Home వ్యాసాలు నిల్చొని చేసే మరికొన్ని ఆసనములు

నిల్చొని చేసే మరికొన్ని ఆసనములు

by Bandi Usha

ఆసనం వేసే విధానం: రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, రెండు చేతులను ముందుకు చాచి, నెమ్మదిగా ఎడమ చేతిని కుడిభుజంపై, కుడిచేతి వ్రేళ్ళు ఎడమవైపు నుంచి ముందుకు వచ్చేలా కుడిచేతితో నడుమును చుట్టి, నడుము నుంచి పై భాగం కుడివైపు నుండి వెనకకు తిప్పాలి. క్రింది భాగం కదలకూడదు. మరలా చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై, ఎడమచేతితో నడుమును చుడుతూ, నడుము నుండి పై భాగం ఎడమవైపు నుండి వెనుకకు తిరగాలి.

ఉపయోగాలు : 1. నడుము దగ్గర కొవ్వు కరిగి సన్నగా అవుతుంది.

2. ఉదర సమస్యలు తగ్గుతాయి.

3. భుజకండరాలు గట్టి పడతాయి.

4. చేతులు బలంగా తయారవుతాయి.

5. పొట్ట తగ్గుతుంది.

6. పక్కటెముకలు బలపడతాయి.

ఉదర కరాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి చేతులను ముందుకు చాచాలి. ఎడమ చేతిని కుడిభుజంపై వేసి, కుడివైపు వెనుకకు తిరుగుతూ కుడిచేతిని వెనకకు చాచి ఉంచాలి. క్రింది భాగం కదలకూడదు.

చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై వేసి, ఎడమవైపు వెనుకకు దిరుగుతూ ఎడమచేతిని చాచాలి.

ప్రయోజనాలు : కటిచ్రకాసనం వలన కలిగే ప్రయోజనాలతోపాటు అదనంగా కలిగే ప్రయోజనం.

వెన్నెముక బలోపేతం అవుతుంది.

తిర్యక్ తాడాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, చేతివేళ్ళను కలిపి, అరచేతులు పైకి చూస్తున్నట్లు చేతులను తలపైకి బాగా సాగదీయాలి. తరువాత చేతులను ముందుకు చాచుతూ వంగి, కుడివైపు నుండి పైకి లేస్తూ నడుము నుంచి పై భాగం నిటారుగా వెనుకకు తిప్పవలెను.

కొద్దిసేపు అలా ఉన్న తరువాత మరలా ముందుకు వంగి ఎడమవైపు పైకి లేస్తూ నడుము నుంచి పైభాగం నిటారుగా వెనుకకు తిప్పాలి.

ప్రయోజనాలు :

  1. కాళ్ళు చేతులు దృఢంగా తయారవుతాయి (దృఢంగా).
  2.  భుజాలు గట్టి పడతాయి.
  3. పొట్ట తగ్గుతుంది.
  4. వెన్నెముక బలపడుతుంది.
  5. తొడ భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది.
  6. పక్కటెముకలు బలంగా తయారవుతాయి.

వృక్షాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. ఎడమకాలిని మడిచి కుడి తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. మోచేతుల్ని వంచరాదు. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని తరువాత మామూలు స్థితికి వచ్చి కుడికాలిని మడిచి ఎడమ తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. చూపు ఒకే బిందువుపై కేంద్రీకరిస్తే ఎక్కువ సేపు ఉండగలుగుతారు.

ప్రయోజనాలు:  1. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.

2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

4. కాళ్లు చేతులు బలోపేతం అవుతాయి.

3. పొట్ట తగ్గుతుంది.

5.  రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

సంతులనాసనము (సంతులనాసనము) : రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అనగా సమస్థితిలో నిల్చోవాలి. తరువాత ఎడమ కాలిని వెనుకకు మడిచి ఎడమచేతితో పట్టుకొని కుడిచేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఇక్కడ కూడా చూపు ఒకే బిందువుపై కేంద్రీకరించాలి. ఉండగలిగినంతసేపు ఉంచి తరువాత మరో కాలిని మడిచి చేయాలి.

ప్రయోజనాలు :  1. ఏకాగ్రత పెరుగుతుంది, 2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 3. కాలివేళ్ళకు, చేతివేళ్లకు రక్త్రపసరణ బాగా జరుగుతుంది.4. కండరాలు గట్టిపడతాయి. 5. పొట్ట తగ్గి శరీరం నాజూకుగా అవుతుంది.

నటరాజాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలును మోకాలివరకు వెనుకకు మడిచి కుడిచేతితో పట్టుకోవాలి. కాస్త ముందుకు వంగుతూ ఎడమ చేతిని, వెనుకకు మడిచిన కుడికాలిని తలకన్నా కాస్త పైకెత్తాలి. ఉండగలిగినంతసేపు ఉండి తరువాత మరో కాలు మడిచి చేయాలి. ఒకే బిందువుపై దృష్టి పెట్టడం మరచిపోవద్దు.

ప్రయోజనాలు :  1. చేతులు, కాళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. 2. వెన్నెముక సమస్యలు తొలగుతాయి.

3. నడుము సన్నబడుతుంది. 4.  మూలశంక తగ్గుతుంది. 5. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

6. ఏకాగ్రత పెరుగుతుంది.

రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. బ్యాలెన్స్ కోసం గోడ పక్కగా నిల్చోవడం మంచిది.

గరుడాసనము: ఇది గరుడపక్షి ఆకారంలో ఉంటుంది కావున దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అందరూ చేయదగిన ఆసనము.

చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని ఎడమ తొడను కుడితొడ మీదకు చేర్చి, అదా కాలుని మెలిపెట్టి కుడికాలి చీలమండల వద్ద ఆనించాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని కుడిచేతితో చుట్టి రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. నాలుగు అయిదు శ్వాసలు తీసుకొని మరలా సమస్థితికి రావాలి. ఈ సారి మరో కాలు, మరో చేతితో చేయాలి. ఈ స్థితిలో వీపు, తల నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు :  1. రక్తనాళాలు బాగా సాగి బల పడతాయి. 2. సర్వయికల్, థైరాయిడ్, కీళ్లనొప్పులు తగ్గుతాయి.

3. నడుము, వెన్నెముకను బలోపేతం చేస్తాయి. 4. వృషణాల వాపును తగ్గిస్తాయి.

  • తొడకండరాలు, తుంటి ఎముకలను బలం చేకూరుతుంది.
  • ఎక్కువగా కుర్చీలో కూర్చొని పనిచేసేవారికి చాలా ఉపయోగం.

హస్తపాదాంగుష్టాసనము: తివాచీపై రెండు కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచి ఎడమచేతిని నడుముపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలిని మోకాలివరకు మడిచి ఎడమకాలి తొడపైకి తీసుకొచ్చిన తరువాత కుడిచేత్తో కుడికాలి బొటన వేలును పట్టుకొని శ్వాసవదులుతూ మోకాలు వంచకుండా కాలును చక్కగా ముందుకు చాచాలి.  ఇక్కడ శరీరబరువు మొత్తం ఎడమకాలిపై పడుతుంది. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని మరలా యధాస్థితికి వచ్చి ఈసారి ఎడమకాలు, ఎడమచేతితో చేయాలి.

ప్రయోజనాలు

  1. తొడ కండరాలకు శక్తి చేకూరుతుంది.
  2. సయాటికా, వెన్నెముక, మోకాళ్ళ, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
  3. కాళ్లు, చేతులు, నడుముకు బలం చేకూరుతుంది.
  4. శరీరము చక్కని ఆకారంలో ఉంటుంది.

త్రికోణాసనము : త్రికోణము అనగా మూడు కోణములు కలిగినదని అర్థము. ఈ ఆసనము త్రిభుజాకారంలో మూడు కోణములను కలిగి ఉండటంవలన త్రికోణాసనం అనే పేరు వచ్చింది.

చేయు విధానం : రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా చాచుతూ రెండు అరచేతులను నేలను చూస్తున్నట్లు ఉంచాలి.

శ్వాస విడుస్తూ నెమ్మిదిగా నడుమును కుడిపక్కకు వంచుతూ కుడిచేతిని కుడిపాదం చివరకాని, పక్కనకాని ఉంచాలి. తరువాత తలపైకి తిప్పి ఎడమ అరచేతిని చూడాలి. ఈ స్థితిలో 5,6 శ్వాసలు  తీసుకొని తరువాత శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేసి సమస్థితికి రావాలి.

ప్రయోజనాలు :   1. కాలికండరాలకు బలం చేకూరుతుంది.

  • చీలమండలు శక్తివంతం అవుతాయి.
  • వెన్ను నొప్పి తగ్గుతుంది.
  • జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • పిల్లలు ఎత్తు పెరుగుతారు.
  • నడుము పక్కన కొవ్వు తగ్గి ఆకర్షణీయంగా కనబడతారు.

పరివృత త్రికోణాసన్:  రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులు భూమికి సమాంతరంగా అరచేతులు నేలను చూస్తున్నట్లు ఉంచాలి.  శ్వాస విడుస్తూ నడుమును కుడివైపు తిప్పుతూ ఎడమ చేత్తో కుడిపాదం ను పట్టుకోవాలి. తరువాత తలను పైకెత్తి కుడి అరచేతిని చూస్తూ 5,6 శ్వాసలవరకు ఆసన స్థితిలో ఉండి మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. ఇదేవిధంగా మరోవైపు చేయాలి.

ప్రయోజనాలు :  1. పొట్ట తగ్గుతుంది.  2. మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారవుతాయి. 3. చేతులు కాళ్లు బలపడతాయి. 4. గూనితగ్గుతుంది. 5. మెడసన్నగా అవుతుంది. 6. కండరాల నొప్పులు తగ్గుతాయి.

విమానాసనము : విమాన రూపంలో ఆసన స్థితి ఉండటం వలన ఆ పేరు వచ్చింది. తివాచీపై సమస్థితిలో నిల్చొని రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ప్రక్కకు చాచాలి. నెమ్మదిగా నడుము దగ్గర నుండి ముందుకు వంగుతూ ఎడమకాలు చక్కగా పైకి లేపాలి. ఈ స్థితి T ఆకారంను పోలి ఉంటుంది. శరీరము యొక్క బరువంతా కుడికాలుపై కేంద్రీకృతం అవుతుంది. నాలుగైదు శ్వాసం అనంతరం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సమాంతర స్థితికి వచ్చి ఈసారి కుడికాలును చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండువైపులా చేయాలి.

ప్రయోజనాలు :  1. ఏకాగ్రత పెరుగుతుంది., 2. శరీరం తేలికగా ఉంటుంది. 3. కాలిపిక్కలు గట్టి పడతాయి. 4. శరీరము, మనసు నిశ్చలంగా ఉంటుంది.

రాకెట్ ఆసనము : ఈ ఆసనము రాకెట్ రూపంలో ఉంటుంది.

చేయు విధానం: రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి, చేతులను పైకి చాచి నమస్కార ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా నడుము నుండి ముందుకు వంగుతూ ఎడమకాలిని వెనకకు చాచాలి. చేతులను నమస్కార ముద్రలో చక్కగా చాచి ఉంచాలి. 4,5 శ్వాసల అనంతరం శ్వాసతీసుకుంటూ నిటారుగా పైకి రావాలి.

మరోసారి ముందుకు వంగుతూ ఈసారి కుడికాలిని చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండు కాళ్ళతో చేయాలి.

ప్రయోజనాలు :   1. శరీరము, మనసు సమస్థితిలో ఉంటాయి.2. ఏకాగ్రత పెరుగుతుంది.

3. చేతులకు, కాళ్ళకు బలం చేకూరుతుంది.  4. పొట్ట తగ్గుతుంది. 5. కండరాలు గట్టి పడతాయి.

You may also like

Leave a Comment