క్షేత్రయ్య సంగీత్ రచన నభూతో న భవిష్యతి. పద రచనకు సంబంధించినంత వరకు ఈతనికి ముందు సాహిత్యానికి ఉన్న స్థానం, విశిష్టత సంగీతానికి లేదు. ఒక్కొక్క రాగం, అది పలికే తీరు, ఆ స్వరాల కున్న శక్తి, ఆ స్వర సమూహంవల్ల కలిగే మధురిమ, ఆ స్వరచిత్రం వల్ల ఏర్పడే ఆనందం, మన కళ్లముందు తిరుగాడే ఛాయా చిత్రం లాగా ఒక సమగ్ర స్వరూపమును అందిస్తుంది క్షేత్రయ్య సంగీతపు బాణి.
ఏ రాగం ఉపయోగంచడం వలన ఒక రచన మనోజ్ఞంగా భాసిస్తుందో, ఏ రాగం ఉపయోగంచడం వలన ఆ రచన మరింతగా భావభరితం అవుతుందో బహుశః క్షేత్రయ్యకు తెలిసినట్లు ఇంకొక పద కవికి తెలియదు అన్నది అతిశయోక్తి కాదు. రస నిర్వహణకు కావలసిన అంగ నిరూపణలో సున్నితమైన, సుకుమారమైన భేదాలను కల్పించడమే గాక వాటిని చిత్రించడానికి కావలసిన భాష, సంగీత రచన ఇతనికి కరతలామలకం. ఏ స్వర సంగతుల వలన రాగంలో భావోద్రేకం కలగడానికి వీలు అవుతుందో తెలిసిన ప్రౌఢ కవి కాబట్టే దానికి తగిన సాహిత్యం కూడా అప్రయత్నంగా రాగ భావంలోని ఆవేశంతోపాటు కలిసి సుకుమారమైన తీగలుగా సాగి సువాసన భరిత పుష్పాలను రసికులకు అందించింది.
ఆయా రసభావాల తీవ్రత లోని వ్యత్యాసాలు, అక్కడ ఉపయోగించిన రాగ వైవిధ్య ప్రయోగ జ్ఞానం కల ఈతని పాండిత్యం శ్లాఘనీయం. ప్రత్యేకించి విషాద భరిత సమయంలో ఉపయోగించిన పున్నా గవరాళి, కాంభోజి, నాద నామక్రియ, ముఖారి, నవరోజు వంటి రాగాలలోని అతి సూక్ష్మ ప్రయోగాలు, విన్నప్పుడు ఆర్ద్రతతో కూడిన గుండె చిత్తడి కావడంతోపాటు కంట తడి కాకమానదు. సంగీతం ముఖ్యంగా మనసుమీద చాలా ప్రభావం చూపుతుంది. అది మనలో ఎందరికో అనుభవమే కదా! ముఖ్యంగా హుస్సేన్, కాంభోజి, తోడి వంటి రాగాలలో క్షేత్రయ్య చూపిన వైవిధ్యం ఇంతవరకు ఇంకొక వాగ్గేయకారుడు చూపలేదు అనడం సాహసం కాదు.
హిందుస్థానీ సంగీతంలో ఒక ప్ర్రకియయైన టుమ్రీలలో రాగభావం పలికించడానికి ప్రత్యేక సాధన చేస్తారు. రాగంలోని జీవస్వరం, రాగఛాయ గొంతులో స్పష్టంగా, శ్రావ్యంగా పలకడానికి కృషి చేస్తారు. క్షేత్రయ్య పదాల్లోని సంగీత విశేషాలు గమనిస్తే ఇతనికి హిందుస్థానీ సంగీతంతో పరిచయం ఉందేమో అని సందేహం కల్గుతుంది. ఎందుకంటే పల్లవి నుంచి అనుపల్లవికి, అనుపల్లవి నుంచి చరణానికి, రెండు చరణాల మధ్యన, తిరిగి చరణం నుంచి పల్లవికి సాగిన రాగప్రస్తారం క్రమంగా విస్తరించి కోరక దశ నుంచి వికసించిన పుష్పం లాగా చిత్తరంజకత కల్గిస్తుంది. అందుకే తరువాతి కాలంలోని సంగీతజ్ఞులు ఈతని రాగ సంచారం గమనించి ఆశ్చర్యపోయారు. ఈతని పదాలు రాగ సంచారానికి నిఘంటువు వంటివి అని ప్రశంసించారు.
సంగీత జ్ఞానంతోపాటు తాళ జ్ఞానం ఇతనికి అపారం. అభినయంలో కూడా అందెవేసిన చేయి కాబట్టి ఈతని పదాలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా మిశ్రచాపు తాళపు నైపుణ్యం ఇతని పదాలలో విరివిగా కన్పిస్తుంది. అభినయానికి ఈ తాళం చాలా అనుకూలమైంది. మూడు, నాలుగు అక్షరాల కలయిక అయిన ఈ ఏడక్షరాల మిశ్రచాపు
తాళంలోని గతినిగాని, విన్యాసాన్నిగాని, అతి రమ్యంగా ప్రదర్శించాడు. అతి సూక్ష్మ భావాలు కూడా ఈ తాళం ద్వారా అద్భుతంగా ప్రకటించబడ్డాయి. అభినయానికి మరొక్క విలక్షణతను ఆపాదించాయి. రాగాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి సమ్మోహన దీప్తి, తాళాలకు ఇంతటి మహత్తర శక్తి ఉంటాయి అనడానికి క్షేత్రయ్య పదాలే సరైన ఉదాహరణలు.
ఈతని పదాలు అతి విలంబ గతిలో ఉండడంవలన కొంత క్లిష్టత ఉండడం సహజం. గాత్రంలో విపరీతమైన నియంత్రణ ఉంటే తప్ప ఈతని పదాలు గానం చేయలేరు. అందుకే ఈతని ధోరణిని తర్వాతి పద కవులకు దాదాపుగా అసాధ్యమైపోయింది. అంతేకాదు, క్షేత్రయ్య పదాలు ఆడిపాడడానికిగాని, చూడడానికి కూడా ఎంతో రసజ్ఞత కావాలి. అది లోపించడంతోపాటు అన్నిటా వేగం పెరిగిన నేటి కాలంలో విలంబ గతిలో సాగే క్షేత్రయ్య పదాలకు ఆదరం తగ్గింది అనుకోవాలి. కాబట్టే ఈతనిని ఏ కవి అనుకరించలేదు. అందుకే నేడు ఈతని పదాలు గానంలోగాని, అభినయంలోగాని కొంత కనుమరుగయ్యాయి.
కేవలం పదకవిగా అపార వైదుష్యం కలవాడిగా మాత్రమే కాక ఇతను కృష్ణభక్తుడు. అందుకే ఈతని పదాలన్నీ మువ్వగోపాల ముద్రతో కన్పిస్తాయి. తాను రచించిన పదాలు పాడుకోవడానికి, అభినయించడానికి అన్న భావన క్షేత్రయ్యలో స్పష్టంగా కన్పిస్తుంది.
ఉదాహరణకు
‘‘బాళితో మువ్వగోపాలునిపై వేడ్క పదమైన పాడుకొంటిమా;
పదము పాడగా వినెవో;,
చిటికెన కొనగోరు చిమ్ముకొంచు పలుమారు చిటిపొటి పదములు చేరి పాడుచు;’’
ఇట్లా ఎన్నోసార్లు అంటాడు.
ముఖ్యంగా క్షేత్రయ్య పదాలు ఉద్వేగప్రధానాలు, ఈ పదాలు పాడాలన్నా, అభినయించాలన్నా జోడు గుర్రాల స్వారీ వంటిది. అన్నమయ్య పదాలలో భక్తి ప్రధానంకాగా, ఈతను తన పదాలలో భక్తితోపాటు రక్తిని కూడా రంగరించాడు.
చివరగా అతని మాటలలోనే అతని అభిప్రాయం విందాం.
వెన్నెల బైట సంగీతము విననట్టి వేడుకేటి వేడుకే?
చిన్నెలు మెరయించి చిరునవ్వు నవ్వని చిత్తమేటి చిత్తమె?
సన్ను తాంగిరో! కనుసైగ సేయని యట్టి పదములేటి పదములే?