Home వ్యాసాలు అభ్యుదయ శక్తులకు నిరంతర స్ఫూర్తి

అభ్యుదయ శక్తులకు నిరంతర స్ఫూర్తి

అభ్యుదయ శక్తులకు నిరంతర స్ఫూర్తి/కష్టజీవులకు కొండంత అండ శ్రీశ్రీ. -మోతుకూరు నరహరి.

* * *

‘కష్టజీవికి ఇరువైపులా నిలబడే వాడే కవి’ (క ష్టజీ వి)అని అల్పాక్షరాలలో అనల్పమైన సత్యాన్ని చెప్పిన మహాకవి, ప్రజాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ జన్మించింది 1910లో విశాఖపట్టణంలో. అస్తమించింది 1983లో చెన్నైలో. ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించి 38 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ జనాన్ని -ముఖ్యంగా కార్మికులకు, కర్షకులకు,అనేకానేకులైన చేతివృత్తులవారికి, వారిపట్ల సానుభూతి గల, వారితో తాదాత్మ్యం చెందే మేధావులకు, కవులకు, కళాకారులకు తన కవితలతో నిరంతరం ఉత్తేజాన్ని ఇస్తూనే ఉన్నాడు. కవితలను అల్లడం ప్రారంభించిన కాలంలో కవితా లోకంలో ఆనాటి దిగ్గజాలు అయిన విశ్వనాథ సత్య నారాయణ, దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారల ప్రభావంతో ప్రకృతి, ప్రేమ, తాత్వికత వంటి అంశాలపై ‘ప్రభవ’ మొదలైన శీర్షికలతో చక్కని పద్యాలు రచించిన శ్రీశ్రీ త్వరలోనే వారి ప్రభావం నుండి బైటపడి, సామాజిక సమస్యల పరిష్కారానికి 1934లో సాహితీరంగంలో సుదీర్ఘ యాత్ర(లాంగ్ మార్చ్)ను ‘మహా ప్రస్థానం’ కవితతో ప్రారంభించాడు. ఈ గీతంలో ‘ఎర్రబావుటా నిగనిగల’ను, ఒక మనిషిని వేరొక మనిషీ- ఒక జాతిని వేరొక జాతీ- పీడించే సాంఘిక ధర్మం చెల్లని ‘మరో ప్రపంచా’న్ని ప్రస్తావించాడు. ఈ మహాప్రస్థానానికి ప్రారంభ సూచనగా 1933లోనే ‘జయభేరి’ని మోగించాడు. ”నేను సైతం ప్రపంచాగ్నికి- సమిధనొక్కటి ఆహుతిచ్చాను” అని ప్రారంభమైన ‘జయభేరి’ కవిత ”నేను సైతం భువన భవనపు- బావుటాన్నై పైకి లేస్తాను” అనే ఉన్నత ఆశయ వ్యక్తీకరణతో ముగుస్తుంది. ‘మహాప్రస్థానం’ కవితల సంపుటిని అకాలమరణం పాలైన తన సన్నిహిత మిత్రుడు కొంపెల్ల జనార్దన రావుకు ‘అంకితం’ ఇస్తూ ”నిరుత్సాహాన్ని జయించడం- నీవల్లనే నేర్చుకుంటున్నాము” అన్న వాక్యం ప్రజా ఉద్యమాలలో ఉన్న మనం అందరం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన మాట. సమాజంలోని అనేకానేక సమస్యలను‌ ప్రస్తావించి, వాటికి గల కారణాలను విశ్లేషించి, పరిష్కారాలను సూచించిన శ్రీశ్రీ ‘బాటసారి’ లో వలస బతుకును,’భిక్షవర్షీయసి’ లో అనాథ వృద్ధ స్త్రీల పరిస్థితిని, ‘ఆకాశదీపం’ లో నిరాశోపహతుడైన నిరుద్యోగ యువకుడినీ చిత్రించాడు.

తన కవితలను “కార్మికలోకపు కల్యాణానికి- శ్రామికలోకపు సౌభాగ్యానికి- సమర్పణంగా,సమర్చనంగా” విరచించిన శ్రీశ్రీ ‘పొలాల్లో బంగారం పండుతుంది’ అనే సామెతను “పొలాలనన్నీ హలాల దున్నీ-ఇలాతలంలో హేమం పండగ-జగానికంతా సౌఖ్యం నిండగ..” అని కవితగా మలిచి తన ఆకాంక్షను వ్యక్తీకరించాడు. “కమ్మరి కొలిమీ,కుమ్మరిచక్రం” వంటి అనేకానేకాలైన చేతివృత్తుల వారి సాధనాలను ప్రస్తావించి, అవే “నా వినుతించే- నా విరుతించే-నా వినిపించే- నవీనగీతికి భావం,భాగ్యం- ప్రాణం,ప్రణవం..”అన్న శ్రీశ్రీ నిస్సందేహంగా శ్రామిక జన పక్షపాతి. వారికి నిరంతర స్ఫూర్తి ప్రదాత. స్వయం ప్రకటితమేధావులు కొందరు మెట్టవేదాంతాన్ని వల్లిస్తూ దోపిడీ వర్గాలకు వత్తాసు పలకడాన్ని ‘మిథ్యావాది’ కవితలో చీల్చి చెండాడాడు శ్రీశ్రీ. “జమీందారు రోల్సు కారు- మాయంటావూ? బాబూ!ఏమంటావు?.. మహారాజు మనీపర్సు- మాయంటావూ?- స్వామీ! ఏమంటావు?- పాలికాపు నుదుటి చెమట- కూలివాని గుండె చెరువు- బిచ్చగాడి కడుపు కరువు- మాయంటావూ?.. ఏయ్!ఏమంటావు?” అని మిథ్యావాదులను గద్దించి, నిలదీసి, వారికి చెమటలు పట్టించాడు. అభివృద్ధి కాముకులను , అవకాశ వాదులను/తిరోగమన వాదులను స్పష్టంగా విడదీసి చెప్తూ “అలజడి మా జీవితం- ఆందోళన మా ఊపిరి- తిరుగుబాటు మా వేదాంతం- ముళ్ళూ రాళ్ళూ అవాంతరాలెన్ని ఉన్నా- ముందు దారిమాది… ముందుకు పోతాం మేము- ప్రపంచం మావెంట వస్తుంది- అభిప్రాయాల కోసం- బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు- మాలోకి వస్తారు- అభిప్రాయాలు మార్చుకొని- సుఖాలు కామించే వాళ్ళు- మీలోకి పోతారు..” అనగలగడమే శ్రీశ్రీ విశిష్టత. “కొంతమంది కుర్రవాళ్ళు- పుట్టుకతో వృద్ధులు- తాతగారి నాన్నగారి- భావాలకి దాసులు- ఉత్తమొద్దు రాచ్చిప్పలు- నూతిలోని కప్పలు- నేటి నిజం చూడలేని- కీటక సన్యాసులు” అంటూ పక్కదారి పడుతున్న యువతపై కొరడా ఝళిపించిన శ్రీశ్రీ భగత్ సింగ్ వంటి దేశభక్తియుత యువ కిశోరాల వారసులైన వారిని- “మరికొంతమంది యువకులు రా- రాబోవు యుగం దూతలు- పావన నవజీవన బృం దావన నిర్మాతలు- బానిసభావాలను తల- వంచి అనుకరించరు- పోనీ అని అన్యాయపు- పోకడలను సహించరు- వారికి నా ఆహ్వానం- వారికి నా సాల్యూట్”- అని అభినందించాడు,వీపు తట్టాడు.
సహజంగా అభ్యుదయ,విప్లవ కవి అయిన శ్రీశ్రీ ‘శైశవగీతి’ ని ఎంతో మార్దవంగా రాయడం ఆశ్చర్యం అనిపించినా ఆయన దృష్టి ఎంతమాత్రమూ పాక్షికం కాదు-అది బహుముఖీనం- అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. “వాన కురిస్తే- మెరుపు మెరిస్తే- ఆకసమున హరివిల్లు విరిస్తే- ఇవి మాకే అని ఆనందించే పాపల్లారా!” అనడంలో శ్రీశ్రీ బాల బాలికలలో తానూ ఓ బాలుడై పోయినట్టుగా అనిపిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’తోపాటు ‘ఖడ్గసృష్టి’, ‘మూడు యాభయిలు’ , ‘మరో మూడు యాభయిలు’ వంటి కవితా సంపుటాలతోపాటు అనేక వ్యాసాలను,నాటికలను,’నా చైనా యానం’అనే యాత్రా చరిత్రనూ రచించాడు. ‘ఖడ్గసృష్టి’ ని ప్రారంభిస్తూ “రెండు రెళ్ళు నాలుగన్నందుకు- గూండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో- క్షేమం అవిభాజ్యం అంటే- జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో- …ఆశయం ఉండడం మంచిదే కాని- అన్ని ఆశయాలూ మంచివి కావు- ఆశయాలు సంఘర్షించేవేళ- ఆయుధం అలీనం కాదు-.. అందుకే సృష్టిస్తున్నాను- అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని- కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది- జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది- ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది- నవీనమార్గాన్ని చూపిస్తుంది- ఇది నిజం- నవధర్మం మానవధర్మం- ఆణుశక్తి కన్న- మానవశక్తి మిన్న….” అన్న శ్రీశ్రీ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి శ్రీశ్రీ చెప్పిన చిరుకవితలు అనేకం నినాదాలుగా మారి, గోడలపైకికూడా ఎక్కాయి. “న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే.కాని గెలిచేదంతా న్యాయం కాదు”. “దొంగనోట్ల దొంగ ఓట్ల- రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి సాక్షులిచ్చు- సాక్ష్యం ఒక సాక్ష్యమా?” జీవికను వెతుక్కుంటూ మదరాసుకు చేరిన శ్రీశ్రీ చలన చిత్రం రంగంలోనూ తన ప్రత్యేక ముద్రను నిలుపుకున్నాడు. ఎంతగా?అంటే “కారులో షికారుకెళ్ళే- పాలబుగ్గల పసిడీదానా- బుగ్గమీది గులాబిరంగు- ఎలా వచ్చెనో చెప్పగలవా..?” అనే ఆత్రేయగారి గీతాన్ని ‘అది శ్రీశ్రీదే’ అని అత్యధికులు భావించేంతగా. 60 ఏళ్ళ నాటి శ్రీశ్రీ గీతం ”పాడవోయి భారతీయుడా..” లోని పరిస్థితులే దేశంలో నేడూ ఉన్నాయి-ఇంకా తీవ్రంగా. “ఆకాశం అందుకొనే- ధరలొక వైపు- అదుపు లేని నిరుద్యోగ- మింకొక వైపు- అవినీతి బంధు ప్రీతి- చీకటి బజారు- అలముకొన్న నీ దేశం- ఎటు దిగజారు? కాంచవోయి నేటి దుస్థితి- ఎదిరించవోయి ఈ పరిస్థితి..” ఎదిరిస్తున్నాం.మరింత బలాన్ని పుంజుకొని పాలకుల దుర్మార్గాలను‌ ఎదిరించక తప్పదు. “కల కానిది-విలువైనది..’ గీతంలో ఓదార్చి, ధైర్యం చెప్పిన శ్రీశ్రీ “తెలుగువీర లేవరా- దీక్షబూని సాగరా- దేశమాత స్వేచ్ఛ కోరి- తిరుగుబాటు సేయరా” అని జనాన్ని ఉత్తేజపరిచిన శ్రీశ్రీ “తెల్లవారి గుండెల్లో- నిదురించినవాడా- మా నిదురించిన పౌరుషాగ్ని- రగిలించినవాడా..” అని చమత్కరించి, మన్యం వీరుడు అల్లూరిని మన కళ్ళ ఎదుట సాక్షాత్కరింపజేసి, మనలో దేశభక్తిని రగుల్కొల్పాడు. ఈ గీతం జాతీయస్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారం పొందగా శ్రీశ్రీ ‘జయభేరి’ లోని “నేను సైతం” చరణాలతో ప్రారంభమైన సుద్దాల అశోక్ తేజ గీతం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారాన్ని పొందగలగడం శ్రీశ్రీ వేసిన దారి రహదారిగా మారిందని చూపుతున్నది. పాలకులు మతం, కులం, ప్రాంతం, భాష, తినే ఆహారం, ధరించే వస్త్రాల పేరుతో ప్రజలలో-ముఖ్యంగా యువతలో పరస్పర విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో “మనుష్యుడే నా సందేశం- మానవుడే నా సంగీతం” అన్న శ్రీశ్రీ కవితల ప్రాసంగికత (రెలవెన్స్) ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. శ్రీశ్రీ కలలుగన్న, ప్రయత్నించిన సమసమాజ స్థాపనకోసం దీక్షతో అలుపు లేకుండా కృషి చేయడమే ఆ మహాకవికి మనం అర్పించే నిజమైన నివాళి.

ఏప్రిల్ 30, 1910
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా

-మోతుకూరి నరహరి

విశ్రాంత ప్రధానాచార్యులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్),
సారస్వత పరిషత్తు ప్రాచ్య (ఓరియంటల్ పిజి)కళాశాల,
హైదరాబాదు.
+91-8464980540

You may also like

Leave a Comment