సమాజ హితాన్ని ఆకాంక్షించడమే శతక సాహిత్య ప్రధాన లక్ష్యం. సంస్కృత, తమిళ, కన్నడ భాషా సాహిత్యాలలో ప్రారంభమైన శతక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 12వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథ కవి రాసిన శతకం మొదటి శతకం అని అనేకులు అన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులు భక్తి, చారిత్రక, శృంగార, నీతి, వేదాంత, తాత్విక, దాస్యం, జీవితచరిత్రలు, స్వీయచరిత్రలు, స్థలమహాత్యం, నిందాస్తుతి శతకములు, కథా శతకాలు, సమస్యాత్మక శతకాలు, నిఘంటువు, అనువాద, అచ్చ తెలుగు, చాటువులు అని అనేక రకాల శతకాలు వెలువరించారు.
శతక లక్షణాలు:
లయాత్మకమైన ఛందస్సు, ప్రాణసమమైన శబ్ద సౌందర్యంతో ప్రతి పద్యం పాఠకులను అలరించాలి.
సంఖ్యాపరంగా వంద పద్యాలు కానీ కొందరు 100/108/116 పద్యాలు వ్రాస్తారు. ద్విశతి (200) త్రిశతి (300) పంచశతి (500) సప్తశతి (700) సహస్రం (1000) పద్యాలు రాసినా ఒకే మకుటంతో ఉంటే శతకం అనే పిలుస్తారు. శతకానికి మకుటం ఉండడం వలన ప్రతి పద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలో రాయాలి. శతకంలోని అన్ని పద్యాలు ఒకే రసంతో ప్రతిపాదించబడాలి.
చారిత్రక నేపథ్యంలో ఆధ్యాత్మికతను జోడించి సింహాచల నారసింహునిపై రాసిన “సింహాద్రి నారసింహ శతకం” కళింగాంధ్రను పాలించిన పూసపాటి విజయనగరరాజుల కాలం నాటిది.
క్రీ.శ.1720లో జన్మించిన గోగులపాటి కూర్మనాధ కవి ఇప్పటికి మూడు శతాబ్దములు పూర్తి అయిన ఈ శుభ సమయంలో శతక సాహిత్యానికి జరుగుతున్న ఈ సాహిత్య పట్టాభిషేకంలో అతని స్థానం సుస్థిరం. అతని రచనలలో మృత్యుంజయ విలాసము అను యక్షగానము; సింహాద్రి నారసింహ శతకము; లక్ష్మీనారాయణ సంవాదము; సుందరీమణి శతకము (అముద్రితము) ముఖ్యమైనవి.
శతక లక్షణాలైన
సంఖ్యాపరంగా నూట ఒక్క పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. .
మకుటం “వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!”
కవి గోగులపాటి కూర్మనాధ కవి
లేఖకుడు ఆదుర్తి హరిహర దాసు
108 పద్యాలకు ఇద్దరూ అవసరమైన పరిస్థితి చాలా విచిత్రమైనది.
గోగులపాటి కూర్మనాధ కవి (1720-1795)
గౌరమాంబా బుచ్చనామాత్యుల కుమారుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. వీరికి వెంకన్న, కామన్న అనే ఇద్దరు సోదరులున్నారు. వీరు కాశీ, రామేశ్వర యాత్రలు చేశారు. రామతీర్థంలో ప్రాథమికవిద్య పూర్తిచేసుకుని సంకీర్తనాచార్యుడుగా ఉండేవారు. శ్రీ తిరుమల పెద్దింటి సంపత్‌కుమార్ వేంకటాచార్యులు వారి శిష్యుడు. ఈ విషయాలను కూర్మనాథ కవి తన ‘మృత్యుంజయ విలాసము’ అను యక్షగానమునందు వ్రాసుకొని ఉన్నాడు.
ద్విపద
“సలలిత పెద్దింటి సంపత్కుమార
శ్రీ వేంకటార్య దేశికుల శిష్యుండ
పావన గౌరమాంబ బుచ్చన్న మంత్రి
వర పుత్రుడను సూర వరుని పౌత్రుండ//”
ఇతడు విజయనగరసంస్థాన ఆస్థానకవిగా, దేవస్థాన ఉద్యోగిగా, ప్రభువుల నుండి అగ్రహారాలు పొందాడు. రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకాకుళంలో పనిచేశారు. అడిదము సూరకవి, లక్ష్మీ నృసింహకవి సమకాలికులు. ఆఖరి రోజులలో దేవుపల్లి గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో దేవాలయ సమీప స్థలము గోగులపాటి వారి నివేశనమని ఈ రోజుకీ పిలువబడుతోంది. సుమారు 1795సం:లోఇచ్చటనేపరమపదించినట్లుగాచెప్తారు.
సంస్కృత కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నా తెలుగు మధుర కవిత అంటే ఇష్టం.
గోగులపాటి కూర్మనాధకవి ఆశువుగా చెబుతుండగా ఆదుర్తి హరిహర దాసు తాళపత్రాలపై రాసిన సింహాద్రి నారసింహ శతకము అనేక ముద్రణలు పొందినది. 1930లో “శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ శతకము” పేరుతో విశాఖపట్టణంలో ముద్రించిరి. శ్రీ రామానుజ విలాస ముద్రాశాల యందు 1930లోనే విజయనగరంలో ముద్రింపబడింది. 1941లో విజయనగరంలో ఆంధ్ర విజ్ఞాన సమితి వారు కూర్మనాథ కృతులను ప్రకటించారు.
1962లో సాహిత్యాచార్య, కవితాశేఖర పంతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారు ఆంధ్ర భాషా శాఖాధ్యక్షుడు, ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల వారిచే తిరిగి వ్రాయబడినది. 1963 లో సింహాచల దేవస్థానం ధర్మకర్త అయిన శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు గారు దేవస్థానం వారిచే తిరిగి ముద్రింప చేశారు.1983 లో తిరిగి ముద్రింపబడింది.
సింహాద్రి నారసింహ శతకం
సింహాచలేశుని స్తుతిస్తూ గోగులపాటి కూర్మనాధ కవి రాసిన 108 సీస పద్యాలతో సింహాద్రి నారసింహ శతకము చారిత్రకంగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది.
చారిత్రక ప్రాధాన్యత:
1753 సం:న దక్కను సుబేదారైన సలాబత్ జంగ్ ఉత్తరసర్కారులు బుస్సీకి కౌలునకొసంగెను. కౌలుకు తీసుకొనిన ఉత్తర సర్కారులు స్వాధీనపరచుకొనుటకు పరాసు బుస్సీ మచిలీపట్టణమునకు గవర్నర్ అయిన మారిసన్ అను అతనిని రాజమహేంద్రవరం శ్రీకాకుళం సర్కారులకు పంపెను. కానీ శ్రీకాకుళములో ఫౌజుదారుగా ఉన్న జాఫర్ అలీ ఖాన్ నకు ఈ విషయం ఇష్టం లేదు. అందుచే బలవంతుడైన మొదటి విజయరామ గజపతితో సంధి చేసుకుని ఆయన సహాయము వలన శ్రీకాకుళం, రాజమహేంద్రవరము స్వాధీనం చేసుకుని ఏకఛత్రాధిపత్యంగా సర్కారులను పాలించదలచెను.
మారిసన్ ఈ విషయం గ్రహించి తాను ముందుగానే విజయరామ గజపతితో సంధి చేసుకున్నాడు అన్న విషయం జాఫరల్లీ తెలుసుకుని శ్రీకాకుళం విడిచి పారిపోయెను. విజయరామగజపతి పైనను, ఫ్రెంచి వారి పైనను పగ సాధించదలచి ఫ్రెంచి వారితో యుద్ధం చేస్తున్న రఘోజీ భాంస్లే కుమారుని సైన్యముతో శ్రీకాకుళం సర్కార్ కు కొండల మీదుగా రమ్మనెను. ఆ కొండ మార్గమును చూపుటకు పాచిపెంట జమిందార్ అయిన వీరప్ప దొర వారికి తోడ్పడెను. మహారాష్ట్రులు గ్రామములను దోచుకొనుచుండగా, తురకలు దేవాలయములు పడగొట్టుచుండిరి. సింహాచలం వరకు వారు చేరిరి అని తెలుసుకుని దేవస్థాన ఉద్యోగులూ భక్తులూ అయిన ఆదుర్తి హరిహరదాసు మరియు గోగులపాటి కూర్మనాధకవి ఇరువురూ స్నానం చేసి దేవాలయం గర్భగుడి లోనికి ప్రవేశించి తలుపులు మూసుకుని శతక రచన చేసిరి. గోగులపాటి కూర్మనాధ ఆశువుగా శతకము చెప్పుచుండగా గంటముతో తాటి ఆకులపై హరిహర దాసు వ్రాసెను.
తురక దండు కొండపైకి ఎక్కి కట్టడములు పాడు చేయుచుండిరి. క్రమముగా దేవుని కళ్యాణ మండపం పాడు చేసి గుడి ఆవరణలో ప్రవేశించి అచ్చటి రాతి రథము నందు గల గుఱ్ఱములను పాడు చేసిరి. గర్భాలయం లోనికి ప్రవేశించుచుండగా కంచు తుమ్మెదలు ఉద్భవించి వారిని వెంటనే సంహరింప వారు వెనుతిరిగిరి. కానీ వారిని విశాఖపట్టణం సమీపమున గల తుమ్మెదల మెట్ట వరకు వెంటనంటి అంతర్ధానమైనవి.
విజయరామ గజపతి సైన్యమును సక్రమముగా సమకూర్చుకుని రఘూజీ సైన్యములను అనకాపల్లి వద్ద తుమ్మపాల వద్ద ఎదిరించి, ఓడించి సింహాచలము తిరిగి వచ్చెను. వచ్చినప్పుడు త్రోవలో కనబడిన అశ్వముల యొక్కయు అశ్వికుల యొక్కయు మృత కళేబరములను చూసి సింహాచలము చేరి విషయం అంతయు తెలుసుకుని శతకమును ఆశువుగా చెప్పినందుకు కూర్మనాథ కవికి రామతీర్థం దగ్గర ఒక అగ్రహారము, తిరిగి అడగకుండా వ్రాసినందుకు హరిహరదాసుకు కొత్తవలస దగ్గర నిమ్మలపాలెం అగ్రహారము ఇచ్చెను. నేటికినీ హరిహరదాసు కుటుంబీకులకు దేవుని కళ్యాణంలో నాలుగవ దినమున కొంత సొమ్ము ఇచ్చే రివాజు కలదు.
శతకము లోని విశేషములు
గోగులపాటి కూర్మనాధకవి శ్రీ సింహాద్రినాథునికి ఆంతరంగిక భక్తుడు. స్వామి వద్ద ఎంతో చనువు కలదు.
ఈ శతకము లోని కవిత్వం నిరర్గళ ధారా ప్రవాహ సదృశంగా సంస్కృతాంధ్రములందు కవికి గల అసమాన పాండిత్యము చాటుచున్నది. కవిత కదళీ పాకము నందు నడచినది.
ఇందులో జాతీయ పద ప్రయోగములు, పెక్కు సామెతలు, ఉర్దూ మాటలు కూడా కలవు.
తురక మాటలు తెలుగులో కలిపి సీసములందు చెప్పుట ఉదా: బేగ్ అరే అరబ్బీ పడోరే
లోకోక్తి ప్రదర్శన
వ్రతము చెడ్డా సుఖం దక్కదు
ఏండ్లెగసనైన, బుద్ధి దిగసన వచ్చెనో
తినగ తినగ గారెలైనను కనరువేయు
కందకు లేని దురద బచ్చలికి నేల గల్గు
ఈకవికిగల కవితానైపుణ్యం తెలియ జేయుచున్నది.
ఈ శతకము చదువుట వలన ఆనాటి రాజకీయ సాంఘిక ఆర్థిక విషయములు తెలుసుకొనుటయే కాక ఆనాటి సింహాచల దేవస్థానం ప్రాశస్త్యము ఆలయ నిర్మాణ కౌశలం గ్రహింపగలము. సింహాద్రి నారసింహ మహిమ వర్ణించు ఈ శతకము భక్తులకు శిరోధార్యం చారిత్రిక పరిశోధకులకు చైతన్య దీపిక.
కూర్మ దాసు కవి రచనా విశిష్టత:
“వైరిహరిరంహ! సింహాద్రి నారసింహా!” అను మకుటంతో రాసారు. వైరి అనగా శత్రువులను సంహరించుట యందు వేగము కలవాడైన సింహాచల నారసింహా! అని వేడుకున్నాడు. శత్రువులు సింహాచలమును ముట్టడించుటకు శరవేగంగా వచ్చుచుండిన ఆ సమయములో వేగము అత్యావశ్యకము కనుక ప్రతి పద్యంలోనూ సింహాచలం నారసింహుని ఆ విధమైన మకుటము తో సంబోధించెను.
సింహాచలం దేవాలయమునకు శత్రువుల వలన విపత్తులు సంభవించే సమయమున భయోద్వేగ, భావోద్వేగ, భక్తి ఉద్వేగంతో కూడిన ఈ కవితాధార ఆశుధారా రూపంలో వెలువడి శతక రూపమును ధరించినది. అందువలన ఈ శతకము మొదటి నుండి తుది వరకు అపూర్వమైనా ధారా విశిష్టతను కలిగి ఉన్నది.
సీ// శ్రీమద్రమారమణీ మణీ రమణీయ
సరస చిత్తాబ్జ బంభర! పరాకు
శంఖ చక్ర గదాసి శార్జ్ఞ చాపాలి భా
సుర దివ్య సాధనకర! పరాకు
ప్రహ్లాద నారద వ్యాస శుకాదిక
భక్త సంరక్షణ పర!పరాకు
బహుతర బ్రహ్మాండ భాండ పరం పరా
భరణ లీలా దురంధర! పరాకు
తే// నీకు సాష్టాంగ వినతు లనేక గతులఁ
జేసి విన్నపమొనరింతుఁ జిత్తగింపు
చెనఁటి వీఁడని మదిలోనఁ గినుక మాని
వైరి హర రంహ సింహాద్రి నారసింహ!
తొలి వాక్యమును ప్రభువును సుముఖుని చేసికొనుటకై మొదటి పద్యం మొదటి పాదములో
“శ్రీమద్రమా రమణీ మణీ రమణీయ సరస చిత్తాబ్జ బంభర!” అని సంబోధించి, విపద్దశను గుర్తింప చేయుటకు “పరాకు” అని నుడివెను.
రెండవ పాదములో “శంఖ చక్ర గదాసి….. దివ్య సాధనకర! “పరాకు” అను సంభోధనమున శత్రుసంహారమునకు ఉపయోగించు యుద్ధ సాధనములు నీ హస్తమున నెలకొని ఉన్నవనియు, మరియు అవి దివ్యములు కనుక శత్రువులను సంహరింపవలయుననియు చెప్పెను. మూడవ పాదమున ప్రహ్లాద నారద….. భక్త సంరక్షణ పర పరాకు అనగా నీవు భక్త సంరక్షణాసక్తుడవు కనుక ఈ మహా విపత్తు నీవే తొలగింప పూనుకొనుము. నాలుగవ పాదములో బహుతర బ్రహ్మాండ భాండ పరంపరాభరణ లీలా దురంధర! పరాకు అనుదానిచే ఒక్కొక్క బ్రహ్మాండమందు పదునాలుగు లోకములు గల ఈ లెక్కలేనన్ని బ్రహ్మాండములు నీకు భాండములుగా ఉన్నవి. అటువంటి నీకు ఈ శత్రువులను శిక్షించి, నీ ఆలయమును రక్షించు కొనుట అనునది అత్యల్ప కార్యము కావచ్చును అంటూ భక్తి భావధ్వని ప్రధానమైన కావ్యం. ఇందలి పద్యములన్నియు భక్తిభావమునే ధ్వనింప చేయుచున్నవి.
ఈ శతకంలో స్వామి వద్ద తనకు గల చనువుతో నిందలతో, నిష్టురములతో, అధిక్షేపములతో అవహేళనములతో స్వామిని హెచ్చరిస్తూ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంతో, నిర్భీతితో, ఆశుధారా రూపమున తన నోట వెలువడిన ప్రతి పదమును, తిరిగి అడగకుండా లిఖించిన హరిహరదాసు ప్రశంసనీయులు.
7వ పద్యములో “పొట్నూరులోని కోదండరామ మూర్తి ఏ పొదలలో దాగెనో, భీమసింగిలోని గోపాల మూర్తి యెక్కడి కేగెనో, జామి లోని జనార్ధనస్వామి యెచ్చోటికి వెళ్ళెనో, చోడవరములోని కేశవ రామమూర్తి ఎన్ని పాట్లు పడుచున్నాడో” అను వాక్యముల చేత ఆయా ఆలయములను తురక సైన్యములు పాడుచేసెను అను విషయము స్ఫురింప చేయబడినది.
8వ పద్యములో యవనులూ, ఖానులూ, తురకలూ “నీకు వారి నమాజులు మున్నగు వానియందే ఇచ్చ పుట్టెనా” అని భగవానుని ఎత్తిపొడిచెను. వీరినందరినీ శీఘ్రముగా ఢిల్లీకి తొలగ ద్రోలుము” అని చెప్పుట చేత వీరిని విధ్వంసం చేయకుమని ప్రార్థించుటచేత భారతీయ సహజమైన కవీంద్రుని అహింసా దృష్టి వెల్లడగును.
ఈ శతకంలోని ప్రతి పద్యము అర్థవంతమైనది.
9వ పద్యంలో నీ కొండమీదికి ఈ దుష్టులు భక్తులను కొట్టుట, పవిత్రములగు మంటపములందు కల్లు త్రాగుట, నీ వంటశాలలో మాంసపు ముక్కలను వండుట, గుడిలో చొచ్చి పరసతుల భంగపరచుట మొదలగు దుష్కార్యము లను చేయకుండగనే వారిని పౌరుషంతో పారద్రోలు ము అని ప్రార్ధించెను.
11వ పద్యంలో ఒక్క భార్యగల గృహస్థులు ఇన్ని ఇడుములు పొందినప్పుడు అష్ట భార్యలు 16000 సతులు కల నీవు ఎక్కడికి వలస పోయెదవు? అని అధిక్షేపించెను.
యవనుల ముట్టడియు, శతక రచన ఏక కాలమున జరుగుచుండుట క్రమముగా పద్యములలో కనబడును.
మహమ్మదీయులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో వారి దృశ్యాలను చూసిన కవి నరసింహుని గేలి చేస్తూ
“జడ విప్పి జులపాలు సవరింపు మిరువంక
……. బీబీ నాంచారిని బిలిపింపు వేగమే
తుదకభ్యసింపు మీ తురక భాష” (32)
ఆత్మ కీర్తన చేయ హరి భక్తులేటికీ
కేకలు వేయగా ఫకీర్లె గలరు (41)
ఈ శతకం చెప్పారు. తురుష్కుల దుశ్చర్యలను నిశితంగా ఖండించి దేవుని సైతం మేలుకొలిపాడు.
“నీవు సింహాచల గుహలలో దాగిన నిన్ను పిరికివాడందురు” అని భగవానునికి నిందా భయమును కలిగించెను.
ఇంతలో శత్రు సైన్యములు సింహాచలం కొండ ఎక్కుతూ ఉన్నవి. ఈ విషయమును కవి
“అరి సైన్యధూళి సూర్యాక్రాంతమై మించె నింకేమి దయఁ జూచెదీవుమమ్ము ”
జాగరూకుడవై రిపు క్షయ మొనర్పు”
“నాకేమియు నిమ్మని నినుఁగోరుట లేదు
నీ పద సేవలు చేయు మాకు వేరు కోరికలెందులకు” అంటూ ప్రార్థించారు.
ప్రజలు గ్రామములను వదిలి వలస పోయిరి. దుష్టులు సర్వము దోచిరి. ప్రజలు పడరాని పాట్లు పడిరి. ఇప్పుడు తురక దండు మీ చెంతకే వచ్చింది.
“శీఘ్ర బుద్ధే పలాయనమ్” శీఘ్ర బుద్ధి కలవానికి పారిపోవుటయే కర్తవ్యము” అని లోకోక్తితో ఎత్తిపొడిచెను.
“నిఖిల విశ్వంబును నీయందణఁగియుండు
విశ్వంలో నీవు వెలసినావు”(59)
దుష్టుల శిక్షింప వేమి? అని ప్రార్ధించి
ఇంత బ్రతిమాల మాకేలా?
కందకు లేని దురద బచ్చలి కేల?
అది నిరుత్సాహం ప్రదర్శించెను.
భగవంతుని లీలా విశేషాలను శ్రీరామచంద్రుని ప్రసన్నతను ఇలా చెప్పారు
“నీ పాద రజమున నిముషంబు లోపల
బాపురే! సతి అయ్యే చాపరాయి!”
కానీ భగవంతుని పొగిడెను.
వెంటనే ఉక్కు మూతులు గల గండు తుమ్మెదలను పంపి ఆ దుష్ట సైన్యమును చీల్చి చెండాడగా, యవనుల గర్వము అణిగినది. ప్రజలు రక్షించబడిరి. ఆలయమునకు ప్రమాదం తప్పింది. (69)
గీత// అరుల బరిమార్చి, వైశాఖ పురసమీప
గిరి బిలంబున డాగె, బంభరములెల్ల
అది మొదలె తుమ్మెదల మెట్టయండ్రుదాని
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(70)
తరువాత ఈ మహాకవి భగవంతుడైన నరసింహుని తాను నిష్టురోక్తుల బలికి నిందించినందులకు పశ్చాత్తాపపడి “అపరాధిని నపరాధిని” అని 32 పర్యాయములు పలికి, దయ చూపుమని క్షమాపణ వేడుకొనెను.
వీరాధివీరుడువై విరాజిల్లు నిను
బిరికివాడంటిని భీతి లేక”
క్షమాపణ కోరుకున్న తరువాత అతని మనస్సు శాంతి పొంది భగవత్ మహత్యమును ప్రత్యక్షముగా సందర్శించి బ్రహ్మానంద పారవశ్యమును పొంది హృదయమున గల భక్తితో
“ప్రభూ! శత్రువులను మర్దించి అలసితివి
నా హృదయ శయ్యయందు పరుండుము
నేను నీ పదములొత్తెదను”
78 నుండి 98 వరకూ ప్రౌఢమైన రచనతో దశావతారములు వర్ణించెను.
మకుట కుండల కేయూర మహిత కంక
ణాంగుళీయక ముఖ్య భూషాంగ, విశ్వ
నిలయు, నారాయణ స్వామి నిన్నుఁ గొలుతు
వైరి హరి రంహ! సింహాద్రి నారసింహ!(101)
ఈ విధంగా
కూర్మనాథకవి ఆశువుగా శతకాన్ని చెపుతూంటే తన సహచరుడైన ఆదుర్తి హరిహరదాసు గంటం పట్టుకుని తాటి ఆకులపై వ్రాసారు. కవి మొర ఆలకించి స్వామి కొండ గుహల నుంచి తుమ్మెదల దండును పంపి మహమ్మదీయులను భయంకరంగా హింసించి విశాఖపట్టణం స్మశానం దాకా తరిమి వేసేటట్లు చేశాడు. నాటి నుండి ఆ ప్రాంతానికి తుమ్మెదల మెట్ట అని పేరు వచ్చింది.
విజయరామరాజు తుమ్మపాలెం వద్ద శత్రువులను ఓడించి తిరిగివస్తూ ఈ విషయాన్ని విని కూర్మనాథ కవికి రామతీర్థం సమీపాన ఒక అగ్రహారాన్ని, శతకాన్ని తాటి ఆకులపై వ్రాసిన హరిహర దాసుకు కొత్తవలస వద్ద నిమ్మ పాలెం అను అగ్రహారాన్ని ఈనాముగా ఇచ్చారు. నేటికీ సింహాచలంలో దేవుని కళ్యాణం రోజున వీరికి కొంత దక్షిణ ఇచ్చుకునే ఆచారం వుంది. ఈ శతకానికి తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉంది.