Home వ్యాసాలు    స్వరాంజలి -4

   స్వరాంజలి -4

by Krishna Kumari Yagnambhatt

క్షేత్రయ్య పదాలన్నీ చక్కని జాను తెలుగులో రచింపడ్డాయి. ఆ నాటి  తెలుగు భాషా స్వరూపం ఈ పదాల ద్వారా తెలుసుకోవచ్చును. అయినా ఇతను సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలో సమాన మైన పాండిత్యం కలవాడు.అన్నమాచార్యుల వారు చెప్పిన సంకీర్తన లక్షణం ఈతని పదాలలో స్పష్టంగా కన్పిస్తుంది.దేశీయ కవిత లో అందె వేసిన చేయి గల ఈతని రచనలో ఎన్నో పలుకుబళ్ళు, సామెతలు అలవొకగా ఇమిడిపోయాయి.పదాలలోని సన్నివేశ చిత్రీకరణ గాని, వర్ణన గాని అత్యంత మనోహరం. జయదేవుని అష్టపదులు కూడా రాధాకృష్ణుల రాసక్రీడల వర్ణనలే కానీ అవి సంస్కృతంలో ఉండడం వలన  భాషా పటిమ గల పండితులకే పరిమితమైనవి. కానీ క్షేత్రయ్య పదాలు జాను తెలుగులో ఉండడం వలన పండిత పామర జన రంజకమయ్యాయి.తేట తెలుగు పదాలతో భావ గాంభీర్యాన్నివ్యక్తం చేయగల రచనా చాతుర్యం ఈతని ప్రత్యేకత. పదాల భావ పరిణామమంతా అలంకారిక మయమే. ప్రాచీన మహాకవుల ప్రయోగాలతో సమానమైన అలంకార ప్రయోగం చేయడం ఒక విశేషం. మల్లెలు గుభాళించి నట్లు,వేసవి కాలపు సాయంకాలం చల్లని గాలి వీచినట్లు, గున్న మామిడి తోపుల నుంచి కోయిల కూసినట్లు, నల్లని మబ్బుల నేపథ్యంలో తెల్లటి కొంగలు ఎగురుతున్నట్లు ఉంటుంది క్షేత్రయ్య కవిత. గతంలో సాహిత్యానికి పరమావధి నాటకమని అనేవారు. కానీ అన్నమయ్య క్షేత్రయ్యల  తర్వాత సాహిత్య పరమావధి పదం అనవచ్చును. ఎందుకంటే పదంలో ఇమడని భావం లేదు. అణువులో అణువు వంటిది,బ్రహ్మండం లో బ్రహ్మాం డం వంటిది ఈ పదం. క్షేత్రయ్య పద స్వరూపం ఇటువంటిది కాబట్టే దానిని మనసులో ఆస్వాదించడానికి గాని, అనుభవించడానికి గాని మామూలు చదువుతో పాటు ప్రత్యేక మైన సంస్కారం ఉండాలి; లలిత కళలలో ప్రవేశం ఉండామే గాకుండా వ్యుత్పత్తి అభ్యాసం వల్ల , అనుభవం వలన మనసు పరిపక్వత చెంది ఉండాలి. అందుకే క్షేత్రయ్య అక్షరాక్షరం పరమ ప్రమాణ మణి అన్న ముందు తరాల విద్వాంసుల మాటను శిరసా వహించాలే  తప్ప నిరసించకూడదు. క్షేత్రయ్య పదాలలో విషయాలు అనేకంగా ఉంటాయి. ఒక్కొక్క పదం చదివినా, పాడినా, అభినయించినా ఆ నాయిక మనోభావాలు, మనో వ్యధలు , బయటకు చెప్పుకోలేని ఎన్నెన్నో భావాలు మనకు స్పష్ట మవుతాయి. ఒక ఉదాహరణ చూడండి.

‘ఉసురని తల యూచునే శయ్యపై నుండి యులికి దిగ్గున లేచునే

కసరి దిక్కులు చూచునే కన్నీరు నించి

కనులెర్రగా చేసునే ఓ లలనరో ‘

ఆన్ ఈ గేయం విరహి నాయిక మనస్థితికి ప్రతిబింబం.

అట్లాగే క్షేత్రయ్య పద చిత్రణ అత్యంత సుందరం.

 

You may also like

Leave a Comment