Home వ్యాసాలు స్వరాంజలి -8

స్వరాంజలి -8

by Krishna Kumari Yagnambhatt

       ఈ వ్యాసంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి గురించి తెలుసుకుందాం. 18 వ శతాబ్దం సంగీత విద్యకు ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి సువర్ణ కాలం.అత్యంత ప్రతిభావంతులు, శారదా మాత అనుగ్రహనికి పాత్రులైన సంగీత త్రిమూర్తులు జన్మించిన కాలమిది. ఆ ముగ్గురిలో కూడా తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న త్యాగరాజ స్వామి వారు తిరువరూరులో 1767 వ సంవత్సరం జన్మించారు. విచిత్ర మేమిటంటే రాజ్యం తమిళులది,రాజ్యాధికారం మహా రాష్ట్ర రాజులది. కాని తెలుగు వాడైన త్యాగయ్య మీద ఈరెండు భాషల ప్రభావం ప్రసరించలేదు. తేట తెలుగులో, తేనె లొలుకు మధురమైన భాషలో,పండిత పామర రంజకంగా రచింపబడ్డ వీరి రచనల వైశిష్ట్యం న భూతో న భవిష్యతి. అటు  సంగీతానికి  ఇటు సాహిత్యానికి వీరు చేసిన కృషి అనన్య మైనది.

     శొంటి వేంకట రమణయ్య గారు ఆ కాలంలో పేరెన్నిక గన్న  గొప్ప విద్వాంసులు. అటువంటి వారికి శిష్యుడైన త్యాగయ్య గురువును మించిన వాడై వందలాది మందికి గురువు అయినాడు. త్యాగయ్య గారి శిష్యులమని చెప్పుకోవడం ఆ నాడు గర్వ కారణంగా ఉండేదిట.

    లౌకిక సంపదలకు దూరంగా ఉన్న వీరికి రామభక్తి  అనే సంపద పుష్కలంగా లభించింది. భోగాల వెంట తిరిగే  వారిని ఉద్దేశించి “నిధి చాలా సుఖమా!రాముని సన్నిధి సేవ సుఖమా!’అంటూ ప్రశ్నించారు.నిరంతర రామ సేవతోనే వారికి మనశ్శాంతి కలిగేది.ఆ సమయంలోనే  వారి నోట అప్రయత్నంగా కీర్తనలు వచ్చేవి. సాహిత్యంలోని అంతర్గత భావాన్ని ప్రస్ఫుటం చేసే రాగం అదంతట అదే ఏర్పడేది.

    రాగ సంచారంలోని కొన్ని ప్రత్యేక ప్రయోగాల ద్వారా రాగ భావాన్ని సాహిత్య భావంతో రంగరించి విస్తరింపచేయడం వీరి ప్రత్యేకత. ఈ ప్రక్రియ బహుశః వీరితోనే మొదలైంది అనవచ్చు.అయితే ఇది కూడా వారికి అలవోకగా వచ్చిందే తప్ప దానికోసం కష్టపడింది లేదు. కృతి అన్న ప్రక్రియ కూడా త్యాగయ్య సొంతమే. అంతవరకు కీర్తనల ద్వారా భగవంతుని కొలవడమే  తప్ప సన్నివేశ చిత్రీకరణ అన్న ప్రక్రియ లేదు. దీనికి స్వామివారే ఆద్యులు. సన్నివేశ చిత్రీకరణే కృతిగా ఆవిర్భవించింది.వీరి కృతులలో అంతర్గతంగా రామాయణం కథ  ఉంటుంది.పరంపరగా వస్తున్న కథను బట్టి నారద మహర్షి స్వయంగా స్వరార్ణవ మనే గ్రంధాన్ని ఇచ్చారు. అందులోని సంగీత మర్మాలను అవగాహన చేసుకొన్న త్యాగయ్య  అంతవరకు ప్రచారంలో లేని ఎన్నో రాగాలకు ఒక స్పష్టమైన ఆకారాన్ని, భావాన్ని కల్పించి, దానికి లక్ష్యంగా ఎన్నో కృతులను రచించారు. సాహిత్యంలోని లోతులను సుస్పష్టం చేయడానికి రాగ సంచారాలలోని ప్రత్యేక ప్రయోగాల ద్వారా రాగా భావాన్ని సాహిత్య భావంతో మేళవించి విస్తరించి తద్వారా ‘సంగతి’అనే నూతన ప్రక్రియను ప్రచారం చేసిన ధాతు కల్పనా దక్షుడు త్యాగయ్య. వీరు నాద యోగ ప్రధానాలు అయినప్పటికీ లోకం పట్ల విరక్టులు కాదు. ఎంతో అనుభవ పూర్వకములైన లోక న్యాయాలను తెలిపి, మంచి చెడుల విచక్షణను ప్రజలకు తెలియ చేశారు.నారదాంశ సంభవుడుగా ప్రసిద్ధి పొందిన త్యాగయ్య తన మనోమందిరంలో రామచంద్రుని ప్రతిష్టించి ఆతని లీలలు వివిధములైన కృతుల రూపంలో ఆరాధిస్తూ భక్తినే ఒక తపసుగా ,యజ్ఞంగా జీవితాన్ని గడిపి రామ సాక్షాత్కారాన్ని పొందారు. తన కీర్తనల ద్వారా తాను అనుష్టించిన ధర్మాన్నే, భక్తి విధానాన్నే లోకులకు ఉపదేశించారు.

”ఎందెందు జూచిన ఎందెందు  పలికిన

ఎందెందు సేవించిన ఎం దెందు పూజించిన

అందందు నీవని తోచే టందుకు నీ

పాదార విందమును ధ్యానించిన దెందుకని?”

అన్న త్యాగరాజ స్వామి భక్తి అనన్య సామాన్యమైనది.  

రాగ స్వరూపాని కైనా, సాహిత్య సౌకుమార్యాని కైనా త్యాగయ్య కృతులు దర్పణాలు. త్యాగయ్య కీర్తి దేశమంతటా వ్యాపించడం వలన తంజావూరు పాలకుడైన శరభోజి ,తిరువానకూరు ప్రభువైన స్వాతి తిరునాళ్ తమతమ ఆస్థానాలకు ఆహ్వానించారు. కానీ సాత్త్విక భక్తుడైన త్యాగయ్య  రామ పాదాలే తనకు సామ్రాజ్యమని  వారి ఆహ్వానాన్ని సున్నితంగా  నిరాకరించాడు.

త్యాగయ్య కృతులలోని సాహిత్యం ఎంతో విశిష్టమైనది. భక్త కవి పోతన ఛాయలు వీరి సాహిత్యంలో గోచరిస్తాయి. ముఖ్యంగా శబ్దాలంకారాల మీద వీరికి గల అధికారం చెప్పుకోదగ్గది. ఉదాహరణకు “నిధి- సన్నిధి, విదులకు-కోవిదులకు,దాంతునికైనా-వేదాంతుని కైనా,దరి -సుందరి,దేహి-వైదేహి,గ్రహ-అనుగ్రహ”వంటివి మచ్చుకి కొన్ని. కృతులలో వారు ఉపయోగించిన సమాసాలు గమనిస్తే వారి సంస్కృత భాషా వైదుష్యం అర్థమవుతుంది. ఉదాహరణకు “సామ నిగమజ సుధా మయగాన విచక్షణ , మోదకర నిగమోత్తమ సామవేద సారం, అమరతారక  నిచయ కుముద హిత పరిపూర్ణ ,దధి పయోధి వాస హరణ, సద్యో జాతాది పంచ వక్త్రజ’మొదలైనవి కొన్ని.

నిజానికి త్యాగయ్య కృతులన్నీ నాద యోగ ప్రధానాలు. నాదోపాసనలో ముక్తి పొందిన త్యాగయ్య తన భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించారు.      

వచ్చె వ్యాసంలో త్యాగయ్య కృతులలోని విశేషాలు చూద్దాం.

You may also like

Leave a Comment