ఈ సంచికలో మనం విద్వాంసుల తీరు ఏ విధంగా ఉంటుందో భర్తృహరి నీతి శతకం ద్వారా తెలుసుకుందాం.
శ్లో|| దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనే, నయో నృపజనే, విద్వజ్జనే చార్జవమ్
శౌర్యం శ్రతుజనే, క్షమాగురుజనే, కాన్తాజనే ధృష్టతా
యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోకస్థితిః
విద్వత్ పద్ధతిలోని ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు ఎలా అనువదించారో చూద్దాం.
చ. వరకృప భత్యులందు, నిజవర్గమునందనుకూలవృత్తి, కా
పురుషులయందు శాఠ్యము, సుబుదు్ధలయందనురక్తి, దాల్మి
ద్గురువులయందు, గౌరవము కోవిదులందు, నయంబురాజుల
దరిజనులందు శౌర్యము, మృగాక్షులయందు బ్రగల్భభావవీ
వరుసగళా ప్రవీణులగు వారలయందు వసించులోకముల్
సేవకాజనము యందు అపారమైన ప్రేమ, బంధువుల యందు అనుకూలమైన ప్రవర్తనము, దుష్టజనుల యందు కాఠిన్యము, సజ్జనులయందు ఇష్టము, పెద్దలయందు సహనభావము, పండితుల పట్ల గౌరవము, రాజుల విషయంలో నిబద్ధతను, శ్రతువులయందు పరాక్రమము, స్త్రీలయందు నిగ్రహశక్తి – మొదలైన గుణములు ప్రదర్శించే కళల్లో ఎవరు నిపుణులో వారివల్లనే లోకము పురోగమిస్తుందని పై పద్యానికి భావము.
మానవుడు సమాజాన్ని విడిచి దూరంగా మనలేడు. జీవనం సాదదు కూడా. అందువల్ల పరిస్థితులనుబట్టి, వ్యక్తులనుబట్టి తన వ్యవహారశైలిని మలుచుకోవలసి ఉంటుంది. తన సేవకాజనము పట్ల దయాగుము కలిగి వారి అవసరములను గుర్తించవలసి ఉంటుంది. బంధువులను తగిన రీతిలో మన్నిస్తూ మసలుకోవాలి. చెడ్డవారితో కఠినంగా వ్యవహరిస్తేనే మరోసారి వారు దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉంటారు. వయసు మీద పడిన వారితో చాలా సమానంగా, వారికి వలసిన విధంగా మసలుకోవలసి ఉంటుంది. పండితుల యందు గౌరవభావాన్ని కలిగి ఉంటేనే మన సంస్కారభావం వెలికి వస్తుంది. అంతేకాక కొద్దొ గొప్పో మనకూ పాండిత్యం అబ్బుతుంది. రాజుల ఆజ్ఞలను శిరసావహిస్తూ, శ్రతువుల యందు పరాక్రమాన్ని ప్రదర్శించాలి. స్ర్తీలయందు ఇంద్రియ నిగ్రహము (పురుషుల యందు స్త్రీల) పురుషులు కలిగి ఉండాలి. ఇటువంటి నేర్పరితనము ఎవరిలో ఉంటుందో వారివల్లనే దేశాలు (లోకాలు) వృద్ధిలోకి వస్తాయి.
కవి మాటల వలన మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే – ఏ దేశమైనా విద్వత్తు కలిగిన వారివల్లే వృద్ధిలోకి వస్తుంది. చదవు వేరు విద్వత్తు వేరు. చదువు ఉండి, విద్వత్తు ప్రవర్తించలేనివారివల్ల దేశాభివృద్ధి, నాగరికత ఛిన్నాభిన్నమౌతాయి. కాబట్టి సదసతం వివేక చతురత కలిగినవారివల్లే పరిపాలన సుగమమవుతుంది. క్రింది నుండి ఉన్నత వర్గము వరకు ఎవరివట్ల ఎలా ప్రవర్తించాలో తెలిసినవారే అసలైన విద్వాంసులు. వారితోనే మన సంస్కృతి, మన ప్రగతి ముడిపడి ఉంటుందన్నది వాస్తవం.
గౌతమబుద్ధుడు, స్వామి వివేకానందుని బోధనల్లోనూ అబ్దుల్ కలామ్ గారి ప్రసంగాల్లోనూ పై పద్యం యొక్క భావాలు మనం గుర్తించవచ్చు. సాటివారిపట్ల మిక్కిలిదయ, తమను ఆశ్రయించుకని ఉన్నవారి పట్ల ప్రేమ, దుర్మార్గులపట్ల జాగరూకత, అశక్తులైన పెద్దవారిపట్ల మన చేయూత, గురువులపట్ల గౌరవభావము, బ్మహ్మచర్యము, ఏ సమాజమైతే కలిగి ఉంటుందో, మానవసేవే మాధవసేవగా ఎవరు భావిస్తారో ఆ సమాజమే ముందుకు సాగుతుందని, వారే మహాత్ములుగా కీర్తింపబడతారని, వారు మన దేశానికి ఎంతో అవసరమైన వ్యక్తులని కలామ్ గారు అంటారు. ఆచరించి చూపారు కూడా.