చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..
అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!
చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర
సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.
ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.
చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..
ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.
మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు
ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.
చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.
జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ
కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!
నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.
అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది
కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.
పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!
గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..
గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..
ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.
విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.
- రామకృష్ణ మనిమద్దె
9494353828