవారట. అందువల్ల రాజుకు తరచూ కొడుకులు పుడితే బాగుండేదని అందరూ జోక్స్ వేసుకునే వారట, ఎందుకంటే రాజుకు అనేకమంది భార్యలుండేవారని.

మత పరిస్థితులు
ఆనంద్, కరీం సన్నిహిత మిత్రులు. వారి వారి కుటుంబాలు కూడా ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉండేవి. ఆనంద్ పాఠశాల విద్య చదువుతున్న రోజుల్లో కృష్ణాష్టమి, మొహర్రం రెండు మతాల వాళ్ళు కలిపి చేసుకునేవారు. సరిగ్గా అప్పుడే ముస్లిం పెద్దలు ‘అనల్ మాలిక్’ (మనం రాజులం) అనే నినాదం పుట్టించారు. అప్పటిదాకా కలిసి ఉండే ప్రజలు హిందూ, ముస్లిం మతస్తులుగా విడిపోయారు. స్కూల్లో కృష్ణాష్టమి రోజున ఆనంద్ శ్రీకృష్ణుడి వేషం వేసాడు. వేషం టైంకి వస్తానన్న కరీం రాడు. ఎందుకు మాట తప్పాడో కనుక్కుందామని ఆనంద్ కరీం వాళ్ళింటికి వెళ్తాడు. తీరా వెళ్ళే సరికి కరీం ఇంట్లో లేడు. నగరం నుండి వచ్చిన అఫ్జల్ చాచా కనిపించాడు. ‘కరీం ఎక్కడికెళ్ళాడో నాకు తెలియదు. అయినా వాడితో మీకేంపని. అది మీ పండుగ. హిందువులే ఆ పండుగ జరుపుకోవాలి’ అన్నాడు. అలా వచ్చిన మత విభజనకు వెనక రాజకీయ కారణాలే ఉంటాయి. రాజకీయ కారణాలు లేనంతవరకు మతం ఒక అడ్డుగోడగా ఎప్పుడూ నిలవలేదనడానికి కూడా ఈ నవలలో సాక్ష్యాలు చూపించాడు పీ.వీ. కూలీ మహిళను పాలివ్వడానికి పోనివ్వకుండా హింసించిన జాగీర్దార్ గుమస్తా గొప్ప సంప్రదాయం ఉట్టిపడేలా మూడు నిలువుబొట్లు పెట్టిన హిందువే. సంస్థానంలో మతం అనేది భారతదేశానికి స్వాతంత్ర్యం రానుందనే ప్రచారం తర్వాత మాత్రమే ప్రారంభించబడింది. స్వాతంత్ర్యం, వెనువెంటనే విలీనం అనే స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ ప్రచారానికి మరో ప్రతిఫలనంగా అనల్ మాలిక్, అంజుమన్ తబ్లిగిస్లాం తెరమీదికొచ్చాయి. అయితే పురోగామి వాదులు దీనికి అతీతంగా ఆలోచించడం కూడా ఈ నవలలో చిత్రించబడింది. ఆనంద్ కు ఖవ్వాలి బాక్స్ నెపంతో భగత్ సింగ్ లేఖనూ, దేశభక్తి గీతాలను ఇచ్చిన విప్లవకారుడు హఫీజ్ అనే ముస్లిం. ఆనంద్ లోని పురోగామి భావాలను ప్రోత్సహించే ప్రిన్సిపల్ కూడా ముస్లిం.

ఎన్నికలు, రాజకీయాలు
స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నికలు రాజకీయాలు విడదీయరానివిగా మారిపోయాయి. అప్పటిదాకా ఉన్న త్యాగశీలత, ప్రజలపట్ల ప్రేమ మచ్చుకైనా కనిపించకుండా పోయిందనే అభిప్రాయాన్ని పీవీ అనేక సంఘటనల ద్వారా చిత్రించాడు. మొదటి ఎన్నికల్లోనే టిక్కట్ల పంపిణీలో వర్గాలు ఏర్పడతాయి. గెలిచే సీట్లను తన మనుషులకు ఇప్పించుకోవడం, ఓడే సీట్లు పార్టీలో వ్యతిరేకులకు ఇచ్చుకోవడం మొదలయింది. రాజకీయాల్లో స్త్రీలను ఎలా వాడుకోవచ్చో రాఘవ్ పాత్ర కళ్ళకు కడుతుంది. అరుణ అనైతిక సంబంధానికి ఒప్పుకోకపోవడంతో ఓడిపోయే సీటిస్తాడు రాఘవ. ఆమెకు అండగా ఉండే ఆనంద్ కూ ఓడిపోయే సీటు ఇస్తాడు. డబ్బులు ఖర్చుపెట్టనిదే, సారా పంపిణీ చేయనిదే ఎన్నికల్లో గెలవలేమని మొదటి సాధారణ ఎన్నికల్లోనే నిరూపించబడిందని ఆనంద్ గ్రహిస్తాడు. సిన్హా, రాం కుమార్, అజిత్ సింగ్ లు ఆనంద్ ద్వారా పని మంజూరీ చేయించుకుందామని పైరవీ చేస్తే ఆనంద్ అందుకు ఒప్పుకోడు. అందువల్ల వాళ్ళు ధర్మకార్యం నెపంతో అరుణ ద్వారా పైరవీ సాధించుకుంటారు. ఆమె నిజాన్ని గ్రహించి దూరం పెట్టడంతో అరుణను బండ బూతులు తిట్టడానికి కూడా తెగిస్తారు. అధిష్టానం దూతగా రంజన్ బాబు అఫ్రోజాబాద్ వస్తాడు. ఆయన పర్యటనలో ఆయనను ప్రభావితం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తారు. ఆ ఎత్తులన్నీ అనైతికమైనవే. కానీ పవర్ బ్రోకర్లకు అవే కావాలి. నరేంద్రనాథ్ అన్ని మర్యాదలూ చేసాక కూడా ‘సూట్ కేసు’ ఇవ్వకపోతే లాభం లేదనుకొని తెలుసుకుంటాడు. ఎక్కడ సూట్ కేసు ఇచ్చినా బహిరంగం అవుతుందని భయపడి విమానంలో బోర్డ్ అవుతుండగా ఒక సహాయకుడి ద్వారా ‘సర్! మీరు సూట్ కేసు మర్చిపోయారు’ అంటూ అందజేయిస్తాడు. ఢిల్లీకి వెళ్తే ముఖ్యమంత్రికి ఏం విలువ ఉండదు. పవర్ బ్రోకర్లను, జాతీయ దినపత్రికల విలేఖరులను ‘మేనేజ్’ చేసుకుంటేనే ఢిల్లీ వర్గాల్లో మంచి పేరుంటుంది.

అదే అధిష్టానం దగ్గర ప్రతిఫలిస్తుంది. ఇలాంటి అభిప్రాయాలను బలపరిచే అనేక సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఆనంద్ కు ముఖ్యమంత్రి పదవి ఎంత నాటకీయంగా వచ్చిందో అంతే నాటకీయంగా పోతుంది. ఈ రెండు సందర్భాలలోనూ రాజకీయ వివేచనతో కాకుండా ఢిల్లీ మేనేజ్ మెంట్లతోనేనని చెప్పవచ్చు. ఆనంద్ కు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చిందీ, తొలగించినదీ ఇందిరా గాంధే కనుక ఈ నవల ద్వారా ఇందిరను బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాడని, కొందరంటారు కానీ నవల మొత్తం ఇలాంటి సంఘటనలే ఉన్నాయన్న సంగతి గమనించినప్పుడు ఆ విమర్శలో పసలేదు. లోపలి మనిషి విపులమైన నవల. ఇందులో కేవలం అఫ్రోజాబాద్, ఢిల్లీ ముచ్చట్లే కాకుండా తమిళ, అసోం తదితర భాషా ఉద్యమాలు; ఇతర రాష్ట్రాల రాజకీయాలు, ముఖ్యమంత్రుల వ్యవహారాలూ చర్చించబడ్డాయి. బంగ్లా భాషోద్యమం దేశం ఏర్పాటుగా పరిణమించిన వైనాన్ని, పాక్, చైనా యుద్ధాలను సందర్భానుసారంగా చెబుతూ వచ్చారు. పాటలను, ఒప్పందాలను, నిబంధనలను చాలా చోట్ల చరిత్ర గ్రంథంలో ఉటంకించినట్లు రాసాడు పీ.వీ. ఇంత విపులంగా రాసిన లోపలి మనిషి పీవీ జీవిత గమనంలో అర్థభాగం మాత్రమే. తర్వాత కాలంలో ప్రధానిగా, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడుగా ఎదుర్కొన్న ఆటుపోట్లు చిత్రిస్తే తన ఆత్మకథాత్మక నవల సంపూర్ణమయ్యేది.

స్వతహాగా ఇది ఇంగ్లీషు నవలకు తెలుగు అనువాదం అయినప్పటికీ కల్లూరి భాస్కరం అనువాదం సూటిగా, ఒరిజినల్ రచనలాగానే ఉండడం విశేషం.

-డా. ఏనుగు నరసింహారెడ్డి
ప్రముఖ కవి, రచయిత
అదనపు కలెక్టర్, కరీంనగర్
+91-8978869183

You may also like

Leave a Comment