Home ఇంద్రధనుస్సు మన యాదాద్రి
శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

శ్రీమచ్ఛ్రీ రత్నగర్భా హృదయ సరసిజాత ప్రభా భాను బింబం
కంపా కంపానుకంపా మృత రసభరితాహ్లాద ప్రహ్లాద డింభం
శుంభ త్సంరంభ గంభీర తనురుచి ప్రాప్ప డంభోదకాండం
వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్!

– శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు

కనువిందు చేయబోయే యాదాద్రి చిత్రం

తాత్పర్యం : శ్రీ మంతురాలైన లక్ష్మీదేవి (రత్నగర్భ) యొక్క హృదయ కమలాన్ని వికసింపజేయగల కాంతిమంతమైన భాను బింబమైనవాడు ; అతివేగంగా కదలగలవాడు – స్థిరమైనవాడు – తన అనుకంపా (కరుణా) మృతరసాన్ని పరిపూర్ణంగా నింపడఁచేత ఆహ్లాదాన్ని (సంతోషాన్ని) కలిగిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు ; ప్రకాశవంతమూ – పరాక్రమశీలమూ అయి గంభీరమైన తన శరీరకాంతి అనే వర్షాకాల మందలి మేఘ సమూహం వంటివాడు; యాదాద్రిపై నెలకొన్న తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్నీ చూపుతున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు : శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దుష్ట (రాక్షస) సంహారం కోసం అవతరించినవాడు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయుడే తన హృదయస్థానంలో నిలుపుకున్నాడు. అటువంటి త్రైలోక్య సామ్రాజ్యలక్ష్మిని దైత్యులు తమ పాదాక్రాంతను చేసి అవమానిస్తే హరి ఊరుకుంటాడా? నృసింహావతారం ఎత్తాడు. రాక్షస సంహారం చేశాడు!
రత్నగర్భా అంటే భూమి. పర్వత, వనాదులతో కూడిన భూమి, రత్నగర్భం అంటే సముద్రం, నదీనదాలు, సరస్సులు కూడా రత్నగర్భాలే! సమస్త సృష్టి స్వరూపిణి అయిన శ్రీ లక్ష్మీదేవి యొక్క హృదయ పద్మాన్ని వికసింపచేసే కిరణాలను ప్రసరింపజేసే భాను బింబం శ్రీ లక్ష్మీ నారసింహుడు! శత్రు సంహార సమయంలో మెరుపు వలె వేగంగా కదిలే లక్షణం (కంపా) ఆయనకుంది. అట్లాగే శ్రతువు ఎంత బలవంతుడైనా చలించకుండా స్థిరంగా నిలబడే (అకంపా) లక్షణం కూడా ఆయనదే! కాని భక్తుల్ని చూస్తే ద్రవించి కరిగిపోయే కరుణాపూరిత హృదయం (అనుకంపా) ఆయన స్వంతమే1 అటువంటి కరుణా, దయా అనే అమృతరసాన్ని కురిపించడంవల్ల పరిపూర్ణమైన ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ పొందిన ప్రహ్లాదుడనే శిశువు కలవాడు శ్రీ లక్ష్మీ నరసింహమూర్తి!

చైతన్యవంతమైన (శుంభత్) పరాక్రమంతో శత్రువులపై విజృంభించిన గంభీరమైన ఆకారం ఆయనది! ఆ శరీర కాంతి వర్షాకాల మందలి నల్లని దట్టమైన మబ్బుల గుంపు (ప్రావృడం భోద కాండం)వలె ఉన్నదట! శత్రు సంహార సమయంలో తన పటుతర భుజబలవేగాన్ని (పటు భుజారంహ) చూపించిన యాదగిరిపై నెలకొన్న లక్ష్మీనృసింహ స్వామిని నమస్కరిస్తున్నాను అంటాడు కవి. ఈ చివరి పాదంలో “కొండ” అనే అర్థంలో “క్షమాభృత్” శబ్దాన్ని కవి వాడడంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఎంత క్షమామూర్తియో కూడా ధ్వనింపజేయడం కవి హృదయం! చక్కని అర్థవంతమైన పదాలతో సుందర సమాసాలను సృష్టించి కవి కవితానిర్మాణ దక్షత అనన్య సామాన్యమైనది! అటువంటి సత్కవిని కన్న తెలంగాణ నిజంగా కోట రత్నాల వీణ!

(సశేషం)

-శ్రీ పెరంబుదూరు రాఘ‌వాచార్యులు
(వ్యాఖ్యానం : బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం)

You may also like

Leave a Comment