లలిత కళలుగా ప్రత్యేకంగా చెప్పబడేవి సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రం, కవిత్వం. ఈ ఐదింటిలో ఒకటైన చిత్రలేఖనం మనం లేచింది మొదలు నిద్రపోయే దాకా ప్రతి దాంట్లో దాని ఉనికిని చాటుకుంటూనే ఉంటదీ, ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండ్లల్లో.
చిత్రకళ లేదా చిత్రలేఖనం అనగానే అది పుట్టుకతోనే అబ్బాల్సిన ప్రతిభ, కొందరికి మాత్రమే అది వస్తుందీ అన్నదీ మనందరి అభిప్రాయం. అయితే అది కొంతవరకే నిజం. ఎందుకంటే ప్రతీ వ్యక్తీ పుట్టుకతోనే కొంత చిత్రకారుడు. భావాలకు, ఊహలకు రూపం ఇవ్వడం అలాగే ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడం చిత్రలేఖనం లేదా చిత్రకళ. మరి ఇది ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత చేస్తూనే వుంటారు. కొన్నిసార్లు మాటలతో వివరించడం వీలుకానపుడు గీసి చూపిస్తుంటాము. ఎప్పుడో రాతి యుగంలో గుహలలో నివసించే రోజుల్లోనే భాషా లిపి లేని నాడే ఆనాటి మానవుడు తన గుహల్లో జంతు, పక్షుల ఆకారాలు, బొమ్మలు, చిత్రాలు, గీసికున్నాడన్నది చరిత్రలో, తవ్వకాలలో బయటపడ్డ నిజం. అంటే భాషకు మునుపే చిత్రలేఖనం ఉందనేగా…
అనాదిగా చిత్ర కళలో పురుషులతో పాటు స్త్రీలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిత్రిస్తున్నారు. పూర్వ కాలం నుంచీ కూడా స్త్రీలు తమకుతెలియకుండానే చిత్రలేఖనం తమ దైనందిన జీవితంలో, తమ దినచర్యలో భాగంగా కలిగి ఉన్నారు. పూర్వపు రోజులలో ఇంట్లో వుండే పోయ్యిని అలికి, దానికి అందమైన ముగ్గును పెట్టీ మంటను అంటించే వారు.
ఇల్లు అలికి ఇడుపులు అలికీ నానబెట్టుకున్న బియ్యం రుబ్బుకుని పిండిని బట్టలో కట్టి ముగ్గులు గీసేవారు. ఇక ధాన్యాలు నిలువచేసే గుమ్ములకు పెండతో అలికి ముగ్గులు కొట్టేవారు బొమ్మలు గీసేవారూ. కొత్త ఇళ్ళకు పూతలు పూస్తే లేదా సున్నాలేస్తే ఇంటి ఇడుపులకు బొమ్మలు వేసేవారూ, కడపల మీదా బొమ్మలు వేసేవారూ. ఇది ఇప్పటికీ ఉందీ. వాకిట్లో సానిపి చల్లి ముగ్గు వెయ్యకుండా దినచర్యనే మొదలవదు ఈ నాటికీ కూడా. ఆ రోజుల్లో అందరి ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతుకు, వ్యవసాయ దారునికి ఏరువాక పున్నమి పెద్ద పండుగ. ఏరువాక పున్నమి వచ్చిందంటే ఎద్దుల ప్రదర్శన ఉండేది. వాటి శరీరం పై రకరకాల బొమ్మలు వేసీ వాటిని అలంకరించి ప్రదర్శించే వారు. ఇక పెళ్ళీలలో చిత్రలేఖనం లేకుండా పెళ్ళి తంతు అసంపూర్ణం. పందిరి నాడు గుంజల చుట్టూ చిత్రలేఖనం. ఇక పెళ్ళి పందిట్లో మైలపోలప్పుడు( పెండ్లిపిల్ల లేదా పెండ్లిపిల్లగాడికి నలుగు పెట్టే టప్పుడు), తాళి కట్టే తంతు అప్పుడు వేసే శాశ ముగ్గు (పెళ్ళి పీటల కింద మొదటగా గొంగడి లేదా జంపకన వేసీ దానిమీద బియ్యంతో వేసే ముగ్గు) గీయనిదే పెళ్ళి పీటలు వెయ్యరు. అలాగే పూజలూ, శుభకార్యాల్లో ముగ్గు వెయ్యకుండా ఏదీ ఆరంభం చెయ్యరు. వెనకటి రోజుల నుంచీ కూడా ఆడవారికీ మైదాకుకూ (గోరింటాకు) విడదీయరాని బంధం ఉంది..
ఈ రోజుల్లో చేతులపై, పాదాలపై, ఇంకా చెప్పాలంటే ఒంటిపై మెహందీ చిత్రాలుగా కూడా వేసున్నారు. వస్త్రాలపై వేసుకునే లతలు, పూలు, ఆకారాలు, డిజైన్ ల ప్రింట్లు చిత్రకళనే..
పూర్వకాలంలో దూతల ద్వారా, పక్షుల ద్వారా పంపే లేఖలు లేదా గుప్త లేఖలలో సందేశం చిత్రాలు గీసి గుర్తులుగా, చిహ్నాలుగా పంపేవారు. అంటే సందేశాన్ని చిత్రాలుగా లిఖించి పంపే వారు. అందుకేనేమో చిత్రలేఖనం అంటారు. ఆ చిత్రలేఖనమే లేదా చిత్రలిపినే నేటి లిపికి దారి తీసింది. అంటే ప్రపంచంలో అన్ని లిపులకూ చిత్రకళనే ఆద్యమన్నమాట. భాష చిత్రాలకు దారితీస్తే, చిత్రాలు లిపికి, లిపి సాహిత్యానికీ, సాహిత్యం ద్వారా తిరిగి చిత్రాలు జీవం పోసుకున్నాయి. దీనిద్వారా చిత్ర కళకూ సాహిత్యానికీ సంబంధం వేరుపరచ రానిది అని చెప్పొచ్చు. సాహిత్యంలో ఊహించిన, వర్ణించిన, ప్రాంతాలూ, వ్యక్తులనూ కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది చిత్రలేఖనం. పండితులను మాత్రమే ప్రభావితం చేసేది సాహిత్యం అయితే, పండిత పామరులను ప్రభావితం చేస్తుంది చిత్రలేఖనం. సాహిత్యానికి చిత్రలేఖనం ఎంత ఊతమిస్తుందో, చిత్రలేఖనం మీదా సాహిత్యం వస్తోంది.
అలాగే ఆధ్యాత్మికత విషయంలో చిత్రలేఖనం పాత్ర చాలా ఉన్నది. హిందువులు దేవతా రూపాలను ఆరాధిస్తారు, వారు తమ ఇష్ట దైవ రూపాన్ని తమ కళ్లముందు ఉంచుకుని పూజిస్తారు. ఆ దేవతా మూర్తుల చిత్రపటాలన్నీ చిత్రలేఖనాలే కదా… భారత దేశంలో దేవతా మూర్తుల రూపాలను జనాలకి పరిచయం చేసిన ఘనత రాజా రవివర్మకు దక్కుతుంది. ఆయన పురాణాల లోని గాథల ఆధారంగా దేవతా రూపాలను జీవకళ ఉట్టిపడేలా చిత్రించి, అవి అందరికి అందుబాటులో ఉండేలా చేశారు.
ఒకవేళ రవివర్మ అనే చిత్రకారుడే లేకపోయి ఉంటే ఈ రోజు హిందువుల ఇళ్ళల్లో పూజా మందిరాలు, భగవంతుని రూపాలు ఇలా ఉండేవి కావేమో వేరే విధంగా ఉండేవేమో… ఇక్కడ ఆధ్యాత్మికత గురించి మాట్లాడే టప్పుడు ప్రాచీన కాలం నుంచీ కూడా శిల్పకళ ముఖ్య పాత్ర వహిస్తుంది. హిందువుల దేవుళ్ళు శిలావిగ్రహల రూపాల్లో పూజలందుకునే వారు. అయితే శిల్పకళ కూడా చిత్రలేఖనం తోనే మొదలవుతుంది. శిల్పి స్వయంగా చిత్రకారుడై ఉండవలెను, చిత్రలేఖనం తెలిసి ఉండవలెను. చిత్రలేఖనం మొదట మైండ్ లో పూర్తి చిత్రం రూపుదిద్దుకున్నాకనే కన్వాస్ పై మొదలవుతుంది.
చిత్రలేఖనం అభిరుచి గానే కాకుండా ఉపాధిగా కూడా చాలా మందికి ఆధారమై ఉన్నది. డ్రెస్ డిజైనింగ్ ఈ రోజుల్లో చాలా పెద్ద ఉపాధి రంగం. ఓ కొత్త మోడల్ డ్రెస్ డిజైన్ చెయ్యాలంటే ఆ డిజైనర్ ముందుగ బొమ్మ గీసుకోవాల్సిందే.
వివిధ ఉత్పత్తుల అడ్వర్టజ్మెంట్ లో భాగంగా పల్లెల్లో , పట్టణాల్లో ఇంటి గోడలపై , ప్రహరీ గోడలపై బొమ్మలు గీసి ఉత్పత్తి దారులు, చిత్రకారులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం వివిధ రకాలైన సామాజిక అంశాల అవగాహన కోసం చిత్రలేఖనం చాలా మంచి సాధనగా ఉపయోగిస్తుంది. క్రైమ్ విభానికి ఎంతో ఉపయుక్తమైనది చిత్రలేఖనం. సాక్షులు చూసిన ఆనవాళ్లు, గుర్తులు, పోలికలు ఆధారంగా నేరస్తులను గుర్తించడం గానీ , ఇన్వెస్టిగేషన్ ముందుకూ సాగడానికి గానీ సహాయకారిగా ఉంటుంది. నిర్మాణ రంగంలో ముందుగా గీసుకోకుండా ఏ నిర్మాణం నిర్మించబడదు. కొత్త ఇంటిని నిర్మించాలంటే ఇంటి నక్ష గీసుకోవాల్సిందే. ఇంటినిర్మాణంలో నగిషీలు చెక్కేవారు చిత్రలేఖనంతోనే మొదలు పెడతారు. ఇక ఆదునిక కాలంలో నిత్య జీవితంలో వాడే ప్రతీ వస్తువూ దాని డిజైన్ గీసిన తర్వాతనే తాయారు చెయ్యబడుతుంది. అవసరాలు అనుకూలంగా, ఊహలకు అనుగుణంగా మొదట చిత్రం గియ్యబడి. ఆ తర్వాత వివిధ రకాలైన మెటీరియల్స్ తో తయారు చెయ్యబడుతుంది.. ఒక రకంగా చెప్పాలంటే నిత్యావసరాల చాలా వస్తువులు పరికరాలు, సౌకర్యాలు చిత్రకారుని ఊహా శక్తి నుంచి రూపు దిద్దుకున్నవే… ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యురోపినన్ చిత్రకారుడు మోనాలిసా సృష్టి కర్త లియోనార్డో డావిన్సీ వేసిన చిత్రాలు, ఆయన చిత్తుగా వేసుకున్న రేఖా చిత్రాలు చూసినపుడు అందులో గ్లైడర్, సైకిల్ లాంటి చిత్రాలు, యంత్రాల నిర్మాణాల రేఖా చిత్రాలు కనబడతాయి… ఆయన బహుశా ఆ నాడే గాలిలో ఎగిరే ఒక యంత్రాన్ని ఊహించి రూప కల్పన చేసి గీసి ఉంటాడు. దీనిని బట్టీ చిత్రకారుడు కేవలము ఊహా లోకంలోనే కాదూ శాస్త్రీయ దృక్పథం, తార్కికత కూడా కలిగి ఉంటారనీ అర్థం అవుతుందీ… చిత్రకారులు దార్శనికులు.
బోధనా రంగంలో తరగతి గదిలో ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే బొమ్మలతో, మ్యాపింగ్ తో చెబితే సులభంగా అర్థం అవుతుంది, ఎప్పటికీ లేదా ఎక్కువరోజులు గుర్తుంటుంది. ఈ రోజు సాహిత్య విద్యా రంగాలలో కోసం సేవలందించిన ఎంతో మంది చిత్రకారుల సేవలు గుర్తు చేసుకోదగినవి. ఉదాహరణగా చెప్పాలంటే ఆధునిక కాలంలో తొలితరం తెలంగాణా చిత్రకారులలో ఒకరైన కొండపల్లి శేషగిరిరావు గారు అందించిన పోతన ఊహా చిత్రం సాహిత్యానికే కాదూ పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఇన్ని మాట్లాడి చిత్రలేఖనంలో తప్పకుండా ప్రవేశం కలిగి ఉండే చిన్నారుల గురించి మాట్లాడక పోతే అది వెలితిగా ఉంటుంది. పిల్లలకు అత్యంత ఇష్టమైన, అత్యంత ఉల్లాసాన్ని కలిగించే అంశం చిత్రలేఖనం. ప్రతి వ్యక్తీ బాల్యంలో చిత్రలేఖనాన్ని టచ్ చేసే వస్తాడు. పిల్లలకు భాష ప్రాబ్లం ఉంటుంది, రాయడానికి పదాల కొరత ఎంపిక ప్రాబ్లం ఉంటుంది కాబట్టీ వాళ్ళు తమ భావాన్ని వ్యక్తం చెయ్యడానికి, సృజనను వ్యక్తపరచడానికి చిత్రలేఖనాన్నే ఆశ్రయిస్తారు. మనందరమూ బొమ్మలు గియ్యకుండా బాల్యాన్ని పూర్తి చెయ్యలేదు అన్నది అతిశయోక్తి కాదు.
ఇలా మనిషి జీవితంలో నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ ప్రతీ అంశంలో చిత్రకళ దాగి ఉంది. అలాగే మనిషి పుట్టింది మొదలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవసరంగా చిత్రకళతో సంబంధం కలిగి ఉంటాడు. చిన్నప్పుడు ఆటగా మొదలైన చిత్రకళ పెరుగుతూ పోయేకొలది అభిరుచి గానూ, అవగాహనకు గానూ , అవసరం కోసం జీవనయానంలో మనతో పాటే ఉంటుంది.
-రూపాదేవి
PhD scholar (OU),
S.A (హిందీ),
చిత్రకారిణి,
ఉమ్మడి పాలమూరు జిల్లా
+91-7330814596