నిశీధి

by Sudharshan Chintapatla

అర్ధరాత్రి.
డాక్టర్.. డాక్టర్..
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
నేను కళ్ళు తెరిచి స్థానిక జమీందారు దక్షిణాచారణ్ బాబును చూశాను. లేచి నిలబడి చేతులు విరిగిన కుర్చీలో ఆయనను కూర్చోబెట్టి గాభరాగా ఆయన ముఖం లోకి చూశాను. గడియారం రెండున్నర గంటల సమయం చూపింది. ఆయన ముఖం పాలి పోయి ఉంది. సూటిగా నన్ను చూస్తూ” మళ్లీ అదే సమస్య మీ మందు పనిచేయలేదు” అన్నాడు.” బహుశా మీరు మద్యం సేవించి ఉంటారు అందువల్లనేమో”
అన్నాను జంకుతూ. ఆయన ముఖం ఎర్రబడింది
” కాదు కాదు తాగడం వల్ల కాదు కథ మొత్తం మొదటి నుంచి చివరి దాకా  చెప్తే కానీ కారణం ఏమిటో నీకు అర్థం కాదు” అన్నాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం వత్తిని ఇంకొంచెం పైకి జరిపాను. అది వెలుతురుని కొంచెం పెంచింది.  ధోవతి బిగించి దినపత్రికల కట్ట ఉన్న అట్ట పెట్టె మీద కూర్చున్నాను.
దక్షిణాచారణ్ బాబు మొదలుపెట్టాడు. నా మొదటి భార్య లాంటి ఉత్తమ ఇల్లాలు చాలా అరుదుగా కనిపిస్తుంది. నేను మంచి వయసులో ఉన్నాను  కవిత్వం మోజులో ఉండటంవల్ల కల్తీ లేని స్వచ్ఛమైన ఇల్లాలు నాకు పెద్దగా నచ్చేది కాదు. ఆమె ముందు నేను ఒక ప్రేమికుడులా ప్రవర్తిస్తే పగలబడి  నవ్వేది. గంగానది బురదలో చిక్కుకున్న ఇంద్రుడి ఐరావతం లా గిజగిజలాడేవాణ్ణి . ముత్యాల్లాంటి పదాలను కూర్చి ఎంత ప్రియమైన మాటలు చెప్పినా ఆమె ఒకే ఒక్క నవ్వుతో ఊడ్చి పారేసేది.
నాలుగు సంవత్సరాల జీవితం గడిచింది. నేను జబ్బు పడ్డాను. జ్వరం తీవ్రమై సంధి ప్రేలాపనదాకా వచ్చింది. నేను బతుకుతానని ఎవరూ అనుకోలేదు. డాక్టర్ కూడా లాభం లేదన్నాడు. ఆ సమయాన మా బంధువు ఒకడు ఎక్కడి నుంచో ఒక సన్యాసిని మా ఇంటికి తీసుకు వచ్చాడు. ఆయన ఒక మూలికను నేతిలో ముంచి నా చేత తినిపించాడు. మందు ప్రభావం వల్లో ఆయుష్షు తీరకపోవడం వల్లో బ్రతికి బయట పడ్డాను.
నేను జబ్బుతో ఉన్నప్పుడు  నా భార్య తీరిక లేకుండా గడిపింది. ఆరోజుల్లో యమదూతలు మా ఇంటి ముందు గుంపు గా ఉండేవారు. ఒక అబల అయి ఉండి ఆమె కేవలం మానవ శక్తితో నా మీద ప్రేమతో నా పనికి మాలిన ప్రాణాలు నిలబెట్టటానికి వారు లోపలికి రాకుండా నిరంతరం పోరాడింది.   ఒక చిన్న పిల్లాడిని సంరక్షించినట్టు నన్ను రక్షించింది.  తిండి తినలేదు నిద్ర పోలేదు. ప్రపంచంలో నన్ను కాపాడుకోవడంతప్ప మరో ధ్యాస లేదు.
విజయం సాధించి తృప్తిచెందిన పులిలా మ్రృత్యువు
నోటకరిచిన నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ పోతూ పోతూ అది నా భార్యని పంజాతో బలంగా కొట్టి పోయింది. అప్పుడు ఆమె గర్భవతి. ప్రసవ సమయంలో ఒక మృత శిశువును కన్నది. ఆ తర్వాత రకరకాల జబ్బులు ఆమెను పీడించడం మొదలుపెట్టాయి. నేను ఆమె బాగోగులు చూసుకోవలసి రావడం ఆమెకు ఇబ్బంది కలిగించింది ‘ఏం చేస్తున్నారు అందరూ ఏమనుకుంటారు’ అనేది ‘మగవారు మీరు నాకు సేవలు చేయడం తప్పు’ అనేది. బారానగర్ లో మా ఇంటి ముంగిట ఇంటికి గంగానదికి మధ్య ఒక తోట ఉండేది. ఇంటికి దక్షిణం వైపు ఉన్న పడక గది పక్కన చిన్న స్థలంలో ఆమె గోరింట పొదలు పెంచింది. తోట లో  గులాబీ, మల్లె, రజనీగంధ మొక్కలు ఉండేవి. ఒక పెద్ద పొగడ వృక్షం ఉండేది. దాని చుట్టూ పాల రాతి అరుగు ఉండేది. నా భార్య రోజుకు రెండు సార్లు ఆ చెట్టు కింద  శుభ్రం చేసేది .తన పనులన్నీ పూర్తయ్యాక అక్కడ కూర్చుని గంగా నదిలో కదిలే కంపెనీ పడవలను చూస్తుండేది.
మంచానికే పరిమితం అయిపోయిన చాలా రోజుల తర్వాత  చైత్రమాసంలో వెన్నెల కురుస్తున్న ఒక సాయం సమయంలో హఠాత్తుగా ఆమె నాతో ‘ఇలా లోపలే ఉండి ఉండి విసుగొస్తుంది ఇవాళ తోటలో కాసేపు కూర్చో వాలనిపిస్తున్నది’ అంది. నేను నెమ్మదిగా జాగ్రత్తగా ఆమెను తీసుకు వెళ్లి పొగడ వృక్షం కింది అరుగుమీద పడుకోబెట్టాను. నా తొడ మీద ఆమె తల పెట్టుకుంటే సంతోష పడేవాడిని. కానీ ఆమెకు  వింత గా అనిపిస్తుందని లోపలనుంచి  ఒక దిండు తెచ్చాను. వీచే గాలికి ఉండి ఉండి ఒకటీ రెండు  పొగడ పుష్పాలు పైనుంచి కిందికి రాలుతున్నాయి. కొమ్మల మధ్య నుంచి వెన్నెల నీడలు ఆమె ముఖం మీద పడుతున్నవి.చుట్టూ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. సువాసన నిండిన నీడ లో ఆమె పక్కన కూర్చుని నేను ఆమె ముఖంలోకి చూశాను. నా కళ్ళ నుంచి కన్నీళ్లు రాలాయి. ఆమెకు దగ్గరగా జరిగి సన్నబడిన ఆమె వేడి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అభ్యంతరం చెప్పలేదు. కాసేపు నిశ్శబ్దంగా గడిచాక అన్నాను’ నీ ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని. వెంటనే ఆ మాట అని ఉండాల్సింది కాదని నాకు అర్థమైంది. నా భార్య నవ్వింది. ఆ నవ్వులో ఆనందం ఉంది. ఆ నవ్వులో నమ్రత ఉంది. ఆ నవ్వులో కొంత ఆసక్తి కొంత ఎగతాళి కూడా ఉన్నాయి. ఒక్క మాట మాట్లాడలేదు. నవ్వింది .నన్ను ఎప్పటికీ మర్చిపోవా  అది అసాధ్యం అలా అని నేను అడగను’ అనే అర్థం  ఉంది ఆ నవ్వులో. తీయగా గుచ్చుకునే ఈ నవ్వుకు భయపడే నేను నా భార్యతో ప్రేమకు సంబంధించిన మధురమైన మాటలు మాట్లాడే వాడిని కాదు. అచ్చులో ఎంతో అందంగా కనిపించే మాటలు కన్నీరు కార్పించే మాటలు ఆమెకు ఎందుకు హాస్యాస్పదంగా కనిపించేవో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాదించడానికి మాటలు అవసరం కానీ నవ్వును ఏ వాదనతో ఎదుర్కొంటాం మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేం.వెన్నెలకాంతి పెరిగింది.  ఎక్కడి నుంచో కోయిల అసహనంగా మళ్లీ మళ్లీ కూస్తున్నది. ఇలాంటి వెన్నెల రాత్రి కూడా ఆడ కోయిల చెవులు వినిపించడం లేదా  అని నాకు ఆశ్చర్యం కలిగింది.
ఎన్ని రకాల మందులు వాడినా నా నా భార్య ఆరోగ్యం కుదుట పడలేదు. డాక్టర్ సలహా తో గాలి మార్పు కోసం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్ళాను. దక్షిణాచారణ్ హఠాత్తుగా చెప్పటం ఆపి రెండు చేతుల మధ్య తల పెట్టుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు. గూట్లో ఉన్న గుడ్డి దీపం మసకబారింది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో దోమల రొద స్పష్టంగా వినిపించింది. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఆయన మళ్లీ చెప్పసాగాడు. అలహాబాదులో డాక్టర్ హరన్ గారు  నా భార్యకు చికిత్స చేసేవారు. ఆయన అన్ని విధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యం బాగుపడదని మిగిలిన జీవితమంతా ఇలాగే ఉండిపోతుందని చెప్పాడు. ఒక రోజు ఆమె నాతో  ‘ఇక నేను కోలుకునేది లేదు నేను  అలాగని తొందరగా నాకు చావూ వచ్చేట్టు లేదు. మీరు ఎందుకు ఒక జీవచ్ఛవం తో బ్రతుకు గడపాలి మళ్లీ పెళ్లి చేసుకోండి’ అంది. మా సమస్యకు ఇదే పరిష్కారమని ఆమె భావించింది. నవ్వడం లో ఆమెకు ఉన్న ప్రతిభ నాకు లేకపోయినా ఇప్పుడు నాకూ నవ్వే అవకాశం వచ్చింది. ఒక నవలలోని కథానాయకుడిలా గంభీరంగా రాజసంగా అన్నాను.’ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు…’ ‘చెప్పండి చెప్పండి నన్ను మధ్యలోనే ఆపి’ ఆపకండి మీరు ఇలా మాట్లాడటం చాలు నన్ను చంపేయడానికి’ అంది. నేను కొనసాగించాను.’ నిన్ను తప్ప ఇంకెవరినీ ప్రేమించలేను’ ఆమె బిగ్గరగా నవ్వడం తో ఆపక తప్పలేదు. బాగుపడుతుందని నమ్మకం లేని దానికి సేవలు చేసి  అలసిపోయాను అని జీవితమంతా ఇలాగే నిస్పౄహలోనే గడపాలాఅని, వయసులో ఉన్న వాడికి అవసరమైన అందం ఆనందం ఆకర్షణ ప్రేమ అనేవి ఇప్పుడు కనబడటం లేదని, నా ముందు  ఒక  ఎండమావి ఒక బీడు భూమి ఒక ఎడారి కనిపిస్తున్నదని నేను అనుకుంటున్నానని పసిగట్టిందేమో  నా భార్య.ఒక చిన్న పిల్లవాడు మొదటి వాచకంలో విడి విడి అక్షరాలను చదివినట్టుగా నన్ను చదివేయ గలదు. అందువల్ల నేను శృంగార నాయకుడిలా కవితా వాక్యాలు చెప్పినప్పుడు ఆమె నిస్సహాయంగా నవ్వేసేది. ఆమె నా అంతరంగంలోని ఆలోచనలను పసిగట్టడం తలుచుకుంటే ఇప్పటికీ నాకు అవమానంతో చచ్చిపోవాలని  అనిపిస్తుంది.
డాక్టర్ హరన్  మాకులస్థుడే. అప్పుడప్పుడు నన్ను తన ఇంటికి రమ్మని పిలిచే వాడు. ఒకనాడు తన కూతురును పరిచయం చేశాడు. పదిహేనేళ్ల వయసులో ఉన్న యువతి ఆమె. డాక్టర్ తనకు నచ్చిన వరుడు దొరకలేదని ఆమెకు ఇంకా పెళ్లి చేయలేదు. ఆమె అందంగా ఉండడమే కాక చాలా ప్రతిభావంతంగా మాట్లాడేది. ఇద్దరం అనేక విషయాలు చర్చించుకునే వాళ్ళం. మాటల్లో పడి నేను భార్యకు సేవ చేయాల్సిన సమయం దాటిపోయాక ఇంటికి వచ్చేవాణ్ణి. నేను డాక్టర్ ఇంటికి వెళ్లి వస్తున్న సంగతి ఆమెకు తెలుసు. కానీ ఎన్నడూ ఆలస్యానికి కారణం అడగలేదు. ఎడారిలో ఒక కొత్త ఎండమావిని చూడటం మొదలు పెట్టాను. దాహంతో తపించి పోతున్న నాకు ఇసుక లో గల గల పారే నీరు కనిపించింది. దాని నుంచి మనసు మరలించలేక పోయాను.  నా భార్య గదికి వెళ్లాలని నాకు అనిపించకపోవడంతో ఆమెకు సేవ చేయడం మందులు అందించడం క్రమం తప్పాయి
. డాక్టర్ హరన్ నయంకాని జబ్బు ఉన్నవారు మరణించడమే మంచిది. వారికీ సుఖము ఉండదు ఇతరులకూ ఉండదు అంటూ ఉండేవాడు .ఆయన నా భార్య గురించి ఇలాంటి మాటలు అంటున్నాడని నేను అనుకోలేదు. ఇది లోకంలో సర్వసాధారణమైన విషయమే కదా అనుకునేవాణ్ణి .మానవుల మరణం డాక్టర్లకు పెద్దగా విచారాన్ని కలిగించదు అనుకుంటా వారికి మానవుల అనుభూతులు అర్థం కావు. ఒకనాడు పక్కగదిలో ఉన్న నా భార్య డాక్టర్ తో అన్న మాటలు వినబడ్డాయి ‘ఎందుకు డాక్టర్ నా చేత ఇలా మందులు తినిపించి మీ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు జీవితం దుర్భరం అయిపోయింది ఏదైనా ఇచ్చి నాకు విముక్తి కలిగించండి’ ఆమె మాటలకు డాక్టర్ ‘వద్దు వద్దు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు’ అని సమాధానం చెప్పి వెళ్లిపోయాడు. నా మనసు  బాధతో విల విల లాడి ఆమె గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆమె నుదుటి మీద చేత్తో రాస్తూ ‘ ఈ గదిలో చాలా వేడిగా ఉంది కదా!’ అన్నాను ‘మీకు వాకింగ్ టైం అయింది వెళ్ళండి వెళ్లకపోతే సాయంత్రం మీకు ఆకలి వేయదు’ అంది. వాకింగ్ కు వెళ్ళడం అంటే డాక్టర్ ఇంటికి వెళ్లడమే. నాకు ఆకలి వేయడానికి ఇలా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆమెకు నేనే చెప్పాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆమె నా మోసాన్ని కనిపెట్టి ఉండాలి. నేనొక తెలివి తక్కువ వాణ్ణి కనుక ఆమెను కూడా తెలివి తక్కువదనే  అనుకున్నాను. దక్షిణాచరణ్ మళ్ళీ చేతుల మధ్య తల పెట్టుకుని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి  అని తాగి  కొనసాగించాడు. ఒకసారి డాక్టర్ కూతురు  మనోరమ నా భార్య ని చూడాలని ఉంది అని అడిగింది నేను అందుకు ఏమాత్రం సిద్ధంగా లేను కానీ వద్దు అనడానికి కారణం ఏమీ లేదు కదా! ఆ సాయంత్రం నాతో పాటు మనోరమ మా ఇంటికి వచ్చింది నా భార్య ఎప్పటికంటే ఎక్కువగా నొప్పితో బాధపడుతున్నది. నొప్పి బాగా ఎక్కువ అయినప్పుడు ఆమె పిడికిళ్ళు బిగించేది. ముఖం నీలి రంగులోకి మారేది. ఆమె కళ్ళకి వెలుతురు గుచ్చుకుంటుందని  దీపం ఎప్పుడూ గది తలుపు దగ్గరే ఉంచేది. చీకట్లో ఆమె బాధతో మూలుగుతూ ఉన్నది.  భారమైన మూలుగు బయటకి వినిపిస్తున్నది. నేను  గదిలోకి వెళ్ళాను. గది ముందు నిలబడింది మనోరమ.దీపపు వెలుతురు ఆమె ముఖం మీద పడింది. ఆమె చీకటీ వెలుతుర్ల మధ్య తటపటాయిస్తూ నిలబడింది. ఎవరో కొత్తమనిషి కనపడటంతో నా భార్య కదిలి నా చెయ్యి గట్టిగా పట్టుకుని బలహీనమైన స్వరంతో ‘ ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?’ అని అడిగింది మూర్ఖుడిలా నేను మొదట నాకు తెలియదు అనాలి అనుకున్నా కానీ ఎవరో కొరడాతో వీపు మీద కొట్టినట్లు అనిపించింది.’ ఆమె .. ఆమె డాక్టర్ గారి కూతురు’ అన్నాను. నా భార్య నా వైపు సూటిగా చూసింది నేను ఆమె వైపు చూడలేకపోయాను ఆమె మనోరమను లోపలికి రా అంది. నన్ను దీపం పైకెత్తి పట్టుకో  అంది. మనోరమ లోపలికి వచ్చి కింద కూర్చుని నా భార్యతో కాసేపు మాట్లాడింది. అప్పుడు వచ్చాడు డాక్టర్ రెండు రకాల సీసాలతో. ‘ఈ నీలం రంగు సీసాలోని లోషన్ ను వంటికి రాసుకోవాలి మరో సీసాలోని మందు తాగాలి జాగ్రత్త ఒంటికి రాసుకునే మందు విషపూరితమైనది ఒక దాని బదులు మరొకటి వాడకూడదు.’ అన్నాడు. నన్ను  కూడా ఈ విషయం గురించి హెచ్చరించి సీసాలు మంచం పక్కనే ఉన్న బల్ల మీద పెట్టాడు. తర్వాత సెలవు తీసుకుంటూ కూతుర్ని కూడా రమ్మన్నాడు. ఆమె ‘నాన్నగారూ!  ఈమెకు సేవ చేయడానికి మరో ఆడమనిషి లేదు కదా’ అంది. ‘వద్దు వద్దు నువ్వేమి ఇబ్బంది పడవద్దు మాకు ఒక వృద్ధురాలైన సేవకురాలు ఉంది ఆమె నన్ను తల్లిలా చూసుకుంటుంది’ అన్నది నా భార్య. ‘నీ భార్య ఎంత మంచిది ఇతరులకు సేవ చేయాలని అనుకుంటుంది కానీ తనకు ఎవరూ సేవచేయడానికి ఒప్పుకోదు.’ అన్నాడు డాక్టర్ నవ్వుతూ. డాక్టర్ కూతురుతో వెళ్ళిపోతుంటే ‘మా ఆయన ఈ గదిలో చాలా సేపటినుంచి ఉన్నారు ఆయనను మీతో పాటు తీసుకు వెళ్ళండి’ అని అంది. ‘ రండి
మాతోపాటు  అలా నది ఒడ్డుకు వెళ్లి వద్దాం’ అన్నాడు డాక్టర్. నేను ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.    మేము వెళ్తుంటే డాక్టర్ ఆ రెండు మందుసీసాల విషయం మళ్లీ హెచ్చరించాడు. డాక్టర్ ఇంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికి చాలా రాత్రయింది నేను వచ్చేటప్పటికి నా భార్య మంచం మీద బాధతో మెలికలు తిరుగుతున్నది. తప్పు చేశాననే భావన నన్ను కత్తిలా గుచ్చుకుంది. మంచం పక్కనే నిలబడి’ నొప్పి చాలా ఎక్కువగా ఉందా?’ అని అడిగాను. ఆమె ఉలుకూ పలుకూ లేకుండా నా వైపు సూటిగా చూసింది. జవాబు చెప్పడానికి ఊపిరి ఆడలేదు. నేను వెళ్లి డాక్టర్ను తీసుకు వచ్చాను ఏం జరిగిందో డాక్టర్ కు అర్థం కాలేదు. తర్వాత ఏదో స్ఫురించి ఒక సీసాను చూపిస్తూ
‘ పొరపాటున ఈ సీసాలోని మందు తాగావా?’ అని అడిగాడు. ఆమె మాట్లాడకుండా అవును అన్నట్టు తల ఊపింది. కడుపులో వేసే  పైపు తీసుకురావడానికి డాక్టర్ ఇంటికి పరుగెత్తాడు. నేను స్ఫృహలో ఉన్నానో లేదో తెలియకుండా మంచం మీద పడిపోయాను. ఒక చిన్న పిల్లవాడి తలలా నా తలను తన పక్షం మీదకు తీసుకుని ఏదో చెప్పాలనుకుంది కానీ నోరు పెగల్లేదు. బాధపడకండి ఇది మన మంచికే! మీరు సంతోషంగా ఉంటారు నేనూ సంతోషంగా వెళ్లి పోతాను అని ఆమె చేతి స్పర్శ నాకు చెప్పింది.
డాక్టర్ తిరిగి వచ్చేటప్పటికి నా భార్యకు ఎన్నాళ్ల నుంచో అనుభవించిన హింస నుంచి విముక్తి లభించింది.
గదిలో ఉక్కపోతగా ఉందని  దక్షిణాచరణ్ వరండా లోకి వెళ్లి నాలుగైదు సార్లు అటూ ఇటూ పచార్లు చేసి వచ్చి మరో గ్లాసు నీళ్లు తాగి మళ్లీ చెప్పసాగాడు. నేను మనోరమను పెళ్లి చేసుకుని బెంగాల్ కు తిరిగి వచ్చాను. తండ్రి అనుమతితో పెళ్లి చేసుకుంది కానీ నేను ఆమె తో ప్రేమగా మాట్లాడినప్పుడల్లా చిరు నవ్వు కూడా నవ్వకుండా గంభీరంగా ఉండేది. బహుశా ఆమె నన్ను అపార్థం చేసుకుందేమో అనుకున్నా. నేను ఆశించినట్టుగా ఆమె ప్రవర్తన లేకపోవడంతో నా తాగుడు హద్దులు దాటిపోయింది.
అది శరదృతువు. సాయంత్రం వేళ బారానగర్ లోని మా తోటలో మనోరమ తో కలిసి నడుస్తున్నాను. చీకటి ఎందుకో భయం కలిగించేదిగా ఉంది. దారికి రెండు పక్కలా ఉన్న పొదలు  ఒకదానికొకటి తాకుతున్న శబ్దం తప్ప గూళ్ళల్లో పక్షుల రెక్కల చప్పుడు కూడా వినిపించనంత నిశ్శబ్దంగా ఉంది.   అలసిపోయిన మనోరమ పొగడ వృక్షం కింద పాలరాతి అరుగుమీద మోచేతిపై తలపెట్టి పడుకుంది. నేను ఆమె పక్కనే కూర్చున్నా. అక్కడ చీకటి ఇంకా చిక్కగా ఉంది. చెట్టు కొమ్మల మధ్య నుంచి అక్కడక్కడ ముక్కలుగా కనిపిస్తున్న ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటున్నవి. కీచురాళ్ళు ఆకాశం నుంచి కిందకు జారిన నిశ్శబ్దమనే చీరకు శబ్దం అనే సన్నటి  అంచును కుడుతున్నవి. నేను ఆ మధ్యాహ్నం అంతా తాగుతూనే ఉండడంవల్ల నా మెదడు మొద్దుబారి పోయింది. నామీద నాకే జాలి కలుగుతున్న మానసిక స్థితి లో ఉన్నాను. నా కళ్ళను ఒత్తిపట్టి ఉంచుతున్న చీకటిని  పక్కకునెట్టి చూస్తే నీడలా కనిపిస్తున్న నా భార్య దేహం నాలో బలమైన కోరికను కలిగించింది. కానీ నీడలా కనిపిస్తున్న్త ఆమెను  నా చేతులతో చుట్టేయడం సాధ్యం కాలేదు. హఠాత్తుగా దగ్గరలో ఉన్న పొదలో మంటలు అంటుకున్నట్టు అనిపించింది. పసుపు చంద్రవంక ఆకాశంలోకి మెల్ల మెల్లగా వచ్చి   తెల్లటి అరుగు మీద తెల్లటి చీరలో ఉన్న స్త్రీ ముఖాన్ని వెలిగించింది. ఆ ముఖం నీరసంగా తెల్లగా పాలి పోయి ఉంది. నేను ఆగలేక ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ‘మనోరమా చెప్తే నమ్మవు కానీ నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను .నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాను. నా మాటలు నాకే భయం కలిగించాయి ఇవే మాటలు ఒకప్పుడు నేను మరొకరితో అన్నాను ఆ క్షణంలో పొగడ వృక్షం పైనుంచి  ఆ పక్కన ఉన్న పొదల మీదినుంచి  కోసిన పండు ముక్క లాంటి పసుపురంగు చంద్రుడి నుంచి,  గంగానది తూర్పు వైపు నుంచి పడమర వరకు ఒక నవ్వు అతి వేగంగా దొర్లుతూ వెళ్ళింది. ఆ నవ్వును నేను వర్ణించలేను.  అది హృదయవిదారకంగా ఉంది. అది ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నట్టనిపించింది. నేను అరుగు మీద నుంచి కింద పడి  స్పృహ తప్పాను.
మెలకువ వచ్చాక చూస్తే ఇంట్లో నా మంచం మీద పడి ఉన్నాను. మనోరమ ‘ఏమైంది ఎందుకలా పడిపోయారు’ అంది. ‘నీకు వినబడలేదా ఆ నవ్వు ఆకాశమంతా వ్యాపించిన ఆ నవ్వు’ అన్నా.  ‘నవ్వా? దాన్ని  నవ్వు అంటారా? ఒక పెద్ద పక్షుల గుంపు మనపై నుంచి వేగంగా ఎగిరిపోయింది నేను వాటి రెక్కల చప్పుడు విన్నాను అంతమాత్రానికే మీరు భయపడ్డారా?’ అంది నవ్వుతూ. ఉదయం   నది ఒడ్డుకు ఉత్తరం వైపునుంచి ఆహారం కోసం ఒక పక్షుల గుంపు వచ్చిందని నాకు అర్థమైంది. కానీ సాయంత్రం అవుతుంటే నేను చూసింది ఎగిరే పక్షుల గుంపు కాదని అనిపించసాగింది. గుండె కోసే ఆ నవ్వు చీకటి పడటం కోసం వేచి ఉన్నట్టు అనిపించేది. అవకాశం దొరికీ దొరకడంతో అది విరుచుకుపడుతుంది అనిపించేది. సాయంత్రం అవుతుంది అనగానే భయం శరీరాన్ని వణికించేది. ఆ సమయంలో మనోరమ తో మాట్లాడటానికి కూడా భయం వేసేది.ఇక అక్కడ ఉండాలనిపించలేదు.  మనోరమను బారానగర్ నుంచి దూరంగా పడవలో తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాను. నది నుంచి వీచే చల్లని గాలుల్లో  పడవ సాగుతుంటే నా భయం క్రమంగా తగ్గి పోసాగింది.
కొన్ని రోజుల వరకు మేము సంతోషంగానే ఉన్నాం మేము గంగను ఖారిని దాటి పద్మా నది కి చేరాం. అద్భుతమైన ఆ నది ఉత్తరాన కుబుసం కప్పుకొన్న నాగులా తన శీతాకాలపు నిద్రను ఆరంభించి  ఇసుక తిన్నెల నుంచి  క్షితిజరేఖ వైపు విస్తరించి నిశ్చలనంగా మసకమసకగా  ఉన్నది. అలాగే నిటారుగా ఉన్న దక్షిణపు ఒడ్డునుంచి గ్రామాలలోకి ఉగ్రరూపంతో విరుచుకు పడుతున్నది. మామిడి తోటలు కంపిస్తున్నవి. వరదలు గ్రామాలను ముంచెత్తున్నవి.ఒకవైపు నిద్రమత్తులో ఉన్నట్టున్న పద్మ మరొకవైపు ఒడ్డును విసిరి కొడుతూ కోస్తూ విరిగిపోతున్నది.
మేం పడవను ఒకచోట కట్టేశాం. తర్వాత పడవ నుంచి చాలా దూరం  నడిచి వెళ్ళాం.  సూర్యాస్తమయపు బంగారు నీడలు కనిపించకుండా పోయాక మా కళ్ళ ఎదుట ఒక స్పష్టమైన పూర్ణ చంద్రబింబం ఉదయించింది. కట్టలు తెంచుకున్న  వెన్నెల వరద ఆకాశం భూమి కలిసే చోటు వరకు వ్యాపించింది. విశాలమైన తెల్లటి ఇసుక లో నాకు మేమిద్దరమే ఒక స్వప్న లోకంలో విహరిస్తున్నా మనిపించింది.  మనోరమ ముఖానికి చుట్టు కున్న ఎర్రని శాలువా ఆమె తల మీద నుంచి కిందకు జారి ఆమె శరీరం మొత్తాన్ని  కప్పేసింది. చిక్కని నిశ్శబ్దం లో దారి ఎటు నుంచో ఎటో తెలియని తెల్లదనంలో  కనుచూపుమేరా వ్యాపించిన శూన్య ప్రదేశంలో మనోరమ తన చేతిని బయటకు తీసి నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె నాకు బాగా దగ్గరగా జరిగి తన మనస్సు మొత్తం శరీరం యవ్వనము అన్ని నావే నంది. నా హృదయపు వేగం పెరిగింది. ప్రేమ అనేది ఇంటి నాలుగు గోడల మధ్య పరిపూర్ణం కాదు అనిపించింది. ఇలాంటి విశాలమైన చోట అనంతంగా దిగంబరంగా ఉన్న వినీలాకాశం తప్ప ప్రేమకు అనువైన చోటు లేదు అనుకున్నాను. ఇల్లు లేదు తలుపులు లేవు తిరిగి వెళ్లాలనే తొందర లేదు ఈ వెన్నెల వెలిగించిన విశాలమైన ప్రదేశంలో చేతిలో చేయి వేసుకుని ఎక్కడికి పోతున్నామో తెలియకుండా విహరించడమే ప్రేమ అనిపించింది.
ఇద్దరం  నడుస్తూ ఇసుక మధ్యలో ఉన్న నీటి కొలను వద్దకు వెళ్లాం.పద్మ తన దారి మార్చుకుంది అందువల్ల ఇలా వచ్చి ఇక్కడ ఇసుక లో చిక్కుకుంది. నిద్రపోతున్న ఎడారిలో అలలు లేని ఈ కొలనులో ఒక పొడవైన చంద్రరేఖ మూర్ఛపోయినట్టు పడుకుంది. మనోరమ నా వైపు చూసింది. ఆమె శాలువా జారిపోయింది. ప్రకాశిస్తున్న వెన్నెల వెలుతురు లో ఆమె తన ముఖం పైకెత్తింది. ఆ శూన్య ప్రదేశంలో ఒక్కసారిగా ఒక శబ్దం ప్రతిధ్వనించింది.  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అన్న మాటలు మూడుసార్లు గాలిలో ప్రకంపనలు రేపాయి. నేను భయంతో అడుగుల వేగం పెంచాను.  మనోరమ కూడా భయపడ్డది.తర్వాత మాకు అర్థమైంది అది మానవ స్వరం కాదని అతీంద్రియ ధ్వనికూడా కాదని అది   మా అలికిడికి నీటి ఒడ్డున ఇసకలో పక్షుల రెక్కల చప్పుడని.  భయంతో వణుకుతూ మేం మా పడవ  వైపు పరిగెత్తి వెళ్లి మా పడకల మీదికి చేరుకున్నాం. బాగా అలసిపోయి ఉన్న మనోరమ వెంటనే నిద్ర లోకి జారుకుంది. కానీ ఆ చీకట్లో ఎవరో వచ్చి నా పక్కనే నిలబడ్డారు. ఆ ఆకారం పొడవైన సన్నని ఎముక వేలుతో మనోరమను చూపుతూ నా చెవిలో స్పష్టంగా  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు?  అన్నది. నేను లేచి  దీపం వెలిగిద్దామని  అగ్గిపుల్ల గీశాను.ఒక భయంకరమైన తుఫాను  శబ్దం లాంటి నవ్వు వినిపించింది. ఆ నీడ లాంటి ఆకారం మాయమైంది. ఆ నవ్వు నా దోమతెరను మొత్తం పడవను సుడిగాలితో ఊపేసింది. చెమటతో తడిసిన నా శరీరంలోని రక్తాన్ని మంచుగడ్డ గా మార్చి ఆ చీకటి రాత్రి లో కలిసి పోయింది. అది పద్మను దాటి ఇసుక తిన్నెలను దాటి నిద్రిస్తున్న పొలాలను గ్రామాలను పట్టణాలను దేశాలను ప్రజలను దాటి క్రమక్రమంగా అస్పష్టమై పోయింది. ఆ నవ్వు ఊహకు అందనంత దూరానికి చేరి చివరికి జననమరణాల పొలిమేరను కూడా దాటి పోయింది.

నేను  దీపం ఆర్పేస్తే తప్ప నిద్రపోలేనని అనుకున్నాను. దీపం ఆర్పేసి పడుకున్నాను. చీకట్లో ఆ ధ్వని మళ్ళీ నా పక్కకు వచ్చి నా చెవి దగ్గర నా గుండెలోని రక్తపు లయను అనుసరిస్తూ  ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? అంది. ఆ చీకటి రాత్రి నిశ్శబ్దంగా ఉన్న పడవలో  నా ఎదురుగా ఉన్న గుండ్రటి గడియారానికి  కూడా ప్రాణం వచ్చి దాని చేతులను మనోరమ వైపు చాచ సాగింది. గడియారపు టిక్కు టిక్కుమనే ధ్వని ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరులా వినిపించింది.
మాట్లాడుతున్న దక్షిణాచరణ్ బాబు పసుపురంగులోకి మారాడు. నేను అతనిని కొంచెం నీళ్లు తాగండి అన్నాను కుదుపుతూ. గుడ్డి దీపం ఆరిపోయింది. బయట సన్నటి వెలుతురు జాడ కనిపించింది.  కాకులు కావు కావు మంటున్నయి.  పక్షులు ఈలలు వేస్తున్నాయి.   మా ఇంటి ఎదురుగా ఉన్న బాటమీద  ఓ ఎద్దు బండి నేలను రాసుకుంటూ పోతున్న శబ్దం వినిపిస్తున్నది. దక్షిణాచరణ్ ముఖంలో భావాలు మారాయి రాత్రి చేసిన చేతబడి కారణంగానూ తెలిసీ తెలియని స్థితిలోనూ ఇదంతా నాకు చెప్పడం అవమానంగా భావించినట్టున్నాడు. మరొక మాట లేకుండా అంశంగా లేచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు  మరునాటి రాత్రి …
అర్గ్థరాత్రి
ఎవరో పిలుస్తున్నారు కాదు అరుస్తున్నారు.
డాక్టర్ !డాక్టర్  !

మూలం: రవీంద్రనాథ్ టాగూర్

You may also like

Leave a Comment