మూలం: రవీంద్రనాథ్ టాగూర్ అనువాదం: చింతపట్ల సుదర్శన్
నేను చేరేటప్పటికి డార్జిలింగ్ వర్షంలో తడిసి ముద్దయ్యింది. బయటకి వెళ్ళదల్చుకోలేదు కాని వెళ్ళకుండా హోటల్లోనే ఉండిపోవడం నచ్చలేదు. టిఫిన్ ముగించి రెయిన్ కోటు తొడుక్కుని బూట్లు వేసుకుని అలా నడిచి వద్దామని బయటకు వెళ్ళాను. మధ్య మధ్య ముసురు పడుతూనే వుంది. దట్టమైన మబ్బులు వెలుతుర్ను పూర్తిగా కప్పేస్తుంటే సృష్టికర్త కొండల్ని చుట్టుపక్కల ఉన్న పరిసరాలను రబ్బరుతో తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాడా అనిపించింది.
పొగ మంచు కప్పేసిన వాతావరణాన్ని మనుషులెవరూ లేని రోడ్డుని ద్వేషించే వాణ్ణి ఇప్పుడు నా పంచేంద్రియాలతో నేల వైవిధ్యాన్ని, రంగుల్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటూ నడుస్తున్నాను. ఈ సమయంలో ఒక స్త్రీ రోదిస్తున్న ధ్వని అతి దగ్గరలో వినిపించింది. జీవితం ఎంతో జటిలమైనది. విషాదం దానికి కొత్త కాదు. ఎవరో ఒకరు ఏ కారణంచేతో రోదించడం సర్వసాధారణమైన విషయమే. మరో సమయంలో అయితే పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు. కానీ ఇప్పుడు ఈ మేఘావృతమయిన వాతావరణంలో ఆ ధ్వని మాయమైపోతున్న ప్రపంచపు శోకంలా అనిపించి ఏడుపు వినవస్తున్న చోటుకు వెళ్ళాను. రోడ్డు పక్కనే ఉన్న ఓ బండరాయి మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీ రోదిస్తున్నది. ఆమె దుస్తులు మట్టి రంగులో ఉన్నయి. చిక్కులు కట్టిన జుట్టును నడినెత్తిన ముడివేసుకుంది. డార్జిలింగ్‌లో కలకత్తా రోడ్డు మీద కొండ పక్కన ఓ బండరాయి మీద ఒక సన్యాసినిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఆమెను హిందీలో అడిగాను.
‘ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది?’
మొదట ఆమె ఏమీ మాట్లాడకుండా నీళ్ళు నిండిన కళ్ళతో నా వైపు చూసింది. ‘భయం లేదు. నేను చెడ్డవాడినేమీ కాదు’ అన్నాను. ఆమె స్వచ్ఛమైన హిందుస్తానీలో మాట్లాడిరది. ‘సిగ్గూ, భయమూ అవమానమూ అనేవి మరిచిపోయి చాలా కాలం అయింది. ఒకప్పుడు పరదా చాటున ఉండే నన్ను చూడటానికి నా స్వంత సోదరుడు కూడా అనుమతి కోరేవాడు. కాని ఇప్పుడు ప్రపంచానికీ నాకూ మధ్య ఏ అడ్డు తెరా లేదు’ అన్నది.
ఇదేదో మంచి కథ అల్లే విషయం అని అనిపించింది నాకు. సిగరెట్టు పొగను రైలు పొగలా వదులుతున్న నన్ను కుతూహలం గట్టిగా పట్టుకుంది. ‘నేను నీకేమైనా సాయపడగలనా?’ అని అడిగాను.
ఆమె నా వైపు సూటిగా చూస్తూ ‘బద్రౌన్ నవాబు గోలమ్కాదర్ ఖాన్ కుమార్తెను నేను’ అంది.
బద్రౌన్ ఎక్కడుందో గోలమ్ కాదర్ ఖాన్ ఎవరో, నవాబు కూతురయిన ఈమె రోడ్డు మీద రోదిస్తూ ఎందుకు కూర్చుని ఉందో నాకు అర్థం కాలేదు. కానీ ఆమె చెప్పే కథను వినే అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాను. నేను వంగి ఆమెకు సుదీర్ఘమైన సలాం చేసి ‘బీబీ సాహెబ్ క్షమించడండి నాకు మీరెవ్వరో తెలియదు’ అన్నాను.
పక్కనే ఉన్న మరో బండరాయిని చూపుతూ ‘కూర్చోండి’ అన్నది. ఆమె పక్కనే నాచు పట్టి ఉన్న బండరాయి మీద కూచుంటూ అడిగాను ‘బీబీ సాహెబ్ మీకీ పరిస్థితి ఎలా వచ్చింది?’
బద్రౌన్ యువరాణి నుదురు కొట్టుకుంది. ‘ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంతో నాకు ఎలా తెలుస్తుంది. ఈ అనంతమైన బరువైన కొండల్ని పలుచటి మేఘాలతో దాచి పెట్టే వాడెవడో?’ అందామె మబ్బుల్లోకి చూస్తూ.
నేను ‘అవును, విధి లీలలు ఎవరికి తెలుస్తయి. విధి ముందు మనమంతా చీమలమే కదా!’ అన్నాను.
ఆమె చెప్పడం మొదలు పెట్టింది. మా తండ్రి గారి నరాల్లో ఢల్లీి చక్రవర్తుల రక్తం ప్రవహిస్తూ ఉండేది. తన కుటుంబ ప్రతిష్ఠను నిలబెట్టుకోవడానికి నాకు సరైన భర్త కోసం ప్రయత్నాలు చేయసాగారు. లక్నో నవాబు దగ్గరి నుంచి పెండ్లి ప్రస్తావన కూడా వచ్చింది. బ్రిటిష్ వారికి సిపాయిలకు మధ్య ‘పోరు సాగుతున్న కాలం అది. హిందుస్తానీ ఫిరంగి జ్వాలల కారణంగా చిక్కని పొగలు కమ్ముకుంటున్న సమయమది’
నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ఒక స్త్రీ స్వచ్ఛమైన హిందుస్తానీలో మాట్లాడ్డం విని ఉండలేదు. బీబీ సాహెబ్ మాటల్లో వాక్యాలు మంచు కప్పిన బంగారు మొక్కజొన్న పొలాల్లో వీచే ఉదయపు గాలుల్లా సుకుమారంగా, అందంగా ఉన్నవి. నవాబుల భాష వింటుంటే మబ్బుల్లో దాక్కున్న బ్రిటిష్ వాళ్ళ రాతి డార్జిలింగ్‌కు బదులు నా మనో నేత్రానికి మొగల్ నగరం, పాలరాతి భవనాలు, వీధుల్లో తిరుగాడే పొడవాటి తోకలున్న గుర్రాలు బంగారు అంబారీలున్న ఏనుగులు, వివిధ రంగుల తలపాగాలతో వదులు చొక్కాలు పైజామాలు ధరించి, వేళ్ళ దగ్గర ఒంపు తిరిగిన పాదరక్షలు తొడుక్కుని నడుములకు కత్తులు వేలాడ దీసుకుని కావలసినంత తీరిక కలిగి ఉండి, ఉల్లాసంగా జీవితం గడిపే మనుషులు కనిపించారు.
నవాబు కూతురు నూరున్నిసా నో లేక మెహరున్నిసానో అంది తన పేరు, కథ కొనసాగింది. ‘మా కోట యమునా నది ఒడ్డున వుండేది. మా సైన్యాధిపతి ఒక హిందూ బ్రాహ్మడు. ఆయన పేరు కేశర్‌లాల్. ఆమె తన గొంతులోని మాధుర్యాన్నంతా కేశర్ లాల్ అన్న మాటలో ఒలికించింది.
కేశర్‌లాల్ మత ఆచారాలను కచ్చితంగా పాటించే హిందువు. నేను ఉద యం నిద్ర లేవగానే జనానా కిటికీలోంచి చూస్తే యమునానది వక్షం మీద చేతులు గుండ్రంగా తిప్పుతూ సూర్య నమస్కారాలు చేస్తూ కనిపించేవాడు. నది ఒడ్డున తడిసిన దుస్తులతో కూచుని మంత్రాలు చదివేవాదు. తర్వాత భైరవి రాగంలో ఒక కీర్తనను ఆలపిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయేవాడు.
నేను ఒక ముస్లిం అమ్మాయిని. నా మతం గురించి నాకు ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. ఆచరణలు, సిద్ధాంతాలు ఏమీ తెలియవు. ఇక మా ఇంట్లో పురుషుల్లో మత సంబంధమైన నిబంధనలు మద్యపానం, స్వార్థ చింతనల కారణంగా బలహీన పడ్డాయి. సుఖాల కారణంగా జనానాలో కూడా మతం సజీవంగా ఉండేది కాదు.
దేవుడు బహుశా నా లోపల ఒక సహజమైన దాహాన్ని నిక్షేపించాడేమో ఉదయపు మసక వెలుతురులో కేశర్‌లాల్ ప్రశాంత యమునా నది తెల్లటి మెట్ల మీద పూజలు నిర్వహించే దృశ్యం నాలో మాటల్లో చెప్పలేని భక్తి భావాన్ని నింపేసేది. తన సమయపాలన, క్రమశిక్షణ, భక్తి, చురుకైన అందమైన దేహంతో ఒక పొగరాని జ్వాలలా ఉండేవాడు. అతని పవిత్రత సౌకూమార్యం, సౌందర్యం ఒక అమాయకమైన ముస్లిం అమ్మాయిని ఒక విచిత్రమైన ఆరాధనాభావంతో వశం చేసుకుంది.
నాకు ఒక హిందూ సేవకురాలు ఉండేది. ఆమె ప్రతి రోజూ కేశర్‌లాల్‌కు మోకరిల్లి ఆయన పాద ధూళిని స్వీకరించేది. ఆ దృశ్యం నన్నెంతో ఆనంద పరిచేది. అసూయ కూడా కలిగించేది. ప్రత్యేక పూజల సమయంలో నది ఒడ్డున అన్న సంతర్పణ జరిగేది. నేను నా సేవకురాలికి ఆ కార్యక్రమం కోసం కొంత డబ్బు అందించేదాన్ని. ‘కేశర్‌లాల్‌ను భోజనానికి ఆహ్వానించావా?’ అని అడిగేదాన్ని. ఆమె భయపడుతూ ‘కేశర్‌లాల్ గారు ఎవరి దగ్గరా ఆహారం స్వీకరించరు. బహుమతులు తీసుకోరు’ అనేది. నేను ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కేశర్‌లాల్‌కు నా ఆరాధనా భావాన్ని ప్రకటించలేకపోతున్నందుకు నా మనస్సు చివుక్కుమనేది.
మా పూర్వీకుల్లో ఒకరు ఒక బ్రాహ్మణ బాలికను అపహరించి వివాహం చేసుకున్నారు. నేను జనానాలో కూర్చుని ఆమె స్వచ్ఛమైన నెత్తురు నా నరాల్లో ప్రవహిస్తున్నదని అనుకునేదాన్ని. ఆ అనుబంధం కారణంగానే కేశర్‌లాల్ పట్ల నాలో ఆరాధనా భావం అంకురించింది అనుకునేదాన్ని. నా సేవకురాలి ద్వారా హిందూ మతం గురించి, ఆచారాల గురించి, దేవతల గురించి తెలుసుకున్నాను. అద్భుతమైన రామాయణ మహాభారత కథలు విన్నాను. విగ్రహాలు, శంఖాలు, గంటలు, ధూప పరిమళాలు, పూల సువాసనలు, గంధపు అలంకారం దైవిక శక్తులు కలిగి ఉండే యోగులు సన్యాసులు ఒక అతీంద్రియ అతి ప్రాచీనమైన ప్రపంచం మొత్తం నా కళ్ళముందు నిలబడేది. నా హృదయం గూడు లేని పక్షిలా విశాలమైన రాజభవనంలో ఒక గదిలో నుంచి మరొక గదిలోకి ఎగురుతుండేది. నాలో ఉన్న అమ్మాయి మనసుని హిందూ ప్రపంచం ఒక అద్భుతమైన కథా సామ్రాజ్యంలా ఆకర్షించింది.
ఆ సమయంలో కంపనీకి సిపాయిలకు మధ్య పోరు ప్రారంభం అయింది. తిరుగుబాటు అలలు మా కోట వరకూ విస్తరించాయి. కేశర్‌లాల్ ‘గో భక్షకులైన తెల్ల వాళ్ళను ఆర్యావర్తం నుంచి తరిమెయ్యాలి హిందూ ముస్లిం రాజులు అధికారం కోసం జూదం ఆడే స్వేచ్ఛను మళ్ళీ పొందాలి’ అన్నాడని తెలిసింది.
మా తండ్రి గోలమ్ కాదర్ ఖాన్ గారు ఆచితూచి కాని యే పనీ చెయ్యరు. ఇంగ్లీషు వాళ్ళు తల్చుకుంటే ఏమైనా చెయ్యగలరు. హిందుస్తాన్ పౌరులు వాళ్ళకి ఏ విధంగానూ సరితూగరు. ‘నేను నా ఈ చిన్నకోటను ఎట్టి పరిస్థితుల్లో పణంగా పెట్టను గౌరవప్రదమైన కంపెనీతో పోరు సలపమని నన్ను అడగవద్దు’ అన్నారు.
హిందూ ముస్లింల రక్తం మరిగిపోతున్న సమయంలో ఒక వ్యాపారస్తుడిలా తండ్రి గారు మాట్లాడిన మాటలు మాకందరికీ కోపం తెప్పించాయి. మా అమ్మ, ఆమె సవతులు కూడా ఆగ్రహ పడ్డారు. కేశర్‌లాల్ సాయుధ బలాలతో వచ్చి ‘నవాబ్ సాహెబ్ మీరు మాతో చేతులు కలపకపోతే మిమ్మల్ని బందీని చేసి యుద్ధం ముగిసే వరకు కోటను మా ఆధీనంలో ఉంచుకుంటాం’ అన్నాడు.
‘ఆ అవసరం లేదు. నేను మీతో పాటే ఉన్నాను’ అన్నారు తండ్రిగారు.
‘మీ కోశాగారం నుంచి కొంత ధనం ఇవ్వండి’ అన్నాడు కేశర్‌లాల్.
మా తండ్రిగారు ఎక్కువ మొత్తం ఇవ్వలేదు. ‘మీకు అవసరం అయినప్పుడు ఇంకా యిస్తాను’ అన్నాడు.
నేను నా ఒంటి మీది నగలు మొత్తం తీసి ఓ గుడ్డలో మూట కట్టి సేవకురాలి ద్వారా కేశర్‌లాల్‌కు పంపాను. ఆయన దాన్ని స్వీకరించడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయేయి.
తుప్పు పట్టిన తుపాకులను శుభ్రం చేయడం, పాలిష్ చెయ్యడం, పాత కాలపు నాటి కత్తులు పదును పెట్టడంతో పోరుకు సిద్ధం అయ్యాడు కేశర్‌లాల్. ఒకనాటి మధ్యాహ్నం జిల్లా కమిషనర్ తన ఎర్ర చొక్కా సైనికులతో కోటలోకి వచ్చాడు. రహస్యంగా ఆయనకు తిరుగుబాటు విషయం తెలియచేశారు నాన్నగారు. కేశర్‌లాల్ మొండి కత్తులతో విరిగిన తుపాకులతో ప్రాణాలకు తెగించి, కంపెనీ సైన్యంతో పోరాడాడు. ద్రోహి అయిన మా తండ్రి గారి ఇల్లు నాకు నరకంగా కనిపించింది. దు:ఖం కోపం నన్ను ఆవహించినా ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. పిరికివాడయిన నా సోదరుడి దుస్తులు వేసుకుని ఎవరూ చూడకుండా జనానా నుంచి పారిపోయాను.
ధూళి, సైనికుల అరుపులు, తుపాకీ మ్రోతలు, మందుగుండు పొగ తర్వాత భయంకరమైన నిశ్శబ్దం నేల మీదా నీటిలోనూ ఆకాశం వరకూ వ్యాపించాయి. సూర్యాస్తమయ సమయం. యమునా నది ఎర్ర బడిరది. ఆకాశంలో పూర్ణచంద్రుడు వేలాడుతున్నాడు. యుద్ధ రంగంలో మరణించిన వారి శవాల మధ్య కలియ తిరిగాను.
కేశర్‌లాల్‌ను వెదకడం తప్ప మరో లక్ష్యం లేదు. అర్ధరాత్రి దాకా వెదుకుతూనే ఉన్నాను. యుద్ధ రంగానికి దగ్గర్లో యమున ఒడ్డున ఉన్న మామిడి చెట్టు క్రింద కేశర్‌లాల్, వ్యక్తిగత సహాయకుని మృతదేహాలు కనపడ్డాయి. తీవ్రంగా గాయపడ్డ యజమానిని సేవకుడే మోసుకొచ్చాడో, సేవకుడినే యజమాని తీసుకు వచ్చాడో ఇక్కడికి ప్రశాంతంగా మరణించడానికి.
మొట్టమొదటి సారిగా నేను కేశర్‌లాల్ ముందు మోకరిల్లాలనే దీర్ఘ కాలపు కోరికను తీర్చుకున్నాను. ఆయన పక్కన మోకాళ్ళ మీద కూలబడ్డాను. నా పొడుగాటి జుట్టును విరబోసుకుని భావావేశంతో ఆయన కాలి ధూళిని రుద్దుకున్నాను. మంచులా చల్లబడ్డ కాలి వేళ్ళను నా నుదురుకు తగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను. నెలల నించీ ఆపుకున్న కన్నీరు ఉబికి వచ్చింది. అప్పుడు ఆ దేహం కదిలింది. ఆయన పెదవుల నుంచి ఒక సన్నటి మూల్గు బయటకు వచ్చింది. ఆ శబ్దానికి భయంతో ఒక్కసారిగా వెనక్కి కదిలాను. బలహీనమైన ధ్వనితో ‘దాహం’ అన్నాడు. నేను యమునలోకి పరుగెత్తాను. నా దుస్తులను తడిపి తీసుకువచ్చాను. సగం తెరుచుకున్న కేశర్‌లాల్ పెదవుల మీద నీటిని పిండాను. అతని ఎడమ కంటికి అయిన భయంకరమైన గాయానికి తడిగుడ్డను చింపి కట్టు కట్టాను. మరికొన్ని సార్లు యమున నుంచి నీళ్ళు తెచ్చి అతని ముఖం తడిపిన తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. ‘ఇంకొంచెం నీరు తీసుకురానా?’ అన్నాను. ‘ఎవరు నువ్వు?’ అన్నాడు కేశర్‌లాల్. నేను ఏమీ దాచదలచలేదు. ‘మీ సేవకురాలిని గోలమ్ కాదర్‌ఖాన్ గారి కుమార్తెను’ అన్నాను. కనీసం మరణానికి ముందు అతనికి అతని పట్ల నాకు ఉన్న ఆరాధనా భావాన్ని తెలియజేసి ఆ ఆనందపు అనుభూతిని పొందుదామనుకున్నాను. కానీ ఆ మాట వినడంతోటే సింహంలా గర్జించాడు. ‘ఆ ద్రోహి కూతురివా? మరణసమయంలో ఒక ముస్లిం స్త్రీవి నాకు నీరు ఇచ్చి నా మతాన్ని అపవిత్రం చేశావు’ అంటూ కుడిచేత్తో నా చెంప మీద బలంగా కొట్టాడు. నా కళ్ళు గిర్రున తిరిగాయి. దాదాపు స్పృహ కోల్పోయాను.
నా వయస్సు పదహారు. జనానా నుంచి మొదటిసారి బయటకు వచ్చాను. సూర్యుని వేడి అందమైన నా బుగ్గల గులాబీ రంగును యింకా దొంగిలించలేదు. ఇది ఈ ప్రపంచంలో నా ఏకైక ఆరాధ్య దైవం నుంచి నాకు అందిన తొలి పలకరింపా అనుకున్నాను. ‘మీరు నిర్భాగ్యురాలైన ఈ సేవకురాలి సేవలు అందుకోరు. ఇతరుల దగ్గర ఆహారం ముట్టరు. సంపన్నుల నుంచి బహుమతులు స్వీకరించరు. మీరు ప్రత్యేకమైన వారు. ఒంటరి వారు. ఎవరికీ అందని వారు. మిమ్మల్నే ఆరాధించే అమ్మాయిని మీరు స్వీకరించరు. నా ఆత్మను మీకు సమర్పించే హక్కు నాకు లేదు’ అన్నాను.
ఆయన ముఖంలో ఆశ్చర్యం లేదు. అసలు ఏ భావమూ లేదు. మెల్లగా లేచి నిలబడ్డాడు. నా చేయి అందించబోతే నిరాకరించాడు. తూలుతూ యమున ఒడ్డుకు నడిచాడు. ఒడ్డుకు కట్టబడి ఉన్న పడవతాడు విప్పాడు. దాటించడానికి ఎవరూ లేదు. కేశర్‌లాల్ పడవ ఎక్కి వేగంగా ముందుకు కదిలాడు. నది మధ్యలోకి వెళ్ళేదాక కనిపించి ఆ తర్వాత కనిపించలేదు. ఏమాత్రం తగ్గని నా ఆరాధనా భావంతో ఆ పడవ ముందు మోకరిల్లి ఈ వ్యర్థ జీవితాన్ని ఈ నిశ్చలనమైన రాత్రి వేళ వికసించకుండానే రాలిపోయే మొగ్గలా అలలు లేని ప్రశాంతమైన యమునలో మునిగిపోయి ముగిద్దామనుకున్నాను. ఆకాశంలో చంద్రుడు, దట్టమైన నల్లని చెట్లు నదిలో నీలి సిరా రంగు నీళ్ళు, మామిడి తోటకు పై భాగాన ఉన్న మా కోట గోపురాలు అన్నీ కల్సి మృత్యుగీతం ఆలపించాయి. భూమి, ప్రపంచం చుక్కలు నిండిన నిశ్చలమైన చంద్ర కాంతి నన్ను ఏక కంఠంతో మరణించమన్నాయి. కానీ నేను మరణించలేదు. యమునలో కంటికి కనిపించని పడవ ఆ వెన్నెల రాత్రి నన్ను వెనక్కు తోసేసింది. జీవితపు పథంలోకి తిరిగి పంపించింది. నేను నది ఒడ్డు వెంట నిదురలో నడిచే దానిలా రెల్లు పొదల మధ్య నుంచి చిట్టడవి దారిలో నడిచాను.
కథ వింటున్న నా సిగరెట్టు మలిగిపోయింది.. ఆమె చెప్తున్నంతసేపు గోడ మీది చిత్ర పటంలా కూర్చుండిపోయాను. ఆమె మళ్ళీ చెప్పసాగింది.
మొదట మిన్ను విరిగి మీద పడ్డట్టు అయింది. కానీ ఒక నవాబు జనానాలోని అమ్మాయికి బయటి ప్రపంచం నిషేధించబడినది అనుకోవడం ఒట్టి భ్రమ. ఒకసారి బయటకు వస్తే దారి అదే దొరుకుతుంది. జీవితంలో సాధించలేనిది యేదీ లేదని తెల్సుకున్నాను. నేను నడిచే దారిలో అనేక అడ్డంకులు ఉండవచ్చు కానీ అదీ ఒక దారే అనుకున్నాను. నాకు తరచు కేశరీలాల్ గురించిన వార్తలు తెలుస్తుండేవి. ఆయన తాంతియా తోపే సైన్యంలో చేరాడని తెల్సింది. ఆకాశంలో మెరిసే మెరుపులా తిరుగుబాటు పోరులో ఉన్నాడని తెల్సింది. నేనప్పుడు యోగిని దుస్తులు ధరించి బెనారస్‌లో తాత్విక గురువు శివానంద స్వామి దగ్గర సంస్కృత శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నాను. ఆయన ఆశ్రమానికి దేశంలోని అన్ని వార్తలూ అందేవి. యుద్ధ వార్తలు వింటుండేదాన్ని.
బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు మంటల్ని ఆర్పేసింది. ఇక కేశర్‌లాల్ వార్తలు తెలియరాలేదు. నేను అక్కడ ఉండలేక శివభక్తుడి వేషంలో బయలుదేరి అనేక ఆశ్రమాలు దేవాలయాలు దర్శించాను.
కేశర్‌లాల్ తెల్సిన ఒక వ్యక్తి ఆయన యుద్ధంలో మరణించి ఉండాలి లేదా ఉరితీయబడి ఉండాలి అన్నాడు. అలా జరిగి ఉండదని నా మనస్సు నాకు చెప్పింది. కేశర్‌లాల్‌కు మరణంలేదు. ఆ అజేయమైన జ్వాల ఎన్నటికీ ఆరిపోదు. అది యింకా ఎక్కడో మండుతూనే ఉంటుంది. నన్ను నేను సమర్పించుకోవడానికి కేశర్‌లాల్ ఎక్కడో ఉండే ఉంటాడు హిందూ శాస్త్రాలు ధ్యానం ద్వారా పవిత్ర ఆచరణల ద్వారా ఒక తక్కువ కులం వాడు బ్రాహ్మణుడు కావచ్చు అంటున్నాయి, కానీ ఒక ముస్లిం బ్రాహ్మణుడుగా మారటాన్ని గురించి ఎక్కడా లేదు. నేను కేశర్‌లాల్‌ను కలవటం కోసం బయటా లోపలా బ్రాహ్మణత్వం సాధించాను. శరీరమూ, మనస్సూ మాటా ప్రవర్తనా అన్నీ మారిపోయాయి. నా బ్రాహ్మణ అమ్మమ్మ రక్తం ఏ మాత్రం శక్తి కోల్పోకుండా నా లోపల ఉన్నది.
కేశర్‌లాల్ చిన్న పడవలో యమునా నది మధ్యకు వెళ్ళిన చిత్రమే నా మనస్సులో నిలిచి ఉన్నది. తోడు ఎవరూ లేకుండా పవిత్రమైన ఆత్మ పరిపూర్ణమైన మనిషి గ్రహాలూ, చంద్రుడూ, నక్షత్రాలూ తననే నిశ్శబ్దంగా చూస్తుంటే వెళ్ళిపోయినప్పటి దృశ్యం రాత్రీ పగలూ నా కంటి ఎదుట నిలిచేది.
నా అన్వేషణ కొనసాగింది. ముప్ఫయి సంవత్సరాలు గడిచిపోయేయి. ఉరి శిక్ష తప్పించుకుని కేశర్‌లాల్ నేపాల్‌లో ఆశ్రయం పొందాడని తెల్సింది. నేను నేపాల్ వెళ్ళాను. కేశరిలాల్ నేపాల్ వదిలి వెళ్ళిపోయాడని, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదని తెల్సుకున్నాను. నేపాల్‌లో మనుషుల పద్ధతులు నాకు నచ్చలేదు. నా పవిత్రతను కాపాడుకుంటూ తిరిగి ప్రయాణం ఆరంభించాను. నా పడవ దాదాపు ఒడ్డుకు వచ్చేసిందని నా జీవిత లక్ష్యం చేరుకోవడానికి ఇంకా ఎంతో దూరం లేదని అనిపించేది. ఇల్లు వదిలిన ముప్ఫయి ఎనిమిది సంవత్సరాల తర్వాత డార్జిలింగ్‌కు వచ్చాను. ఒక్క క్షణం ఆగి అంది ఆమె ‘ఇవ్వాళ ఉదయం కేశర్‌లాల్‌ను చూశాను’.
‘ఎవరినీ?’ నమ్మలేక అడిగాను నేను. నవాబు కూతురు చెప్పింది ‘వయస్సు మళ్ళిన కేశర్‌లాల్‌ను డార్జిలింగ్ సరిహద్దుల్లో ఉన్న భూటాన్ గ్రామంలో భూటానీ భార్యతో ఆమె వల్ల కలిగిన మనవలు మనవరాళ్ళతో ఒక మురికి ఇంటి ముందు మొక్కజొన్న గింజలు ఏరుతుంటే చూశాను’
ఆమె కథ ముగించింది. నేను సానుభూతి వ్యక్తం చేద్దామనుకున్నా, ‘ముప్పయి ఎనిమిదేళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అపరిచితుల మధ్య బతికితే ఎవరైనా తమ మతాన్ని ఆచరణను మరిచిపోతారు’ అన్నాను.
‘ఆ సంగతి నాకర్థం కాలేదు అనుకోకు. సుదీర్ఘ కాల కష్టాలు ఎదుర్కొన్న దాన్ని. ప్రమాదాలు అవమానాలు ఎదుర్కొన్న దాన్ని. నా యువ హృదయాన్ని దొంగిలించిన బ్రాహ్మణీకం కేవలం ఆచారం మూఢ విశ్వాసం అనుకోలేదు. నేను అది ఒక ధర్మం అని భావించాను. అనంతమైనదని శాశ్వతమైనదని అనుకున్నాను. కేశర్‌లాల్ చేత తిరస్కరించబడి అవమానించబడిన ఆ రాత్రి. ఆయన నా పట్ల చూపిన ప్రవర్తనను ఒక గురువు నేర్పిన తొలి పాఠంగా భావించి రెట్టించిన ఆరాధనా భావంతో ఆయన అన్వేషణ కొనసాగించాను. అయ్యో బ్రాహ్మడా నువ్వు నీ అలవాట్లను ఆచరణలను అన్నింటినీ మరొక జీవన విధానంలో పూర్తిగా మార్చుకున్నావు. మరి నేను నా జీవితాన్ని యవ్వనాన్ని ఆత్మను త్యాగం చేశానే. వాటిని తిరిగి ఎలా పొందగలను?’ అంటూ ఆ స్త్రీ లేచి నిలబడి ‘బాబూ సాహెబ్’ వీడ్కోలు అంది. నేను ఏమీ అనక ముందే గాలిలో తేలి ఆకాశంలోని మబ్బుల్లో కల్సిపోయింది.
నేను కళ్ళు మూసుకున్నా. ఆమె చెప్పిందంతా మరొక్కసారి కళ్ళ ముందు కదలాడిరది. ఒక పదహారేళ్ళ అమ్మాయి, నవాబు కుమార్తె గదిలో తివాచీ మీద కూచుని కిటికీలోనుంచి యమున వైపు చూస్తున్నది. ఒక సాయంత్రపు వేళ ఒక యోగిని భక్తి పారవశ్యంలో కనిపించింది. ఒక వృద్ధ మహిళ డార్జిలింగ్ లోని కలకత్తా రోడ్డు పక్కన బండరాయి మీద కూచుని కనిపించింది. నా హృదయం ముక్కలైంది.
నేను కళ్ళు తెరిచాను. మబ్బులు తొలిగిపోయేయి. సూర్యకాంతిలో ఆకాశం నిర్మలంగా వుంది. నేను లేచి నిలబడ్డాను. మేఘాలు కమ్మిన తుఫాను వాతావరణంలో నేను విన్న కథను ఇప్పుడు సూర్యకాంతిలో నమ్మలేకుండా ఉన్నా ను. ఇదంతా సిగరెట్టు పొగ మేఘాల్లో నా ఊహాచిత్రం. ఆ ముస్లిం స్త్రీ ఆ హిందూ నాయకుడు, యమునా నది ఒడ్డున ఆ కోట బహుశా ఏవీ నిజమైనవి కావేమో!