కలం అతడిదే…. కాలం అతడిదే….
అక్షరం అతడిదే… అర్థం అతడిదే…
అనంతానంత విశ్వంలో రెపరెపలాడుతున్న
సాహితీ కేతన వర్ణమతడిదే
అతడు…..
పాలమూరు సాహితీ దిగ్గజం కపిలవాయి లింగమూర్తి !
పరిచయం :
1928 మార్చి 31
ఉమ్మడి పాలమూరు జిల్లా, అచ్చంపేట తాలూకా, బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో జన్మించారు.
మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులు వీరి తల్లిదండ్రులు. 1930- 31 ప్రాంతంలో వెంకటాచలం గారు మరణించారు. ఈ పరిస్థితిలో మేనమామ పెద లక్ష్మయ్యగారు కపిలవాయిని చేరదీసాడు.
ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కపిలవాయి పాఠశాల విద్య ఉర్దూ మాధ్యమంలో కొనసాగింది. కానీ ఒక వయసు, ఒక ఆలోచన, వచ్చాక గుండె నిండా తెలుగు భాషమీద అభిమానం అనివార్యంగా ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగు విశారద ప్రమాణ పత్రాన్ని పొందాడు.
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. పట్టా పొందాడు.
సంస్కృతాంధ్ర నిఘంటువులు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలు, జ్యోతిషశ్రౌతాదిభాగాల్లో కపిలవాయి ఆరితేరారు.
విధి నిర్వహణ :
వీరి ఉద్యోగ జీవితం 26 ఏండ్ల వయసు నుండి కొనసాగింది. 11.7.1954 న జాతీయోన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్ లో తెలుగు పండితునిగా చేరి సేవలు అందించాడు.
19.8.1972 న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలో ఉపన్యాసకులుగా చేరి చరిత్రోపన్యాసకులుగా సేవలు కొనసాగించారు.
28.2.1983 న ఉద్యోగ విరమణ పొందారు.
వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిని కొనసాగిస్తూ శతాధిక రచనలు చేశాడు.
సాహితీ ప్రస్థానంలో
కపిలవాయి పద్య రచనతో తన ప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత వచన సాహిత్యం,
కావ్యాలు, గీతాలు, శతకాలు, బాల సాహిత్యం,
స్థల చరిత్రలు,దేవాలయ చరిత్రలు, విమర్శ, జనపదం, తదితర సాహిత్య ప్రక్రియలను స్పృశించారు.
జిల్లా వ్యాప్తంగా శ్రమకోర్చి పర్యటించి మరుగున పడిన శాసనాలను పరిశీలించాడు. . చరిత్రను గ్రంధస్థం చేసాడు. జానపదుల నోళ్ళలో కదలాడే మౌఖిక సాహిత్యాన్ని సేకరించి రికార్డు చేసాడు. ఇవి వీరి జీవితంలో “వేయిపున్నమల వెలుగు “.
వీరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి రచనలు – జీవితం ఆధారంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం , తెలుగు విశ్వవిద్యాలయం , మధురై యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.
1. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి శతకాలు – పరిశీలన
2. డా. అనంత రాములు (ఉస్మానియా యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
3. యాదగిరిచారి (మధురై యూనివర్సిటీ) శ్రీమత్ప్రతాపగిరి ఖండం – పరిశీలన
4. రామాచారి (యస్.వి. యూనివర్సిటీ) చక్రతీర్థ మహాత్మ్యం – పరిశీలన
5. రామాచారి (తెలుగు యూనివర్సిటీ) కపిలవాయి జీవితం – సాహిత్యం
6. జి. వెంకటరాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయం) కపిలవాయి లింగమూర్తి సాహిత్యంలో చరిత్ర – సంస్కృతి
వీరు మొత్తం 100కు పైగా రచనలు చేసారు. వాటిలో శతకాలు, ద్విపద కావ్యాలు, సంకీర్తనలు, చరిత్రలు, ఉదాహరణలు, ఆధ్యాత్మిక గ్రంధాలు, కథలు, సంకలనాలు – వ్యాఖ్యనాలు, సంపాదకాలు – పరిష్కృతాలు, అనువాదాలు మొదలగునవి ఉన్నాయి. కొన్ని అముద్రితాలు. వీరి కొన్ని ముఖ్యరచనలు, వాటి వివరాలు గమనిస్తే…
1)భాగవత కథాతత్వం
(భాగవతంలో 10 కథలకు వ్యాఖ్యానం )
2)సాలగ్రామ శాస్త్రం
(సాలగ్రామం దానిపుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర),
3) శ్రీ మత్ప్రతాపగిరి ఖండం
(అమరాబాదు స్థల చరిత్ర)
4)కుటుంబగీత (కుటుంబ నియంత్రణను చాటి చెప్పే ఏకైక కావ్యం)
5)మాంగళ్య శాస్త్రం
(మాంగళ్యం ధరించడంలోని గూడార్థాలు, విశేషాలు), 6)దుర్గా భర్గా శతకాలు
(అలంకార యతి లక్షణాలు)
7) ఆర్యా శతకం
(చిత్ర పద్యాల గారడి)
8) స్వర్ణశకలాలు
(90 కావ్యాలలోని స్వర్ణశిల్పి ప్రశస్తి)
9)గీతాచతుష్పథం
(భ్రమరగీత, భగవద్గీత, ఉత్తర గీత, ఉద్ధవగీతల సారాంశము)
10)రుద్రాధ్యాయం
(సామాజిక చారిత్రక వ్యాఖ్యానం)
11)పాలమూరు జిల్లా మాండలికాలు (పామర సంస్కృతం)
వీరి ఆత్మకథ ” సాలగ్రామం ”
భాగవతకథాతత్త్వం :
కపిలవాయి వారికి అభిమానమైన గ్రంధాలలో ఇది ఒకటి. కానీ వారి మరణం తర్వాత ఈ గ్రంధం ప్రథమ ముద్రణ వచ్చింది.. ఇందులో మొత్తం 10అధ్యాయాలు ఉన్నాయి.
01 ) కపిల దేవహూతి సంవాదం
ఈ కథ ఆంధ్ర భాగవతంలోని తృతీయ స్కంధంలో ఉంది . మూలంలో ఇది 21 నుండి 33 అధ్యాయాల వరకు గల సమగ్ర గ్రంథం . ఈ కథను పవిత్ర గంగాతీరంలో మైత్రేయుడు ‘ విదురునికి చెప్పాడు.. దీనిలో 310 గద్య పద్యాలున్నవి . ఈ కథలో వేదాంత విషయం ఎక్కువ కాబట్టి ఇది సంసారికేతి వృత్తం వలె సరసంగా ఉండదు .
02.) పురంజనోపాఖ్యానం
కళాపూర్ణోదయంలోని సరస్వతీ చతుర్ముఖుల శృంగారం వలె భాగవతంలో పురంజనోపాఖ్యానం
ఒక మార్మిక ప్రబంధం . ఇది అద్వైత ప్రతిపాదకమైన వృత్తాంతం . దీన్ని నారదుడు ప్రాచీన బర్షికి చెప్పినాడు . పూర్వం పురంజనుడనేరాజు ఉండేవాడు. అవిజ్ఞాతుడు అతడి మిత్రుడు.పురంజనుడు తనకు తగిన పట్టణాన్ని వెదకటానికి మిత్రునితో బయలుదేరి దేశదేశాలు తిరుగుతాడు. అనేక పట్టణాలు చూస్తాడు.కాని ఏదీ తనకు నచ్చలేదు . చివరకు హిమాలయ దక్షిణ సానువుల్లో నవద్వారపురం అనే పేరుగల
ఒక పట్టణం రాజవారిని ఆకర్షిస్తుంది . అదే క్రమంలో ఆ పట్టణం ముందున్న ఉద్యానంలో ఒక యువతి కనిపిస్తుంది. ఆమె ఆ పట్టణం రాకుమారి. పేరు ప్రమదోత్తమ.ఆమె వెంట పదిమంది అనుచరులు ఉంటారు. రాజుకు ఆమె పరిచయం అవుతుంది. “నేను తగిన వరునికై చూస్తున్నా -నాభాగ్య వశంగా నీవిక్కడికి వచ్చినావు ” అని వివరిస్తుంది. ఈ విధంగా కథ సాగుతుంది.
03) భరతోపాఖ్యానం
ఈ కథ భాగవతంలోని పంచమ స్కంధంలోగల ప్రథమాశ్వాసంలో ఉన్నది.మూలంలో 7 నుండి 14 అధ్యాయాలు గల గ్రంథం . ఇది ఏ భరతుడి కథ అని చెప్పడానికి వివరణ అవసరం. ఎందుకంటే పురాణాలలో భరతులు చాలానుంది ఉన్నారు.
మొదటివాడు నాట్యశాస్త్రకర్త.
రెండవవాడు కైకేయీ దశరథుల పుత్రుడు . మూడవవాడు శకుంతలా పుత్రుడు .ఈ మూడవ భరతుడి కారణంగా మనదేశానికి భారతదేశమనే పేరేర్పడిందని నమ్ముతారు. కాని ఇది నిజం కాదు . మనదేశానికా పేరు రావటానికి ఋషభ దేవుడి కుమారుడైన భరతుడు కారణం . అతడు కపిల మహర్షి సమకాలికుడు. ఈ భరతుడికి పూర్వం మన దేశానికి ” అజనాభం ‘ అని పేరు ఉండేది. మేరుదేవి , నాభి ప్రభువుల కుమారుడు ఋషభదేవుడు. ఇతడు
శ్రీమహావిష్ణువు అవతారం . జైనులు వీరిని తమ ప్రథమ తీర్థంకరుడుగా అంగీకరించినారు . ఋషభుని జీవితం నుండి గూడ నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవ్వన్ని కథాను సారంగా పొందుపరచబడ్డాయి.
04 ) అజామీళోపాఖ్యానం
ఇది భాగవతంలోని షష్ఠ స్కంధంలో ఉంది . తెలుగు భాగవతంలో వంద గద్యపద్యాలలో ఈ కథ చెప్పబడింది . తరువాత మరో 32 పద్యాల్లో విష్ణు సంకీర్తన ప్రభావం వివరించబడింది . తెలుగు భాగవతంలో షష్ఠస్కంధం మహాభారతంలోని విరాటపర్వం వంటిది. ఈ భాగంలో గుణనిధి,నిగమశర్మ, సుకుమారుడు, మదాలుసుడు, నిరంకుశుడు కథలను కపిలవాయి వార0పొందుపర్చారు.
05) నారాయణ కవచం
ఆంధ్ర భాగవతంలో పోతనగారు 19 గద్యపద్యాలతో ఈ భాగాన్ని వివరించారు.ఇది భాగవతంలోని షష్టస్కందంలో గల ఇతివృత్తం. దీనిలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి. అవి – కవచానుష్టానా విధానం , కవచం , కవచఫలం. విశ్వరూపాచార్యుడు ఇంద్రునికి ఉపదేశించిన మంత్రరాజం నారాయణ కవచం.. ఇంద్రత్వం ఒక పదవి , దానిపై ప్రతి మన్వంతరానికి ఒకరు మారుతూ ఉంటారు . అందుచేత ఇంద్రులు చాలామంది గడిచినారు . ఈ పదవిని సృజించి మొదటిసారిగా అధిష్టించినవాడు సుయజ్ఞ అనే పేరుతో కాలం గడిపిన విష్ణువు. సుయజ్ఞ తర్వాత ఎందరో ఈ పదవిపైకి వచ్చినారు కాబట్టి వారిలో వారెవరో , అహల్యా జారుదేవరో నిర్ణయించి చెప్పటం కష్టం. ప్రస్తుతం ఉన్న ఇంద్రుని పేరు పురందరుడు . బ్రహ్మ పేరు ఆదిజుడు. ప్రస్తుతం ఈ కథ ఒకనాటి ఇంద్రుని విషయాన్ని తెలుపుతుంది .
06) ప్రహ్లాద చరిత్ర
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు .
ఇది పద్యమయ నాటకం.ఈ నాటకం తృతీయ స్కంధం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననంతో ప్రారంభమైతుంది. విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించటం , అతనిపై హిరణ్యకశిపుడు పగ పెంచుకుని ప్రతీకారంతో రగిలిపోయే కథ ఉంటుంది. ఈ భాగంలోని చివరి వంద పద్యాలలో హిరణ్యాక్షుని వృత్తాంతం చెప్ప బడింది.
07) గజేంద్ర మోక్షం
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో ఉన్నది . మూలంలో ఈ కథ నాలుగాధ్యాయాల పరిమితమై ఉన్నది. కాని పోతనగారు తనదైన ప్రతిభతో నాలుగంతలు పెంచినాడని శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెప్పినట్టుగా కపిలవాయి వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కథ నాలుగు మన్వంతరాల క్రింద క్షీరసాగరంలోని శ్వేతద్వీపంలో జరిగినట్టుగా కపిలవాయి తెలిపారు.
08)వామన చరిత్ర
ఈ కథ భాగవతంలోని అష్టమ స్కంధంలో 15 నుండి 23 అధ్యాయాలువరకు ఉంది . దీన్ని పోతనగారు 125 గద్య పద్యాల వరకు పెంచడం జరిగింది . ఋగ్వేద కాలం నాటికి ఇంద్ర త్రివిక్రములే ముఖ్య దేవతలు . అప్పటికి నేటిరాముడు కృష్ణుడు లేరు . పూర్వం వ్యవహార జయం కోరేవారు ప్రాతః కాలంలో వామన స్తుతి చేసేవారు . ఆదర్శ గృహస్థుడైన ప్రవరుడు ప్రతిదినం శ్రీ వామన స్తుతితో మేలుకొనేవాడు . బలి చక్రవర్తి అస్సలు పేరు ఇంద్రసేనుడు . ఇతడు ప్రహ్లాదుని మనుమడు . విరోచనుని కుమారుడు . రాక్షస లోకానికి రాజు . రాక్షసులకు దేవతలతో ఎపుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి . అందుచేత వారు బలిని చేరి ఇంద్రుని జయించటానికి ప్రోత్సహించినారు . వంటి వివరాలు ఈ అధ్యయంలో కపిలవాయి పొందుపర్చారు.
09 )గోపికా గీతలు – భ్రమర గీతాలు
భాగవతం దశమ స్కంధంలో 31-32 అధ్యాయాలలోనూ, 47 వ అధ్యాయంలోనూ భ్రమర గీతాలు ఉన్నాయి. 36 పద్యాలలో పొందుపర్చడం జరిగింది.. భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాల సంపుటి . వాటికి ఆలంబనం శ్రీకృష్ణుడు . శ్రీకృష్ణుడు లీలా మానుష విగ్రహుడు కాబట్టి అతని జీవితానికి రెండు విధాల సమన్వయం ఉంది . అతనిని కన్నవారు దేవకీ వసుదేవులు . పెంచినవారు యశోదా నందులు . రెండు కుటుంబాలు పరస్పరం మిత్రులు . నందుడు ఆవుల మందలకు యజమాని.కాబట్టి శ్రీకృష్ణుడు బాల్యంలో కొంత కాలం గోవులను మేపాడు.గోవులను అనేకమైన ఆపదల నుండి కాపాడినాడు తరువాత సాందీపుని దగ్గర విద్యలు నేర్చుకున్నాడు . . కృష్ణుడు జంతు పోరాటంలో మంచి నేర్పరిగా కన్పిస్తాడు .ఈ వివరాలు మొత్తం ఈ అధ్యాయంలో పొందుపర్చబడ్డాయి.
కృష్ణుడు మంచివాడనుచు సంప్రీతిన్ ప్రశంసించెంది సంగీతంబున నేము సొక్కుదుమె తచ్చారిత్రముల్ వింతలే
అంగీకారముగావు మాకు పురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతం బొనరింపు వారిడుదు రోజన్నీకు నిష్టార్థముల్ .
సమదాళీశ్వర ! చూడుముజ్జ్వలిత హాసభ్రూ విజృంభంబులన్….
రమణీయుండగు శౌరిచే గరగరే రామల్ త్రిలోకంబులన్…
ప్రమదా రత్నము లక్ష్మియాతని పదాబ్జాతంబు సేవింప ని
క్కము మేమెవ్వరమా కృపా జలధికిన్ కారుణ్యముల్ జేయగన్….
వంటి పద్యాల విందు రమనీయముగా ఉన్నది.
10 ) రుక్మిణీ కల్యాణము
తే :
రూఢి నామాయ కామినీ రూపమునను
పురుషులకు నెల్ల మోహంబు బొందజేయు
గాన పురుషులు సతుల సంగంబు
మాని యోగవృత్తి చరించుచు నుండవలయు .
కం :
యోషిద్రూపంబున నను
నీషణముఖ గహ్వరమున నెగమ్రింగి కడున్ ద్వేషమున కోతి జేసిన
దోషదయగు నాత్మమాయ దొలగగ గంటిన్ .
వంటి పద్యాలతో కపిలవాయి గారు రుక్మిణి కళ్యాణం అధ్యయనాన్ని ప్రారంభించాడు.
పాలమూరు జిల్లా దేవాలయాలు
“పాలమూరు జిల్లా దేవాలయాలు” పరిశోధనాత్మక రచన కపిలవాయి జీవన సాఫల్య గ్రంధం. జిల్లావాసులకు ఉపయుక్త గ్రంధం. తిరుమల తిరుపతి దేవస్థానములు – తిరుపతి వారు 2010 లో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకంలో మొత్తం 30 శీర్షికలతో జిల్లా దేవాలయాల సమాచారాన్ని పొందుపర్చారు.
1.పాలమూరు జిల్లా పుట్టుక
2.అచ్చంపేట తాలూకా ఆలయాలు
3.అచ్చంపేట మండలంలోని అరణ్యకాలు
4.అమరాబాదు పట్టీలోని ఆలయాలు
5.అమరాబాదు సీమలోని అరణ్యకాలు
6.ఆలంపురం సీమలోని ఆలయాలు
7.కలువకుర్తి తాలూకాలోని గుడులు
8.వెలిదండలో వెలసిన ఆలయాలు
9.కొల్లాపురం తాలూకా కోవెలలు
10.కోడంగల్ తాలూకాలోని గుడులు
11.నాగర్ కర్నూలు తాలూకాలోని గుడులు
12.వడ్డవాని సీమలో వర్ధిల్లిన ఆలయాలు
13.పాలమూరు తాలూకాలోని ఆలయాలు
14.మక్తల్ తాలూకాలోని మందిరాలు
15.లోకయ్యపల్లె దొరలు కట్టించిన గుడులు
16.వనపర్తి యిలాకా ఆలయాలు
17.నాయక్ వంశీయులు కట్టించిన గుడులు
18.గోపాలపేట యిలాకా కోవెలలు
19.ఈ జిల్లాలోని కొన్ని వెంకటేశ్వరాలయాలు
20.వాసవీ కన్యకాంబ ఆలయాలు
21.వీరబ్రహ్మేంద్రుని ఆలయాలు
22.మన గ్రామదేవతలు
23.ఇదమ్మ జాతరలు
24.ఎల్లమ్మ జాతరలు
25.మైసమ్మ జాతరలు
26.ఇతర దేవతలు జాతరలు
27.ఆశ్రమాలు – మఠాలు – సమాధులు
28.మఠాలు
29.సమాధులు
30.మా జిల్లాలో కొన్ని దర్శనీయ స్థలాలు
నలుగురు ముఖ్యమంత్రులతో సన్మానం
సాహిత్యరంగంలో వీరి కృషి, సంకల్పం, వెలకట్టలేనిది.
వీరి విశిష్ట రచనలు వీరికి పురస్కారాలతో విశిష్ట స్థానాన్ని ఆపాదించి పెట్టాయి. వాటిలో విశేషమైన వాటి వివరాలు చెప్పుకుంటే…….
1983లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కపిలవాయి వారిని సన్మానించి గౌరవించారు.
నారాచంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు కూడా తమ పాలనాకాలంలో కపిలవాయిని సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సైతం వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక సాహిత్యకారుడుగా కపిలవాయి చరిత్ర విశిష్టమైనది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తిగా కపిలవాయి ఘనత దక్కించుకోవడం
విశేషం.
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం –
బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం-
బ్రౌన్ సాహిత్య పురస్కారం –
నోరి నరసింహశాస్త్రి పురస్కారం –
కందుకూరి రుద్రకవి పురస్కారం –
పులికంటి సాహితీ పురస్కారం –
బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం –
1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి
2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్
సంచికలు సంపాదకులు :
1. విశ్వజ్ఞ రామాచార్యులుగారి అభినందన సంచిక ( షాద్ నగర్ ) – 1990
2. ఎమ్ . నారాయణ గారి షష్టిపూర్తి సంచిక 1992 3.స్మృతివాణి ( కాకమాను లక్ష్మీశ్వరమ్మ స్మృతి ) 2001
4. కళా నీరాజనం – భైరోజు దామోదరాచారి షష్టిపూర్తి సంచిక –
వ్యక్తిత్వం :
కపిలవాయి !
మూర్తీభవించిన మహాతత్త్వం …
తెలుగు భాషను, తెలుగు ప్రజలను మనసారా ప్రేమించిన భాషా యోగి…….
తెలంగాణ ప్రాంతం తన గుండెకాయగా జీవించిన అభిమాన ధనుడు….
తాను నడిచే గ్రంధాలయం అయినప్పటికీ, వహించిన విజ్ఞానం అయినప్పటికీ అందరినీ కలుపుకు పోయిన నిగర్వి…..
కుటుంబం
వీరి జీవిత భాగస్వామిమీనాక్షమ్మ. ఈ పుణ్య దంపతులకు కిశోర్ బాబు, అశోక్ బాబు ఇద్దరు సంతానం.
శివైక్యం
కపిలవాయి నవంబర్ 6, 2018 న తన 90 ఏండ్ల వయసులో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి హైదరాబాదులో కాలధర్మం చెందారు.
ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు