Home వ్యాసాలు స్వరాంజలి-10

స్వరాంజలి-10

by Krishna Kumari Yagnambhatt

               సంగీత త్రయంలో శ్రీ ముత్తు  స్వామి దీక్షితుల వారు రెండవవారు .వీరి కీర్తనలు అత్యంత ప్రౌఢమైనవి.1775 వ సంవత్సరంలో తిరువారూర్ లో జన్మించిన దీక్షితుల వారు సకల శాస్త్ర పారంగతులు. మనాలీ జమీందారు ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన వీరు అక్కడ వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతం విన్నారు. ఆ సంగీతపు వర్ణ మెట్టు  మీద ఆసక్తి పెరిగి,అక్కడే కొన్నాళ్ళు ఉంది ఆ సంగీతపు సంప్రదాయాలను నేర్చుకొని అందులో ప్రావీణ్యత సంపాయించారు. వీరు తర్వాతి కాలంలో రచించిన కొన్ని కీర్తనలలో పాశ్చాత్య సంగీతపు ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకు ‘సంతతం పాహిమాం సంగీత శ్యామలే’ అన్న కీర్తన ‘god save the king’ అన్న పాశ్చాత్య గేయపు వర్ణ మెట్టు ఆధారంగా చేసినదే. దాదాపుగా 50 వరకు కీర్తనలలో ఈ ప్రభావం కన్పిస్తుంది.

         చిదంబర నాథ యోగి శిష్యులైన వీరు గురువుతో కలిసి కాశీ నగరానికి వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు సంగీత విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి గురువు ఆజ్ఞ మేరకు గంగా నదిలో దిగి కళ్ళుమూసి ధ్యానం చేస్తుండగా విచిత్రంగా వారి చేతిలోకి ఒక వీణ వచ్చింది. దాని పై  శ్రీ రామ అని రాసి ఉంది. భగవంతుని అనుగ్రహంగా భావించి ఆ వీణను వారు తీసుకొన్నారు. అంతేకాదు ,జీవితాంతం వారు దాని సహాయంతోనే గానం చేశారు.

       తర్వాత దీక్షితుల వారికి గురువు అనుగ్రహం వలన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కల్గింది. ఆ క్షణమే వారి నోటి నుండి మొదటి కీర్తన వెల్వడింది. వీరి కీర్తనలు మంత్ర పూరితాలు. సంగీతానికి తగిన సాహిత్యం, సాహిత్యానికి అనువైన దేవ భాష , ఈ రెండింటికీ తగిన రాగ తాళాదులు –ఇది వారి కీర్తన స్వరూపం. వీరి కృతులలో వేదాలు, వేదాంగాలు,శాస్త్రాలు,ఇతిహాస పురాణాలు,ఆగమాలు,మంత్ర శాస్త్ర రహస్యాలు మొదలైనవి ఎన్నో కన్పిస్తాయి. అంతేకాదు , వీరి జటిలమైన సమాస రచన అద్బుతం. ఎన్నో సార్లు తన వాక్శుద్ది తో మహిమలు చూపించారు కూడా. సాహిత్యానికి తగిన రాగం ఎన్నుకోవడమే కాకుండా రాగం పేరు సాహిత్యంలో ఇమిడ్చి రచనలు చేశారు. నిజానికి ఈ లక్షణమే వారిని ఒక ప్రత్యేక వాగ్గేయకారునిగా నిలబెట్టింది.

       ప్రపంచంలో అన్ని రకాల సంగీతాల కంటే భారతీయ సంగీతం రాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పిస్తుంది. ఒక్కొక్క రాగం, దాని స్వర సమూహాలు, స్వర ప్రస్తారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది భారతీయ సంగీతంలో. అటువంటి ప్రత్యేకత కల్గిన ‘రాగం”  పట్ల దీక్షితుల వారికి గల అవగాహన అద్భుతం. అందువల్లనే వారి కీర్తనలకు ఒక ప్రత్యేక స్థానం కల్గింది.  అందుకే ఎంత ప్రౌఢ రచన అయినా, మంత్ర పూరితమైనా వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి.

       దీక్షితుల వారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించారు తమ రచనలలో. ఏ దైవం మీద వారు రచనలు చేసినా సమర్పణ భావంతోనే రచించారు. ఒక ఉదాహరణ చూడండి.

గౌళ రాగం. త్రిపుట తాళం.

పల్లవి-

శ్రీ మహా గణపతి రవతుమాం

అనుపల్లవి-

కామజనక విధీంద్ర సన్నుత, కమలాలయ తట నివాసో

కోమల ధర పల్లవ పద ఖర ,గురుగుహోగ్రజ శివాత్మజః !  

చరణం-

  సువర్ణాకర్షణ విఘ్న రాజో ,పాదాంబుజో గౌర వర్ణ వాసన ధరో

   బాలచంద్రో నరాది వినుత లంబో దరో ,కువలయ స్వవిషాణ పాశంకుశ

  మోదక ప్రకాశ కరో భవ జలధి నావో ,మూల ప్రకృతి స్వభావస్సూకతరో

  రవి సహస్ర సన్నిప దేహో ,కవి జన నుత  మూషిక వాహో

  అవనత దేవతా సమూహో ,ఆవినాశ కైవల్య గేహో !

వీరిది గురుగుహ ముద్ర.   

            

You may also like

Leave a Comment