తెలుగులో సాహిత్యాన్ని పరిమళింప జేస్తూ వచ్చిన ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక, గుడిపాటి గారి సంపాదకత్వంలో జనవరి, 2022తో పన్నెండేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాహిత్యం మీద అవ్యాజ్యమైన ప్రేమతో సాహిత్య మాసపత్రికను నిరాటంకంగా ఒక పుష్కరకాలాన్ని ప్రయాణింపజేసిన సాహిత్య ప్రేమికుడు గుడిపాటిని అభినందించాల్సిన విషయమే. పెద్ద పెద్ద సంస్థలు, ఆర్ధిక బలం వున్న యాజమాన్యాలు కూడా సాహిత్య సంబంధ పత్రికలను మూసివేసిన సందర్భాలలో, కరోనా మహమ్మారి లాంటి కల్లోల సమయంలో ఒక వ్యక్తి, ఒంటి చేత్తో, ఆర్ధిక వనరులకై సంఘర్షణపడుతూ, పాఠకుల చందాలపై ఆధారపడుతూ, పిడికెడు స్నేహితుల, హితైషుల సహాయం, విరాళాలపై నిలబడుతూ, పాలపిట్ట రెక్కలను విప్పార్చుతూ సాహితీ వినీలాకాశ వైశాల్యాన్ని పెంచుకోగల నిబ్బరాన్ని కలిగిన వాడిగా దర్శనమిచ్చే గుడిపాటిలో కేవలం సంపాదకుడే కాదు, ఒక కవి, ఒక విమర్శకుడు ఒక వ్యాసకర్త , విశ్లేషకుడు కూడా వున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జననం. సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఎలాంటి సాహితీవాసనలు లేని కుటుంబ నేపథ్యం ఐనా గుడిపాటిలో బహుముఖీనత కలిగిన వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకున్న దార్శనికుడు కనబడతాడు. జర్నలిజం పై మమకారం, సాహిత్యం పై ఆసక్తి , వార్త ఆదివారం పత్రికకు ఎడిటర్ గా, నవతెలంగాణ దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా విశేషమైన అనుభవం, జర్నలిజం, సాహిత్యపరమైన అనేక విషయాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహనతో పాలపిట్టను ఫిబ్రవరి 2010 ప్రారంభ సంచికగా ఆవిష్కరించారు. పత్రిక నడపడం అంత సులువైన పని కాదు. అభిరుచి, ఇష్టం వేరు, సృజనతో ముడిపడిన ఒక non – commercial subject ను నడిపించడంలో ఎదురయ్యే కష్టాలు వేరు. పత్రిక ప్రారంభ మయ్యాక మూడేళ్లపాటు ఆగకుండా ప్రయాణం కొనసాగింది. అనేకమైన విలక్షణ సంచికలనందించింది. సంచిక లోపలి బ్లాక్ అండ్ వైట్ పేజీలు 80 , మల్టీ కలర్ కవర్ పేజీలు నాలుగు మొత్తం 84 పేజీలతో పత్రిక పాలరాతి మెరుపు, నునుపు వంటి మ్యాప్ లితో అచ్చవుతూ ఆకర్షణీయంగా వచ్చింది. వస్తున్నది. మార్చి, 2010 లో మహిళా ప్రత్యేక సంచికగా 120 పేజీలతో వెలువడింది . అలాగే ఏప్రిల్, 2010 లో గోరటి వెంకన్న ప్రత్యేక సంచిక 100 పేజీలతో, మే ,2010 సామల సదాశివ ప్రత్యేక సంచికగా , జూన్, 2010 బండి నారాయణ స్వామి ప్రత్యేక సంచికగా వెలువడినాయి. సాహిత్యంలో తమదైన ప్రత్యేక శైలి , కంఠ స్వరంతో ప్రత్యేక ముద్ర కనబరిచే సాహితీవేత్తల రచనా విశేషణాలతో వచ్చిన సంచికలు ఇవి. వీటికి విభిన్న వర్గాల నుంచి మంచి ఆదరణ వచ్చింది. అలానే జులై, 2010 సంచిక సంగీత శిఖరమైన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మీద వచ్చింది. కాళోజి శత జయంతి సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు గారి గౌరవ సంపాదకత్వంలో సెప్టెంబర్, 2013 లో 120 పేజీలతో కాళోజి ప్రత్యేక సంచిక వెలువడింది . ఇలాంటి విశేష సంచికలు వెలుగులోకి రావడానికి సాహితీ మిత్రుల సహకారం , ప్రోత్సాహం అభినందించదగినది .
2014-15 సంవత్సర కాలం ఆర్ధిక వనరుల కొరత కారణంగా ఈ ఏడాదిలో ఆరు సంచికలు మాత్రమే వచ్చినా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భాన్ని పురష్కరించుకొని తెలంగాణ ప్రత్యేక సంచికగా 160 పేజీలతో ఫిబ్రవరి -మార్చి 2014 లో వచ్చింది. తెలంగాణాకు సంబంధిన పలు విషయాలను అందించిన తెలంగాణ ప్రత్యేక సంచికగా కేవలం పాలపిట్ట మాత్రమే వెలుగు చూడటం గమనించాల్సిన విషయం.
కోవిడ్ -19 ప్రభావం కారణంగా మన రాష్ట్రం, దేశమే కాదు యావత్ప్రపంచం అల్లకల్లోలానికి గురైంది. ప్రజల జీవన శైలి మీద తీవ్రమైన ప్రభావం పడింది. వైద్యం, ఫార్మసీ లాంటి సంస్థలు/రంగాలు మినహా అన్ని రంగాలు కుదేలైపోయాయి. కోవిడ్-19 ప్రభావం సాహిత్యరంగం మీద పడి అచ్చులో వచ్చే తెలుగు సాహిత్య పత్రికలన్నీ చాలా వరకు అంతర్థానమయ్యాయి. కొత్త పత్రికలు వెబ్ మ్యాగజైన్లుగా , ‘ఆన్ లైన్ ‘ పత్రికలుగా దర్శనమిచ్చినా మచ్చుకు కొన్ని పత్రికలు అచ్చులో రాసాగాయి, అందులో ‘పాలపిట్ట ‘ సాహిత్య మాస పత్రిక ఒకటి . సిసలైన సృజనకు వేదికగా వుంటూ, ప్రమాణాలు పాటిస్తూ అనేక ఒత్తిళ్ల నడుమ తన ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది. అందుకు సంపాదకుడిగా గుడిపాటి గారి సంకల్ప బలం పునాది రాయి వంటిది. కరోనా తీవ్రత కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో దాదాపుగా అన్ని కార్యాలయాలతో పాటు ప్రెస్సులు మూతపడటంతో పాలపిట్ట ఫిబ్రవరి, 2020 సంచిక నుండి కొన్ని నెలలు పి డి ఎఫ్ కాపీలు చేసి వందలాది మందికి పంపించడం జరిగింది. ఇందులో చందాదారులతో పాటు వందలాది పాఠకులు వున్నారు. ఫలితంగా ‘పాలపిట్ట’ అందరికి అందుబాటులో వుండి పాఠకుల సంఖ్య పెరగడంతో పాటు అందరి నుండి మంచి స్పందన వచ్చింది. దీనితో పాఠకుల సంఖ్య పెరగడం తదనుగుణంగా చందాదారుల సంఖ్య కూడా పెరగడంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్న పట్టుదల పెరగడం గుడిపాటి గారి సంకల్పానికి మరో నిదర్శనం .
మే, 2020 సంచిక లాక్ డౌన్ సమయంలో విల్సన్ రావు కొమ్మవరపు ప్రత్యేక సంచికగా వచ్చింది. ఆ తర్వాత వరసగా సంచికలు వచ్చాయి. కరోనా మహామ్మారి సమయం లాక్ డౌన్ లో కూడా సంచికలు రావడం, పి డి ఎఫ్ రూపంలో పాఠకులందరికి అందుబాటులో ఉండటంచేత, పాత వారితో పాటు కొత్త పాఠకులు, యువ రచయితలూ, రచయిత్రులు, పరిశోధక విద్యార్థులు కూడా పాలపిట్ట సభ్యులుగా చేరడంతో, పాలపిట్ట రెక్కలకు కొత్త ఉత్తేజo, బలo అంది వచ్చాయి. అలా ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో మొత్తం 116 సంచికలు వెలుగు చూసాయి. ప్రతి సంచిక, ప్రత్యేక సంచికలు సాహిత్య విషయాలతో పరిపుష్ఠిగా వచ్చాయనటంలో సందేహం లేదు. సంపాదకుల సంకల్పబలం ఎంతగా వున్నా నిజానికి ఆయా కాలాల, సమాజాల అవసరాలు వ్యక్తుల, సంస్థల, పత్రికల ఉనికికి, మనుగడకు తోడ్పడతాయి. తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యం అవసరం ఉన్నందుకే ‘పాలపిట్ట’ ప్రయాణం కొనసాగుతున్నది .
విభిన్న సాహితీ ప్రక్రియలకు, విభిన్న అస్తిత్వాలకు వేదికగా వుంటూ తనదైన ముద్ర వేసుకుంది. కవితలు కథలు, విమర్శ, సమీక్షా వ్యాసాలూ, సీరియళ్లు, ప్రముఖ సాహితీ వేత్తల ఇంటర్వ్యూ లు/ముఖాముఖి సంభాషణలు తెలుగు సాహిత్యానికి వారందించిన ఆదాన ప్రదానాలు ఇలా అనేక అంశాలతో సాధారణ పాఠకులకే కాదు తెలుగు ఉపాధ్యాయులకు, పరిశోధక విద్యార్థులకు (Research Scholars) కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందమైన ముఖచిత్రంతో, సాహిత్య విషయాల పరిపుష్టితో వస్తున్న ‘పాలపిట్ట’ సదా సచేతనంగా, క్రియాశీలంగా, సృజనశీలుర ఆదరణతో, సాహితీ వినీలాకాశంలో ఎగరాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు గుడిపాటి గారికి ఈ పుష్కరయానం పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందిస్తూ… పాలపిట్ట ప్రయాణం ఆగకుండా సాహితీ వైదగ్ధ్యంతో సంపద్వంతంగా కొనసాగాలని ఆశిస్తూ, శుభాకాంక్షలతో…