1. జీడిగింజ-ప్రాముఖ్యం
గ్రామీణుల జీవితంలో ప్రాధాన్యత కలిగిన అనేక వస్తువుల్లో జీడిగింజ ఒకటి. జీడిగింజ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది దాని ‘నలుపురంగు‘. అందుకే అది ‘నల్లజీడి‘గా ప్రసిద్ధి పొందింది. వంటల్లో ఉపయోగించే దాన్ని తెల్లజీడి, కొండజీడి, కాజు అని అంటారు. అన్నిపళ్లలో (ఫ్రూట్స్)లో గింజ ఉంటుంది. కాని జీడిగింజ పండుకు వెలుపల ఉంటుంది. ఈ విధంగా దీనికి రంగులోనే కాకుండా స్వరూపంలోనూ ఓ వైశిష్ట్యం ఉంది. నల్లజీడిగింజ ఆంగ్ల నామం మార్కింగ్ నట్, ట్రేసింగ్ నట్.
2. భారతీయ భాషల్లో నల్లజీడిగింజ పేర్లు
కన్నడం : అగ్నిముఖి, భల్లాతక, చేర, గెర్కాయి, కేరుబీజ.
తమిళం : కెల్కొట్టాయి, అరుత్కర్మ్, కెరాన్ కొట్టాయి, ఎరిమముఖి, పెంగొట్టాయి, సెరావొట్టాయి.
తెలుగు : జీడి, తుమ్మెద మామిడి, నల్ల జీడి, భల్లాతక, గుడోవా,
మరాఠీ : బిబ్బ, బిభ, బిబో, బిబ్బా,
మళయాళం : అలక్కుచేరు, కేరు, కెర్కోట్ట, షెగ్గొట్ట, తెల్కొట్ట.
హిందీ: ఖిలావా, బేలతక్, భేలా,
3. వివిధ గ్రంథాల్లో జీడి పేర్లు, గుణాలు
3.1 జీడిపేర్లు: సర్వమూలికా గుణరత్నాకరమ్ (పుట. 104) లో నల్లజీడి (భల్లాతక)కి ఉన్న పర్యాయపదాలు, దాని రుచులు, లక్షణాలు, మొదలైనవాటిని సంస్కృత శ్లోకాల్లో ఇచ్చారు. వాటి చీకను కింద తెలపడమైంది. భల్లాతకః, నభోభల్లీ, రవృక్షః, అగ్ని వక్రకః, అరుష్కర, రూక్ష్మ, తపనః, అగ్నిముఖీ, ధను
3.2. జీడిగుణాలు: జీడిపండు వగరుగా, మధురంగా ఉంటుంది. కొంచెం కాక (వేడి) చేస్తుంది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. వాతం, శ్లేష్మం, ఉదరరోగం, అనాహం, కుష్టువు, అర్మరోగం, గ్రహణి, గుల్మం, జ్వరం, శ్విత, అగ్నిమాంద్యం, క్రిమిజ్వరాలను పోగొడుతుంది, కఫరోగం, బడలిక, వాపు, కడుపుబ్బరం, మలబద్ధకం, శూల, ఆధ్యానం, కృమలను పోగొట్టుతుంది. దాని మజ్జ అతితాపం, పిత్తం, వాతం, అరుచిని హరిస్తుంది. అంతేకాక శీఘ్రంగా పిత్తరోగాన్ని నిర్మూలిస్తుంది. ఈ అంశాలను ‘వస్తుగుణ దీపిక’లో కూడా చెప్పారు.
4. జానపదులు – జ్ఞానపదులు – వినూత్న ప్రయోగశీలురు
చెట్లకు, తాటిచెట్లకు చీమలు పట్టుకుండా జీడి పూస్తారు, కాళ్ళ పగుళ్ళకు, మడమ శూలకు, గుర్రం మూతులకు కూడా జీడిని పెడతారు. అంతేకాక జీడిని నూనెలో కాగబెట్టి, తలకు పెట్టుకుంటారు. వీటితోపాటు గంపలు, గుల్లలు, చేటలు, జల్లెడలకు, కుండలకు కూడా పూస్తారు. అయితే ఈ విషయాలను వైద్య గ్రంథాల్లో ఎక్కడా తెలపలేదు. జానపదులు వైద్య గ్రంథాలను చదవకపోయినా జీడిగింజను నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా మనుషులకు, పశువులకు వాడుకుంటున్నారు. గింజలనుండి చమురు తీసి, చమురు తీయకుండా ఆచారవ్యహారాల్లో, అటు జానపద వైద్యంలో, ఇటు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ‘జానపదులు జ్ఞానపదులనీ, ప్రాయోగశీలురనీ, వినూత్న శాస్త్రీయ ఆవిష్కరణల కర్తలనీ, వారు జీడిగింజలను ఉపయోగించుకునే తీరును బట్టి చెప్పవచ్చు. నిరూపించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం-
4.1. ఆచారవ్యవహారాల్లో, శుభకార్యాల్లో జీడిగింజు: 4.1.1 హిందువుల వివాహ సమయంలో కుమ్మరింటి నుండి ‘అరివేణి కుండలు’ను ఇంటికి తీసుకురావడం అందరికీ తెలిసిన విషయమే. కొందరి ఇండ్లల్లో వారి ఆనవాయితీ ప్రకారం ఆ కుండలను ఇంటిలో దించిన తర్వాత, వాటిలో ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో నైవేద్యం (అన్నం) సమర్పిస్తారు. ఎరుపుకోసం కుంకుమను కానీ, సున్నం, పసుపులు మిశ్రవాన్నిగానీ వాడ్తారు. అలాగే నలుపుకు బొగ్గును దంచి, ఆ పొడినిగానీ, మసినిగానీ వాడుతారు. ఆ నైవేద్యంపై నుండి, అరివేణులపై నుండి ‘సూదికి గుచ్చిన జీడిగింజ’ను మూడుసార్లు తిప్పి, ఆ నైవేద్యం పైన పెడ్తారు.
4,1,2. సంక్రాంతి సమయంలో పిల్లల తలపై పోసే భోగిపండ్లలో జీడి(గింజ) పండ్లను కూడా కలుపుతారు. ఇల్లు అనగానే ఇంటికి ఓ భౌతికస్వరూపం, ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు (గృహిణి), పిల్లలు, పెద్దలు, గొడ్డుగోదలు (పశుసంపద), వాటి పిల్లాజెల్లా మొదలైనవి గుర్తుకు వస్తాయి. వీటికి జీడిగింజకు ఉన్న సంబంధం కూడా తెలుసుకుందాం. 4.2. గృహిణులకు నిత్యావసర (ఔపయోగిక) వస్తువు: 1, పప్పులకు, పొడులకు క్రిమిసంహారక పదార్థం (మందు), 2. వస్తువుల మన్నికకు, దృఢత్వానికి ఉపయోగపడే రసాయనం, 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసు.
4.2.1. క్రిమిసంహారక పదార్థం: దీర్ఘకాలం నిలవ ఉండే పప్పులు, మిరపపొడి, దనియాలపొడి, పసుపు పొడి, మొదలయిన వాటిలో జీడిగింజలను వేసిపెట్టడంవల్ల పురుగు పట్టదు. గింజ ఘాటువల్ల ఆ పొడుల్లో తెల్లపురుగు వంటి క్రిమికీటకాదులు చేరవు, పొడులు చాలాకాలం నిలువ ఉంటాయి.
4.2.2. వస్తువులకు మన్నిక: జీడినూనెను (చమురును, రసాన్ని, తైలాన్ని) చేటలు, జల్లెడలు, గుల్లలు, కుండలు, మొదలైన వాటికి దట్టగా పట్టించడం వల్ల అవి సుదీర్ఘకాలం మన్నికతో ఉంటాయి. అవి జీడినూనెతో గట్టిపడతాయి, కిందపడ్డా విరిగిపోవు. వాటి పేడు (చెక్క బడ్డ)కు కూడా పురుగు పట్టదు.
మామిడికాయ వంటి నిలవపచ్చళ్ళకు ‘జీడిపోత పోసిన కుండలు’ను ఉపయోగిస్తారు. అవి నేటి జాడీలలాగ పనిచేస్తాయి. పూర్వకాలంలో జీడిపోత పోసిన (పూత పూసిన కుండల్లోనే పచ్చడి పెట్టుకొన్నారు. అందులోనే నిలవ చేసుకున్నారు. అందుకోసం జీడగింజలతో ‘బట్టీ’ పెట్టి, వాటినుండి చమురును తీశారు. దాన్ని దట్టంగా కుండలలోపల పట్టించారు. అది ఆరిన తర్వాత అందులో పచ్చడిని నింపారు. జీడిగింజ చమురువల్ల కుండగోడలు గట్టిపడతాయి, అంతేకాక, కుండలను ఉప్పుకారం పచ్చడికుండ ‘మట్టి’ పచ్చడిలోకి రాలదు.
4. 3. ఆయురారోగ్యాలను కలిగించే మందు దినుసుః గృహవైద్యంలో జీడిగింజను మించిన మరో వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని అంటువ్యాధులు, దగ్గులు, చర్మవ్యాధులు, నొప్పులు, చుండ్రు, మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
ఇంట్లో శిశువులు, పిల్లలు అకారణంగా గుక్కపట్టి (నిర్విరామంగా) ఏడుస్తుంటారు. వారి ‘ఏద్పు’కు దృష్టిదోషం (దిష్టి) కారణం అనుకుంటారు. మాటలు 204 వచ్చిన పిల్లలైతే, కడుపు పట్టుకొని, కడుపు నొస్తుందని ఏడుస్తారు. వారి కడుపు మీద వేలుతో కొట్టి చూస్తారు. కడుపు ఉబ్బరంగా ఉండి, ‘టక్ టక్’ అని శబ్దం వస్తే, ‘సరదృష్టి – దిష్టి’ కారణం అనుకుంటారు. అప్పుడు డబ్బడం లేదా ఒక ఇనుప చువ్వకు జీడిగింజను గుచ్చి, దానికి అగ్గిని అంటిస్తారు. దానిని ఎడమచేతిలో పట్టుకొని, పిల్లల మీదినుండి తల చుట్టూ వలయాకారంగా తిప్పి, ఆ తర్వాత ముఖం మీది నుండి కిందికి ‘దిగతుడుస్తారు. ఆ జీడిగింజ చిటపటలాడుతూ, పల్చటి చమురు (రసం) కారిస్తే దృష్టిదోషం (దిష్టి/ జిష్టి) తగిలిందనీ, చిటపటలాడకుండా చిక్కటి రసాన్ని కారిస్తే, దృష్టిదోషం తగల్లేదని భావస్తారు. రోగం పోవాలని భావించినపుడు, దేనినైనా తిప్పి తీయదల్చుకున్నప్పుడు, వ్యక్తులకు పైనుండి కిందికి దిగతుడవాలి. అంటే చేతిని పైనుంచి కిందికి తేవాలి. అలా గాకుండా చేతిని కిందినుండి పైకి ఎగతుడిస్తే, రోగమైనా, జిష్టి అయినా ఎక్కువవుతుందని
కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు చిన్నా పెద్దా భేదం లేకుండా ఈ జీడిగింజ చమురును పాదం మధ్యలో (అరికాలులో పెట్టుకుంటారు. పిల్లలకు, పెద్దలకు రకరకాల దగ్గులు వచ్చినప్పుడు, జీడిగింజను కచ్చె పిచ్చె మెత్తగా కాకుండా, కసపిస గా దంచి, పాలల్లో వేసి, మరిగించి, వడబోసి, బాధితులకు తాగిస్తారు.
స్త్రీలు నిరంతరం నీళ్ళల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చేతిగోళ్ల పక్కన, కాలివేళ్ళ మధ్య దురద, నొప్పి కలుగుతుంది. ఆ చిగురును సన్న సూదిమొనతో కొంచెం అటుఇటు అని (కెలగించి), ఆ సందుల్లో జీడిగింజ నూనె (రసం) పూయాలి. దానివల్ల నొప్పి, దురద (ఇన్ఫెక్షన్) తగ్గుతుంది. అంతేగాకుండా, కాలి మడమలు పగిలి, నెర్రెలు (వెడల్పుగా చీలడం) ఏర్పడతాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉ ంటుంది. అలాంటప్పుడు ఆ నెర్రెలకు జీడిపూస్తే, నొప్పులు తగ్గుతాయి, నెర్రెలు మానతాయి.
మడమనొప్పి లేచినా, మడమ వెనకాల ‘గుర్రం మూతులు’ వచ్చి, నొప్పి కలిగినా, జీడిగింజతో కాల్చాలి. గింజకు ఒకవైపు చిన్నరంధ్రం పెట్టి, మరోవైపు డబ్బడం గుచ్చి, దీపానికి (సెగకు) కాలిస్తే, అందులో నుండి జీడినూనె బయటకు వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు అలాగే కాలుకు పెట్టి నొక్కాలి. కొందరికి ఇది పడక వుండు కూడా అవుతుంది.ముల్లు గుచ్చుకొన్నచోట కూడా ఇలా చేస్తే, నొప్పితగ్గుతుంది.
పూర్వం తలకు మరిగించిన మంచినూనె వాడారు. ఆ నూనె మరుగుతున్నప్పుడు అందులో కొంచెం ఆముదం, సువాసనకోసం కచ్చూరాలు, తుంగగడ్డలు వేసేవారు. ఆ నూనెలోనే నల్లజీడిగింజలను కూడా వేసేవారు. అందులో వేయగానే అవి చిట్లి (పగిలి), అందులోని చమురు నూనెలోకి వచ్చేది, చల్లారిన తర్వాత దాన్ని వడగట్టి, తలకు రాసుకునేవారు.
4.4. దిష్టి తగలకుండా పశువులకు, వాహనాలకు జీడిగింజల దండలు: గ్రామాల్లో ఆవులు, బర్రెలు ఈనగానే (ప్రసవించగానే), వాటికి పెయ్యి కడిగి (స్నానం చేయించి), ‘జీడిగింజల దండ’ కడ్తారు. ఈనిన కొత్తలో దూడ చిన్నగా ఉండి, పాలు తక్కువగా తాగడం వల్ల పొదుగు బరువుగా ఉంటుంది. దూడ కూడా గంతులు వేస్తూ అందంగా, ఆనందదంగా ఎగురుతుంటుంది. వాటిని కొందరు ఈర్ష్యాసూయలతో చూస్తారని, వారి చూపువల్ల ఆ తల్లీపిల్లలకు దిష్టి తగుల్తందని భావిస్తారు. దిష్టి తగిలితే పాలు తగ్గుతాయి. పాడిపశువులు ఎండిపోకుండా ఉండాలని, నల్లదారానికి కుచ్చిన జీడిగింజలదండలను వాటి కాలుకుగానీ, మెడకుగానీ, రెండింటికిగానీ కడ్తారు. జీడిగింజల దండలు అంగడి (సంత) జరిగిన రోజు కొనుక్కోవచ్చు. ఆ దండల్లో జీడిగింజలతోపాటు గవ్వలు, పగడాలు (ఎర్ర పూసలు) కూడా ఉంటాయి. కొందరు ఆ దండలో నిమ్మకాయలు కూడా కలిపి కడ్తారు. అంతేగాకుండా వాటికి ఏమైనా జరిగినా, పాలు ఇవ్వక పోయినా, మేత మేయకపోయినా, పాలు ఇగిరిపోతున్నా, పెరుగు బంకలాగా సాగుతున్నా, వాటికి దిష్టి తగిలిందని, జీడిగింజులతోపాటు, మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వ్యానులు, లారీలు, మొదలైన వాహనాలు, ఎద్దుల బిళ్లు, వ్యాపార సంబంధ ఇతర వాహనాలకు కూడా దృష్టి తగలకుండా జీడిగింజల దండలను కడతారు.
4.5. జీడిగింజ (చమురు / నూనె) చెట్లు: తాటి చెట్లను ‘భూలోక కల్పవృక్షాలు’ అంటారు, తాటి ‘కల్లు’ను తాగడానికి గండుచీమలు బారు (వరసలు) కడ్తాయి, కల్లుగీత కార్మికుడు రోజుకు మూడుసార్లు కల్లు తేవడానికి చెట్టు ఎక్కవలసి ఉంటుంది. చెట్టుపైకి వెళ్తుంటే అవి కుడుతుంటాయి. వాటి బాధకు తాళలేక కిందికి దునికితే, కార్మికుని ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది, గాయాలవుతాయి. ఈ కారణంగా వాటి బాధ పోవడానికి, ఆ చెట్టుపైకి ఎక్కకుండా ఉండడానికి తాటి చెట్టు చుట్టూ జీడిచమురుతో వెడల్పుగా ‘జీడికట్టు’ పెడ్తారు. అంతేగాకుండా తాటికల్లుపై ‘నరదృష్టి’ పడకూడదని, కల్లు ఉత్పత్తి తగ్గ కూడదని, చెట్టు ఎండిపోకూడదని చెట్టుమొదలుకు జీడిగింజనూనెతో ‘జీడికట్టు’ను వలయాకారంగా పెడ్తారు. ఈ జీడికట్టునుండి వచ్చే ఘాటువల్ల గండుచీమలు కూడా కల్లుతాగడానికి చెట్టుపైకి ఎక్కవు.
4.6. బట్టలకు గుర్తులు పెట్టడానికి రజకులు వాడతారు: జీడిగింజను ‘మార్కింగ్ నట్, దోభీ నటి’ అని కూడా అంటారు. దీనికి ఈ పేరు వారివల్లనే వచ్చింది. అందరికన్నా రజకులు తెలివైనవారు అనే గుర్తింపు కూడా జీడిగింజ వల్లనే వచ్చిందంటే ఆశ్చర్యంలేదు.
| బట్టలు ఏ ఇంటివో తెలుసుకోవడానికి చుక్కలతో ఒక గుర్తును ఏర్పాటుచేసుకుంటారు. ఆ గుర్తులను ఆయా ఇంటివారి బట్టలపైన నల్ల జీడిగింజ చమురుతో పెడ్తారు. బట్టలు చిరిగిపోతాయి, కాని జీడిగింజ చమురు గుర్తులు పోవు.
జీడిచమురు పైన తెలంగాణలో ఒక ఉయ్యాలపాట కూడా ఉంది. ‘ఒక మరదలు (ఆడపడుచు) తన అన్నభార్య (వదిన) వద్ద పట్టుచీరను అడుక్కొని, కట్టుకొని, ‘బతుకమ్మ’ ఆడడానికి వెళ్తుంది. ఒక ఆకతాయి అబ్బాయి ఆమె పట్టు చీరపైన చిత్తన గొయ్య (రంగులు చిమ్మేగొట్టం)తో ‘జీడి చమురు’ను కొడ్తాడు (చిల్లిస్తాడు). ఆ అమ్మాయి ఆ చీరతో ఇంటికి వెళ్తే, వదిన కొత్తచీర అని భయపడి, రజకుని వద్దకు వెళ్తుంది. దాన్ని ఉతికి, మచ్చలు పోగొట్టి ఇవ్వమని అడుగుతుంది. ఆ రజకుడు ఇదే సమయమని, ఆమె భయాన్ని తన స్వార్థానికి వాడుకుంటాడు. ‘నువ్వు నన్ను పెండ్లి చేసుకుంటే, తికిస్తాను’ అంటాడు. అందుకు ఆమె ఒప్పు కుంటుంది, పెండ్లి చేసుకుంటుంది. అయితే రజకుడు ఆ చీరను ఎంత ఉతికినా మచ్చలు పోవు. ఆమె పుట్టింటికి పోదు, ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లోని అయొడిన్ లాగా మంచికి, చెడుకు పైన చెప్పుకున్న విధంగా గ్రామాల్లో జీడిగింజ ఒక ఔషధంగా ఉపయోగపడుతున్నది. ఆయుర్వేద గ్రంథాల్లో ఆయుర్వృద్ధి కోసం, కుష్టు, ఆర్మరోగాలు పోగొట్టడానికి, పుండ్లమచ్చలు పోగొట్టడానికి, రోగనిరోధకశక్తిని మొదలైనవాటిని పెంచుకోవడానికి నల్లజీడిగింజలను వాడారని తెలుస్తున్నది. ఈ నల్లజీడిగింజతో జానపదులు చేసే వైద్యం ఎంతవరకు శాస్త్రీయమైందో తెలుసుకోవడానికి కూడా ఆయుర్వేద వైద్యగ్రంథాలను సంప్రదిస్తే బాగుంటుంది. 5. ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో నల్లజీడి
ఆయుర్వేద గ్రంథాలు: 1. అగ్నివేశమహర్షి రచించిన చరక సంహిత, 2.సుశ్రుత సంహిత, 3. ధన్వంతరి, 4. బసవరాజీయమ్, 5. భైషజ్యరత్నాకరమ్ 6. సర్వమూలికా గుణరత్నాకరమ్, 7. వస్తుగుణదీపిక, మొదలైనవి బాగా ప్రసిద్ధి పొందాయి.
‘కృతయుగంలో చరక సంహిత, త్రేతాయుగంలో రసరత్నాకరమ్, ద్వాపరయుగంలో సిద్ధ-ద్యాభువు, కలియుగంలో బసవరాజీయమ్ శ్రేష్ఠమైన గ్రంథాలని బసవరాజీయం (పుట. 3)లో చెప్పారు. అలాగే ధన్వంతరి ఆయుర్వేద గ్రంథంలో కూడా చరక సంహిత, తర్వాతనే సుశ్రుత సంహిత అని చెప్పారు. వస్తు గుణ దీపిక (పుట 35) లో జీడిగింజ పేర్లను, గుణాలను కూడా చెప్పారు. కాబట్టి ముందుగా చరకసంహితలో జీడిగింజ గురించి ఏం చెప్పారో చూద్దాం. చరక సంహిత మూడు అంశాలు 1. భల్లాతక క్షీరరసాయన యోగం (పుట 35), 2. భల్లాతక క్షౌద్ర రసాయనం (పుట 37), 3. భల్లాతక తైలప్రయోగం (పులు 37) గురించి చెప్పారు.
5.1. చరక సంహిత-భల్లాతక క్షీర రసాయన యోగం: వాతావరణ వైపరీత్యాల వల్ల, వృక్షసామాన్యమైన రోగాలవల్ల చెడిపోని, రసంతో బాగానిండినవి, మంచి పరిమాణం కలవి, నేరేడుపండ్లలాగ నల్లని కాంతి కలిగిన నల్లజీడిగింజలను జ్యేష్ఠమాసంలోనైనా, ఆషాఢమాసంలోనైనా తెచ్చుకోవాలి. వాటిని యవలరాశిలోనైనా, ఉద్దుల (ఎనుముల) రాశిలోనైనా నాల్గునెలలు పెట్టాలి. ఆ తర్వాత ఆ గింజలను వెలికి దీయాలి. ఆరోగ్యవంతుడైనవ్యక్తి వాటిని ఆరోహణావరోహణాక్రమంలో 30 రోజులు వాడాలి. పైన చెప్పుకున్న జీడిగింజల నుండి తొలుత పదింటిని నలగ దంచాలి. దానికి ఎనిమిది భాగాలు నీళ్లు పోసి, ఎనిదవ వంతు మిగిలేటట్లు కాచాలి. ఆ రసాన్ని వడగట్టాలి. అందులో ఆవుపాలు కలపాలి. వాటిని తాగే ముందు నోటికి ‘నెయ్యి’ని పూసుకోవాలి. పాలతో కూడిన ఆ జీడిగింజల రసాన్ని మార్గశిర మాసంలోనైనా, పుష్యమాసంలోనైనా తాగాలి. ఇది మొదటి దినం సేవించే పద్ధతి.
రెండవదినం నుండి మిగిలిన (29) రోజులు రోజుకు ఒక్కొక్కటి చొప్పున (10-1) పెంచుకుంటూ పోవాలి. అలా రోజుకు ఒక్కొక్క జీడిగింజ వంతున పది కన్న ఎక్కువగ చేర్చుకుంటూ పైన చెప్పిన విధంగా ఎనిమిదిపాళ్లు నీళ్లు పోసి, ఎనిమిదవ భాగం మిగుల కాచి, వడగట్టి, అందులో పాలు కలుపుకొని తాగాలి. ఈ విధంగా ఒక్కొక్క గింజవంతున హెచ్చించుకుంటూ, ముప్ఫైగింజలు అయ్యే వరకు, పైన చెప్పిన విధంగానే తాగాలి. ఆ గింజల సంఖ్య ‘ముప్పై’ అయిపోయిన మరుసటి రోజునుండి. ఒక్కొక్క గింజ వంతున తగ్గించుకుంటూ, ప్రతి రోజు పైన చెప్పిన విధంగానే తాగాలి. అలా వాడిన మొదటినుండి ఉపయోగించినవన్నీ కలిపి, ‘ఒక వేయి’ సంఖ్య అయ్యేవరకు మాత్రమే తాగాలి. వేయిసంఖ్య కాగానే పూర్తిగా మానాలి.
పై రసాయనం వాడినప్పుడు, ప్రతిదినం ఔషధం జీర్ణమై, ఆకలి కల్గినపుడు ‘రాజనాల’ అన్నమైనా లేదా 60 రోజుల్లో పండే ‘సంబావుల’ అన్నమైనా నేతిని, పాలను కలిపి తినాలి. ఈ రసాయనాన్ని ఉపయోగించడంవల్ల యౌవనం స్థిరంగా ఉంటుంది. నూరు సంవత్సరాలకాలం సుఖంగా జీవించి ఉంటాడు. భల్లాతక (నల్లజీడి) రసాన్ని పాలల్లో (క్షీరంలో) కలిపి వాడడం వల్ల దీన్ని ‘భల్లాతక క్షీరరసాయనము’అని అంటారు. 5.2. భల్లాతక క్షౌద్ర రసాయనం: ఇంతకుముందు (నల్లజీడి గింజల గురించి చెప్పుకున్న లక్షణాలు కలిగిన జీడిగింజలను ముక్కలుముక్కలు చేయాలి. ఆ ముక్కలను ‘సన్నని రంధ్రాలు కలిగిన ఒక కుండ’లో నిండుగ పోయాలి.
భూమిలో గుంటను తవ్వి, నూనె లేదా నెయ్యిలో చాలాకాలం మాగిన (పీల్చుకొన్న) కుండను కంఠం వరకు పాతాలి. పైన చెప్పుకున్న రంధ్రాలున్న పాత్రను దానిపై ఇమిడి ఉండునట్లు బోర్లించాలి. అవి రెండూ కలిపిన చోటు వద్ద (సందులను) నల్లని బంకమట్టిని పూయాలి. దానిపైన ‘ఏడు పిడకలు’ చేత మూటుబెట్టి, ఉడికించాలి. వేడికి గింజలు పగిలి, గింజల్లోని చమురు (తైలం) కింది కుండలోకి కారుతుంది. ఆ గింజల చమురుకు ఎనిమిది భాగాలు తేనెను, రెండింతలు నేయిని కలిపి, ప్రతిదినం ఉదయం పూట, జఠరాగ్నిని అనుసరించి, వాడుకోవాలి. ఈ రసాయనాన్ని వాడడంవల్ల, నూరు సంవత్సరాల వరకు ముసలితనం దరిచేరదు (పుట 37) క్షాద్రం అంటే తేనె. 5.3. భల్లాతక తైల ప్రయోగం: పైన చెప్పిన ‘ధి’ ప్రకారం సిద్ధమైన భల్లాతక స్వరసాన్నే ‘భల్లాతక తైలం’ అంటారు. భల్లాతక తైలాన్ని, పాలును ఒక పాత్రప్రమాణం (ఆడకం) సిద్ధం చేసుకొని, అందులో సమభాగం ఆవుపాలను పోసి, అక్ష(కర) ప్రమాణం అతి మధుర కల్కాన్ని చేర్చి, స్నేహక ప్రకారం పక్వం చేయాలి. పైన చెప్పిన పాలను, అతిమధుర కల్కాన్ని మాటిమాటికి చేరుస్తూ, వంద మార్లు చేయాలి. ఈ భల్లాతక తైలాన్ని, ఇంతకు ముందు చెప్పిన భల్లాతక స్వరసంలాగా ఎనిమిదింతలు తేనెను, నాల్గవపాలు నేతిని చేర్చి, తగిన పరిమాణంలో సేవించాలి (పుట. 37).
భల్లాతక యోగ విశేషాలు పది. అవి- 1, భల్లాతక ఘృతం (జీడి, నేయి), 2. భల్లాతక క్షీరం (జీడిపాలు), 3. భల్లాతక కేంద్రము (జీడి, తేనె), 4. గుడ భల్లాతకము (జీడి, బెల్లం), 5, భల్లాతక యూషము (జీడి,గంజి), 6, భల్లాతక తైలము (జీడి తైలం), 7. భల్లాతక ఫలము, (జీడి, మాంసం- జీడిగింజలను చేర్చి సంస్కరింపదగిన మాంసం),
8.భల్లాతక సక్తువు (జీడి, సత్తుపిండి జీడిగింజలను చేర్చి, సంస్కరింపబగిని సత్తుపిండి). 9. భల్లాతక లవణము (జీడి, లవణం), 10, భల్లాతకతర్పణము (వేపుడు బియ్యపు పిండిని మూకుటిలో వెచ్చ జేయుచు, అందులో నీరు పోసి, ఉడికించిన ముద్ద) పైన చెప్పిన వాటితో వేరువేరుగా సంస్కారం చేయబడినదే భల్లాతకమృతం.
ఆయుర్వేదంలో మిక్కిలి ప్రసిద్ధిపొందిన రెండవ గ్రంథం- సుబ్రత సంహిత, అందులో మూడు విషయాలు- 1. భల్లాతక తైలం కృష్ణకర్మకు లేపనం (పుట 29, 30), 2.భల్లాతక కల్పం (పుట,122), 3. భల్లాతక ధానాలు (పుట 123,124) గురించి చెప్పారు. 5.4. భల్లాతక తైలం (లేపనం) కృష్ణకర్మకు లేపనం: వ్రణం (పుండు), మచ్చలు ఏర్పడినపుడు ‘కృష్ణకర్మ’ను చేయాలి. అందుకు ‘భల్లాతక తైల లేపనం’ చేయాలి.
నల్లజీడిగింజలను ముందుగా ఏడురోజులు గోమూత్రంలో తడిపి, ఎండబెట్టాలి. తరువాత పాలలో నానవేయాలి. బాగుగా నానిన తర్వాత వాటిని తీసి, మధ్యకు రెండు ముక్కలుగా కత్తిరించాలి. వాటి కింది భాగంలో చిన్న రంధ్రాలున్న ఇనుప పాత్రలో పోయాలి. వేరొకమట్టి పాత్రకు లోపల నేతిపూసి ఆరబెట్టాలి. దానిని భూమిలో మెడ వరకు పాతిపెట్టాలి, దాని మూతిమీద జీడిగింజలు పోసిన ఇనుపపాత్ర అడుగుమోపి, నిలబెట్టి, దాని మూతిమీద మూకుడు బోర్లించి, మెత్తాలి. ఆ ఇనుపకుండ చుట్టు పిడకలు పేర్చి (పెట్టి) పుటం వేయాలి. అప్పుడు ఆ జీడిగింజలు చమురు అడుగున ఉన్న మట్టి పాత్రలోనికి దిగుతుంది. దానిని మెల్లెగ తీయాలి. అందులో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, మొదలైన వాటి డెక్కల గిట్టలను కాల్చి, ఆ మసిని మెత్తగా నూరి కలిపి, తెల్లగా ఉండే కురుపు మచ్చలపైన పూయాలి. దానివల్ల ఆ మచ్చలు నల్లబడి శరీరం సవర్ణమగును, (“కృష్ణకర్మ’కు భల్లాతక తైలం లేపనం, చికిత్సాస్థానం, ప్రథమ అధ్యాయం, పుట 29, 30 6. జానపదులు ప్రాయోగిక జ్ఞానం: పైన చెప్పుకున్న జీడిగింజ జానపదులు నిత్యజీవితంలో ఒక భాగమై, సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఉంది. ఇలా వారికి ‘ఔపయోగిక వస్తువు’గా, జీర్ణాశయవ్యాధులు మొదలైన వాటికి ‘వైద్య దినుసు”గా అనేక విధాలుగా పనికి వస్తున్నది. ఇలాంటి నల్లజీడి గురించి జానపదులు, వైద్యశాస్త్ర గ్రంథాలు ఏమన్నాయో కూడా తెలుసుకున్నాం.
జానపదుల పూర్తిగా ప్రాయోగిక వైద్యం, ప్రాయోగిక జ్ఞానం, వైద్య గ్రంథాలలో చెప్పని అనేక రోగాలకు కూడా ఈ జీడిగింజను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. జీడిగింజలనుండి తైలం తీసే పద్ధతిని జానపదులను చూసి, వైద్యులు నేర్చుకున్నారా?
వైద్యులను చూసి, జానపదులు నేర్చుకున్నారా? అనే సంధిగ్ధావస్థ ఎవరికైనా కలుగుతుంది. ఇప్పటికీ కల్లుగీత కార్మికులు బట్టీ పెట్టి, జీడిగింజలనుండి చమురును తీస్తున్నారు. ఏది ఏమైనా జానపదుల జీవితంలో ‘జీడి’కి ప్రాశస్త్య స్థానమున్న దనేది సుస్పష్టం.
ఆధార గ్రంథాలు:
1 . అగ్నివేశమహర్షికృత చరకసంహిత, పండిత నుదురుపాటి విశ్వనాథ శాస్త్రి (వ్యాఖ్యానం), రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి, ప్రథమముద్రణ, 2010.
2. పండిత మల్లంపల్లి భైరవమూర్తి పంతులు, ధన్వంతరి ఆయుర్వేద గ్రంథము. ఎ.బి.ఎస్. పబ్లిషరు, 4వ ముద్రణ. సంవత్సరం
3. బసవరాజు. బసవరాజీయము. ఎ.బి. ఎఎస్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 1998.
4. రామచంద్రరావు, పువ్వాడ, భైషజ్య రత్నాకరం, రోహిణి, పబ్లికేషన్స్, 2016.
5. సుబ్బారాయుడు, యర్రా, వస్తుగుణ దీపిక, ఎ.బి, ఎఎస్ పబ్లిషర్పు, 11వ ముద్రణ. 2010.
6. సుశ్రుతుడు. సుశ్రుత సంహిత, ద్వితీయ ముద్రణ, 2014.
7. సూర్యనారాయణరావు, పువ్వాడ సర్వమూలికా గుణరత్నాకరం, ముద్రణ మోహన్ పబ్లికేషన్స్ 2016
1 comment
amma achaarya, inta pathaalu cheptunnaru vere vallaku vyaktigata swechcha vuntundi ane vishayam artham kaada meeku. ayina vinakunda vere valla meedaki rudddam yenti dooradam yenti. mee ishtam mee intlo. vere valla intlo kaadu. idi inta pragnavantulaki artham kaada.