Home వ్యాసాలు సంక్రాంతి ముగ్గులు పడుచుల ఓపికకు ప్రతీకలు ,సంస్కృతి

సంక్రాంతి ముగ్గులు పడుచుల ఓపికకు ప్రతీకలు ,సంస్కృతి

భారతీయ మహిళలు కళాపిపాసకులు ఏ పనినైనా అందంగా తీర్చిదిద్దడం వారికి అలవాటు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల ముగ్గులు వాకిట్లో వేయడం తెలుగు ఆచారం. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వాకిలిని ఆవుపేడతో అలికి లేదా కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ ముగ్గులు ఇంటికి అందం కంటికి అందం.
సంక్రాంతి పర్వదినాల్లో ఆవుపేడతో చల్లినా – లేదా అలికిన ఇంట్లోకి క్రిములు కీటకాలు, సూక్ష్మక్రిములు చేరవని పల్లెవాసుల ఒక విశ్వాసం,ఇది సహజం పూర్వ కాలంలో ఉండేది, అక్షరాల సత్యం. ఈ ఆధునిక కాలంలో కృత్రిమమైన ముగ్గులకు అలవాటు పడిపోతున్నారు మహిళా మణులు. ఆనాటి ఆహ్లాదకరమైన వాతావరణం నేడు కనిపించడం లేదు. సహజత్వానికి దూరంగా మసలుతూ ఉన్నారు.

ముగ్గులను రంగవల్లులు, రంగవల్లికలు అని అంటారు. రంగం… వేదిక. ప్రపంచం. ‘ వల్లిక ‘ అంటే అందమైన అల్లిక. ప్రపంచానికి సంబంధించినవే జ్ఞానాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది. కనుక దీన్ని రంగవల్లిక అన్నారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగకి ఇతర పండుగలకు లేని
విశిష్టత వుంది . హిందువుల పండుగలలో కేవలం సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. మిగతా పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి.

పండుగలు వ్యక్తిని లౌకిక జీవితాన్నుంచి , ఆధ్యాత్మిక చింతనకు మార్గనిర్దేశికతను సూచిస్తాయి. భగవధ్యానానికి దోహదపడతాయి.

సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి సంక్రమణం చెందే పవిత్రమైన రోజున “మకర సంక్రాంతి” గా ఆనందోత్సవాలతో జరుపుకోవటం అనాదిగా వస్తున్నది. భోగి, మకర సంక్రాంతి,కనుమ, ముక్కనుమ కూడా, ఇది పాడి పంటల పెద్ద పండుగగా కూడా పెద్దలు చెబుతారు. ఈ మూడు, నాల్గు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. పట్టణాలలో కంటే, పల్లెల్లో సంక్రాంతి హడావుడి హరిదాసుల సందడి, కోడిపందాలు, గాలిపటాలు పండుగ సంబరాన్ని ప్రతి ముంగిటి లోనూ కనిపించే గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు సంక్రాంతి ప్రత్యేకత ను మరింత ఆనందంగా ప్రదర్శిస్తాయి.

ఈ సంక్రాంతి సూర్యుని సంక్రమణానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశములో జరిగే, గ్రహగతులను నేల మీద ముగ్గుల రూపంలో గమనించే ఏర్పాటు చేశారు మన ప్రాచీనులు. తొమ్మిది చుక్కల ముగ్గు ఇది నవగ్రహాలకు సంకేతం. ఆవుపేడతో అలికిన నేల, ఆ పైన కనిపించే ఆకాశానికి సంకేతం. నేల మీద పెట్టబడిన చుక్కలు నక్షత్రానికి సంకేతం .ఆ చుక్కలను ఏ తీరుగా కలుపుతూ ప్రతి చుక్క కూడా ఓ గడిలో పదిలంగా కూర్చునేలా చేసి , దాన్ని “ముగ్గు” అనే పేరిట పలికేలా చేసిన ఈ విధానమంతా ఏ గ్రహం ఎలా ప్రయాణిస్తుందో, ఖగోళంలోని ఏ గ్రహగతి నక్షత్ర స్థితి ఎలా ఉందో తెలియజేసే సంకేతం.

గ్రహగతి రంగవల్లిక ద్వారా ఏ గ్రహం దేనితో మైత్రి ఉంటుందో, ఏ గ్రహం దేనికి శత్రువువో,ఏ గడి దేనికి అనుకూలమో అనే జ్యోతిష్య పరిజ్ఞానంతో ముగ్గులను తీర్చి దిద్దేవారు. ముగ్గులలో మధ్య గడిలో ఉండే సూర్య గ్రహానికి ఎరుపు రంగు కుంకుమతో, సూర్యునికి ముందుగా ఉండేది శనిగ్రహం ఆ గడికి నల్లని రంగుతో లేదా నీలి రంగుతో నింపేవారు. ఏ గడిలో ఏ రంగు నింపాలో అదేవిధంగా ప్రతి ముగ్గు లోనూ అలంకరిస్తూ ఉండేవారు ప్రాచీనులు.

“దేవుడి ముగ్గు” ఇది కుండలినీ శక్తికి సంకేతం. రెండు త్రికోణాలు ఇందులో ఉంటాయి. మధ్యలో ఒక చుక్క ఉంటుంది దేవుడి గది ముందు వేస్తారు. మరోరకం ఆరు చుక్కల ముగ్గు.త్రికోణాలు ఇందులో ముగ్గు అని కూడా అంటారు.వేడుకగా దేవుని ముందు వేసేది అష్ట ఇందులో కోణాలని మలుపుల తీరుగా ఉంటాయి. దైవ మందిరం ముందు వేసే మరో ముగ్గు పద్మపు ముగ్గు. ఇది ఎనిమిది కోణాల ముగ్గు తూర్పు వైపున ఇంద్రుడు, తూర్పు దక్షిణానికి మధ్యన అగ్ని, దక్షిణ వైపు యముడు, దక్షిణ పశ్చిమానికి నడుమ నైరుతి, పశ్చిమానికి వరుణుడు పశ్చిమోత్తర వాయువు, ఉత్తరము కుబేరుడు, ఉత్తరానికి తూర్పు కు నడుమ ఈశానుడు ఉంటారు. ఇవన్నీ గ్రహ ఉపగ్రహ విధానానికి ప్రతీకలు.

సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వేసేది స్వర్గద్వారం ముగ్గు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగానే ముక్కోటినాడు తలుపులు తెరిచి ఉన్నట్టుగా ఈ ముగ్గులు వేస్తారు. అట్లాగే భోగినాడు స్వర్గ ద్వారాలు మూసి ఉన్నట్టుగా సంక్రాంతినాడు వైకుంఠ వాకిలి తెరిచి ఉన్నట్టుగా ముగ్గులు వేస్తారు. భోగినాడు వాకిలి బయట రథం ముగ్గు వేస్తారు.u సంక్రాంతి రోజు ఇంటి ముందుకు రథం వచ్చినట్లుగా వేసి రథాన్ని లాగే తాడు ఇంట్లోకి వచ్చే ఎలా వేస్తారు. కనుమనాడు ప్రధాని బయటికి వేస్తారు. ముక్కనుమ నాడు మన రథాన్ని పక్కింటి రథానికి తగిలేట్టుగా వేస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందు నుంచి కదిలే రథం ఊరి చివరి దాకా సాగుతుంది. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు మా ఇంటికి వచ్చాడు ఆయనకు పూజ చేసి పరమాన్నం పెట్టి పంపించండి అన్నా మార్మిక సందేశాన్ని ముగ్గులు సంకేతంగా చెబుతాయి.
ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి పండుగ ముంగిట్లో ముగ్గులు ఇంటికి శోభని వ్వడమే కాదు లక్ష్మీప్రదం కూడా. ఎవరి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు అలంకరించబడి ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుందనే విశ్వాసం . మనం రోజు తినే ఆహారం భూదేవి మనకు ఇచ్చిన వరం, అటువంటి భూమాతను అలంకరించడంమే ముగ్గులు వేయడంలోని ఆంతర్యం. మారేడు దళం ముగ్గు, తులసి కోట ముగ్గు. పద్మ బంధం నాగబంధం, గుమ్మడి పండు ముగ్గు ఇలా రకరకాల ముగ్గులు ఇంటి ముందు తీర్చిదిద్దడం ముగ్గు వ్యక్తి మనస్తత్వం చెబుతుంది. ముగ్గులు వేయడానికి ఓపిక కావాలి అభిరుచి ఏకాగ్రత ఎంతో అవసరం. తెల్లవారుజామున ముగ్గులు వేయడం స్త్రీ మూర్తుల శరీరాలకు వ్యాయామం లాంటిది. ముగ్గులు పెట్టడం మన భారతీయ సంప్రదాయం.

⚜️ ⚜️ ⚜️ ⚜️
⚜️⚜️
⚜️

* వరి పిండితో వేసిన ముగ్గులు చిన్న చిన్న కీటకాలకూ, పక్షులకూ ఆహారం అవుతాయి.
* భూత దయకు ఆలవాలంగా నిలుస్తాయి .
* ముగ్గులోని కాల్షియం క్రిమి కీటక సంహారానికి తోడ్పడుతుంది.
* వనితలు నడుము వంచి ముగ్గులు వేయడం మూలంగా కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రాకుండా నిరోధిస్తాయి.
* ముగ్గులు వేసేటప్పుడు నడుము వంచి వేయటం వల్ల ఉదర కండరాలకి కలిగే ఒత్తిడి మసాజ్ లా పనిచేస్తుంది.
* నేటి ఆధునిక యుగంలో మహిళా మణులు రకరకాల రంగులతో వేయడం, స్త్రీలలోని సృజనాత్మకతకు అద్దం పడతాయి.
* ముగ్గులు దేవత ఆరాధనగా చెప్పవచ్చు.

You may also like

Leave a Comment