ఈ సంచికలో మంచివాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు ‘స్నేహం’ ఎలా ఉండాలో భర్తృహరి చెబుతారు.
శ్లో|| క్షీరేణాత్మగతోదకాయ హి గుణాదత్తాః పురాతే౭ఖిలాః
క్షీరోత్తాపమేక్ష్య తేన పయసాస్వాత్మా కృశానౌ హుతః
గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్వాతు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి, సతాం మైత్త్రీ పునస్వ్తీదృశా
సజ్జన పద్ధతిలోని ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణకవిగారి అనువాదం పరిశీలిద్దాం.
చ. క్షీరము మున్ను నీటికొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్
క్షీరము దప్తమౌటగని చిచ్చుఱికిన్ వెతచే జలంబు దు
ర్వారసుహృద్విపత్తిగని వహ్న జారంజనె దుగ్ధ, మంతలో
నీరము గూడి శాంతమగు, నిల్చు మహాత్ముల మైత్రి యీ గతిన్
పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలను ఇస్తుంది. తనకు సహాయం చేసిన పాలు కాగిపోతూ అగ్నిలో పడబోతుండగా దానికి నీరు చేరువ కాగా అది శాంతిస్తుంది. సజ్జనుల మధ్య మైత్రీ భావం ఇలానే ఉంటుంది.
మిత్రులైన సజ్జనులు వారిలో ఎవరికి ఆపద వచ్చినా పరస్పరం సహాయం చేసుకొని ఆ ఆపద నుండి బయటపడతారని కవి చెబుతూ పాలు – నీరు దృష్టాంతంతో వివరిస్తున్నారు.
మొదట మనం పాలలో నీటిని కలుపుతాం. అప్పుడు పాలకు నీటితో స్నేహం ఏర్పడుతుంది. అందువల్ల పాలు, స్నేహ ధర్మంతో నీటికి తన మాధుర్యాది గుణాలనన్నింటినీ ఇస్తుంది. ఆ తరువాత వాటిని అగ్నితో వేడి చేసినప్పుడు ఆ వేడికి పాలు బాగా కాగిపోతుంటాయి. తమకు ఆశ్రయమివ్వడమేగాక మాధుర్యాదిగుణాలను కూడా ఇచ్చిన పాలు కాగిపోవడం చూచి, నీరు మైత్రీభావంతో, పాలు ఇంకిపోకుండా తాము ఇగిరిపోతుంటాయి. నీరంతా ఇగిరిపోగానే, ఇఁతసేపు తమతో కలిసి ఉన్న నీరు లేదనే భావనతో పాలు పొంగి నిప్పులో పడబోతూ ఉంటే మళ్ళీ చేరిన నీరు ఆ పాలను పొంగకుండా చేస్తుంది. ఈ నీరక్షీర విధానం మనం రోజూ వంటింట్లో చూచేదే. ఈ రెండింటి స్వాభావికమైన తీరును కవి, మంచివారి స్నేహానికి ఆపాదించి చెబుతున్నారు. పాలు తమ మాధుర్యాది గుణాలను నీటికిచ్చినట్లుగా సంపద ఉన్న మిత్రుడు తన మిత్రునికి సంపదనిస్తాడు. సంపద ఇచ్చిన మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు, పూర్వం సంశయం పొందిన మిత్రుడు ఆ మిత్రునికి సహాయం అందిస్తాడు. మంచి మిత్రులు ఎప్పుడూ ఇలాగే పరస్పరం చేసుకుంటారు.
ఈ విషయాన్నే అబ్దుల్ కలామ్ గారు – ఒక మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానమంటారు. ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానమని చెబుతారు. అంటే స్నేహితుడు జీవిత మార్గదర్శిగా నిలుస్తాడని, నిలవాలని వారి అభిప్రాయం. వీరే మరొక సందర్భంలో మంచి స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని, ఆత్మీయ స్నేహితులు ఒకరికొకరు అర్థం చేసుకుంటారని, నిజమైన స్నేహితులు ఎల్లవేళలా , ఎల్లలు దాటినా, ఎల్లప్పుడూ ఉంటారని చెబుతూ స్నేహధర్మాన్నీ, స్నేహ మాధుర్యాన్ని తెలియజేశారు.
మనిషి సంఘజీవి. ఒకరి సహాయం లేనిదే అతని జీవితం, జీవిక సాగదు. అది స్నేహస్పదమైతే మరింత మధురంగా ఉంటుంది. దానికై మనం మనుగడ సాగించాలి. దానితో జీవనం కొనసాగించాలి.