2
చిన్నాదేవికి నిద్రపట్టడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందరరూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళుమూసుకుని పడుకుంది.
వాతావరణం వసంత మనోహరంగా ఉంది. కిటికీలోంచి పిల్లగాలి అల్లరిపెడుతోంది. అది కొంత ఊరట కల్గిస్తున్నా మరింత నిట్టూర్పుకు కూడా కారణమవుతోంది. నిండు పేరోలగంలో కొలువు తీరిన రాయలమూర్తి గంభీర రాజసంతో ధీర విలసితంగా ఉంది. నాడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో తన నృత్యం చూసిన కృష్ణరాయని కళ్ళల్లో తొణికిసలాడిన ఆ భావం ఏమిటో పూర్తిగా అర్థం కావటం లేదు. అది ప్రేమా? ప్రశంసా? అనురాగమా? అభిమానమా?భగవానుని సన్నిధిలో ప్రభుదర్శనం వల్ల తన జీవితంలో ఎటువంటి మార్పు జరుగనున్నదో ఆ నాట్యమయూరికి అవగతం కాలేదు. ఏమో! చల్లనితల్లి అలివేలుమంగమ్మ అనుగ్రహంతో రాయలు తనను అంగీకరిస్తే ఈ జన్మకదే వరం. ఇదంతా శ్రీకృష్ణరాయలు ప్రభువు కాకముందు. కానీ ఇప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఒక దేవదాసి చేయి పట్టుకుంటాడా? ఒకవేళ ప్రభువు అలా అనుకున్నా అప్పాజీ అంగీకరిస్తారా! అప్పాజీ మాటను ప్రభువు శిరసావహిస్తాడు కదా! ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
చిన్నాదేవి పారవశ్యంతో నృత్యం చేస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులున్నారు. ఆమె దృష్టి మాత్రం మురళీమోహనుడి మీదే కేంద్రీకృతమై ఉంది. ఇదేమిటి! స్వామి స్థానంలో కృష్ణరాయలు చిరునవ్వులతో తనకేసి చూస్తున్నాడు? రారమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు?
‘‘స్వామీ పూజా ప్రసూనమై నీ
పద పద్మముల వాలెదను
ఎన్ని జన్మలైన నిన్నెడ బాయను స్వామి!’’
చిన్నాదేవి నర్తిస్తూ మురళీమోహనుడి వైపే అడుగులేస్తోంది. అందరికీ ఆవేళ చిన్నాదేవి ధోరణి కొత్తగా ఉంది. సమ్మోహనకరంగా ఆరాధనానృత్యం చేస్తూ అటు స్వామిని, ఇటు దేవాలయ ప్రేక్షకులను అలరించే ఆ కళాతపస్విని ఇవ్వాళ పూర్తిగా స్వామి తప్ప మరో ప్రపంచం పట్టనట్లు ఏదో మైకం కమ్మినట్లు ప్రవర్తిస్తున్నది.
విగ్రహంలోంచి కృష్ణదేవరాయలు తనకేసి చేతులు చాపి వచ్చేశాడు. ఆమె అతని విశాల వక్షస్థలంపై వాలిపోయింది. పెదవులు పాటను గుసగుసలాడు తున్నాయి. స్వామి చేతుల్లో బందీఅవటం హాయిగా ఉంది. సిగ్గుతో తలెత్తి రాయల మొహంకేసి కూడా చూడలేకపోతున్నది. ఆమె అణువణువూ అతని వశమై మనసు పరవశమైంది. కళావతంసుడు రాయలు కళాకారిణి చిన్నాదేవి మనుసులు ఐక్యమైన అద్భుత అనుభూతి. చుట్టూ ఎందరున్నా ఎవ్వరూ లేని ఏకాంత భావనా ప్రపంచం అది.
కల చెదిరింది. ఆశ్చర్యపడి చుట్టూ చూసింది చిన్నాదేవి. పక్కన తల్లి గాఢనిద్రలో ఉంది. ఆమెకీ అనుభూతి కొత్తది. తాను ఎవరిబిడ్డో ఏమో ఈ తల్లి పెంచి నాట్యం నేర్పింది. చిన్నతనం నుంచి ‘నీజన్మ కృష్ణార్పణం’ అన్న అమ్మమాట తలదాల్చి జీవిస్తున్న చిన్నాదేవి మనసీనాడు చెదిరిపోతున్నది.
రాయలు ఎంత అందగాడు! అచ్చు కృష్ణునిలా… తప్పు తప్పు! కృష్ణుడు భగవంతుడు. మరి రాయలు కూడా భగవంతుని అంశే! ప్రభువు అంటే విష్ణువే కదా! తన పిచ్చిగాని ప్రభువు తనని స్వీకరిస్తాడా! తన జన్మ ఎలాంటిదో ఆయనకి తెలుసా? దేవదాసీ వ్యవస్థలో దేవాలయాలలో ప్రభువుల సమక్షంలో మాత్రం నాట్యం చేసే నర్తకిని ప్రభువు రాణిగా చేసుకుంటాడా! కలతగా నిద్రపట్టింది చిన్నాదేవికి.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘ఏయ్ మంజరీ ఆగు!’’ చంద్రప్ప మంజరిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మంజరి అతనికి చిక్కినట్లే చిక్కి జారిపోతోంది.
‘‘ఇలా అయితే నేను నీతో మాట్లాడను’’ అతను బుంగమూతి పెట్టుకొని ఓ చంద్రకాంతశిల మీద కూర్చుండిపోయాడు. దిగువుగా ఉన్న శిలమీద కూర్చుని అతని వడిలో తన్మయంగా తలవాల్చి కూర్చుంది మంజరి.
ఆ ఉద్యానవనంలో వెన్నెల్లో చెట్ల పూలు కొత్తగా మిలమిల్లాడుతున్నాయి. చంద్రప్ప వేణువును తీసి పాడటం మొదలుపెట్టాడు. అతనికి తెలుసు మంజరినెలా అలరించాలో! నాగస్వరానికి వివశురాలైన నాగినిలా ఆమె శరీరమంతా ప్రకంపనలే.
చంద్రప్ప సమక్షంలో… మంజరి నర్తనం ముందు ఇంద్రసభలో అప్సరల నృత్యాలు కూడా సరిచాలవు.
అతని వేణువు నింపుకుంటున్న ఊపిరి విన్పించే పాటను ఆమె కాలి అందెయలు నాట్యంగా అనువదించుకుంటున్నాయి. ఆ నాదానికి ఈ పాదంతోడై ఇరువురి శరీరాలు తన్మయంగా పరవశిస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలీదు. రెండు నాగుపాములు జంటగా పెనవేసుకున్నట్లు.
రాత్రి ఒక జాము దాటింది.
పహారా నగారా మోగింది. చంద్రప్ప ఒళ్ళో తలపెట్టి పడుకొన్న మంజరి ఉలిక్కిపడిరది.
‘‘చంద్రా! చాలా పొద్దుపోయింది. నీ దగ్గర ఉంటే కాలం ఆగిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను చంపేస్తుంది’’ అంది భయంగా.
‘‘భయమెందుకు? నువ్వు నా దానివి… నా నుండి నిన్నెవ్వరూ దూరం చేయలేరు. మంజరీ! నీ నృత్యం నా గానానికి ఊపిరి. మీ అమ్మకి చెప్పెయ్. మనం వివాహం చేసుకుందాం’’ చంద్రప్ప ఆమె ముంగురులు సవరిస్తూ వెన్నెల కాంతిలో తళతళలాడే ఆమె కనుపాపల్లో తన బింబాన్ని చూసుకుంటూ చిలిపిగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమె మనసులో పులకింతలు రేపింది. పెళ్ళిమాట వింటూనే మంజరి నిటారుగా అయింది.
‘‘నీకు తెలీదు చంద్రా! చిన్నాదేవిగారిని ప్రభువు కోరుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి మా అమ్మకి కూడా అదే ఆశ పుట్టింది. నన్నే రాజ ప్రముఖుడెవరైనా చేసుకుంటే రాజవైభోగాలన్నీ దక్కుతాయని ఆమె ఆలోచన. నీలాంటి సంగీతకారుడికి నన్నిచ్చి పెళ్ళి చేయదుగాక చేయదు’’ నిరాశగా అంది మంజరి.
‘‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్ళింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అది దేవదాసీల వీధి. ఆ భవనాల్లోంచి అనుక్షణం నృత్యగానాలు విన్పిస్తూ
ఉంటాయి. మంజరి తల్లి కృష్ణసాని ఆ వీధిలోకెల్లా సంపన్నురాలు. మంజరికి చిన్నతనం నుంచి నృత్యం, గానం నేర్పింది. మంజరి భగవంతుని కైంకర్యంగా నర్తిస్తున్నా, కృష్ణసాని కళ్ళు మాత్రం ధనవంతుల కోసం వెదుకుతున్నాయి. ఈ మధ్య మంజరి చంద్రప్పతో పొద్దుపుచ్చటం కృష్ణసాని దృష్టికి రాకపోలేదు. సమయం సందర్భం చూసి కుమార్తెను హెచ్చరించాలనుకుంది.
తల్లి నుంచి ఎటువంటి పెడసరపు మాటలు వినాల్సి వస్తుందోనన్న భయంతో మంజరి మెల్లగా తన కక్ష్యవైపు నడిచింది. పర్యంకం మీద కృష్ణసాని అరుణ నేత్రాలతో కుమార్తెకేసి తీక్షణంగా చూసింది.
మంజరి భయభీత అయి కంపించింది.
‘‘అమ్మా! ఈ వేళప్పుడు…’’ అర్థోక్తిలో ఆగిపోయిందా బేల.
‘‘అదే అడుగుతున్నాను. ఈ వేళప్పుడు ఎవరితో తిరుగుళ్ళు? ఎక్కడ నించి?’’ కృష్ణసాని తీవ్రస్వరంతో అడిగింది.
మంజరి మాట్లాడలేదు. తలవంచుకుని నిలబడిరది.
‘‘ఆ చంద్రప్పదగ్గర్నుంచేనా’’ కరకుగా ఉందా స్వరం.
అవునన్నట్లు తలూపింది మంజరి.
‘‘నేను నీకు గతంలో ఒకసారి చెప్పాను. ఆ ఉన్మత్త గాయకుడితో తిరిగితే లాభం ఏముండదని. ఇదే నీకు ఆఖరుసారి చెప్తున్నాను. నువ్వు అతన్ని మర్చిపో! చిన్నాదేవిలా నీక్కూడా ఓ ప్రభువు లేదా ప్రభువంతటివాడు…’’ తల్లిమాటలు పూర్తికాకుండానే మంజరి ఆపింది.
‘‘నేను చంద్రాన్ని ఇష్టపడుతున్నానమ్మా! అతనే నా జీవితేశ్వరుడు’’ ఆమె స్వరం మెల్లగా ఉన్నా దృఢంగా ఉంది.
కృష్ణసాని తోకతొక్కిన కృష్ణతాచులా లేచింది.
‘‘కళ్ళు పైకెక్కినాయా! చిన్నాదేవి వైభోగం చూశావా! శ్రీకృష్ణదేవరాయ ప్రభువు కూడా రాజుకాకముందే ఆమెను కోరాడు. మాట ఇచ్చాడు. ప్రభువైతే కూడా ఆమెని మరువడు. పట్టాభిషేకం జరుపుకోబోతున్న రాయల మనసులో పట్టమహిషి చిన్నాదేవే! ఎంత అదృష్టవంతురాలామె! నేనెంత కలలు కంటే మాత్రం ఏం లాభం!’’ నిట్టూర్చింది నిస్సహాయంగా కృష్ణసాని.
‘‘అమ్మా! ఇతరులతో మనకెందుకు? అది ప్రభువు ఆదరం. నన్నూ, చంద్రాన్ని ఆశీర్వదించు. కళాపోషకుడైన ప్రభువు నీడలో మా జీవితాలు తరిస్తే నాకదే పదివేలు’’ మంజరి నచ్చచెప్పింది.
‘‘నీ మాట నీదేనా! ఇక పడుకో! రేపటినుంచి నేను చెప్పినదే జరగాలి. మరో ఆలోచనకు తావులేదు’’ విసవిసా బయటికి నడిచింది కృష్ణసాని.
మంజరి విశ్రమించిందేగానీ మనోహర వేణుగానం మదిలో ఆ గదిలో విన్పిస్తూనే ఉంది. ఆమెకదే ఏకాంత సేవాభాగ్యం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
నర్సప్ప నాయకుని మరణకాలానికి కృష్ణరాయని పట్టాభిషేక కాలానికి విజయనగర సామ్రాజ్య రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. సరిహద్దు రాజ్యభాగాలు కోల్పోయి రాజ్యం అంతఃబహిర్ శత్రువులతో, అంతఃకలహాలతో, బహ్మనీ గూఢచారులతో నిండి సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితులలో ప్రబల రాజాధిరాజు, రాజ పరమేశ్వర, వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయు తిమ్మరుసు ధీయుక్తితో చక్రవర్తిగా పట్టాభిషిక్తుడౌతున్నాడు.
ఆరోజు కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది.
శ్రీజయంతి నాడు జరుగుతున్న ఉత్సవానికి కర్ణాటకాంధ్ర దేశాల ఏలికలకు ఆహ్వానాలు అందాయి.
ఆనాడు విజయనగరం వికసించిన వనవాటికలా సుగంధ పరిమళాలతో విలసిల్లుతున్నది. అనేకమంది రాజులు, పండితులు, కవులు, జ్యోతిష్కులు విచ్చేశారు. నగరాన్ని అరటిబోదెలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బ్రాహ్మణ శ్రేష్టులు గ్రహశాంతి, హోమయజ్ఞాలు చేశారు. శుద్ధోదక స్నానం చేసిన రాయలు నూతన వస్త్రాలంకార భూషితుడై మరో విష్ణువులా భద్రాసనంపై శోభిల్లుతున్నాడు, వేదపండితుల మంత్రోచ్ఛాటనంతో బంగారు కలశంలోని సకల నదీజలాలతో రాయలకు సంప్రోక్షణ చేశారు. అందరి జయజయధ్వానాల మధ్య శ్రీకృష్ణదేవరాయల కిరీటధారణ జరిగింది.
రాజోద్యోగుల పరిచయం, రాజధానీ సందర్శనం అయినాక రాయలు తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. మహామంత్రి, పితృసమానులు అప్పాజీ, గురువు వ్యాసరాయల ఆశ్సీసులు పొందాడు. కవులు పద్యాలతో ఆశ్సీసులందించారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం జరిగాక అప్పాజీ మరోసారి రాయల్ని గౌరవించి కౌగిలించి ఆశీర్వదించాడు. ఈ ఉత్సవానికి గుర్తుగా విరూపాక్ష మందిరంలో ‘రంగనాథ మందిర గోపురం’ నిర్మించబడిరది.
ప్రజలంతా అప్పటికే కృష్ణరాయని గురించి విన్నారు. అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాపథాన మహత్తర గిరి దుర్గం విజయనగరం. ఆ పేరును సార్థకం చేయటానికి రాయలు అనేక చర్యలు తీసుకున్నాడు.
రాచకార్యాలతో వ్యస్తుడైన రాయలకు చిన్నాదేవి అనుక్షణం గుర్తు వస్తున్నది. ఆమెని పట్టమహిషిని చేస్తానన్న తన వాగ్ధానం పదే పదే ఆయన స్మృతిపథంలో మెదుల్తూ అది నెరవేర్చటానికి వేగిరపడుతోంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
‘‘చిన్నా! ఏమిటి ఈ బేలతనం!’’ చిన్నాదేవికి చేరువగా వచ్చి ఆమె మునిగడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది మంజరి.ఆ కళ్ళు తామర కొలనులా ఉన్నాయి.
‘‘అవును మంజరీ! నీవీవేళ బాగా గుర్తొస్తున్నావు సుమా! మనిద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం నేర్చాం. నా పాదాలు నేడెందుకో మొరాయిస్తున్నాయి. మనం నేర్చుకున్న కృష్ణనృత్యాన్ని ఓసారి ప్రదర్శిస్తావని.’’
చిన్నాదేవి స్వరంలో తెలియని ఆవేదన, అలసట.
నిరంతరం రాయల గురించిన ఆలోచనలతో ఆమె మనసు వడిలిపోయింది. తన రాయలు ప్రభువైనాడు గదా! తననింక గుర్తుంచుకుంటాడా! మనసు నిండా సంతాప మేఘాలు కమ్ముకుంటున్నాయి. తనవల్ల రాయల కీర్తికి ఎటువంటి మచ్చ రాకూడదు. పట్టమహిషి పదవిమీద కూడా ఆమెకి ఆశలేదు. రాయలే ఆమెకి సర్వస్వం. ఆమె అతనికి ప్రియురాలు, భార్య, అర్థాంగి, రాణి కూడా.
మంజరి ముద్ర పట్టి ‘కృష్ణనృత్యం’ చేస్తున్నది. రాధ విరహంతో వేగిపోతూ కృష్ణుని రాకకోసం చెట్టునీ, పుట్టనీ, పులుగునీ, పున్నమినీ స్వామి జాడకోసం అభ్యర్థిస్తోంది.
‘‘రాడేలనే స్వామి రాడేలనే
నా వాడని నమ్ముకొంటి
ఇంతకింత రేయిమించె
రాడేలనే స్వామి రాడేలనే!’’
మంజరి విరహోత్కంఠిత రాధలా మారిపోయింది. ఆమె హృదయంలో అగ్ని బాణాలు గుచ్చుకుంటున్నాయి. నేటికి పది దినాల నుండి చంద్రప్ప జాడ లేదు. అతని సన్నిధి కోసం ఆమె బేలహృదయం పలవరిస్తోంది.
‘‘నే తాళ లేనే చెలియా
నే తాళ లేనే ఓ సఖియా’’
అంటూ ఉన్మత్త విరహిణిలా మంజరి నేలకొరిగింది. అప్పటివరకూ అదే స్థితిని అనుభవిస్తూ విపరీత వేదనకు గురవుతున్న చిన్నాదేవి మంజరి స్థితికి కంగారుపడిరది. ఆమె పరిచారికల సహాయంతో మంజరిని సేద తీర్చింది.
‘‘మంజరీ! ఏమిటిది! నీది నర్తనమా! నిజస్థితి ప్రదర్శనమా?’’
మంజరి బలహీనంగా నవ్వింది. ఆమె ఆహారం తీసుకొని కొన్ని దినాలయిందని గ్రహించింది చిన్నాదేవి. మంజరిని మంచం మీదికి చేర్పించింది. పానీయం ఇప్పించింది. ఆమె సేద తీరాక విషయం అడిగింది.
‘‘మంజరీ! చెప్పు. మనం చిన్నప్పట్నుంచీ నేస్తాలం. ఒకరి మనసు మరొకరు బాగా తెలిసినవాళ్ళం. నీవు చంద్రప్ప ఒకరికొకరుగా మెలగటం నాకూ తెలుసు. ఇప్పటి నీ పరిస్థితికి అతను కారణమా?’’ ప్రేమగా మంజరి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.
మంజరి తలదించుకోవటం వల్ల ఆమె మనసులో ఏముందో తెలీటం లేదు. సన్నగా కంపిస్తున్న ఆమె శరీరం మనోవ్యాకులతను తెలుపుతోంది. చిన్నాదేవి మంజరిని మరి ప్రశ్నించదలచలేదు.
‘‘కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం’’ అని మంజరిని ఏకాంతంగా వదిలేసి బయటి కక్ష్యలోకి వచ్చింది.
అప్పటికే ఆమెకోసం ఒక వార్తాహరుడు ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయల ప్రేమకు పాత్రమైన ఆమెపట్ల అంతా గౌరవం, వినయాలనే ప్రదర్శిస్తున్నారు. ఏమో! ‘రాబోవు కాలంలో కాబోయే రాణి’ అని తలచి కాబోలు!
‘‘ఏమి వార్త తెచ్చావయ్యా!’’ చిన్నాదేవి రాజసాన్ని ఒలకబోస్తూ ఆసనంపై ఆసీనురాలయింది.
‘‘మహామంత్రి తిమ్మరుసులవారు మరో రెండు గడియల్లో మిమ్ములను కలవనున్నారు. ఇది అతి గోపనీయమని సెలవీయమన్నారు’’ వార్తాహరుడు అభివాదం చేసి నిష్క్రమించాడు.
దిగ్గున లేచింది చిన్నాదేవి. మనసు భయాందోళనలతో, ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. ఏమి చేయటానికీ పాలుపోవటం లేదు. అంతటి మహామాత్యుడేమిటి… తమ ఇంటిని పావనం చేయటమేమిటి? విజయనగర సామ్రాజ్య యశస్సుకు మూలస్తంభంలాంటి అప్పాజీ తమబోటి వారింటికి రావటమా! సమయానికి తల్లికూడా ఇంట లేదే!
ఆలోచిస్తుండగానే తిమ్మరుసు మహామంత్రి ధీరగంభీర మూర్తిలా ఆ దేవదాసి ఎదుట నిలిచాడు. తొట్రుపడిరది చిన్నాదేవి.
‘‘మహామంత్రికి ప్రణామాలు!’’ పాదాభివందనం చేసింది. ఆయనను ఆసనం మీద కూర్చుండబెట్టి ఎదుట తలవంచి వినమ్రంగా నిలిచింది ‘ఏమి ఆజ్ఞ’ అన్నట్లు.
సర్వాలంకారభూషితjైు శ్వేతాంబర ధారిణిగా అపర సరస్వతిలా నిలుచున్న చిన్నాదేవి ముగ్ధమనోహర రూపాన్ని ఒక నిమిషం పరికించాడు అప్పాజీ.
‘ఈమె ఇంతటి సౌందర్య సౌశీల్యాలు కల్గిఉంది కాబట్టే రాయలు మనసిచ్చాడు. పట్టమహిషి కాదగిన సకల లక్షణ సముపేత’ అనుకున్నాడు అప్పాజీ.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ చిన్నాదేవి మెల్లగా అడిగింది. ‘‘పెద్దలకి నా మీద ఇంత అనుగ్రహానికి కారణమేమో తెలుసుకోవచ్చునా?’’
అప్పాజీ గంభీరముద్ర వహించాడు. మరుక్షణం చిన్న చిరునవ్వు ఆయన పెదవులపై చంద్రవంకలా మెరిసింది.
‘‘అమ్మా! విజ్ఞురాలివి. రాయలు ఏనాడో నీవాడైనాడు.రాజుకు భార్యలెందరున్నా దోషం కాదు. అయినా నీ స్థానం నీదే! ప్రభువుల వివాహానికి అనేక కారణాలుంటాయి. నీవల్ల ఒక సహాయం కోరి వచ్చాను.’’
ఉలిక్కిపడిరది చిన్నాదేవి.
‘‘నావల్లనా అప్పాజీ! విజయనగర సామ్రాజ్యమే మీకెంతో ఋణపడిరది చెప్పండి మహామాత్యా!’’
‘‘చిన్నాదేవీ! కృష్ణరాయలు రాజుకాకముందే వారి అభిమానం సంపాదించావు. నీకాయన ఖడ్గవిద్య నేర్పారు. నీ సహజ లలిత కళాకౌశలాన్ని ప్రభువు అభిమానించారు. ఇప్పుడు రాజయ్యాక పట్టమహిషి స్థానం కూడా నీకివ్వదలిచారు. అయినా రాయలు మరో వివాహం కూడా చేసుకోవాలి. దీనికి రాయల్ని నువ్వే అంగీకరింపచేయాలి’’ అభ్యర్థనగా అన్పిస్తున్నా ఆదేశం ధ్వనించిందా స్వరంలో.
‘‘నేనా’’ చిన్నాదేవి గొంతు జీరవోయింది. ఆమె హృదయవేగం పెరిగింది.
‘‘అవునమ్మా! శ్రీరంగ పట్టణానికి చెందిన వీర శ్యామల రాయల కుమార్తె తిరుమలదేవితో రాయల వివాహం చేయదలిచాను. ఇది ప్రభువుకు, రాజ్యానికి కల్యాణకారణం అవుతుంది. రాయలు నా మాట కాదనడు. కానీ నీ ప్రేమ రాజ్యశ్రేయస్సుకు ప్రతిబంధకం కాకూడదు కదా!’’ అర్థస్ఫురణతో అన్నాడు అమాత్యుడు.
‘‘అప్పాజీ! మీరు నాకు తండ్రిలాంటివారు. ప్రభువు ఉన్నతి కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు నిశ్చింతగా ఏర్పాట్లు జరుపుకోండి’’ చిన్నాదేవి మాటల్లోని గంభీరతకు తిమ్మరుసు మంత్రి ఆశ్చర్యపడ్డాడు. ఆమె మట్టిలో మాణిక్యమని గుర్తించాడు.
‘‘మేము నిన్ను కల్సిన సంగతి రహస్యం సుమా’’ అని హెచ్చరించి గడప దాటుతూ ‘‘మంజరి క్షేమమా’’ అడిగాడు. చిన్నాదేవి తలూపింది.
అప్పాజీ అటువెళ్ళగానే కూలబడిరది చిన్నాదేవి. అశ్రుధారలతో ఆమె
చెక్కిళ్ళు, చీర తడిసిపోయాయి.
‘ప్రభువు తనకు దూరమవుతాడా’ ఆలోచనకే ఆమె హృదయవేదన మిక్కుటమయింది. అన్నింటికీ ఆ విరూపాక్షుడే సాక్షి అనుకున్నది. మంజరి ఎప్పుడువచ్చిందో చిన్నాదేవి భుజంమీద చేయివేసి పిలిచేదాకా తెలీలేదు.
‘‘చిన్నాజీ! నేనంతా విన్నాను. నీ నిర్ణయంలో ఎంత త్యాగముందో రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.’’
‘‘ఏమో! నా ప్రభువు లేని జీవితం మాత్రం నేనూహించలేను’’ చిన్నాదేవి మంజరిని కౌగలించుకుని రోదించింది.
‘‘అలా ఎన్నటికీ జరుగదు. ప్రభువులు అనేక కారణాలతో ఎందర్ని చేసుకున్నా వారు అనుమతిస్తేనే భార్యగా చెలామణి అవుతారు. ప్రభువు నిన్నేనాడో పట్టమహిషిని చేశారు. మరెందరు భార్యలుంటేనేం? దుఃఖించకు’’ అని ఓదార్చింది మంజరి. చిన్నాదేవి ఒకింత సాంత్వన పొందింది.
‘‘అవును మంజరీ! నువ్వు మహామంత్రికి ఎలా తెల్సు? నువ్విక్కడ ఉన్నట్లు వారికి ముందే తెలుసా?’’ ఈ లోకంలోకి వచ్చినట్లుగా ప్రశ్నించింది చిన్నాదేవి.
‘‘విజయనగర సామ్రాజ్యంలో చీమ కదిలినా కూడా మహామంత్రికి తెలియకపోదు. శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల పట్టాభిషేక మహోత్సవంలో జరిగిన నాట్యప్రదర్శనలో నీతోపాటు నేనూ నాట్యం చేశాను కదా! తిమ్మరుసు మంత్రివర్యులు ఆనాడే నన్ను పసిగట్టారు. మనలో మాట… చంద్రప్ప సంగతి అడిగావుగా! చంద్రాకు అప్పాజీగారు కొన్ని రాచకార్యాలు అప్పగిస్తుంటారు. ఈ పదిరోజులుగా అతను కన్పించలేదంటే అదే అనుకుంటున్నాను.’’
చిన్నాదేవి ఆదరంగా మంజరి చెక్కిళ్ళు నిమిరింది. మేనా తెప్పించి ఆమెను ఆదరంగా సాగనంపింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చిన్నాదేవి రాయలను ఎలా ఒప్పించిందోగానీ, రాయల వివాహం తిరుమలాంబతో వైభవంగా జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగాంబ కోడల్ని ప్రేమతో అంతఃపురానికి ఆహ్వానించింది.
ముత్యాల హారతులు
ముదితలంతా ఈరె
ముద్దుల సీతకు
మురిపాలు మీర ॥
పగడాల హారతులు
పడతులంతా ఈరె
పసిడి పళ్ళెమ్ములో
పూవు లక్షతలుంచి ॥
వజ్రాల హారతులు
వనితలంతా ఈరె
వైభోగములు వెలయ
వాణీశుడే బ్రోవ ॥
తిరుమలదేవికి సాహిత్యమంటే బహుప్రీతి. ఆమె చాలా అందగత్తె. వీణావాదనలో నిష్ణాతురాలు. రాజసం ఉన్న ధీరవనిత. అంతఃపురంలో నృత్యగాన వినోదాలతో పొద్దుపుచ్చుతున్నా తిరుమలదేవి మానసంలో ఏదో ముల్లులా ఒక బాధ. అది చిన్నాదేవి గురించి తెలియటమే!
ఆ రోజు సాయంత్రం తిరుమలదేవి అంతఃపురంలో ‘కృష్ణలీలలు’ నృత్యసన్నివేశం జరుగుతోంది.
‘‘ఈమె ఎవరు? ఇంత అద్భుత సౌందర్యంతో తన్మయపరుస్తున్న ఈ నర్తకి విజయనగర సామ్రాజ్యానికే మణిదీపంలా ఉంది’’ అని మంజరిని చూస్తూ తలపోసింది మహారాణి.
నాట్యప్రదర్శన ముగిశాక మంజరి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఆమె చిన్నాదేవికి అత్యంత ప్రీతిపాత్రురాలని అవగతమైంది. మంజరి దేవదాసి అనీ, ఆమె నర్తనంలో అలౌకిక దివ్యత్వం ఉందనీ అర్థం చేసుకుంది. ఆమెను అనేక బహుమతులతో సత్కరించింది.
తిమ్మరుసు మహామంత్రికి తన మనసులోని ఆవేదన నివేదించిన తిరుమలదేవి చిన్నాదేవిని అంతఃపురానికి సకల లాంఛనాలతో రప్పించమని కోరింది.
తిరుమలాంబ ధీరత్వానికి అప్పాజీ లోలోపల సంతోషించాడు. సామ్రాజ్య పటిష్టతకు రాయల వ్యక్తిగత జీవన ప్రశాంతత కూడా చాలా అవసరం అని ఆయనకు తెలుసు.
చిన్నాదేవి రాజమందిరంలో చెలికత్తెలతో ప్రవేశించటం రాయలకు మహదానందంగా ఉంది. తిరుమలదేవి స్వయంగా ఎదురువెళ్ళి హారతిచ్చి చిన్నాదేవిని ఆహ్వానించింది. తిరుమలదేవికి ఆమెను చూస్తూంటే తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లే అన్పిస్తున్నా మనసులో స్త్రీ సహజమైన కలత తొంగిచూస్తున్నది.
మంజరి చిన్నాదేవితో బాటు రాజమందిరంలోకి వచ్చిందే కానీ మొహాన చిరునవ్వు మాయమైంది. ఎప్పుడూ అన్యమనస్కంగా ఉంటున్నది. నాట్యం చేసినా ఆత్మ పలకటం లేదు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అప్పాజీ రహస్య సమావేశ మందిరంలో దీర్ఘాలోచనలో నిమగ్నమై ఉన్నాడు. వార్తాహరుడు వచ్చి అందించిన సమాచారం వల్ల ఆయన మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఇంతలో చంద్రప్ప వచ్చినట్లు కబురందింది. లోపలికి అనుమతించాడు మహామంత్రి. చంద్రప్ప వచ్చి వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
‘‘చంద్రప్పా! వెళ్ళిన పని ఏమయింది’’ ఆయన మామూలుగా అడిగినా అది ఉరుమంత గంభీరంగా ఉంది.
‘‘మహామాత్యా! మీ ఆనతి ప్రకారం ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రాంతాలు పరిశీలించి వచ్చాను. అక్కడి మన వేగులతో సంప్రదించాను. ఆ పాలెగాళ్ళు మన విజయనగర ఆధిపత్యాన్ని లెక్కచేయటం లేదు. వాళ్ళు మనకి పన్నుకట్టరట. త్వరలోనే స్వతంత్రత ప్రకటించుకుంటారట అప్పాజీ!’’ నమ్రతగా చెప్పాడు.
‘‘ఆహా! ఎవ్వరికీ ఏమీ ఉప్పందించలేదు కదా!’’ అప్పాజీ లోతుగా ప్రశ్నించాడు.
‘‘లేదు అప్పాజీ! ఈ మాసం రోజులు నా వేణుగాన ప్రదర్శనలతో ప్రజల్లో ధారాళంగా సంచరించాను.’’
‘‘ప్రజలేమనుకుంటున్నారు?’’
‘‘ప్రజలంతా కృష్ణరాయలవారి పాలనే కోరుకుంటున్నారు అప్పాజీ!’’
‘‘మంచిది. ఇక నువ్వు వెళ్ళవచ్చు’’ తిమ్మరుసు ఆజ్ఞఅయినందుకు వినమ్రంగా నమస్కరించి నిష్క్రమించాడు చంద్రప్ప.
సేనానాయకుడు దండపాణి ప్రవేశించాడు. మహామాత్యులు ఆసీనుడైనాడు. సుదీర్ఘ మంతనాలు జరిపాడు.
‘‘మహామంత్రి! మనం అభివృద్ధిపరిచిన ప్రకారం మన సైన్యం ఏడులక్షల కాల్బలం, ఐదువందల యాభై గజబలం, ముప్ఫైరెండు వేల ఆరువందల అశ్వికదళం, ఇది కాక కామానాయకుడు, తిప్పన్న నాయకుడు, కొండమరెడ్డి, మధుర నాయకుడి ఆధీనంలో వేల కాల్బలం, గుర్రపుదళం, గజబలం కేంద్రీకృతమై యుద్ధసామాగ్రితో సిద్ధంగా ఉంది. రాయలవారు పట్టాభిషిక్తులైన ఈ సంవత్సరంలో మనసైన్యం బహుధా శిక్షణ పొంది ఉంది. ఇంకా కొద్దిరోజుల్లోనే బహుమనీ సుల్తాన్ రెండవ మహమ్మద్షా, బీజాపూర్ యూసఫ్ అదిల్ఖాన్ షాతో కలిసి మనమీద యుద్ధం ప్రకటించబోతున్నారని వేగులవల్ల తెలిసింది.’’
‘‘మంచిది. సైన్యాన్ని ఆయత్తపరచండి. వాళ్ళు సరిహద్దు చేరగానే మన సైన్యం ఆ మ్లేచ్ఛులను చీల్చి చెండాడగలదు’’ మహామంత్రి ఆజ్ఞకాగానే దండపాణి సమరోత్సాహంతో నిష్క్రమించాడు.
ఆ రాత్రి రెండుజాముల వరకు తిమ్మరుసు దీపం వెలుగులో పలు లేఖలు రచించి వేగులతో వర్తమానాలు పంపించాడు. అవి ఎవరికోసం రాశాడో మున్ముందు చరిత్రే చెప్తుంది.
చిన్నాదేవి మందిరంలో ప్రణయ సామ్రాజ్యంలో ఓలలాడి ప్రశాంతంగా నిద్రిస్తున్న రాయలకీ విషయాలేవీ తెలియవు. మహామంత్రి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యాన్ని కంటి రెప్పలా కాపాడుతున్నంత కాలం నిశ్చింతగా ఉండొచ్చని రాయల అచంచల విశ్వాసం.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
అంతఃపుర సౌధాన్ని ఆనుకొని ఉన్న సుందర ఉద్యానవనంలో చాలాసేపటి నుంచి మంజరి వేచిఉంది. చంద్రాన్ని చూసి ఎంత కాలమైంది! తనను కలవలేనంత రాచకార్యాలేముంటాయి? తను అతనికోసం అంతగా వేదన చెందుతుంటే చంద్రాకి ఇదేవిూ పట్టదా! ఈ రోజు చంద్రుడు నడినెత్తి మీదికి వచ్చే సమయానికి ఈ వసంతవాటికలో కలుస్తానని కబురంపాడు. ఇంతవరకు జాడలేదు.
ఆకాశంకేసి చూసింది మంజరి. మబ్బులు అడ్డగించడం చల్ల చంద్రుడు ఎంతమీదికి వచ్చాడో తెలీటం లేదు. ఉస్సురని నిట్టూర్చింది. చిన్నాదేవిదే అదృష్టం. ప్రభువుకాకముందే కృష్ణరాయని ప్రేమకి పాత్రురాలయింది. ప్రభువయినా రాయలవారి మనసు ఇసుమంతయినా మారలేదుసరికదా తిరుమలాంబతో వివాహమైనా చిన్నాదేవి పట్ల మక్కువ పెరిగిందే కానీ తరగలేదు. ఓసారి నిట్టూర్చి పాలరాతి మండపంలో స్తంభానికి చేరగిలపడి చంద్రప్ప గురించి తలపోస్తున్నది మంజరి.
‘‘ఎదుట ఉన్నవారిని మరిచి ఎంతసేపా ధ్యానం మంజూ’’ చంద్రప్ప ప్రేమపూరితమైన స్వరం విని నిలువెల్లా పులకించింది.
‘‘చంద్రా!’’ ఉదుటన లేచి నిలువెల్లా అల్లుకుపోయింది.
‘‘ఇన్నాళ్ళకా చంద్రా! నేనేమైపోవాలి’’ ఆమె గొంతు మూగవోతున్నది.
‘‘మన్నించు మంజూ! అప్పాజీవారు అప్పగించిన స్వామికార్యంలో నిమగ్నమై నిన్ను కలవలేకపోయాను’’ బుజ్జగిస్తూ చెప్పాడు. ఆమె భుజంమీదుగా చేయివేసి లతామండపానికి తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చెప్పాడు.
‘‘నువ్వు వినే ఉంటావు. మనకీ, బహుమనీ సుల్తాను, బీజాపూర్ సుల్తాన్లు కలిసి జరిపిన యుద్ధం గురించి’’
‘‘అవును… మనం సాధించిన విజయవార్త కూడా విన్నాను… విజయనగర సైన్యం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరదనీ, మహ్మద్షాకు తీవ్రగాయాలైనాయనీ’’
‘‘ఆ! అంతేకాదు. పిరికితనంతో పలాయనం చిత్తగిస్తున్న మహ్మదీయ సైన్యాన్ని మనవాళ్ళు తరిమి తరిమి కొట్టారు. ఈ యుద్ధంలో బీజాపూర్ యూసఫ్ ఆదిల్షా మరణించాడు. అతని కుమారుడు పన్నెండేళ్ళ బాలుడైన ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ సుల్తాన్ అయ్యాడు. ఇస్మాయిల్ బాలుడు కావటాన బీజాపూర్లో కామల్ఖాన్ సర్దారు అధికారం చేజిక్కించుకున్నాడు. బీదర్ ఆక్రమించి సుల్తాన్ మహమ్మద్ షాని బందీని చేశాడు. రాయచూర్ని జయించాక కామల్ఖాన్ హత్య తర్వాత రాయలు మహమ్మద్ షాని బంధవిముక్తుడ్ని చేసి మళ్ళీ సుల్తాన్ని చేశాడు’’ సంతోషంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘ఇవన్నీ విజయనగర పౌరులందరికీ తెల్సినవే! రాయలవారికి ‘యవనసామ్రాజ్య స్థాపకాచార్య’ బిరుదు ప్రదానం అందుకే కదా’’ నవ్వింది మంజరి ఉల్లాసంగా.
‘‘మంజరీ! అన్నీ శుభవార్తలే! ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత మళ్ళీ నీ సుందర వదనారవిందాన్ని చూసే అదృష్టం కలిగింది. నా దేశాంతరవాస శ్రమంతా నీ చిరునవ్వుతో, ఆలింగన స్పర్శతో తీరిపోయింది’’ చంద్రప్ప మంజరిని తన బాహువుల మధ్య మళ్ళీ చేర్చుకున్నాడు. మంజరి గువ్వలా అతని కౌగిట ఒదిగిపోయింది.
‘‘చంద్రా! మరో ముఖ్య విషయం. నేను నీ ఎడల అనురాగాసక్తనై ఉన్నట్లు చిన్నాజీకి తెల్సింది.’’
అతను కౌగిలి నుంచి విడివడి ఆమె కళ్ళల్లోకి చూశాడు.
‘‘నువ్వే చెప్పావా?’’
‘‘లేదు. ఆమె గ్రహించింది. రాయలవారి అనుంగు పట్టమహిషి ఆమె. ఆమె ప్రియసఖిని నేను. నా మనసు తెలుసుకోవటం అంత కష్టమేమీ కాదులే!’’ బుంగమూతి పెట్టింది మంజరి.
‘‘అప్పాజీవారు కూడా మనకి ఆశీస్సులందిస్తారు’’ నమ్మకంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘అప్పాజీవారా’’ ఆశ్చర్యంగా చూసింది మంజరి.
‘‘అవును. ఈ రాచకార్యం మీద నేను దేశాంతరం వెళ్ళేముందు వారు ‘కళ్యాణమస్తు’ అని కూడా ఆశీర్వదించారు.’’
‘‘అయితే అది మన కోరిక తీరే దీవెనే’’
‘‘అయినా కొంచెం ఆగాలి సుమా’’
‘‘ఇంకానా’’ ఆమె అతని భుజంపై తలవాల్చింది.
‘‘రాయలవారు దక్షిణ దిగ్విజయయాత్రకు బయలుదేరుతున్నారు. నీకు తెలుసుకదా! ప్రభువుతోబాటు సైన్యమే కాదు కళాకారులు, కవులు కూడా యుద్ధరంగానికి తరలి వెళ్తున్నాం’’ ఉత్సాహంగా చెప్పాడు చంద్రప్ప.
‘‘మీరు కూడానా! యుద్ధరంగానికా! ఇదేమిటి చంద్రా! అక్కడ మీకేం పని? వేగు పనిచేయటం వేరు. వేణుగానంతో మనసుల్ని అలరించే లలిత హృదయుడివి. రక్తపుటేరులు పారే కదనభూమిలో నిలువగలవా?’’ భయాందోళనలతో అడిగింది మంజరి.
ఆమె చేతిమధ్య అతని చేతిని బిగించి పట్టుకోవటంలోనే అతనిపట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రప్ప చిన్నగా నవ్వాడు. అతనికి తెలుసు ఆమె మనసులో చెలరేగే సంఘర్షణాజ్వాల.
‘‘రాయలవారు ఏ జైత్రయాత్రచేసినా కవులు, కళాకారులు సైన్యంతో పాటు బయలుదేరాల్సిందే. సాయంత్రం యుద్ధవిరమణానంతరం ప్రభువు కవిపండిత గోష్ఠితో మానసోల్లాసం పొందుతారు. అల్లసానిపెద్దన, నందితిమ్మన వంటి కవులు కూడా వస్తున్నారు. నా గానంతో ప్రభువు అలసట ఉపశమిస్తే అంతకంటే మనకు కావలసినదేముంటుంది మంజరీ!’’ ఆమె చుబుకం పట్టి చెప్పాడు చంద్రప్ప మృదువుగా.
కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా తలదించుకుంది మంజరి.
‘‘నేనూ వస్తాను. నా నాట్యంతో ప్రభువుల్ని అలరిస్తాను’’ బింకంగా అంది.
‘‘స్త్రీలను తీసుకెళ్ళటంలేదు’’ చంద్రప్ప అర్థవంతంగా నవ్వాడు.
‘‘ఓహో! ప్రభువు స్త్రీలను తగురీతిగా గౌరవిస్తారని విన్నామే!’’
‘‘అది ఆస్థానంలో! శత్రువుల మాయోపాయాలతో ద్వేషం బుసలుకొట్టే రణరంగంలో కాదు.’’
ఆమె నిరుత్సాహపడిరది. చంద్రప్పతో వియోగం సహింపరానిదిగా ఉంది. అతనామె మనస్థితిని గ్రహించాడు.
మరుక్షణం మొదలైన అతని వేణుగాన మాధురీ తరంగాలు ఆమెను చుట్టుముట్టేశాయి.
ఆమె ఉన్మత్త నాగినిలా ఉంది. ఆ రాత్రి శరీరమంతా వేయినాగులు చుట్టుకున్నట్లు మంజరి నర్తించింది. కారణం ఆ ప్రకృతికి తెలుసు. చంద్రప్పకీ తెలుసు. రాత్రి రెండవరaాము నగారా మోగింది.
చిన్నాదేవి మందిరంలో ఆమెను వక్షస్థలానికి చేర్చుకుని నిద్రిస్తున్న శ్రీకృష్ణరాయలకి లీలగా మెలకువ వచ్చింది. చిన్నాదేవి ప్రభువు హృదయంపై తలవాల్చి ‘రాయలే లోకం’ అన్నట్లు నిద్రిస్తోంది.
దూరంగా గాలితరంగాలు భారంగా మోసుకొస్తున్న వేణుగానం వింటుంటే ఆ కళాకారుడు ఆనందపరవశంతో పాడుతున్నట్లు అన్పించదు. ఏదో హృదయ తాపాన్ని గానరూపంలో వెలిబుచ్చుతున్నట్లనిపిస్తుంది. ఎవ్వరో ఆ గాయకుడు? మున్నెన్నడూ విన్నట్లు లేదు. నడిజామున ఈ విరహగానాలాపన ఏంటి? కృష్ణరాయలకు నిద్రాభంగమైంది. కాపలావారిని పిల్చి ఆ గానాన్ని ఆపించుదామనుకున్నాడు. కానీ మనసొప్పలేదు. ఒకనాడు చిన్నదేవి కోసం తాను పడిన వేదనను గుర్తుచేస్తున్న గానం అది. ఆ వేణుగానం మెల్లగా మంద్రస్థాయికి దిగింది. క్రమంగా గాలిలో విలీనమైంది. ప్రభువుకు కలతగానే నిద్రపట్టింది.
‘‘ఇక నేను వెళ్ళివస్తాను మంజూ!’’
‘‘అప్పుడేనా’’ దిగాలుగా అందామె.
‘‘ఉదయానికే ప్రయాణానికి సన్నద్ధం కావాలి మరి’’ ఆమెను మరోసారి సందిట చేర్చి ముద్దాడి వీడ్కోలు పలికాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలకు దేవేరిలిద్దరూ హారతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి సాగనంపారు. రాయల దక్షిణ దిగ్విజయ యాత్ర మొదలైంది. కాలం నడక వేగం పుంజుకుంది.
అంతఃపురంలో చిన్నాదేవి దిగులుగా ఉంది. ఆభరణాలు, అలంకారాలు లేవు. మంజరి రావటం చూసింది.
‘‘రా మంజరీ!’’
‘‘ఏంటి చిన్నాజీ ఇంతటి వైరాగ్య వేదన! నిరాలంకరణ దేనికి?’’
‘‘ప్రభువు దగ్గరలేని అలంకరణ దేనికి మంజరీ! నేటికి పదినెలలు గడిచింది ప్రభువు యుద్ధానికి వెళ్ళి.’’
‘చంద్రప్ప వెళ్ళి’ మనసులో మంజరి అనుకుంది.
‘‘ఆ వార్తలు తెలుస్తున్నాయి గదమ్మా! అంతా జయమే’’ పైకి బింకంగా అంది.
‘‘కానీ నాకు మాత్రం క్షణమొక యుగంలా ఉందే!’’
‘‘పాద సంవాహన చేయించనా’’
‘‘వద్దు! ఓ పాట పాడు’’
మంజరి గొంతు సవరించుకుని ఓ గీతాన్ని ఆలపించింది.
‘‘మోహన మురళి ఊదవోయి కృష్ణా!
తేనెలొలికే పాట మధువు
ఓపలేదీ రాధ బ్రతుకు’’
‘‘మంజరీ! నా బాధ పెంచే పాటే పాడుతున్నావే’’ చిన్నాదేవి వారించింది.
‘‘మనిద్దరిదీ ఒకే బాధగదా చిన్నాజీ’’
‘‘అంటే చంద్రప్ప కూడా’’ ప్రశ్నార్థకంగా అడిగింది చిన్నాదేవి.
మంజరి అవునన్నట్లు తలాడిరచింది. నిట్టూర్చింది చిన్నాదేవి. మంజరిని పంపేసింది గానీ మనసు కుదుటపడలేదు. రాజులకి యుద్ధాలు తప్పవు. అలాగే వారి ప్రియసతులకీ వేదనా తప్పదనుకొంది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
యాభైవేల కాల్బలం, రెండువేల అశ్వికదళంతో గంగరాజు పాలిస్తున్న శత్రుదుర్భేధ్యమైన ఉమ్మత్తూర్ కోటను రాయలు ముట్టడిరచాడు. భీకర పోరాటం సాగుతున్నది.
యుద్ధశిబిరంలో కృష్ణరాయలకి నిద్రరావటం లేదు. శ్వేతాంబరధారిణి అయిన చిన్నాదేవి జ్ఞప్తికి వస్తోంది. ఆమె బాహువుల్లో ఒదిగి హాయిగా నిద్రించే రోజెన్నడో! ఏదైనా గానం వింటే మనసుకి కొంత ఊరట. చంద్రప్పకు కబురందింది.
అతని బాధాతప్తగానం రాయల హృదయానికి ఊపిరులూదుతోంది. ఇదివరలో రాత్రివేళ విన్న గానమిదే! ఇతనికీ ఓ ప్రేయసి ఉందేమో! లేదంటే ఎందుకింత విరహ వ్యధ? ఈ యుద్ధంవల్ల లాభమా! నష్టమా! హిందూ సామ్రాజ్య సంస్థాపన కోసం కంకణంగట్టుకున్న తాను ఇలాంటి ఆలోచన చేయొచ్చా?
ప్రభువు నిద్రించారని గ్రహించి ఆలాపన ఆపేశాడు చంద్రప్ప.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
సంవత్సరం పాటు జరిగిన పోరులో గంగరాజు మరణంతో ఉమ్మత్తూర్పై విజయం సిద్ధించింది. శ్రీరంగపట్నం జయించి విజయుడై వస్తున్న రాయలకు విజయనగర ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
మంజరి మనసు పాలసముద్రంలా ఎగసిపడుతోంది. వార్తాహరుని ద్వారా చిన్నాదేవి మందిరంలో అందరికీ తెల్సిన వార్త ఆమెలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చిన్నాదేవి కూడా పరవళ్ళు తొక్కే నదిలా పూజామందిరంలో నృత్యం చేయటం చూసి మంజరి చాలా సంతోషించింది. ఎవరికైనా మనసు ప్రతిబింబించేది ఆరాధించే కళలోనే గదా!
తిరుమలదేవి, చిన్నాదేవిలతో కొలువుతీరిన ప్రభువు రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణునిలా భాసించాడు. నాటి కొలువులో చంద్రప్ప గానానికి మంజరినాట్యం కళాకోవిదుల ప్రశంసలు పొందింది. తిమ్మరుసు మంత్రి వాళ్ళిద్దరికీ ఆశీఃపూర్వకంగా సంభావనలిచ్చాడు. రాయలు మహాదానాలు చేశాడు.
దక్షిణాపధాన విజయప్పనాయకుడి దండయాత్రవల్ల చేర, చోళ, పాండ్యరాజులు విజయనగరానికి సామంతులు కావటం రాయల కిరీటంలో మరిన్ని మణులు చేరినట్లయింది.
కృష్ణరాయల కోసం బంగారంతో రత్నాలు, వజ్రాలు తాపడం చేసిన కళాత్మక సింహాసనం ఏర్పాటయింది. చక్రవర్తి కోశాగారం నిండిరది. లక్షకిపైగా నివాస గృహాలున్న విజయనగరం లక్ష్మీశోభతో కళకళలాడుతోంది. బహుభాషా కోవిదులు, చాకచక్యంగల చారుల సేవలవల్ల విజయనగరం మరింత భద్రంగా శోభిల్లుతున్నది.