కవిరాజు బిరుదాంకితులు త్రిపురనేని రామస్వామి చౌదరి " మహా మేధావి,తాత్వికుడు,పండితుడు,విమర్శకుడు,సంఘసంస్కర్త,భావుకుడూను.అందుచేత వారి ఆలోచనలు,భావాలు,వాటిలో వచ్చిన పరిణామం తెలుసుకోవడం అవసరం" అంటారు ఆవుల సాంబశివరావు గారు ఆముఖంలో
సూతపురాణం,కురుక్షేత్ర సంగ్రామం,శంబుకవధ,ఖూనీ,వివాహనిధి,కుప్పుస్వామి శతకం,ధూర్తమానవా,సూతాశ్రమ గీతాలు,పల్నాటి గీత మొదలైనవి రచించిన త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాది,నాస్తికుడు.స్వాతంత్ర్య సమరయోధుడు, ఆ కాలంలో సంఘాన్ని ఎదిరించి పోరాడి మానవతా విలువలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన గొప్ప సామాజిక కవి జనవరి 15 వ తేదీ 1887 వ సంవత్సరంలో కృష్ణాజిల్లాలోని అంగలూరు గ్రామంలో రామమాంబ,చలమయ్య దంపతులకు జన్మించాడు.
రైతు కుటుంబంలో పుట్టినా చిన్నప్పటినుండి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు.మెట్రిక్యులేషన్ చదివేటప్పుడే పల్నాటి యుద్ధము ఆధారంగా కారెంపూడి కథనం,మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు 23 వ యేట రచించాడు.1911 సంవత్సరంలో బందరు లోని నోబుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అవధానం చేసి ప్రతిభను చాటుకున్నాడు.
1914 సంవత్సరంలో న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ లోని డబ్లిన్ కు వెళ్లి న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యం, ఆధునిక ఐరోపా సంస్కృతిని కూడా అధ్యయనం చేశాడు. 1914 సంవత్సరంలో అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతు నివ్వాలంటూ భారతీయులకు విజ్ఞాపన చేస్తూ డబ్లిన్ నుండి కృష్ణాపత్రికకు తన రచనలు పంపించాడు.దేశభక్తి గీతాలు రాశాడు.
భారతదేశం తిరిగివచ్చాక మచిలీపట్నంలో న్యాయవా వృత్తిని చేపట్టాడు.సామాజిక అన్యాయాల మీద పోరాటాలు చేస్తూ తెనాలిలో స్థిరపడి 1925 సంవత్సరంలో జస్టిస్ పార్టీ తరఫున తెనాలి పురపాలక సంఘ అధ్యక్షునిగా ఎన్నికై గంగానమ్మ కొలువులో నిర్వహించే జంతుబలిని నిషేధించినందుకు అవిశ్వాసతీర్మానం పెట్టి పదవినుండి తొలగించినా వెంటనే జరిగిన ఎన్నికల్లో ఎన్నికై తిరిగి అధ్యక్షుడై 1938 వరకు ఆ పదవిలో ఉన్నంతకాలం జంతుబలిని నిషేధించాడు. ఈయన గృహానికి సూతాశ్రమం అని పేరు పెట్టుకున్నాడు.
1898 సంవత్సరంలో పున్నమ్మను పెళ్లి చేసుకున్నాక అసమర్థుని జీవయాత్ర రచించిన ప్రముఖ కవి గోపీచంద్ 1910 సంవత్సరంలో పెద్దకుమారునిగా జన్మించాడు.
భార్య చనిపోగా చంద్రమతిని ఆమె చనిపోగా అన్నపూర్ణను 1932 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు.గోపిచంద్ కుమారుడే సినీ నటుడైన సాయిచంద్..
త్రిపురనేని సాహిత్యకృషిని గుర్తించిన ఆంధ్ర మహాసభ వారు కవిరాజు బిరుదునిచ్చి సత్కరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతీయేడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. 1987 సంవత్సరంలో శత జయంతి సందర్బంగా భారతదేశ ప్రభుత్వం కవిరాజు స్మారక చిహ్నంగా ఒక తపాలాబిళ్ళను విడుదల చేసింది.హైదరాబాద్ ట్యాంకుబండ్ పై రామస్వామి విగ్రహం నెలకొల్పారు.
సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులో అనువాదం చేయడమే కాక ఎన్నో పెళ్లిళ్లకు స్వయంగా పౌరోహిత్యం చేసి అంటరానితనాన్ని వ్యతిరేకించిన సంఘ సంస్కర్త ,ఆదర్శవాది. ఈయన 1943 సంవత్సరం జనవరి 16 వ తేదీన తనువు చాలించాడు. పుట్టుక గిట్టుక రెండు జనవరి 15,16 కావడం విశేషమే.
కవిరాజు 1914 సంవత్సరంలో డబ్లిన్ నగరానికి వెళ్లి బారిస్టర్ పట్టా గ్రహించి 1917 సంవత్సరంలో స్వదేశానికి తిరిగి వచ్చారు.ప్రయాణ సమయంలో కొలంబో,ప్యారిస్ నగరాల నుండి,తర్వాత డబ్లిన్ నగరం నుండి ముట్నూరి కృష్ణారావు గారికి రాసిన లేఖల్లో వ్యక్తిగతాభిప్రాయాలు,
ప్రయాణ విశేషాలు, అనుభవాలు,మన దేశ సంస్కృతి,సాహిత్య విషయాలు ఇమిడి ఉన్నాయి.
ముందు సింహళ ద్వీపానికి వెళ్ళాడు.కొలంబో నుండి వ్రాసిన ఉత్తరం మొదటిది.ఇది 31.10.1914 నాడు వ్రాయబడింది.దీనిలో సింహళ ద్వీప సౌందర్యం వర్ణింపబడింది." లంక యంతయు నేడొక యుద్యానవనముగా గన్పట్టుచున్నది.ఎచ్చట జూచినను పచ్చని పట్టుబట్టలను పరచినట్లు జొమ్పములచే నలంకరింపబడిన లతా సముచ్ఛాదితములైన వృక్షములు గన్పట్టును.ఎండిన వృక్షములను చూపరులకు నింపుబెంపమని తీవలు గుబురుగా నలముకొని యుండును.
నేను జూచినవరకింత ఫలవంతమగు ప్రదేశము వేరొండు కన్పట్టదు.సింహళమునకు నేడు కొలంబో ముఖ్యపట్టణము.పాశ్చాత్య నాగరికతయు,బూర్వ నాగరికతయు నిచ్చట గ్రుమ్ములాడుచున్నవి.తుదకు పాశ్చాత్య నాగరికతయే మేలు చేయి యైనది.” అంటూ దృశ్యానుభూతిని ఎంతో చక్కగా వివరించాడు.గ్రాంథిక భాషలోనే రాయడం విశేషం.
అదే లేఖలో ఒక దుకాణంలో తనకు కావలసిన వస్తువులు కొంటున్న సమయంలో ఒక బౌద్దుడు వచ్చాడు.బౌద్ధునికి కవిరాజుకు మధ్య జరిగిన సంభాషణలో ఇండియాలో బౌద్దమతం నశించింది.సింహళంలో కూడా నశించిపోతుందని విన్నానంటూ చౌదరి గారు అనగా బౌద్దుడు ముప్పాతిక భాగం బౌద్ధులే కానీ మతానికి పాటుపడేవారు లేరని చెప్తూ మేము కులభేదాలతో చచ్చిపోతున్నామన్నాడు.చౌదరి ఆశ్చర్యపోయి ” సర్వ జంతువులయందు సోదరభావముండవలయుననిహెచ్చు లొచ్చులులేవనియు,బోధించిన కరుణామయుడగు బుద్ధుడిది వినిన ఎంత దుఃఖించునో గదా!” అని అనేసరికి బౌద్దుడు కులభేదం నశిస్తేనే మనకు పురోభివృద్ధి అని చెప్పాడు.
ఆ బౌద్ధుని పేరు ఫెర్నినాండ్.తర్వాత కవిరాజు స్టీమరెక్కి ప్రయాణం కొనసాగించాడు.
డబ్లిన్ నుండి రాసిన లేఖలో అర్చకుల విషయం,దేవాలయ మాన్యాల విషయంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.అర్చకులను మతప్రచారకులుగా చేసి దినవెచ్చాలకై ,ఉత్సవాలు జరపడానికి ,దేవాలయాలు శిథిలావస్థ పొందకుండా కాపాడడం కోసమే మాన్యములీయబడ్డాయని,
అయితే అర్చకుల పోషణభారమెప్పుడూ గ్రామస్థులపైనే ఉండేదని,అధికాదాయాన్ని వినియోగపరచేదెట్లాయని బుద్ధిమంతులాలోచించాల్సిన విషయమని అంటాడు.
అర్చకుల ధర్మాన్ని గూర్చి ,పెద్దల కర్తవ్యాన్ని గురించి చక్కగా వివరించాడు. అర్చకులచేత ఊడిగం చేయించడం కంటే అర్చకులకు వారి విద్యుక్తధర్మాలను తెలిపి వారిని విద్యావంతులుగా చేసి,మతగ్రంథాలను చదివించి,అర్చక సమాజమేర్పరచి మతప్రచారకులుగా నెందుకు ప్రయత్నం చేయరాదని ప్రశ్నిస్తాడు.
అర్చకులను కూలివాండ్రను చేసి దేవునిసేవ చేయించుట కన్న మతంపట్ల వారికాసక్తి కలిగించి,దేవాలయాలందు అభిమానం కుదిర్చి మతవ్యాప్తికి దోహదపడేట్లు చేయడం యుక్తమని భావించాడు.హిందువులమై యుండి కూడా హిందూమతమంటే ఏమిటో తెలియకుండా మాట్లాడేవాళ్ళం మనం అంటాడు.
మతాచార్యులంటే మానవులే కదా.గృహస్తు ఏ మతస్తుడో ఆ మతాచార్యుని కూడా భగవత్పూజ తర్వాత పూజించాలి కానీ త్రిమతాచార్యులనెందుకు పూజించాలి అని ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు లేఖలో..
సంఘాన్ని విమర్శించడం లేఖల్లో కనిపిస్తుంది.” హిందూదేశము స్వరాజ్యమును కాంక్షించుటలేదు”.అన్న వార్తను పత్రికలో చదివి బ్రాహ్మణేతరులు చేసిన ఈ తీర్మానాన్ని నిరసిస్తూ లేఖాముఖంగా తెలియచేశాడు.” ఈ చెన్నపట్టణమున బ్రోవైన యీ బ్రాహ్మణేతరులకు యావత్భారత దేశమునందున్న బ్రాహ్మణేతరుల పక్షమున నీగతి దీర్మానించుటకు నెవ్వరధికారమిచ్చిరి? కటా! స్వలాభపరులెవ్వరో యీ నీచకార్యమునకు దిగి యుందురు.కాని నీ తీర్మానము బ్రాహ్మణేతరులందరు నంగీకరించుటలేదనియు,బ్రిటిషువారి యధికారము క్రింద స్వరాజ్యమును ( హోమ్ రూల్) బొందుట మాకు బరమ సమ్మతమనియుం దెలియజేయుచున్నాను.” అని తన నిర్ణయాన్ని వెంటనే తెలియచేశాడు. మనము తాకితే స్నానము చేయడం,నీరు ముట్టుకుంటే త్రాగకపోవడం,దేవాలయాల్లోకి పోనీయక పోవడం మొదలగు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగుట్టు విదేశీయులకు తెలిపి, బ్రాహ్మణులు మనకపకారం చేశారని హిందువుల కుత్తుకలను కత్తిరించడానికి కత్తిని ఇతరుల చేతిలో పెట్టడం అవివేకం అంటూ” బ్రాహ్మణులు నా కడనుండి యపహరించిన హక్కులను వారికడనుండి బలిమియై గుంజుకొనియెద గాని యీ కార్యమును జేయము.” అని తన మనో నిశ్చయాన్ని వ్యక్తపరచాడు.మనలో మనకు ఎన్ని విభేదాలున్నా ఉండొచ్చు కానీ బయట వారిముందు మనందరం ఒక్కటే .ఇతరుల ముందు మన లోటుపాట్లను బయటపెట్టడం మూర్ఖత్వం అని అనడంలో కలిసి మెలసి స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.
ప్యారిస్ నుండి రాసిన ఉత్తరంలో హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని నిరూపిస్తూ వివరించాడు.ప్యారిస్ నగరానికి వెళ్ళడానికి రైలెక్కాడు కవిరాజు.రైలులో జరిగిన సంఘటనను తిలకించి ” ఫ్రెంచి మత్తకాశిని యోర్తు మా ప్రక్క గదిలో కూర్చుండెను.ఆ విలాసినికిని మా గదిలోనున్న ఇంగిలీషు యువకునికి ప్రసంగము గలసినది.ఆ యుత్తర క్షణముననే హృదయములు కలిసిపోయినవి.పదంపడి నా యెట్ట యెదుట,నా కట్టెదుట ,నా కన్నుల యెదుట జరిగిపోయినవి.మన దేశమున నిట్టి యకృత్యము వారాంగనయైనను సల్పదని నా నమ్మకము ” అని తన జుగుప్సాభావాన్ని వ్యక్తం చేస్తూ హిందూ స్త్రీల ఔన్నత్యాన్ని సమర్ధిస్తూనే పశ్చిమదేశాలనుండి ఎన్ని విషయాలను మనం నేర్చుకోవాల్సినవి వున్నా ఈ విషయంలో మాత్రం మనమే వారికి నేర్పాల్సిన అవసరం ఉంది అంటాడు.” హిందూదేశము యొక్క ఔన్నత్యమంతయు చిరకాలము నుండి స్త్రీల పాతివ్రత్యముపై నాధారపడి యున్నది. అది లేని నాడు హిందూదేశము సమూలముగా నధోలోకము పాలయినను మనము చింతింపవలసిన యగత్యము లేదు…మనమే సగర్వముగ,సానందముగ మన మహా పతివ్రతలను జూసి వాని చిత్త స్వాస్థ్యమును బొందగలుగుదము.మనకెట్టి ఔన్నత్యము కూర్చునవియైనను,దీనికి బ్రతిబంధకములగు మార్గములను వందనములతో ద్యజింపవలయును”. అని ఎంతో గొప్పగా హిందూ స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతూ ఏ.వారాంగన కూడా ఇంత నీచానికి పాల్పడదు అనడం వల్ల మన సంస్కృతి పట్ల ఉన్నతభావం కలిగిన వ్యక్తిగా కన్పిస్తాడు.విదేశాల్లో చదివినప్పటికి దేశం పట్ల అపారప్రేమను చాటుకున్నాడు లేఖల్లో.
“స్త్రీ స్వాతంత్య్రమే ఐరోపాఖండ సకలైశ్వర్యాలకు యాధారము” అంటూ వారి చిత్తశుద్ధి,కార్యదీక్ష,దయారసము,శౌర్యసాహసాలు చూసినట్లయితే వారు స్త్రీ ప్రపంచానికే కీర్తి తెచ్చిపెడుతున్నారని అజ్ఞానాంధకారములో మునిగిన భారత స్త్రీలు సంఘసేవ అనే ఉత్తమ ధర్మాన్ని పాశ్చాత్య స్త్రీల నుండి నేర్చుకోవాల్సింది అని అంటాడు ఆనాడు చౌదరి ఆశించిన ఆశయం నేడు మనం స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేసి ఉన్నత శిఖరాలధిరోహించడంలో తిలకిస్తున్నాం.దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చి వారి వంతు స్థానాన్ని ఆక్రమిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
డబ్లిన్ నుండి వ్రాసిన ఉత్తరంలో ‘ధర్మసాధని’ పత్రికలో ” లవ్” శబ్దంపై తగిన నిర్వచనమివ్వలేదని సంతృప్తిచెందక ‘ లవ్’ శబ్దంపై సుదీర్ఘ లేఖ రాశాడు.ఒక పారశీక కవి వ్రాసిన శ్లోకంలో హిందూసతిని గురించి రాసిన వాక్యసారాంశం గమనింపవలసి వుంది ” హిందూ సాధ్వివలె సమరాగము నందు స్వార్థ త్యాగమును జూపించు జంతువును నీ జీవత్ప్రపంచమున నెచ్చటను గానము.వెలుగుచున్న దీపమునుండి వేలకొలది పురుగులు మ్రగ్గ గలవు గాని,మారిపోయిన రూపరహితమైన నిప్పునంబడి యొక్కటేని మ్రగ్గజాలదు…లవ్ నందు స్వార్థ త్యాగములని యెడల పవిత్ర భావ మెచ్చట నుండును” అంటూ ఆంధ్ర భాషలో లవ్ శబ్దానికి పర్యాయపదమే లేదని సీతారాముల పరస్పరానురాగం,సావిత్రీ సత్యవంతుల ప్రేమానుబంధం,కృష్ణునియందు లీనమయిన రాధ ఐక్యభావం మొదలైనవి లవ్ మూలధనం” యవ్వనంలో ఆవిర్భవించిన లవ్ క్షణికమైంది ఇది నేటి పాశ్చాత్యులలో కనిపిస్తుంది తాత్కాలిక కష్టాలకోర్వజాలని “లవ్” లవ్ ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తాడు.
విషయ సుఖానుభూతితో కూడింది మృగలక్షణమని ఈసడించి ఇతర దేశాలనుండి మన దేశంలోకి దిగుమతి కాబడిన లవ్ ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాము.బ్రిటిష్ సామ్రాజ్యంలో ” సామాన్య జనుల యందు నూటికి పదిమంది కొఱకుడు చేతను,నిరువదిమంది సెగరోగము చేతను,నిరువది మంది యితర రోగముల చేతను బీడింపబడుచున్నారు.ఇక బ్రిటిషు సైన్యమునందు నూటికి నెనుబదిమంది యీ వ్యాధిగ్రస్తులై యున్నారు” అని సుఖవ్యాధుల గురించి వివరించాడు.” పాశ్చాత్యులనుండి గ్రహింపదగినవి యావగింజలో నరభాగమైన లేదు.రాజకీయవిషయముల మనము నేర్చుకొనదగినది పెక్కులున్నవి” అని అంటూ ధర్మసాధని ఇటువంటి నీతులుపదేశించి దేశీయులను మోసపుచ్చడం మంచిది కాదని సత్యం తెలుసుకొని హితోపదేశాలను ప్రచురించాలని హెచ్చరిస్తూ లవ్ పవిత్రతను తెలియచేశాడు.
వేరే లేఖలో మార్సెల్సు పట్టణం చేరుకున్న తర్వాత ప్యారిస్ పోవడానికి పాస్ పోర్ట్ కోసం 'బ్రిటిష్ కన్సల్' దగ్గరకు వెళ్లగా,ఆయన గదిలో భారతదేశ సంస్థానంలోని ప్రభువులు తమతమ సైన్యాలతో రణరంగంలో ఉరుకుతున్న చిత్రాలను చూసి ఆనందం కల్గిందని రాస్తూ పాస్ పోర్ట్ తీసుకొని ఫ్రెంచి గవర్నమెంట్ దగ్గర ' అధికార పత్రము' తీసుకోవడానికి వెళ్లగా ఫ్రెంచి పోలీసువాడు నవ్వుతూ చౌదరిగారి చేయిపట్టుకొని అధికారి దగ్గరకు తీసికెళ్లగా ఫ్రెంచి అధికారి" మీ ఇండియన్లు మా దేశంలో యుద్ధంబొనర్చు చుండిరి.కాన ఇండియనులైన నీకు నొక యధికారపత్ర మిచ్చుటకు నేనెంతయు సంతోషించుచుంటిని " అని రాశాడు భారతదేశ వీరుల ఘనత విదేశాల్లో ఏ విధంగా ప్రస్తుతింపబడిందో ఈ లేఖ నిరూపిస్తుంది.
చౌదరి గారు రాసిన ఉత్తరాల్లో సాహిత్య విషయం కూడా స్పృశింపబడింది.డబ్లిన్ నుండి 29-4-1916 నాడు రాసిన లేఖలో ఆంధ్ర నాటకాలను గురించిన విమర్శ గమనింపదగింది.పూర్వ కాలంలో గీర్వాణ కవులు వారి పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి,
రాజానుగ్రహం పొందడానికి,విద్వాంసుల్లో అగ్రపీఠం సంపాదించుకోవడానికి ఒకే ఇతివృత్తాన్ని గ్రహించి వారి ప్రజ్ఞలు చూపిస్తూ రచనలు చేశారని”నేడన్ననో నాటక మూలమున ప్రజలు జ్ఞానవంతులుగను,నీతిమంతులుగను జేయవలసిన బాధ్యత వర్తమాన కవులందున్నది” అని నిస్సంశయంగా తెలిపి పూర్వగ్రంథాల్లోని ఇతివృత్తాన్ని తీసుకొని వారి వారి శక్తిసామర్థ్యం వ్యర్థపుచ్చుకోవడం కన్నా వేరే కథను గైకొని ప్రజలను జ్ఞానవంతులుగా చేయడం సమంజసం అంటాడు.ఒకే ఇతివృత్తం తీసికొని పలువురు నాటకాలు రచిస్తే దానివల్ల వచ్చే లాభమేంటి? అని ప్రశ్నిస్తాడు.” నాటకములు పెంచుట,క్లుప్తము చేయుటయందు మనము గీర్వాణ నాటకముల నతిక్రమింపరాదు.ఈ యభిప్రాయముతో నేనేకీభవింపజాలను.కవికి స్వాతంత్రముండవలెను.
లేనిచో అనర్థములు పెక్కులు వాటిల్లును.గీర్వాణ నాటక సంప్రదాయములని,ఆంగ్లేయ నాటక సంప్రదాయములని కవి చేతులు గట్టివేయుట భాషాలతను మొదలంట గోసివేయుటయే”.అని ఇతివృత్త స్వీకరణలో కొత్తదనాన్ని ,మార్పును ఆశించి కవికి స్వేచ్ఛ ఉండాలని,పూర్వ సంప్రదాయాలను అతిక్రమించి నాటకం రసపుష్టి గావించడమే పరమోత్తమమని వ్యక్తం చేశాడు.
అలాగే భాష విషయంలో కూడా తన అభిప్రాయాన్ని లేఖల్లో తేల్చేశాడు.నీచోక్తులు,నీచుల గ్రామ్య సంభాషణ విషయంలో విమర్శిస్తూ” నాటక పాత్రము రంగమున వివిధ గ్రామ్య భాషా సంభాషణ మొనరింపరాదను వాదమాదరణీయమని నా యాశయము” అంటూ మూడు భాషలు మాట్లాడే ముగ్గురు విదేశీ వాళ్ళు వివిధ గ్రామ్యము లైన ఇంగిలీషులో మాట్లాడక సలక్షమైన ఇంగిలీషులో మాట్లాడితే ఉచితంగా ఉంటుంది అంటాడు.అక్బర్ పాదుషా’ మాకీ ,మీకీ ‘ అని మాట్లాడినా,నీచ తురుష్క పాత్ర గ్రాంథిక భాషను మాట్లాడినా కూడా హాస్యాస్పదమంటాడు.గీర్వాణ భాషలో చెప్పబడ్డ నియమాలు గీర్వాణ నాటకాలకే అన్వయిస్తాయి కానీ ఆంధ్ర నాటకాలకు పనికి రావని నిస్సంకోచంగా చెప్పాడు.” ద్రావిడ భాషలు దేశభాషలుగా నున్నచోటుల నా భాషల నీచపాత్రములకే గ్రామ్య భాష గాని,మిశ్రమ భాష గాని యుపయోగింపబడవలయును,ఉచ్చ పాత్రముకు భిన్న జాతీయుడైన నేమి,భిన్న మతస్తుడైన నేమి గ్రాంథిక భాషనే యుపయోగించుట సమంజసం”. అంటూ పాత్రోచిత భాషా విషయంలో త్రిపురనేని తన నిర్ణయాన్ని లేఖలో నిక్షిప్రం చేశాడు
రామస్వామి గారి లేఖల్లో ఆయన అలవాట్లు,వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చును.వ్యక్తిగతం అయినప్పటికీ ఆనాటి సమాజపరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఉత్తరాలు ఎంతగానో ఉపకరణాలు అని చెప్పొచ్చు.
తలకు బట్ట చుట్టుకోవడం అంటే తలరుమాలు ధరించే వాడని తెలుస్తుంది.కేవలం శాకాహారాన్నే భుజించేవాడు.
కొలంబో నుండి బయలు దేరెటప్పుడు స్టీమరెక్కాడు.స్టీమరులో ఒక సంఘటన జరిగింది.జపాను భాష తప్ప వేరే భాష తెలియని జపాను ఉద్యోగి చౌదరి ముందుకు వచ్చి” కసాయి దుకాణము బరచెను.కత్తి,గరిటె మాంసము,చేపలు చూడగానే నా శరీరము జలదరించెను. ఏమి చేయను? సేవకునితో వీనిని దీసికొనిపోయి శాకములను గొనిరమ్మని యింగ్లీషులో జెప్పితిని.అయినా వాడికర్థం కాలేదు.చివరికి మాంసం వైపు చూపించి ఇవి అక్కరలేదా అని అడిగితే పండ్లు కానీ శాకము కానీ గానీ తెచ్చివ్వమంటే కొన్ని పండ్లు,బంగాళాదుంప కూర తెచ్చి పెట్టాడు.పదార్థాల్లో ఏదో వాసన వచ్చి తిన్నదంతా వాంతి” చేసుకున్నాడట.ఇదీ ఆయన అవస్థ.ఆయనకే కాదు అలవాటు లేని వారికెవరికైనా ఇదే పరిస్థితి.ఏడు రోజులకు ఒక పక్షి గాని,చెట్టుగాని కన్పించలేదట.కవిరాజు సున్నిత మనస్తత్వం ,మాంసాహారం పట్ల గల వైముఖ్యం మొదలగు విషయాలను ఈ లేఖలో తెలుసుకోవచ్చును.
డబ్లిన్ నుండి రాసిన ఉత్తరంలో తనకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో తెలపమని అనేక ఉత్తారాలు వస్తున్నాయని పత్రికాముఖంగా తెలపడం సమంజసమని తనకు నెలకయ్యే ఖర్చును వివరంగా తెలియచేశాడు.ఆనాడు విదేశాల్లో ఖర్చు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి యీ లేఖ పనికి వస్తుంది.
” ఈ వ్యయము సాధారణముగ విద్యార్థి స్థితిగతుల మీదను,సత్ప్రవర్తన మీదను నాధారపడి యుండును గాన ఎంత వ్యయమగునని నిశ్చయించుట దుర్లభమైనను,ప్రస్తుతము విద్యార్థులకగు వ్యయమును పరిశీలించిన కొంతవరకు తెల్లమగును.” సాధారణంగా చాలామంది విద్యార్థులకు సగటున 100 రూపాయలు ఖర్చు అవుతాయని, తాను 100 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపాడు.వారి వారి స్తోమతను బట్టి ఎంత పంపిస్తే అంత ఖర్చు పెడతారని చెప్తూ ఒక చిన్నగదిలో ఇద్దరు కలిసి ఒకే మంచముపై పడుకుని ఎట్లో కాలం గడిపే విద్యార్థుల్లో కూడా ఒక విద్యార్థి సంవత్సరానికి ఆరువేలు ఖర్చు చేసిన వాడున్నాడని తెలిపాడు.తుదకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ” దుర్వ్యయముల జోలికి బోక సర్వసుఖములనుభవించుచు ( నాటకములకు తరచు బోవుచున్నను) జాగ్రత్తగ సంచరించుచుండిన యెడల నూరు రూపాయలు చాలును “
అని వివరించాడు.దీన్ని బట్టి ఎంత జాగ్రత్తపరుడో,ఎంత పొదుపు పరుడో తెలుస్తుంది.నాటకాలు చూసే అలవాటుతప్ప అనవసరంగా డబ్బు ఖర్చుపెట్టేవాడు కాదని తెలుస్తుంది.క్రమశిక్షణ కలిగిన వాడుగా,శాకాహారము మాత్రమే తీసుకునే వాడుగా తెలుస్తుంది.
ఈ రకంగా కవిరాజు లేఖలను పరిశీలించినట్లయితే ఆయన అలవాట్లు, మనస్తత్వం,వ్యక్తిత్వం,
కుండబద్దలు కొట్టినట్లు నిజాన్ని చెప్పడం,పాత్రోచిత భాష, నాటికేతివృత్తం గురించి ఆయన అభిప్రాయాలు ,ఆనాటి సాంఘిక పరిస్థితులు ,ప్రయాణ అనుభూతి మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు.ఆయనకు గల స్వాతంత్ర్య కాంక్ష కూడా తెలుస్తుంది.ఈ విధంగా లేఖలు సమాజానికి దర్పణాలు అనడంలో ఎట్టి సందేహం లేదు..
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
ప్రభుత్వ విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
చరవాణి:
949036738