సంజీవదేవ్ లలితకళారాధకుడు.ముఖ్యంగా చిత్రలేఖనం,ఫోటోగ్రఫీలకు కొత్తరూపులు అద్ది కృతకృత్యుడైనాడు.
తెలుగులోనే కాక సంస్కృతాంగ్ల,ప్రెంచి, వంగ,హిందీ,ఉర్దూ భాషల్లో నిష్ణాతుడు.
విద్యాలయాల్లో చదవకుండా పోయినప్పటికి ప్రపంచానుభూతి,విదేశపర్యటానుభవము, ప్రకృతి సౌందర్యానుశీలనం ఈయనలో కవితాదృక్పథం వైపు మళ్లించింది.
రసలేఖలు,తేజోరేఖలు,సమీక్షా రేఖలు,తెల్లమబ్బులు,దీప్తిధార,తెగిన జ్ఞాపకాలు,గతంలోకి, స్మృతి బింబాలు,గ్రే అండ్ గ్రీన్ మొదలైనవి ఈయన రచనలు.
మిత్రులకు,బంధువులకు,మహా మహులకు ఉత్తరాలు రాశారు.ప్రతీ ఉత్తరం ఒక కళాఖండం.విషయ విపులీకరణ,వారి వారి స్థాయికి దగినట్లు సమాధానం రాయడం కన్పిస్తుంది.ఒక విషయాన్ని చెప్పదలచుకొన్నప్పుడు వాక్యాలను,పదాలను అటు ఇటు త్రిప్పి,ఉత్తేజం కలిగించే విధంగా,చదువరులను ఊర్రూతలూగించే విధంగా రాయడం ఈయన ఉత్తరాల్లోని ప్రత్యేకత.
ఈయన ఉత్తరాల్లో నిత్యజీవితంలోని విషయాలు,తాత్త్విక విషయాలు,సరససల్లాపాలు,నీతులు ఎన్నో చోటు చేసుకున్నాయి.ఇంకా అనేక విషయాలు ఉత్తరాల్లో నిక్షిప్తమై ఉన్నాయి.
“మనం రాజనైతిక జీవులం కాదు.”శుద్ధ సాంస్కృతికజీవులం” అని ఈ విశాల విశ్వంలో సుఖాల కంటే కష్టాలే ఎక్కువ.కానీ మనిషి తన మనోసాధన ద్వారా ఖేదాన్ని మోదాలుగా మార్చుకోగలడు.విషాదాన్ని ఆనందంలో రూపాంతపర్చడమే మానవ ధర్మం”.అంటూ కృష్ణాబాయికి రాసిన లేఖలో తెలిపాడు.కష్టాలు రావడం సహజం.కష్టాల్లో కృంగిపోకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనోనిబ్బరం అవసరం అంటాడు.అందంలోనూ,ఆనందంలోనూ నిరంతరం జీవించడానికి ప్రయత్నించాలి.ఈ ప్రయత్నంలో విఫలం చెందినా ఆ విఫలత కూడా గొప్ప ఘనకార్యమే అని అంటాడు.
చిత్త చాంచల్యంలో బడక ధీరచిత్తంతో జీవనసమరంలో పోరాడే వ్యక్తులు ధన్యులు. అని విషాదాన్ని భరించడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ ఆనందమే అని చెప్తూ నిరీక్షణ భవిష్యత్తుకు చెందింది.వాస్తవం వర్తమానానికి చెందింది.జ్ఞాపకం భూతకాలానికి చెందింది.” అని త్రికాలాల గూర్చి ఎంతో చక్కగా వివరించాడు.
మంచితనం లేని తెలివితేటలు సంఘాన్నీ, వ్యక్తినీ కూడా చీకటి గుణాల్లోకి గుంజుతుంది.ఎంత తెలివి వున్నా మంచితనమనేది ముఖ్యం అనే భావన కలవాడు.
“ఏది నీతి, ఏది అవినీతి అనే విషయాల్లో జీవిత రహస్యాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు నీతి మీద ప్రీతి ఉండదు.అవినీతి మీద రోతా ఉండదు.” అని ఉద్బోధిస్తాడు.
బుచ్చిబాబు గారికి రాసిన లేఖలో ” నిత్యజీవితం నుండి బాధను తొలగించలేం కానీ బాధ వుంటూనే బాధ పడకుండా ఒక ఆనందమయ స్థితిని సృష్టించుకోగలం” అంటూ జీవిత సత్యాన్ని వెల్లడించాడు.
బాధ జీవితంలోని బోధకు మార్గం.అని. హితవు చెప్తాడు.లింగం వీరభద్రయ్య చౌదరి కి రాసిన లేఖలో,’ఆషా’ రాసిన ఉత్తరంలో కూడా ఇదే భావాన్ని తెలియజేశాడు.
వస్తువుల్ని సృష్టించడం సులభమే కానీ సుందరమైన ఆలోచల్ని సృష్టించడం చాలా కష్టం.నిత్యావసరాలు ఎన్ని వున్నా, ఎన్ని అనుభవించినా జీవితాన్ని సమన్వయం చేసుకోటంలో ఉంది ఆనందం ” అంటాడు తన చెల్లి భారతీదేవికి రాసిన ఉత్తరంలో.
లక్ష్మికి రాసిన లేఖలో “వైఫల్యాలను చూసి మనం నిరాశ చెందాల్సిన పనిలేదు” అంటూ ప్రోత్సాహ వాక్యాలు చెప్తాడు.
నార్ల చిరంజీవికి రాసిన ఉత్తరంలో అసలు జీవితమంటే ఏమిటి? అనేదాన్ని విశదీకరిస్తూ
” జీవనకళ లేకపోతే సమస్తకళలూ పెద్ద నటన మాత్రమేనని,బాగా జీవించడం అంటే భోగంతో కానీ,యోగంతో కానీ జీవించటం కాదు.త్యాగంతో నిండిన రాగంతో జీవించటం.రాగం అంటే రంగు.రాగం అంటే నాదం.రాగం అంటే అనురాగం.రాగం లేని జీవితం రోగంతో నిండిన బ్రతుకే.” అని జీవితసారాన్ని చక్కగా నిర్వచించాడు.
జీవితంలో రసానుభూతి అవసరం అనే అభిప్రాయం గలవాడు. జీవితాన్ని ఎప్పుడు సంతోషంగా గడపాలి, దుఃఖాలకు కృంగిపోవద్దు అనే హితోక్తులు పలుసార్లు వ్రాశాడు
చాలా లేఖలో సంజీవదేవ్ తన అభిరుచులు వ్యక్తిగత విషయాలు లేఖల్లో వివరించాడు తనకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది.ఈ విషయాన్నే కృష్ణాబాయికి వ్రాసిన లేఖలో
” నిమ్మంటే నా కిష్టం.దానిమ్మంటే నా కిష్టం.
బొమ్మంటే నాకిష్టం,లేని అమ్మంటే నాకిష్టం.
తన హృదయాన్ని విప్పిచెప్పాడు. నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమని తెలిపాడు వ్యక్తుల జీవితాల్లోని ఎండనీడల్ని తెలుసుకోటంలో నాకెంతో అభిలాష,ఆనందం.నావి ఇతర్లకు తెలపటంలో కూడా”” అంటూనే భావ వినియం జరగాలి అని చెప్తాడు.
తన వ్యక్తిగతాభిప్రాయాన్ని
తెలుపుతూ వసుమతికి వ్రాసిన ఉత్తరంలో “నేను పాండిత్యానికి విలువనివ్వను,కళా ప్రతిభలకు విలువనివ్వను,తెలివితేటలకు
విలువ ఇవ్వను,మరి దేనికి విలువ ఇస్తానో తెలుసా వసూ?
హృదయస్పందన అంటే ప్రేమ,జాలి,దయ,కరుణ,సానుభూతి, వీటికి నేను ఇచ్చేది- అవి ఎవరితో ఉన్నా సరే,స్త్రీలలో ఉండేది. వారిలో విద్య ఉన్నాసరే లేకపోయినా సరే వారు నాకు ప్రియులు హృదయస్పందనే ప్రాణస్పందన,ప్రాణస్పందనే ఆత్మానందం. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ సాదాగా జీవించడం ఉన్నతంగా ఆలోచించడమే
తన అభ్యాసమని చెప్పుకున్నాడు.
తపస్వికి రాసిన ఉత్తరంలో
మరణ పర్యంతరం శాంతితో, ఆనందంతో నేను జీవిస్తూ ఇతరులను జీవింపచేయటం
జీవిత లక్ష్యమని రాశారు.జీవితాసాంతం
ఆనందాన్ని కోరువాడు సంజీవ్ దేవ్.సాహిత్యరచనలో కంటే చిత్రరచనలో ఎక్కువ ఆనందమని తెలియచేశాడు.
ఎవరిదగ్గరినుండైనా సరే ఉత్తరం రాగానే వెంటనే బదులివ్వడం సంజీవదేవ్ కు బాగా అలవాటు. ఆయన మాటల్లోనే “ఉత్తరం అందగానే జవాబు రాసే దురభ్యాసం ఒకటి చిన్నప్పటి నుంచీ నన్ను
పట్టి పీడిస్తున్నది” అని దాన్ని ఒక వ్యసనంగా చెప్పుకున్నాడు.
ఉత్తరం అంటే సరియైన నిర్వచనం చెబుతూ ఉత్తరాల్లో ఏ విషయాలు ఉంటే బాగుంటాయో అచ్యుతవల్లికి రాసిన లేఖలో వివరిస్తాడు.”ఉత్తరాలు కేవలం
పాఠ్య గ్రంథాలుగా పాఠాలు లాగా భోగట్టా ప్రధానంగా మాత్రమే ఉంటే చాలా ఎండుగా, నీరసంగా ఉంటవి.వ్యక్తిగత విశేషాలుంటూనే అపరోక్షంగా కాకా పరోక్షంగా ఇన్ఫర్మేషన్ అందజేయబడుతూ ఉండాలి కదూ. వినోదం కూడా విజ్ఞానం”. ఉత్తరాలు సమాచారాన్ని అందించివే కాక వినోదాన్ని కల్పిస్తూ విజ్ఞానాన్ని
కూడ బోధ పరచేవిగా ఉండాలంటాడు.
ఉత్తర ప్రత్యుత్తరాలలో మళ్ళీ నవప్రాణ స్పందన జన్మించాలంటే మధ్య మధ్య విరామం అవసరం” అని కృష్ణాబాయికి రాసిన లేఖలో తెల్పుతాడు.
లేఖలు రాయడంలో గల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ లక్ష్మికి రాసిన ఉత్తరంలో ” సాహిత్యాన్ని గురించీ, కళలను గురించీ,మానవ జీవనతత్వాన్ని గురించి మనము భావవినిమయం చేసుకోటం ఎంతో శాంతి” అని వివరిస్తాడు.ఒకరినొకరు విషయాలను ఇచ్చి పుచ్చుకోవడం వలన పలువిషయాలు తెలుస్తాయి.ఉత్తరాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అనే అభిప్రాయం కలవాడు.
తను రాసే ఉత్తరాల్లో “మెట్ట వేదాంతోపన్యాసాలు అవుతున్నవేం!”రుక్కుకు రాసే ఉత్తరాలు అదొక ధోరణిలో ఉంటూంటవి. వాటిలో లవ్, సెక్స్,మొదలైన సైకలాజికల్ ప్రసంగాలు రాస్తుంటాను.వేదాంతాని కంటే లవ్ మరియు సెక్స్ ఏమీ తక్కువస్థాయికి చెందవు”అని అచ్యుతవల్లికి రాసిన ఉత్తరంలో చెప్తాడు.ఆయన లేఖల్లో ఎన్నో సాహిత్యాంశాలు ఇమిడి ఉన్నాయి.
రచనా పద్ధతిని వివరిస్తూ ఆషా కు రాసిన లేఖలో ” సుందరమైన భావావళి లేని సుందరమైన భావావళి పాఠకుని హృదయంపై అంతగా ముద్రవేయజాలదు. కానీ ఇందుకు వ్యతిరేకంగా సుందరమైన పదావళి లేని సుందరమైన భావావళి పాఠకునిపై మంచి ప్రభావాన్ని వేస్తుంది” అంటూ భావ ప్రాధాన్యాన్ని తెలిపాడు.
ఆషా కు రాసిన ఇంకో ఉత్తరం లో గద్య, పద్య,సంగీత భేదాల్ని తెలియజేస్తూ మూడింటి ప్రాధాన్యాన్ని తెలియజేశాడు.” గద్యం అనేది ఆలోచన.పద్యం అనేది వేదన.సంగీతం అనేది సంవేదన.గద్యం అభివ్యక్తపర్చజాలని దాన్ని పద్యం అభివ్యక్తపరుస్తుంది.పద్యం అభివ్యక్తపర్చలేని దాన్ని సంగీతం అభివ్యక్తపరుస్తుంది.గద్యం భోగట్టానిస్తుంది.పద్యం ప్రేరణనిస్తుంది. సంగీతం తన్మయతనిస్తుంది.అర్థాలు గల శబ్దాలు గద్యాన్ని నిర్మిస్తవి,శబ్దాలు లేని నాదం సంగీతాన్ని స్పృశిస్తుంది.గద్యం అనేది భూమి.పద్యం అనేది ఆకాశం,సంగీతం అనేది ఇంద్రధనుస్సు!” ఈ మూడు కూడా సమాన ప్రాముఖ్యం గలవే అంటాడు.
బి.మోహనరావుకు వ్రాసిన లేఖలో ఆధునిక సాహిత్యాన్ని నిర్వచిస్తూ రోమాంటిక్ భావాన్ని అభివ్యక్తి చేయజాలదని ఆధునిక సాహిత్యాన్ని ఎవరూ నిందించరాదంటూ,జీవితంలో అన్నీ సౌకర్యాలనుపయోగించుకున్నప్పుడు ” ఆధునికజీవితానికి ‘ ఎగ్జిస్టెన్సియనిస్టు’ తత్వానికి,అచేతనకు సంబంధించిన ఆధునిక మనోవిజ్ఞానానికి ప్రతిబింబమే ఆధునిక సాహిత్యం” అని వివరిస్తాడు.మన అనుభవాన్ని,వాస్తవికతను వ్యక్తం చేయాలి.జీవితానికి,సాహిత్యానికి సంబంధం ఉండాలి.కల్పనకు తావివ్వరాదు వాస్తవిక దృక్పథం ఉండాలి.ఆధునిక సాహిత్యాన్ని ఆనందించండం అంటే ప్రాచీన సాహిత్యాన్ని నిరసించడం కాదని,నవీనాన్ని ప్రేమిస్తూ ప్రాచీనాన్నికూడా గౌరవించాలని,ప్రాచీనం నుండే నవీనం ఉద్భవిస్తుందని,వర్తమానానికి భూతకాలం మాతృక అయితే భవిష్యత్తుకు వర్తమానం మాతృక అంటాడు.
రాధాకృష్ణ(శ్రీ రమణ) కు రాసిన ఉత్తరంలో ” సాహిత్యంలో అనుభూతి మాత్రమే వుంటే చాలదు.ఆలోచన మాత్రమే వున్నా చాలదు.రెండూ వున్నపుడే అది సమగ్రం.మేధకూ, హృదయానికీ కూడా పని కలగాలి”. అని సాహిత్యం అంటే హితాన్ని ఉపదేశించాలి, రసానందం కలిగించాలి,ఆలోచింపజేసేదిగా ఉండాలి.ప్రాచీనులు చెప్పిన కావ్యప్రయోజనం,ఉపదేశం,ఆనందం అన్న అభిప్రాయానికి దగ్గర వాడుగా కనిపిస్తాడు సంజీవదేవ్.
భారతదేశం కాని విదేశీ సాహిత్యం కాని ఒక ప్రాంతంలోనిది మరో ప్రాంతంలో వినిమయం జరిగితేనే ప్రపంచ ప్రజల్లో నిజమైన సౌభ్రాతృత్వం జనిస్తుందని ఆశించాడు.
అనాలోచితంగా చేసే పనిలో పరిపూర్ణత ఉండదని,ఏ కళైనా ముందు ఆలోచన సృష్టించిన తర్వాతే కల్పన ఉంటుందని,కల్పన లేని కళ వుండదని అంటాడు.
తన రచనాశైలిని వివరిస్తూ ఒక లేఖలో ” ఒక్కోసారి తార్కిక స్రవంతిలో పడి మొదటి వాక్యంలో అర్థమైన విషయాన్నే సాగదీసి,అరగదీసి,ఈకకు ఈకా,తోకకు తోకా విడగొట్టి అతిగా విశదీకరించటం నా వ్రాతల్లో అప్పుడప్పుడు జరుగుతుంటుంది.ఇందు మూలాన ఎదుటి వాళ్ళను మరీ పిల్లల్ని చేసి చెపుతున్నారు అనే అపోహకు తావున్నది.ఇక కొందరు విద్యావంతులున్నారు.వారు నా యీ విశదీకరణ శైలిని ప్రశంశిస్తారు.అతార్కిక వాక్య నిర్మాణం,పునరుక్తి వివరణ,చాలా ఎన్నదగిన ప్రత్యేకత అని అంటారు.” అంటూ కృష్ణాబాయికి రాసిన లేఖలో ఆత్మ విమర్శ చేసుకున్నాడు.
ఇతర కవులపై సంజీవదేవ్ అభిప్రాయాలు
గోపీచంద్ గురించి రాస్తూ "ఆయన రచించిన కల్పనా సాహిత్యంలో హృదయంలోని రసానుభూతికంటే మేధలోని ఆలోచనలకే ఎక్కువ తావు ఆయనదంతా అనవచ్చు." అని అంటాడు.
రంథి సోమరాజుకు రాసిన లేఖలో ఆయన రచించిన ‘రతనాల తండ్రి’ రచనపై సంజీవదేవ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ” మీ పదాల ధ్వని,అందులోని భావలావణ్యమూ నన్నెంతో మెప్పించింది.కథా వస్తువుతో పని లేకుండానే కేవలం శబ్దం,భావం నాకెంతో రసాన్ని ప్రసాదించింది.” అని వివరించాడు.
రంథి సోమరాజు రాసిన ‘ ఈ మనిషి ఈ లోకం’ కథపై కూడా తన అభిప్రాయాన్ని లేఖద్వారా వ్యక్తపరిచాడు.” ఎలా వ్రాస్తారండి మీరు అలాంటి హృదయాన్ని ప్రకంపనపరచే కథల్ని? మీ పాత్రలు అమృత పాత్రలు.సిరాతో కాక హృదయంలోకి రక్తాన్ని బయటకి కార్చి అందులో పాళీ అద్ది వ్రాస్తారా మీ కథల్ని.” అని ఇది పొగడ్త అవుతుందేమోనని భయపడుతూ వ్రాశానంటారు.భావాల తగ్గట్టు ఆత్మీయంగా వుంటుందంటాడు.
సంజీవదేవ్ రస హృదయం స్పందించే తీరు తెలుస్తుంది.
అచ్యుతవల్లి రచించిన కథపై అభిప్రాయాన్ని తెలుపుతూ సంభాషణలూ, సంఘటనలూ చిత్రంగా ఉందని అంటూనే కొన్ని సలహాలు ఇచ్చాడు ” మీరు ఇతర్ల ప్రఖ్యాత కథలు బాగా చదవాలి.మానవుల నిత్య జీవితాల్లో ప్రతి స్వల్ప విషయాన్ని ,అతి ప్రాముఖ్య సంఘటననూ నిశితంగా స్టడీ చేయాలి.ఓపికతో మానవ స్వభావాలను అవగాహన చేసుకోవాలి. వాస్తవ వాదాల్ని, కల్పనా వాదాన్ని సమ్మిశ్రమం చేసి నూతన కళాసృష్టిని చేసి చూపాలి”.అని సూచించాడు. కథా రచయిత చక్కని కథను ఆవిష్కరించాలంటే రచయిత సామాజిక జ్ఞానం,లోకాన్ని చదవడం,ఇతర రచనలు చదవడం ఎంత ముఖ్యమో అప్పటివారికే కాదు ఏ కాలంలో రచయితలకు కూడా వర్తించే తీరులో చక్కని,చిక్కని సలహాలనిస్తూ సూచన చేశాడు.
ఇంకో ఉత్తరంలో అచ్యుతవల్లి రచించిన’వర్షం వచ్చినరోజు’ కథానికపై అభిప్రాయాన్ని తెలుపుతూ సంఘంలోని రెండు వ్యక్తుల మనస్తత్వాలను చక్కగా చిత్రించారని,ఏది లభిస్తే సుఖపడాలని అందరూ కోరుకుంటారో అది లభించినా సుఖపడరు’. అంటూ “ఉన్న హంసతో అసంతృప్తి,లేని కొంగ కోసం ఆరాటం మీ కథలో చక్కని మనస్తత్వాలను చిక్కని జీవన సత్యాలను పుష్పింపజేశారు.” అని రాశాడు. ఇంత చక్కని కథ దక్షిణ,ఉత్తరాది భాషల్లో తర్జుమాజరగడం మంచిది అంటాడు.ఉత్తమ విమర్శకుని లక్షణం సంజీవదేవ్ లో కనపడుతుంది.ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పడం సంజీవదేవ్ కే చెల్లిందని అనుకోవచ్చు.
ప్రముఖ చిత్రకారుడు డా.ఎస్. వి.రామారావుకు రాసిన ఉత్తరంలో “విఫలప్రేమ,భగ్నహృదయం,ఎండిన నది,మరణిస్తున్న మనిషి మొదలైనవే కవులకూ, కళాకారులకూ కూడా రసమయ వస్తువులు.” అంటూ వివరించాడు.కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అన్నట్లు జీవితంలో ప్రకృతిలో కరిగిపోయినవి,ఎగిరిపోయినవే కళాకారులకు వస్తువులుగా పనికి వస్తాయి.
డి.రామలింగంకు రాసిన లేఖలో ఇప్పుడిప్పుడు వ్రాసిన ఆంగ్లకవితలు పత్రికలో ప్రకటించిన వాటిని కలిపి ‘Echos of Silence’ అనే పేరుతో పుస్తకరూపంలో అచ్చు వేయాలన్న ఆసక్తిని కనబరుస్తూ తన ‘రసరేఖలు’అన్న గ్రంథాన్ని అకాడమీ దృష్టికి తేవాలన్న రామలింగం సూచనకు సంజీవదేవ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ అకాడమీల పరిస్థితిని వివరించాడు.”అభిమానాలకూ,
కులతత్వాలకూ,అయోగ్యతలకు విలువివ్వడానికి చాలా ఖ్యాతి చెంది వున్నాయి అకాడమీలు .” అంటూ అకాడమీల అస్తవ్యస్థను,సమాజంలో అకాడమీలు ఎవరిని గౌరవిస్తాయో, ఎంత రాజకీయం నడుస్తుందో,అయోగ్యులకు మాత్రమే అకాడమీలు విలువనిస్తాయని ఉన్న వాస్తవాన్ని,నాటి సమాజ పరిస్థితిని వివరించాడు.నేటిదాకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు.
సామాజిక స్వేచ్ఛ కావాలంటాడు.”స్వేచ్చలేని నాగరికత నాగరికతే కాదు.”అంటూనే మానవునికి కీర్తి మీద కాంక్ష ఎక్కువ.కీర్తిపై కాంక్ష లేకుంటే ఏ కార్యాన్నైనా సాధించడానికి సాహసంచేసే వాడు కాడు “దేశంలోని కళలూ, విజ్ఞాన శాస్త్రాలూ, సుజ్ఞాన సాధనలూ అన్నీ కూడ నిద్రాణమైయే వుండేవి.”అని వక్కాణిస్తాడు.కార్యసాధకునికి కీర్తి కాంక్ష ఉంటేనే విజయం తప్పక లభిస్తుంది.
రచనపై అభిప్రాయానికి కొలబద్ద ఏమిటో చక్కగా చెప్తూ “ఒకరి రచన మంచిది అనీ చెడుది అని విలువకట్టడానికి ఆ చదివే వ్యక్తి యొక్క అర్హత మీద కూడా ఆధారపడి ఉంటుంది.” అంటూ రామబ్రహ్మంకు రాసిన ఉత్తరంలో వివరిస్తాడు.
నిజమే కదా మరి. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి ఆలోచనా రీతులను బట్టి ఒకరి రచనను గ్రహించడంలో,అర్థం చేసుకోవడంలో,ఆస్వాదించడంలో మార్పులు వస్తుంటాయి.విమర్శలో కూడా అంతే.వారి వారి స్థాయిని బట్టి,వారి వారి సామర్థ్యం బట్టి ఆలోచనాతీరులను బట్టి తేడాలుంటాయి.
అరుణకు రాసిన ఉత్తరంలో ఆధునిక విద్యా విధానాన్ని విశ్లేషిస్తూ మాతృభాషలో బోధన ఉంటే బాగుంటుంది.ఇంగ్లీషును అంతర్జాతీయ,అంతర్ రాష్ట్రీయ భాషగా వాడుకొని మాతృభాషపై ఉన్న అభిమానం కొద్ది ఇంగ్లీష్ భాషపై విరోధంగా మారకూడదన్న భావాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మాటల్లో” మానవుని మానవీయ గుణాలను వికసింప చేయటంలో తోడ్పడే విద్య ఆదర్శమైన విద్య.జీవితపు శారీరక,మానసిక,భౌతిక,రసాత్మక,,ఆత్మికశక్తులను వికసింప చేస్తుంది సరైన విద్య.విద్యార్థులకు విజ్ఞానమూ, వినోదమూ కూడా ఇచ్చేదిగా ఉండాలి” ఇలా విద్య అంటే ఏమిటో నిర్వచించాడు.
” విద్య అనేది మెదడుకూ,సంస్కృతి అనేది హృదయానికీ చెంది ఉన్నట్లు కనిపిస్తుంది.మెదడులోని హేతువు,హృదయంలోని విశ్వాసం మానవుణ్ణి ప్రకాశవంతంగా మధురంగా మారుస్తవి.” అంటూ బి.మోహనరావుకు రాసిన ఉత్తరంలో వివరిస్తాడు.విద్య పుష్పం అయితే,సంస్కృతి సువాసన, వాసన లేని పుష్పానికి ఎక్కువ విలువ లేనట్లే సంస్కృతి,సంస్కారం లేని విద్య నిరర్థకం కదా.
చిత్రకళపట్ల ఆసక్తి ఎక్కువ సంజీవదేవ్ కు.సాహిత్యం కంటే కూడా చిత్రరచనపట్ల ఎక్కువ ప్రేమని చూపించేవాడు.ముందు ఆలోచన,తర్వాత కళావిష్కరణ,సాహిత్య, సంగీత,నాట్య,చిత్రకళలపై ఎన్నో ఉపన్యాసాలిచ్చి అందరి మన్ననలను పొందాడు.” రంగుల్లో సృష్టించి చిత్రాన్ని నిర్మాణం చేయడం,పదాల్లో సృష్టించి కవితను తయారుచేయడం- Technique లో భేదించినా మూలంలో ఒకటే.హృదయంలో దాగివున్న రసానుభూతికి ఒక బాహ్యరూపానివ్వటం మాత్రమే”. అని అంటాడు. జీవిని దుఃఖంనుండి ఆనందం వైపుకు త్రిప్పలేని కళ కేవలం కల మాత్రమే నంటూ ” ఆధునిక చిత్రకళలో అర్థాలకోసం వెదకటం అనర్థం” అంటూనే చిత్రకళను ప్రోత్సహించరు,ఆదరించరనే ఆవేదనను వ్యక్తం చేస్తూ” లక్ష రూపాయలతో ఇల్లు కట్టి ఇరువైవేల రూపాయల ఫర్నీచర్ కొని,ఒక వేయిరూపాయల మౌలిక చిత్రాన్ని అందులో ఉంచటానికి కొనరు ఏమిటో ఈ మనస్తత్వాలు”. చిత్రకళను ఉద్ధరించరనే ఆవేదననను డి.రామలింగంకు రాసిన లేఖలో తన బాధను బహిర్గతం చేశాడు.
” పరీక్షలు తెలివిని కొలిచే యంత్రం కాదు అవి తెలివితక్కువను కొలిచే యంత్రం”. అంటూ పరీక్షావిధానాన్ని విమర్శించాడు.
వివాహ వ్యవస్ధ గురించి చెప్తూ అంతర్వర్ణ,అంతర్ ప్రాంతీయ,వివాహాల్లో విచిత్రం లేదు.ఈనాటి కాలంలో అవి మామూలే.సంస్కరణ అంటే స్త్రీ,పురుషులకు మధ్య వివాహం చేయడం కాదు.స్త్రీ స్త్రీ యే,పురుషుణ్ణి పురుషుడే వివాహమాడితే అది సంస్కార వివాహం అంటాడు.
సంజీవదేవ్ రాజకీయ ఉపన్యాసాలపట్ల విముఖతభావం కలిగినవాడు.కూలియిచ్చి వినమని చెప్తే కూడా”ఆ కూలి తీసుకుని వినటం ఎగేసివద్దాం అనిపిస్తుంది.” అని కూచోని వినకపోవడం ఇటువంటి స్థితి నేటి కాలంలో కూడా గమనిస్తున్నాం.జనాన్ని పోగుచేయడానికి, సేకరించడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో,ఎన్ని తాయిలాలు పెడుతున్నారో ప్రత్యక్ష అనుభవమే. నాడైనా, నేడైనా,ఏనాడైనా మారని దుస్థితి,దుసంస్కృతి.
,జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ” యోగ్యమిత్రులను పొందటం” అంటూ మిత్రత్వాన్ని నెరపడంలో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
వేదాంత,తాత్విక విషయాలను లేఖల్లో వ్యక్తం చేశాడు.కోరికలను జయిస్తే సుఖశాంతులు అంటాడు.” దుఃఖాన్నించి ఆనందాన్ని సృష్టించుకోవడమే ‘ఆధ్యాత్మిక సాధన’ అని బుచ్చిబాబుకు రాసిన ఉత్తరంలోను,చెల్లి భారతీదేవికి రాసిన ఉత్తరంలోను ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
” సాధకులు ఇంద్రియగ్రాహ్యజగత్తును గాక అతీంద్రియ సత్యాన్ని ధ్యాన సాధన ద్వారా అందుకొని దానితో ఏకత్వం చెందటం మిస్టిజం; ఒక అర్థంలో మిస్టిజం అంటే భక్తి యోగం అనే అర్థమే”. అని లక్ష్మికి రాసిన ఉత్తరంలో విపులీకరిస్తాడు.
సంజీవదేవ్ లేఖలో వ్యక్తిగత విషయాలు,ఆధ్యాత్మిక విషయాలే కాక సాహిత్య, సామాజిక ,చిత్రకళకు సంబంధించిన విషయాలు తెలుపుతూనే లేఖలు వ్రాయడంలో,లేఖలు అందుకోవడంలో తృప్తి ఉంటుందని చెప్తాడు.జీవితంలో ఆనందాన్ని అనుభవించడం రసానందాన్ని పొందడమే పరమార్థం అని పెక్కుచోట్ల వక్కాణించిన కళాతపస్వి సంజీవదేవ్.
సంజీవదేవ్ ఒక్కో లేఖ ఒక సుదీర్ఘమైన వ్యాసంలా ఉంటుంది.ఏదన్నా ఒక విషయాన్ని తీసుకుని దాన్ని విపులీకరించడం ఈయన లేఖల్లో కన్పించే ప్రత్యేక లక్షణం.ఆయన లేఖలలోని వేదాంత, తాత్విక,సాహిత్య,సాంఘిక విషయాలు పాఠకులలో ఎంతో జిజ్ఞాసను రేకెత్తించేవిగా ఉంటాయి.
లేఖలలో ఎన్నో రకాల విషయాలను స్పృశించడంబట్టి ఆయన రాసిన వ్యాసాలను బట్టి సంజీవదేవ్ కు జీవితంపట్ల గల అవగాహన, విషయ పరిజ్ఞానం తెలుస్తాయి.ఆయన లేఖలద్వారా ఆయన గొప్ప వక్త అనీ,పాఠకులకు ఏదేని ఒక సందేశం ఇవ్వాలనే ఆరాటం మనకు ఆయన రాసిన ప్రతీ లేఖలోను కనిపిస్తుంది.
జీవన రేఖ
సంజీవదేవ్ ఇంటిపేరు సూర్యదేవర.గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి గ్రామంలో జులై 3 వతేదీ 1914వ సంత్సరంలో జమీందారీ కుటుంబంలో పుట్టాడు వెంకాయమ్మ ,రామదేవరాయలు తల్లిదండ్రులు.హోదా ఉన్నప్పటికీ సామాన్యుడిలా జీవించడమంటే ఇష్టం చిన్నప్పటినుండి సంజీవదేవ్ కు. చిన్నతనంలోనే తల్లిలేని పిల్లవాడయ్యాడు. అమ్మమ్మ వాళ్ళింట్లో,పెదనాన్న వాళ్ళింట్లో పెరిగి ఇంట్లోనే చదువుకున్నాడు.పెద్దగా చదువుకోలేదు కానీ హిమాలయాలపట్ల ఉన్న ఇష్టంతో ఇంట్లో చెప్పకుండా తన 26 వ ఏట హిమాలయాలకు వెళ్లడం అక్కడ కొంతకాలం ఉండడం, ఉత్తర భారతదేశాన్ని చుట్టుముట్టడం,ప్రకృతిని ఆస్వాదించడం,చిత్రాలు వేయడం జరిగింది.30 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో జ్ఞానం సంపాదించాడు.
బెంగాల్,ప్రెంచి,జపానిస్,ఉర్దూ,హిందీ భాషలు నేర్చుకోవడమే కాక ఎస్పరాంటో అనే అంర్జాతీయ భాషను కూడా నేర్చాడు.కాళిదాసు రచనలను,జయదేవుని గీతగోవిందాన్ని చదివాడు బెంగాలీ సాహిత్యాన్ని చదివాడు.లక్నోలో హసిత్ కుమార్ హల్దార్ దగ్గర చిత్రలేఖనం నేర్చుకోవడమే కాక నోబుల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథుణ్ణి చూసే అదృష్టం కలిగింది.చిత్రకళపై పట్టు సాధించాడు.రవీంద్రునితో బెంగాలీ భాషలో మాట్లాడమే కాక రవీంద్రుని రెండు రచనలను చదివి వినిపించి ముగ్దుణ్ణి చేశాడు.”కవిగానే కాదు మనిషిగా జీవించాలన్న” రవీంద్రుని మాటలు సంజీవదేవ్ హృదయాన్ని తాకాయి.
1954 సంవత్సరంలో సులోచానదేవితో వివాహం జరిగింది.ఇద్దరు కొడుకులు పుట్టారు.చదివింది 8 వ తరగతే అయినప్పటికీ 14 భాషల్లో రాయడం,చదవడం వచ్చు. ప్రతిసంవత్సరం సంక్రాంతికి తుమ్మపూడి వాళ్ళింట్లోనే కవిసమ్మేళనాలు జరుపుతుండేవాడు. నార్ల వెంకటేశ్వరరావు,త్రిపురనేని గోపిచంద్,నాగభైరవ కోటేశ్వరరావు లాంటి గొప్పగొప్ప కవులు సైతం కవిసమ్మేళనానికి హాజరయ్యేవారు.
విద్యార్థి పత్రికలో 1963 సం. లో ఒక వ్యాసం రాస్తూ మనిషి కనకం, కాంతం,పదవి,సుఖం అన్నిటినీ వదిలేస్తాడు కానీ కీర్తి కాంక్షను వదిలివెయ్యడు అని అంటాడు.ఇలా గొప్ప చిత్రకారుడు,వ్యాసకర్త అయిన సంజీవదేవ్ ఎన్నో గ్రంథాలు రాశాడు.
ఈయన చేసిన సేవను గుర్తించి1980 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ,కళాప్రపూర్ణ పురస్కారం ఇచ్చి గౌరవించారు.1995 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్. టి.రామారావు చేతుల మీదుగా హంస పురస్కారాన్ని పొందారు.
దేశ విదేశాల కవులు,చిత్రకారులతో సంబంధాలుండేవి.తుమ్మపూడికి సంజీవదేవ్ ను కలవడానికి ఆయన ఇంటికి వచ్చేవారు.
బుచ్చిబాబు,దేవులపల్లి కృష్ణశాస్త్రి ,రవీంద్రునితో సంబంధాలుండేవి.
మిత్రులకు ఉత్తరాలు రాసేవాడు. అమెరికాలో
స్థిరపడ్డ ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి రామారావు తో ఉత్తరాలు నడిచేవి.
ఎంతో పేరుప్రఖ్యాతులు గడించిన ప్రముఖ చిత్రకారుడు,సాహిత్య వేత్త, ఆధ్యాత్మిక వేత్త,తాత్వికుడు అయిన సూర్యదేవర సంజీవదేవ్ ఆగస్టు 25 వ తేదీ 1999 వ సంవత్సరంలో తన జన్మభూమి తుమ్మపూడిలో తుదిశ్వాస విడిచినప్పటికీ ఆయన పంచిన జ్ఞానం గ్రంథాలరూపంలో మనకు అందుతూనే ఉన్నాయి.
3 comments
అనితరసాధ్యుడు శ్రీ సూర్యదేవర సంజీవదేవ్ గారు. అనుక్షణికం నవలలో వీరి గురించి చాలా విలువైన మంచి ప్రస్తావన ఉంది. చాలా మంచి విషయం మీద పరిశోధన చేసిన శ్రీమతి చీదెళ్ళ సీతాదేవి గారిని అభినందిస్తున్నాను.
కవయిత్రి డా.సీతాలక్ష్మి గారు చాలా చక్కటి విశ్లేషణ చేసారు. వారికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను.
మేడం గారికి ఆత్మీయ అభినందనలు.. 🙏చక్కని విషయాలపై పరిశోధన చేశారు.. మాలాంటి వారికి ఇలాంటి వ్యాసాలు ఎంతో ఉపయోగకరం. 👍🏾👌