నారద సనత్కుమారుల సంవాదం
(ఛాందోగ్యోపనిషత్తులోనిది)
నారదుడు ఋషులలో అగ్రేసరుడు. అతడొకనాడు సనత్కుమారుని దగ్గరికి వచ్చి తనకు ‘బ్రహ్మం’ అంటే ఎవరో తెలియజేయవలసిందిగా కోరినాడు.
“మొదటి బ్రహ్మం గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు” అని సనత్కుమారుడు అడిగాడు.
దానికి బదులుగా నారదుడు ఇచ్చిన సమాధానం మన కాశ్చర్యాన్ని కల్గిస్తుంది. “ఓ మహాత్మా! నేను చదవని విద్యలు లేవు. నాల్గువేదాలను గురు ముఖంగా చదివాను. ఇతిహాసాల మర్మం తెలుసుకున్నాను. పురాణాల్లోని రహస్యాలను గ్రహించాను. విజ్ఞాన గ్రంథాలను తిరిగేశాను. గణితవిద్య, తర్కవిద్య, నీతిశాస్త్రం, నిరుక్తం చదివాను. జీవశాస్త్రాన్ని అధ్యయనం చేశాను. భౌతిక రసాయనిక శాస్త్రాలను ఆమూలాగ్రం పరిశీలించాను. ధనుర్విద్యను, జ్యోతిష్య విద్యను, సర్పవిద్యను నేర్చుకున్నాను. లలిత కళలను అవలోకించాను. ఇన్ని విద్యలు గడించినప్పటికీ నాకు ‘బ్రహ్మం’ అంటే ఎవరో తెలియకుండా ఉంది. నేను మంత్ర విదుడను అయ్యానుగాని, బ్రహ్మవేత్తను కాలేకపోయాను. పరబ్రహ్మ తత్త్వం తెలిస్తేనే దుఃఖం నుండి నేను బయటపడగలను. నాకు బ్రహ్మ మెవరో తెలియజేసి మోక్షాన్ని ప్రసాదించండి” అని వేడుకున్నాడు.
అప్పుడు సనత్కుమారుడు నారదునితో “నువ్వు నేర్చినదంతా శబ్ద విద్యనే. ఆత్మను తెలుసుకోవడానికి శబ్దోపాసన అవసరమేగాని, సాధకుడు అక్కడే ఆగిపోరాదు. ఎవరు నామాన్ని బ్రహ్మం అంటూ ఉపాసిస్తారో, వారు శబ్దార్థ జ్ఞానంలో చక్కగా విహరించగలుగుతారు. అంతేగాని వారికి బ్రహ్మం ఎవరో తెలియదు” అని సమాధానమిచ్చాడు.
నారదుడు వెంటనే ‘నామానికంటె మించింది ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. ‘నామం కంటె వాక్కు గొప్పది’ అని సనత్కుమారుని సమాధానం. విశ్వవిజ్ఞానమంతా వాక్కు చేతనే తెలుస్తుంది కాని, వాక్కునే బ్రహ్మమని ఉపాసిస్తే అతనికి బ్రహ్మం దొరకడు అని సనత్కుమారుడు చెప్పినాడు. ‘వాక్కునకు మించింది ఉన్నదా అని నారదుని ప్రశ్న. ‘మనసే వాక్కు కంటే గొప్పది’ అని సనత్కుమారుని సమాధానం. మనస్సు కంటే మించింది ఉన్నదా? అని నారదుని ప్రశ్న. దానికి సనత్కుమారుడు “మనస్సుకంటే మించింది సంకల్పం. సంకల్పం చేతనే మనం కర్మలు చేస్తున్నాం. ప్రతిది సంకల్పం వల్లనే సాధ్యమవుతుంది. వాయురాకాశాల్లో, నీరగ్నులలో ఉన్నది సంకల్పమే. అది చక్కగా పనిచేయడంవల్లనే వర్షం కురుస్తుంది. వర్ష సంకల్పంవల్లనే అన్నం లభిస్తుంది. అన్నంవల్లనే ప్రాణం, ప్రాణసంకల్పంవల్లనే మంత్రశక్తి, మంత్రసంకల్పంవల్లనే అన్ని పనులు సాధ్యమవుతాయి. ఎవరిలో సత్ సంకల్పం ఉదయిస్తుందో వారే ఫలసిద్ధికి అర్హులు” అని వివరించగా నారదుడు సంకల్పాన్ని మించింది ఉందా? అని అడిగాడు. అందుకు ‘సనత్కుమారుడు సంకల్పాన్ని మించింది చిత్తమని, చిత్తశుద్ధివల్లనే మనిషి బ్రహ్మవిదుడవుతా”డని చెప్పగా దానికంటే మించినదున్నదా? అని నారదుడడిగాడు. “చిత్తం కంటె ధ్యానం మించింది. సమస్త ప్రపంచం ధ్యానంలో మునిగి ఉన్నట్లు చూడవచ్చు. ఎవరి పనులు వారు చక్కగా చేస్తున్నారంటే దానికి ధ్యానమే కారణం. అధికులుగాని, అల్పులుగాని, రాజులుగాని, సేవకులుగాని ధ్యానంవల్లనే తమ తమ పన్ను చక్కబరుచుకుంటా”రని సనత్కుమారుడు చెప్పగా నారదుడు ధ్యానాన్ని మించినదున్నదా? అని ప్రశ్నించాడు. ‘ధ్యానాన్ని మించినది విజ్ఞానం ఒక్కటే’ అయితే విజ్ఞానం లోకానికి సంబంధించింది. దానివల్ల బ్రహ్మం దొరకదు. విజ్ఞానం ఐహిక సుఖాలను మాత్రమే ఇవ్వగలదు, మోక్షానికది ప్రత్యక్షంగా కారణం కాజల’దని సనత్కుమారుడు సమాధాన మిచ్చాడు. అప్పుడు నారదుడు దాన్ని మించినదున్నదా అని అడుగగా సనత్కుమారుడు కేవలం విజ్ఞానం ఉంటే చాలదు. దానికి తగిన దేహబహలం అవసరం. దేహబలమే ఆయా జన్మలను సార్థకం చేస్తున్నది. కాని దేహబలమొక్కటే బ్రహ్మంకాదని సనత్కుమారుడు చెప్పగా నారదుడు దాన్నిమించింది ఉన్నదా అని అడిగాడు. దానికి సమాధానంగా సనత్కుమారుడు బలం కంటె అన్నం గొప్పది. అన్నంవల్లనే బలం కల్గుతుంది కాని అన్నమే అన్నింటికంటే గొప్పది కాదు.
ఎవరు అన్నాన్ని బ్రహ్మంగా భావించి ఉపాసిస్తారో వారికి అన్నమే లభిస్తుంది కాని బ్రహ్మం లభించదు” అని చెప్పగా దాన్ని మించింది ఉన్నదా? అని నారదుడడిగాడు. “జలంవల్లనే అన్నం లభిస్తుంది కనుక, అన్నంకంటే జలమే గొప్ప’ అని సనత్కుమారుడు సమాధానం ఇచ్చాడు. దాన్ని మించిందున్నదా అని నారదుడడుగగా’ అగ్ని జలం కంటే గొప్పది’ అని సనత్కుమారుడు చెప్పాడు.
ఇంకా క్రింది విధంగా వారి సంవాదం కొనసాగింది.
నారదుడు : అగ్నికంటె గొప్పదేది
సనత్కుమారుడు : ఆకాశం
నారదుడు : ఆకాశాన్ని మించిందేది?
సనత్కుమారుడు : ‘స్మృతి’ స్మృతి లేకపోతే ఎవ్వరినెవ్వరూ గుర్తుపట్టలేరు.
నారదుడు : స్మృతికంటే గొప్పదేది?
సనత్కుమారుడు : ‘ఆశ’. ఆశ ఉంటేనే స్మృతి ఏర్పడుతుంది కదా?
నారదుడు : ఆశ కంటే మించినదున్నదా?
సనత్కుమారుడు : ప్రాణం ఆశకంటే మించినది. ప్రాణాన్ని బ్రహ్మంగా భావించేవాడు. నామం మొదలు ప్రాణంవరకు
అభ్యుదయం పొందగలడు. కీర్తికెక్కగలడు. కాని ప్రాణం కంటే బ్రహ్మం (పరమాత్మ) మించినవాడు.
బ్రహ్మం తన మహిమలోనే ప్రతిష్ఠితుడౌతాడు. అతడే సర్వవ్యాపకుడు. అతడు అన్ని ప్రాణుల్లో, అన్ని
జడపదార్థాల్లో ఉన్నాడు. అన్ని దిశల్లో ఉన్నాడు. అతడు లేని చోటులేదు. ఎవరు బ్రహ్మంను తెలిసి ధ్యానిస్తారో వారికి, ప్రాణం, ఆశ, స్మృతి, ఆకాశం, అగ్ని, నీరు, అన్నం, బలం, కోరిక, మనస్సు అన్ని సిద్ధిస్తాయి. కనుక బ్రహ్మం (పరమాత్మ)ను అన్నింటికంటే మించిందిగా భావించి, ధ్యానించవలెను” అని సనత్కుమారుడు నారదునికి బ్రహ్మోపదేశం చేశాడు.
అన్నింటిని మించింది బ్రహ్మమే
previous post