Home వ్యాసాలు అమ్మ ప్రేమ అమృతధార

అమ్మ ప్రేమ అమృతధార

by Burra Venkatesham

       భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. ముల్లోకములలో తల్లి కంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరు. గాయత్రిని మించిన మంత్రము లేదు, గంగను మించిన తీర్థము లేదు, విష్ణువును మించిన ప్రభువు లేడు, శివుణ్ణి మించిన పూజ్యుడు లేడు. తల్లిని మించిన దైవమూ లేదు. 

          ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే, లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ పర్యవేక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడ తల్లి ఆర్యమాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. భారత జాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతుల నందుకొనిన వీర శివాజీ తనతల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్యమైన బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి పెంచి, పోషించి గాంధీజీని మహాత్మునిగా రూపొందించ గలిగింది ఆయన మాతృమూర్తి పుత్లీభాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే… మనదేశానికి భారతదేశమని పేరురావటానికి కారణమైన భరతుని పెంచి పెద్దచేసినది, తల్లి – శకుంతల.

ఆరు సంవత్సరాల బాలుణ్ణి ప్రోత్సహించి, విష్ణు దర్శనం చేయించి ధృవమండలంలో శాశ్వితంగా వెలుగొందే స్థానానికి చేర్చినది, తల్లి – సునీతి.

ఇంద్రుణ్ణి ఓడించి అమృత భాండాన్ని భువికి తెచ్చేంత వీరునిగా గరుత్మంతుణ్ణి పెంచినది, తల్లి – వినతాదేవి.

ప్రహ్లాదుణ్ణి అనన్య విష్ణు భక్తునిగా చేసినది, తల్లి – లీలావతి

హనుమంతుణ్ణి పెంచి పెద్దచేసి అనన్య సామాన్యునిగా చేసినది, తల్లి – అంజనాదేవి.

భీష్ముడిని పెంచి పెద్దచేసి వివేక సంపన్నుడిగా తీర్చిదిద్దినది, తల్లి – గంగాదేవి.

పాండవుల వంటి ధీరులకు జన్మనిచ్చిన తల్లి – కుంతీదేవి.

శాతకర్ణిని, మహోన్నత చక్రవర్తిగా మలిచింది తల్లి – గౌతమీదేవి.

ఇలా, ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. సింహాసనంపై ఉన్న రాజుకు మించిన శక్తి తల్లులకు ఉంటుంది. ఊయల ఊపే చేతులకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలు, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.

‘మాతృదేవోభవ’ అని చెప్పి స్త్రీ మూర్తికి మొట్టమొదటి పెద్ద పీటవేసిన వాజ్ఞ్మయం మన సొంతం. యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నొక్కి వక్కాణించే ధర్మం మనది. ఈ పవిత్ర భారతదేశంలో తల్లిని దైవంగా భావించి, ఆరాధించి, ఆనందించే సంప్రదాయం ఉంది. తల్లి , తండ్రి, గురువు – ఈ ముగ్గురూ జంగమ దేవతలు. అనగా నడిచే దేవుళ్ళు. ‘అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుడైనా, తల్లి బ్రతికి ఉన్న వాడైతే పసిబాలుడే. ఐదు సంవత్సరాల బాలుడైనా తల్లి లేనివాడైతే వృద్ధుడే.’ ఇది స్కాందపురాణంలో చెప్పిన మాట. 

మాతృ దినోత్సవ నేపథ్యం 

అంతర్జాతీయ మాతృ దినోత్సవం… కని, పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’ గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించడం జరిగింది. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ, ఆదరించే సంప్రదాయం మన దేశంలో అనాదిగా ఉంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును కేటాయించాలని’ మాతృ దినోత్సవం’ ను ఏర్పాటుచేయటం జరిగింది. 

మన దేశంలోనూ కొలువు కోసం పొరుగు దేశాలకూ, దూర ప్రాంతాలకూ వెళ్ళేవారు ఇటీవల అధికమయ్యారు. ఉద్యోగాలు చేసే మహిళలూ నానాటికీ పెరిగిపోతున్నారు. తమ ఇంట్లో పెద్దవారు లేని మహిళా ఉద్యోగినులు, వారి పిల్లలను డే కేర్ సెంటర్ లలో వదిలి ఆఫీసులకు వెళుతున్నారు. అక్కడ ఆయాలే పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. పరాయి చేతుల్లో కిరాయి పెంపకాలు ఐనాయి. ఉన్నత చదువులకోసం, ఉద్యోగాలకోసం పిల్లలు తల్లికి దూరంగా పెరుగుతున్నారు… అలా, నేటి తరం పిల్లలకు మాతృత్వపు మమకారం కరువైంది. 

మన దేశంలో, ప్రతీ రోజూ మాతృ దినోత్సవమే, ఇందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా! అని ఆశ్చర్యపోయే వారున్నారు. అలాగే, భారతీయ సమాజంలోనూ, తల్లికి దూరంగా ఉంటున్నవారి సంఖ్య క్రమక్రమంగా పెరగటంతో ‘అవసరమే’ అని సమర్థించే వారూ ఉన్నారు. ‘చిన్నప్పుడు మీరు, నన్ను హాస్టల్ లో వేశారు కదా! ఇప్పుడు నేను మిమ్మల్ని హాస్టల్ (వృద్ధాశ్రమం) లో వేస్తాను’ అని సేవ చేయకుండా, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో ఉంచే ప్రబుద్ధులూ ఉన్నారు. అనుబంధాలు వేరు, ఆర్థిక బంధాలు వేరు… అనుబంధాల స్థానాన్ని ఆర్థికబంధాలు ఆక్రమించినప్పుడు సార్థక జీవనానికి స్థానం లోపిస్తుంది.

ఇక ఈ మాతృ దినోత్సవం వెనుక దాగి వున్న అసలు కథ ఏమిటో ఒకసారి చూద్దాం…

ఈస్టర్ కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17 వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారంనాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు. 1872 లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, ఇందుకు గాను ఆమె బోస్టన్ లో సమావేశాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’ డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905 మే 9 న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్‌జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు, తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారంనాడు ‘మాతృ దినోత్సవం’ ను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910 లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరపగా, జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914 లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ‘మాతృ దినోత్సవం’ ను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

అమ్మ త్యాగం

తల్లి నవమాసాలూ మోసి సంతానాన్ని కంటుంది. నవమాసాలూ నిండే వరకూ, గర్భస్థ శిశువును మోస్తూ ఉంటుంది. ఆ బరువు… నెత్తిమీద ఉంటే, అలసిపోయినప్పుడు కిందికి దించుకోవచ్చును. కానీ ఇది అలా కాదు, ప్రసవం అయ్యేవరకూ మోయవలసిందే. 

తరువాత ప్రసవ వేదన అనుభవించి, తల్లి శిశువుకి జన్మనిస్తుంది. ప్రతీ ప్రసవమూ స్త్రీకి పునర్జన్మ. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అమృతం ఆయుష్సును పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం, తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది. శిశువు జన్మించిన పిదప తన రక్తాన్ని పాలుగా మార్చి శిశువును పోషిస్తుంది. తొలి మూడు నెలలూ నిద్రలేని అలసటను, తన బిడ్డ బోసినవ్వుల చూసి మరిచిపోతుంది. మాలమూత్రాలనూ శుభ్రపరుస్తుంది. నిద్ర పుచ్చటం కోసం జోల పాడుతుంది. ప్రథమ గురువుగా మాటలు నేర్పుతుంది. అమ్మ ఆది గురువు. అమ్మ ఒడే మొదటి బడి. “నాస్తి మాతృసమః గురుః అని వేద వ్యాసుడు పలికాడు. అనగా తల్లిని మించిన గురువెవరూ లేరు. తన బిడ్డ బాగుకోసం కోటి దేవతలకు మొక్కుతుంది. తన త్యాగపు పునాదులపైన మన బతుకు సౌధాన్ని నిర్మిస్తుంది మాతృమూర్తి. 

ప్రపంచానికి నిన్ను… నీకు ప్రపంచాన్ని… పరిచయం చేస్తుంది అమ్మ. శిశువుకు పుట్టిన క్షణం నుండి, ఆ శిశువుకు తల్లి ఎవరో ఎవరో తెలుసు. కానీ, తండ్రి ఎవరో, తల్లి చెబితేనే తెలుస్తుంది. అందుకేనేమో, తల్లిదండ్రులు ఇరువురూ ఎదురుగా ఉన్నప్పుడు ముందుగా తల్లికి నమస్కరించి, ఆతరువాతే తండ్రికి నమస్కరించాలి అని పెద్దలు చెబుతారు. 

అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు, తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. 

భీమసేనుడు బాగా తినగలవాడు. ఎవరు ఎంత పెట్టినా అతని కడుపు నిండేది కాదు. తల్లి ఐన కుంతీదేవి చేతిముద్ద ఒకటి తింటే చాలు కడుపు నిండిపోయేది. పొట్ట నిమురుకుంటూ… తేన్చుకుంటూ… తృప్తిగా వెళ్ళేవాడు. 

తినడానికి రెండు రొట్టెలే ఉన్నాయి. తినేవారు ముగ్గురున్నారు. ఈ సందర్భంలో … ‘నాకు ఆకలిగా లేదు, మీరు తినండి’ అని ఆ రెండు రొట్టెలనూ ఇచ్చి వారి తృ ప్తీ, సంతోషంలోనే… తన తృప్తినీ, ఆనందాన్ని పొందే అమృతమూర్తే అమ్మ. బిడ్డల కడుపు నిండితే, అమ్మకు తేన్పు వస్తుంది. 

తల్లి తన పిల్లల చేతిని పట్టుకొని నడిపిస్తుంది. కొంతకాలం తర్వాత, పట్టుకున్న చేతిని వదిలేస్తుందేమో కానీ తన హృదయంలోని ప్రేమను మాత్రం ఎప్పటికీ వదిలివేయదు. తల్లి ప్రేమ వర్ణింప నలవికానిది. ఊహించటానికి వీలులేనిది. అపారమైనది, అవ్యాజమైనది. 

రాయి తగిలి పడబోయినప్పుడు, ముల్లు గుచ్చుకున్నపుడు, అనుకోని బాధ కలిగినప్పుడు, ఆపద సమయంలోనూ ‘అమ్మా’ అనే మాటే ముందొస్తుంది. దేవుడిని స్మరించినా ఆ తర్వాతే. 

ఈ భూమిపై మనిషిగా మనం చేయగలిగిన అత్యుత్తమమైన విధులలో, పిల్లలను ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడం అతి ముఖ్యమైనది. ఈ పని తల్లులు సమర్ధవంతంగా చేయగలరు… నేటి సామాజిక పరిస్తితులలో అది కొరవడడం వల్లనే అన్ని సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి అంటే…

రాజవత్‌ పంచవర్షాణి, దశ వర్షాణి దాసవత్‌,

ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్‌.

రాజవత్‌ పంచవర్షాణి – అంటే పిల్లల్ని అయిదేళ్లవరకు రాజ మర్యాదలతో పెంచాలి.అంటే వారికీ స్నానం చేయించడం, గోరుముద్దలు తినిపించడం, ఆటలు ఆడించడం, జోలపాడి నిద్ర పుచ్చడం, వారిని కంటికి రెప్పలాగా కాపాడడం, వంటి సమస్త సేవలూ వారికీ చేయవలిసిందే.  

దశ వర్షాణి దాసవత్‌ – అంటే పదేళ్లు వచ్చే వరకు దాసులుగా పెంచాలి. వారికీ పనులు చెప్పడం, పనులు నేర్పడం, ఇంటి పనులు, బయట పనులు వారికి తగ్గట్టుగా అప్పగించాలి. పనుల్లో వారి సహకారం తీసుకోవాలి. చిన్నవాళ్లు కదా, వారికి ఏం వస్తుంది అని అనుకోకండి, ఆ వయస్సులో పిల్లలు చాల బాగా నేర్చుకుంటారు . జీవితంలో అది ఒక ముఖ్యమైన దశ అని గుర్తు పెట్టుకోండి.

ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్‌ – అంటే పదహారేళ్ల వయస్సు వచ్చాక వారిని మీ మిత్రులుగా చూడాలి. ఆ వయస్సులో వారిని మిత్రులుగా చూస్తేనే, వారు ప్రతీ విషయం మీతో పంచుకుంటారు. మీ సలహాలు, సూచనలు పాటిస్తారు. చెడు మార్గంలో వెళ్ళకుండా కాపాడుకోవడానికి ఇది ఒక ఉత్తమ విధానము అని చెప్పాలి . ఇది పుత్రుడు, పుత్రికలు ఇద్దరికీ వర్తిస్తుంది.

లాలయేత్‌ పంచవర్షాణి, దశ వర్షాణి తాడయేత్‌,

ప్రాప్తేతు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్‌.

పిల్లల్ని, అయిదేళ్లు వచ్చేవరకూ లాలించి, వాత్సల్యం చూపించాలి. ఆ తర్వాత పదేళ్లు, పిల్లలను మంచి మార్గంలో నడిపించే విషయంలో దండించటానికీ వెనకాడకూడదు. పదహారేళ్లు రాగానే సంతానంతో మిత్రుడిలా మెలగాలి.

తల్లిదండ్రుల ప్రాధాన్యత

గణాధిపత్యం:

ఒకనాడు దేవతలు, ఋషులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. తనకే ఆధిపత్యం ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. 

ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు కూడా. గణపతి వాహనం చిన్న ఎలుక, పైగా ఎగరలేదు. ఐనప్పటికీ గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా, తాపీగా నడుచుకుంటూ… తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి “జననీజనకులారా! ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకాల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతారని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైన మీ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నానని చెప్పి, గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి మూడు లోకాల్లో ఏ నదికి వెళ్ళినా, ప్రతీ నదిదగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళేసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు ‘నాన్నగారూ! అన్నగారి మహిమ నాకు తెలియలేదు. నాకు అన్నగారే ఒకప్పుడు మయూర వాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం… నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు… కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి’ అన్నాడు. ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు. 

ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. ఎన్నో తీర్ధాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం కంటే… తల్లితండ్రులని సేవించిన పిల్లలే ఉన్నతిని పొందుతారని తెలియచెప్పటమే గణాధిపత్యపు పోటీ ముఖ్యఉద్దేశ్యం.

తల్లి పట్ల గౌరవం

మాతృవందనం:

ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి, తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యమాంబ చాలా బాధ పడింది. “శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకంటూ ఎవరున్నారు? నాకు దిక్కెవరు?” అని దీనంగా ప్రశ్నించింది.

“అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు, నీ ముందు వుంటాను.” అన్నాడు శంకరుడు.

కొంతకాలం గడచిపోయింది… భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి అంతిమ ఘడియలు సమీపించాయి. మూసిన కళ్ళు తెరవనేలేదు. “నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు” అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యమాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు… వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు… శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా, నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.

‘తలుచుకుంటేనే శంకరుడు వస్తానన్నాడే’ అని ఆర్యమాంబ తపిస్తున్నప్పుడు, అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యమాంబ చటుక్కున లేచి… శంకరా! అంటూ, అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యమాంబ, శంకరుడు సన్యాసి కదా! ఈ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యమాంబ. అక్కడ తను అనునిత్యమూ పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచివుండడం గమనించింది.

గురువాయూరప్పని చూసిన ఆర్యమాంబ మహదానందంతో “అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలిని ఆఖరిక్షణాలలో చూసేందుకు వచ్చావా? కృష్ణా ” అని మెల్లిగా గధ్గదస్వరంతో పలికింది. 

శ్రీకృష్ణుడు వెంటనే “నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా? అమ్మను చూడకుండా వుండగలనా?” అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో, ఆ మాతృమూర్తి శంకరునితో… “నాయనా! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!” అంటూ ఆనందభాష్పాలు కార్చింది.

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడిన శ్రమకు, నాపై కురిపించిన ప్రేమకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తూ భగవంతుడే మానవరూపంలో పుట్టినా… మాతృ ప్రేమకు సాటిగా, ఎంతటి సేవచేసినా… కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే. అని మాతృదేవత పాదాలపై మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

ఇదంతా నిజంగానే జరిగిందా? లేదా? అనే సందేహాన్ని వదిలి, సందేశాన్ని మాత్రమే చూడాలి. అద్భుతమైన సందేశం ఉన్నప్పుడు, అనవసరమైన సందేహాలను వదిలివేయటం సమంజసమే. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నింటిలోనూ మాతృ సంబంధం ఎంతో ఘనిష్టమైనది, పవిత్రమైనది, విడదీయరానిది, త్యజింప వీలులేనిది. తల్లికి సంతానం పేగులో పేగు, రక్తంలో రక్తం. అటువంటి తల్లి ప్రతివ్యక్తికీ పూజనీయురాలు, వందనీయురాలు. సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి అందరూ సాష్టాంగ నమస్కారం చేయడం సంప్రదాయం. తండ్రి కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన కుమారునికి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. కానీ, సన్యాసి మాత్రం తన తల్లికి నమస్కారం చేయాలి. తల్లితో ఉన్న సంబంధం అటువంటిది. అందుకే… 

భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రా యుతేన చ,

సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే.

ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ … కేవలం, తల్లికి నమస్కరించటం వల్ల లభిస్తుంది.

పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి… 

ఆదిశంకరాచార్యులవారు వారియొక్క తల్లిగారికి నమస్కరించటం లోని అంతరార్థమిదే. ప్రపంచానికి, ఈ సత్యాన్ని తెలియజేయటమే. తల్లి ప్రేమను, త్యాగాన్ని తెలియజేస్తూ శంకరాచార్యులవారు రచించిన ‘మాతృ పంచకం’ ప్రసిద్ధమైనది.

తల్లితో సమానమైన వ్యక్తులు

రాజపత్నీ గురోః పత్నీ, భ్రాతృపత్నీ తథైవ చ,

పత్ని మాత స్వమాతా చ, పంచైతాః మాతరః స్మృతాః.

అనగా… రాజు గారి భార్య, గురువు గారి భార్య, సోదరుని/ స్నేహితుని భార్య, భార్య తల్లి అనగా అత్తగారు మరియు తన యొక్క స్వంత తల్లి ఈ ఐదుగురినీ మాతృమూర్తులుగా భావించాలి. అనగా, ఈ ఐదుగురిని పూజ్యభావముతో తన స్వంత తల్లిని ఏ విధముగానైతే గౌరవిస్తారో అదే విధముగా సమ్మానముతోనూ, ఆదరముతోనూ గౌరవించాలి.

‘గురూణాం మాతా గరీయసీ’ అనేది చాణక్యుని నీతి వచనం. తల్లులందరిలోనూ, స్వంత తల్లి అందరికంటెనూ ఎక్కువ గొప్పది మరియు పూజ్యురాలు. ఇది ముమ్మాటికీ నిజం, ఆచరణీయం.

“ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను.” అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్‌.

“తల్లి పాదాల వద్ద స్వర్గం ఉంటుంది.” అని ఖురాన్ లో చెప్పబడింది. 

అమ్మ భాష :

ప్రతివ్యక్తికి ప్రథమ గురువు మాతృమూర్తి. మాటలు నేర్పించడం, నడకలు నేర్పించడం అన్ని తల్లి ద్వారానే నేర్చుకుంటాం. భాష.. కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనమే కాదు, ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్నే పరిచయం చేస్తుంది.

మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. 

మాతృభాష కళ్ల వంటిది, ఆంగ్ల భాష కళ్లజోడు వంటిది.

ఖురాన్ లో తల్లిని గురించి

1. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.

2. తండ్రిని, తల్లిని ఆప్యాయంగా, దయతో చూడటం నిజమైన భక్తి.

 3. తల్లిద౦డ్రుల స౦తృప్తిలోనే దేవుని స౦తృప్తి ఉ౦ది, వారి కోప౦లోనే ఆయన కోప౦ ఉ౦ది.

4. భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మీరు కోరుకుంటే, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. 

5. తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం మహాపాపం.

6. మీరు బిలియనీర్ కావచ్చు, కానీ మీ తల్లి మీకు ఇచ్చిన అనుగ్రహాన్ని, మీరు ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు.

7. మీ తల్లి, అల్లాహ్ మీ కోసం తెరిచిన దయగల ద్వారం, దానిని మూయవద్దు.

8. మీ తల్లిదండ్రులపై మీకు కోపం వచ్చినప్పుడు, వారు లేని జీవితాన్ని ఊహించుకోండి.

9. మీ తల్లిపట్ల మీ కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయవద్దు.

10. తల్లి ప్రేమ, అనుగ్రహాలు వెలకట్టలేనివి. నిజం ఏమిటంటే, మనం ఏమి చేసినా తల్లులు చూపించిన త్యాగం మరియు కరుణతో ఎప్పటికీ సమానం కాదు.

తల్లుల గురి౦చి క్రైస్తవ ఉల్లేఖనాలు

1. అమ్మా, నేను బతికి ఉన్నంత కాలం నువ్వు నన్ను ప్రేమించావని నాకు తెలుసు, కానీ నా జీవితమంతా నిన్ను ప్రేమించాను.

2. ప్రార్థి౦చే తల్లి తన పిల్లలపై పడే ముద్ర జీవితకాల౦గా ఉ౦టు౦ది. ప్రార్థనకు సమాధానం లభిస్తుంది.

3. మాతృత్వం అనేది దేవుడు కృప, విముక్తి, నవ్వు, కన్నీళ్లు మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమతో కలిసి అల్లిన ఒక మిలియన్ చిన్న క్షణాలు.”

 4. రాజద౦డంలో క౦టే తల్లి చేతిలో ఎక్కువ శక్తి ఉ౦టు౦ది.

5. తల్లి హృదయం పిల్లల తరగతి గది.

6. వృద్ధ స్త్రీలను నీ తల్లివలెనే చూడుము, నీ సొ౦త సహోదరీలవలె యౌవనస్థులను చూడుము.

7. మీ త౦డ్రిని, తల్లిని ఘనంగా చూసుకొనుము. మీకు మేలు కలుగునట్లును, భూమిమీద దీర్ఘాయుష్షును అనుభవి౦చునట్లును ఆశీర్వదించబడుతుంది.

8. తల్లి తన బిడ్డను ఓదార్చునట్లు నేను మిమ్మును ఓదార్చుదును.

9. నా కుమారుడా, నీ త౦డ్రి ఆజ్ఞను శిరసావహించు, నీ తల్లి బోధనను విడువకుము.

10. మీలో ప్రతి ఒక్కరూ మీ అమ్మానాన్నలను గౌరవించాలి.

ప్రఖ్యాత మాతృమూర్తులు

మదర్ థెరీసా (సామాజిక సేవకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత)

హిల్లరీ రోధమ్ క్లింటన్ (మాజీ అమెరికన్ ప్రథమ మహిళ)

ఇందిరా గాంధీ (భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి)

మార్గరెట్ థాచర్ (బ్రిటన్ మొదటి మహిళా ప్రధానమంత్రి)

మేరీ క్యూరీ (నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్త)

వర్థమాన మహావీరుని తల్లి – త్రిశాల

బుద్ధుని తల్లి – మహామాయ

చంద్రగుప్త మౌర్యుని తల్లి – ముర

శ్రీ కృష్ణదేవరాయల తల్లి – నాగాంబ

అక్బర్ తల్లి – హామీదాభాను భేగం

భారతదేశంలో తొలి మహిళా టీచర్ – సావిత్రి భాయి పూలే

నెహ్రూ తల్లి – స్వరూపరాణి

అమ్మా అనే కమ్మని పిలుపు…

అస్సామీ, బెంగాలీ, హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు మొదలైన భాషలలో : మా, ఆయి, అమ్మ, మరియు మాతలను ఉపయోగిస్తారు.

స్పానిష్ లో : మామా, మా మరియు మామి

చైనీస్, పోలిష్, జర్మన్, డచ్, రష్యన్ మరియు స్లోవాక్ లలో : మామా

ఫ్రెంచ్ మరియు పర్షియన్ భాషలలో : మామన్

పంజాబీ భాషలో : మా

ఒడియాలో : బౌ/బావ్ (బూ/బూ)

హీబ్రూ భాషలో : ఎమ్

అనేక దక్షిణాసియా సంస్కృతులలో మరియు మధ్యప్రాచ్యంలో : అమ్మ, ఓమా, అమ్మి అని పిలుస్తారు. 

అమ్మ గురించిన కొన్ని ఆంగ్ల పుస్తకాలు

1. మదర్ – మాక్సిం గోర్కీ

2. బికమింగ్ – మిచెల్ ఒబామా

3. ఓన్ ఇట్ – ఓప్రా విన్ ఫ్రే

4. ఫైన్డింగ్ మీ – వయోలా డేవిస్

5. మామ్ & మీ & మామ్ – మయా ఏంజెలూ

6. ద కలర్ వాటర్ – జేమ్స్ మెక్ బ్రైడ్

7. ఆఫ్ విమెన్ బోర్న్ – యాన్డ్రీనీ రిచ్

8. బిలవ్డ్ – టోనీ మొరిసన్

9. ద ఫెమిషెడ్ రోడ్ – బెన్ ఒక్రీ

10. దోస్ బోన్స్ ఆర్ నాట్ మై చైల్డ్ – టోనీ బంబారా

అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన ఆంగ్ల చిత్రాలు:

1. కన్వర్జేషన్స్ విత్ మదర్

2. ద స్టోరీ ఆఫ్ ఏ మదర్

3. డైరీ ఆఫ్ మై మదర్ అండ్ ఫాదర్

5. అల్ ఎబౌట్ మై మదర్

6. ద మదర్ ఆఫ్ టియర్స్

7. డియర్ మదర్

8. లిటిల్ మదర్

9. మదర్

10. మదర్ థెరీసా ఆఫ్ కలకత్తా

అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన తెలుగు చిత్రాలు:

1. అమ్మ రాజీనామా

2. రఘువరన్ బీటెక్

3. మాతృదేవోభవ

4. సింహరాశి

5. కే.జి.ఎఫ్

6. ఛత్రపతి

7. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

8. యమలీల

9. బిచ్చగాడు

10. నాని

అమ్మ ప్రేమను ఎంతో అందంగా చూపించిన హిందీ చిత్రాలు:

1. మథర్ ఇండియా

2. మమతా

3. దీవార్

4. భావన

5. బేటా

6. కరణ్ అర్జున్

7. కభీ కుషీ కభీ గమ్

8. పా

9. కహానీ

10. మామ్

అమ్మ- నాన్న

అమ్మ గీసిన బొమ్మను నేను

నాన్న కన్న కలల రూపం నేను

అమ్మ చెక్కిన శిల్పం నేను

నాన్న మదిలో ఉన్న భావన నేను

అమ్మ చెప్పిన కథను నేను

నాన్న చేసిన ప్రకటన నేను

అమ్మ పాడిన పాటను నేను

నాన్న రాసిన గీతం నేను 

అమ్మ చేసిన ప్రతిమ నేను

 నాన్న మెచ్చిన ప్రతిభ నేను

అమ్మ నడుస్తున్న బాటను నేను 

నాన్న వెళ్లాలనుకున్న గమ్యం నేను

అమ్మలోని ఆత్మవిశ్వాసం నేను

 నాన్నలోని ఆత్మ గౌరవం నేను

అమ్మలోని దీక్షను నేను

నాన్నలోని దక్షత నేను

అమ్మ ప్రేమకు ప్రతిబింబం నేను 

నాన్నకు ప్రతిరూపం నేను

అమ్మలోని శ్రమను నేను

నాన్నలోని స్వప్నము నేను 

అమ్మ చదివిన చదువు నేను

నాన్న పొందిన జ్ఞానం నేను 

అమ్మ లోకానికి ఇచ్చిన కానుక నేను

నాన్న లోకానికి చేసిన వాగ్ధానం నేను

You may also like

1 comment

Murali Mohan Korrapati April 17, 2024 - 4:27 pm

నమస్సుమాంజలులతో,

తిధి ప్రకారం సరిగ్గా ఈరోజు అంటే శ్రీ రామనవమి రోజు రెండు సంవత్సరాల కిందట నాకు మాతృవియోగం కలిగింది. ఎందుకో అనుకోకుండా ప్రశాంతంగా ”మాతృమూర్తి’ అని అంతర్జాలంలో శోధించడం జరిగింది.

నా కళ్ళకు “అమ్మ ప్రేమ అమృతధార”
written by Sri Burra Venkatesham గారి రచన
యాదృచ్ఛికంగా కనిపించింది.

సాంతం చదివాక నా కళ్ళల్లో ఆశ్రువులు గిర్రున తిరిగాయి.
తల్లి గురించి ఇంత గొప్పగా చెప్పడం నా మనసును ఒక విధంగా భారంగాను ఒక విధంగా సంతోషంగాను కదిలించింది. తల్లి లేని జీవితం ఊహించలేనిది. కానీ తల్లి తర్వాత మన గురించి ఆలోచించే భార్యాబిడ్డల కొరకు మన జీవన గమనాన్ని కొనసాగించవలసిందే.

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని.

ఏ జీవి శాశ్వతం కాని ఈ పుడమిపై మనకు ఆ విశ్వేశ్వరుడు అవకాశం ఇచ్చిన రోజులు మన మనుగడ కొనసాగించాల్సిందే.

అందమైన కుటుంబం అంటే తల్లి తండ్రి,
ధర్మపత్ని, భగవంతుడిచ్చిన సంతానం.
అలాగే సోదర సోదరీమణులు బంధుమిత్రులు.

తల్లి గురించి ఇంత చక్కగా గొప్పగా తెలియజేసి పదిమందికి
ఈ పరమార్తాన్ని బోధించడానికి అనువైన అద్భుతమైన ఆంతరంగాన్ని
ప్రబోధించిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

Reply

Leave a Comment