Home వ్యాసాలు తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ పండుగ

తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ పండుగ

by Dasari (jangiti) Shantakumari

తెలంగాణ సంస్కృతి విశిష్టమైనదే కాదు విలక్షణమైంది.తెలంగాణ ప్రజలు జరుపుకునే పండగల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకమైనది.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.ప్రకృతిని ఆరాధిస్తూ,పూజిస్తూ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ.ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు అంతా కులాలు,మతాలు అంతస్థుల తారతమ్యం ,చిన్నా పెద్దా,వయోభేదం లేకుండా సంబరంగా ఆడుతూ పాడుతూ గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పూల ఉత్సవం.ఈ పండుగ కోసం ఆడపడుచులమంతా ఎదురు చూస్తుంటాము.నగరాలలో ఉన్నవారు సైతం ఊళ్లకు పయనమై పండగలో పాల్గొంటారు.ఉరుకుల పరుగుల జీవితంలో ఈ పండగ ఇంటింటా సరికొత్త ఆనందాలను నింపి,ఉత్సాహాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఆటవిడుపు కాలమిది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏటా బతుకమ్మను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించటం విశేషం.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకుంటూ జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ.శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25 న ప్రారంభం కానున్నాయి.బతుకమ్మ ఉత్సవాలు కూడా ఇదే రోజున మొదలై 9 రోజులపాటు జరుగుతాయి. అక్టోబర్ 3 వ తేదీన సద్దుల బతుకమ్మ ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు జరుపుతోంది. బతుకమ్మ పండుగ వారసత్వ పండుగ.చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో చారిత్రక కథలు,పురాణాల రూపంలో ప్రచారంలో ఉన్నాయి.నవాబులు, భూస్వాముల,పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు బలైపోయి,నలిగిపోయినవారిని,వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి పూలను పేర్చి,బతుకవమ్మా…లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడుతాము.”బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ” పాటల వెనుక ఉన్న మర్మం ఇదే.వెయ్యేళ్లుగా ఇక్కడి ప్రజలము బతుకమ్మను తమ ఇంటిదేవతగా పూజిస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర అంతా ఇంతా కాదు. ఒకరకంగా ఉద్యమానికి ఊపునిచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని కదిలించటమే కాదు మన అస్తిత్వాన్ని నిలబెట్టిందనటంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పాలి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రధాన్యాన్నిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది.

బతుకమ్మ పండుగ కథ :

తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళనే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది.అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006 లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు.తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు.అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకోవడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను జరుపుకుంటున్నాము. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నాము. అంతేకాకుండా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలన్నీ సామాజిక సంబంధాలకు అద్దం పడతాయి.ప్రకృతిలో మమేకమై ఆత్మీయంగా బంధాలను పెనవేసుకోవడం ఇక్కడి ప్రజల సహజ జీవన సౌందర్యానికి ప్రతీక.బతుకమ్మకు వాడే పూలు కూడా సహజ సిద్ధంగా లభించేవి కావడం విశేషం.మానవ ప్రయత్నం లేకుండా సహజంగా లభించే మొక్కలకు,తీగలకు పూసేవే. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే సమయంలో…భూమితో,జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటాము.ఈ సంబరాల్లో పెండ్లికాని అమ్మాయిలు”బొడ్డెమ్మ”(పుట్టమన్ను తో చేసే దుర్గాదేవి బొమ్మ)ను చేసి వాకిట్లో ముగ్గులు వేసి ఆడుతారు.ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకుంటుంది.ఇలా మట్టిరూపం నుంచి పూలరూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు అంతా జానపదుల సంస్కృతిలో భాగం.ఆద్యంతం జానపదుల జీవన విధానం ఈ పండుగలో మేళవిస్తూ…అటు ప్రకృతితో ఇటు మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే అపురూపమైన ఉత్సవం.ప్రకృతిలో లభించే రకరకాల పూలవలె అందరూ కలిసి మెలిసి బతకాలనే గొప్ప సందేశం అంతర్గతంగా మనకు బోధిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే పల్లెవాసుల జీవనశైలి, శ్రామిక రైతుల బతుకు చిత్రం ఇమిడి ఉండే సామాజిక ఉత్సవంగా …వృత్తి, వర్గ,కుల,ప్రాంత,మత సాంప్రదాయ భేదాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిసి సమతాభావాన్ని పెంపొందించే గొప్ప ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ.

పర్యావరణ హితం :

 బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరలో,శీతాకాలపు తొలిరోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి.రకరకాల పూలు దొరుకుతాయి.వర్షాకాలం,శీతాకాలం సంధి సమయంలో ఉపయోగించడంతో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.నిండుకుండలాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. పర్యా వరణాన్ని కాపాడుతాయి. బతుకమ్మ పాటలు కష్టసుఖాలు, - ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల మేళవింపుగా అలరిస్తూ...సంస్కృతి, సంప్ర దాయాలకు అద్దం పడతాయి. ఈ పర్వదినం సందర్భంగా తొమ్మిది రోజుల పాటు రకరకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. మొక్కజొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం లాంటి పదార్థాలను నైవేద్యాల తయారీలో ఉపయోగిస్తారు

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పేర్లు,నైవేద్యాలు :

1.ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు. దీన్నే “పెత్రామాస” అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతాము.
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తాము.
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తాము.
6. అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించము.
7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తాము.
8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తాము.
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఇదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటాము. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం,మలీదా,నువ్వుండలు అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదిస్తాము.
బతుకమ్మ పూల పండగే కాదు ఆటపాటల పండగ.కోలాటాల పండగ.వేడుక ఒక ఎత్తయితే ఆ ఆటలు,పాటలు అనిర్వచనీయ ఆనంద హేలలు.బతుకమ్మ ఆట ఆడుతూ పాడే పాటలు ఆనందానుభూతిని పంచుతాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు,ప్రేమ,స్నేహం,బంధుత్వం, ఆప్యాయతలు,త్యాగం,భక్తి,భయం,గౌరవం,చరిత్ర పురాణాలను మేళవించి పాడటం ఒక గొప్ప విషయం.
శతాబ్దాలుగా ధ్వంసమైన మన సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి ప్రాణం పోసిన మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కృషి ఎనలేనిది.మరువలేనిది.మన భాష సంస్కృతిని బతికించి, భావితరాలకు అందించటంలో తెలంగాణ జాగృతి చేస్తున్న కృషి ద్వారా ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది.పూల పండగ అయిన బతుకమ్మ నేడు ఖండాంతరాలు దాటి, ప్రపంచమంతా విస్తరించి అట్టహాసంగా నిర్వహించబడుతోంది.

You may also like

Leave a Comment