5
‘‘మంజరీ! ఏమిటే చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు?’’
‘‘ఏమీలేదు చిన్నాజీ’’
‘‘ఏదో నాకు చెప్పవే! వేయిచంద్రికలు విరబూస్తున్న నీ మొహంలో ఆనందం చెప్పకనే చెప్తున్నది. చంద్రప్పను కలిశావా?’’
‘‘అవును చిన్నాజీ! ప్రభువు దయవల్ల మనకి మంచిరోజులే!’’
‘‘ఇక కల్యాణయోగమేనేమో!’’ చిన్నాదేవి ఆమెను ఆట పట్టించింది.
‘‘పోండి చిన్నాజీ! ఆ… నేను మా అమ్మని చూసి చాలాకాలమైంది ఇంటికి వెళ్ళివస్తాను.’’
‘‘నా అనుమతి ఎందుకు మంజరీ! నీవు నా చెలికత్తెవు కావు. చిన్ననాటి నేస్తానివి. నీకీ భవనంలో రాకపోకలకు పూర్తి స్వాతంత్రం ఉంది.’’
సంతోషంతో చిన్నాదేవి మందిరం నుండి బయలుదేరింది మంజరి.
విరూపాక్షస్వామి దేవాలయ వాణిజ్య వీధిలోంచి వస్తుండగా ఎవరివో గుసగుసలు చెవినబడ్డాయి.
‘‘ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ పంపారు’’
‘‘ఏంటి ఖబర్?’’
ఒకడు పరదేశి అని తెలుస్తోంది. ముఖాలను పూర్తిగా వస్త్రంతో కప్పుకున్నాడు. మరొకడు విజయనగర పౌరుడే!
మంజరి వాళ్ళకి కనబడకుండా అటువైపు తిరిగి వస్త్రాలు, గాజులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ సంభాషణ వింటున్నది.
‘‘రాయచూర్ ముట్టడికి రాయలు వస్తాడు కదా’’ పరదేశి చెప్తున్నాడు.
‘‘అయితే?’’
‘‘ముట్టడి జరుగుతుండగా రాయల సైన్యం రాయచూర్కి తూర్పువైపు గుడారాలు వేస్తారు’’ పరదేశి వివరిస్తున్నాడు.
‘‘అవును. సరిగ్గానే ఉందీ విషయం.’’
‘‘ఇకవిను. మా ఇస్మాయిల్ ఆదిల్ఖాన్ అశ్వదళాలు పదాతి దళాలతో విజయనగరానికి తొమ్మిదికోసుల దూరాన నిలుస్తాడు. కందకాలు తవ్వి ఫిరంగులను పేలుస్తాడు’’ పరదేశి మాట్లాడాడు.
‘‘ఇక విజయనగరం కోటమట్టిదిబ్బేనంటారా’’ విజయనగర వాసి ప్రశ్నించాడు.
‘‘ష్! జనం వింటారు. ఈ సమాచారం ఎక్కడా పొక్కరాదు. ఆదిల్ఖాన్ కోట ముట్టిడిరచే సమయానికి మీరు కోటలోపల నుంచి సహకరించాలి.’’
‘‘మాకు లాభం’’ ఆశపడ్డాడు విజయనగర ద్రోహి.
‘‘ఎంత కోరితే అంత’’ శత్రువు ఆశ చూపించాడు.
‘‘సువర్ణరాజ్యం ఇది. దీనిని స్వాధీనపరచటమంటే మాటలు కాదు. సరే మీ ఖాన్సాబ్కి చెప్పు. అంతా సవ్యంగా జరుగుతుందని’’ మాట ఇచ్చాడతను.
వాళ్ళిద్దరూ త్వరత్వరగా అక్కడినుంచి వెళ్ళిపోయారు.
మంజరి తమ ఇంటికి పోలేదు. నేరుగా తిమ్మరుసు భవనానికి బయలుదేరింది. విజయనగర ద్రోహి గుర్తించి ఆమెని వెంబడిరచాడు. తన అనుమానం నిజమే. ఆమె విజయనగరంలో వేగు. ఈ వార్త తిమ్మరుసుకు చేరవేస్తుంది. సందేహం లేదు. దారికాచి ఆపాడు.
‘‘ఆగు! నీ గొంతులోంచి మా రహస్యం పొక్కనీయకు’’ బొంగురుగా అన్నాడు.
‘‘ద్రోహి! విజయనగరానికే ఎగ్గు తలపెట్టిన నిన్ను వదిలిపెట్టను’’ సివంగిలా అతని జుట్టుపట్టుకుంది మంజరి.
ఒక సామాజ్య నర్తకి అని భావించిన మంజరిలో ఇంతటి శక్తి అతడూహించలేకపోయాడు. తడబడి కైజారు దూయబోయాడు.
మెరుపులా ఒక అశ్వికుడొచ్చాడు. ఒక్కవుదుటున మంజరిని తన గుర్రంపైన కూర్చుండపెట్టుకొని క్షణంలో మాయమయ్యాడు. మైదానంలోకి వచ్చాక అశ్వం ఆగింది. అతని మొహం చూసి ఆమె నివ్వెరపోయింది. ఆనందించింది కూడా.
‘‘చంద్రా!’’
‘‘మంజూ! సాహసం కూడా అదను కనిపెట్టి చేయాలి. ఈ వార్త నాకూ తెలిసింది. తిమ్మరుసుగారికి చేరింది కూడా! నువ్వు మీ ఇంటికి పో! నేనూ వచ్చి కలుస్తాను. అక్కడ నీ అవసరం ఉంది’’ అంటూ ఆమెను అశ్వంపైన ఎక్కించుకొని కృష్ణసాని ఇంటిదగ్గర దింపి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు చంద్రప్ప.
ఇంటిదగ్గర జనం గుమికూడారు. తలా ఒకటి అనుకుంటున్నారు.
‘‘ఎలా జరిగింది? ఎవరు చేశారో ఈ ఘాతుకాన్ని’’ ఎవరో వ్యాఖ్యానించారు.
‘‘కాలమహిమ’’ మరొకరి బదులిది.
‘‘బతికినన్నాళ్ళు కూతురి వైభోగం కోసమే తపించింది’’ ఒకరు జాలి చూపిస్తున్నారు.
ప్రజల మాటల్ని దాటుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మంజరి ఎదురుగా కన్పిస్తున్న దృశ్యాన్ని చూసి నిట్టనిలువునా కూలిపోయింది.
‘‘అమ్మా!’’ ఆ ఆక్రందన అందరి హృదయాలను పిండేసింది.
రాత్రి ఎవరో ఇంటదూరి విలువైన రత్నాభరణాలను దొంగిలించి కృష్ణసాని గొంతునులిమారట. ఆమె అతనిని చూసి ఉంటుంది. అందుకే ఈ మరణం. మరికాసేపట్లో చిన్నాదేవికీ వార్త అందింది. ఆమె పంపిన రాజోద్యోగుల సాయంతో మంజరి తల్లి అంత్యక్రియలను పూర్తిగా నిర్వర్తించగలిగింది.
ఇక ఈ భవంతిలో ఏముంది? తనను గొప్పస్థానంలో చూడాలని బతికినన్నాళ్ళూ తపించిన తల్లి ఇక లేదు. తాను ప్రేమించిన చంద్రప్ప మారువేషంలో తిరుగుతున్నాడు. ఈ భవనంలో తనకి భద్రత ఏముంది?
మంజరి చిన్నాదేవి భవనానికే చేరింది. ‘‘చిన్నాజీ’’ అని ఏడుస్తున్న మంజరిని కౌగలించుకొని కంటతడిపెట్టింది చిన్నాదేవి. ప్రేమతో మంజరిని ఓదార్చింది.
‘‘నేటినుంచి నువ్వు నా సోదరివి. నా దగ్గరే ఉండు’’ అని పలువిధాల సమాధానపరచింది. మంజరి మనసులో ఆకాశమంత దిగులున్నా తారకల్లాంటి వెలుగు దివ్వెలు దూరాన కన్పిస్తుంటే కొంత ఊరట చెందింది.
* * *
రాయల సైన్యం రాయచూర్ ముట్టడికి బయలుదేరింది. వారి వ్యూహం ప్రకారం రాయచూర్కి తూర్పుదిక్కున రాయలసైన్యం శిబిరాల్లో ఉంది. ముట్టడికి రాయలు సర్వసన్నద్ధంగా తరలి వస్తే ఇస్మాయిల్ అదిల్ఖాన్ అశ్వపదాతి దళాలతో కోటకు తొమ్మిది కోసుల దూరాన నిలిచి కందకాలు, ఫిరంగులతో యుద్ధానికి సన్నద్ధమైనాడు. రాయలు గ్రహించాడు.
కోటముట్టడికి కొంత సైన్యాన్ని అక్కడే ఉంచి మరికొంత సైన్యంతో ఆదిల్ఖాన్ని ఎదిరించటానికి పూనుకొన్నాడు. నిజానికి ఈ యుద్ధం రాయల శక్తికి మించిపోయింది. ఒక దశలో అపజయం సూచనలున్నాయి. చివరికి అవమానం ఒప్పుకోని ధీమంతుడైన రాయలు యుద్ధరంగంలోకి స్వయంగా దిగి, తన సైనికులకు బలాన్నిచ్చాడు. ‘‘విజయమో వీరస్వర్గమో’’ అనే నినాదాలతో సైనికులకు నాయకత్వం వహించి నడిపించాడు. రాయల పౌరుషం శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడిరది. అపజయం విజయంగా మారింది. ఆదిల్ఖాన్ పారిపోయాడు. అతని సేనాధిపతి బందీ అయ్యాడు. ఆదిల్ఖాన్ పరాజయాన్ని కళ్ళారా చూసిన అల్లసాని పెద్దన ఆశువుగా ఇలా అన్నాడు.
అలుక న్ఘోటక థట్టికా ఖురపుటీ హల్యన్భురాసాని శ్రపు
చ్చలు వో దున్ని, తలచ్చమూ గజ మదాసార ప్లుతీన్గీర్తిపు
ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తే దృష్టికే
దుల నోగ్రఖాకపాలమర్ధప హరిద్భూజాంగల శ్రేణికిన్ (2)
రాయలు రాయచూర్పై యుద్ధానికి వెళ్ళినప్పుడు సపరివారంగా కవులు, పండితులు వెంట ఉన్నారు. యుద్ధశిబిరం యుద్ధభూమిలా లేదు. రకరకాల ధాన్యాలు, ఆభరణాలు, ముత్యాలు అమ్మకాలు జరిగాయి. ఏదో మహానగరంలా ఉంది. రాయలు పోర్చుగీసు సైనికుల సహాయాన్ని కూడా పొంది రాయచూర్ ముట్టడిని సాధించాడు.
* * *
తల్లి మరణం తర్వాత మంజరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. చిన్నాదేవి ప్రేమ, చంద్రప్ప స్నేహం ఆమె బాధను మరిపిస్తున్నాయి.
‘‘మంజూ! ఈ రోజు భువనవిజయానికి రావాలి’’ చంద్రప్ప ఆహ్వానించాడు.
‘‘ప్రత్యేకత ఉందా’’ నిరాసక్తంగా అంది.
‘‘ఈ రోజు రాయలవారు అన్ని భాషల కవులకు తమ కవిత్వాలు చదివే అవకాశం ఇస్తున్నారట.’’
‘‘అష్టదిగ్గజ కవుల కవిత్వాలు, ఛలోక్తులు ఎంతో రమణీయాలు కదా! మరి ఈ కవులెవరు? ఏ దేశంవారు?’’ ఆమెకి ఆసక్తి కలిగినట్లుంది.
‘‘మనదేశంలోని అన్ని భాషల కవులు విచ్చేస్తున్నారు. వస్తే నీ మనసు ఆనంద తరంగితమౌతుంది.’’
‘‘మరి నువ్వు రావా?’’
‘‘ఎందుకురాను! కానీ నన్ను అక్కడ నువ్వు గుర్తించలేవు.’’
అతనికి మంజరిని త్వరగా వివాహమాడాలని ఉంది. కానీ తల్లి మరణంతో దిగాలుపడిన ఆమె వద్ద అటువంటి ప్రస్తావన కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంజరి మనసును ఉల్లాసపరచాలని చంద్రప్ప ప్రయత్నం. ఆ విషయం గ్రహించిన మంజరి భువనవిజయానికి హాజరవటానికే నిర్ణయించుకుంది.
* * *
భువనవిజయసభ ఇంద్రసభను తలపిస్తున్నది. శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పూర్వపశ్చిమ దక్షిణ సముద్రాధీశ్వర, మూరురాయర గండ, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణదేవరాయలకు జయీభవ! విజయీభవ! వందిమాగధుల స్తోత్రాలతో శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంపై కొలువుదీరాడు.
కర్ణాటాంధ్ర సామ్రాజ్య రక్షామణి సభావైభోగం కళ్ళార చూడాలేగానీ ఊహింప శక్యము కాదు.
తిమ్మరుసు మంత్రి కనుసన్నలతో సభ ప్రారంభమైంది. మొదటగా తాళ్ళపాక పెదతిరుమలయ్యగారు అన్నమాచార్యుని పదకవితలను భక్తి పురస్సరంగా ఆలపించారు.
తందనానా అహి తందనానా పురె
తందనానా భళా తందనానా ॥
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ` పర
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
కందువగు హీనాదికము లందులేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ ॥
ఇందులో జంతుకుల మింతా ఒకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ ॥
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటునిద్ర అదియునొకటే ॥
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
ఛండాలుడుండేటి సరిభూమియొకటే ॥
కడిగి యేనుగు మీద కాయునెండొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వర నామమొకటే ॥
విశిష్టాధ్వైతంలోని ఆధ్యాత్మిక తత్వాన్ని సంకీర్తనగా విన్న కృష్ణరాయలు పరవశించారు.
నాడు ఒక ప్రత్యేకాంశం భువన విజయసభలో జరిగింది. తిమ్మనకవి నిలబడ్డాడు.
‘‘ప్రభూ! నాచే విరచితంబైన పారిజాతాపహరణ మహాప్రబంధంలో చాలావరకు విన్పించాను. నేడు విన్పించు రచన ఈ కావ్యానికి చాలా ముఖ్యమైంది. అవధరించండి.
అలకబూని కోపగృహంలో ఉన్న సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీకృష్ణుడు అనేక విధాల ఆమెను అనునయించాడు. చివరకు
పాటల గంధిó చిత్తమున బాటిలు కోప భరంబుమాన్ప నె
ప్పాటున బాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్
జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం
దొలగం ద్రోచె లతాంగి యట్లయగు నాధుల్నేరముల్జేయ బే
రలుకం జెందిన కాంత లెందు సుచిత వ్యాపారము ల్నేర్తురే!
ఇంత జరిగినా శ్రీకృష్ణ స్వామి ఏమన్నాడో వినండి ప్రభూ!
నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా
చిన యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులగాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే
ననియెద, నల్క మానవుగదా! యికనైన నరాళకుంతలా!
అంతా ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్ జగన్నాథుడయిన శ్రీకృష్ణుడు భార్య కాలితో తన్నినా ఓర్పు వహించినాడనే దీని భావం రాయల మనసుని ప్రభావితం చేసింది. దీనికి సంబంధించిన ఓ సంఘటన ఆయన స్మృతిపథంలో ఆ క్షణంలోనే మెదిలింది.
సాధారణంగా చక్రవర్తి వచ్చేదాకా మహారాణి తలగడ మీద తలపెట్టి పడుకోకూడదు. మహారాణి కాళ్ళవైపున తలపెట్టి పడుకున్నది. ఆ రాత్రి రాయలు ఆలస్యంగా అంతఃపురంలోకి వచ్చాడు. మెలకువ రాకపోవడంతో మహారాజు ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. పొరపాటున మహారాణి కాలు ఆయనకి తగిలింది. ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మహారాణి కావాలనే రాజు తలను కాలితో తన్నిందని భావించి ఆగ్రహించి రాయలు అప్పటికప్పుడు అంతఃపురం వదిలి వెళ్ళాడు. ఆనాటినుంచి మహారాణి అంతఃపురానికి ఆయన పోలేదు.
పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా సవతి రుక్మిణికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆగ్రహించిన సత్యభామ ఆయన తలను కాలితో తన్నినా కృష్ణుడు ఆగ్రహించ లేదు. శ్రీకృష్ణదేవరాయలను కృష్ణాంశగా భావిస్తారు గాబట్టి ఆయనకూడా రాణిగారి కాలు తగిలినా ఆగ్రహించరాదని కావ్యబోధ. శ్రీకృష్ణదేవరాయలు మహారాణిని అనుగ్రహించేట్లు చేయడం కావ్యప్రయోజనం. మహారాణి నందితిమ్మనను రాయల మనసును మార్చమని కోరిన కోరికననుసరించే నందితిమ్మన అర్థస్ఫోరకంగా ‘పారిజాతాపహరణం’ రాశాడు. రాయలు ఆలోచిస్తున్నాడంటే కావ్యప్రయోజనం నెరవేరినట్లేనని స్వస్తిపలికాడు తిమ్మనకవి.
మహాకవులు కావ్యాలు వెలయించటమే కాదు, కాపురాలు కూడా నిలబెట్టగలరనటానికి ఇది ఉదాహరణ మాత్రమే!
చింతలపాటి ఎల్లకవి రాధామాధవ కావ్యాన్ని రుచి చూపించాడు. ప్రసిద్ధ కన్నడకవి తిమ్మణ్ణి కుమారవ్యాసుని భారతం నుంచి కావ్యగానం చేశాడు. విద్యానందుడు, గుబ్బిమల్లహ్హణ్ణ, కుమారవాల్మీకి, చాటు విఠలనాథుడు తమ కావ్యాలనుండి కొన్ని భాగాలను విన్పించారు.
నాటి సభకు గురువులైన వ్యాసరాయలు, వాగ్గేయకారులైన పురంధరదాసు కనకదాసులు కూడా విచ్చేశారు. తమిళకవి కుమారసరస్వతి ‘‘రాయల గజపతీ కుమారీ పరిణయం’’ నుండి కవితాగానం చేశాడు. హరిహరదాసుడు ‘‘ఇరుసమయ విళక్కుం గ్రంథం, జైన నిఘంటికుడు మండలపురందర్, జ్ఞానప్రకాశర్ ‘‘మంజరిప్పా’’ గ్రంథం, తిరువారూర్, ‘తత్వప్రకాశర్’ ఆయా కవులచే సభాసదులకు పరిచయం చేయటం జరిగింది.
సంస్కృత కవులు శ్లోకాలు విన్పించారు. రాయలు తాను స్వయంగా సంస్కృతంలో రచించిన ‘‘మదాలసచరితం’’ నుండి కవిత్వం విన్పించారు. కటకవాసి లొల్ల పండితుడు, ఈశ్వర దీక్షితుడు సత్కరించబడ్డారు. తనకు సంగీతం నేర్పిన లక్ష్మీనారాయణను రాయలు వైభవంగా సత్కరించారు. తిమ్మరుసు మహామంత్రి తాను రచించిన ‘అగస్త్య భారతవ్యాఖ్య’లో కొంత సభకు విన్పించారు.
ముగ్గురు దేవేరులు ఈ సభను ఎంతగానో ఆనందించారు. సంస్కృతం అంతగా రాని చిన్నాదేవి, కర్ణాటక తమిళ భాషలు తెలియని అన్నపూర్ణాదేవి మూడు భాషల్లో విదుషి తిరుమలాంబ ఈ మువ్వురూ కవితా సౌరభాలను నిండుమనస్సుతో ఆస్వాదించారు.
భువనవిజయ సభాప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక అపూర్వ ప్రకటన చేశారు. తెలుగుభాష తెలుగుజాతి ఉన్నంత కాలం నిలిచిపోయే ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే ఆ సన్నివేశం మరికొన్ని రోజుల్లోనే జరుగనున్నదని తెలిసి అష్టదిగ్గజకవులంతా ఆనందించారు. అటువంటి నిర్ణయానికి అప్పాజీ రాయలను అభినందించారు.అందరూ పెద్దన అదృష్టాన్ని వేనోళ్ళ కొనియాడారు.
మంజరి కళ్ళు మాత్రం చంద్రప్ప కోసం ఆ సభలో నలుమూలలా వెదుకుతూ నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నాయి.
అప్పాజీవారికి చేరువలో కానుకలు అందిస్తున్న పరిచారిక సైనికుడు చంద్రప్ప అని గుర్తించడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. దాదాపు సభ ముగిసే సమయానికి గానీ ఆమె అతన్ని గుర్తించలేకపోయింది. ఇది గమనించిన చంద్రప్ప తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ విధి నిర్వహణ చేస్తున్నాడు.
* * *
‘‘ఫో! నీతో మాట్లాడను’’ మంజరి అలక నటించింది.
‘‘మరి ఈ రాళ్ళతో మాట్లాడటానికి వచ్చావా?’’ చంద్రప్ప ఉడికించాడు.
‘‘అంత సభలో ఎక్కడున్నావని వెదకను’’ రోషంగా అంది.
‘‘ప్రస్తుతం నేను ప్రచ్ఛన్నంగా ఉన్నాను. రాయచూర్ విజయం దక్కింది గదా! ఇంక అజ్ఞాతవాసం తేలినట్లే.’’
‘‘హమ్మయ్య’’
‘‘మంజరీ! సుముహూర్తం నిర్ణయించుకునే వచ్చాను’’
ఆమె ఆనందంగా చూసింది.
‘‘దసరా మహోత్సవాల్లో విజయదశమి శుభదినం. ఆనాడు మనం దంపతులమవుదాం. భువనేశ్వరీదేవి, విరూపాక్షస్వామి కృపవల్ల ఈ విజయనగర సామ్రాజ్యంలో మనమూ నీడల్లానయినా మిగిలిపోతాం.’’
‘‘చంద్రం! నాదో కోరిక’’
‘‘చెప్పు మంజూ’’
‘‘మన వివాహం తిమ్మరుసుల వారి ఆశీస్సులతో జరగాలి. వారు కరుణా సముద్రులు. అడిగితే కాదనరు. నాకు ఎవరున్నారు? తల్లిపోయింది. వారిని నేను పితృదేవులుగా సంభావించాను. తిమ్మరుసు తనయులు కూడా సోదరులుగా ఎల్లవేళలా నాకు రక్షణ ఇస్తున్నారు.’’
‘‘నీవన్నదానిలో అణుమాత్రమయినా అసమంజసం లేదు. రేపు తిమ్మరుసుల వారిని కలిసి నీ కోరిక విన్నవిద్దాం’’ ఒప్పుకున్నాడు చంద్రప్ప.
‘‘మన వివాహం విరూపాక్ష మందిరంలో జరగాలి’’ ఆమె కోరింది.
‘‘ఎంత చక్కని యోచన చేశావు మంజూ! విజయనగర సామ్రాజ్య రక్షకుడా ప్రభువు. అతని కృపతోనే మనం ఒకటవుదాం’’ అతనూ సంతోషించాడు.
‘‘చంద్రా! ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. ఆహారధాన్యాలకు కొదవలేదు. విజయనగర వీధుల్లో కెంపులు, వజ్రాలు, నీలాలు, పచ్చలు, ముత్యాలు, రత్నాలు అమ్మటం చూసి పరాయి మూకలు ఈ రాజ్యంపై కన్నేస్తున్నారు. ముఖ్యంగా బహమనీలు.’’
‘‘అవును. రాయచూర్ని రాయలవారు జయించాక ముసల్మానులకు కన్నెర్ర అయింది. వర్తకం పేరుతో శత్రు గూఢచారులు విరివిగా విజయనగరంలోకి ప్రవేశిస్తున్నారని సమాచారం.’’
‘‘ఈ వ్యాపకంలో నీ నృత్యసాధన కూడా మర్చిపోతున్నావు’’ ఆమె ధ్యాస మళ్ళించటానికి అన్నా అంతకుముందు మంజరి నోట వెలువడినవి చంద్రప్ప మనసులోని ఆలోచనలే.
‘‘తెలుగుభాషను అందలం ఎక్కించిన రాయలవారు దేవేరుల కోసం మూడు మందిరాలు నిర్మించారు కదా! వాటిని చూశావా మంజూ!’’
‘‘చూశాను! తిరుమలదేవి శివాలయం, చిన్నాదేవి కృష్ణ మందిరం, అన్నపూర్ణాదేవి జగన్నాథమందిరం. ఏమా దేవాలయాల వైభవం! ఎవరెన్ని మందిరాలు ఏర్పాటుచేసుకున్నా వారి హృదయమందిరంలో కొలువైంది శ్రీకృష్ణదేవరాయలవారే గదా!’’
‘‘మరి మా హృదయరాణి మందిరంలో ఎవరో!’’
‘‘ఇంకెవరూ’’ అతనివైపు చూసింది. నాట్యంలాంటి నడకతో నునుసిగ్గుతో అతని చేతిల్లో వాలిపోయింది మంజరి.
అప్పటిదాకా రాజ్యశ్రేయస్సు గురించి గంభీరంగా చర్చించిన మంజరి పెళ్ళిప్రసక్తి రాగానే సిగ్గుపడటం చూసి ‘ఆడవారి మనసు ఆర్ణవం లాంటిది’ నవ్వుకున్నాడు చంద్రప్ప.
* * *
ఆ రోజు విజయనగరం నిజంగానే విద్యానగరమై సరస్వతీ నిలయమైన సత్యలోకంగా భాసిల్లుతున్నది. ప్రభువు మందిరం నుండి ఎదురుగా ఉన్న రాజమార్గం ఇరుపక్కలా మంత్రులూ, రాజోద్యోగులు, సేనానాయకులు, రాజబంధువులు, ప్రజలు, అష్టదిగ్గజ కవులు నిలబడి తిలకిస్తున్నారు. ప్రభువు మందిరంలోంచి అందమైన బంగారుపల్లకీ బయటికి వచ్చింది. పల్లకీలో ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆసీనులై ఉన్నారు.
రాజమార్గానికిరువైపులా మామిడి తోరణాలు, మార్గమధ్యంలో రంగవల్లులు అలంకృతమైవున్నాయి.
శ్రీకృష్ణదేవరాయల ప్రభువు సర్వాలంకారభూషితుడై తెల్లని పట్టు వస్త్రాలు ధరించి అప్పాజీతో మందిరం వెలుపలికి వచ్చారు.
పల్లకీ వెనుక కొమ్ము పండితవర్యులు పట్టారు. సాహితీపిపాసి, భువనవిజయాధిపతి, ఆంధ్రభోజుడు, తెలుగులెస్స అని పల్కిన కళావాచస్పతి, హిందూ సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాజితుడు, మూరురాయగండడైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సంస్కృతాంధ్రాలలో సమానంగా కవితామాలిక నల్లినవేళ కాలికి గండపెండేరము తొడిగించుకున్న ఆంధ్ర కవితాపితామహుడు అల్లసాని పెద్దన అధిరోహించిన బంగారు పల్లకీని తన భుజాన మోయటం తెలుగువారి చరిత్రలోనే అపూర్వ సంఘటనగా నిల్చింది. నాడు చూసినవారి కన్నులదే అదృష్టం.
హర్షధ్వానాలతో విజయనగర రాజమార్గం మారుమ్రోగింది. ప్రభువు భాషానురక్తి, కవులపట్ల వారికున్న గౌరవం భావితరాలవారికి ఆదర్శప్రాయమై నిలిచిన శుభవేళ అది.
* * *
ప్రధాన శిల్పాచార్యుడు శిల్పులందర్నీ సమావేశపరిచాడు. హంపీ విజయనగరంలో నిర్మితమవుతున్న దేవాలయాల నిర్మాణానికి ఎందరో శిల్పులను విభిన్న ప్రాంతాల నుండి రప్పించడం జరిగింది. వారందరితో ప్రధాన శిల్పాచార్యుడు ఇలా ప్రస్తావించాడు`
‘‘దక్షిణ భారతదేశంలో అచిరకాలంలో ఏకైక చక్రవర్తిగా కీర్తిగడిరచిన హిందూసామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన ఆంధ్రభోజుడు కృష్ణరాయ ప్రభువుల వారు అటు కదనరంగంలోనూ ఇటు కవనరంగంలోనూ ఎనలేని కీర్తిప్రతిష్టలు సాధించారు. రాయలవారు దైవభక్తి, కళాపోషణ, ప్రజాసేవానురక్తి, దయ, మానవీయత, వీర పరాక్రమం, పెద్దలయందు గౌరవం గల గొప్ప రేడు. మహామంత్రి తిమ్మరుసు ప్రభువుకు మంత్రికావటం వారికేకాదు మనందరి అదృష్టం.
ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రభువు, మహామంత్రి, వారికి హృదయా న్నర్పించి సేవచేసే సేనావాహిని, న్యాయాధికారులు, దండనాయకులు, రాజ్యక్షేమం కోరే కవి పండితులున్న రాజ్యం మన విజయనగరం. రాత్రింబవళ్ళు ఆడామగా తేడా లేకుండా నిర్భయంగా తిరగగలిగే పరిపాలన ప్రభువు మనకిచ్చారు. వీధుల్లో రత్నాలు అమ్ముతున్న రాజ్యం ఇది. కొత్తవారొస్తే మర్యాదలు చేసి గౌరవించే పౌరులున్న రాజ్యం మనది. కక్షలు, కార్పణ్యాలు మచ్చుకైనా కానరాని ఈ శాంతి సామ్రాజ్యంలో మనలాంటి కళాకారులు మనస్ఫూర్తిగా కళాసేవలో తరించగల అవకాశం ఉంది.
కళాకారునికి ఎక్కడైతే రాజాశ్రయం దొరుకుతుందో, ఎక్కడైతే కళాకారులు అన్నవస్త్రాలకు కష్టపడక మనశ్శాంతిగా సంపూర్ణంగా కళారాధనలో నిమగ్నమౌతారో ఆ రాజ్యంలో సిరిసంపదలు విలసిల్లుతాయి. శారదాదేవి కొలువు తీరుతుంది. తిరుమలేశుని, విరూపాక్షుని సమానంగా అర్చిస్తూ హరిహరతత్వాన్ని ఆరాధించే రాయలవారు అనేక ఆలయాలు, కళామందిరాల నిర్మాణాలను తలపెట్టటం మనందరికీ తెలుసు.
మనలాంటి శిల్పులందరినీ పోషించి రాళ్ళల్లో రాగాలు పలికింపజేసే ప్రభువాయన. మనందరం ఐక్యభావనతో ఈ హంపీని శిల్పారామంగా తీర్చిదిద్దుద్దాం.
నిన్ననే తిమ్మరుసు మహామంత్రి నిర్మిస్తున్నవి, సంకల్పిస్తున్నవి, మరెన్నో వివరించారు. ఈ ఆలయాల సృష్టికి విశ్వకర్మ అబ్బురపడేట్లు మన ఉలులతో శిలలకు ప్రాణం పోయటానికి కంకణం కట్టుకోవాలి. ఏమంటారు?’’
శిల్పాచార్యుల సుదీర్ఘ గంభీర వాక్కుకు శిల్పులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వాళ్ళంతా ‘నభూతో న భవిష్యతి’ అన్నట్లు విజయనగర రాజధాని హంపీపట్టణాన్ని నిర్మిస్తున్న మయులా అన్నట్లున్నారు. ప్రతి ఒక్కరి మనసుల్లో సంకల్పదీక్ష, నేత్రాల్లో కళాకాంక్ష ద్యోతకమవుతున్నాయి.
శిల్పాచార్యులు మళ్ళీ కొనసాగించారు.
‘‘రంగమండపం పూర్తయింది. ఇంకా విరూపాక్ష దేవాలయ కళ్యాణమండపం, మహాగోపురం పూర్తికావాలి. కృష్ణస్వామి ఆలయం, హజారా రామాలయం, నాగలాపురంలోని విఠోభా ఆలయానికి కళాకృతుల బాధ్యతను నరహరివర్మకు అతని శిష్యులకు అప్పగిస్తున్నాను.’
నరహరివర్మ లేచి శిల్పాచార్యునికి కృతజ్ఞతగా వందనం చేశాడు.
మహోన్నత శిలపై తలపెట్టిన ఉగ్ర నరసింహమూర్తిని రామప్పే తీర్చిదిద్దాలి.
కాళహస్తిలో నూరుస్తంభాల మండపాన్ని, గోపురాన్ని చిన్నప్పకు అప్పగించాం.
చిదంబరంలో ఉత్తర గోపురాన్ని వరదయ్య పూర్తిచేస్తాడు.
శ్రీకృష్ణదేవరాయల ప్రభువు తిరుమల శ్రీ వేంకటేశుని గుడిముంగిట నిర్మింప తలపెట్టిన వేయిస్తంభాలమండపం, గర్భగుడి, వినాయక రథం, మూలగోపురం, వీటన్నిటి నిర్మాణం పూర్తి కావస్తున్నది. అక్కడ అత్యద్భుత కళాకృతుల పర్యవేక్షణ స్వయంగా మేమే చేస్తున్నాం.
శ్రీశైలంలో మండపం, గోపురం మల్లయ్య చూస్తాడు.
అరుణాచలంలో వేయిస్తంభాల మండపం, పదకొండు అంతస్తుల గోపురాన్ని శివన్న దగ్గరుండి శిల్పీకరిస్తాడు.
శిల్పాచార్యుల వారి వింగడిరపుకు శిల్పులంతా హర్షాతిరేకాన్ని ప్రకటించారు.
‘‘కాలం ప్రవాహం వంటిది. విజయనగర సామ్రాజ్య శిల్పులు చరిత్రలో మహనీయులుగా నిలిచిపోయే సువర్ణవకాశం దక్కింది. ఇదంతా పంపావతి కృప. భావితరాలవాళ్ళు మనం తీర్చిన కళామందిరాలు చూసి పులకాంకితులు కావాలి. ఈ శిల్పారామ సౌందర్యదీప్తుల వల్ల రాయల వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోవాలి. హంపీలోని విఠలమందిరం, రాతిరథాలకు స్వయంగా మేమే
ఉలిసేవలను అందిస్తున్నాము. ఇంక మీరంతా వెళ్ళి మీమీ పనులలో నిమగ్నం కండి. మీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరిగాయి’’ అని అందరికీ సెలవిచ్చి పంపాడు శిల్పాచార్యుడు.
అపర విష్ణువు అయిన శ్రీకృష్ణదేవరాయల కీర్తిచంద్రికలను యుగాల పాటు శాశ్వతం చేసే కార్యక్రమానికి ఇది నాంది. రాజ్యం ఎంత సంపన్నవంతమైనా కాలచరిత్రలో ఏది నిలుస్తుందో చెప్పలేం. కానీ హంపీ శిలలు పాడుతున్న ఆ శిల్పరాగం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని శిల్పాచార్యుడికి తెలుసు. దూరంగా ఎవరో బైరాగి ఏకతార మీటుతూ పాడుకుంటున్నాడు.
‘‘రాయి రాయి అంటూ
రాతలే రాసేవు
రాయి రాత తెలియుడయ్యా!
రాయిలోనే ఉంది
రాయల ఘనచరిత ` అది
రాత కందని కావ్యమయ్యా!
రాజ్యమంటూ రగిలి
కోటలన్నీ దాటి
ఏమి సాధించేవు నరుడా
ఎన్ని గెల్చిన గాని
పున్నెమే మిగిలేది
ఏనాటికైనాను నరుడా!’’
తత్వం పాడుకుంటూ బైరాగి వెళ్ళిపోతున్నాడు. అతడు విజయనగర సామ్రాజ్య కీర్తి కావ్యాన్ని లిఖిస్తున్న బ్రహ్మలా కన్పిస్తున్నాడు.