కాలం ఎంతో విచిత్రమైంది. ఎన్నో సంగతులను మోసుకొస్తూ మనుషుల్ని ఆశల ఊయలలో ఊగిస్తూ ఉంటుంది. ఈ ఆశనే ఒక ఊతకర్ర లాగా వెంట రావాలి. దట్టమైన అడవిలో నడచివెళ్ళేప్పుడు పురుగుబూచిని బెదరగొట్టేందుకు చేతి కర్రను నేలపైన కొడ్తు, శబ్ధం చేస్తూ నడవాలి. ఎంతో ధైర్యాన్నిచ్చేది ఆ క్రరనే. మనకు అట్లా ధైర్యాన్నిచ్చేవి మన ఆశలే. గతంలో సాధించిన ఆశలు , రేపు సాధించాలనుకునే ఆశలు జమిలిగా కర్రసాయమౌతాయి. ఈ ఆశలకు ఆశయాలు తోడైతే తప్పకుండా మన జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీన్ని సాధించాలంటే తగినంత కృషి తప్పనిసరి అవసరం. పనిలోనే ఆనందాన్ని వెతుక్కునే అలవాటు మనదైతే నలుగురికి మనమే ఆదర్శనీయులం అవుతాం , అవ్వాలి.
ఈ మధ్యకాలంలో భయంకర స్వార్థాపేక్ష నుండి జనులు బయట పడలేకపోతున్నారు. అందరూ మంచివాళ్ళే, మరి అన్యాయాలు ఎట్లా జరుగుతున్నాయో! మత్తు పదార్థాలు శరీరానికి ఏ విధమైన ఆరోగ్యాన్ని ఇవ్వవు. కాని తక్షణ సుఖాన్నిస్తాయన్న అత్యాశతో తీసుకుంటుంటారు. అదేంటో తెలివి ఎంత పెరుగుతుంటే విధ్వంసాలు అంత పెరుగుతున్నాయి. గతంలో ఒక పద్ధతి ఉండేది. ఊళ్ళల్లో ఎవరు ఏ పంటలు వేస్తున్నారో తెలిసిపోయేది . కాబట్టి భయం తో అదికూడా ఏ కొద్దిమందో దొంగచాటుగా పంటల మధ్య వేసి పండించేవారు గంజాయిని. కాని ఈమధ్య విరివిగా పండిస్తున్నారు. ఈ విషయం ఊళ్ళల్లో చాలామందికి తెలుసు. అయినా ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. వీళ్ళంతా మాయా మర్మాల టక్కుటమారీలు చేసేవాళ్ళేం కాదు. సాధారణ ప్రజలు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్లుండేవారు. వీళ్లలో స్వార్థమనే భావనతో పాటు , మనకెందుకులే అనే కనిపించని నిర్లిప్తతతో చాలామంది ఉంటారు . పంట వేయడం, పండించడం, కోయడం, సంపాదన కోసం పంపిణీ చేయడం అన్నీ….అన్నీ తెలుసు. వీళ్లు, ఇందులో భాగస్వాములైనవాళ్ళు మామూలుగా ఈ సామాన్య ప్రజల మధ్యనే అందరిలో ఒకరిగా ఉంటుంటారు.
మరి పిల్లి మెళ్ళో గంటనెవరు కట్టాలి? మేధావులు బాగా ఆలోచించాల్సిన విషయమిది.
పుట్టుకతోనే ఒక గుణం వెంట వస్తుంది. ఉదాహరణకు ఒక గుర్రం పరుగెత్తుతూ ఉంటుంది. అది పోటీ కాదు. కాని ఆ గుర్రానికి తనను స్వారీ చేసేవాడు మెచ్చుకునేది ఎట్లా అర్థం అవుతుంది? అర్థం అవుతుంది. కర స్పర్శనో, చూపులో, శబ్ధోచ్ఛారణనో ఏదో సంకేతాన్ని గ్రహిస్తుంది గుర్రం. ఇది జీవి లక్షణం, జీవలక్షణం. ఇంత తెలియదా మనుషులకు? తెలుసుకాని ఊరకుంటారు, ఉత్తినే ఉంటారు. ఇది సమాజానికి ద్రోహం చేసినట్లే. వ్యవస్థల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది. “పిట్టమనసు పిసరంతైనా, ప్రపంచమంతా దాగుంది” అన్నారు దాశరథి. మనం రక్తగతం ఎంత చేసుకోగలిగాము అన్నదే ముఖ్యం. ఇప్పడున్న మన తరమైనా, రేపటితరమైనా బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు కోసం మనుషులుగా ఆలోచించాలి. ఎదిరించాలి, తెలియజేయాలి, శిక్షపడేలా చూడాలి. పెంచకుండా అడ్డుకోవాలి. దీనికి ప్రత్యక్షంగా కూడా చేయనక్కరలేదు. పరోక్షంగానూ చేసి సాధించవచ్చు. ఈ మహత్కార్యం కోసం సామాజిక సేవా సంస్థలు, పెద్దలు ముందుకురావాలి .
పాఠశాల విద్యార్థులనూ వదలడం లేదు ఈ అవినీతిపరులు . ఇదీ దృష్టిలో పెట్టుకోవాలి. సంబంధిత డాక్టర్లు , సేవారంగంలోని ప్రముఖులు ఒక ఉద్యమ ప్రాతిపదికన సలహాలను ఇస్తూ తల్లితండ్రులను చైతన్యపరచాలి. విద్యాసంస్థలకు వెళ్ళిగాని, కాలనీల్లోకి వెళ్ళిగాని ఒక సంఘం స్థాపించడంలాంటివి చేయాలి. ఇంటింటికీ తిరిగి మాదకద్రవ్యాల వల్ల కలిగే ఇబ్బందులు , జబ్బులు ఎలా బాధిస్తాయో ప్రచారం చేయించగలిగితే మరెంతోబాగుంటుంది . కష్టమైన పనే కాని ఆలోచననైనా సంఘసేవకులకు ఉంటే మంచిది.ముక్కుపచ్చలారని పిల్లలు మన దేశ భావి జీవసంపదలు.
ఆ ఏంకాదు మనపిల్లలు అలా ఏంచేయరు అనే అలసత్వం వద్దు . అసలు వాళ్ళ మనసుల్లో ఏమున్నదో పసిగట్టడము అంత తేలిక కాదు కాబట్టి వాళ్ళకు తెలియకుండానే నిఘా అనేది వేయాలి . జాతి సమగ్ర వికాసం కోసం , అభివృద్ది కోసం పాటుపడాల్సిన అవసరమున్నది.యువత నిర్వీర్యం కావడం మనకళ్ళముందే కూలిపోతున్న భవనం వంటిది . ఏ మనోవైకల్యాలు లేని స్వచ్ఛమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన కృషి చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్నది .
ఆగిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసే శక్తిని అలవరచుకోవాలి. ఒక చింతనాక్రమం ఉండాలి. మయూఖ పాఠకులకు ఒక సామాజిక చింతనను గుర్తు చేయడమే ఇది.
ఇక నాలుగో సంచికగా శరదృతువును ఆలంబన చేసుకుని వస్తున్న ఈ మయూఖ ఎప్పటిలాగే అన్ని రకాల సాహిత్యప్రకియలను మీకు అందిస్తున్నది. కవితలు ఆలోచనాత్మకమై, హృదయాలను కదిలించే వస్తువుతో అలరారేవి ఉన్నాయి. ధారావాహికంగా వచ్చే తెలంగాణ ప్రబంధాల వ్యాసం అయితేమి, కవిత్వ నైపుణ్యాలు – ప్రసంగ పాఠమైతేనేమి, స్వరాంజలి, లేఖా సాహిత్యం ,యోగా , ఉపనిషత్తు కథాత్మక వ్యాసం వంటి వ్యాసాలైతేనేమి ఎంతో విస్తృతమైన విషయ సమాచారంతో ఉన్నవే కాకుండా మరెన్నో విశేషాలను ప్రోదిచేసిన ఇతర వ్యాసాలు ఉన్నాయి. ఇక కథలలో వైవిధ్యభరితమైన కథలూ, అనువాద కథలూగాని, అనువాద సాహిత్యంగాని పత్రిక తెరిచారు అంటే తప్పక ఇప్పుడే చదవాలని అనిపించేలావుంది మయూఖ. మన కవులకు , రచయితలకు, చదువుతున్న పాఠకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ అభిప్రాయాలను వ్రాసి పంపి సాహిత్య సమ్యక్ దృష్టిని చాటుతారని ఆశిస్తున్నాను.