Home వ్యాసాలు తెలుగులో ఉదాహరణ వాఙ్మయం

తెలుగులో ఉదాహరణ వాఙ్మయం

by Dasharathula Narsaiah

తెలుగు సాహిత్యంలో ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకూ ఎన్నెన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ద్విపదలు, శతకాలు, రగడలు, ఉదాహరణలు, యక్షగానాలు, పదకవితలు, నవల, కథానిక, నాటకం, నాటిక, ఏకాంకిక – వంటి ప్రక్రియలు సాహిత్యంలో నిలదొక్కుకుని వాటి సత్తాను నిరూపించుకున్నాయి.

ఉదాహరణ ప్రక్రియ కూడా 12వ శతాబ్దంలో ఆవిర్భవించి, ఆధునిక యుగం వరకూ కూడా గౌరవింపబడుతున్నది.

పుట్టుక, స్వరూపం : ‘హృ’ ధాతువుకు ‘ఉత్’ అను ఉపసర్గ చేరగా ఉదాహరణం ఏర్పడింది. దీనికి దృష్టాంతం, నిదర్శనం – నైఘంటికార్థాలు. మార్గ కవిత్వానికి సంకేతంగా నిలిచే వృత్త పద్యాలతోనూ, దేశి కవిత్వానికి సంకేతంగా నిలిచే కళికోత్కళితలతోనూ ఉదాహరణ ప్రక్రియ రూపుదిద్దుకుంది. అంటే, ఉదాహరణ ప్రక్రియ – మార్గ, దేశి కవిత్వాలను కలిపిన అద్భుత సాహిత్య ప్రక్రియగా గుర్తింపు పొందింది.

ఉదాహరణ ప్రక్రియలో – తెలుగులోని విభక్తి ప్రత్యయాలకు ఆశ్రయం లభించింది. సర్వ విభక్తులనూ క్రమంగా ఉదాహరించడం ఈ ఒక్క ప్రక్రియలోనే జరుగుతుంది. సృష్టిలోని జీవాత్మ, పరమాత్మల సంగమం లాగా, భాషలోని ప్రకృతి ప్రత్యయాల సంగమం అనివార్యంగా జరిగే సాహితీ ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ సార్థక్యం చెందింది.

వృత్త పద్యాలతో పాటు, కళికోత్కళితలు కూడా చోటు చేసుకోవడం వల్ల – ఈ ఉదాహరణ ప్రక్రియ సంగీత, సాహిత్యాలను మేళవింపు చేసుకున్న ప్రక్రియలకు ఉదాహరణ ప్రాయంగా నిలిచింది.

సంస్కృత ప్రమేయం లేకుండా తెలుగులో ఆవిర్భవించిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగులో తెలియవచ్చినంతగా, మరే భాషల్లో దీనికి సంబంధించిన సమాచారం తెలియకపోవడం వల్ల తెలుగు సాహిత్యానికే పరిమితమైన వినూత్న రచనా ప్రక్రియగా కూడా ‘ఉదాహరణం’ రూపుదిద్దుకుంది.

నేపథ్యం : ప్రాక్తన మానవుడు ప్రకృతిని ప్రేమించాడు. నిరంతర అన్వేషణాసక్తి – ప్రాక్తన మానవుణ్ణి మిగతా జంతు సముదాయం నుండి వేరు చేసింది. ప్రకృతిని క్రమంగా తాను సాధించిన విజయాలకు మూలంగా భావించాడు. ప్రకృతిలో దైవత్వాన్ని చూసాడు. ఆరాధించడం, పూజించడం అలవాటు చేసుకున్నాడు. రకరకాల స్తోత్ర పాఠాలతో స్తుతించాడు. ఈ స్తోత్ర పాఠాలు మనకు ఋగ్వేదంలో ‘కుంతాప సూక్తములు’ అనే పేరుతో కనిపిస్తాయి. ఈ కుంతాప సూక్తములకే ‘నారాశంసులు’ అని కూడా పేరు.

వేద వాఙ్మయం లోని ‘కుంతాప సూక్తములు’, కాలక్రమంలో లౌకిక వాఙ్మయం లోకి ప్రవేశించాయి.

హరివంశ, విష్ణు పురాణాలలో పృథు చక్రవర్తిని స్తుతించిన సందర్భాలున్నాయి. పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు నిర్వహించే క్రమంలో సూతమాగధులు జన్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి. సూత మాగధులు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఋషులు స్తోత్ర పాఠాలు నిర్వహించారు. ఈ స్తోత్ర పాఠాల పరంపర క్రమంగా లౌకిక సాహిత్యంలోనూ నిలదొక్కుకుంది. ప్రభువుల లోకోత్తర చరిత్రను ప్రచారం చేయడానికి ఈ స్తోత్ర పాఠాలు చదువడం క్రమంగా ఒక అలవాటుగా రూపుదిద్దుకుంది. ఈ స్తోత్ర పాఠాలు భారతాది మహా గ్రంథాలలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయా దేవతలను, మానవులను స్తుతించే సందర్భాలలో ఈ స్తోత్ర పాఠాలు కావ్యాలలో ప్రవేశించాయి. అంతేకాదు, ఈ స్తోత్ర పాఠాలు ప్రత్యేక కావ్యాలుగా అవతరించాయి. అట్లా, అవతరించిన స్తుతి ప్రధానమైన కావ్యమే ఈ ఉదాహరణం అని చెప్పవచ్చు.

కాళిదాసు తన రఘువంశంలో మొదటిసారిగా ఉదాహరణ శబ్దాన్ని ప్రయోగించాడు. రఘు వంశంలోని నాల్గవ సర్గలో ఈ కింది శ్లోకం ఉంది.

“శరైరుత్సవ సంకేతాన్యకృత్వా విరతోత్సవాన్

జయోదాహరణం బాహ్వోర్గాపయా మాస కిన్నరాన్”

రఘువంశ మహారాజు శరత్కాల ఉత్సవ సంకేతాఖ్య గణాలను ఉత్సవ రహితులుగా నిర్వీర్యం చేశాడు అనగా వారిపైన విజయాన్ని సాధించాడు. ఈ విజయానికి సూచకంగా కిన్నెరులు ఉదాహరణాన్ని గానం చేశారట! కిన్నెరులు గానం చేసిన ఈ ఉదాహరణమే లౌకిక సాహిత్యంలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ప్రవేశించి ఉంటుందని పల్వురు భావిస్తున్నారు. రఘువంశంలోని జయోదహరణాన్ని మల్లినాథసూరి ఇట్లా వ్యాఖ్యానించాడు.

“కిన్నెరాన్బాహ్వోః స్వభుజయోర్జయోదాహరణం

జయాఖ్యాపకం క్షుద్ర ప్రబంధ విశేషంగా పయామాస”

మల్లినాథసూరి వ్యాఖ్యను పురస్కరించుకొని ఉదాహరణం అనగా ఒక కావ్య విశేషమనీ, గానానుకూలమైనదనీ తెలుస్తుంది. మల్లినాథసూరి తెలుగులో ఉదాహరణ స్వరూపం తెలిసినవాడు కాబట్టి ‘జయోదాహరణమ్’ అనే పదాన్ని చూడగానే ‘జయోదాహరణమ్ జయాఖ్యాపకమ్ -క్షుద్ర ప్రబంధ విశేషమ్ గాపయామాస’ అని అనగలిగాడు.

కాళిదాసు విక్రమోర్వశీయం నాటకంలో కూడా ‘ఉదాహరణమ్’ అనే పదాన్ని ప్రయోగించాడు.

తుల్యానురాగ పిశునం లలితార్థ బంధం

పత్రే నివేశిత ముదాహరణం ప్రియాయాః

ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాసిన రంగనాథుడు ఉదాహరణ శబ్దానికి ‘ఉక్తి’ అను అర్థాన్ని చెప్పాడు. రంగనాథుని దృష్టిలో ‘ఉదాహరణం’ అనేది కావ్యం కాదు. ‘ జయోక్తి’ గానే ఉదాహరణ శబ్దాన్ని వ్యాఖ్యానించాడు. అంటే, సంస్కృత వాజ్మయంలో అప్పటికీ ఉదాహరణ ప్రక్రియ లేదు కాబట్టి అట్లా వ్యాఖ్యానించాడని చెప్పుకోవలసి ఉంటుంది. దీనిని బట్టి తెలుగులో ఉదాహరణ ప్రక్రియ స్వతంత్ర ప్రక్రియ అని తెలుస్తుంది. తెలుగు కంటె ముందు సంస్కృతంలో ఉదాహరణ ప్రక్రియ లేదని కూడా తెలుస్తుంది. అనగా తెలుగులో వెలువడిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ పేరు దక్కించుకుంది.

ఉదాహరణం లక్షణాలు :

  1. ప్రథమా విభక్తి నుండి మొదలెట్టి, సప్తమీ విభక్తి వరకు అన్ని విభక్తులల్లో వృత్త పద్యాలు చెప్పాలి. ఆ తర్వాత సంబోధనలతో పద్యం చెప్పాలి.
  2. చివరలో సార్వవిభక్తకంగా ఒక పద్యాన్ని, అంకితాంక పద్యాన్ని చెప్పాలి.
  3. ప్రథమాది సప్తవిభక్తుల్లోనూ, సంబోధనలోనూ ప్రతి విభక్తిలోని వృత్త పద్యం కింద రగడ భేదాలైన కళికోత్కళికలు చెప్పాలి.
  4. కళిక ఎన్మిది పాదాలు కలిగి వుంటుంది. అందులో సగం అర్థకళిక. ఇది కూడా ఎన్మిది పాదాలలో ఉంటుంది. దీనికి ఉత్కళిక అని పేరు.
  5. ప్రతి విభక్తిలో వరుసగా ఒక వృత్తపద్యం, దాని కింద ఒక కళిక, ఉత్కళిక మాత్రమే ఉంటాయి. అంతకు మించి పద్యాలు ఉండకూడదు.
  6. కళికలోని ప్రతి పాదం చివర ఆయా విభక్తులకు చెందిన ప్రత్యయాలు ఉండాలి. ఉత్కళికలో మాత్రం చివర రెండు పాదాలలో మాత్రమే విభక్తి ప్రత్యయాలు ఉండాలి.
  7. సంబోధనా విభక్తిలోని కళికోత్కళికలు – అన్ని పాదాలలో సంబోధనాంతాలుగానే ఉండాలి.
  8. సార్వవిభక్తి పద్యంలో అన్ని విభక్తులు చెప్పాలి. ఇది సాధారణంగా మత్తేభంలోగానీ, శార్దూలంలో గానీ వుంటుంది.
  9. ఈ ప్రక్రియ స్తుతి ప్రధానమైనది కాబట్టి గానయోగ్యంగా ఉంటుంది. వృత్త పద్యాలు రాగాంగ ప్రధానాలుగా వుంటే, కళికోత్కళికలు తాళాంగ ప్రధానంగా వుంటాయి. త్రిపుట, జంపె, రూపక తాళాలతో కళికోత్కళికలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఆ తాళాలకు అనుకూలమైన త్రశ్య, చతురస్ర, మిశ్ర జాతులు ఈ కళికోత్కళికలలో ప్రకటింపబడుతాయి.
  10. మహాకావ్యాలలో నాయక గుణవర్ణన ప్రధానమైనట్లుగా, ఉదాహరణల్లో నాయక గుణకీర్తనమే ప్రధానం.
  11. సాధారణంగా ఒక ఉదాహరణ కావ్యంలో కళికోత్కళికలూ, వృత్తాలు – అన్నీ కలిసి 26 పద్యాలుంటాయి.
  12. ఉదాహరణ కావ్యంలోని కళికోత్కళికలు ఒక రకంగా రగడ భేదాలే. ఇవి 9 రకాలుగా చెప్పబడినాయి. అవి –
  13. హయప్రచార రగడ
  14. తురగవల్గన రగడ
  15. విజయమంగళ రగడ
  16. మధురగతి రగడ
  17. హరిగతి రగడ
  18. ద్విరదగతి రగడ
  19. జయభద్ర రగడ
  20. హరిణగతి రగడ
  21. వృషభగతి రగడ

ఈ రగడలు 9 రకాలుగా చెప్పినా అందులో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. అవి. 1. హయప్రచార రగడ, 2. మధురగతి రగడ, 3. ద్విరదగతి రగడ, 4. హరిణగతి రగడ.

హయప్రచార రగడలో మూడు మాత్రల గణాలు, మధురగతి రగడలో నాలుగు మాత్రల గణాలు. ద్విరదగతి రగడలో ఐదు మాత్రల గణాలు, హరిణగతి రగడలో ఏడు మాత్రల గణాలుంటాయి. ఈ నాల్గింటిలోనూ ప్రతి పాదంలో నాలుగు గణాలే ఉంటాయి. ఈ నాలుగు గణాలను రెట్టింపు చేస్తే వరుసగా 1.తురగ వల్గనం, 2.హరిగతి, 3.జయభద్రం, 4. వృషభగతి – రగడలు ఏర్పడుతాయి. తురగవల్గన రగడను రెట్టింపు చేస్తే విజయమంగళ రగడ ఏర్పడుతుంది.

ఉదాహరణ వాఙ్మయ  వికాసం

తెలుగులో ఉదాహరణ ప్రక్రియ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవోదాహరణంతో ప్రారంభమైంది. అయితే, నన్నయ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యాన సందర్భంగా ప్రథమా విభక్త్యంత పద్యాలు కనిపిస్తాయి. ఈ విభక్త్యంత పద్యాలే, తెలుగులో విభక్తులతో కూడిన పద్యాలు రాయడానికి అనగా ఉదాహరణ కావ్యాలు ఆవిర్భవించడానికి మూలకారణమయ్యాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

“దేవ మనుష్య లోకములఁద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫుర

త్పావక తాపి తాఖిల విపక్షులునైన మహానుభావులై

రావత కోటి ఘోర ఫణిరాజులు మాకుఁ బ్రసన్నులయ్యెడున్”

– ఇట్లాగే ‘మాకు ప్రసన్నుడయ్యెడున్’ – అను పాదాంతంతో మరి మూడు పద్యాలున్నాయి.

12వ శతాబ్దంలో, వీర శైవమతాన్ని తెలుగు దేశంలో విస్తృతంగా ప్రచారం చేసిన శివకవులలో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. ఆయన లేఖిని నుండి బసవోదాహరణం రావడం, ఒక రకంగా శైవ మత ప్రచారానికి ఇది ఉపయోగపడి వుంటుందని భావించడంలో తప్పులేదు. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుణ్ణి కలియుగ రుద్రుణిగా సాక్షాత్కరింపజేస్తూ ఈ కింది పద్యం చెప్పాడు.

“వసిగొని యెవ్వడేని బసవాయను నీ సుకృతాక్షర త్రయం

బెసగ పఠించెనేని గిరిజేశుని కాతని వక్ష గహ్వరం

బసదృశ్య గేహమన్న యవి యార్యుల వాక్యములట్ల కావునన్

బసవన (బుణ్యమూర్తిఁ దలపంగదె చిత్తమ పాయ కెప్పుడున్”

బసవా! అను సుకృతాక్షర త్రయాన్ని పఠించినంత మాత్రంచేత పరమేశ్వరుడు ఆ భక్తుని ముఖ గహ్వరంలో నివసిస్తాడని చెప్పడంతో బసవేశ్వరునికి పరమేశ్వరత్వాన్ని – ఆపాదించింది ఈ పద్యం.

భాషాపరంగా బసవోదాహరణాన్ని పరిశీలిస్తే చతుర్థి విభక్తి ప్రత్యయంలో ఇపుడున్న కొఱకు, కై- ప్రత్యయాలు కాకుండా, ‘కునై’ రూపం కనబడుతుంది. ఉదాహరణకు ఈ కింది కళికను గమనిద్దాం!

వెండియును నిర్మల ప-విత్ర గోత్రునకు నై

పండిత స్తవనీయ – పాత్ర గాత్రునకు నై

దురిత భంజన కళా – ధుర్య చరితునకు నై

సరవి నిష్ట వ్రతా – శ్చర్య భరితునకు నై

సవిశేష విమలగుణ – జాలలోలునకు నై

శివయోగ సంధాన – శీల పాలునకు నై

……………………………………….

…………………………………………

ఇట్లా సాగిపోతుంది కళిక.

భాషా చరిత్ర పరిణామ క్రమంలో విభక్తి ప్రత్యయాలు ఎట్లా రూపాంతరం చెందాయో తెలుసు కోడానికి, ఉదాహరణ వాజ్మయ ప్రక్రియ చక్కగా పనికి వస్తుందని ఈ ఉదాహరణ ఋజువు చేస్తుంది.

క్రీ.శ. 1320 ప్రాంతంలో రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదాహరణాన్ని రచించాడు. శ్రీశైలానికి తూర్పు వాకిలిలో కొలువుదీరిన దేవుడు త్రిపురాంతక దేవుడు. ఆయన మీద రాసిన కావ్యమే త్రిపురాంతకోదాహరణం. త్రిపురాంతకోదాహరణంలో కన్నప్ప, సేనమరాజు, నంబి, భల్లహుడు, చిఱుతొండడు వంటి శివభక్తులు ప్రస్తుతింపబడినారు. ఈ కావ్యంలో శివుని ఉతృష్టతను చాటి చెప్పే అర్ధనారీశ్వరత్వం, గంగాధారణం, దక్షాధ్వర ధ్వంసం, కపాల భిక్షాటనం, త్రిపురాసుర సంహరణం మొ|| పౌరాణిక విషయాలు ప్రస్తావించబడినాయి. వీరశైవం కాకుండా శివాద్వైత మార్గమే ఈ ఉదాహరణ కావ్యంలో ప్రతిపాదించబడింది.

మానవల్లి రామకృష్ణ కవి త్రిపురాంతకోదాహరణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా – “దీని శబ్దార్థ మాధుర్యానికి మెచ్చి, ఈ కృతి రత్నం చిన్నదైనప్పటికీ – దీనిని పండితులు కంఠాలంకారంగా స్వీకరిస్తారని” భావించి పరిష్కరించినట్లు వ్యాఖ్యానించాడు.

15వ శతాబ్దంలో సంపూర్ణమైన ఉదాహరణ కావ్యాలు లభించలేదు గాని, ఉదాహరణ కావ్య భేదమైన ‘విద్దళి’ లభించినట్లు నిడుదవోలు వేంకటరావు తెలియబరిచాడు. ఈ కావ్యంలో వృత్త పద్యాలతో పాటు కంద, గీత దేశీయ ఛందస్సులు మిళితమై ఉన్నాయని తెలిపాడు.

16వ శతాబ్దంలో తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణాన్ని రచించాడు. ఆయనకు సమకాలీన కాలంలో చిత్రకవి పెద్దన హనుమదోదాహరణం రచించాడు. పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణంలో సార్వవిభక్తిక పద్యం తర్వాత షష్యంతాలతో కూడిన అంకితాంక పద్యాన్ని రచించాడు. ఇది ఒక విలక్షణత్వంగా నిలిచిందని చెప్పాలి.

ఉత్తర ప్రబంధ యుగంలో ప్రసిద్ధ లాక్షణికుడైన అప్పకవి ఉదాహరణానికి లక్షణాలు చెప్పాడు. దానికి లక్ష్యభూతంగా శ్రీ కృష్ణోదాహరణాన్ని రచించాడు. శ్రీకృష్ణుని లీలావిలాసాలు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ప్రధానేతి వృత్తంగా ఈ కావ్య రచన సాగింది.

దక్షిణాంధ్ర  యుగంలో బాలకవి అనంతయ్య రాసిన శేషార్యోదాహరణం ఒక్కటే పరిపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యం. అంకితాంక పద్యం కందంలో ఉండడం దీని ప్రత్యేకత. కందంలో అంకితాంక పద్యం రాసిన తొలి ఉదాహరణంగా ఈ కావ్యానికి గుర్తింపు లభించింది. అయితే ఈ యుగంలో మరికొన్ని ఉదాహరణ కావ్యాలు లభించాయి. కాని అవి అసంపూర్ణ గ్రంథాలే. ఏనుగు లక్షణ కవి రాసిన విశ్వేశ్వరోదాహరణం, నుదురుపాటి సాంబశివమూర్తి రాసిన రఘునాథీయోదాహరణం – అసంపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యాలే. మచ్చ వేంకటకవి ముఖలింగేశ్వరోదాహరణం కూడా పరిపూర్ణంగా దొరుకలేదు.

పాల్కురికి సోమనాథుని కాలంలో మొదలైన ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆయా కాలాలలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.

ఆధునిక యుగంలో కూడా ఉదాహరణ కావ్యాలు పుంఖానుపుంఖంగా వెలువడుతున్నాయి. ప్రాచీనకాలంలో వెలువడిన ఉదాహరణల కంటె, ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణలే అధికం.

ఆధునిక యుగం – వైవిధ్యభరితం

ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణ కావ్యాలను పరిశీలిస్తే – మనకు వైవిధ్యం అధికంగా గోచరిస్తుంది. సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ఉదాహరణలు వచ్చాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలను ప్రశంసిస్తూ ఉదాహరణ కావ్యాలు వచ్చాయి. ప్రాంతీయ వైవిధ్యాలను తొలగించి విశాల భావాలను ప్రచారం చేయడమే పనిగా ఉదాహరణలు వెలువడ్డాయి. ఇట్లా, వ్యక్తుల పరంగా, సమాజపరంగా, దేశపరంగా వివిధ ఉదాహరణ కావ్యాలు పుట్టుకొచ్చాయి.

ఆధునిక యుగంలో మానవుడు యాంత్రిక జీవితానికి అలవాటు పడినాడు. సాహిత్యానికి అధిక సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదు. చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే కావ్యాలవైపు పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, చాలా తక్కువ పద్యాలలో పూర్తయ్యే కావ్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదాహరణ కావ్యాల మీద ఆసక్తి కనబరచే పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి.

ఆధునిక యుగంలో వెలువడిన ఉదాహరణ కావ్యాలు

  1. నాగేశ్వరోదాహరణం – కీ.శే. మండపాక పార్వతీశ్వర శాస్త్రి                       –        1938
  2. గోపాలోదాహరణం – కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ                   –        1940
  3. వీరేశలింగోదాహరణం – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి                  –        1948
  4. అన్నమార్యోదాహరణం – డా|| తిమ్మావరుల కోదండ రామయ్య                  –        1951
  5. శంకరోదాహరణం – కవి కిశోర శంకరప్రసాద్                                  –        1952
  6. శ్రీమద్రామానుజోదాహరణం – చెలమచర్ల రంగాచార్యులు –        1952
  7. ఆంధ్రలక్ష్మీ వైభవోదాహరణం- చెలమచర్ల రంగాచార్యులు –        1952
  8. విశాలాంద్రోదాహరణం – డా|| దివాకర్ల వేంకటావధాని                            –        1956
  9. వీరభద్రోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  10. విరూపాక్షోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  11. లక్ష్మీనృసింహోదాహరణం- డా. సుప్రసన్న –        1962
  12. సామగాన ప్రియోదాహరణం – శ్రీమతి బుర్రా కమలాదేవి –        1963
  13. వివేకానందోదాహరణం – పాటిలు తిమ్మారెడ్డి                                                               –              1963
  14. వేంకటేశ్వరోదాహరణం – గాజుల వీరయ్య                                          –        1963
  15. రాధాకృష్ణోదాహరణం – వడ్డాది సీతారామాంజనేయ కవి                         –        1965
  16. శ్రీరామోదాహరణం – అత్తిలి వేంకటరమణ                                     –        1966
  17. శ్రీసత్యసాశాయీశ్వరోదాహరణం- ఉప్పాడ రాజారావు – 1966
  18. శ్రీనివాసోదాహరణం – జంధ్యాల పాపయ్యశాస్త్రి                                 –        1969
  19. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – బండి నాగరాజు –        1971
  20. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – వేముగంటి నరసింహాచార్యులు –        1973
  21. జనకోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  22. కుమారోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  23. పరిశుద్దాత్మోదాహరణం – బల్లి పురుషోత్తం –        1973
  24. రామలింగేశ్వరోదాహరణం – శ్రీపాద కృష్ణమూర్తి –        1973
  25. సత్యోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                              –        1980
  26. శారదోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  27. విశ్వనాథోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  28. సురూపోదాహరణం – సాల్వ కృష్ణమూర్తి                                       –        1980
  29. ఉత్ఫుల్లకం (ఉదాహరణ భేదం)- సంపత్కుమార్ –
  30. కొత్త సద్దలి (ఉదాహరణ భేదం)- ఆరుద్ర –
  31. శ్రీరామోదాహరణం – నిడుదవోలు వేంకటరావు                                –
  32. శ్రీ రాఘవోదాహరణం – కొమ్ము సుబ్రహ్మణ్యవర ప్రసాద్                          –        1983
  33. శ్రీ గణేశోదాహరణం – శ్రీ వేముగంటి నరసింహాచార్యులు                       –        1983
  34. శ్రీ రామచంద్రోదాహరణం – డా॥ దాశరథుల బాలయ్య –        1983
  35. యాదగిరి లక్ష్మీనృసింహోదాహరణం – డా|| దాశరథుల బాలయ్య – 1983

– ఇంకా నా దృష్టికి రాని మరిన్ని ఉదాహరణ కావ్యాలు కూడా వెలువడినాయి. వాటిని కూడా సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణ కావ్య భేదాలు :

ఉదాహరణ కావ్యాలకు లక్షణాలు చెప్పిన లాక్షణికులు ఉదాహరణ కావ్యభేదాలను కూడా సూచించారు.

విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో సద్దలి, పద్దలి, విద్దలి, కల్యాణి, ఉత్ఫుల్లకం – అను ఐదు రకాల భేదాలను సూచించాడు.

సద్దలి : సంబోధనా విభక్తి పద్యాల్ని వదలిపెట్టి సప్త విభక్తుల్లో పద్యాలు చెపితే అది సద్దలి.

పద్దలి : సప్త విభక్తుల్లో పద్యాలూ, సంబోధనా విభక్తి పద్యాలు చెపితే అది పద్దలి.

విద్దలి : సంబోధనా విభక్తిని విడిచి విషమ విభక్తుల్లో పద్యాలు చెపితే అది విద్దలి.

కల్యాణి : కేవలం కళికలతో రచించిన కృతికి ‘కల్యాణి’ అని పేరు.

ఉత్ఫుల్లకం : కేవలం ఉత్కళికలతో రచించిన కృతికి ఉత్ఫుల్లకం అని పేరు.

– ఇన్ని భేదాలు చెపుతూనే విన్నకోట పెద్దన ‘ధరనుదాహరణాది భేదములు పెక్కు’ అని కూడా అభిప్రాయపడినాడు. దీంట్లో ఆరుద్ర కొత్త సద్దలి, సంపత్కుమార ఉత్ఫుల్లకం – వంటి ఉదాహరణ కావ్య భేదాలను రచించారు.

మొత్తం మీద ఉదాహరణ కావ్యప్రక్రియ – భిన్న ఇతివృత్తాలతో – అనగా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, సామాజిక, భౌగోళిక, ప్రాంతీయ, దేశీయ గత వైవిధ్యభరిత ఇతివృత్తాలతో – తన అస్తిత్వాన్ని చాటుకుంటూ సాహిత్యంలో తన స్థానాన్ని భద్రపరుచుకుంది.

 

 

డా|| దాశరథుల నర్సయ్య

విశ్రాంత తెలుగు అధ్యాపకులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

గజ్వేల్, సిద్దిపేట జిల్లా

9390919100

You may also like

Leave a Comment