Home ఇంద్రధనుస్సు మన యాదాద్రి- 2 & 3

శ్రీ పెరంబుదూరు రాఘవాచార్యులు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్తలయిన డా|| ఎస్. లక్ష్మణ మూర్తి

డా|| శ్రీ రంగాచార్య సోదరులయొక్క తండ్రిగారు.

 

అభ్రాజ భ్రాజ దవ్యాజ నిరుపమ దయాసార ధారానుసారం

కోపాటోప ప్రదీప్త ప్రకటతర గరుద్వంద్వ భూమ ప్రతాపం

వ్యాక్షిప్త స్వర్గగంత ప్రథిత గుణగణారంభ వీటీమ్యవాహం

వందే యాదక్షమాభృత్కటక పటుభుజారంహ లక్ష్మీనృసింహం (2వ శ్లోకం)

తాత్పర్యం: ప్రకాశములేని వాటిని కూడ ప్రకాశింపజేసే, కపటములేని – కారణము నెంచని, దేనితోను ఉపమింపబడని – నిరుపమానమైన తన దయాసారము యొక్క అనుసరణమైనవాడు; కోపం వల్ల కలిగిన ప్రజ్వరిల్లుతున్న – అందరికీ తేటతెల్లనైన, గరుత్మంతునిపై వెలుగొందుతున్న గొప్ప ప్రతాపం కలిగినవాడు; స్వర్గము, దిగంతాలలో విస్తరించబడిన శ్రేష్ఠమైన గుణసమూహములచేత ఉత్తమము, రమ్యము అయినవాడు, గరుత్మంతుని వాహనముగా కలిగిన యాదాద్రిపైన తన పటుతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీనృసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: లోకంలో ఒక ఆర్యోక్తి ఉంది. “వస్తేణ వపుషా వాచా, విద్యయా వినయేన చ, వకారైః పంచభిరీనః, వాసవో పి న పూజ్యతే”. లోకంలో ఐదు వకారాలకు (వకారంతో మొదలయ్యే పదాలకు) అత్యంత గౌరవ స్థానం ఉంది. అవి – వస్త్రం, అందమైన చక్కని శరీరం, వాక్కు చదువు, వినయము – ఈ వకారంతో మొదలయ్యే వాటికే జనాలు విలువనిస్తారు, గౌరవిస్తారు. అంటే వస్త్రము మొదలైన ఈ ఐదు ఆడంబరాలు ఎవరికైతే ఉంటాయో వారికే లోకంలో గౌరవం! పూజింపబడతారు లేకపోతే ఇంద్రుడంతవాడికి కూడ గౌరవం లభించదు. కంలో ధర్మపరులు, నీతి-నిజాయితీ కలిగిన వాళ్ళు. న్యాయవర్తన కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళను ఆడంబరాలకు గౌరవాన్నిచ్చే ఈ లోకం గౌరవించదు. వాళ్ళు లోకం దృష్టిలో ప్రకాశహీనులే! ఆ విధంగా లోకంలో ప్రకాశించలేని తన భక్తుల్ని ప్రకాశించేవాడు (అబ్రాజభ్రాజత్) పరమాత్మ! ఏ విధంగా అంటే – తన స్వభావసిద్ధమైన, ఎటువంటి కారణములను అడగని తన యథార్థమైన కపటములేని దయాసారంతో! ఆ దయ కూడ ఎటువంటిది? నిరుపమానమైనది. ఆ దయకు ఉపమానంగా చెప్పగలిగినది ఈ సృష్టిలోనే లేదు! అటువంటి శ్రేష్ఠమైన (సార) దయను అఖండమైన, ఎడతెగని ధారగా కురిపించే పరమాత్మ (దయాసార ధారానుసారం) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ‘అనుసారం’ స్వారస్యాన్ని కొంచెం చెప్పుకోవాలి. అనుసారం అంటే అనుసరించేవాడని అర్థం. దేవుడు ఎవరిని అనుసరిస్తాడు? తన ‘దయాసారాన్ని కురిపిస్తూ! అంటే పరమాత్మ భక్తుల్ని ముందు తన దయాసారంతో అనుగ్రహిస్తాడు. భక్తుల పై తన దయను పంపిస్తాడు. దాని వెంట తాను అనుసరించి భక్తులకు దర్శనమిస్తాడు! అందుకే కవి లక్ష్మీనరసింహస్వామి వారిని “అవ్యాజ నిరుపమ దయాసారానుసారం” అంటూ అభివర్ణించారు.

నరసింహస్వామి దుష్ట సంహారం కోసం అవతరించినవాడు. భక్త పరిపాలన ఆయన నిత్యకృత్యం! రాక్షసుల్ని సంహరించే సందర్భంలో నరసింహుడు తన కోపాన్నీ, వేగిరపాటును (ఆటోపాన్నీ) ప్రదర్శిస్తాడు. అప్పుడు ఆయన కోపం ప్రజ్వరిల్లిపోతూ ప్రకటితమవుతుంది. అతి భయంకరమైన వేగమూ, పరాక్రమమూ కలిగిన గరుత్మంతునిపై వెలుగొందుతూ తన గొర్పు ప్రతాపాన్ని ప్రదర్శించి రాక్షస సంహారం చేస్తాడు. స్వర్గాది దివ్యలోకాలలోను, దిగంతాలలోను ఆయన శ్రేష్ఠమైన గుణగణాలు వ్యాపించాయి. అటువంటి గుణగణారంభము చేత శ్రేష్ఠుడైనవాడు! ఇంకా రమ్యమైన ఆకారం కలవాడు!! అటువంటి లక్ష్మీనరసింహస్వామి వేగ పరాక్రమాలు కల గరుత్మంతుని తన వాహనంగా చేసుకున్నాడు. యాదగిరిపై తన పటుతర భుజబలంతో ప్రకాశించే శ్రీలక్ష్మీనరసింహస్వామినీ నమస్కరిస్తున్నాను అంటాడు కవిశేఖరుడు!

: స్వస్తి :

కౌటల్యాట వ్యట త్కాంచన తను నయనభ్రాంతికృచ్ఛంబరఘ్నం

లాంగల్యబ్లాంకుశేంద్రాయుధ ఝష శుభరేఖోజ్జ్వలత్పన్నవాబ్దం

ఆపన్నా పన్నగేంద్రం శుచి నియమ గుణార్యాభివంద్యాభిధేయం

వందే యాదక్షమాభృత్కటక పటు భుజారంహ లక్ష్మీనృసింహమ్

తాత్పర్యం: కుటిలత్వము, వంచన అనే అడవిలో తిరిగే, మనోహరమైన ఆకారాలతో చూచేవారి కళ్ళకు భ్రమను కలిగించే మాయను నశింపజేసేవాడు; నాగలి, పద్మము, అంకుశము, వజ్రము అనే ఇంద్రుని ఆయుధం, చేప (మత్స్యం) అనే శుభప్రదమైన రేఖలు కలిగి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న తామరతో పోల్చదగిన పాదము కలవాడు; తనను భక్తితో ఆశ్రయించిన వారి ఆపదలనే పర్వతాలకు ఇంద్రుని వంటివాడు; పరిశుద్ధమూ-పవిత్రమూ అయిన నియమము మొదలైన సద్గుణములచే ఉత్తములచే అభివందనములందుకునే చెప్పుకోదగిన రూపము కలవాడు అయిన – యాదగిరిపై నెలకొన్న – తన దృఢతరమైన భుజబలాన్నీ, వేగాన్ని చూపుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామిని నమస్కరిస్తున్నాను.

విశేషాలు: కౌటిల్యము అనేది ఒక దట్టమైన అడవి. ఈ సంసారం కూడా దాటలేని ఒక మహారణ్యమే! సంసార మహారణ్యంలో మనిషిని ఎన్నో వ్యామోహాలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి లొంగి మనిషి కష్టాల పాలౌతూ ఉన్నాడు. దీన్నే కౌటిల్యము (కుటిలత్వము, కపటము మొదలైన దుర్గుణములు) కల మహారణ్యమని, అందులో (అటత్) తిరుగుతూన్న (కాంచనతను) వ్యామోహాన్ని కలిగించే రకరకాల విశేషాలు మానవుని కళ్ళకు ఆకర్షణీయాలుగా కనిపించి భ్రమను (నయన భ్రాంతి కృత్) కలుగజేస్తూ ఉంటాయి – రామాయణంలో కాంచన మృగ రూపంలో మారీచుడు సీత కళ్ళకు భ్రమను కలుగజేసినట్లు! శంబరము అంటే ఒకజాతి లేడి అన్న అర్థమూ ఉంది, మాయ అన్న అర్థంతోపాటు. ‘శాంబరీవిద్య’, ‘శాంబరీ ‘మాయ’ అన్న వ్యవహారాలు ప్రసిద్ధాలే కదా! శంబరుడు అటువంటి మాయను ప్రయోగించడంలో నిపుణుడు. అటువంటి శంబరుణ్ణి (శంబరాసురుణ్ణి) మన్మథుడు సంహరించాడు. మరి ఈ సంసారమనే అరణ్యంలో వ్యామోహమనే లేడి శాంబరీ మాయవలె మానవుల్ని వ్యామోహంలో ముంచి వేస్తూ కష్టాల పాలు చేస్తున్నది. అటువంటి శాంబరీ మాయను నశింపజేసి (శంబరఘ్నం) తన భక్తులకు కలిగిన నయన భ్రాంతిని పోగొట్టి ముక్తిని ప్రసాదించేవాడు నరసింహస్వామి!

హస్తరేఖాశాస్త్రం ప్రత్యేక బహుళ ప్రచారం పొందింది. చేతిలో ఉన్న రేఖలను ఆ శాస్త్రాధారంగా గుర్తించి వ్యక్తి భవిష్యత్తును చెప్తుంటారు. చేతిలో ఉన్నట్లుగానే పాదాలలో కూడా రేఖల ద్వారా కొన్ని గుర్తులు (రూపాలు) ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి వారి ఉజ్జ్వలమైన జీవితం ముందుగానే తెలుస్తుందంటారు విజ్ఞులు! శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాలలో లాంగల రేఖ దీన్నే హల రేఖ అంటారు. నాగలి ఆకారంలో ఉంటుంది. పద్మరేఖ, అంకుశరేఖ, వజ్రరేఖ, ఝష (మత్స్య) రేఖలు ఉన్నాయి. స్వామివారి పాదాలు, శ్రీలక్ష్మీ నరసింహస్వామివారు, ఎక్కడ నెలకొని ఉంటే అక్కడ హలరేఖ చేత అన్న సమృద్ధి ఉంటుంది. పద్మరేఖ సంపదభివృద్ధిని ఇస్తుంది. అంకుశ రేఖ దుష్టుల్ని, దుర్గుణాల్ని అదుపు జేస్తుంది. వజ్రరేఖ శత్రు సంహార కారకం! మత్స్య రేఖ సర్వసమృద్ధిని చేకూరుస్తుంది. స్వామివారు స్థితి కారకులు! లోక రక్షణ దీక్షగా కలిగినవారు! అటువంటి శుభరేఖల చేత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్న నూతనాబ్దములవంటి పాదాలు కలవారు స్వామివారు! (శుభలేఖోజ్జ్వలత్ +పత్+నవాబ్దం). స్వామివారు తమ భక్తులకు సర్వసమర్ధినీ కలిగిస్తారని భావం! ఆపదలు కలిగినవాళ్ళు ఆపన్నులు. స్వామివారు తమ భక్తుల మానసిక సైర్యాన్ని పరీక్షించడం కోసం వారికి తరచూ ఆపదలను కలిగిస్తూ ఉంటారు. ఎన్ని ఆపదలు ఎదురైనా భక్తులు స్వామి వారిని విడువకుండా సేవిస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు కలిగిన ఆపదలనే పర్వతాల్ని ఖండించే ఇంద్రుడే శ్రీలక్ష్మీ నరసింహస్వామి! (ఆపన్న+ఆపద్(త్)+నగ+ఇంద్రం). పరిశుద్ధతను, పవిత్రతను కలిగించే నియమాది సద్గుణాల చేత ఉత్తములైన వారిచేత నమస్కరింపబడే నామధేయం కలిగినటువంటివారు (శుచి+నియమ+గుణ + ఆర్యా +అభివంద్య + అభిధేయం) శ్రీస్వామివారు! యాదాద్రి పై నెలకొని (వెలసి) తన పటుతరమైన భుజ బల విక్రమం చేత ప్రకాశించే శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని నమస్కరిస్తున్నాను.

 

You may also like

Leave a Comment