దసరా సెలవుల ముందురోజు పూల వనంలా మారింది బడి. బతుకమ్మ లోని రంగు రంగుల పూలకు సాటిగా రంగు రంగుల బట్టల్లో పువ్వుల్లా కేరింతలు కొట్టే చిన్నారులతో ప్రతీ ఏడాది దసరా సెలవుల ముందు రోజు బతుకమ్మ సందడి సంతరించు కుంటుంది తెలంగాణ బడులల్లో.
కాలంతో పాటు ప్రయాణించాలి కాబట్టి కాలానికనుగుణంగా కట్టూ బొట్టుకు అలవాటు పడిన పిల్లలు చక్కని పరికిణీలు కట్టుకొని వాలుజడలు, వాటి చుట్టూరా పూల దండలు, పాపిట బిళ్ళ లు – చంపసరాలు , వడ్డాణాలు – వంకీలు, గాజులు – గజ్జెలు, కాటుకలు – గోరింటాకు భారతీయ వస్త్రధారణలో ధగ ధగా మెరిసిపోతూ బతుకమ్మలు పట్టుకున్న అమ్మాయిలను కళ్ళనిండుగా చూస్తూ ఉంటే కళ్ళకింపుగా ఉంటుంది.
ప్రతి దానికీ తీన్ మార్ డాన్సులు మాత్రమే తెలిసిన మగపిల్లలు కోలాటం కర్రలు పట్టుకుని పాటలకనుగుణంగా పదం కలపడం భారతీయ సంస్కృతిక వైభవాన్ని గుర్తుచేస్తోంది. పాశ్చాత్య పోకడలు ఎన్ని పెరిగినా భారతీయత మాత్రం లోపల అలాగే భద్రంగా ఉంది అనే సంతోషాన్ని , భరోసాను నింపుతోంది. విద్యాలయాల్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పరిచయం చేస్తాయి. మూలాలు మరువకుండా చూస్తాయి.
ఎప్పటిలానే సరిగా అర్థం కాని తీన్ మార్ పాటలు కాకుండా మంచి భావం, సందేశం గల సాహిత్యంతో అచ్చతెలుగు పాటల వల్ల ఈ తరం పిల్లలకు తెలుగు పదాలు పరిచయం అవుతున్నాయి. జస్టిన్ బీబర్, షకీరా పాటలే కాదూ అచ్చతెలుగు పాటలూ అంతే ఉత్సాహాన్ని ఊపునూ ఇస్తాయని పిల్లలకు తెలిసేలా నిరూపిస్తున్నాయి బతుకమ్మ పాటలు.
తెలంగాణ రాష్ట్ర పండగగా గౌరవం దక్కిన తర్వాత కాలం నుండి ఇప్పటి తరానికి అర్థమయ్యే భాషలో చాలా చాలా బతుకమ్మ పాటలు రాయబడుతున్నాయి, ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా ప్రత్యేకంగా బాణీలు కట్టబడుతున్నాయి. అయితే వెనుకటి నుండి కూడా ప్రాచుర్యంలో ఉన్న పాటలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…, ఒక్కొక్క పువ్వేసి సందమామ…, రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో…ఇలాంటి పాటల్లో ప్రజల జీవన విధానం ప్రతిబింబించేలా సుఖ దుఃఖాలు కలగలిసిన బతుకులు అగుబడేలా పాటలు ప్రాచుర్యంలో ఉన్నవి.
నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు వరకు ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న బతుకమ్మ పండుగ దక్షిణ తెలంగాణ లోని పాలమూరు జిల్లాలో తెలియదు. ఎక్కడా బతుకమ్మ ఆడే వారు కాదు కానీ ఏరొంక పున్నమి, పీర్ల పండుగలప్పుడు పిల్లలను అమ్మవార్లుగా భావించి మధ్యలో కూచోబెట్టి చుట్టూరా చేరి పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేసే వారు. తెలంగాణా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, సభ్యత చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలలో భాగంగా బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఉద్యమనాయకుల ఆదేశం అయ్యిందీ ఇప్పుడదే ఆనవాయితీ అయ్యిందీ.
తెలంగాణ ఏర్పడ్డాక దీనికి రాష్ట్ర పండగ గా గౌరవం కల్పించబడింది. అప్పటినుంచి తెలంగాణా ప్రభుత్వం ఈ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తప్పని సరిగా బతుకమ్మ నిర్వహించేలా ఆదేశాలు చేసింది. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు,కార్యాలయాలు బతుకమ్మను నిర్వహించడానికిగాను అనేక వేదికలు ఏర్పాటు చేసి, పూవులు,విద్యుత్ వెలుగులు, పాటల కోసం మైకులు సమకూర్చి వేడుక చేసుకునేలా సౌలభ్యం కల్పిస్తోంది.
భారతీయులు ప్రాణి కోటి మనుగడకి కారణం అయిన ప్రతి దానినీ అంటే విశ్వంలోని సూర్యచంద్రులు, గ్రహాలు నక్షత్రాలు, గాలి, నీరు, నిప్పు, నేల, రాయి రప్ప, చెట్టు,పుట్ట , కొండ, గుట్ట, పాము,పక్షీ, జంతువు, కాలం, ఇలా ప్రతీది చివరికి జీవనానికి ఉపయోగపడే వస్తువులను కూడా కృతజ్ఞతా భావంతో దేవతల రూపంలో కొలుస్తారు. సామూహికంగా పండగలు, పర్వదినాలు చేస్తారు. భారతీయ పండుగలలో ప్రతి పండగకి ఓ పరమార్థం ఉంటుంది. ప్రతి ఉత్సవానికి ఓ కథ ఉంటుందీ. కాల గమనంలో ఉత్సవాల వెనక కథలు మారుతూ కొత్తవి చేరుతూ పోతున్నా ఉత్సవాల ఉద్దేశం మాత్రం అంతర్లీనంగా అదే ఉంటుంది.
ఇక బతుకమ్మ పండుగ విషయంలో రకరకాల కథలు కథనాలు ప్రచారంలో ఉన్నా జీవులకు మనుగడకి కారణం అయిన ప్రకృతిని గౌరీదేవి పేరుతో కొలుస్తూ ఆమెకు ప్రతిరూపంగా సహజ సంజీవని రోగ నివారణి అయిన పసుపు ముద్దను చేసి ఆ ప్రతిమ చుట్టూరా అందుబాటులో ఉన్న పూలను అలంకరించి అందరూ చుట్టూ చేరి పాటలు పాడుతూ ప్రాణులకు బతుకునిచ్చే దేవతగా బతుకమ్మ పేరుతో కొలుస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురి అయి అంత పెద్దగా జరుపుకోని ఈ బతుకమ్మ పండుగ ఈ నాడు ప్రత్యేక తెలంగాణకు ప్రత్యేక పండగ. రాష్ట్ర అవతరణ తరవాత రాష్ట్రం లోని ఊరు – ఊరు, వాడ – వాడా చేరింది. రాష్ట్ర హద్దులు దాటి, దేశ ఎల్లలు దాటి వెళ్లింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పూల పండగను ఘనంగా, ఇంత కళగా పుష్కలంగా పువ్వులతో జరుపుకోవడంతో ప్రజలకు వేడుకే కాదు ఆ పువ్వులు పండించే రైతుల మొహాల్లో కూడా నవ్వులు విరుస్తున్నాయి. బతుకమ్మ పుణ్యమా అని పూలు రైతులకు బతుకుదెరువు పెరిగింది. పూల వ్యాపారలకు లాభాలు పెరిగాయి తద్వారా ఆర్థిక మార్పిడి పెరిగింది. అలాగే బతుకమ్మ పాటల రూప కల్పన లో కవులకు , కళాకారులకి, గాయకులకు, సాంకేతిక నిపుణులకు చేతినిండా అవకాశాలు, పని పెరిగినాయి.
పిల్లలు పెద్దలు సంతోషంతో పాటు ఆనంద డోలికల్లో ఊగే సంబరం బతుకమ్మ.
ఆడ మగ తేడా లేకుండా పెద్దలే పిల్లలై, పిల్లలతో కలిసి బతుకమ్మ ఆటలో లీనమై బాధ్యతలు, వత్తిడులు , సాధక బాధకాలు మరచి, ఈగోలు, స్థాయిలు, పట్టింపులు పక్కకు పెట్టి కాసేపు సంతోషంగా ఆనందంగా గడపటం ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించింది. బాల్యాన్ని గుర్తు చేసింది. ఏడాదికోమారు వచ్చే ఈ సంబరం మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంగా కూడా పెంచుతుంది…
మనస్పర్థలు మరిపించే ఇలాంటి చక్కటి సంబరాన్ని కార్యాలయాల్లో ప్రవేశ పెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
శుష్క ప్రాంతం, గుట్టల ప్రాంతమైన తెలంగాణలో బంజరు భూములలో మొలిచే ఔషద మొక్కలు తంగేడు, గునుగు, పోక పూలు, పట్టుకుచ్చు పూలు, ఉప్పు పూలను శంఖు ఆకారంలో పేర్చి విశ్వ గతికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఎంచి ప్రకృతి ఆరాధన చేసే ఈ పూల పండుగ ప్రకృతి స్వభావాన్ని, ఔషద గుణాన్ని, ప్రకృతి విలువను చెబుతుంది, ప్రకృతి పట్ల మనిషి భాధ్యత తెలుపుతుంది. పర్యావరణ హితకారిగా ఉంది.
https://drive.google.com/file/d/1Ivv499DrppiHHK1DDgU0nEnVsbqNAYdK/view?usp=sharing