Home ఇంద్రధనుస్సు సినీగేయాల పరామర్శ

పాటల పల్లకీలో ఊరేగించిన సముద్రాల రాఘవాచార్యులు

సముద్రాలగా పేరు తెచ్చుకున్న రాఘవాచార్యులుగారు సినీ గీత రచయితే కాకుండ, సిని మాటలకు, కథ, సంభాషణలు మాత్రమే కాదు వినాయక చవితి, బబ్రువాహన సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.  1958వ సంవత్సరంలో విడుదలైన “భూకైలాస్” సినిమాలో పాటలన్నీ సముద్రాల వారే వ్రాశారు. ఇందులో ఒక పాట.

“జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆశ్రిత మందారా, శృతి శిఖర సంచారా” తో మొదలయ్యే ఈ పాట  ఘంటసాలగారి భక్తి గీతాలలో ఎన్నదగినది, మిన్నయైనది.

శృతులనబడే వేదాల శిఖరమందు ఉండేవి ఉపనిషత్తులు. జీవాత్మను పరమాత్మను సన్నిధికి సమీపంగా (ఉప), నియమబద్ధంగా (ని), ఉంచునది (షత్). కనుక ఆ ఉపనిషత్తులలో సంచరించే వాడా అనే అర్థంలో వాడిన ‘శృతి శిఖర సంచారా’ వాక్యాన్ని మన కందించిన సముద్రాల వారి పాండిత్య వైభవానికి నమో వాక్కాలు.

నీలకంధరాదేవా, దీనబాంధవారావా, నన్ను గావరా ||నీలకంధరా||

సత్యసుందరాస్వామి, నిత్య నిర్మలాపాహి,

అన్యదైవమూ కొలువా, నీదు పాదమూ విడువా,

దర్శనమ్మునీరా, మంగళాంగా గంగాధరా ||నీలకంధరా||

ఈ పాట పల్లవి ‘నీలకంధరా’ నుండి ‘గంగాధరా’ వరకు ‘తిలంగ్’ రాగాన్ని ఉపయోగించారు.

‘దేహియన వరములిడు దానగుణ సీమా, పాహియన్నను ముక్తినిడు పరంధామా’, నీమమున నీ దివ్య నామ సంస్మరణా, ఏ మరకసేయుదును భవతాపహరణా, నీ దయా మయ దృష్టి దురితమ్ములారా, వరసుధా వృష్టి నా వాంఛలీడేరా, కరుణించు పరమేశ దరహాస భాసా, హరహర మహాదేవ కైలాసవాసా’

ఇంతవరకు శుద్ధసావేరి రాగాన్ని ఉపయోగించారు.

“ చరణం నుండి పాట పూర్తి అయ్యేవరకు హృదయమున్న ప్రతి మనిషి, స్పందనకు లోను కావలసిందే. లేకుంటే

దానిని పాషాణంగా అనుకోవాలి.

“అన్య దైవమూ కొలువా’ చరణం ద్వారా రావణ బ్రహ్మ వ్యక్తిత్వాన్ని సముద్రాలవారు ఆవిష్కరించారు.

‘ఫాల లోచన నాదు మొరవిని జాలిని పూనవయా,

నాగభూషణ నన్నుగావక జాగును సేయకయా, 

కన్నుల విందుగ భక్తవత్సల కావగ రావయ్యా ||కన్నుల||

ప్రేమీ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||ప్రేమ||

శంకరా శివశంకరా, అభయంకరా, విజయంకరా

ఈ చరణంలో సముద్రాలవారు ‘నాద నామక క్రియ’ రాగాన్ని ఉపయోగించారు.

నందమూరి తారాకరామారావు, రావణబ్రహ్మగా అభినయించిన ఈ పాటలో నాగభూషణం (పరమశివునిగా), బి.సరోజాదేవి (పార్వతీదేవిగా) కనిపిస్తారు.

సుదర్శనం, గోవర్ధనం, సంగీతం కూర్చిన ఈ పాటను పాటల పోటీలలో పాడే ఏ గాయకుడైనా ప్రత్యేకంగా ప్రశంసించబడతాడు.

సముద్రాలవారు పండిత కుటుంబం నుండి వచ్చినవారు. వారికి విషయ పరిజ్ఞానం, గ్రంథపఠనా బలం, భాషా పటిమ మెండుగా వున్నాయి.

ఈ పాటలో సముద్రాలవారు విశేషణాలు బాగా వాడారు.

భూ కైలాస్ సినిమా ఎ.వి.యం సంస్థ నిర్మించినది. దర్శకుడు కె.శంకర్. 1958 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం  తమిళ, కన్నడ భాషల్లో కూడా నిర్మాణం జరిగి, 3 భాషల్లోనూ విజయవంతమైనది.

రావణబ్రహ్మ తన తల్లి అయిన కైకసి కోరిక మేరకు పరమశివుని ఆత్మలింగం తేవడానికి తపస్సు చేస్తాడు. మహావిష్ణువు మాయ ప్రభావంతో ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని ఇవ్వమని శివుని కోరతాడు రావణుడు. తిరిగి రెండవసారి తపస్సు చేయగా పరమశివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తు ఎట్టి పరిస్థితుల్లోనూ లింగాన్ని నేలపై పెట్టవద్దని చెప్తాడు. నారద మహర్షి సలహామేరకు గణేషుడు బాల బ్రాహ్మణుని రూపంలో రాగా, రావణుడు, సంధ్యావందనం చేయడానికి, ఆత్మలింగాన్ని గణేషునికి ఇచ్చి తాను వచ్చేవరకు, లింగాన్ని పట్టుకోవాలని కోరతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఆలోగా రాకపోతే నేలపై పెట్టేస్తానని గణేషుడు షరతు విధిస్తాడు. రావణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గణేషుడు 3 సార్లు పిలువగా రానందున ఆత్మలింగాన్ని గణేషుడు నేలపై పెడతాడు. రావణుడు వచ్చి లింగాన్ని తీయడానికి ప్రయత్నించగా, భూమిలో నుండి లింగం రాలేదు. ఆ ప్రదేశమే గోకర్ణ క్షేత్రం (భూకైలాస్)గా ప్రసిద్ధి చెందినది.

సముద్రాల సీనియర్ వి మరికొన్ని పాటలు

జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే పాట లవకుశ (1963)
జననీ శివకామినీ నర్తనశాల (1963)
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అనార్కలి (1955) చిత్రం
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట లవకుశ (1963)
సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట సీతారామ కళ్యాణం (1961) సినిమా
జయహే కృష్ణావతారా పాట శ్రీకృష్ణావతారం (1967) చిత్రం

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ – పి. సుశీల బృందం – రచన: సముద్రాల సీనియర్
కరణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా – ఘంటసాల బృందం
పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే – ఘంటసాల
ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి – ఘంటసాల, పి.భానుమతి
ఓ చిగురాకులలో చిలకమ్మా … చిన్నమాట వినరావమ్మా

ఇది మంచి సమయము రారా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి నటి, గాయని అయిన బెజవాడ రాజరత్నం భక్త పోతన (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్య  రచించారు.

సముద్రాల జూనియర్

సముద్రాల సీనియర్ కుమారుడే సముద్రాల వెంకట రామానుజాచార్యులు, తన తండ్రికి ఇష్టం లేకపోయినా, ఇతరుల ఆకాంక్షమేరకు సినీరంగంలోకి అడుగుపెట్టి, మాటలు, పాటలు వ్రాశాడు.

బ్రుతుకు తెరువు సినిమాలోని ‘అందామె ఆనందం’ పాట సముద్రాల జూనియర్ కలం నుండి జాలు వారినదే.

తండ్రి, కొడుకు ఇద్దరు కూడా సినీరంగంలో ఉండడంతో, తండ్రిని సీనియర్, కొడుకుకు జూనియర్ గా టైటిల్స్ లో వ్రాసేవారు.

బ్రతుకు తెరువు సినిమా వచ్చింది. తనకు బతుకు తెరువునిచ్చింది అని సముద్రాల (జూనియర్) చెప్పేవారు.

‘అందమె ఆనందం’ వ్రాశానని తన తండ్రి రాఘవాచార్యులగారితో  చెప్పబోతే , కీట్స్ ‘A thing of beauty is joy for ever’ను తెలుగు భాషలోకి తిప్పివ్రాశావా ఏమిటి? అని ఆయన సణిగారట.

అందమె ఆనందం, అందమె ఆనందం

ఆనందమె జీవిత మకరందం

కేవలం బాహ్య సౌందర్యమే కాకుండ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులోను మన అందాన్ని ఆస్వాదించవచ్చని, ఆ ఆస్వాదనే మనకు ఆనందం కలిగిస్తుందని, మన జీవితంలో తేనెను కురిపిస్తందని సముద్రాల (జూనియర్)గారి భావన.

పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురాను రాగం

సాయంకాలవేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో కిరణాలు అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటాయి. ఆ సాయంకాలవేళ ఆ అందాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టంగా భావిస్తారు సముద్రాల. ఆ కిరణాలు పూలమొక్కలపై పడి, ఆ మొక్కలకున్న పూలపుప్పొడిని ద్విగుణీకృతం చేస్తే, మన మనస్సు మధురానురాగంలోకి వెళుతుంది. తన ఇష్టమైన ప్రేయసి తన ఒడిలో పడుకొని మోహనరాగాన్ని ఆలపిస్తే, ఇంకేం కావాలి మానవ జీవితానికి.

పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం

సముద్రం ఒడ్డుకు కూర్చొని, అలలు ఒడ్డుకు చేరే సమయంలో ఆ సవ్వడిని ఆస్వాదించునపుడు మన జీవితం పులకిస్తుంది. జింక భయపడి, రక్షణకొరకు మనలను చేరినపుడు దానిని మనం మన ఒడిలో పెట్టుకొని, దాని శరీరాన్ని, నిమురుతంటే ఆ కోమలత్వంతో మన మనస్సుకు కూడా హాయి అనిపిస్తుంది. గాలిపటం (పతంగం) ఆకాశంలో ఎగరవేస్తుంటే, సుడిగాలి వచ్చినపుడు అది గింగిరీలు కొడుతూ, కొద్దిసేపు క్రిందికి వచ్చి, మళ్ళీ పైకి ఎగురుతున్నప్పుడు, మన జీవితం కూడ పతంగంలాగే ఉన్నత స్థితికి, నీచస్థితికి అనగా ఒడిదుడుకలకు లోనై, ఒక నాటక రంగంలా వుంటుందని రచయిత భావన. నాటక రంగంలో కొంతసేపు శోకరసం,కొంతసేపు శాంతరసం ప్రదర్శించబడతాయో, పతంగం లాగే మన జీవితాలు కూడ అనుభవాలకు లోనవుతాయని రామానుజాచార్యుల వారి భావన.

జూనియర్ గారు వ్రాసిన మరికొన్ని పాటల పల్లవులు

  1. పాండురంగ మహత్మ్యం సినిమాలో “జయకృష్ణా ముకుందా మురారి”
  2. శాంతినివాసం సినిమాలో “తుషార శీతల సరోవరాన”
  3. మంచి మనసుకు మంచి రోజులు సినిమాలో “ధరణికి గిరిభారమా”
  4. కులదైవం సినిమాలో “పయనించే ఓ చిలుకా”
  5. బొబ్బిలి యుద్ధం సినిమాలో “శ్రీకర కరుణాలవాల”

పాటలు జూనియర్ గా ప్రతిభకు తార్కాణాలు. వారు లేకున్నా వారి పాటలు మన తెలుగు నేలలో “ఊగేములే తులతూగేములే ఇక తొలిప్రేమ భోగాలా” అంటూ అందరినీ ఊసులాడుతున్నాయి.

You may also like

1 comment

C.krishnamurthy September 13, 2021 - 6:21 am

The information shared by Sri Eluru Ahoka Rao travels that the senior and junior samudrala were legendary lyricists of Telugu films. They penned many famous songs.Iam very happy for sharing such valuable information by Sri Eluru Ashoka Rao.Thanq very much.

Reply

Leave a Comment