వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు
——————
నా అరవై రెండేళ్ల జీవనయానంలో వేములవాడది ఒక ప్రధాన భూమిక. అనేక అనుభవాలకు,ఆనందాలకు,కొన్ని అవమానాలకు వేదికయిన ఆ వూరు మా అమ్మను కన్న వూరు,అమ్మమ్మ వూరు,తాతయ్య జోరు, గొప్ప జాతర హోరు.
వేములవాడ లో నేను అమ్మ గారింటి తోనే ఐడెంటి ఫై అయినప్పటికీ మా వారాల వంశం మూలాలు వేములవాడలోనే వున్నాయి.తరతరాలుగా మిఠాయిలోల్లం. అది తర్వాత ఎప్పుడయినా రాస్తాను.
నేను పుట్టింది వేములవాడలోనే అయినా పెరిగింది చదివింది కరీంనగర్. సెలవులకు,పండగలకు,పబ్బాలకు,అమ్మ గారింటికి వచ్చేవాడిని. అమ్మమ్మ సత్తమ్మ, తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం,మామయ్యలూ, అత్తమ్మలూ, అందరిలో ఒక్కడినై కలగలిసి పోయి వేములవాడ వాడినే అయిపోయాను.
నా సుజనాత్మక జీవితంలో నటరాజ కళానికేతన్ ఒక ప్రధాన మూల మలుపు. ఆ మలుపు వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపించి జాతీయ అంతర్జాతీయ స్థాయి సినిమాల్ని ప్రదర్శించడం దాకా సాగింది.1983 దాకా నా ప్రధాన వేదిక భూమిక ఆ వూరే.
ఆ వేదిక గురించి విస్తృతంగా రాయాల్సివుంది. రాస్తాను ఎప్పటికయినా.
ఇప్పటికి గత అయిదు దశాబ్దాలుగా నన్ను వెంటాడుతున్న కొన్ని images గురించి రాస్తాను.
SOME Haunting images :
1 ) తిప్పాపురం బస్ స్టాండ్ :
చిన్నప్పటి నుండి దశాబ్ద కాలం వీక్షించిన దృశ్య మిది. జనంతో క్రిక్కిరిసి పోయి నిండు గర్భిణీ లా మెల్లిగా స్టాన్డ్ కు చేరుకున్న బస్సు చుట్టూ పొలోమంటూ పూజార్లూ వేద పండితులూ చేరి దేవుని దర్శనానికా అని పలకరిస్తూ పోటీలు పడి తలా ఒకటో రెండో కుటుంబాల్ని వెంట తీసుకెళ్లి. వారికి వసతి దర్శన తదితర బాధ్యతలు చూసే వారు. వేదపండితులు,విజ్ఞులు అయినా వారిని అలాంటి స్థితిలో చూడ్డం తీవ్రంగా కలత పెట్టేది.ఆ ఇమేజ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది.
2 ) ధర్మ గుండం
అప్పట్లో దేవాలయ ధర్మ గుండానికి చెరువుకి నడుమ కేవలం చిన్న రాతి కట్టడం ఉండేది, ఇంకా కట్టడాలేవీ లేవు. యాత్రికులు దేవునిమీది విశ్వాసం తో గుండం లోకి పైసలు వేసేవాళ్ళు. అప్పుడేన్నని ఒకటో,రెండో, ఐదో పైసల బిళ్ళలు వేసేవాళ్ళు వాటికోసం కొంతమంది నీళ్ళల్లోకి దూకి మునిగి వెతికి కరుచుకుని
మరీ తెచ్చు కునే వాళ్ళు. ఎన్ని సంపాదించే వాళ్ళో కానీ ఆ ఇమేజ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే వుంది.
3 ) మిఠాయి దుకాణాలు
గుడి ముందు కాలువ పక్కన కేశన్నగారి ఇంటి వరుసలో పొందికగా వున్న మిఠాయి,గాజుల దుకాణాలు నాకిప్పటికీ గొప్పగా అనిపిస్తాయి. రంగు రంగుల చిలుకలు బత్తీసలు బెండ్లు శక్కరి పుట్నాలు, అందంగా పేర్చిన పేడాలు ఎంత కళాత్మకంగా ఉండేవో. గొప్ప దృశ్యాలవి పిల్లలు మేడలో చిలుకల పేర్లు వేసుకోవడం ఎంత అందంగా ఉండేదో.
4 ) బిచ్చ గాళ్ళు
జాతరలు ఆలయాల ముందు వీళ్ళు సాధారణం. కానీ వేములవాడ వీధుల్లో ముళ్ల కంపల పై పడుకుని కొందరు, ఇంకొందరయితే భూమిలో గోతి తవ్వి అందులో తల పెట్టి మట్టి తో కప్పుకుని పక్కనే ఒక ప్లేటు పెట్టుకుని గంటల తరబడి అట్లా వుండే వాళ్ళు. వాళ్లకు శ్వాస ఎట్లా ఆడేదో ఇప్పటికీ అర్టంకానీ విషయమే.ఆ దృశ్యాలు నన్ను వెంటాడు తూనే వున్నాయి. అప్పుడు కెమెరాల్లేవు ఇమేజెస్ మనసులోనే ఉండి పోయాయి
5 ) తూము
చెరువు కింది తూములోంచి నీళ్లు వదిలి నప్పుడు ఉప్పొంగి కాలువలోకి వచ్చే నీటి దృశ్యం పట్నం లో పెరిగే నాకు అబ్బురంగా కనిపించిన ఇమేజ్ .
6 ) పోచమ్మ
పోచమ్మ బోనాలు వాటికి ముందు మోగే దప్పుల చప్పుడు శివాలూగే భక్తులు ఓహ్ చూడాల్సిందే.మరీ చిన్నప్పుడు భయమేది కానీ ఆ ఇమేజ్ మామూలుది కాదు
7 ) జైన శిల్పాలు
ప్రధాన దేవాలయం నుండి తరలించిన వందలాది శిల్పాల్ని అనాధలుగా భీమన్న గుడి పక్క తోటలో పడేసిన దృశ్యం వెరీ మచ్ హాంటింగ్. కొంచెమయినా చారిత్రిక దృష్టి లేని తనం దుఃఖం కలిగిస్తుంది.వేదనగా ఉంటుంది.
8 ) తాతయ్య దవాఖానా
సుబ్రహ్మణ్యం తాత దవాఖానా రోజంతా పేషంట్ల తో క్రిక్కిరిసి ఉండేది. కషాయం దగ్గు పొట్లాలతో బిజీగా ఉండి సేవ చేసేది. సాయంత్రమయితే చాలు దవాఖానా ముందు ఊడ్చి శుభ్రం చేసి చాపలు వేసేవాళ్ళు. ఆప్పుడు తాతయ్య, ఠాకూర్ సాబ్, సాంబయ్య సారూ ఇంకా అనేక మంది పెద్దలు ఒక్కోసారి ఎం.ఎల్లే రాజేశ్వర్ రావూ కూర్చుని దేశం గురించి రాజకీయాల గురించీ చర్చించే వాళ్ళు. ఆ దృశ్యం ఎంత గొప్పగా ఉండేదో
9 ) దవాఖాన్ల అమ్మమ్మ రాజేశ్వరి అమ్మమ్మ
నా చిన్నప్పటి నుండి మనసులో అట్లా నిలిచి పోయిన స్త్రీ రూపం దావాఖాన్ల అమ్మమ్మ. ఒకింత నిండుగా ముక్కు పుడక, చెవులకు గంఠీలు సహా ఒంటినిండా ఆభరణాలతో కళకళ లాడేది.నోట్లో పాన్ ఎంత అందంగా ఉండేదో. దసరాకు జాతరాకో మా పిల్లలందరికీ ఒక్కో రూపాయి ఇచ్చేది. తను నాకయితే గొప్ప గ్రామ దేవతలా అనిపించేది. చాలా గొప్ప స్త్రీ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.
ఇట్లా నన్ను హాంట్ చేసిన ఇమేజెస్ ని కొన్నింటిని నా ‘శివ పార్వతులు’ డాక్యుమెంటరీ లో పొందు పరిచాను.
ఆ ఫిలిం Slovenia ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు గెలుచుకుంది.ఇంకా భూటాన్, మెక్సికో లాంటి చోట డాక్యుమెంటరీ ఫెస్టివల్స్ లో పాల్గొంది. ఆ వివరాలు మరో సారి.
ఇవన్నీ నన్ను వెంటాడిన ఇమేజెస్ మాత్రమే. నా ఫిలిం చూడాలనిపిస్తే చెప్పండి లింక్ ఇస్తాను.
వేములవాడ=కొన్ని వెంటాడే దృశ్యాలు= 2
ఆయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆట విడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు మందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మావూరు కరీంనగర్. తాతయ్య డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ సత్యమ్మ. ఎక్కడో మహాబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి వేములవాడ వచ్చి అక్కడి దేవస్థానంలో మొట్టమొదటి వైద్యాదికారిగా సేవలందించిన తాతయ్య కొల్లాపూర్ లో రాచరిక భూస్వామ్య వ్యవస్థ ముందు తల ఒగ్గ లేక వేములవాడ వచ్చినట్టు విన్నాను
ఆ విషయాలు తాతయ్యను ఎప్పుడు అడిగినా చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవాడు. నేను కరీంనగర్లో కార్ఖానాగడ్డ, గంజ్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు పరీక్షలవుతున్నప్పుడు తాతయ్యకు ఉత్తరం రాసేవాడిని ఫలానా రోజుతో పరీక్షలయిపొతున్నాయని. సరిగ్గా ఆరోజు పగటీలికల్లా తాతయ్య కరీంనగర్లో మా మిఠాయి దుకాణం ఇంట్లో దిగేవాడు. అనేక మంది పిల్లలతో మున్సిపల్ స్కూలులా వుండే మా ఇంట్లో అందరికీ ఐస్ ఫ్రూట్లు ఇప్పించి నన్ను తీసుకుని వేములవాడ బయలు దేరేవాడు. అట్లా దాదాపు స్కూలు సెలవులన్నీ వేములవాదలోనే గడిచేవి. అక్కడి మిత్రులు దేవాలయ వాతావరణం నా బాల్యం లో భాగం అయిపోయారు.
అమ్మమ్మ తతయ్యలకు తమ కూతుళ్ళ పిల్లలంటే ఎంత అభిమానమంటే వాళ్ళని ఏమయ్యా అనేవాల్లె గాని అరేయ్ ఒరేయ్ అని పిలిచే వాళ్ళు గాదు. అమ్మమ్మయితే ఆడబిడ్డల కొడుకులను అరేయ్ అంటామా అని అందరిముందూ అనేది. అదే మా ప్రసాద్ బావని మాత్రం అరేయి ప్రసాదూ అని పిలిచేది. అదీ అప్పటి పెద్దల అభిమానాలూ ఆదరణలూ.
తాతయ్య వేములవాడ దేవస్థాన మొట్టమొదటి వైద్యాధికారి. దేవాలయ వెనకాల కట్టమీద ఆసుపత్రి నివాసమూ వుండేదని చెప్పేవారు. అక్కడే అనేక ఏళ్ళు గొప్ప సేవా తత్వంతో సేవలందించిన ఆయన ఆజానుబాహువు. ముఖంలో గంభీర్యంతో కూడిన చిరునవ్వుతో అందరి ఆదరణకూ పాత్రుడయ్యేవారు. కరేమ్నగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కాలేజీ లో 1960 ప్రాంతంలో లైబ్రేరియన్ గా పనిచేసిన శ్రీ శ్రీరంగా రావు గారు ఇటీవల నాతో మాట్లాడుతూ మీ తాతయ్య ఎంత అందగాడనుకున్నావు కట్టమీద నడుస్తుంటే ఎవరికయినా గౌరవంగా పలకరించాలని పంచేది. నేనూ తన దగ్గర నా చిన్నప్పుడు వైద్యం చేయించుకున్నాను అన్నాడు. అంతేకాదు ప్రైవేట్ గా ఆసుపత్రి తెరిచి ఆయన చేసిన సేవ గురించి దావఖాన్ల అమ్మమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (అవన్నీ మరెప్పుడయినా పంచుకుంటాను)
నాకయితే ఆర్ద్ర రాత్రి ఆపరాత్రి అనకుండా మందుల పెట్టె పట్టుకుని కాన్పులు చేయడానికి ఆపదలో వున్న వాళ్లకు వైద్యం చేయడానికి వెళ్ళిన ఆయనే గుర్తొస్తాడు. అట్లా వేముల వాడలోనే కాదు చుట్టూ పక్కల అనేక గ్రామాల్లోని ఆపన్నులకు ఆయన అందించిన సేవల్ని ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాలపాటు స్మరించుకున్నారు. చిన్నపిల్లలు మొదలు వృద్ధుల దాకా ఆకాలంలో ఆయన చేతి కషాయం, దగ్గు మందు, దగ్గు పొట్లాలు వాడని వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి.
ఆ మహానుభావుడి యాదిలో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు.
వ్యక్తిగతమయినవి కాకుండా వూరి పరంగా సామాజిక పరంగా నన్ను వెంటాడుతున్న మూడు దృశ్యాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
1) తాతయ్య ఉదయాన్నే లేచి బావి వెనకాల చెట్లకు నీళ్ళు పారించి పిల్లల స్నాన పానాదు లతో గడిపి గ్లాసెడు చాయ్, నోట్లో పాన్ బిగించి తన స్టాండర్డ్ డ్రెస్ లాల్చీ పైజామాలు ధరించి ఆసుపత్రికి బయలు దేరేవాడు. అప్పుడప్పుడు నేనూ వెంట వుండే వాడిని. తాను ఇంటి గడప దాటింది మొదలు ఆయనకు కుడిచేయి దించే అవకాశం వుండేది కాదు. తాతయ్యా నమస్తే, తాతా నమస్తే అంటూ బడి పిల్లలూ ఆడుకునే పిల్లలూ ఆయన్ని పలకరిస్తే అందరికీ ప్రతిగా నవ్వుతూ చేయి ఊపుతూ దగ్గరికి వచ్చిన వాళ్లతో చేతులుకలపదం చేసేవాడు. ఇక పెద్ద వాళ్ళయితే ‘దండాలయ్యా’, నమస్తే డాక్టర్ సాబ్, అయ్యా దండం పెడ్తున్నా అనేవాళ్ళు ఇంకొందరు, అందరికీ బదులిస్తూ అందరినీ పలకరిస్తూ తాతయ్య ఆసుపతికి చేరే సరికి ఎంతో సమయం పట్టేది. నిజంగా ఒక మనిషి అంతమంది ఆదరణను ప్రేమని పొందడం అపురూపమం. ఆ దృశ్యం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంది. మనిషి కనిపిస్తే ముఖం చాటేసి వెళ్ళే ఈ కాలం లో అది అపురూప దృశ్యమే.
2) ఇక రెండవది రాజ రాజేశ్వరుని ‘సేవ’. ప్రతి దసరాపండుగ రోజు సాయంత్రం వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో రెండు సేవలు (దేవుని పల్లకీలు) బయలుదేరేవి. శివకేశవుల సేవలు అవి. ఆలయంలో బయలుదేరి జమ్మి చెట్టు నిలబెట్టే స్థలానికి చేరి ఇక అక్కడినుంచి వూరు ఊరంతా అన్ని వీధులూ తిరిగి ఆలయానికి వచ్చేవి. ఆ రెండు సేవలూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటి ముందుకు వచ్చి అక్కడ గౌరవంగా నిలబడేవి. అప్పటికే అమ్మమ్మ తో సహా అనేక మంది మహిళలు హారతులు పట్టుకుని నిలబెడేవారు. మేము పిల్లలమంతా సేవల కిందినుంచి అటూ ఇటూ దూరి పరుగులు తీసే వాళ్ళం. అదొక అద్భ్తమయిన దృశ్యం. దేవుని సేవలు ఒక వ్యక్తి ఇంటి మందు నిలబడడం ఒక అపురూపమయిన విషయం. ఆ ఆనవాయితీ తాతయ్య ఉన్నంత కాలం కొనసాగింది.
౩) ఇక మూడవది తాతయ్య అంతిమ యాత్ర. బహుశా నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని వెంటాడే దృశ్యం అది. అనారోగ్యం తో హైదరాబాద్ ఆసుపత్రిలో తన అంతిమ శ్వాస విడిచిన ఆయన అంతిమ యాత్ర వేములవాడలో మొదలయినప్పుడు వేములవాడ వూరు ఊరంతా దుఖమే. రోదించని వాళ్ళు లేరు. అంతిమ యాత్ర ముగిసే వరకు దేవాలయ ప్రధాన ద్వారం మోసేసారు. ఊరంతా బందు. అంతిమ యాత్ర సాగినంత మేరా ఇళ్ళముందు పిల్లా పెద్దా అంతా తమ ఇంట్లో మనిషి పోయినట్టు రోదిస్తున్న దృశ్యం నా కళ్ళల్లో ఇప్పటికీ మెదుల్తూనే వుంది. ఇదికదా ఒక మనిషికి మహానుభావుడికి ప్రజలు ఇచ్చే నివాళి. గౌరవం.
జయహో తాతయ్యా జయహో డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం జయహో.
కన్నీళ్ళతో ఇక ఏమీ రాయలేను’