సహృదయులు, సాహితీమూర్తి, అలుపెరుగని నిత్య పరిశోధకులు, సాంస్కృతిక సేవా తత్పరులు, శ్రీ కళాపూర్ణ బిరుదాంకితులు ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు – పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురం అనే గ్రామంలో 1923 జూలై 21వ తేదీన శ్రీయుతులు పోణంగి రామమూర్తి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు 11వ సంతానంగా జన్మించారు. అంటే ఈ రోజు వారి 98వ జయంతి సందర్భంగా ఆ ఆధునిక భరతముని జీవిత విశేషాలను ఒకసారి మననం చేసుకుందాం.
భరతముని సంస్కృతంలో రచించిన ” నాట్యశాస్త్రం ” గ్రంధాన్ని P.S.R. అప్పారావు గారు – గుప్త భావ ప్రకాశిక సహితంగా – తెలుగులోకి అనువదించారు. దీనినే ఆయన ఆంగ్లంలో ” A Monograph on Bharata’s Natya Sastra ” అనే పేరుతో రచించారు. ” నాట్యశాస్త్రం ” గ్రంథ రచన అప్పారావు గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. మామూలు అధ్యాపక వృత్తి నుంచి, పరిశోధకునిగా, విమర్శకునిగా, కళా వ్యాఖ్యాతగా రూపాంతరం చెంది – ఆయన విశేషమైన కీర్తి గాంచారు. 1952లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు – B.A. విద్యార్థులకు ” సాహిత్యం – సౌందర్య శాస్త్రం – తులనాత్మక అధ్యయనం ” బోధించవలసి వచ్చింది. తనకు అంతగా పరిచయం లేని ఈ పాఠ్యఅంశాన్ని బోధించడానికి లోతుగా అధ్యయనం చేయాలని భావించి భరతుని నాట్యశాస్త్రాన్ని కూలంకషంగా చదివారు. భరతుడు సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రంలోని ప్రతి వాక్యం, ప్రతి పదం ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఉన్నాయని గ్రహించి – ఎంతో శ్రమకోర్చి తెలుగులోకి అనువదించారు. 36 అధ్యాయాలలోని 6 వేల శ్లోకాలను తేట తెలుగులోకి అనువదించి ఆంధ్రులకు చక్కటి కళా గ్రంధాన్ని బహూకరించిన ధన్యజీవి ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావుగారు. సుమారు వెయ్యి పేజీలకు పైన ఉన్న ఈ గ్రంధంలో సంస్కృత మాతృకలోని శ్లోకాలలోని భావాన్ని పాశ్చాత్య తత్వాలతో పోలుస్తూ – సహేతుకమైన వ్యాఖ్యానాన్ని రచించారు. రాజమండ్రి నుండి వెలువడిన ” సంస్కృతి ” పత్రికలో ” నాట్యశాస్త్రం ” ధారావాహికంగా ప్రచురితమైంది. 1961లో ఈ గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ బహుమతి అందుకోడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు – అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమ మధ్య అప్పారావు గారిని కూర్చోబెట్టుకుని తేనీటి విందు స్వీకరించి – గ్రంథకర్తలు, మేధావుల పట్ల తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.
భరతముని ” నాట్యశాస్త్రం ” తో పాటు ఆచార్య అప్పారావు గారు నందికేశ్వరుని ” అభినయ దర్పణం ” గ్రంధాన్ని – తెలుగు, ఇంగ్లీషు భాషల్లోకి అనువదించి – అభినవ నదికేశ్వరునిగా ఆంద్ర వాజ్మయ చరిత్రలో నిలిచారు. అలాగే ఆయన రచించిన – సాత్వికాభినయం, ఉత్తమాంగ అభినయం, శారీరాభినయం, చేష్టాకృత అభినయం, హస్తాభినయం వంటి గ్రంధాలు నృత్యాన్ని అభ్యసించే కళాకారులకు పఠనీయ గ్రంథాలుగా – ఆయా కళలను బోధించే అధ్యాపకులకు కరదీపికలుగా విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. నాట్య, నాటక, సాహిత్య రంగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఆయన రచించిన “విశ్వభారతి” నవల ఉన్నత పాఠశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచకంగా ఎంపికయ్యింది. ఇంకా “తాజ్ మహల్” నాటకం, “వేణువు” వచన కవిత, మంత్రి తిమ్మరుసు, ఉలూపి వంటి రచనలు విశేషంగా సాహిత్యాభిమానుల ప్రశంసలందుకున్నాయి. అప్పారావుగారి సృజనాత్మక సృష్టికి నిదర్శనాలుగా నిలిచాయి.
అప్పారావు గారు తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన – విజ్ఞాన సర్వస్వం – తెలుగు సంస్కృతి – విశ్వసాహితి – లలిత కళల సంపుటాల్లో – పలు వ్యాసాలు రచించారు. అదేవిధంగా – భారతి, కిన్నెర, పరిశోధన, జయంతి వంటి పత్రికల్లోనూ – వివిధ అభినందన సంచికల్లోనూ – ఎంతో విలువైన సమాచారంతో వీరు రచించిన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఆయన పరిశోధనా పటిమకూ, సాహిత్య ప్రతిభకు, పాండిత్య వైభవానికీ ప్రతీకలుగా నిలిచాయి. ఆచార్య అప్పారావు గారు ఆంధ్రప్రదేశ్ లోని నృత్యాలపై రచించిన పుస్తకాన్ని – 1969 లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రచురించింది. మహా నాటక కర్త ” ధర్మవరం రామకృష్ణమాచార్య ” జీవిత గాధను – అప్పారావు గారు రచించగా – కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు – 1974, 1989 సంవత్సరాల్లో ప్రచురించాయి. వీరు రచించిన ” ప్రధమ ఆంద్ర నాటక కర్తలు ” అనే గ్రంధంలో – అనేక మంది నాటక రంగ ప్రముఖుల జీవిత విశేషాలతో పాటు – ను సోదాహరణంగా వివరించారు.
ఇరవయ్యో శతాబ్దంలో జన్మించిన సుప్రసిద్ధ శాస్త్ర-సాహిత్య పరిశోధకులలో డాక్టర్ పోణంగి శ్రీ రామ అప్పారావు గారిది ఒక ప్రత్యేక స్థానం. 1860 నుండి 1960 వరకు ఉన్న నూరేళ్ళ తెలుగు నాటక వైభవాన్నిసమగ్రంగా సమీక్షించి ” తెలుగు నాటక వికాసం ” అనే పరిశోధనా గ్రంధాన్ని తెలుగు ప్రజలకు, ముఖ్యంగా నాటక రంగ ప్రేమికులకు కానుకగా అందించారు. నాటక సాహిత్యంపై పరిశోధన చేసిన, చేస్తున్న ప్రముఖులందరికీ అప్పారావుగారు అనువదించిన ఈ సిద్ధాంత గ్రంధమే స్ఫూర్తినిస్తోంది. 1956 – 1959 సంవత్సరాల మధ్య – హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధనకు – 1961 లో పీ హెచ్ డీ పట్టా పొందారు. ఈ పరిశోధనలో భాగంగా అప్పారావుగారు సుమారు 2 వేల నాటకాలు, 4 వేల ఏకాంకిక నాటికలు, వెయ్యి మంది రూపకర్తల వివరాలను సేకరించి సమీక్షించి మనకు అందించారు. ఈ గ్రంధం ఆయనకు మంచి ఖ్యాతినార్జించి పెట్టింది.
B.A. ఆనర్స్ డిగ్రీ పొందిన అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లోని D.N.R. కళాశాలలో తెలుగు ట్యూటర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి, మద్రాసు, కడప, శ్రీకాకుళం మొదలైన పట్టణాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు అధ్యాపకునిగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. రాజమండ్రీ లో అక్కడ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నాటికలు రచించి వారిచేత ప్రదర్శింపజేశారు. విద్యార్థినుల చేత మగ వేషాలు వేయించి వారిని ప్రోత్సహించారు.
ఆ తర్వాత 1959 లో పాఠ్యపుస్తకాల జాతీయీకరణ ప్రత్యేక అధికారిగా, సాంస్కృతిక వ్యవహారాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. పాఠ్య గ్రంధాల రచన, ముద్రణ విషయంలో అప్పారావు గారు చూపిన శ్రద్దాసక్తులను గమనించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న P.V. నరసింహారావు గారు 1968లో ఏర్పాటైన తెలుగు అకాడమీకి మొదటి డైరక్టరుగా అప్పారావు గారిని ఎంపిక చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలైన తెలుగు భాషా వ్యాప్తి, అభివృద్ధి, ఆధునికీకరణ, అధికార భాషగా అమలులో రాష్ట్రప్రభుత్వానికి సహకరించడంతో పాటు – వివిధ పాఠ్యపుస్తకాలు, పరిభాషక పదకోశాలు, అనువాద గ్రంధాల ప్రచురణ పెద్ద ఎత్తున చేపట్టారు. అతి తక్కువ కాల వ్యవధిలో – దాదాపు 4 వందల పాఠ్య పుస్తకాలు తెలుగు మాధ్యమంలో తీసుకువచ్చిన ఘనత అప్పారావుగారిదే. తెలుగు అకాడమీ చేపట్టిన అన్ని పాఠ్య, విద్యా విషయక ప్రచురణల్లో – వ్యవహారిక భాషనే ప్రవేశపెట్టారు. తెలుగు అకాడమీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లేలా పనిచేశారు. తద్వారా తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారు.
1974లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రి మండలి వేంకట కృష్ణారావు గారు, ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు – ఆ కార్యక్రమ నిర్వహణా భారాన్ని అప్పగించడానికి సమర్ధుడైన అధికారి ఎవరా అని అన్వేషించి – చివరికి ఆ బాధ్యతను P.S.R. అప్పారావు గారి భుజస్కంధాలపై పెట్టారు. చేపట్టిన ప్రతి పనినీ కేవలం ఉద్యోగ ధర్మంగా కాకుండా స్వంత పనిగా భావించేవారు. పగలంతా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక అధికారిగా సచివాలయంలోనూ, రాత్రంతా ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శిగా రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కార్యాలయంలోనూ – నిద్రాహారాలు మాని పనిచేశారు. 1975 ఏప్రిల్ నెల 12వ తేదీ నుంచి వారం రోజులపాటు – హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో వైభవోపేతంగా జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహా సభలను అనితర సాధ్యంగా నిర్వహించారు. ఇది వారి కీర్తి కిరీటంలో కలికి తురాయిగా భాసిల్లింది.
ప్రపంచ తెలుగు మహా సభల్లో చేసిన తీర్మానం నేపథ్యంలో ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు గా నియమితులైన అప్పారావుగారు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులతో – విద్యా, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించి, తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడానికీ – ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రముఖులను అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావదానికీ – విశేష కృషి చేశారు. అదేవిధంగా విదేశాలలో జరిగిన తెలుగు మహా సభలలో కూడా – ఆయన – ప్రముఖ పాత్ర పోషించారు.
1981లో ఆనాటి ముఖ్యమంత్రి N.T. రామారావు గారు దానిని తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేయడంతో – అప్పారావు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్ గా బదిలీ పై వచ్చి, 1983 లో పదవీ విరమణ చేశారు.
తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఆయన చేసిన కృషి అపర భగీరథ ప్రయత్నంగా పేరుగాంచింది. అప్పారావు గారు మృదుభాషి. సౌమ్యుడు. విద్వన్మణి. బంధు మిత్రులతో సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ పరుషంగా కానీ, కటువుగా కానీ మాట్లాడేవారు కాదు. సహోద్యోగులు తప్పు చేస్తే మృదువుగా మందలించేవారే తప్ప ఎవరి మనసును నొప్పించేవారు కాదు. తనతో భావ సారూప్యం గల వ్యక్తులతో తన అవసరానికి తగ్గట్టు ఒక జట్టును తయారుచేసుకుని, తనకు అప్పగించిన బాధ్యతను – చడీ చప్పుడూ లేకుండా పూర్తిచేసేవారు.
చివరగా రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకునిగా ప్రభుత్వ సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన ఆచార్య అప్పారావు గారు ఆ తర్వాత సాహితీ, సాంస్కృతిక సేవకు ద్విగుణీకృత ఉత్సాహంతో పునరంకితమయ్యారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రం లో తెలుగు సాంస్కృతిక రంగ అభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సాహితీ, సాంస్కృతిక, విద్య విషయక సంస్థలకు శ్రీకారం చుట్టి, తమ దీక్షా, దక్షతలతో వాటికి గుర్తింపు, రాణింపు తెచ్చారు. చాలా కాలం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను వ్యవస్థీకరించి – సమన్వయ కర్తగా, ఆచార్యులుగా పనిచేసి – ఆ సంస్థ ఉన్నతికి ఎంతగానో శ్రమించారు. ఆ విధంగా పరిపాలన, బోధన, పరిశోధనా రంగాల్లో – అప్పారావు గారు చేసిన కృషి అనిర్వచనీయమైంది. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి.
* రాష్ట్ర ప్రభుత్వంనుంచి-1980లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు – పలు అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
* వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల నుంచి 1987 లో రాష్ట్ర నాట్య సామ్రాట్, 1990లో నాటక రత్న, 1992 లో కళారత్న వంటి బిరుదులు అనేకం అందుకున్నారు.
* మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, రాజాలక్ష్మీ సాహిత్య పురస్కారం ఆయన్ను వరించాయి.
వీరి తండ్రి గారు గ్రామ కరణంగా పనిచేసేవారు. నిత్యం భాగవత పారాయణ చేస్తూ ఉండేవారు. వారు చదివేటప్పుడు దగ్గర కూర్చుని ఆలకించడం వల్ల, చిన్న వయస్సులోనే పోతనామాత్యుని పద్యాలు కొన్ని అప్పారావుగారికి కంఠస్తమయ్యాయి. తల్లి గారు ఏమీ చదువుకోలేదు. ఎప్పుడూ పిల్లలతో, మనమలతో సతమతమౌతూ ఉండేవారు. అనుబంధాలతో, మమకారాలతో అల్లుకున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. వారి మండువా లోగిలి ఎల్లప్పుడూ బంధుమితృలతో, పరివారంతో, పశుసంపదతో, ధాన్యాదులతో కళకళ లాడుతూ ఉండేది.
వారి చిన్న తనంలో – గ్రామంలో పిచ్చుకుంట భాగవతార్లు ప్రదర్శించే ” ప్రహ్లాద” , “రామ నాటకం” వంటి నృత్య రూపకాలు అప్పారావుగారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ కళాకారులను వీరి తండ్రిగారు, ప్రోత్సహించి, పోషించేవారు. అదే వారి కళాతృష్ణకు బీజం నాటింది. అప్పుడే – ఆయనకు – కళల పట్ల అవ్యాజమైన అనురాగం పుట్టింది. ప్రాధమిక విద్య స్వగ్రామం లో పూర్తి చేసిన అనంతరం అప్పారావు గారు కొవ్వూరులో అన్నగారి ఇంట్లో ఉండి, విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అప్పారావు గారు ఆరవ తరగతి నుండి స్కూల్ ఫైనల్ వరకు కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రీ లో ఇంటర్మీడియట్ చదివారు. ఆ రోజుల్లోనే – కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ” వేయి పడగలు ” చదివి – ఆ సాహితీమూర్తి పట్ల – ఆరాధన పెంచుకున్నారు. ఆయన వద్దే B.A. చదవాలన్న తలంపుతో – విజయవాడ శ్రీ రాజా రంగయ్య అప్పారావు కళాశాలలో డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారు ప్రిన్సిపాల్ గా ఉన్న కాలంలో డిగ్రీ పూర్తిచేసి – 1944 లో విశాఖపట్నం ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి – తెలుగు భాషా, సాహిత్యాలు అభిమాన విషయాలుగా B.A. ఆనర్స్ పట్టా అందుకున్నారు. విశ్వనాథ గారి సాంగత్యంలో తెలుగు సారస్వతంపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అక్కడ చదువుతుండగానే ” తాజ్ మహల్ ” నాటికను రచించారు. విద్యార్థి దశ లోనే చిన్న చిన్న నాటికలు వ్రాసి, దర్శకత్వం వహించడంతో పాటు వాటిలో పాత్ర పోషణ కూడా చేసి, తోటి విద్యార్థులతోకలిసి ప్రదర్శించేవారు. 1946 లో M.A. డిగ్రీ తీసుకున్నారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PHD చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు – అప్పారావు గారికి – సాహితీ స్రష్టలు దేవులపల్లి – రాయప్రోలు – నార్ల వంటి వారితో పరిచయం ఏర్పడింది.
1941 లో S.S.L.C. పరీక్షలో ఉత్తీర్ణులైన అనంతరం వెంకటరమణమ్మ గారితో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరూ ఉన్నత విద్యలనభ్యసించి, ఉన్నత స్థాయిలో స్థిరపడి, తండ్రిగారి ఆశయాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు.
ఆధునిక భారతమునిగా నిర్విరామ సాహిత్య, కళా సేవ చేసిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు కొంత కాలం అనారోగ్యంతో బాధపడి 2005 జూలై ఒకటవ తేదీన హైదరాబాద్ లో తుది శ్వాస విడిచి కళా సరస్వతి చెంత చేరారు.
82 సంవత్సరాలు ఎంతో ఫలవంతమైన జీవితాన్ని గడిపిన అప్పారావు గారు – ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకున్నా- తన రచనల ద్వారా మన హృదయాలలో వెలిగించిన విజ్ఞాన జ్యోతి – నిరంతరం కాంతిని ప్రసరిస్తూనే ఉంటుంది. తరతరాలకూ ఉపయోగపడే అపూర్వ సాహితీ సంపదనూ, కీర్తి, ప్రతిష్టలనూ మనకు మిగిల్చిన ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు నిజంగా ధన్యజీవి.