Home Uncategorized మయూఖ శుభకృత్ వసంతఋతు (ఏప్రిల్ )సంపాదకీయం

మయూఖ శుభకృత్ వసంతఋతు (ఏప్రిల్ )సంపాదకీయం

by mayuukha

నేలమ్మా! నేలమ్మా! అని ఎలుగెత్తి ఆర్తితో పిలవాల్సి వచ్చే కాలం రానున్నది.
మనం తిరుగాడే భూమిని కన్నతల్లిలా భావిస్తాం. స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. ఇదే సూత్రం భూమిని గురించీ చెప్పుకోవాలి. భూతల్లి, నేలతల్లి బాగుంటే నే మనమ బాగుంటాం, చెట్లూ పచ్చగా ఉంటాయి.
ఇక్కడే గుర్తుకువచ్చే ఒక కవిత “ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో!” ….. “భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో…. అన్నారు మన మహాకవి దాశరథిగారు. ఎన్నో పరిణామాల తర్వాత దాదాపు 475 కోట్ల సంవత్సరాలు కాలం గడిచిన తర్వాత పరిణామం చెంది భూమి గోళాకారపు స్థితికి వచ్చింది. దాదాపు 370 కోట్ల సంవత్సరాల క్రితం జీవావిర్భావం జరిగిందనీ శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా తెలుస్తున్నది. ఈ అనంత విశ్వంలో జీవులు కనిపించే గ్రహం భూమి వంటిది ఇంకేదైనా ఉందా? అనే ప్రశ్న తొలచి, ప్రయత్నిస్తూనే ఉన్నది నేటి ఈ విజ్ఞానమంతా. కానీ ఇంకా ఏ ఆధారాలు కచ్చితంగా దొరికిన దాఖలాలు లేవు. సకలప్రాణి కోటి సంచరించే ఒకే ఒక గ్రహం భూమి అని అనుకున్నప్పుడు, కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా జీవులైన మానవులదే.
మన పంచేంద్రియాలు మంచిగా పనిచేయాలంటే పంచభూతాలూ మంచిగా ఉండాలి. ఏ ఒక్కటి ‘అతి’కి గురైనా మన బ్రతుక్కి గతి లేకుండా అవుతుంది. అందుకే పృథ్వీ పరిరక్షణ ఇప్పుడొక అవసరమైన స్పృహ. ఈ పరిరక్షణ లక్ష్యం కోసం “ధరిత్రీ దినోత్సవం ‘’ అనే బృహత్తర కార్యక్రమాల్ని చేయటానికి పూనుకున్నది. ప్రకృతి వైపరీత్యాలను ఎటూ అడ్డుకోలేము. కనీసం తగ్గించే ప్రయత్నాలైనా చేయాలి. ఈ స్పృహతోనే 1970వ సంవత్సరం ఏప్రిల్ 22ను ‘ధరిత్రి దినోత్సవం’ గా నిర్ణయించి నిర్వహిస్తున్నది. భూమిని కాపాడే ప్రయత్నం కోసమే Save the World అనే నినాదం వినిపిస్తున్నది. చాలా ఏళ్ల క్రితం డైనోసార్ లు అని మనమిప్పుడు అంటున్న రాక్షస బల్లులు ఉండేవి. అవి పూర్తిగా అంతరించిపోయాయి.
ఇప్పుడు ఎక్కడా ఎక్కువ కనిపించని, ఆఫ్రికా, ఇండియా దేశాలలోనే కనిపించే పులులు క్రమంగా అంతరించిపోతున్నాయి. వీటిని రక్షించుకోవాలన్న తెలివిని తెచ్చుకుంటున్నాం. వీటికోసం, ఇట్లా అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణ కోసం బలమైన చట్టాలనే తయారుచేసుకోవాల్సిన అవసరం, అగత్యం వచ్చింది. మన పరిసరాలలో కిచకిచలాడే పిచ్చుకలను మనం కోల్పోతున్నాం. మరి కొన్ని జంతువులు కూడా కనుమరుగవుతున్నాయి. ఇవన్నీ ఎన్నో దుష్ఫలితాలనూ ఇస్తాయి. ప్రస్తుతం కోట్ల కోట్ల జనాలు బ్రతికే ధరిత్రికి కూడా ఇటువంటి కష్ట సమయం వస్తున్నది. రానున్న రోజుల్లో జరగబోయే విధ్వంసాన్ని ఆపడానికి ఇప్పుడే కళ్ళు తెరవాలి. అందుకోసం ప్రతి మనిషి పుట్టిన రోజును జరుపుకుంటున్నట్టు, ఏప్రిల్ 22 నాడు భూమిని కాపాడుకునేందుకు అంతా కృషి చేస్తామని ప్రతినబూనాలి, నడుం బిగించాలి.
ప్రకృతి సిద్ధమైనవి ఏవీ మనిషి సృష్టించలేడు ఏవి చేసినా అవి కృత్రిమంగానే ఉంటాయి . లేనివి తేలేం కాని ఉన్నవి కాపాడుకోగలం.
మనుషుల జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. శాస్త్ర , సాంకేతిక ప్రగతిలో భాగంగా ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నాం.ప్రకృతిలో ఉండే వనరులను కొల్లగొట్టడం మానవ నైజం అయిపోయింది. కొండలను పిండిచేస్తూ, అడవులను నరికివేస్తూ భూమి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం.అసలే ప్లాస్టిక్ , రబ్బర్ ల వాడకం ఎక్కువైపోయింది. ఇక అంతా కాలుష్యమే కాలుష్యం.

ఈ అనంత విశ్వంలో సకల ప్రాణికోటి సజీవంగా ఉన్న ఒకే గ్రహం భూమి. చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకునే తీరు తెలిసిందే. భూమిలోని సారాన్ని పీల్చి పిప్పిచేస్తూ ఎంతో నష్టం కలిగిస్తున్నాం. విపరీతమైన రసాయనాలను ఉపయోగిస్తూ పంటలను పండించడం వలన ఒకవైపు ఆహారంలో పోషక విలువలు ఏవైతే సహజ సిద్ధంగా ఉంటాయో అవన్నీ హరించిపోతున్నాయి. మరోవైపు ఈ రసాయనాల వలన భూసారమూ తగ్గిపోతున్నది. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్ల తర్వాత భూమిలో పంటలకు అవసరమయ్యే ఖనిజాలన్నీ అంతరించిపోతాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. భూసారాన్ని దెబ్బతీసే ఈ నికృష్ట చర్యలు ఎక్కువ కాకుండా ఉండాలంటే సహజ ఎరువుల వాడకంతో పంటలు పండిస్తూ, పంటల మార్పిడిచేస్తూ భూసారాన్ని పరిరక్షణ చేయాలి. వ్యవసాయ క్షేత్రాల్ని సుసంపన్నం చేయాలి.
ఇంధన ఉత్పత్తి తగ్గించడం, ఇంధన వినియోగం తగ్గించడంవలన కాలుష్యాన్ని ఎట్లాగైతే ఎక్కువ కాకుండా చేయగలమో, ఆధునిక వ్యవసాయం కోసం వాడుతున్న ఈ రసాయన పదార్థాల వాడకం తగ్గించడం వలన భూకాలుష్యాన్ని ఎక్కువ కాకుండా చేయగలం .ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కావలసింది కేవలం పూనిక.
కాళ్ల క్రింద నేల కరిగిపోతున్నది కనులు తెరువు మానవా అని ఎవరు చెప్తారు మనకు. కొందరుంటారు సంఘ ఉద్ధారకులు, కొందరుంటారు ప్రకృతి ప్రేమికులు . కొందరుంటారు ప్రాణదాతలు . వారికోసం కాదు మనం మనకోసం ఏం చేస్తే బాగుంటుంది అని అంతర్మథనం చెందాల్సిన తరుణం ఆసన్నమవుతున్నది. నేలతల్లి కోసం ఉద్యమించాల్సిన ఆగత్యం మనదే !సంసిద్ధులమవుదాం!!

You may also like

Leave a Comment