Home వ్యాసాలు గార్గి

గార్గి

దైవదత్తమైన ప్రతిభ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. అన్నిరంగాల్లో లాగా ఆధ్యాత్మిక రంగంలోను ప్రసిద్ధి గల మహిళా మణులెందరో భారతీయ సమాజంలో కనిపిస్తారు.

వేదమంత్రార్థం తెలిసిన వారిని ద్రష్టలని పిలుస్తారు. అట్టివారిలో ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, పౌలోమి మొదలైనవారి సరసన నిలబడ గల్గిన విదుషీమణి గార్గి, గార్గి అద్భుతమైన చరిత్ర బృహదారణ్యకోపనిషత్తులో చోటు చేసుకున్నది.

గార్గి వాచక్ను మహర్షి కూతురు. తండ్రి పెంపకంలో ఆమె గొప్ప వక్తగా పేరుగాంచింది. విశిష్టమైన వ్యక్తిగా రాణించింది. ఆశ్రమ వాతావరణంలో పెరడగం వల్ల ఆమెలో ఆధ్యాత్మికానురక్తి ద్విగుణీకృతమైంది. తోటి బ్రహ్మచారిణులతో సంభాషించడం వల్ల వాదపటిమను సంతరించుకున్నది. గార్గి వాదబలానికి తలలూపని వారు లేరు. ఆమె సంవాదశైలికి మునిపల్లెలే కాదు, ఆనాటి రాజస్థానాలు కూడా మురిసిపోయాయి.

జనక చక్రవర్తి ఒకసారి ‘దక్షిణ’మనే పేరుగల మహాయాగాన్ని తలపెట్టినాడు. ఆ యాగానికి దేశంలోని నలుమూలల నుంచి వేదపండితులు వచ్చారు. యాగం ఫలవంతమైంది. కాని ఆ మహా చక్రవర్తికి ఇంకా తృప్తి కలగలేదు. వచ్చిన పండితులలో బ్రహ్మవేత్తలెవరో తెలుసుకోవాలనుకున్నాడు. తానే నిర్ణయిస్తే అది రాజుగారి పక్షపాత దృష్టికి నిదర్శనమవుతుంది. అందుకే ఆయన ఒక ఆలోచన చేశాడు.

తన కొలువు కూటానికి సమీపంలో ఒక వెయ్యి ఆవుల్ని తెప్పించి ఉంచాడు. ఆ గోవుల కొమ్ములకు పదేసి బంగారు నాణాల చొప్పున అలంకరింపబడడం చూపరులకు అద్భుతంగా తోచింది.

జనకుడు సభనొక్కసారి తేరిపార జూశాడు. ఆ సభలో ఆసీనులైనవారు సామాన్యులు కారు. వారిలో అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు, విదగ్గుడు, శాకుల్యుడు అందరిని మించి యాజ్ఞవల్క్యుడున్నాడు, విదుషీమణుల్లో గార్గి ఉంది.

రాజు సభాంగణంలో తమ విద్వత్తులో ప్రకాశిస్తున్న పండితులనుద్దేశించి “ఓ పండితులారా! మీరంతా బ్రహ్మజ్ఞులుగా కనిపిస్తున్నారు. ఐతే మీ అందరిలో ఎవరు గొప్పవారో తేల్చే శక్తి నాకు లేదు. కాని మీలో ఎవరు బ్రహ్మవేత్తలో వారికి వెయ్యి గోవులను బహుమానంగా ఇస్తాను. వారీ గోవులను ఏ ఇబ్బంది లేకుండా తమ ఆశ్రమానికి తోలుకొని పోవచ్చు”నని ప్రకటన చేశాడు.

ప్రకటన విననైతే విన్నారుగాని ఆ పండితులెవ్వరూ తాము బ్రహ్మవేత్తలమని చెప్పడానికి ముందుకు రాలేకపోయారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ సభలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుణ్ణి పిలిచి, ఆ వెయ్యి గోవులను తన ఆశ్రమానికి తోలుకొని వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటిదాకా చప్పుడు చేయని పండితులు క్రోధావేశానికి లోనై యాజ్ఞవల్కుణ్ణి తిట్టసాగారు. ఆయన తమకంటె గొప్పవాడా? అని ప్రశ్నించసాగారు.

సభలోని కలకలాన్ని గ్రహించిన జనకుని పురోహితుడు అశ్వలుడనేవాడు సభాసదులనుద్దేశించి శాంతంగా ఉండవలసిందిగా కోరుతూ, యాజ్ఞవల్క్యునితో “మీరు అందరికంటె మించిన పండితులైతే మీకివే వందనాలు! మాకూ గోవుల్ని తోలుకొని పోవాలని ఉంది. కాని మీరాపని మమ్మల్ని కాదని చేశారు. ఐతే మేమడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పినట్లైతే అందుకు మేమేమీ నిరోధించం” అంటూ తాను కొన్ని ప్రశ్నలను సంధించినాడు. యాజ్ఞవల్క్యుడు వాటికి తగిన సమాధానాలిచ్చాడు. ఆ తర్వాత వరుసగా అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు మొదలైన వారు ప్రశ్నలు సంధించారు. కాని యాజ్ఞవల్క్యుడు ధీరోదాత్తంగా వారి ప్రశ్నలనే బాణాలను ఎదుర్కొని ఏమాత్రం గాయపడక సమాధానాలిచ్చాడు. అంతేకాదు, “నేను బ్రహ్మవేత్తను. వెయ్యి గోవులను నా ఆశ్రమానికి తోలుకొని పోవడానికి అనుమతి ఇవ్వండి” అని రాజునుద్దేశించి పలికినాడు. రాజు మౌనంగా ఉన్నాడు కాని, అతని పురోహితుడు అశ్వలుడు అడ్డుపడ్డాడు. అంతకుముందే వాదంలో అశ్వలుడు కూడా ఓడిపోయి ఖంగుతిన్నాడు.

పురుష పుంగవులెవ్వరూ యాజ్ఞవల్యుణ్ణి వాదంలో ఓడించలేకపోయారు. ఇక నారీజనంలో విదుషీమణులెవరైనా ఉంటే తప్పక యాజ్ఞవల్యుణ్ణి గెలిచేవారనే మాటలు వినిపించాయి. క్రమంగా అలా మాట్లాడుతున్న వారి చూపులు ఒక విద్వన్మణి మీద వాలాయి. ఆమె ఎవరో కాదు, గార్గి! తపస్సే స్త్రీరూపం దాల్చినట్లుంది. విద్వత్తే ఆకారం పొందినట్లుంది. సాక్షాత్తు వేదమాత ప్రత్యక్షమైనట్లు గోచరిస్తుంది.

మిన్నకుండడం విద్వాంసుల పని కాదని తెలిసిన గార్గి జనక మహారాజుతో, యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించడానికి అనుమతి కోరింది. అలా కోరడంలోనే ఆమె విద్వత్తుతో పాటు ఎంతటి వినయశీలం కలిగిందో తేటతెల్లమవుతుంది.

‘ఇంత గొప్ప పండితులం మేమే యాజ్ఞవల్యున్ని గెలవలేకపోయాం. ఒక స్త్రీ ప్రశ్నలు అడగడమా?’ అని కొందరు పండితులు గుసగుసలుపోయారు. కాని ధర్మప్రభువైన జనకుడు “ఇది విద్వత్సభ. ప్రతిభ, పాండిత్యం ఒకరి సొత్తు కాదు. అవి ఎవరిలోనైనా ఉండవచ్చు. కనుక యాజ్ఞవల్యున్ని ప్రశ్నించడానికి గార్గిని అనుమతిస్తున్నాను” అని పలుకగానే సమస్త నారీలోకంతో పాటుగా గార్గి తన అంతరంగంలో ఎంతో సంతోషపడింది.

మహర్షిని చూసి “ఓ యాజ్ఞవల్క్యా! కాశీవాసియో, విదేహనగరవాసియో, ఎవరైనా ఒక వీరుడు వాడిగల బాణాలతో శత్రువులను ఎదిరించినట్లే నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలతో గెలవాలనుకుంటున్నాను” అనగా ఆ మహర్షి అందుకు సరే అన్నాడు.

గార్గి అడిగిన మొదటి ప్రశ్న : “దివికి పైనా, భూమికి క్రిందా, మధ్యనున్న అంతరిక్షంలో ఉన్న దానిపేరేమిటి?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “దివికి పైన, భూమికి క్రింద అంతరిక్ష్యంలోను అంతటా ఉన్నది ఆకాశమే”.

గార్గి రెండవ ప్రశ్న : “ఈ ఆకాశం దేనిలో ఓతప్రోతమై (వ్యాపించి) ఉన్నది?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “ఈ ఆకాశం అక్షర పరబ్రహ్మలో వ్యాపించి ఉన్నది. నాశం లేనిది అక్షరబ్రహ్మం. దానివల్లనే సృష్టి స్థితిలయలు వరుసగా జరుగుతున్నాయి. మూడు కాలాలు, మూడు లోకాలు ఆ అక్షరబ్రహ్మ ఆజ్ఞకు లోబడి నడుచుకుంటాయి. ఐదే అక్షరబ్రహ్మం కనిపించదు. కాని అన్నింటినీ చూస్తుంది. అన్నింటిని వింటుంది” అని సృష్టిరహస్యాన్ని విప్పి చెప్పిన యాజ్ఞవల్క్యుని మాటలకు హర్షించిన గార్గి, అతనిని బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడని స్వయంగా ప్రకటించింది, సభ అంతా పులకించి పోయింది.

భారతదేశ చరిత్రలో ఒక మహిళ తన అపారమైన వాదపటిమతో ఒక పురుషుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖింపదగింది, నారీలోకానికి గర్వకారణమైంది.

గార్గి, యాజ్ఞవల్క్యుడు పరస్పరం అభినందించుకున్నారు. జనక మహారాజు ఎంతగానో సంతోషించాడు. గార్గిని అందరి హర్షధ్వానాల మధ్య సన్మానించినాడు. ఆ తర్వాతనే జనకుడు యాజ్ఞవల్యుణ్ణి గురువుగా చేసికొని అతనివల్ల బ్రహ్మోపదేశం పొంది మోక్షార్హత సంపాదించినాడు.

– ఆచార్య మసన చెన్నప్ప.

23.10.2021

You may also like

Leave a Comment