2019 లో కీ.సే. సి.నారాయణ రెడ్డి గారి గురించి రాసినది. మరొక్కసారి వారిని స్మరించుకుంటూ……….
ఆధునిక తెలుగు సాహితీ జగత్తులో , నిలువెత్తు రూపం …..సి నా రే. ఆయనకి రోజూ కవిత రాయనిదే తెల్లవారదు, కవితకు కొత్త సొబగులు అద్దనిదే నిద్దర రాదు.
ఆయన కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు. అన్నిటినీమించి మనిషి జీవితాన్ని ఒక ప్రిజమ్ లోంచి కాంతి ప్రసరించినప్పుడు వెలువడే రంగులన్నింటినీ మేళవించి, పద చిత్రణతో , రూపుకట్టించిన మేధావి.
ఆయన మాట్లాడుతుంటే మువ్వల సవ్వడి గొంతులో వినిపిస్తుంది.ఆయన బహుముఖ సాహితీ స్వరూపాన్ని దర్శించడం అంటే , గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ , గుడి గోపురం, గోడల మీద చెక్కిన శిల్పాలను చూడడం వంటిది.
ఆయన రచనల్లో అత్యంత ప్రశస్తమైనది గా భావించబడేది ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన ” విశ్వంభర ” వచన కావ్యం. మానవుడు ఆ కావ్యానికి నాయకుడు. ప్రకృతి నాయిక.ఆదిమ కాలంనించీ ఆధునిక కాలం వరకూ సాగిన మనిషి జీవన ప్రస్థానం , ఐదు ప్రకరణాలుగా సాగిన సుదీర్ఘ కవిత.” నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర.కాళ్ళ కింద ధూళి పొర.” అంటూ మొదలయ్యి “ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రతి అంగం నాదంగా పరిణమించాలని……ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు ……అఖిలాణువులు మూర్తులుగా మూర్తీభవించాలని…. అనిసాగిపోయే కవితా ప్రవాహం గుక్కతిప్పుకొనివ్వదు.
నారాయణ రెడ్డి గారిని చూసి మాట్లాడిన అదృష్టం నాది.ఆయన సినిమా పాటల సంకలనం ” పగలే వెన్నెల ” ఆయన చేతులమీదుగా కాలేజీలో బహుమతిగా అందుకున్నాను.మూడు వేల పైచిలుకు పాటలు రాసిన ప్రతిభా మూర్తి. జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ వారిని మెప్పించటంకోసం ” ఏకవీర ” సినిమాకు మాటలు రాశారు.ఆ సినిమా చూసి హాల్లోంచి బయటికి వస్తూ ఒక సామాన్య ప్రేక్షకుడు అన్నాట్ట ” ఈ సినిమాలో పాటలు అన్నీ అర్థం అయ్యాయి కానీ మాటలు ఒక్క ముక్కా అర్థం కాలేదు ” అని.
అయితే ఆ సినిమాలో ” తోటలో నారాజు ” పాట సినీ ఉద్యానవనంలో రెడ్డిగారిని రారాజుగా నిలిపిన పాట.ఆ పాటలో ఆయనే అన్నట్టు అది రస రమ్య గీతం.అదే సినిమాలో ఆయన తాను కాలేజీ రోజుల్లో రాసిన ” ప్రకృతిలో ప్రణయిని కవితని పాటగా పెట్టారు.బాలూ ఎంత నిదానంగా పాడారు అంటే , పడవలో వెళ్తూ పాట వింటే , పడవ కంటే పాట వెనకబడినట్టు అనిపిస్తుంది.
గులేబకావళి కథ (1962)నించీ మొదలైన ఆయన సినీ గీత రచనా ప్రస్థానం , ఐదు దశాబ్దాలకు పైగా సాగింది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ , హైద్రాబాద్ నించీ చెన్నైకి విమానంలో వచ్చేలోపు కొన్ని పాటలు రాసేసే వారుట.చెన్నైలో మేము ఉన్న టీ నగర్ , బస్ స్టాండ్ ఎదురుగా సుధార హోటల్ లో బసచేసేవారుట.
నారాయణ రెడ్డి గారిని సాహితీ మూర్తిగా , మరొక మారు దర్శించాలి అంటే, ఆయన అనేకానేక రచనలు ఆధారంగా ఆయన బహుముఖ సాహితీ రూపాన్ని సందర్శించాలి.కవిగా పద్య రచనతో శ్రీకారం చుట్టి , కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, ఋతు చక్రం వంటి పద్య కావ్యాలు రాశారు. వచన కవిగా జలపాతం, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలూ – మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామా, కాలం అంచుమీద, నడక నా తల్లి, శిఖరాలూ లోయలూ, మట్టీ మనిషీ ఆకాశం, దూరాలను దూసుకొచ్చి, ఆరోహణ, దృక్పథం, భూగోళమంత మనిషి బొమ్మ, , వ్యక్తిత్వం, గదిలో సముద్రం.
:
👆 ఆయన కావ్యాల పేర్లు ….ఒక క్రమపద్ధతిలో పెర్చితే అది ఒక కవిత అవుతుంది. అందువల్లే భారతీయ జ్ఞానపీఠ కమిటీ, వారి సృజనాత్మక సాహితీ సేవకు మెచ్చి వారి చుట్టూ పట్టు ఉత్తరీయం కప్పినట్టు వారి సమగ్ర సాహిత్యానికి జ్ఞాన పీఠ బహుమతి ప్రకటించింది
సి నా రే ని తిరుగులేని పరిశోధకుడిగా మాత్రమే కాకుండా ఆచార్య స్థానంలో నిలబెట్టిన గ్రంధం “ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు.” రిఫరెన్స్ పుస్తకంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద దీనిని మించిన పరిశోధనా గ్రంధం వేరొకటి ఇప్పటిదాకా రాలేదు.
సినిమా పాటల రచయితగా ఎన్ని ఉదాహరణలు చెప్పినా , ఆయన పాటలలోని మాటల సొగసు తరగదు. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అంటూ ఆయన రాసిన సినిమా పాటలమీద ఆయనే రాసిన లఘు వ్యాఖ్యానాలు , పాటలలోని అందాలను వెతికి పట్టుకునేలా చేస్తాయి.
కృష్ణవేణి సినిమాలో నాయికని నది తో పోలుస్తూ రాసిన “శ్రీగిరి లోయల సాగే జాడల శతకోటి విద్యుల్లతలు వికశింపచేసినావు ” అంటారు, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ గురించి.
సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పాట ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. “కదిలింది కదిలింది గంగ, మహోత్తుంగ తరంగ ” అంటూ గంగా నదీ ప్రవాహాన్ని , పదప్రవాహంగా, కవితా ఝరిగా పరుగులెత్తించారు.
నదులు అంటే ఆయనకు బహు మక్కువ, ఆయనకు నలుగురు కుమార్తెలు, గంగ,యమున, సరస్వతి,కృష్ణ ,….వారి పేర్లు.
ఆయనకు, జ్ఞానపీఠ బహుమతి వచ్చాక , శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ …… అంటూ రాసుకొచ్చి శరణాగతి నీవు భారతీ అంటారు.ఆ పాట ఆయన జ్ఞానపీఠం పై నిలిచిన సరస్వతీ దేవికి చేసిన గీతార్చన. ఆ పాటలో ప్రతి పదమూ , కవితాత్మ దర్శన ప్రాప్తి కలిగించే కైవల్య పథం.
:
ఒక సినిమా పాట మీద పాఠం రావడం , ఆయనకే చెల్లింది…..” వట పత్ర సాయికి ” పాట రాసిన ఆయన వెళ్లిపోయారు అని బాధ కలిగినా తాత రాసిన జోల పాట పిల్లలరూపంలో సాక్షాత్తూ ఆభగవంతుడు నిత్యం విని ఆనందిస్తూనే ఉంటాడు.
నారాయణరెడ్డి గారు , తెలంగాణాలో , హనుమాజీ పేటలో జన్మించారు.ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.పారసీక భాషలో కూడా పట్టు ఉంది. ఆ పాండిత్యం ఆయన చేత తెలుగులో గజల్స్ రాయించింది.గజల్ శ్రీనివాస్ ఆయన గజల్స్ బాగా పాడి ఆయన మానస పుత్రుడిగా పేరుతెచ్చుకున్నాడు.
ఆయన కూడా తన గజల్స్ చాలా బాగా పాడి క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు.”అమ్మ ఒక వైపు , దేవతలంతా ఒక వైపు, సరి తూగమంటే, అమ్మవైపు ” అన్న ఆయన గజల్ మాతృవాత్సల్యాన్ని మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
ఆయనకు సమకాలికుడైన ఆయన మిత్రుడు దాశరథి తో కలిసి తొలి రోజుల్లో జంట కవిత్వం రాశారు.
పోతన భాగవత పద్యాలకు మందార మకరందాలు పేరిట సరళ వ్యాఖ్య రాశారు. 85 సంవత్సరాలు పైగా జీవించి , పుట్టినప్పటినించీ లెక్క గట్టుకున్నట్టు 85 కి పైగా రచనలు ప్రచురించారు.ఏటేటా వచ్చే ఏ సంస్థ తెచ్చే కవితా సంకలనాల్లో ఐనా ఆయన కవిత ఉండ వలసిందే. అది ఆయనకు జ్ఞానపీఠం వచ్చింది కనుక వేసే పెద్ద పీట కాదు . కాలానుగుణంగా, భావజాలానికి , కవిత్వ వ్యక్తీకరణ విధానానికి పదును పెట్టుకుంటూ, పాళీకీ పదును తగ్గలేదని కొత్త కలాలకి ధీటుగా కవిత్వం రాసే ఆ నిత్య కవితా వసంత భోగ రాయుని గొప్పదనం అది.
నారాయణరెడ్డి మౌలికంగా కవి.కవిత్వం విషయంలో ఆయన నమ్మిన ఆచరించిన, అనుసరించిన రచనా సూత్రం “కవిత్వానికి మూలం భావం…..అదే కవితాత్మ……. ఆ ఆత్మకు రూపాన్నిచ్చేది భాష…… అది దేహం. ” ఈ సూత్రం ఆధారంగానే ఆయన ఏడు దశాబ్దాలు కవిగా మనగలిగాడు.
మనమధ్య, నరుడిగా , నారాయణుడి గా తన విశ్వంభర మహా కావ్యం ద్వారా కవితా విశ్వ విహారం చేశారు. ఆయన తన రచనల ద్వారా చేసిన “సదాలోచనలు అంతరంగాలను సమీక్షించి చూపుతాయి.ఆ సమీక్షలు జీవన నిర్వహణకు పురోదర్శినులవుతాయి ” కళాత్మకత, వైజ్ఞానికత, ఆధ్యాత్మికత , సాధనలోఎన్ని ఎదుదెబ్బలు తగిలినా మనిషి ఎప్పుడూ తిరోగామి కాడు, అనేది ఆయన ప్రగాఢ నమ్మకం.అదే విశ్వంభర కావ్యంలో ఆయన సృష్టించిన కవితా సారాంశం.