Home ఇంద్రధనుస్సు ఉప్పెన సినీమా పాట సమీక్షా

ఉప్పెన సినీమా పాట సమీక్షా

by Ramakrishna Manimadde

“ఉప్పెన” సినిమా కోసం “శ్రీమణి” రాసిన
“నీ కన్ను నీలి సముద్రం “.. ఈ ప్రేమ పాట వింటే ..
మనసు పరవశిస్తుంది.. పలవరిస్తుంది..
ప్రేయసికై పరుగులు తీస్తుంది..

అలతి అలతి పదాలతో.. ప్రేమకు ప్రేమను అద్ది
హృద్యంగా ఆవిష్కరించిన తీరు..
ఈ పాటను పదేపదే వినేలా చేసింది.

చిలిపితనం.. కుర్రతనం.. కలగలిపి,
ప్రేమ పాటలలో.. పదికాలాల పాటు నిలిచేలా
ఈ పాటను తీర్చిదిద్దారు.

“నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం..” అంటూ
పల్లవిలోనే అదరగొట్టేశారు.

ప్రేయసి కన్నులను నీలి సముద్రం చేసి
ప్రేమికుడి మనసుని పడవ ప్రయాణం
చేయించారు కవి..

నీలాల కన్నులు అందానికి ప్రతిరూపమే కాదు..
వేలవేల భావాలను పసిగట్టేవి.. పలికించేవి..
నిగూఢతకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచేవి.

అలాంటి కన్నులను నీలి సంద్రం చేసి..
ప్రేమలోని గాఢతను తెలియజేశారు శ్రీమణి

ముత్యం స్వచ్చతకు ప్రతిరూపం..
మరి.. ప్రేయసి పెదాలపై విచ్చుకున్న ఆ స్వచ్చమైన నవ్వు
ప్రేమికుడిలోని కష్టాలను దాచేసి.. దాటివేసి
తీరానికి లాగేటి దారమే కదా..!

“నల్లనైన ముంగురులే
అల్లరేదో రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే ..”

ముసురుకున్న ప్రేయసి ముంగురులు అల్లరేదో రేపి..
ఇంకో లోకాన్ని లేకుండా కప్పాయి అంటూ.. కొంటేతనాన్ని కవిత్వికరించిన శ్రీమణి..
“ఘల్లుమంటే నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే ..”

ప్రేయసి గాజుల గలగలలు గల్లుమంటుంటే..
ప్రియుడి ప్రాణం జల్లుమనకుండ ఉంటుందా..?

వానాజల్లుల అల్లుకుంటుంది.. అలరిస్తుంది ..
అని
చిలిపి తనాన్ని చమత్కరించారు..
అంత్య ప్రాసలతో ఆకట్టుకున్నారు..

“చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ..”

ప్రేమలో నాకే దక్కాలి అనే స్వార్థం ఉంటుంది..
ఆ స్వార్థంలో పసితనంలోని నిష్కల్మశం దాగి ఉంటుంది..
అందుకేనేమో కవి మనలను తిరిగి
పసివాల్లను చేశారు..

ఇసుక గూడు చేసుకుని పేరు రాసి పెట్టడం..
ఎంత హృద్యమైన భావన.. మరెంత గొప్ప వర్ణన..!
ఆ పేరును చేరిపెటి కెరటాలు పుట్టలేదని
తన ప్రేమను ఉన్నతీకరించాడు..

“ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంటా నువ్వుంటే నా పక్కన..”

ఏ జంటనైనా ఒకరికి ఒకరులా ఉంటే
చిలుక గోరువంకలా ఉన్నారు.. అని అంటాము.
అంతకన్నా చక్కని జంట తమదని చెప్పడం
కవి దార్శనికతకు… ఆదర్శ జంటని చెప్పటానికి
అద్దం పడుతుంది.

“అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమనీ..”

పాటకే హైలైట్ ఈ వర్డ్స్ ..
శ్రీమణి ఈ పాట రాయడానికి నిజంగానే
కొత్త కొత్త మాటలని అప్పు అడిగే ఉంటారు..

నవ్యత కు.. సృజనకు తన పాటలతో
ప్రాణం పోయడానికి నిత్యం తపన పడే శ్రీమణి
కవి హృదయానికి ఈ చరణం తార్కాణం అని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఒక సినిమా పాట రాసేటప్పుడు..
సాహిత్యం రాయాలంటే..గీత రచయిత కు
మంచి సన్నివేశం.. సందర్భం దొరకాలి..
ఆ రెండు దొరికాయేమో రచయితకు
విజృభించాడు..

కమర్షియాలిటీ కూడా ఆలోచించి
టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలి
అనుకున్నారేమో శ్రీమణి..
“నీ అందమెంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా”.. అంటూ
“ఉప్పెన” టైటిల్ ని ఉదాహరిస్తూ
సాహిత్యానికి భంగం కలగకుండా
తెలివిగా.. చక్కగా రాసారు..

యవ్వనంలో ఆకర్షణ .. అందం ..
యువతి యువకులకు ..
చాలా పసందుగా ఆనిపిస్తాయి ..
అందుకే..
ఉప్పెనెలా అందం చప్పున ముంచేసిందని
ప్రియుడు మునిగి తేలుతున్న వైనాన్ని..

ప్రేయసి ప్రాయపు పొంగులను..
ఆకర్షణను ఆరబోసారు.. కవి శ్రీమణి..

“చుట్టూ ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా..”

ప్రేమికుడు ఏకాంతంగా ఉన్నా.. ఎందరిలో ఉన్నా
తన ప్రేయసి సవ్వడిని పసిగట్టగలడు..

ఎంత దాచేసినా..దాయాలని చూసినా
జల్లేడేసి మరీ పట్టుకోగలడు..

శ్రీమణి సాహిత్యంలో కొత్త పోకడలను స్పృశించారు..
“జల్లడేసి” అనే ఆర్డినరీ పదాన్ని చాలా అద్భుతంగా
ఒదిగి పోయేలా రాశారు .. ఇది కవి నేర్పుని సూచిస్తుంది.

ఇలా.. పద ప్రయోగాలు చేస్తూ
ప్రేమ పాటకు జీవం పోయడం
రచయితకు ఆత్మ తృప్తిని ఇస్తుంది..
గీత రచయితగా కీర్తిని తెస్తుంది..

ఈ రెండూ చక్కగా నిర్వర్తించిన
శ్రీమణి అభినందనీయులు..

“నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని..’

అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తారు..
కానీ..
ఇక్కడ అబ్బాయే అమ్మాయి ప్రేమ వలలో చిక్కుకుని
చేపలా విలవిలలాడుతున్నాడు..
నిజమే కాబోలు..
ప్రేయసి ఊహలను ఊపిరిగా
ఆమె ఊపిరినే ప్రాణంగా
బతుకుతున్న పిచ్చోడు కదా..!

సినిమా పాటలలో.. ప్రేమ పాటలకు
విస్తృతి, పరిధి చాలా ఎక్కువ..

కమర్షియాలిటీ మిస్సవ్వకుండా.. చక్కని సాహిత్యాన్ని అందించి.. కవిత్వాన్ని సూత్రీకరించి..
తన కలానికి ఉన్న పదును
మరోసారి తెలియజేశారు శ్రీమణి.

“శ్రీమణి.. ది బెస్ట్” అనేలా..
సాహిత్యాన్ని అందించిన ఈ పాట
ప్రేమికుల హృదిలో..
తెలుగు భాషాభిమానుల మదిలో..
“ఓ.. మంచి హిట్ పాటగా నిలిచిపోతుంది..

You may also like

Leave a Comment