గురజాడ అడుగుజాడ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.లేఖల్లో వెతుకుదాం.
ప్రముఖ కవి,నాటక కర్త,కథా రచయిత,సంఘసంస్కర్త,
వ్యావహారిక భాషా ప్రచారకులు, ముత్యాలసరం అనే పేరుతో కొత్తదైన మాత్రాఛందస్సును సృష్టించి తరువాతి కవులకు మార్గదర్శకుడై తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని గురజాడ- అడుగుజాడ అని కీర్తి గడించి నాది ప్రజల ఉద్యమం అని చాటి చెప్పిన ప్రజానాయకుడు,అభ్యుదయ కవి,ఆధునిక సాహిత్య యుగకర్త గురజాడ వెంకట అప్పారావు పంతులు.
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ అని నినదించి దేశాన్ని ప్రేమించమని చెప్తూ దేశభక్తిని చాటిన గురజాడ 1862వ సంత్సరం సెప్టెంబర్ 21వ తేదీన యెస్ రాయవరం గ్రామం విశాఖపట్టణం జిల్లాలో వెంకటరామదాసు,కౌసల్యమ్మ దంపతులకు జన్మించాడు.
తండ్రి విజయనగరం సంస్థానంలో ఉద్యోగ జీవితం నిర్వహించి కన్నుమూశాక అప్పారావు గారు విజయనగరం వచ్చి వారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుండగా అక్కడ ఎం.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రి చేరదీశారు. 1882లో మెట్రిక్కులేషన్,1884లో ఎఫ్.ఏ.చేసి అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన తర్వాత బి.ఏ చదువుతుండగా సహాధ్యాయి గిడుగు రామమూర్తితో స్నేహం కొనసాగి ప్రాణస్నేహితులయ్యారు. వివిధ ఉద్యోగాల్లో తనదైన ముద్రవేసి,రచనా వ్యాసంగం కొనసాగించి ,అభ్యదయకవిగా సంఘసంస్కరణే ప్రధాన భూమికగా రచనలు చేసిన మహాకవి గురజాడ 1915 వ సంవత్సరంలో తన 53 వ యేట తనువును చాలించినా ఆయన రచనలు మన అందరిని ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
అప్పారావు గారికి సమకాలికులు వ్రాసిన లేఖల వల్ల, అప్పారావుగారే స్వయంగా సమకాలికులకు,మిత్రులకు,సన్నిహితులకు వ్రాసిన లేఖల వల్ల వ్యక్తిగత విషయాలు,అభిప్రాయాలు,
వివేచనాశక్తి,విమర్శనా పద్ధతులు,రచనా విశేషాలు నాటి సమాజపరిస్థితులు,ఆయన ఖచ్చితమైన దృక్పథం మొదలైన అనేక విషయాలు తెలుసుకోవచ్చు.పంతులు గారి స్వభావం లేఖల వల్ల విదితమౌతుంది.
పాఠ్యపుస్తక నిర్ణయంలో కానీ, రచనలో వ్యావహారిక భాషను ప్రయోగించడంలోగాని అనేక నూతన సంస్కరణలను చేపట్టాడు గురజాడ.
మిత్రునికి వ్రాసిన లేఖవల్ల గురజాడ ఉద్యోగ జీవితం,సాహిత్యకృషి తెలుస్తుంది.మీ కృషిని గురించి వివరించండి అని మిత్రుడు రాసిన లేఖకు సమాధానంగా లేఖ రాస్తూ “ఎవరి కృషిని వారు చెప్పుకోవడం బాగుండదు.బాగుండని పని మీరు నా చేత చేయిస్తున్నారు” అని సవినయంగా చెప్పుకున్నప్పటికీ ఆయన నిర్వహించిన పాత్ర ఎంత సమగ్రమైనదో తన మాటల్లోనే వ్యక్తం చేశాడు. “సిండికేటు సభ్యులందరికీ నేను తెలుసు. నా కృషి ఏమిటో తెలుసు.నా సాహిత్య కృషి ఎందుకు అడగడం” అని ప్రశ్నిస్తాడు.ఒక వాక్యం వ్రాయనివారు, ఒక పుస్తకం కూడా ప్రచురించని పండితులు మనలో చాలామంది వున్నారు.” సృజనాత్మక శక్తికి పాండిత్యానికి భేదం చాలా ఉంది.ఒక కళాశాలలోనో,పాఠశాలలోనో పండితునిగా వున్నంత మాత్రాన తానొక కవిననుకోవడం ఎవరికీ భావ్యం కాదు” అని అంటూనే ” ప్రతి పండితుడు తానొక వచన రచయితననో,కవిననో భావించడం మన దేశ దౌర్భాగ్యం…. పనికిమాలిన పాండిత్యంతో కవిత్వం మీద విరుచుకుపదుతున్నారు.” అని విమర్శిస్తాడు.నాటి సమాజంలో కొద్దిగా తెలిసినవారైనా సరే పండితుడైనా సరే కవినని చెప్పుకుని తిరిగేవారు.ఏదో కవిత్వం రాసి మిడిసిపాటు పడే వారిని చూసి సహించని గురజాడ పనికిమాలిన పాండిత్యంతో కవిత్వంపై విరుచుకు పడుతున్నారని దెప్పిపొడిచాడు.పండితులపై ఒక విసురు విసిరి నిరసిస్తూనే తన గురించి గొప్పచెప్పడం మంచిది కాదనే చెప్తూ మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నానని తన ఉద్యోగ వివరాలను తెలియపరచాడు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో కొన్ని సంవత్సరాలు ఉపన్యాసకుడుగా పని చేసినప్పుడు అక్కడ విద్యార్థులకు ఇంగ్లీషు,హిస్టరీ,సంస్కృతం బోధించేవాడు.తర్వాత విజయనగరం సంస్థానంలో శాసన పరిశోధకునిగా కొంతకాలం కృషి చేశాడు.విజయనగరంలో ” ప్రకాశిక” అనే పత్రికను నెలకొల్పి సంపాదకునిగా వున్నాడు.
ఈ లేఖలోనే తన సాహిత్యకృషిని కూడా వివరిస్తూ కన్యాశుల్కం,బిల్హణీయం నాటకాలు,నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు మొదలగు గేయాలు,ఆంధ్ర భాషా సాహిత్యంపై కొన్ని వ్యాసాలు,విమర్శలు “ఆంధ్రపత్రిక,కృష్ణాపత్రిక,కేసరి,
శశిలేఖ,ఆంధ్ర ప్రకాశిక ” మొదలగు పత్రికల్లో ప్రచురించినట్లు తెలిపాడు. ఉత్తరాలవల్ల గురజాడ వ్యక్తిత్వం నిర్మొహమాటంగా ,ముక్కుసూటిగా వుండేవాడని తెలుస్తుంది.
విజయనగరం మహారాజా వారి సంస్థానంలో శాసన పరిశోధకునిగా వుండి చేసిన సేవ కొనియాడదగింది.గురజాడ స్వయంగా వ్రాసిన లేఖలో శాసనాల వల్ల భాషా స్థితి,లిపి స్వభావం ,అనేక రాజుల చరిత్ర తెలుస్తుందని,శాసనాలను ప్రకటించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించాడు.భారతదేశంలో భాషా పరిశోధనా రంగం మరుగున పడిపోయిందనే బాధను వ్యక్తం చేశాడు.” ప్రాచీన భాషను మాండలిక భాషను పరిశీలించడం ఎంత ఉపయోగమో తెలుగు రచయితలు గుర్తించడం లేదు.దురదృష్టవశాత్తు ఈ కృషికి సి.పి.బ్రౌన్ మొదటివాడు.ఆఖరివాడు కూడా. తమిళమున అలాగ కాదనుకుంటాను” అని పరిశోధనా రంగంలో,భాషా పరిశోధనలో తెలుగువారి చాతగానితనాన్ని దుయ్యబట్టాడు.సి.పి బ్రౌన్ ను శ్లాఘించాడు.
శాసన పరిశోధనలో కష్టనష్టాలను ,చేసిన శ్రమను,అనుసరించాల్సిన పద్ధతులను లేఖల్లో సూచించాడు.తరువాతి తరం వారికి ఉపయోగపడే రీతిలో భద్రపరచాలని సూచనలిస్తూ పరిశోధనా రంగంలో అభివృద్ధి పొందాలని ఆకాంక్షించాడు. “జయవూరు చరిత్ర” గురించి పరిశోధిస్తూ మహారాజా వారు ఆమోదించినట్లయితే ఒక వ్యాసం రాస్తానని ఆసక్తిని వెలిబుచ్చుతూ ఆయన పరిశీలనలో తేలిన అంశాలను లేఖలో వివరిస్తూ” పల్లవులది భరద్వాజస గోత్రము.వివాహ సంబంధము వలన పల్లవులకు చాళుక్యులకు బాంధవ్యము కల్గినది.ఈ సిద్ధాంతము రాజా వారికి అంగీకారమయితే నేను వ్యాసము వ్రాస్తాను” అని రాజావారి అనుమతి కోరాడు.
మద్రాసు విశ్వవిద్యాలయంలో సిండికేట్ మెంబర్ గా నామినేట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గురజాడకు లేఖ రాస్తూ E.W.మిడిల్ మాస్ట్ ” ఇందులో ఏ రాజకేయ కారణాలు లేవు.కేవలం మీ పాండిత్యాన్ని ప్రతిభను పురస్కరించుకొని నామినేటయ్యారు” అనడం వల్ల ఆనాడు విశ్వవిద్యాలయం కూడా గురజాడ ప్రతిభా పాండిత్యాన్ని గుర్తించి ఉన్నత స్థానం ఇచ్చిన విషయం విదితమౌతుంది. సిండికేట్ మెంబర్ గా,పాఠ్యపుస్తక నిర్ణయాధికారిగా ఉండి గురజాడ చేసిన కృషి,తీసుకున్న నిర్ణయాలు,ఖచ్చితమైన అభిప్రాయాలు,సూచనలు,ఆయన తీసుకొన్న చొరవ,ఉద్యోగనిర్వహణ బాధ్యత,వ్యావహారిక భాషావశ్యకతను గుర్తించి ప్రచారం చేయడం మొదలైనవి మిత్రులు గురజాడకు రాసిన ఉత్తరాల వల్ల తెలుస్తాయి.
పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను పెట్టడానికి ప్రోత్సహించిన వారిని విమర్శించాడు.గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో ” బడిలో వేసినప్పటినుండి చదువు పూర్తయ్యేవరకు కృతక గ్రాంథిక భాషలో ఉన్న వాచకాలను,పాఠ్యపుస్తకాలను చదవడం వల్ల మీరు పడికట్టు రాళ్లవంటి పదాలకు అలవాటు పడిపోయారు అంటూనే ” మీరు వ్రాస్తున్న దోషభూయిష్ట వచన గ్రంథాలను పఠించడం వల్ల యెస్ .యెస్.యల్.సి, ఇంటర్మీడియట్,బి.ఏ., ఎం.ఏ., విద్యార్థులు కూడా దోషభూయిష్టమైన భాషను అలవర్చుకుంటున్నారు.దృతముపై యడాగమాన్ని యథేచ్ఛగా వాడుతున్నారు.విసంధిని పాటించిన వచన గ్రంథాలను చదవడం వల్ల విద్యార్థులకు కావ్యశైలి అబ్బుతుందని మీ ఉద్దేశ్యమా? గ్రాంథిక వ్యాకరణం నేర్చుకోవడానికి అటువంటి పుస్తకాలు చదవాలి కదూ!” అని వ్యంగాస్త్రాన్ని ప్రయోగించారు.” గ్రాంథిక వ్యాకరణ యుక్త పదాలపై,వ్యవహారాల్లో నశించిన శబ్దాలపై రచయితకు మోజు వుంటే పద్యాలలో వాటిని ప్రయోగించి ఆనందించమనండి.కానీ వచనమైన వాడుకభాషలో వ్రాయవద్దా,వ్రాసి తీరాలి” అంటూ విద్యార్థుల పట్ల సానుభూతిని,వ్యవహార భాష పట్ల తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు గురజాడ. ఆనాడే వ్యావహారిక భాషలొనే పాఠ్య గ్రంథాలు,బోధన,పరీక్షాపత్రాలు వ్రాయడానికి అనుకూలంగా స్పందించిన విషయం సెనేట్ మెంబర్ గా తన బాధ్యతను ఎలా చక్కగా నిర్వర్తించాడో ఉత్తరాల వల్ల తెలుసుకోవచ్చు.
ఇంకో లేఖలో విద్యార్థుల పక్షపాతిగా కనిపిస్తాడు.సమాధానపత్రాలు దిద్దడంలో పొరపాట్లు పడి దిద్దితే విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశముంటుందన్న అభిప్రాయాన్ని వెల్లడించిన తీరు చూస్తే గురజాడ నిశితదృష్టి వ్యక్తమౌతుంది.” క్లాసికల్ తెలుగు పత్రాలను దిద్దిన సహాయ పరీక్షకులు శిష్ట వ్యావహారిక పదాలను వ్యాకరణ విరుద్ధప్రయోగాలుగా అపార్థం చేసుకుని,విద్యార్థులకు రావాల్సిన మార్కులను తగ్గించివేశారు” అని, వేదం వెంకటరాయశాస్త్రి గారికి రాసిన లేఖలో వ్రాస్తూ అభ్యర్థనలను ప్రోత్సహించాలన్న దృక్పథం కనిపిస్తుంది.మలయాళంలో ఎం.ఏ.లో కూచున్న అభ్యర్థు లేడుగురు ఉత్తీర్ణులయ్యారు.మనం కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని అంటూ “సర్క్యులేషన్ పద్ధతి” లో అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తే బాగుంటుందని అన్నాడు.” సర్క్యులేషన్ పద్ధతి” అంటే ఒకరు వేసిన మార్కులు తమ అభిప్రాయాలతో పాటు ఇంకొకరికి పంపించి వారి సూచనలు తాము తెలుసుకోవాలి.మాట వరసకి నేను సమావేశానికి రాలేకపోతాను.మీరు, రామయ్యగారు నేను వేసిన మార్కులు మార్చితే బాగుండుననుకుంటారు.నా పరోక్షంలో నాతో సంప్రదించనిదే మార్కులు మార్చకూడదు.నాకు సూచన చేసే అవకాశం ఉండి తీరాలి” అని వివరించాడు.విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాస్ అవాలన్న ఆకాంక్షతో పాటు విద్యార్థుల శ్రేయస్సును ఆశించాడు.ఎం.ఏ.లో ఇద్దరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని,మనం వారిని పాస్ చేయాలని కోరుతూ జయంతి రామయ్య పంతులుకు రాసిన లేఖలో ” రామయ్య గారికి ఇవాళ నేను ఫైనల్ లిస్ట్ పంపిస్తున్నాను.వాళ్ళకి చెరొక మార్కు వేస్తే ప్యాసవుతారు.అది వీరిద్దరి ఇష్టం” అని రాయడం వల్ల విద్యార్థుల పట్ల గురజాడ చూపిన ఔదార్యం,ఆదరభావం వ్యక్తమౌతుంది. జయంతి రామయ్య గారికి రాసిన లేఖలో మలయాళ భాషలో పరీక్షకు వెళ్లిన ఏడుగురు ప్యాసయ్యారని,” ఎం.ఏ.పరీక్షకు ఇది ఆఖరు సంవత్సరం కనక మనం విద్యార్థుల పట్ల సాధువుగా ఉండాలి” అని విద్యార్థులు ఫెయిల్ అవుతున్నందుకు విచారాన్ని వ్యక్రం చేస్తూ ” నేను దిద్దిన టెస్ట్ పేపర్లు మళ్ళా జాగ్రత్తగా చూశాను.కొన్ని మార్కులు కలపాలనిపించింది కలిపాను.కానీ టెక్ట్స్ పేపర్లో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్కమార్కు తక్కువ వచ్చింది. మీరు మీ పేపర్లలో రావాల్సిన కనీస మార్కులకు ఒకొక్క మార్కు తక్కువ వచ్బింది.మీ పేపర్లలో మీరు ఆ మార్కు ఇద్దరికీ అవకాశం ఉంటే కలిపి పుణ్యం కట్టుకోండి….నాతో మీరు,వేదం వేంకటరాయ శాస్త్రి గారు ఏకీభవిస్తే తప్పక మరిద్దరు అభ్యర్థులు ఉత్తీర్ణులౌతారు.అప్పుడు వారి సంఖ్య ఆరు అనడం వల్ల గురజాడకు విద్యార్థులపట్ల ఉన్న సహృదయ భావం అర్థం చేసుకోవచ్చు.విద్యార్థులు గట్టెక్కడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మేలు ఏ విధంగా చేశాడో తెలుసుకోవచ్చు.
పాఠ్యపుస్తకాలను నిర్ణయించడంలో కూడా చొరవ తీసికొని తన అభిప్రాయాలను లేఖా ముఖంగా వ్యక్తం చేశాడు. “ద్రవిడభాషల బోర్డాఫ్ స్టడీస్ చైర్మన్ రామకృష్ణ పిళ్ళై” కి రాసిన లేఖలో పాఠ్య పుస్తకాల జాబితాను తయారు చేయడానికి తొందరపడి సమావేశాలలో నిర్ణయాలు చేయడం మంచిది కాదని సలహా ఇస్తూ బోర్డు వారు ముఖ్య విషయం గమనించాలని కోరుతూ “మెట్రిక్యులేషన్ పరీక్షకు వేసే పుస్తకాలు ప్రధానంగా ఆధునిక వచనంలో ఉండితీరాలి” అంటూ ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ‘ ఫిలిప్స్’ రాసిన లేఖలో ఇంటర్మీడియట్లో పాఠ్యపుస్తకాలు నిర్ణయించడంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ “పిల్లలపై మోపలేని భారాన్ని మోపకూడదు.ఒక ప్రాచీన కావ్యం,ఒక ఆధునిక గ్రంథం చెప్తే చాలును…తిక్కన విరాటపర్వ భాగాన్ని సూచించాను…బ్రౌన్ పరిష్కరించిన “వార్స్ ఆఫ్ ది రాజాస్ ” పఠనీయ గ్రంథంగా సూచిస్తూ ..వాస్తవిక జీవితంలో సంబంధం ఉన్న తెలుగు పుస్తకాలు చాలా తక్కువ.అందులో ఇది ఒకటి. బ్రౌన్ అతి నేర్పుతో ఈ పుస్తకాన్ని పరిష్కరించారు.” అనడం వల్ల విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకున్న వాడుగా కనిపిస్తాడు గురజాడ..’ ఎస్.ఎస్.ఎల్.సి బోర్డు కార్యదర్శి మేడాక్స్ కు వ్రాసిన లేఖలో ” శాస్త్రీయమైన దృక్పథంతో భాషాతత్వాన్ని అవగతం చేసుకునే పండితులు దేశంలో లేరని” వాపోతూ ఇలా తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పారు. “థామ్సన్” గురజాడకు రాసిన లేఖలో “సంసారులు ,విద్యావంతులు మాట్లాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో వచన గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అంటూ గురజాడ వాదాన్ని ఆమోదించారు. పాఠశాలలో విద్యాబోధన పద్ధతులు విధిగా మారాలని ,అప్పుడే విద్యార్థుల స్థాయి పెరుగుతుందని,పాఠ్యపుస్తకాల్లో అశ్లీల శృంగారం ఉండరాదని విశ్వవిద్యాలయం నిర్దేశించిందని,వికృతమైన తెలుగు అపభ్రంశపు సంస్కృతం కలగాపులగం చేసి కొందరు రాసిన పుస్తకాలను విద్యార్థుల నెత్తిమీద మనం రుద్దకూడదు” అంటూ వేదం వేంకటరాయ శాస్త్రికి రాసిన లేఖలో తెలిపాడు.
విద్యార్థులను దృష్జిలో పెట్టుకుని పాఠ్యపుస్తకాల నిర్ణయంలో గురజాడ ఎన్నో సూచనలు,సలహాలను ఇచ్చాడు.స్పష్టమైన అవగాహన కలిగినవాడు.వ్యావహారిక భాషపట్ల ఎక్కువ మొగ్గు చూపాడు .అందరిని ఒప్పించిన ధీశాలి.
విజయనగర సంస్థానంలో కూడా వ్యవహార దక్షునిగా సలహాలనందించి ఖ్యాతి గడించినట్లు ,మంచి పలుకుబడి,గౌరవం ఉన్న వ్యక్తి అనడానికి లేఖలే నిదర్శనం. రాజకుటుంబాల దావా విషయంలో సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఆలోచించి సాక్ష్యం చెప్పడం వలన కలెక్టర్ ‘ పౌలర్ దొర’ గురజాడకు స్వయంగా రాసిన ఉత్తరంలో ” సంస్థానానికి అతి నమ్మకంతో మీరు చేసిన సేవ,మేలు మరువరానిది.తంత్రాలకు మీరు ఆమడ దూరం.మీది కేవలం ఋజుమార్గం.మీరు కావించిన సేవకు ప్రతిఫలం అందించే మహద్భాగ్యం నాకు పట్టింది” అని రాయడం వల్ల గురజాడ వ్యక్తిత్వం,ముక్కుసూటిగా పోయే చక్కని శీలసంపన్నుడు అని తెలుస్తుంది.
మహారాణి లలితా కుమారికి గురజాడ పట్ల గౌరవం,వాత్సల్యం,అభిమానం,చిత్తశుద్ధి,ఔదార్యం మొదలైనవి ఉన్నాయని విశాఖపట్నం పెద్దాసుపత్రి సర్జన్ కు ఆమె స్వయంగా రాసిన లేఖ వల్ల తెలుసుకోవచ్చు.అప్పారావు గారి ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆందోళన చెంది ” మా ఆంతరంగిక కార్యదర్శి శ్రీ గురజాడ అప్పారావు గారు కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన ఇప్పుడే విశాఖపట్నం బయలుదేరారు.ఇక్కడకంటే అక్కడ వాతావరణం బాగుంటుందని,తగిన వైద్య చికిత్స లభిస్తుందని ఆశ. పి.టి.శ్రీనివాసయ్యంగారింట దిగుతారు. మీరు వెంటనే అక్కడికొకమారు వెళ్లి వారి శరీరస్థితి జాగ్రత్తగా పరీక్షించి కావాల్సిన ఔషధములు వాడుతూ కంటికి రెప్పవలె కాపాడుతారని నమ్ముతున్నాను.ఆయన ఆరోగ్యము ఎలా వుంటున్నది ఎప్పటికప్పుడు నాకు తెలియ చేస్తూ ‘ బిల్లు’ నాకు పంపండి.బిల్లు ఎంతయినా సరే మీకు నేను చెల్లిస్తాను” అనడం వల్ల రాణిగారికి గురజాడ పట్ల ఉన్న ఆప్యాయత, శ్రద్ధ ,గురజాడకు ఉన్న స్థానం స్పష్టమౌతుంది.
వ్యావహారిక భాష కోసం గురజాడ పడిన తపన, శ్రమ, రచనాపధ్ధతి,
ఆశించిన మార్పు లేఖలద్వారా ద్యోతకమవుతుంది.” జ్ఞానేంద్ర మోహన్ దాస్” లేఖలో గురజాడ ఆశయం ” నిఘంటువులు,పండితుల,వైయాకరణుల సహాయం,అవసరం లేకుండా చదవగానే అందరికీ అర్ధమయ్యే విధంగా,భాషను సంస్కరించవలెనని మీ ఆశయం.
అదే నేటి సమస్య. మనమంతా భాషాసంస్కరణను కోరుతున్నాము.మన దేశంలో ఋజువర్తనగల మీవంటి ధీశాలురు,భాషా సంస్కరణ సమస్యను తరచి తరచి అవలోకిస్తున్నారు” అని రాయడం వల్ల వ్యావహారిక భాష కోసం గురజాడ తపన గోచరిస్తుంది.
జ్ఞానేంద్ర మోహన్ దాస్ ,జె.వి.యేట్స్ వ్రాసిన లేఖల ద్వారా గురజాడ వ్యావహారిక భాషోద్యమానికి ప్రోత్సాహమిచ్చినట్లు తెలుస్తుంది.”థామన్స్” లేఖలో “సంస్కారులు ,విద్యావంతులు మాటలాడుకునే శిష్ట వ్యావహారిక భాషలో గ్రంథములు వ్రాయవలెననే మీ వాదము న్యాయమైనది,సశాస్త్రీయమైనది” అని అభిప్రాయపడ్డాడు.
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వ్రాసిన లేఖలో ” రాబోవు నంచికకు నూతన అభిప్రాయములతో మీరు ఏమైనా సూచనలు కావింపవేడుతున్నాను” అని వ్రాస్తూ ” భాష సజీవమైంది,సంఘం అభివృద్ధి చెందాలంటే భాషాసంస్కరణ కూడా జరగాలి.భాషా వికాసానికి ఏపద్ధతులు అమలు చేయాలో,ఉత్సాహవంతులైన వారిని చర్చలో పాల్గొనేలా చేయాలని ఉంటే మీ వలే క్షుణ్ణంగా నిశితంగా తరచి పరిశీలించే వారు అట్టే మంది లేరని నా అనుమానం” అని వ్రాస్తూనే సిద్ధాంతం కోసం పదప్రయోగం చేయొద్దని,వ్యావహారిక భాష పట్ల పక్షపాత వైఖరిని విడనాడి సహజ శైలిలో రచన చేయమని సూచిస్తూనే విమర్శించాడు,వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు .
గున్నయ్య శాస్త్రికి రాసిన లేఖలో తన రచన పట్ల ఎంతో ధీమాను,విశ్వాసాన్ని,ప్రతిభను చాటుకున్నాడు గురజాడ.” తెలుగులో నవ్యరీతులకు,నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే.నా కావ్యకళ నవీనం,కావ్య యితివృత్తాలు భారతీయం.కవితలో నేను ఉత్తమ ప్రయోజనాలను ఉపలక్షించాను.జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా,కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను.నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి ” అంటూ తన రచనా ప్రణాళికను,రచనా పద్ధతిని చెప్పుకున్నాడు గురజాడ.
ఇంకో ఉత్తరంలో ఆంగ్ల భాషాధిక్యం వల్ల ఇద్దరు మిత్రులు కలిస్తే ఆంగ్ల భాషలో మాట్లాడుకోవడం వల్ల ఇంగ్లీష్ లోనే ఉత్తరాలు వ్రాయడం వల్ల బహుభాషా సంకీర్ణమైన మన రాష్ట్రంలో “వాడుక భాషల సాహిత్యం పెంపొందడం లేదు” అని వాపోతాడు.
ముని సుబ్రహ్మణ్యంకు వ్రాసిన లేఖలో గురజాడ నా ఉద్యమం ప్రజల ఉద్యమం సంస్కృతీ పరుల భావ సంపద నాకు అండగా ఉంది.అసలు విషయాన్ని అర్థం చేసుకోజాలని ఎవరో కొందరు వ్యక్తులు నాకు వ్యతిరేకంగా వ్యూహాలను పన్నినా లక్ష్యపెట్టక వాడుక భాషోద్యమాన్ని కొనసాగిస్తానని శపథం చేస్తూ గ్రాంథిక భాష వ్రాయడం కూడా ఓక వ్యసనమే” అంటాడు. “లలితమైన,సుందరమైన వాడుక భాషలో గ్రంథరచన కొనసాగించే సంప్రదాయమొకటి తలెత్తాలంటే నీవంటి యువకులు నాకవసరం” అంటూ యువతరాన్ని మేల్కొల్పాడు.వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఎంతో మంది విమర్శలకు సమాధానాలిచ్చాక “ఇన్నాళ్లకు వాళ్ళు నన్ను గౌరవించడం నేర్చుకున్నారనుకుంటాను” అని తన లక్ష్యసాధన పట్ల ఎంతో విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రాచీన “గ్రాంథిక భాషను వ్రాస్తామని దర్పానికి పోతూ వాడుక భాషను కృతకం చేసే రచయితలు నాకవసరం లేదు” అని గంట భజాయించి మరీ చెప్పాడు. కలెక్టర్ పౌలరు దొర వ్రాసిన జాబులో ” అందుకోదలచిన ఆదర్శాలు మీరు అందుకుంటారు.మీ కలలు నిజమౌతాయి” అన్న మాటలు వృధా పోలేదు.గురజాడ ఆశయాలు (సాహిత్య,భాషా విషయాల్లో )మార్పు నెరవేరి నేడు వ్యావహారిక భాషా స్థిరత్వం పొంది గురజాడ కన్న కలలు నిజమయ్యాయి.వాడుక భాషకు పట్టం కట్టడం జరిగింది.
గురజాడ మిత్రులకు ,సన్నిహితులకు వ్రాసిన లేఖలొకయెత్తు. మునిసుబ్రహ్మణ్యం గారికి వ్రాసిన లేఖలొక ఎత్తు. దీనిలో ఆయన హృదయం విప్పి విషయాలన్నింటిని కూలంకషంగా వివరించాడు.” రానున్న తరంలో యువకులు మాకన్నా సాహిత్య కృషి చేయగలరన్న” విశ్వాసాన్ని కనబర్చాడు.
ఇంకో లేఖలో ” కవితా న్యాయం నిన్నమొన్నటిలాగా నేడు లేదు.మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను…..అయినా మానవ సమాజం పట్ల నాకొక మహత్తరమైన బాధ్యత ఉంది.” అంటూనే ” తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు.నిజమైన, ఆరాధించ తగిన ప్రేమ ఏది? ” అని విశ్వప్రేమను చాటాడు.ఇతరులను ప్రేమించడం వల్ల నిరవధికానందం సిద్ధిస్తుందని అంటాడు.మనం ఒకరికి ఇచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను కొని తెస్తుంది”.మానవ ప్రేమ గురించి ఎంతో గొప్పగా వివరించాడు గురజాడ.
భారతదేశంలో సాహిత్య గ్రంథాలు కొనేవాళ్ళు తక్కువ.” పుస్తకాల చెల్లుబడి మందంగా ఉంది.ఒకరు ఒక పుస్తకాన్ని కొంటే దాన్ని ఎరువు తెచ్చుకొని చదివేవాళ్ళు ఇరవై మంది.మనది పేద దేశం” అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తూనే ఒక చురక అంటించాడు.నేటి పరిస్థితి అదే.ఒట్టిగా ఇచ్చినా చదవరు.
గురజాడ తన రచనల ఉద్దేశ్యాన్ని లేఖల్లో వివరించాడు.విజయనగరం మహారాజా వారికి వ్రాసిన జాబులో ” అనేక సంఘటనలతో నిండి ఉన్న ఎంతో గాంభీర్యమూ,వైవిధ్యమూ గల నేటి జీవితాన్ని వీక్షించక ప్రపంచ ప్రసిద్ధికెక్కిన ప్రాచీన కాల్పనిక కథలనుంచి రచయితలు ఇతివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్థం కాక నాకు ఆశ్చర్యం వేస్తుంది.ఈ కారణాల వల్ల నేను వాస్తవిక జీవితం నుంచి సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగు వాడుకభాషలో నాటకంగా రూపొందించాను” అంటూ ఆదిభట్ల నారాయణదాసు గారికి రాసిన లేఖలో తన కన్యాశుల్క నాటక గొప్పతనాన్ని చాటుకున్నాడు.
” ఇతివృత్త స్వీకరణలో,నిర్వహణలో,హాస్యరస పోషణలో,పాత్రోన్మీలనంలో తెలుగు సాహిత్యంలో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరువకండి” అంటూ తన రచనా ఔన్నత్యం పట్ల విశ్వాసాన్ని ప్రకటించాడు.
మధురవాణి పాత్రను సమర్థిస్తూ మునిసుబ్రహ్మణ్యం కు వ్రాసిన లేఖలో గురజాడ సానిపిల్లల్లో కూడా మానవత్వం ఉంటుందని,సానుభూతిని ప్రకటిస్తూ ఆ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చి దిద్దిన విషయంలో తీసుకున్న శ్రద్ధ ,సమాజాన్ని అవగాహన చేసుకున్న తీరును మనం కూడా గురజాడ నాటి సమాజ స్థితే కాదు నేటికాలంలో కూడా రచయితలకు ,కవులకు సమాజం పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.సమాజాన్ని చదవాలన్న హితబోధ చేశాడు గురజాడ.
“ఆమె సైతం ఒక మానవవ్యక్తి అనే మాటను విస్మరించకు.ఆమె విచారం,కన్నీళ్లు,సంతోషం,ఆనంద బాష్పాలూ నీ నా సుఖదుఃఖాల వంటివే.మన అనుభూతుల
వలె అని గణుతింపదగినవే,గంభీరమైనవే.వ్యభిచారమే తన వృత్తిగా ” లేబిల్ వేయబడ్డ భోగపడచు సమాజాన్ని మోసగించడం లేదు.ఆమెకు ఉన్న లేబిల్ దృష్ట్యా ఆమె జీవితం సరియైన త్రోవనే సాగుచున్నది.ఆమె ఏ వివాహ బంధనాలను,వైవాహిక సూత్రాలను ఉల్లంఘించడం లేదు” అని సానుభూతిని వ్యక్తం చేస్తూనే స్త్రీ పురుష శారీరక వాంఛలను గురించి,కామ ప్రవృత్తిని గురించి కావ్యేతివృత్తాలలో మార్పు కనిపిస్తున్నప్పటికీ సాహిత్యం కేవలం వీటితోనే ఎందుకు నిండి ఉండాలని ప్రశ్నిస్తాడు.మానవజీవితం కాని,సారస్వతంలో కానీ స్త్రీ పురుష శారీరకానుభవాలు ,వాటి వర్ణనలూ ఉచిత స్థానంలో ఉండాలని సూచించాడు.
” ఉదాత్త గంభీరభావాల అనుభూతులు ,అభివ్యక్తీకరణకు వాడుక భాష అన్ని విధాలా యోగ్యమైనదని చూడడానికి బిల్హణుని కథను నాటకంగా రచిస్తున్నాను.” అంటూ వాడుక భాష వలన ప్రయోజనం ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు.ప్రజలకు అర్థమయ్యేవిధంగా ఉండాలని,అప్పుడు వారి హృదయంలో హత్తుకు పోతుందని,చదవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందని గురజాడ అభిప్రాయం కావచ్చు.ఆర్భాటాలకు,
పటా టోపాలకు చాలా దూరం గురజాడ. వాస్తవికతకు ప్రాధాన్యతనిచ్చాడు.
‘ డామన్ పిథియస్ ‘ గురజాడ రచనను ప్రాచీన సంప్రదాయాలకు కట్టుబడిన పత్రికల వాళ్ళు సైతం ఎంతో మెచ్చుకుంటున్నారని వ్రాశాడు.
గురజాడ రచనలు నీలగిరి పాటలు,ముత్యాలసరములు,డామన్ పిథియస్,లవణరాజు కల,కాసులు ఇవన్నీ ఆంధ్రభారతి పత్రికలో ప్రకటితమయ్యాయని తెలిపాడు.
ఆయన సాహిత్యకృషి కూడా మునిసుబ్రహ్మణ్యం కు రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది. ” నెల్లూరు జిల్లా వ్యావహారిక భాషా వ్యాకరణం నాకు అవసరం.నెల్లూరు జిల్లా వాడుకపదాలు,ముఖ్యంగా క్రియలు,క్రియాభేదాలు,విశిష్యములోని రూపభేదాలు తెలిపే ఒక పట్టికను తయారు చేసి పంపమని” వ్రాశాడు.మహాభారతంలో వ్యాకరణ విరుద్దప్రయోగాలను పంపించమని రాశాడు.
గురజాడ తన 21 వ ఏట ఆంగ్లంలో రాసిన సారంగధర పద్యాలను ” రీన్ అండ్ రయత్” పత్రికలో ప్రకటించగా చూసి చదివిన పత్రికాధిపతి ముఖర్జీ స్వయంగా గురజాడకు వ్రాసిన ఉత్తరం వల్ల యువకుడైన గురజాడలో మార్పువచ్చింది.
గురజాడ రచయితగా ఎదగడానికి,ఆత్మవిశ్వాసం పెరగడానికి యువకునిగా వున్నప్పుడు చక్కని సలహానిస్తూ 14/8/ 1883 సంవత్సరంలో వ్రాసిన ఉత్తరం అత్యంత కీలకమైంది. జలపాతాలను,ప్రవహించే సెలయేళ్ళను వీక్షించండి.మానవరూపంలో అరుదుగా అందంగా గోచరించే దైవాంశమును చూడడం మరువకండి.మీ హృదయాన్ని ఇతరుల హృదయాలను పరిశీలించండి.వాటి బలాన్ని,దౌర్బల్యాన్ని పరీక్షించండి.ఇతరులు సాధించిన గొప్పతనాన్ని తెలుసుకోండి కానీ ఇతరుల మీద ఆధారపడవద్దు.మీ ఆత్మశక్తి మీద మీరు విశ్వాసం ఉంచి అన్ని విధాలా దాని వికాసానికి కృషి చేయండి.”
” నిరంతర పఠనం అవసరం.మీరు అన్యభాషలో వ్రాస్తున్నారు కనుక
ఆ భాషపై సంపూర్ణ అధికారం మీకు సిద్ధించాలి. గొప్పగొప్ప కవులు తమ భావాలను ఎలా అభివ్యక్తి చేశారో ఆకళింపచేసుకోండి.భావవ్యక్తీకరణకు తగినంత శబ్దశక్తిని సాధించేవరకు మీ జీనియస్ కు సరిపడే నూతన మార్గాన్ని అన్వేషించేవరకు మీరు ఇతరులను అనుకరించవల్సిఉంటుంది ”
అంటూ ముఖర్జీ రాసిన మాటలు యువకుడైన గురజాడపై చెరగని ముద్రవేసి బాగా ప్రభావితుడు కావడానికి,యుగకవిగా రాణించడానికి,గురజాడ నూతన దృక్పథానికి తోడ్పడ్డాయని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మహామనీషి కావాలంటే పెద్దల మాటల చద్దిమూటలే మరి. ఆమాటలు గురజాడకే కాదు ఎప్పటి వారికైనా ఆమోదయోగ్యాలే.
ఏ రచయితకైనా శిరోధార్యమే.
కన్యాశుల్కం నాటకం ఆనాటి మహామహుల అభిప్రాయాలు
రెంటాల సుబ్బారావు గారి ఉత్తరంలో ” మీరు ప్రేమికులు.మీరు ప్రేమించడం ఎరుగుదురు.మీ నాటకంలో కొన్నిచోట్ల షాక్ లు వున్నా అవి చురకలు మాత్రమే” అంటారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
” మీ కన్యాశుల్కంలోని గిరీశం గూర్చిన కొంత భాగం ఆడినారు.పొట్ట చెక్కలగునట్లు నవ్వని వారు లేరు.అద్భుతముగా నున్నది.” అని వ్రాసారు.
కలకత్తా నుండి గురుదాస్ బెనర్జీ వ్రాసిన లేఖలో ” కన్యాశుల్క పీఠిక చదివి ఆనందించాను.నాకు తెలుగు భాష వచ్చిఉంటే మీ నాటకాన్ని చదివి ఉత్తేజితుడనై వుందును.నాకు మీ భాష రానందుకు విచారిస్తున్నాను.భావ ప్రేరణాత్మకముగా,ప్రతిభావంతముగా మీరు ఆంగ్లమున రచించిన నాటక పీఠికను చదివి ఆనందించాను.అనేక అమూల్య విషయములు గ్రహించగలిగాను.కన్యలను శుల్కములకు అమ్మజూపే దురాచారాన్ని మీరు ఖండించినందుకు సంతోషం.
ఈ దురాచారాన్ని మనువు సైతం నిరసించాడు.” అని వ్రాయడం వలన ఆనాడు కన్యాశుల్కం సమాజంలో ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు.
విమర్శ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా గురజాడ లేఖల్లో పేర్కొన్నాడు.మునిసుబ్రహ్మణ్యంకు రాసిన ఉత్తరంలో ” విమర్శించేటప్పుడు నీ అభిప్రాయాలు నిష్కర్షగా ఉండాలి.మొగమాటం వద్దు.నిష్కర్షగా వ్రాయకపోతే అది పాక్షికమే అవుతుంది.పాక్షికవిమర్శలకు విలువలేదు.నీ అంతట నీవే నిర్ధారించుకుని ముందుకు సాగాలి.మనకు అభిప్రాయ భేదం వస్తే రానీ.కొంప మునిగి పోదు.రచయిత తాను ఏది వ్రాసినా అందుకు ఒక సమర్థన వుందనుకుంటాడు.సబబైనది కానీ దానితో మీకు నిమిత్తం లేదు.
” ఒక కావ్యాన్ని చదివి దానిని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువకట్టే విమర్శకులు మనలో బహు అరుదు.ఇప్పుడు పత్రికలలో వెలువడుతున్న విమర్శలకు
నేనేమీ విలువ ఇవ్వను.నాగరికత,సంస్కారం,విజ్ఞానం గల నీ బోటి వ్యక్తుల అభిప్రాయమంటే నాకు విలువ హెచ్చు” అంటూ విమర్శ గురించి స్పష్టంగా వివరించాడు.
వేదం వేంకటరాయ శాస్త్రి గారి ప్రతారుద్రీయ నాటకాన్ని విమర్శిస్తూ ముని సుబ్రహ్మణ్యంకు రాసిన లేఖలో ” ఈ కాలంలో కొన్ని నాటకాల్లో కవితా ప్రౌఢిమ కల్పనా చాతుర్యము లోపించకపోయినా ప్రస్తుతం తెలుగులో వెలువడుతున్న నాటకాలన్ని ఒట్టి డొల్ల సరుకులు.చివరకు ప్రతాపరుద్రీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా అవి నాటక కథాగమన విస్తరణకు, పాత్రల పెరుగుదలకు ఉపకరించవు.అయితే నాకు బాగా నచ్చిన ఒక లక్షణం మాత్రం ఉంది.మన దేశ చరిత్రలో గుండెలను కదిలించే వృత్తాంతాన్నొకదాన్ని తీసికొని దానిని నాటకంగా మలిచేటప్పుడు ఈ కవి సాహిత్యాత్మక దేశభక్తి పూరిత కాల్పనిక వాతావరణాన్ని సృష్టించుకుని దానిని నేర్పుతో జయప్రదం చేశాడు.కాని నాటకంలో చారిత్రక చిత్రీకరణ మటుకు కేవలం అభూతకల్పన అసంభావిత విషయాలు సారస్వత కట్టుబాట్లను లైసెన్సును అతిక్రమిస్తున్నాయి.” అంటూ తన అభిప్రాయాన్ని ఉన్నదున్నట్లు వ్యక్తం చేశాడు.
గురజాడ నిరంతరం శ్రమ పడడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని జె.ఎ యేట్స్ ( 4/11/1915 ) నాడు రాసిన లేఖలో ” జబ్బుతో మంచాన పడ్డందుకు దుఃఖం వస్తోంది.అతి శీఘ్రంగా కోలుకొని మీరు ఆశిస్తున్నట్లు మీ ఆయుధాన్ని మళ్లీ మీరు చేత బుచ్చుకుంటారు.మీ ఆరోగ్యం ఎలా వున్నదో ఎప్పటికప్పుడు దయవుంచి నాకు తెలుపుతూ ఉండండి.మీ కృషి అనన్య సామాన్యమైనది.” అంటూ బాధను వ్యక్తం చేశాడు.. ఆనాడు కలెక్టర్,రాణిగారు లాంటి గొప్పవాళ్లకు కూడా గురజాడపై గల ప్రేమాభిమానాలు,గౌరవం ఎంత వుందో అందరి హృదయాలను అట్లా చూరగొన్న ఆ మహాకవి నవంబర్ 30 వ తేదీ 1915 సంవత్సరంలో తుదిశ్వాస విడిచాడు.
గురజాడ లేఖలను పరిశీలించినట్లయితే ఆయనొక సమర్థుడు,ఉత్తమఅధ్యాపకుడు,విద్యార్థులను ,సమాజాన్ని ప్రేమించేస్వభావం కలవాడు,నిరంతర కృషి,పట్టుదల,ఋజువర్తన,నిష్కళంకమైన వ్యక్తిత్వం కలవాడుగా కనిపిస్తాడు. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం గురజాడ మనమధ్యలో చిరంజీవిగానే ఉంటాడు. ఇట్లా సాహిత్యంలో గురజాడ లేఖలకు ఒక ప్రత్యేక స్థానముందని చెప్పవచ్చు.
1 comment
Very nice to read . Informative , nostalgiac , how he became universal standard writer .. all are interesting . Thank you very much for the post.