Home వ్యాసాలు స్వరాంజలి – 3

స్వరాంజలి – 3

by Krishna Kumari Yagnambhatt

అన్నమయ్య తర్వాత ఆతని కుటుంబీకులు పెద తిరుమలాచార్యులు వంటి వాగ్గేయకారులు తమ రచనల ద్వారా ఈ సంప్రదాయాన్ని ముందుకు నడిపించారు. ఈ కాలంలోనే సాహిత్య రంగంలో ప్రబంధాల పంట విరివిగా పండింది. అది క్షేత్రయ్యకు అనుకూలించింది. అందుకే క్షేత్రయ్య కవితలో రకరకాల శబ్దాలంకారాలు కన్పిస్తాయి. పదంలో సన్నివేశ చిత్రీకరణ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రత్యేకత నాటి రసిక జనుల మన్ననలను అందుకొంది.

అన్నమయ్యలో మొగ్గ రూపంలో ఉన్న అభినయ విద్య క్షేత్రయ్యలో సహస్ర దళ పద్మమై వికసించింది. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ తీరుల చతుర్విధ అభినయాలకు క్షేత్రయ్య పదాలు అనుకూలంగా ఉంటాయి. నాట్య శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయని వారు క్షేత్రయ్య పదాల అభినయాన్ని అధ్యయనం చేస్తే చాలు. అన్ని రకాల అభినయాలు పట్టు పడతాయి. క్షేత్రయ్య ప్రతి పదం నృత్య గాన అభినయాలకు నిఘంటువు వంటిది. ఒక్కొక్క పదం ఒక్కొక్క అభినయ వైచిత్రి కల్గి ఉంటుంది. నిజానికి ఈ పదాలను అన్నింటిని గుదిగుచ్చే ఏక సూత్రత లేకపోయినా అంతర్గతమైన కృష్ణ తత్త్వం వలన ఇదొక రస భరిత కావ్యం అనవచ్చును.

అభినయ కళలో శివ తత్త్వం, విష్ణు తత్త్వం అని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ఈ రెండు తత్వాలను ఒకే పదంలో మిళితం చేసి రచించాడు క్షేత్రయ్య. చూడండి ఈ ఉదాహరణ.

‘చక్కని దయ గలదా యిది నీ జాగా చెవంది లింగా

ఇక్కడికి వచ్చినదేమో హెచ్చు కంచి వరదా!

ఇందున్నావాని యీడ వచ్చితి చెవంది లింగా

అందుకేల యెవరిల్లిదీ యవురా కంచి వరదా!

ఎవ్వడో యీ పడకింటిలో నవ్వేది చెవంది లింగా

మువ్వ గోపాలుడు గాక మరెవ్వరు కంచి వరదా!

ఇద్దరు దైవతాలని సంభోదిస్తూ చివరన ఆ ఇద్దరినీ మువ్వ గోపాలునితో సమన్వయించాడు. నృత్యం చేసే నర్తకికి అభినయానికి అపారమైన అవకాశం ఉంటుంది ఇటువంటి రచనలలో.

పలుకు పలుకులో తేనె లొలుకే విధంగా రచనలు చేసిన క్షేత్రయ్య పుట్టుక, బాల్యం చాలా వివాదాస్పదమైన విషయం. ‘శూరుల జన్మంబు, సురుల జన్మంబు నేరుల జన్మంబు నెరుగ నగునే’ అన్నట్లు అతని జన్మ చర్చనీయమే. శ్రీ విస్సా అప్పారావు గారి విశేష పరిశోధన వలన క్షేత్రయ్య జన్మ స్థలం కృష్ణా జిల్లాలోని కూచిపూడి దగ్గర గల మువ్వ గ్రామం అని, 16/17 శతాబ్ది మధ్యకాలంలో జీవించాడని తెలుస్తున్నది. పుట్టుక, బాల్యం మాత్రమే కాకుండా ఈతని పేరు కూడా వివాదాస్పదమే. పలు క్షేత్రాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అనే పేరు వచ్చిందని, అసలు పేరు వరదయ్య అనే వాదం కూడా లేకపోలేదు.

మువ్వ పురీ నిలయా, మువ్వ పురీ విభుడైన, మువ్వ పురీ సామి వంటి అనేక పదాలలో క్షేత్రయ్య మువ్వ ను గ్రామవాచిగానే ఉపయోగించాడు. ఈ గ్రామం లోనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయమున్నది. ఈ స్వామినే క్షేత్రయ్య మువ్వ గోపాలుడని సంభోదించాడు. పైగా మువ్వ కు కూతవేటు దూరంలో నాట్యానికి నెలవైన కూచిపూడి గ్రామం ఉంది. ఆ నాట్యం చిన్నప్పుడు చూస్తూ పెరిగే అవకాశం ఇతనికి ఉంది కూడా. కాబట్టి నాయికానాయక భేదాలన్నీ అతి సూక్ష్మమైనవి కూడా ఈతని రచనలలో కన్పిస్తాయి. నేటికీ కూడా కూచిపూడి వారు క్షేత్రయ్య పదాభినయంలో నిపుణులు.

నిజానికి క్షేత్రయ్య పదాలు అత్యంత శృంగార భరితమైనవి. ముందు చెప్పుకున్నట్లు అది క్షీణ ప్రబంధ యుగం. ఆ కాలంలో ఎవరు రచనలు చేసినా అది శృంగార మయంగానే ఉండేది. తంజావూరు పాలకుడైన రఘునాథ రాయల ఆస్థానంలో అష్ట దిగ్గజాల వంటి మహిళా కవయిత్రులు ఉండేవారు. వారు రాసినవన్నీ ఈ కోవకు చెందినవే. అటువంటి కాలంలో ఇంకో రసానికి తావు ఉంటుందా.

తాను ఒక మహా కావ్యం రాయక పోయినా తొలి రచన మాత్రం శ్రీకారంతో మొదలు చేశాడు క్షేత్రయ్య. ఈ తొలి రచనలో అందులోని పదాల పొందిక, భావ లాలిత్యం చూడండి.

‘శ్రీ సుతు బారికి నెనోపలేక నిను వేడితే కోపాలా – మువ్వ గోపాలా

ఏ పొద్దు దానింటిలోనే కాపై యుండిన నీ సరస సల్లాపాలా – మువ్వ గోపాలా

చూపుల నన్యుల దేరి చూడని నాతో చేరి కలాపాలా – మువ్వ గోపాలా ..

ఈ రచనలో గల పద ప్రయోగం గాని, నడక గాని, తాళం గాని తర్వాతి పదాలలో కన్పించవు. దాదాపుగా ప్రతి పాదంలో మువ్వ గోపాలా అంటూ యమక యుక్త ప్రయోగాలున్నాయి.

దీని తర్వాత రాసిన పదాల నడక గాని, పద ప్రయోగాలు గాని స్వభావ రీత్యా పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ పదాలన్నీ దాదాపుగా త్రిపుట తాళం లేదా మిశ్ర చాపులో కన్పిస్తాయి. నిజానికి ఈ తాళాలు నృత్యానికి అనుగుణమైనవి. పైగా ఈ పదాలు అతి విలంబితమైన నడక కలవి.

చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఈతనిని కృష్ణా తీరంలో జరిగే భజనలు, ఆలయ ప్రాంగణాల్లో అన్నమయ్య పదాలు, సిద్ధేంద్రుల వారి కలాపాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు చేస్తున్న కూచిపూడి నర్తకులు చాలా ఆకర్షించారు. బహుశః వీటి ప్రభావం క్షేత్రయ్యలో చిన్ననాడే బీజప్రాయంగా పడింది. క్రమంగా అది బలపడి, ఒక రూపు సంతరించుకొని యౌవన దశలో సంపూర్ణ వాగ్గేయకారత్వానికి దారి చూపింది. అనేక ప్రదేశాలు తిరిగిన కారణంగా ఈతనికి క్షేత్రయ్య అన్న పేరు స్థిరపడింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరదయ్య అని శ్రీ విస్సా అప్పారావు గారి పరిశోధన చెబుతున్నది. దివ్య క్షేత్రాలు దర్శించిన వాడు, క్షేత్రజ్ఞానం కలవాడు క్షేత్రజ్ఞుడు అని పిలువ బడు తాడని వేటూరి ఆనంద మూర్తి గారి అభిప్రాయం.

17 వ శతాబ్దపు సాహిత్య రచనలో అవసరానికి మించిన శృంగారం కన్పిస్తుంది. ఇది కేవలం మన తెలుగు సాహిత్యంలో మాత్రమే కాదు. భారతదేశమంతటా ఇదే పరిస్థితి. ఇవే లక్షణాలు క్షేత్రయ్యలోనూ కన్పిస్తాయి. ఆ నాడు రచన చేసిన స్త్రీ పురుషులందరు మితి మీరిన శృంగారాన్ని వర్ణించారు. ఆది నాటి యుగ లక్షణమనుకుంటే క్షేత్రయ్యలో గొప్ప భక్త కవిగా, వాగ్గేయకారుడుగా దర్శనమిస్తాడు. ఇతను భారత శాస్త్ర నిధి. అభినయ విద్యా విశారదుడు. తేట తెలుగు భాష సౌందర్యాన్ని, మాధుర్యాన్ని ఆసాంతం తెలుసుకొని పలికినవాడు. తనకు తెలిసిన భాషా సౌందర్యాన్ని తనదైన భావ సౌందర్యంతో మేళవించి కమ్మని పదాలను ఆలపించాడు. తనదైన ఒక ప్రత్యేక బాణీ ద్వారా పద కవితా చరిత్రలోనే తనకంటూ ఒక విశేష స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. వివిధ కోణాలలో, వివిధ దృక్పథాలలో, వివిధ రీతుల చతుర్విధ అభినయాలని ప్రదర్శించడం కేవలం ఒక్క క్షేత్రయ్య పదాలలో మాత్రమే సాధ్యపడుతుందని స్వానుభవం ద్వారా చెప్పారు శ్రీ నటరాజ రామకృష్ణ గారు.

‘ఆంగికం కావలసిన వారికి ఆంగికం, గానం వినదలచిన వారికి గాన మాధుర్యం, భావ యుక్తంగా పాట వినాలన్న వారికి ఆ తృప్తి, భాష యొక్క, ఆ నాద ధ్వని యొక్క ప్రభావం తరచి తరచి వినాలన్న వారికి సంతృప్తి, పద్యంలోని నాయికా సంపూర్ణ స్వరూపం చూడ గోరిన వారిని ఆ నిరూపణం, సంచార విన్యాసాలు తిలకించ గోరిన వారికి ఆ అనుభూతి, శృంగార రసం లోతులు ఎరుగ దలచిన రసజ్ఞులకు ఆ ఆనందం..’ అంటూ క్షేత్రయ్య సంపూర్ణ స్వరూపాన్ని మన కళ్ళెదుట సాక్షాత్కరింప చేశారు రామకృష్ణ గారు.

క్షేత్రయ్య పదాలను కొన్నింటిని తీసుకొని వచ్చే వ్యాసంలో విశ్లేషణ చేసి, అందులోని విశేషాలను తెలుసుకుందాం.

You may also like

Leave a Comment