Home ఇంద్రధనుస్సు ఆచార్య దేవోభవ – నాటిక (పౌరాణికం)

ఆచార్య దేవోభవ – నాటిక (పౌరాణికం)

by Arutla Sridevi

పాత్రలు
గురువు – ధౌమ్య ముని
శిష్యులు – అరుణి, వేదా, ఉపమన్యు
తెరవెనుక – సూత్రధారి
ద్వాపర యుగాంతంలో ధౌమ్యుడనే ఋషి ఉండేవాడు. అతనివద్ద వేదాభ్యాసము చేస్తూ ముగ్గురు శిష్యులుండేవారు. అందులో ఒకడు అరుణి, రెండవవాడు వేదా. ఇతనిని బైదుడు అని కూడా అంటారు. మూడవవాడు, అందరికన్నా చిన్నవాడు ఉపమన్యు. విద్యాభ్యాసం కోసం వారు ముగ్గురూ గురువును సేవిస్తూ ఉండేవారు. ఆ కాలంలో గురువులు ముందుగా శిష్యుల అంతఃకరణంలో భక్తిని పరీక్షించి వారిపై కృప చూపి, వారికి విద్యనేర్పేవాడు. ఈ గురుశిష్యుల కథనే నాటికగా రూపొందించాను. ఈ కథ మహాభారతం మొదటి పర్వంలోనిది (ఆదిపర్వం).
ఈ నాటికను 5 తరగతి నుండి 8వ,9వ తరగతివరకు వేయవచ్చు. గురువు పాత్ర 9,10వ తరగతి విద్యార్థులు వేస్తే బాగుంటుంది.
మొదటి ఘట్టమం
తెర తోలుతుంది. ముందుగా ఆశ్రమ వాతావరణం కనపడుతూ ఉంటుంది. పర్ణకుటీరము, పచ్చని చెట్లు, లేళ్ళు, కుందేలు, పక్షులు, పూల మొక్కలు ఉంటాయి. రంగస్థలంపైన అయితే తెరద్వారా వాతావరణం చూపించాలి.
T.V.లో అయితే సెట్టింగ్స్ ద్వారా చూపించవచ్చు. రేడియోలో అయితే వాయిదాల సహకారంతో పక్షుల కిలకిల రావాలు మొదలైనవి వినిపించవచ్చును.
ధౌమ్యముని : (పద్మాసనుడై కూర్చొని ఉంటాడు)
నాయనా అరుి ఇలా రా నాయనా
అరుణు: పిలిచారా గురువుగారు (లోపల నుండి రంగస్థలంపైకి పరిగెత్తుకొస్తాడు)
ధౌమ్యముని : ఈ రోజు నీవు మన పొలానికి వెళ్ళి చెరువులోని నీరు పొలానికి మళ్ళించు, వెంటనే వెళ్ళు.
అరుణి : ఆజ్ఞ. గురువుగారు ఇప్పుడే వెళ్తున్నాను (రంగస్థలంపై నుండి లోపలికి వెళ్లిపోతాడు)
(తెర ద్వారా పొలం చూపించాలి. చెరువులో నీరు చూపించాలి. నీటి శబ్ధము వాయిద్యాల సహకారంతో చూపించాలి)
అరుణి పొలం దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ పొలం మధ్య గుండా ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది.
అరుణి: (ఆశ్చర్యముఖంతో – స్వగతం) (సంభాషణ బయటకు వినబడాలి)
ఆ ఇదేమిటి పొలంలో నీరు ఇలా ప్రవహిస్తుందేమిటి? అయ్యో ఇప్పుడేం చెయ్యాలి? (కొంచెంసేపు ఆలోచిస్తూ అటూ, ఇటూ తిరుగుతాడు). ఆ ఇక్కడేదో పెద్ద బండలా ఉఁదే. అవును బండే. ఈ బండను ప్రవాహానికి అడ్డంగా పెడ్తాను.
(బండను వేదికపై ముందే అమర్చి పెట్టుకోవాలి (అట్టతో తయారుచేసినది) )
(అయినా కూడా ఈ బండను నెటే్టసి నీరు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది)
అయ్యో! నీరు ఆగడం లేదే ఎట్లా?
(కొంచెంసేపు అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు)
ఆ ఇక్కడ గడ్డిమోపును అడ్డంగా వేస్తాను.
(అరుణి ముఖం సంతోషంగా ఉంటుంది)
గడ్డి మోపును అడ్డంగా వేస్తాడు.
(అయినా నీరు ప్రవహించడం ఆగలేదు)
భగవంతుడా శ్రీహరీ నీవే ఏదైనా దారి చూపించు. గురువుగారు చెప్పిన పని పూర్తి చేయలేకపోతున్నాను. నీటి ప్రవాహం ఆపలేకపోతున్నాను. పొలం అంతా నీటితో మునిగిపోతుంది.
ఏడుస్తూ ఓ చెట్టుకింద చతికిలబడిపోతాడు)
(మళ్లీ కొంతసేపటికి లేచి కళ్ళ నీల్లు తుడుచుకుని ఇలా తన మనసులో అనుకుంటాడు).
ఏమైనా సరే గురువుగారి ఆజ్ఞను పాటించాల్సిందే. అందుకు నా ప్రాణాలు పోయినా సరే. (నిర్ణయించుకుంటాడు)
(మనసులో గురువుని ఇలా ధ్యానించాడు)
గురుః బ్రహ్మ గురుః విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
రెండు చేతుల్తో పక్కనున్న తీరాన్ని పట్టుకొని, రెండవవైపు తన పాదాలు పెట్టి నీటికి అడ్డుగా పడుకొన్నాడు.
(ఈ విధంగా చేయగానే పొలం లోనికి ప్రవహించే నీటి ప్రవాహ వేగం కొంత తగ్గింది. అరుణి మాత్రం నీటిలో మునిగిపోయాడు. తల మాత్రం బయట ఉంది).
ఆహా నాదెంత భాగ్యము. ఎలాగైతేనేం గురువుగారు చెప్పిన పని చేయగలిగాను. ఇక నా ప్రాణం పోయినా నాకే బాధ లేదు.
(సెట్టింగ్ మార్చాలి)
(ఆశ్రమ వాతావరణం)
ధౌమ్యముని : (అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు.)
పగలు గడచిపోయింది. చీకటి పడ వస్తూంది. అరుణి ఇంకా రాలేదేమిటి? (ఆందోళనగా)
ఎందుకైనా మంచిది. ఒక్కసారి పొలం దగ్గరకు వెళ్ళి చూసొస్తాను.
(పొలానికి వెళ్తాడు అక్కడ శిష్యుడు కనబడడు)
అరుణీ అరుణీ (పిలుస్తాడు)
అయ్యో అరుణి ఏమయ్యాడు? అతన్ని ఏ క్రూరమృగమో తినెయ్యలేదు కదా! (మనసులో)
నాయనా అరుణీ (ఇంకా గట్టిగా పిలుస్తాడు) ఎక్కడున్నావు నాయనా.
అరుణి: గురువుగారూ నేనిక్కడ అంటూ పరుగెత్తుకొని వస్తాడు (బట్టలు తడిచి ఉంటాయి).
ధౌమ్య : (ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంటాడు). అరుణీ తడిచిపోయావా నాయనా. ఎంత పని చేశావు నాయనా. గురువు మాట కోసం నీ ప్రాణాలమీదికే తెచ్చుకున్నావా? (గద్గద స్వరంతో)
శిష్య శిఖామణీ నీకు వేదశాస్త్రం, వ్యాకరణాది విషయాలు అన్నీ ధారపోస్తాను. రా నాయనా మన ఆశ్రమానికి వెళదాం.
(ఇద్దరూ ఆశ్రమానికి వచ్చేస్తారు)
(తెర వెనుక : అరుణికి సకల విద్యలూ అబ్బిన తరువాత వివాహ యోగ్యుడైన తరువాత గురువుగారు అతన్ని ఆశీర్వదించి గృహస్థాశ్రమం స్వీకరించమని ఇంటికి పంపిస్తాడు).
…………………

You may also like

Leave a Comment