Home ఇంట‌ర్వ్యూలు వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం

వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం

by Aruna Dhulipala

కోవెల సుప్రసన్నాచార్యులు

తెలుగు సాహితీ జగత్తుకు తలమానికమైన సుప్రసిద్ధ కవులు, విమర్శకులు, ఆధ్యాత్మిక, తాత్వికవేత్త, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కార గ్రహీత కోవెల సుప్రసన్నాచార్యులు గారితో ముఖాముఖి. -అరుణ ధూళిపాళ

సుప్రసన్నాచార్యులుగారితో అరుణధూళిపాళ

గురువుగారు నమస్కారాలు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మహద్భాగ్యం. మీలాంటి మహనీయుని గురించి మా పాఠకులకు పరిచయం చేయడం నా జీవితానికి ఒక గొప్ప అనుభూతి.

1) మీ బాల్యం, విద్యాభ్యాసాల గురించి మాకు వివరంగా తెలపండి.

జ. మార్చి 17, 1936న వరంగల్లులోజన్మించాను నేను. మా తండ్రి వెంకట నరసింహాచార్యులు గారు, తల్లి లక్ష్మీనరసమ్మ గారు. మా పితామహుడు అయిన కోయిల్ కందాడై రంగాచార్యులు గారు, మాతామహులైన ఠయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు గారు నాకు సాహిత్యంలో గురువులు. వరంగల్లు లోనిని ఏవీవీ హైస్కూల్లో ఉన్నత విద్య వరకు చదివి, హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎమ్.ఏ చేసి రామరాజ భూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి పీ హెచ్ డీ పట్టా పొందాను.

2) కేవలం 9వ ఏట కంద పద్యాలు రాసిన సామర్థ్యం ఎలా పట్టువడింది?

జ. ఛందస్సు తెలియదు నాకు. నేర్చుకోలేదు ఇవ్వాల్టి వరకు కూడా. అప్పుడు వీధి బళ్ళలో భాగవత పద్యాలు, భాగవత ఘట్టాలు చెప్పేవారు.అది చదవడం, వినడం వల్ల వాటి నడక మాకు అర్థం అయ్యేది. ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే “”హయరింకా ముఖ ధూళి ధూసర పరిన్యస్త అలకోపేతుడై” గుర్రపు డెక్కల యొక్క ధూళి ఎగిసి ముఖం మీద పడింది. ముంగురులలో చెమట వచ్చింది. ఆ దుమ్ములో పడి అట్టకట్టుకుని పోయిన రూపాన్ని ఎంతో అందంగా వర్ణించాడు. ఇలా కాకుండా రారా పరిగెత్తుకు పోదాం క్రికెట్ ఆడదామంటే ఏముంటుంది దాంట్లో? పోతనది ఎంత గొప్ప కవిత్వం అంటే విజువలైజేషన్లో ఆయనను మించిన వారు లేరు. “నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు”ఈ పద్యాలు చదువుతున్నప్పుడు పద్యం యొక్క రూపం, నడక, గురులఘువులు ఎక్కడ ఉంటాయో తెలియకపోయినా ‘ధాటి’ అంటారే ఆ ధాటి నాకు తెలిసేది. ‘శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకలజనులు’..’తన కోపమె తన శత్రువు’..ఇలా  భాగవతం, సుమతీ శతకం, పద్యాన్ని నేర్పాయి. ఒక ఇమేజ్ మనసులో ఏర్పడితే దానికి ఒక ధాటి వస్తుంది. చెక్కుతూ పోవాలి దాన్ని. అది అందరికీ సాధ్యం కాదు. అలా చెక్కుతూ పోయినవాడు కృష్ణశాస్త్రి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలా గొప్పగా వ్యక్తీకరించడమనేది పోతన వల్ల నాకు కలిగింది. సుమతీ శతకంలో కంద పద్యం ఒరవడి తెలుస్తుంది కదా! అది 6,7 ఏళ్ళ వయస్సులోనే పిల్లలకు చెప్తారు కదా! అదే నాకు అలవడింది. It happend, it continued till day. అందువల్ల దానికోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం రాలేదు. అంతే కాక మా తాతగారు ఉభయ వేదాంత విద్వాంసులు. ఆ రోజుల్లో కాంచీపురం నుండి బరంపురం వరకు ఆయన ఉపన్యాసం లేని ఊరు లేదు. దాదాపు 3 గంటలు. మైకు లేకుండా చెప్పేవారు. కంఠం చాలా గొప్పగా ఉండేది. నా మొదటి విద్యా ప్రదానం ఆయన దగ్గరే జరిగింది. రజాకార్ల గొడవలు జరుగుతున్న సందర్భంలో మేము తల దాచుకోవడానికి కల్లెడ గ్రామంలో ఉండేవాళ్ళం. మధ్యాహ్నం గుడిలో భక్తి ప్రబోధ విషయాలు, సాయంకాలం శ్రీమద్రామాయణం చెప్పేవారు తాతగారు. మాకు అప్పుడు పని ఏమీ లేదు. కాబట్టి అన్నీ వింటూ ఉండేవాళ్ళం. పులిహోర ప్రసాదం కోసం వెళ్ళేవాళ్ళం (నవ్వుతూ). కేవలం కాలక్షేపానికి మాత్రమే కాక, వేదాంత, పురాణ, ఇతిహాస, ఉపనిషత్తుల విషయాలు కూడా చెవిలో వినబడుతుండేవి. ఆ తర్వాత జాతీయోద్యమ స్ఫూర్తితో ఏర్పడ్డ చందా కాంతయ్య గారి ‘ఆంధ్ర విద్యాభివర్ధిని’ స్కూల్లో చదువుకున్నా.. చందా గారు గొప్ప వదాన్యుడు. ఉర్దూ మీడియం స్కూళ్లకు వ్యతిరేక ఉద్యమంలో భాగంగా లక్షరూపాయలు దానంగా ఇచ్చి తెలుగు మీడియం స్కూల్ పెట్టాడు. దాంట్లో చదువుకున్నా. అందులో గొప్ప టీచర్లు వుండేవారు. అక్కడ ఒక సాంస్కృతిక వాతావరణాన్ని ఏర్పాటు చేశారు వారు. ప్రతీ ఏటా పోతన జయంతి చేసేవారు. రెండు మూడు రోజులు ఉత్సవాలు చేసేవారు. విశ్వనాథ వెంకటేశ్వర్లు గారని విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు గొప్ప విద్వాంసుడు. ఆయన పాఠం చెప్పేవాడు మాకు. పద్యం, కవిత్వం ఎలా ఉండాలో, ఎలా రాయాలో చెప్పేవారు. ఆయన చెప్పే పద్ధతి నాకు ఆదర్శం. ఆయన నత్కీరుని కథ ఉదాహరణగా చెప్పి, ఎవరినీ స్తోత్రం చేయవద్దని, ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని ఈ రెండు విషయాలను చెప్పారు నాకు. అవి నేను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాను. అలాగే రాస్తూ వచ్చా. ఎవరికీ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆ స్కూల్లో సోమేశ్వర రావు గారని ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. పేరుకు ఇంగ్లీష్ టీచరే గాని ఆయన చిత్రకారుడు. సంస్కృతి గురించి చెప్పేవారు. పాఠశాలలో రామప్పకు ఎక్స్ కర్షన్ తీసుకెళ్లినప్పుడు అక్కడి శిల్పకళలో హోయసాల, కాకతీయ, చోళుల భేదాలను కూడా చెప్పేవారు. ఈ విధంగా రచనా పద్ధతి నాకు అలవడింది. అలా రాస్తూనే వున్నా.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

3. అసలు కవిత్వం యొక్క లక్షణం ఏమిటి? ఇప్పటి కవిత్వం ఎలా వుంది? కవిత్వంలో రసజ్ఞత ఎలా ఉండాలి?

జ. వ్యంగ్య భావన ఉండడం కవిత్వం యొక్క ముఖ్య లక్షణం. వాక్యంగా చెబితే కవిత్వం కాదు. ఇప్పుడేమయ్యిందంటే ఏదో పాద విభజన చేస్తున్నారు. అదే కవిత్వం అంటున్నారు. ఎక్కువమంది కవిత్వానికి దూరంగా ఉంటున్నారు అనుకుంటున్నాను. నేను చాదస్తుడిని అనుకోవచ్చు, మరేమైనా అనుకోవచ్చు. అప్పట్లో ఎన్నో అవకాశాలు ఉండేవి. ఇప్పుడు క్రమంగా తగ్గిందని అనుకుంటున్నా. పద్యం ఎప్పుడైనా సరే ఆనాటి చైతన్యాన్ని లబ్దీకరించుకునే శక్తి దానికున్నది. దాశరథి పద్యం మామూలుదా? పింగళి కాటూరి వారి సౌందర నందనంలోని పద్యాల కాఠిన్యం…? అసలు కాఠిన్యం అంటే..? భావ క్లేశం ఉండొచ్చు. మోహన్ ప్రసాద్ కవిత ఎంతమందికి అర్థం అవుతుంది? ఆయనను పొగిడిన వాళ్ళు కొన్ని కవితల్ని కాదంటే..? వాళ్ళ దృష్టి వేరు కదా! కవిత్వంలో ఒక ఆత్మీయ లక్షణం ఉండాలి. శ్రీశ్రీ “కవితా! ఓ కవితా” లో కవిత అనేది ఏకాంతమైనది. భావ గర్భితమైనది అనే మాట అంటాడు. ఏకాంతంలో వుండే ఒక స్థితి అనుభవంలోకి రావాలి. దానికోసం ఎన్నో చోట్లు చూస్తూ వచ్చాడు. నిఘంటువు, వ్యాకరణాలను, ఛందస్సులను వదిలేయమంటాడు. ఎందుకు వదలాలి? అవి ప్రధానం కావు కాబట్టి. కానీ అవి ఉంటాయి. విశ్వనాథ కూడా ఒకచోట ” నా కవితకు ఔచితి లేదు, భాషలేదు, ఆకృతి లేదు. ఊరక రసాత్మకనే ప్రవహించి పోదు” అంటాడు. అంటే వ్యాకరణం, శబ్దం లేదని కాదు కదా! కేవలం నిఘంటువుల్ని మాత్రమే పట్టుకోవద్దనేది వారి భావన..ఇద్దరూ వారివారి మాటల్లో ఒకే విషయం చెప్పారు. దాశరథి ఒకచోట అంటాడు. వైద్యశాస్త్రం శ్లోకాల్లో ఉంటుంది. మరి అది కవిత్వం అవుతుందా? అని. కవిత్వానికి ఆత్మస్పర్శ ఉండాలి. అది ఉండాలంటే అంతస్సులోకి వెళ్లిపోవాలి. వ్యష్టి చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో అనుసంధానించుకోవాలి. రస సిద్ధాంతంలో   సాధారణీకరణం అనే మాట వాడారు. అంటే ఏమిటి? కవి తన దేశాన్ని, కాలాన్ని మరచిపోవాలి. అన్నింటినీ దాటుకొని విశ్వయాత్ర చేయాలి. ఎవరి జీవితంలోనైనా ఏవో అనుకోని విషయాలు వస్తూనే ఉంటాయి. వాటిని కవిత్వీకరించాలి. ఇదే ‘విశ్వజనీనం’ అనే మాట అవుతుంది. కావ్యాల్లో చెట్లు, పుట్టలు, పక్షులు, చంద్రుడు, మేఘం ఇలా ప్రకృతి ఉంటుంది. ఇవి ఏమీ చెప్పవు. తన భావాలన్నింటికీ ఏదో ఒకదాని మీద ఆధారపడి మనుష్యత్వాన్ని కల్పించి, దాంతో ఏదో ఒక సందర్భాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాడు కవి. ఆ సమయంలో అన్నింటినీ మరచిపోయి రెక్కలు కట్టుకుని మరీ ఎగరాలి. నేల బారుగా పడిపోతే లాభం ఏముంది? 80, 90 ఏళ్ళల్లో జరిగింది ఏమిటంటే భావనల కంటే  ఉపన్యాసాలకు, సిద్ధాంతాలకు, ఇతర విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. మనుచరిత్రలో ప్రవరుడు దారి తప్పాడు. ఇలాంటి ఇష్టంలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అందరికీ సహజమే. దాని నుండి బయటపడడానికి ప్రయత్నమూ సహజమే..దాన్ని అర్థం చేయించడమే కవికి ముఖ్యమైనది. అందువల్ల కవిత్వం ఎప్పుడూ అపరిమితమైన స్థితిలో ఉండాలి కానీ పరిమితులకు లోబడి ఉండకూడదు.  శబ్దానికి ఒక శిల్పం ఉండాలి. శాస్త్రాలు వేరు, కావ్యాలు వేరు.శాస్త్రాలకు, కావ్యాలకు వుండే భేదం తాదాత్మ్యత. తన్ను తాను మరిచిపోయినప్పుడు సమస్త విశ్వంలో ఉండే భావన తనలో లీనమయ్యే పరిస్థితి వస్తుంది. అలౌకికమైన ఆనందపు స్థితిని పొందడం కవిత్వం చేసే పని. పద్యం అంటే ఏవో గణాలు కుదుర్చుకొని ఛందస్సు సరిచూసుకొని రాసేది కాదు. మనసులో ఛందస్సు కుదురుకున్నాకే పద్యం బయటకు వస్తుంది. ఇది విశిష్టమైన ప్రక్రియ. ఉపమానాలు వుండొద్దు, ఉపమేయాలు వుండొద్దు, శబ్దం వుండొద్దు. మనకు ఉన్న కొన్ని శబ్దాలతోనే కవిత్వం ఉండాలంటే ఆ పటుత్వం ఎలా ఉంటుంది? ఇప్పటికే ఎంతో శబ్ద సంపదను కోల్పోయినాము. ఈనాటి ఆధునిక కవులలో శబ్దజ్ఞానం కొరవడింది. తిలక్ కవిత్వంలో ‘రొమాంటిక్ ఎలిమెంట్’ ఉండడం చేత అంత గొప్ప కవి అయ్యాడు. ‘రొమాంటిక్ ఎలిమెంట్ ‘అంటే ఏమిటి? ప్రతీదాన్ని ప్రేమించడం. ప్రేమ అనేది స్త్రీ పురుష సంబంధం కాదు. బాహ్య, అంతర్లీనమైన ప్రతీ అంశాన్ని ప్రేమించ గలగాలి. ఏ వస్తువునైనా కవిత్వంగా మార్చగలిగే శక్తి ఉండాలి. దీనికి ప్రాచీన, ఆధునిక కవిత్వాలనే భేదం అవసరం లేదనుకుంటా. కవిత్వంలో గాఢత వద్దంటే ఎలా? నాకనిపించేది ఏంటంటే We are loosing almost all the essences of the literature. వివాదాల్లో పడి వీటిని పోగొట్టుకుంటున్నామేమో…

4) హైదరాబాద్ లో మీరు ప్రారంభించిన ‘రసధుని’ సంస్థ గురించిన వివరాలు చెప్పండి. ఇంకా అలాంటివి ఏవైనా మీరు స్థాపించారా?

జ. మేము చదువురీత్యా హాస్టల్లో ఉండేవాళ్ళం. సాయంకాలం కాగానే సుల్తాన్ బజార్ కి వచ్చి ఎక్కడో ఒకచోట భాషా మీటింగులు అటెండ్ చేసేవాళ్ళం. పల్లా దుర్గయ్య, నారాయణరెడ్డి, దాశరథి, రామరాజు గారు ఆళ్వార్ స్వామి, వరదాచార్యులు గారు వీళ్లంతా పల్లా దుర్గయ్య గారి ఇంట్లో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో వరదరాజేశ్వరరావు గారు కవిత అనే రెండు వచన సంపుటాలు వేశారు. అబ్బూరి ఛాయాదేవి సంపాదకత్వంలో కూడా ఆయన రచనలు వెలువడ్డాయి. ఆళ్వార్  స్వామి దేశోద్ధారక గ్రంథమాలకు పుస్తకాలు వేస్తున్నారు. రాఘవాచారి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పుడు. ఆయన ఆదర్శ సాహిత్య అనే ఏదో పేరుతో పుస్తకాలు వేస్తుండేవారు. సాహిత్యం మీద ఆక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది.  అప్పటికే తెలంగాణ రచయితల సంఘం ఏర్పడింది. మొదటి మహాసభలు జరిగినాయి. దానికి దాశరథిగారు అధ్యక్షులు. ఆ సమావేశానికి శ్రీశ్రీ మొదలైన వారు ఎంతోమంది వచ్చారు. తర్వాత సంఘాలలో చాలా మార్పులు వచ్చాయి. సారస్వత పరిషత్తుకు అప్పటికే స్థలం ఉండేది. దానిని ఆక్రమించాలనే ప్రయత్నాలూ  జరిగాయి. ఆ సమయంలో నేను నా మిత్రుడు మాదిరాజు రంగారావు గారు హాస్టల్లో ఉండే వాళ్ళం. పద్యం అంటే చాలా ఇష్టమైన తనకి. రాత్రి 8,9 గంటల సమయంలో గంట గంటన్నర సేపు రామాయణ కల్ప వృక్షం చదివి వినిపించేవాడు. పద్యాలు బాగా చదువుతాడు ఆయన. అప్పుడు హైదరాబాద్లో ఆక్టివిటీ కోసం ‘రసధుని’ పేరుతో సంస్థ ప్రారంభించాలని అనుకున్నాము. అదే సమయంలో రామకోటి శాస్త్రి గారు గుడివాడ నుండి వచ్చి రిసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ. మొదలి నాగభూషణ శర్మ ఎమ్.ఏ చదువుతున్నారు. రమాపతిరావు గారు, అక్కిరాజు గారు మేమంతా కలిసి తాజ్ మహల్ లో ఏదో ఓ మూల కూర్చొని టీ తాగుతూ చాలా సమయం గడిపే వాళ్ళం. అప్పుడు ఈ ‘రసధుని’ అనే కాన్సెప్ట్ వచ్చింది.  ఒక కవి మీద స్టడీ చేసిన ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగింది. మొదటిది విశ్వనాథ మీద చేశాం. గౌతమ రావు గారు ,సంపత్ కుమార్ ఆచార్య గారు, ఆనందమూర్తి గారు మొదలైనటువంటి వారు ముందు వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలనే ఉపన్యాసాలుగా తయారు చేశాం. ఆ వ్యాసాలన్నీ తర్వాత స్రవంతి పత్రికలో వచ్చాయి. తర్వాత శ్రీశ్రీ పేరు మీద కూడా సెమినార్ ఏర్పాటు చేశాము. సంపత్ రాఘవాచారి అనే ఆయన ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉండేవాడు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరుగా పనిచేసే ఒక ఆయన ఇంకో ఇద్దరు,ముగ్గురు శ్రీశ్రీ గురించి మాట్లాడారు. చలం మీద అనుకున్నాం కానీ కుదరలేదు. విశ్వనాథ గారి మీద వ్యాసాలు అన్నీ స్రవంతిలో వచ్చాయి. తెలంగాణ సంఘంలోని కవులు విస్తృతంగా కృషి చేశారు. ప్రాచీన కావ్యాలలోని ఒక్కొక్క ఆశ్వాసాన్ని ఒక్కొక్కరు గానం చేసేవారు. కొత్త కవులు అందరికీ మంచి ప్రోత్సాహం ఇచ్చేవారు. దాశరథి,ఆనందమూర్తి, నారాయణ రెడ్డి ఏదో ఒక కావ్యాన్ని గానం చేసేవారు. పైకి చదవడం వల్ల మనసులోకి పోతుందది. శబ్దం కాదు భావం ముఖ్యం. గౌతమ రావు గారు కల్పవృక్షం చదివితే అక్కడ చేకూరి రామారావు లాంటి ఎలాంటి పెద్ద వాళ్ళు ఉన్నా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కరీంనగర్ లో  రెండు మూడు రోజులు సెషన్స్ పెట్టుకునేవాళ్ళం. ఐదు, ఆరు సంవత్సరాలు నడిచింది అట్లా. పద్యం అంటే  చైతన్యం. చచ్చుగా చదవడం కాదు. ఏదైనా కవిత్వమయంగా చెప్పినప్పుడు అనుభూతి కలుగుతుంది. 1954 లో సాహితీ బంధు అని వరంగల్ లో ప్రారంభించాము. 1957లో మిత్రమండలి, 1960లో కులపతి సమితి స్థాపించాము. ‘చేతనావర్త కవులు’ అనే పేరిట నేను, సంపత్కుమారాచార్య, పేర్వారం జగన్నాథం, నరసింహారెడ్డి కలిసి అనేక వ్యాసాలు ప్రచురించాము. ఇది ఒక కవిత్వ తీర్థయాత్ర. పోతూ ఉండడమే.. కనిపించిందల్లా జేబులో వేసుకోవడమే. ఆ విధంగా కవిత్వ యాత్రలో మమేకమై పోయేవాళ్ళం.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

5) అవధానాల మీదకు మీ దృష్టి ప్రసరించడానికి కారణాలు ఏవి?

జ. 1970 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఈ లెఫ్టిస్ట్ కోర్సులు పద్యాలను తిరస్కరించడం మొదలు పెట్టాయి. పద్యం పనికిరాదు. పద్యాలు రాయకూడదు. ఛందోబద్ధ గణాలన్నీ వ్యర్థములని సిద్ధాంతాలు చేయడం మొదలు పెట్టాయి. దాన్ని తట్టుకోవడానికి ఏదో ఒక మార్గం అవసరం. పద్యం చెప్పడం ఎంత సులభమైంది? ఎంత హాయిగా చదువుకోవచ్చు? ఎంత హృద్యంగా ఉంటుంది? ఇవన్నీ తెలియాలి కదా! కొప్పరపు కవులు గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పేవారు. విశేషమేమిటంటే, ఉదాహరణకు…జటాయువు కథ చెప్పాలంటే, మొత్తం ఆ కథకు సంబంధించిన పద్యాలే అన్ని చెప్పేవారు. అది అద్భుతమైన శక్తి. అదే కావ్య నిర్మాణమంటే. తిరుపతి వేంకట కవుల సమకాలికులు. వారు. ఆ కాలంలో వందలకొద్దీ శతావధానులు వచ్చారు. గుంటూరు సీమ వాళ్ళను చూస్తుంటే ఎంత గొప్ప పరిశ్రమ జరిగిందో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సందర్భంలో మా వూళ్ళో ఎవరో ఒకాయన వచ్చి అష్టావధానం చేశారు. అది మాకు అంతగా నచ్చలేదు. నేను, శ్రీభాష్యం విజయసారథి గారు,ఇంకో ఇద్దరం మిత్రులం రోజూకలుసుకునేవాళ్ళం. విజయ సారథి గారు అపుడు నన్ను ప్రారంభం చేయమన్నారు. “నేనెక్కడ చేయగలను ఈ ఆశువుగా” అంటే “ఎందుకు కుదరదు..చేయి” అన్నారు. వాళ్ళింట్లోనే ప్రారంభం చేశాను. ఒక కవి మిత్రుని ఇంట్లో సాయంకాలాలు కలుసుకొని రెండు, మూడు రోజులకొకసారి నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది ఈ మూడు, నాల్గు అంశాలపై అభ్యాసం చేసేవాడిని. అష్టావధానంలో మిగతావి ఈజీనే కదా! ఆ క్రమంలో ఉగాది వచ్చింది. ఆరోజు మొదటిసారి ( 1973 ) అవధానం చేశాను. అట్లా తీవ్రంగా మూడేళ్లు చేశాను. ఆ తర్వాత ఇక చాలనిపించింది. ఎందుకంటే పృచ్ఛకులు దొరకరు. ఉన్నవాళ్ళు సందర్భానికి తగని అంశాలేవో ఇవ్వడం.. మనం వాళ్ళని ఏమీ అనలేక పోవడం.. అందుకే విరమించుకున్నా. 1975లో తెలుగు మహాసభలు జరిగాయి. దానికి ముందు వరంగల్ లో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఒక మధ్యాహ్నం పూట నా అష్టావధానం పెట్టారు. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన సమస్య ఇచ్చారు.  అనుకోకుండా అక్కడికి పీవీ నర్సింహారావు గారు వచ్చారు. చిన్నప్పటినుండీ తెలిసినవాడిని అవడం వల్లో, చిన్న పిల్లవాడు వీడేం చేస్తాడని చూడడానికో మొత్తానికి వచ్చారు. ఎప్పటి నుండి చేస్తున్నావని అడిగారు. ఇటీవలే పద్యం మొదలు పెట్టానని చెప్పాను. అలా ఆయన రావడం నాకు జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఎందుకంటే కవిత్వ స్థాయి తెలిసిన వాడు కాబట్టి, ఆ స్థాయిలో ఆస్వాదించ గలుగుతాడు కాబట్టి. మరోసారి భారతీ తీర్థ స్వామివారు వరంగల్ లో శంకర మఠానికి వచ్చినప్పుడు వారి ఆశీస్సులు లభించాయి. తర్వాత 20 ఏళ్లకు అక్కడే కవితా ప్రసాద్ అవధానం స్వామివారి సమక్షంలో జరిగింది. పృచ్ఛకునిగా వున్నాను నేను. నన్ను చూసి వారు 20 ఏళ్ళ క్రితం మీరు అవధానం చేశారు కదా! అని అన్నారు. వారి ధారణా శక్తికి ఆశ్చర్యపోయాను. వారు శాస్త్రాలలో సమృద్ధులు. తపస్వి. ఇలాంటి అదృష్టాలు కొన్ని నాకు కలిగాయి.

6) అవధాన ప్రక్రియలో విజయం సాధించాలంటే ఏ విధమైన పట్టు సాధించాలి?

జ. పట్టు ఏముందమ్మా ! ముందు పద్యం తెలియాలి. ఆశువుగా పద్యం చెప్పగలగాలి. భాష మీద అధికారం ఉండాలి. వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోవడం కాదు. ధారగా రావాలి. రెండవది ధారణ ఉండాలి. మనం ముందు ఒక పాదం చెబుతాం. ఓ సమస్య, ఓ దత్తపది, ఓ నిషిద్ధాక్షరి ఇవన్నీ ఒక ఆవర్తనం పూర్తయ్యేటప్పటికి ముందువన్నీ జ్ఞాపకంలో ఉండాలి. అవి ఒక క్రమంలో చెప్పగలగాలి. ఉదా: నిషిద్ధాక్షరి చూస్తే, ఒక అక్షరం దగ్గర నిషేధం అయ్యేటప్పుడు దానికి ప్రత్యామ్నాయ పదం మన దగ్గర ఉండాలి. అలాగే ఆ అక్షరం తర్వాత నిషేధించబడే అక్షరాన్ని ఊహించి దానికి తగిన మరో పదాన్ని మన ఆలోచనల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. లోకజ్ఞత కూడా అవసరం. ఎందుకంటే ఇపుడు అప్రస్తుత ప్రశంస ఉంటుంది. ఆ సమయంలో కోపం తెచ్చుకోకూడదు. సరదాగా ఉండాలి. ఇలా వుండగలిగితే సాధ్యం అవుతుంది.

7) దాదాపు మీకు సమవయస్కులు, చిన్నాన్న గారైన సంపత్కుమారాచార్యులు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది?

జ. మా పినతండ్రి ఆయన. మా నాన్నగారికి కనిష్ఠ సోదరుడు. ఆయనకు నాకు కేవలం మూడేళ్ళ వయసు తేడా మాత్రమే ఉంది. అందువల్ల స్నేహితుల్లాగా మెలిగేవాళ్ళం. చాలామంది మేమిరువురం సహోదరులమని పొరపాటు పడేవాళ్ళు ( నవ్వుతూ ). ఇద్దరమూ కలిసి జంటగా కవిత్వం చెప్పేవాళ్ళం.  హృద్గీత, ఆనందలహరి, అపర్ణ అనే రచనలను చేసాం. చేతనావర్త కవులుగా పేరు తెచ్చుకున్నాం. ఎన్నో సాహిత్య అనుభవాలున్నాయి ఇద్దరివీ కలిపి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

8) భారతీయ గొప్ప తత్వవేత్త, మహాయోగి శ్రీ అరవిందులవారి తత్వం మీకెలా అలవడింది?

జ. మా టీచరు సోమేశ్వరరావు గారని చెప్పాను కదా!ఆయన ద్వారానే అరవిందుల వారి గురించి తెలిసింది. అదేకాక శతావధాని వేలూరి శివరామ శాస్త్రిగారు ‘భారతి’లో అరవిందుల వారి తత్త్వం గురించి వ్యాసాలు రాసారు. అవి చదివాను. నాకది నచ్చింది. ఆయన జగత్తు మిథ్య అనలేదు. శంకరులు కూడా మిథ్య అంటే పారమార్థిక మిథ్య అన్నారు కానీ వ్యావహారికంలో కాదు. అరవిందుల వారు ఏం చెప్పారంటే “జగత్తు పరిణామంతో కూడుకున్నది.. ఈ జడమైన పదార్థం ప్రాణంగా, ప్రాణమైన పదార్థం మనసుగా, మనసైన పదార్థం విజ్ఞానంగా, విజ్ఞానమైన పదార్థం ఆనందంగా పరిణమిస్తుంది. అట్లాగే ఆనందం నుండి విజ్ఞానానికి, విజ్ఞానం నుండి మనస్సుకు, మనస్సు నుండి ప్రాణానికి, ప్రాణం నుండి జడత్వానికి దిగివస్తుంది” అని. దీనిలో  transformation  ఉంటుంది. ఇది ascent, descant గా నడుస్తుంటుంది. మానవుడు ఎప్పుడూ ascent కోసం ప్రయత్నించాలి. పైకి ఎక్కాలి. తన చైతన్యాన్ని దివ్య తరంగా మార్చుకోవాలి. అని చెప్పారు. ఈ విషయాలన్నీ నేను శివరామశాస్త్రి గారి నుంచి కొంచెం, మా టీచరు చెప్పడం ద్వారా కొంత నేర్చుకున్నా. విశిష్టాద్వైతంలో గాని, ద్వైతంలో గాని జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడూ నిత్యమే. ఇక్కడ జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి కూడా ఒకటే అంశం కానీ అవస్థా భేదం చేత ఒకటి ఒకటిగా, ఒకటి ఒకటిగా మారిపోతూ ఉంటుంది. పరిణమిస్తూ ఉంటుంది. ఆ పరిణామంలో  మనం భాగమయ్యి ఎంత aspiration జరిగితే అంత  పరిణామం సిద్ధిస్తుంది. అప్పుడు ఈ జగత్తులో దుఃఖం పోతుంది. మృత్యువు పోతుంది. మృత్యువు ఉందనుకుంటాం మనం. భగవద్గీతలో చెప్పినట్టు ఈ శరీరం పోతుంది. మరో శరీరం వస్తుంది. పరిణమిస్తుంది తప్ప మృత్యువనేది భయంకర పదార్థం కాదు. మనం ఎంత కష్ట పడితే అంత పైకి పోతాం. Rituals ని పట్టించుకోను నేను. Traditions లో ఉండే rituals తో నాకు సంబంధం లేదు. దాంట్లో ఉండే సత్యంతో సంబంధం. ఆ సత్యం ఏమిటంటే నాకు నా దేశం, జాతి, సంస్కృతులు ముఖ్యం. ఇవి భద్రంగా ఉంటే జగత్తుకు భద్రం కలుగుతుంది. ఇందులో వుండే సకల ప్రాణులు భద్రంగా ఉంటాయి. మానవుడే మహనీయుడు అంటూ చెట్లు, పుట్టలు అన్నింటినీ ధ్వంసం చేసి ప్రకృతిని సర్వ నాశనం చేస్తుంటే ఏం జరుగుతుంది? Industrial Revolution రాకముందు ఎలా ఉండేది? ఇంత అకాలం ఉందా? ఇసుకను తీయడం వల్ల నీరూ పాయె, కొండలు, బండలు పోయేటప్పటికి వర్షాలూ పాయె.  ఋషులను సృష్టి తెలిసిన క్రాంత దర్శులు అన్నారు ఎందుకు? Universal truth తెలిసిన వాళ్ళు వారు. మరి మనం..? పరుగెడుతున్నాం. “రాజా కాలస్య కారణం” అని సామెత ఉంది. పరిపాలనా దోషాలు కాలాన్ని అకాలంగా మారుస్తాయి. మంచి వైపు వెళ్తున్నామా, చెడు వైపు వెళ్తున్నామా తెలియడం లేదు. మంచి జరుగుతుందనే ఆశించాలి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

9) భగవాన్ రమణమహర్షి గారు మీ ఆలోచనలను ఎలా ప్రభావితం చేయగలిగారు?

జ. వారి మార్గం అందరికీ ఆదర్శం ఆచరణీయం. అందుకే నచ్చింది నాకు. అరవిందో, రమణమహర్షి సమకాలికులు. చలం అంతగా మారడానికి కారణం చింతా దీక్షితులు. రమణ మహర్షి భక్తులు. అలా మారిన చలం తిరువణ్ణామలైలో స్థిరపడిపోయారు. నేను ఆయన్ను అక్కడే చూసాను. సౌరీస్ మొదలగు వారు అక్కడ ఒకే ఇంట్లో ఉండేవారు. చలం, నేను చాలాకాలం ఉత్తరాలు రాసుకున్నాం. మంచి కవిత్వం ప్రస్తావన వచ్చినప్పుడు సౌందర్యలహరి, శివానంద లహరి పుస్తకాలు పంపించాను ఆయనకి. ఆ సమయంలో ఆయన మారడం వల్ల లాభం ఏమిటి?  భగవద్గీతను అనువాదం చేశాడు. రమణ మహర్షిపై వచన గేయాలు రాశాడు.  గీతాంజలి అనువాదం చేశాడు. ఇన్ని చేసినా అంతకుముందు జీవితం పరిస్థితి ఏమిటి? అంతే.. మనిషికి కర్మఫలం తప్పదు.

10) ‘విశ్వలయ’ ప్రతిపాదన అంతరార్థాన్ని వివరించండి.

జ. సాహిత్యంలో ‘విశ్వలయ’ ఉండాలనే ప్రతిపాదన అది. సూర్యుడు ఉదయించడం, వాయువు వీయడం లాంటివన్నీ నియమాలకు లోబడి జరుగుతున్నాయి. ఇదే విశ్వంలో వుండే క్రమమైన వ్యవహారం. అంటే సృష్టి అంతా ఒక లయలో నడుస్తున్నది. భాషలో ఒక లయ ఉన్నది. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా ఒక లయ ఉన్నది. ఒక క్రమము, క్రమ వికాసము వున్నది. ఒక పువ్వు పుట్టడం, పరిమళించడం, రాలిపోవడం ఇవన్నీ కూడా సృష్టిలో ప్రతీ వస్తువుకు, ప్రతీ అంశానికీ ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే లయను అనుసరించిపోతే మనకు అనుకూలంగా నడుస్తుంది. దీనికి భిన్నంగా పోతే ప్రవాహానికి ఎదురీది నట్లు అవుతుంది. అట్లాగే కవిత్వంలో కూడా భాషలో లయ ఉండాలి. ఛందస్సులో లయ ఉండాలి. శబ్దంలో లయ ఉండాలి. అపశబ్దం ఉండకూడదు. సంగీతం పాడే వాళ్ళకు లయ ఉంటుంది. అలాగే భాషలో ఉండే లయ మనలో reflect కావాలి. ఋతువులన్నీ క్రమబద్ధంగా సాగుతాయి. శిశిరంలో గ్రీష్మం, గ్రీష్మంలో వర్షం రాదు. ఇప్పుడెందుకు వస్తుందంటే భూతాపం పెరిగింది కాబట్టి.

సుప్రసన్నాచార్యులు గారి మాటలు వినండి

అంటే ఇక్కడ విశ్వలయ తప్పింది. మనుషులే కారణం దీనికి. సృష్టి యొక్క లయ ఏంటంటే పుట్టడం, పెరగడం, చివరకు నశించడం ఇది పద్ధతి. మనిషి యొక్క చైతన్యం దాన్ని అనుసరించి ఉండాలి. స్త్రీలను హింసిస్తున్నారు ఇప్పుడు. ఢిల్లీలో, హైదరాబాద్ లో ఎక్కడైనా ఇదే నడుస్తున్నది. ఒక 50 ఏళ్ల నాటి క్రితం ఒక బంధుత్వం, ఒక ప్రేమ అన్నీ సహజంగా ఉండేవి. తర్వాత అవన్నీ పోవడం లేదా? ఇవాళ మానవ సంబంధాలు బలహీన పడలేదా? ఇవన్నీ మన జీవితంలోని లయను తొలగిస్తున్నవి. ‘విశ్వలయ’ అనేది ఏదో అద్భుతమైన విషయం అని కాదు. The system in the Universe un disturbed and help to growth towards universal consciousness. అదే విశ్వలయ అంటే.

11) తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో మీరు రాసిన పలు గ్రంథాల్లో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చినది ఏది?

జ. అన్నీ సంతృప్తిని ఇచ్చినవే.. ప్రతీదీ సంతృప్తి ఇస్తేనే రాశాను. నేను వ్యాపారం కోసం రాయలేదు. డబ్బు కోసం రాయలేదు. నేను నా మనసులోంచి తన్నుకు వచ్చిన భావాలనే రాశాను. “కన్నుల ఓకిరింతలుగ రాల్చెడి భాష్పజలము గొంతులో సన్నవడి.. పుట్టువుల చాళ్ళు దాటుతు వచ్చి నీ సన్నిధి చేరితి..మిగులు సంగతి నీదయా!” ఎంత వేదన ఉంటే ఇలా వస్తుంది? కన్నులకు కూడా ఓకిరింత ఉంటుందా? ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చామో..మనకు మంచి గురువు లభించడమంటే అది అదృష్ట విశేషమే.. ఎన్ని జన్మలు వెతుక్కుంటూ వస్తే ఆ గురువు లభిస్తాడు? అదొక అద్భుత సన్నివేశం. ఏదో అదృష్టవశాత్తూ ఈ దేశంలో ఉండే మట్టివాసన లభించింది.

12) విభిన్నమైన పద్య, వచన కవిత్వాన్ని ఎలా సంబాళించుకున్నారు?

జ. ఎందుకు భిన్నమైనవి? ప్రాచీన కావ్యాల్లో వచనం లేకుండా ఏ ఒక్కటైనా ఉందా? నిర్వచనమని రాసుకోవాల్సి వచ్చింది (నిర్వచనోత్తర రామాయణం).
పాత, కొత్త ఏమిటి? వేంకటేశ్వర గీతాలేమిటి? సింహగిరి వచనాలేమిటి? వేంకట పార్వతీశ కవులు భావ సంకీర్తనమనే కావ్యం రాశారు. దానిలో రెండవ భాగం అనుకుంటా…పూర్తి వచనంలాగా ఉంటుంది. పద్యమే అది ( గట్టిగా నవ్వుతూనే ). మీరు ఎంత తన్నుకున్నా పద్యం దొరకదు. చలం గారి వచనాలు? ప్రాచీనం ఏంటి నాకర్థం కాదు. భాష ప్రాచీనమవుతుందా? దాహం వేసినప్పుడు మంచినీళ్లు తాగడం సహజం అది ఏ భాషలో చెప్పినా.. అంతే కదా! చిలుక, కోకిల, మర్రిచెట్టు ఇవన్నీ ప్రాచీనమా? అప్పుడున్నది ఇవాళ లేనిదేమిటి? ఇవాళ లేదు అంటే మనం నాశనం చేసుకున్నదే. ప్రకృతికి మానవుడు చేసిన దుర్మార్గం తప్ప మరోటి కాదు. స్పందనలు అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. మృత్యుభయం అందరికీ సమానమే ఎప్పుడైనా.. “ఆహార నిద్రా భయ మైథునంచ సామాన్య మేతత్ పశుభిర్నరాణామ్” ఆహారం, నిద్ర, భయం, స్త్రీ పురుష సంగమం ఇవన్నీ మానవునికి పశువులకు సమానమే. అరిషడ్వర్గాలు ఇవాల్టివా, ముందు లేవా? “ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” దీంట్లో ప్రాచీనత, నవీనతలు ఏమున్నాయి? నేను వ్యతిరేకిస్తున్నానని అనుకోవద్దు. ఎక్కడ Universal అయితే అక్కడ కవి ఉంటాడు. Universal కాని చోట కవి ఉండడు. ఇదే సిద్ధాంతం.

13) అపారమైన మీ సాహితీ జగన్నిర్మాణంలో మూలాధారంగా నిలిచిన అంశం ఏది?

జ. సృష్టి రహస్యం తెలుసుకోవడం. మనిషి రహస్యం తెలుసుకోవడం. ఈ జీవితం continue కావాలి. Consiousness continue కావాలి. అది ఒక పరిమితిలో ఉంటుంది. దాన్ని దాటి రావాలి. కుండలో ఉన్న ఆకాశం వేరు. బయట ఉన్న ఆకాశం వేరు. కానీ కుండ అనేది దానికి పరిమితి విధించింది. కుండ పగిలిపోతే ఆకాశం లేకుండా పోతుందా? అలాగే “యూనివర్సల్ కాన్షియస్ నెస్” కూడా మన లోపలే ఉంది. అది బయట ఎక్కడో లేదు. అది అల్టిమేట్ గా మనకు కావాలి. అదే ముక్తి. అంటే ఘటాకాశ స్థితి నుండి మహాకాశ స్థితికి చేరుకోవడమే ఒకరకంగా మోక్షం.

14) అనేక ఉద్యమాలు, త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం లభించడం ఎలా అనిపించింది?

జ. తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం. ఈ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న భావనతో ఉద్యమం ఊపిరి పోసుకొంది. దానికి ముందే సాంస్కృతికోద్యమం జరిగిందని ముందే మీకు చెప్పాను. ఆ ఉద్యమంలో పదవులు, ఆకాంక్షలు, స్వార్థాలు లేవు. ఒక ఇంట్లో బలవంతుడు ఉంటే బలహీనుని ఇబ్బంది పెడతాడు. అన్యాయం జరగ లేదని నేననను. కానీ సాంస్కృతికోద్యమం బలహీన పడడం సరియైనది కాదు. అది ఎప్పుడూ బలంగా ఉండాలి. నిజాం కాలంలో అణచివేతకు గురయ్యాము. మన కర్మ..తప్పలేదు. మా మేనమామ ఆ రోజుల్లో హైదరాబాద్ లో చదువుతున్నాడు. ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు షేర్వాణి, కుచ్చు టోపీ ధరించి వచ్చాడు. ఆ వేషం చూసి ఆశ్చర్య పోయాను. కానీ తప్పదు. అణచివేత ఉన్నప్పుడు బాధ తప్పదు. అవి రాజకీయ పరమైనవి. రాజకీయానికి, సంస్కృతికి తేడా చూడాలి. ఒక సందర్భంలో ఒక మంత్రి గారిని కలవాల్సి వచ్చింది నేను. అందులో మాన్య మహాశయులు మంత్రి గారికి అని, కింద ఇతరులకు ఆచార్య, డాక్టర్ అని గౌరవ వాచకలున్నాయి. నా పేరు దగ్గర ఏమీ లేవు. అయితే మీరంతా డాక్టర్లు, ఆచార్యులు కానీ నేను కానా! అని ఆహ్వాన పత్రిక కింద పడేశాను. మనసు గాయపడింది. రాజకీయ బలం ఏంటంటే మనిషిని విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఇవన్నీ తలచుకుంటే కష్టాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్నప్పుడే శరీరం పక్కకు వాలిపోతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అవార్డులు వద్దు, రివార్డులు వద్దు. ఇస్తే వద్దని అనను. ఇవ్వమని అడగను. అంతే…

15) చివరగా రాబోయే తరాలవారికి మీ ఆశీర్వాద బలంగా ఏదైనా సందేశం ఇవ్వండి.

జ. (నవ్వుతూ) నా పుస్తకాలన్నీ సందేశాలే. నేను రాసిన కారణం “A search for Universal Truth” కోసమే. వెతుకులాట కోసమే. లయలో లీనమైపోవాలి. మొత్తానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆనందాన్ని పొందాలి. చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. మంచి వాయువు పీల్చాలి. అట్లా ఉంటే చాలు జీవితం ధన్యమైనట్లు…

………ఇంతటి వయస్సులో కూడా అడిగిన వెంటనే కాదనకుండా మాకోసం సమయాన్ని వెచ్చించినందుకు వేనవేల నమస్కారాలు. ఎన్నెన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మా జన్మలు ధన్యత పొందాయి..మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతాభివందనాలు.

You may also like

Leave a Comment