Home ఇంద్రధనుస్సు నా గురించి నేను –

నా గురించి నేను –

by Ponangi BalaBasker

మయూఖ సంపాదకులకు నమస్కారం.

%%%%%%%%%%%%%%%%%%%

నాపేరు పోణంగి బాల భాస్కరరావు. నేను 1955 లో పుట్టిందీ, ఆ తర్వాత ఇరవైయేళ్లు పెరిగిందీ, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కి మారిన, ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గౌతమీ తీరంలోని గోష్పాద క్షేత్రంలో. ఆ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డాను.

నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను రెండు విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాను. ఒకటి వృత్తి, రెండోది ప్రవృత్తి. ఈ జోడెడ్ల బండి మీద నా జీవనయానం సమతూకంతో సాగడానికి నా అదృష్టం ఒక కారణమైతే, రెండో కారణం, నా తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో పాటు సహోద్యోగుల ప్రోత్సాహం.

నా ఉద్దేశ్యంలో ప్రతి వ్యక్తికీ జీవనాధారంగా ఆదాయాన్ని సమకూర్చే ఒక ఉపాధి తో పాటు మనలో నిబిడీకృతమై ఉండే ఒక ప్రత్యేకమైన అంశాన్ని వెలికి తీసి, మనకు అపరిమితమైన మానసిక ఆనందాన్ని కలుగజేసే, మరొక వ్యాపకం లో కూడా నిమగ్న మవ్వాలి. మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అని, ఒక సినిమాలో చెప్పిన డైలాగు లాగా అన్నమాట. దాన్ని, కొంత మంది సర్వీసు నుంచి రిటైరయ్యాక కాలక్షేపానికి ఒక వ్యాపకంగా చేపడితే నాలాంటి మరి కొంత మందికి రెండింటినీ సమాంతరంగా పోషించే అవకాశం లభించవచ్చు. నేనైతే, అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నాను.

ఇక ముందుగా, వృత్తి విషయానికి వస్తే, ఉద్యోగాల వేటలో భాగంగా, 1974 లో హైదరాబాద్ వచ్చి, అబిడ్స్ లోని, శ్రీ బృందావన్ హోటల్ లో బిల్ రైటర్ గా, రిసెప్షనిష్టు గా, టెలిఫోన్ ఆపరేటర్ గా, సూపర్వైజర్ గా మూడున్నరేళ్ళు ఆడుతూ, పాడుతూ పనిచేశాను. సమాజంలోని రక రకాల మనుషులు వాళ్ళ మనస్తత్వాలు, భాషలు, భావావేశాలు, మౌనంగా, నిశితంగ పరిశీలించి ఆకళింపు చేసుకున్నాను.

అదే సమయంలో, అంటే, 1975 ఏప్రిల్ నెలలో, హైదరాబాద్ లో ప్రప్రథమ అంతర్జాతీయ తెలుగు మహా సభలు జరిగాయి. దానికి మా చిన్నాన్న గారు డాక్టర్ పోణంగి శ్రీరామ అప్పారావు గారు ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించారు. అప్పుడు ఆయనతో కలిసి తిరగడం వల్ల, ఆ మహా సభల కార్యక్రమాలను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. అంతకు ముందు ఆ తర్వాత కూడా అయన రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా, తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థల వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేసినప్పుడు, ఆయన వెనకాల, ఏదో ఒక వంకతో తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఎంతో మంది కవులు, కళాకారులు, సాహిత్యాభిలాషులతో నాకు పరిచయ భాగ్యం కలిగింది. దాంతో, క్రమంగా సాంస్కృతిక కార్యక్రమాల మీద, అభిరుచి, ఆసక్తి పెరిగాయి.

అలా ఉండగా, బృందావన్ హోటల్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేసిన అనుభవంతో, 1978 ఫిబ్రవరి లో హైదరాబాద్ జీడిమెట్ల లోని – హెచ్.ఎం.టి. మెషీన్ టూల్స్ సంస్థ లో టెలిఫోన్ ఆపరేటర్ గా చేరడం, నా జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో హెచ్.ఎం.టి. లో చేరిన నేను, ఆ తర్వాత నెమ్మిదిగా విద్యార్హతలు పెంచుకుంటూ, అంచెలంచెలుగా డిప్యూటీ మేనేజర్ స్థాయి కి చేరాను. సంస్థ ఒడిదుడుకులు, నా ఒడిదుడుకులు తట్టుకుని నిలబడి ఒకే ఊరులో ఒకే సంస్థలో 35 సంవత్సరాలకు పైగా సర్వీసు పూర్తిచేసుకుని, 2013 లో రిటైర్ అయ్యాను. తర్వాత కూడా ఓ ఏడాది పాటు సంస్థ అవసరాల దృష్ట్యా, తాత్కాలిక ప్రాతిపదికన హెచ్.ఎం.టి. కి నా సేవలందించే అవకాశం కలిగింది. అనంతరం బయట రెండు ప్రయివేటు సంస్థల్లో మరో రెండేళ్ళు పనిచేశాక, ప్రస్తుతం శేష జీవితాన్ని హాయిగా ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తూ, నాకెంతో ఇష్టమైన ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలతో పాటు, ఇతర సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఎంతో సంతృప్తిగా గడుపుతున్నాను.

అవకాశం వచ్చింది కాబట్టి, పనిలో పనిగా నా వ్యక్తిగత జీవితం గురించి కూడా రెండు విషయాలు చెబుతాను.

1983 లో ఖమ్మం వాస్తవ్యులు శ్రీ కొమరగిరి సీతారామచంద్రరావుగారి అమ్మాయి గాయత్రితో నా వివాహం జరిగింది. ఇన్నాళ్లూ నావృత్తి, ప్రవృత్తులకు అనుగుణంగా ఇంటా, బయటా విజయవంతంగా తిరిగానూ అంటే, దానికి నా శ్రీమతి ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణం. ఆమె సహచర్యం నాకెంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని కలుగజేస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరికైనా అంతే కదా! ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటేనే, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇద్దరు అమ్మాయిలు ప్రతిభ, ప్రత్యూష. పెద్దమ్మాయి ఆర్కిటెక్ట్ గా, రెండో అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరికీ నా తాహతుకు తగ్గట్టు ఘనంగా వివాహాలు చేశాను. వారి, వారి కుటుంబాలతో వారు హాయిగా జీవిస్తున్నారు. 1996 లో హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను.

సరే ఇక్కడితో ఈ విషయాలకు ఫులిస్టాప్ పెట్టి, మళ్ళీ, ప్రవృత్తి విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో అందరికీ రేడియో ఎక్కువగా వినడం మా దినచర్యలో ఓ భాగం. ఆ అలవాటే అందులో పాల్గొనాలనే ఉత్సాహాన్ని రేకెత్తించింది. ప్రాధమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో వేసవి శలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు సార్లు, “బాలానందం” రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్న రోజులు నేను ఎప్పటికీ మరువలేను. అదేవిధంగా హై స్కూల్లో, జూనియర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా సార్లు ఫ్రెండ్స్ తో కలిసి స్టేజి నాటకాల్లో పాల్గొన్నాను. అప్పుడే, నా సాంస్కృతిక పిపాసకు నాందీ ప్రస్తావన జరిగి నాలోని కళాతృష్ణ కు తెరలేచింది. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం లో పాల్గొనేవాడిని.

కట్ చేస్తే –

“ఆకాశవాణి , ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోణంగి బాల భాస్కర్” అని రేడియోలో నా పేరు చెప్పుకోవాలన్న నా కల నెరవేరిన రోజు నా జీవితంలో మరొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ రోజు నా సంతోషానికి అవధులు లేవు. అది జరిగింది – 1988 జులై నెలలో. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళకు పైగా ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగంలో ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు అనువాదం చేయడం, చదవడంలో నిమగ్నమయ్యాను. ఇందుకు ఆ విభాగంలో అప్పుడు న్యూస్ ఎడిటర్లు గా పనిచేసిన శ్రీయుతులు ఆకిరి రామ కృష్ణారావు గారు, ఆర్.వి.వి. కృష్ణారావు గారు, ఆశయ్య గారు, సుబ్రహ్యణ్యం గారు, ఎస్.వి.ప్రసాద్ గారు, భండారు శ్రీనివాసరావు గారితో పాటు, న్యూస్ రీడర్లు గా పనిచేసిన – శ్రీ డి. వెంకట్రామయ్య గారు, శ్రీమతి జ్యోత్స్నా దేవి గారు నాకు వార్తలు సేకరించడం, రాయడం, అనువదించడం, చదవడంలో మంచి తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఎంతో మంది న్యూస్ ఎడిటర్లు, న్యూస్ రీడర్ల తో కలిసి ఎన్నో కొత్త విషయాలు, మెళకువలు నేర్చుకున్నాను.

రేడియోలో వార్తలు చదవడం అంటే ఎవరైనా రాసి ఇచ్చిన వార్తలను చూసి చదవడమే కదా అని, చాలా మంది రేడియో స్టేషన్ కి వచ్చేవారు. వార్తలు చదవడంతో పాటు అంతకంటే ముందు పెద్దగా ఉన్న వార్తలను తగ్గించి చిన్నగా రాసుకోవాలనీ, ఆ వార్తలను అవసరమైతే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చెయ్యాలని చెబితే, అమ్మో, అలా అయితే మా వల్ల కాదని, నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. మంచి రాయగలిగినవారు స్పష్టంగా ప్రసార యోగ్యంగా చదవలేకపోయేవారు. చక్కగా చదవగలిగినవారికి మంచిగా రేడియోకి అనువుగా రాయడం వచ్చేదికాదు. అందుకే చాలా కాలం పెద్దగా కొత్తవాళ్ళెవరూ ఈ రంగంలోకి రావడానికి ధైర్యం చెయ్యలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భాష, ఉచ్చారణ తో పాటు, జర్నలిజం మీదా, అనువాదం మీదా మంచి అభిరుచి, అవగాహన, అనుభవం ఉన్న వారు వస్తున్నారు. నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

అప్పట్లో, ఆకాశవాణి, ప్రాంతీయ విభాగంలో పనిచేసే వారిలో చాలా మంది జర్నలిజం విద్యార్హత, అనుభవంతో వచ్చి పనిచేసే వారే ఉండేవారు. నాలాగా వేరే ఆఫీసుల్లో, కంపెనీల్లో పనిచేస్తూ, కేవలం చదవాలనే కోరికతో, ఆసక్తి తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అందువల్ల నేను దాదాపుగా ప్రతీ రోజు వేరే వాళ్ళు చదివే వార్తలు విని, వాళ్ళు ఎలా వ్రాస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని జాగ్రత్తగా విని, వారి భాష, శైలి, ఉచ్చారణ పరిశీలించి, గుర్తుపెట్టుకుని, వాటిని నెమరువేసుకుంటూ, నేర్చుకోడానికి ప్రయత్నించేవాడిని. అంతే కాదు నేను చదివిన ప్రతి వార్తల్నీ ఇంట్లో రికార్డ్ చేయమని చెప్పి, ఇంటికి వచ్చాక, మళ్ళీ మళ్ళీ విని, నాకు నేనుగా మంచిగా రాయడం, చదవడం మెరుగు పరచుకోడానికి కృషి చేసే వాడిని. దాంతో నాకు పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజంలో ఏదైనా విద్యార్హత సాధించాలనే కోరిక కలిగింది. అవకాశం చూసుకుని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేశాను. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.కామ్. చేసాను. వీటికి తోడుగా ఉంటుందని తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్ & జర్నలిజం లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాను.

ఆ తర్వాత – 2005 డిసెంబర్ 25వ తేదీన హైదరాబాద్ ఎఫ్.ఎం. రెయిన్ బో స్టేషన్ ప్రారంభం కాగా, ఆ మర్నాడు ఉదయం “ఎఫ్.ఎం.రెయిన్ బో – న్యూస్ హెడ్ లైన్స్” మొదటి బులిటెన్ చదివే అదృష్టం నాకు దక్కింది. అప్పటి నుండి 2020 వరకు దాదాపు 15 సంవత్సరాలు ”ఎఫ్.ఎం.రెయిన్ బో వార్తల ముఖ్యాంశాలు” చదవడంతో పాటు, వాటిని సేకరించి, ప్రసార యోగ్యంగా కూర్చడం కూడా నేర్చుకున్నాను.

వీటితో పాటు, ప్రాంతీయ వార్తా విభాగం ద్వారా ప్రసారమయ్యే జిల్లా సమాచార లేఖలు, వార్తా వ్యాఖ్యలు, శాసనసభ, శాశనమండలి సమీక్షలు, వార్తా వాహిని వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈ విషయంలో ఆ కార్యక్రమాలను అప్పట్లో నిర్వాహించిన శ్రీ అద్దంకి శ్రీరాం కుమార్ ప్రోత్సాహం మరువలేనిది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి భౌతిక కాయానికి జరిగిన అంతిమ యాత్రకు ఆకాశవాణి నిర్వహించిన “ప్రత్యక్ష వ్యాఖ్యానం” కార్యక్రమంలో నేను కూడా ఒక వ్యాఖ్యాతగా పాలుపంచుకోవడం నా జీవితంలో మరువలేని ఒక అరుదైన సంఘటనగా నేను భావిస్తాను.

రేడియో లో ప్రాంతీయ వార్తలు చదవడానికి రెండు సంవత్సరాల ముందు నుంచే అంటే, 1986 నుంచీ, నేను ఆకాశవాణి హైదరాబాద్ మెయిన్ స్టేషన్ తో పాటు, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం, యువవాణి కేంద్రాల్లో క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేసే వాడిని.

అంతకుముందు 1978 నుంచీ, యువవాణిలో నేను రాసిన ప్రసంగాలు, రూపకాలు ప్రసారమవుతూ ఉండేవి. అప్పటికి నేను డిగ్రీ పూర్తి చేయలేదు. కనీసం డిగ్రీ విద్యార్హత ఉంటే కానీ, అనౌన్సర్, లేదా న్యూస్ రీడర్ గా దరఖాస్తు చేయడానికి వీలు లేదని తెలియడంతో, మొత్తానికి కుస్తీ పట్టి, ఆఘమేఘాల మీద, ఉస్మానియా విశ్వవిద్యాలయం, దూరవిద్యా కేంద్రం నుంచి బి.కామ్ పూర్తి చేశాను.

ఆ తర్వాత, 1985 లో ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం లో క్యాజువల్ అనౌన్సర్లు కావాలన్న రేడియో లో ప్రకటన విని, వెంటనే అప్లై చేశాను. నా అదృష్టం కొద్దీ, ఎంపికయ్యాను. రేడియో చిన్నక్క గా సుప్రసిద్ధులైన శ్రీమతి రతన్ ప్రసాద్ గారు, ఏకాంబరంగా సుపరిచుతులైన సత్యనారాయణ గారు, సుప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత శ్రీమతి ఇలాయస్ జ్యోత్స్న గారితో పాటు, శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి నిర్మలా వసంత్ గారు, శ్రీ కపర్ది గారు, శ్రీ మట్టపల్లి రావు గారు, శ్రీమతి సుశీల గారు, శ్రీమతి సీతాదేవి గారు మొదలైన ఎంతో మంది సీనియర్ అనౌన్సర్లు, కళాకారులతో కలిసి పనిచేస్తూ, వారి వద్ద చక్కటి శిక్షణ పొందాను. అదేసమయంలో వివిధ భారతి, వాణిజ్య ప్రసార విభాగంలో కూడా, క్యాజువల్ అనౌన్సర్ గా పనిచేశాను. ఆ తర్వాత డ్రామా సెక్షన్ లో కూడా ఆర్టిస్టు గా ఎంపికై అనేక నాటకాలు, నాటికల్లో పాల్గొన్నాను.

దానికంటే సుమారు పదేళ్ళ ముందు నుంచీ, అంటే, 1978 లో హెచ్.ఎం.టి. లో చేరిన తర్వాత అక్కడ పరిచయమైన గురుతుల్యులు శ్రీయుతులు టి.ఆర్.జి.కె. విఠల్ గారు, కె.ఎం.కె. రావు గారు, దివాకర్ల రామ భాస్కరం గారు వంటి సాహితీ మూర్తులతో కలిసి, వారు రూపొందించే బాలల కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు అన్నింటిలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడిని. అలా నాకు ఆకాశవాణితో దాదాపు నలభై ఏళ్ళకు పైగా అనుబంధం ఏర్పడింది. అందుకే నాకు ఆకాశవాణి పేరు ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, నాకు ఆకాశమంత ఆనందం కలుగుతుంది. .

అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం- ఎస్.ఐ.ఈ.టి.- రూపొందించి, “టెలీ స్కూల్” పేరుతో హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసిన అనేక విద్యా కార్యక్రమాలలో కూడా అనౌన్సర్ గా, వ్యాఖ్యాత గా, నటుని గా పాల్గొన్నాను. ఇదే సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి దృశ్య శ్రవణ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగింది.

ఇలా ఉండగా, 1987 లో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో యాంకర్ గా, అనౌన్సర్ గా, వ్యాఖ్యాత గా అర్హత, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చనే ప్రకటన వినగానే ఎగిరిగంతేసి, వెంటనే అప్లై చేశాను. అక్కడ కూడా నా అదృష్టం కొద్దీ సెలెక్టు అయ్యాను. నన్ను వ్యవసాయదారుల కార్యక్రమ నిర్వాహకులకు పరిచయం చేశారు. అప్పుడు నాకు శ్రీయుతులు బొగ్గవరపు వెంకట్రావు గారు; మండవ విజయ సారధిగారు చక్కటి శిక్షణ ఇచ్చి, లెక్కలేనన్ని కార్యక్రమాల్లో అవకాశం ఇచ్చి, ప్రోత్సహించారు. దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా నాకొక గుర్తింపు రావడానికి దోహదం చేశారు. దూరదర్శన్ లో ప్రసారమైన ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం “బిజినెస్ ట్రెండ్స్” లో కూడా వ్యాఖాతగా, ప్రెజెంటర్ గా పాల్గొన్నాను.

అంతే, ఇక ఆరోజు నుంచి వెనుదిరిగి చూడలేదు అంటారు కదా! అలా నిరాఘాటంగా 2010 లో కరోనా నిబంధనల అంతరాయం వరకు, దాదాపు ముఫై మూడేళ్ళు దూరదర్శన్ లో – “వ్యవసాయదారుల కార్యక్రమం అంటే బాల భాస్కర్ – బాల భాస్కర్ అంటే వ్యవసాయదారుల కార్యక్రమం” అన్నట్లుగా, దూరదర్శన్ లో ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చినా, నా స్థానం సుస్థిరంగా కొనసాగింది. అందుకు దూరదర్శన్ కార్యక్రమ నిర్వాహకులందరికీ నేను పేరు పేరునా ఎప్పుడూ హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇంత సుదీర్ఘకాలం దూరదర్శన్ లో వ్యాఖాతగా నాకు తెలిసి ఎవరూ కొనసాగలేదు. నిజంగా ఇది ఒక రికార్డే అని, అందరూ అంటూ ఉంటే, నాకు గర్వంగా కూడా ఉంటుంది. అంతే కాదు గ్రామదర్శిని లో వ్యవశాయదారుల కార్యక్రమానికి లైవ్ లో కామెంటరీ ఇచ్చిన అరుదైన అవకాశం కూడా నాకు కలిగింది. ఆ విధంగా అనేక సంవత్సరాలు తెర వెనుక వ్యాఖ్యాతగా ఉన్న నాకు, తెర మీద కనబడాలనే నా ఉత్సాహాన్ని గమనించి, అప్పట్లో ప్రొడ్యూసర్ గా ఉన్న శ్రీమతి శైలజా సుమన్ గారు నాకు దూరదర్శన్ లో “ఉద్యోగ వార్తలు” చదివే అవకాశం కల్పించారు. ఆ అనుభవంతో, ఆతర్వాత, కొంత మంది ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను.

ఈనాడు టెలివిజన్ ప్రసారం చేస్తున్న “ఆంధ్రావని” కార్యక్రమంలో కూడా “వాయిస్-ఓవర్-ఆర్టిస్ట్” గా పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో “తేజా టీవీ” ద్వారా ప్రతీ రోజు ప్రసారమైన “రైతు మిత్ర” అనే వ్యవసాయదారుల కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, వ్యవసాయ వార్తల ప్రెజంటర్ గా కూడా రెండు, మూడేళ్ళు పనిచేశాను. తీరిక సమయాల్లో వివిధ పాఠశాలలు, కళాశాలలు, సాంస్కృతిక సంస్థల వార్షికోత్సవాలు, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలతో పాటు, వర్ధమాన నృత్య కళాకారుల “అరంగేట్రం” కార్యక్రమాలకు యాంకర్ గా, వ్యాఖ్యాతగా వ్యవహరించాను.

రేడియో వార్తల ద్వారా నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏవిషయాన్నయినా పాజిటివ్ గా చెప్పడంతో పాటు, సానుకూల దృక్ఫధం అలవాటయ్యింది. సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా, క్లుప్తంగా చెప్పడం. వాస్తవ విషయాలనే – మాట్లాడడం. ఏదైనా అనుమానం, అస్పష్టత ఉంటే, ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం, అవకాశం లేకుంటే, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా వదిలేయడం.

అదేవిధంగా, దూరదర్శన్ లో వ్యవసాయదారుల కార్యక్రమాలపై ఎవరైనా జోక్స్ వేస్తే, నేను అసలు ఒప్పుకునే వాడిని కాను. వారితో గొడవపడి, ఆ కార్యక్రమాల ప్రత్యేకత, గొప్పదనం, ప్రయోజనం గురించి వివరించి, వారి అభిప్రాయం తప్పు అని వారిచేతే ఒప్పించేవాడిని. లేకపోతే వారిని క్షమించేవాడిని కాను.

ప్రస్తుతం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రచురణల విభాగం, యోజన పత్రిక తో పాటు, పత్రికా సమాచార కార్యాలయం లో – ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదకునిగా పనిచేస్తున్నాను. ఇందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతోంది.

అదేవిధంగా ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనుభవంతో ప్రస్తుతం – సంప్రదాయం; ది యారో టి.వి; బట్ న్యూస్ తెలుగు; ఛానల్ 5 ఏ.ఎం. వంటి వివిధ యూట్యూబ్ ఛానెల్స్ లో “వాయిస్-ఓవర్-ఆర్టిస్ట్” గా, గాత్ర దానం చేస్తున్నాను.

“ఓ సారి చూడండి అంతే!” అనే పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రతీ నెల మొదటి, మూడవ గురువారాల్లో మాత్రమే ప్రసారమౌతూ బహుళ ప్రజాదరణ పొందుతున్న “దృశ్య శ్రవ్య పఠన సమ్మిళిత ప్రసార సంచిక” లో భాగంగా, సంక్షిప్త వార్తలు అందిస్తూ “న్యూస్ ప్రజెంటర్” నా స్థానాన్ని సుస్థిరపరచుకుంటున్నాను.

ఇటీవల మరొక కొత్త అనుభవం కూడా నాకు కలిగింది. అదేంటంటే, ఆర్.జె. లు, యాంకర్ లు; వాయిస్-ఓవర్-ఆర్టిస్టుల శిక్షణ కోసం “మన వాయిస్ గ్లోబల్ రేడియో ఛానల్” నిర్వహిస్తున్న – ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా, 2022 జనవరిలో రెండు రోజులు దృశ్య మాధ్యమం ద్వారా, వారికి నా అనుభవాలతో పాటు, నాకు తోచిన కొన్ని సూచనలు, మెళకువలు చెప్పే అవకాశం కలిగింది.

ఇక పురస్కారాలు, అవార్డుల విషయానికి వస్తే, హెచ్.ఎం.టి. లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రతీ ఏటా వివిధ సందర్భాల్లో నిర్వహించే “స్లోగన్” పోటీలు; వ్యాస రచన పోటీల్లో అనేక బహుమతులతో పాటు, నగదు పురస్కారాలు అందుకున్నాను. ఇవి కాక, ముఖ్యంగా, మచిలీపట్నంలోని “పట్టాభికళాపీఠం” 2011 లో ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ గా, 2012 లో ఉత్తమ వ్యాఖ్యాత గా అవార్డులు ఇచ్చి సత్కరించింది. 2013 ఏప్రిల్ నెలలో, హైదరాబాద్ లో పి.ఎస్. ఆర్. ఆంజనేయ శాస్త్రి స్మారక ఉత్తమ రేడియో న్యూస్ రీడర్ పురస్కారం అందుకున్నాను. 2018 లో అమెరికా లోని వివిధ తెలుగు సంస్థలు మరియు గాంధీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అట్లాంటా లోని గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన “మీట్ & గ్రీట్” కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత ,చలన చిత్ర నటులు శ్రీ తనికెళ్ళ భరణి గారితో పాటు, ముఖ్య అతిధిగా సత్కారాన్ని అందుకోవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అదేవిధంగా, 2021 డిసెంబర్ లో “అంతర్జాతీయ మానవతా స్వచ్చంద సేవా సమితి” వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది శ్రీ ముషిణి రామ కృష్ణా రావు గారు అమెరికా, అరెగాన్ స్టేట్ లో ఉన్న తమ పోర్ట్ ల్యాండ్ కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా వ్యాఖ్యాన శిరోమణి అవార్డును ప్రదానం చేశారు.

అదండీ సంగతీ . ..

చివరిగా, నేను చెప్పదలచుకున్న ఏమిటంటే, “నేను రిటైర్ అయిపోయాను. నేనేం చేయగలను. నా పని అయిపొయింది.” అని – నిరుత్సాహ పడి కృంగిపోకూడదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆలోచనలను అందిపుచ్చుకుని, ముందుగా మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే, ఆ తర్వాత శారీరిక ఉత్సాహం, ఓపిక దానంతట అవే సమకూరుతాయనేది నా అభిప్రాయం. నా అనుభవం.

ఈ విధంగా – నా జీవన ప్రస్తానం గురించి ఒక సారి పునశ్చరణ చేసుకునే అపూర్వ అవకాశం కలిగించిన మయూఖ పత్రిక సంపాదకులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.

నమస్కారం.

You may also like

Leave a Comment