మల్లీశ్వరి సినీమా పాట – మనసున మల్లెల మాలలూగెనే…
దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రిగారి వాణికి, సాలూరి రాజేశ్వరరావు గారు బాణీ సమకూర్చిన ఈ గీతం భానుమతిగారి గళంలో వినసొంపుగా ఉంటుంది.
మల్లీశ్వరి చిత్రం 70 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా, ఆ సినిమా పాటలు ఇప్పటికి తెలుగువాళ్ళ హృదయాల్లో తాజాగా కదలాడుతున్నాయి. అందులో
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలాలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్న నాళ్లకి బ్రతుకు పండెనో
నిజానికి నిరీక్షణ ఎంత మధురమైనదో, అంత బాధాకరమైనది కూడా! అంటే నిరీక్షణ ఒక మధురమైన బాధ. నిరీక్షణ నిజంగా ఫలిస్తే మాత్రం ప్రేమికులకు పెద్ద పండుగ.
కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
ప్రకృతిలోని ప్రతిశబ్దం కూడా తన ప్రేమమూర్తి ప్రతి ధ్వనిలాగే వినిపిస్తుంది. తన ప్రేమమూర్తి కొరకు ఎదురు చూడడమంటే తన జీవితం కొరకు, తన ప్రాణం కొరకు ఎదురు చూడడం. ఒకవేళ ఆ ప్రేమమూర్తి రావడానికి ఆలస్యమే కాదు, ఎడబాటు ఏర్పడితే, కళ్లు కన్నీటిమయమే. నిజంగానే అతడొచ్చి ఎదురుగా నిలబడితే, కన్నీటి పొర కమ్మేసిన కళ్ళతో అతనిని గుర్తించడం కష్టమే.
గడియయేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
తన అదృష్టం కొద్ది తన నిరీక్షణ ఫలించి తన ప్రేమమూర్తి తన దగ్గర వాలిపోతే ఈ లోకమంతా తన సొంతమైనట్లుగా ఆనందం, చెంతకు చేరిన ప్రేమమూర్తి ఎప్పటికీ తన దగ్గరే వుంటారనే గ్యారంటీ లేదు. ఏదో కారణంతో వారిద్దరు విడిపోయి, చాలాకాలం దూరదూరాలకు విసిరివేయబడితే ఆ ప్రేమ హృదయాలు మళ్ళీ చేరువ కావడానికి ఎంత పోరాటం చేయాలో?
1951లో విడుదలైన మల్లీశ్వరి ‘‘వాహినీ’’ వారి చిత్రం. బి.ఎన్.రెడ్డి నిర్మాత, దర్శకుడు. ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా, రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినప్పటికి, కమ్యూనిష్టు దేశమైన చైనాలోను 100 రోజులకు పైగా నడిచింది.నాగరాజు (ఎన్టిఆర్), మల్లీశ్వరి (భానుమతి) ఇద్దరు బావా మరదళ్లు, వేళా కోళానికి మల్లీశ్వరిని రాయలవారి రాణివాసానికి (మహారాణి తిరుమలుదేవికి ఇష్టసఖిగా) పంపిస్తే బాగుంటుందని నాగరాజు అంటే, రాయలవారు (శ్రీవత్స) తన సైన్యాన్ని పంపించి, మల్లీశ్వరికి తన రాణివాసములో చోటు కల్పిస్తాడు. చిన్న నాటి నుండి అనుబంధాలను పెంచుకున్న బావామరదళ్లు విడిపోయి, బ్రతకజాలకపోతారు. ఆ సమయంలోనే నాగరాజు విజయనగరంలో శిల్పాులు చెక్కుతుంటాడు. తోటలోని దేవాలయం వద్ద నాగరాజు, మల్లీశ్వరి ఇద్దరు రహస్యంగా కలిసికొన్న సందర్భంలో పాడిన యీ పాటను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు వ్రాయగా, సాలూరి రాజేశ్వరరావుగారు బాణీ కూర్చారు.
దేవులపల్లి కృష్ణశాస్ర్తిగారు సహజంగా భావ కవి. సరళ లాలిత్య పదాలతో ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించేవారు. ఆంధ్రాషెల్లీగా ప్రసిద్ధులు. ఆయన సాహిత్యం “ఇక్షురసార్ణవం” వంటిదని శ్రీశ్రీ ప్రశంసించారు.ఈ పాటలో నాయిక తన భావోద్వేగాన్ని, హృదయ స్పందనను అందరికి అర్థమయ్యే విధమైన సరళ పదాలతో పాడుతూ, నటిస్తూ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంది. 70 సంవత్సరాలైనప్పటికి ఈ పాట ప్రజలలో పాతుకుపోవడానికి కారణం కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే కారణం.
-ఏలూరు అశోక్ కుమార్ రావు
ప్లాట్ నెం. 203, ద్వారకా గ్రాండ్ రెసిడెన్సీ,
రోడ్ నెం. 8, యాదవ్ నగర్,
అలకాపురి, హైదరాబాద్ – 500102
+91-9440575028
1 comment
ఆనాటి పాత పాటల ఆపాత మధురమనిపించే ఆ గీతాల నేపథ్యం వివరించిన ఏలూరు అశోక్ కుమార్ గారి హృయయం పాటలాగే ఆర్ద్రం . ఇలాంటి నాటి వైభవ సాహిత్యాల
వ్యాసాలనకు వేదికైన మయుఖ ప్రోత్సాహం మహా ద్వారం
అభిమానంగా
– కందాళై రాఘవాచార్య