త్యాగయ్య గారు నవవిధ భక్తి మార్గాలలో రచించిన కీర్తనలు కొన్ని పరిశీలిద్దాం. 1)శ్రవణం ..
పల్లవి - రామకథా సుధారస పానమొక రాజ్యము చేసునే!
ధర్మాద్యఖిల ఫలదమె మనసా -ధైర్యానంద సౌఖ్య నికేతనమే
కర్మబంధ జ్వలన ఆబ్ది నావయే -కలిహరమే త్యాగరాజ వినుతుడగు!!
ఈ కీర్తనలో రామనామ మహిమ చెప్పబడింది.
2)కీర్తనం..
పల్లవి-
రామాభిరామ మనసు రంజిల్ల బల్కరాదా!
బంగారు మేటి పాన్పు పై భామామణి జానకి
శృంగారించుకొని చెలువొంద నినుగని
పొంగుచు మల్లె విరుల పూజించు వేళ శ్రీ హరి
సంగీతము పాడుచును త్యాగరాజు నితో!!
త్యాగయ్య ప్రతి కీర్తనలో రామ కీర్తనం వివరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదో ఒక కృతిని ఉదహరించడం కొంత కష్టమే.
” ఏలావతార మెత్తు కొంటివి -ఏమి కారణము రాముడై “ అను కీర్తనలో
“యోగులను జూచుటకా భవ రోగులను బ్రోచుటకా శత
రాగ రత్న మాలికను రచించిన త్యాగరాజు నకు వర మోసంగుటకు’
అని తన శత రాగ రత్న మాలిక నంగీకరించి వరమిచ్చుటకై అవతరించి నాడని రామచంద్రుని కీర్తించుట ఎంతో మనోహరమైన భావన.
3 )స్మరణము..
“ శ్రీపతే నీ పద చింతనే జీవనము’
అను కీర్తనమున భగవంతుని స్మరించుటయే తన జీవిత లక్ష్యమని అట్టి చింతనే ఇంద్రాదులు గొప్ప మహిమను పొందారని చెప్పుచు
‘రామ నామ స్మరణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట జేయగలేదా’
అంటూ స్మరణ విశిష్టతను తెలిపారు.
4 )పాద సేవనం..
‘శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తానికి రావే!
అను కృతిలో పాదాభివందన మొక్కటే అన్ని దురితాలను అపహరించగల సామర్థ్యం ఉందని చెప్పుతూ అహల్య వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని, బ్రహ్మాదుల చేత పూజింపబడే ఆ పాదాలు తన మనస్సులో నిరంతరం స్థిరంగా నిలవాలని ప్రార్థించాడు. సందేహమును దీర్చవయ్య సాకేత నిలయ’అను కృతిలో
‘వర మౌను లెల్ల జరణమ్ములను,స్మరియింప నీడు పద మొసంగెనో
భరతార్చనచే బాదుకలు ,ధర నిన్నొసంగె త్యాగరాజ భాగ్యమా!!
అంటూ శ్రీ రామ చంద్రుని చరణాల కన్నా ,వాటిని సేవించిన పాదుకలు మరింత గొప్పవని భరతుని వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని కీర్తించారు.
‘రఘునాయక !నీ పాద యుగ రాజీవముల నే విడ జాల’ అను కీర్తనలో భవ సాగరమును దాటగోరు వారికి శ్రీ రాముని తప్ప వేరుగతి లేదని తెలిపారు.
‘శ్రీ మానినీ మనోహర ! చిరకాలము మాట యొక టేరా ‘ అను కృతిలో భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుని చరణాల యందు సమర్పించి పాద సేవచే ధన్యులవుతారు అంటూ ప్రశంసించారు.
5 )అర్చన..
. రార సీతా రమణీ మనోహరా’ అను కృతిలో
‘బంగారు వల్వలు నే బాగుగా గట్టెద మరి
శృంగారించి సేవ చేసి కౌగిట జేర్చేద
సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టేద
సారమైన ముక్తా హారములు నిక దిద్దేద ‘
అంటూ అనేక విధాలుగా పరమ భక్తితో భగవంతుని సేవ చేసి తరింతు నని
పేర్కొన్నారు.
‘తులసీ బిల్వ మల్లికాది జలజముల పూజలు గైకొనవే ‘అనే కృతిలో
‘ఉరమున ముఖమున శిరమున భజమున
గరమున నేత్రమున చరణ యుగమ్మున
గరుణతో నెనరుతో పరమానందముతో ‘అంటూ వివిధములైన పుష్పాలతో శాస్త్రవిధిని పాదాది శిరః పర్యంతము ప్రత్యంగ పూజ చేసే విధానాన్ని వివరించారు. 6 6 )వందనము..
‘వందనము రఘు నందన’అనే కృతిలో పరమ భక్తి భావము మనసులో ఉప్పొంగు చుండగా భగవంతునకు నమస్కరించు పద్ధతి తెలియ చేశారు.
7 )దాస్యము..
‘తవ దాసోహం తవ దాసోహం దాశరథి’ అను కృతిలో త్యాగరాజు దాసత్వమే సరియైన తరణొ పాయమని విశ్వాసంతో పలికారు.
8 )సఖ్యము..
‘సామికి సరి జెప్ప జాల వేల్పుల’అనే కీర్తనలో
‘తన కంటి కెంతో ముద్దు తప్ప దాడిన వద్దు చనువు చేయునొ పొద్దు చల్లని చూపు కద్దు
అన్నీ వేల్పుల లోన అతనికి సరిగాన
తన్ను బ్రోచిన ఘన త్యాగరాజు సఖు డైన’
ఆంటూ శ్రీ రాముని పట్ల తనకు గల స్నేహ భావాన్ని ప్రకటించారు.
9 )ఆత్మ నివేదనము..
‘కాలహరణ మేలరా హరే’ అన్న కృతిలో
‘చుట్టి చుట్టి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి
భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్ననన్ను బ్రోవ
దినదినమును తిరిగితిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీదే యంటి త్యాగరాజ వినుత రామ’
అంటూ అనన్య గతికత్వముతో శరణు కోరారు త్యాగయ్య ఈ కృతిలో.
‘నన్ను విడిచి కదలకురా’ అనే కృతిలో కూడా మనసు కరిగే విధంగా శరణు వెడుతూ తన సర్వస్వాన్ని రామ చంద్రునికి సమర్పించారు.
ఈ రకంగా ఎన్నో విధాల తమ కవితా శక్తిని ప్రదర్శించి తమ భక్తిని అనేక కృతులలో వర్ణించారు. ప్రాచీన కవులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ,భక్తా గ్రేసరులైన నారదాది ఋషుల లాగా తమ భక్తి ప్రపత్తులను వెల్లడి చేసిన ఉత్తమోత్తమ వాగ్గేయ కారులు త్యాగయ్య గారు.
**************************************