Home పుస్త‌క స‌మీక్ష‌ “పల్లె తల్లీ, జూలపల్లీ!”

“పల్లె తల్లీ, జూలపల్లీ!”

by Narendra Sandineni

కాంచనపల్లి గోవర్ధన్ రాజు కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రముఖ కవి,ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్, జర్నలిస్ట్,కాంచనపల్లి గోవర్ధన్ రాజు కలం నుండి జాలువారిన “పల్లె తల్లీ, జూలపల్లీ!” కవితపై విశ్లేషణా వ్యాసం.కవిత చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.గోవర్ధన్ రాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జూలపల్లీ పల్లెలో జన్మించారు.ఎవరికైనా జన్మనిచ్చిన పల్లె తల్లి లాంటిది అంటారు.కవితకు పల్లె తల్లీ జూలపల్లీ అని శీర్షిక పెట్టారు.పల్లె తల్లి ఎలా అవుతుంది అని మనలో ప్రశ్నలు ఎదురవుతాయి.జన్మనిచ్చిన జనని తల్లి అని మనందరికీ తెలుసు.ఏ పల్లె గడ్డ మీద మనం ఊపిరి పోసుకున్నామో ఆ పల్లె గడ్డ కూడా తల్లి లాంటిది అంటారు.జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి.కన్నతల్లి మాతృభూమి స్వర్గం కంటే కూడా గొప్పది.కన్నతల్లితో,జన్మభూమితో ఎంత అనుబంధం ఉంటుందో మాటల్లో చెప్పలేం.కన్నతల్లి తాను ఉన్నంతవరకు బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకుంటే… తర్వాత పుట్టిన నేల మనకు బ్రతుకును ప్రసాదిస్తుంది.ఈ భావన మనకు సుఖము లేదా గొప్పతనం నుండి రాదు.అది మనం స్వంత వ్యక్తులతో గల అనుబంధం నుండి మరియు మనం పెరిగిన ప్రదేశం గురించి మనం కలిగి ఉన్న మధురమైన జ్ఞాపకాల నుండి వస్తుంది..

” ఎలా మరచిపోను
“పెసరు చేల మీద విరిసే ఆకు పచ్చ వెన్నెలని
ఎలా మరిచి పోను అనే అనుభవం కవి హృదయంలో జ్ఞాపకంగా నిక్షిప్తమై ఉంది అని అర్థమవుతుంది.పెసరు చేల మీద ఆకుపచ్చని వెన్నెల ఎలా విరుస్తుంది అని మనలో సందేహాలు
పొడ సూపవచ్చు.వెన్నెల ఆకుపచ్చగా ఉండదు.
వెన్నెల పిండార బోసినట్లుగా ఉంది అంటాం.పెసరు
చేల మీద విరిసే ఆకు పచ్చని వెన్నెల అనడం
ప్రతీకలా తోస్తుంది.రాత్రులందు చంద్రుడి నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు.వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు.వెన్నెలని ఆంగ్లంలో మూన్ లైట్ అంటారు.పగలు చంద్రుడు వెన్నెల కురిపించినప్పటికీ సూర్యుని వెలుతురు ఎక్కువగాఉండటంవలనచంద్రకాంతినిగుర్తించలేం.పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా వెన్నెలను కురిపిస్తాడు.ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో,ఆకాశం నుంచి అంతా నిర్మలంగా ఉండి భూమి అంతా వెన్నెలతో నిండి ఉంటుంది.
“తాడి తోపుల నడుమ
“ముక్కలుగా ఖండించబడ్డ రాత్రులని
పల్లెలో ఎటు చూసినా పొలాల గట్లపై మరియు పెరండ్ల గట్లపై మరియు చేనుల గట్లపై తాడి తోపులు ఆకాశాన్ని అంటుకున్నట్టుగా ఉంటాయి.మనం ఒక పరి మనసుపెట్టి పరికించి చూస్తే తాడి తోపుల నడుమ రాత్రి ముక్కలుగా ఖండించబడ్డట్టుగా కనిపించడం సహజమే అనిపిస్తుంది.కవి గోవర్ధన్ రాజు భావన చక్కగా ఉంది.
“జనన మరణాలకు
“రాగద్వేషాలకు అతీతంగా
” నిర్లిప్తంగా ప్రవహించే వాగు చెలిని
పుట్టుక లేదా జననం.ఒక జీవి భూమి మీద జీవించడానికి పుట్టడం.ఈ జీవులు వాని జీవితకాలం పూర్తయిన తర్వాత మరణం ద్వారా ఈ భూమి నుండి నిష్క్రమిస్తాయి.ప్రతి జీవి తల్లి నుండి మాత్రమే జన్మిస్తుంది.
రాగం: బలమైన అభిమానం,ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.దేనికైనా అటాచ్ మెంట్/ అనుబంధం దానికోసం కోరికను సూచిస్తుంది.ఇది ఎమోషనల్ లేదా మేధాపరమైనది కావచ్చు.ఇది సాధారణమైన ఇష్టం లేదా ప్రాధాన్యతనుండి తీవ్రమైన కోరిక మరియు ఆకర్షణ వరకు ఉండవచ్చు.
ద్వేషం:ఒక దాని పైన విరక్తి /నిరాకరణ దానిపట్ల అయష్టతని సూచిస్తుంది.ఇది ఎమోషనల్ లేదా మేధా పరమైనది కావచ్చు.ఇది సాధారణ ప్రాధాన్యత లేనిదై ఉండి తీవ్రమైన వికర్షణం,వ్యతిరేకత మరియు ద్వేషం వరకు ఉండవచ్చు.
రాగ ద్వేషాలు:.ఇది ద్వంద్వత్వం.ఎందుకంటే అది మనల్ని సాపేక్షతలో తిరుగుతూ చేరుకోవడం మరియు దూరంగానెట్టడం,అంగీకరించడం మరియు తిరస్కరించడం,పరిగెత్తడం మరియు దూరంగా పారిపోవడం వంటి ప్రత్యామ్నాయ ప్రభావాలు లేదా ధ్రువాలు గా విలసిల్లుతాయి. వాటిలో భయంకరమైన విషయం ఏమిటంటే అవి ప్రత్యామ్నాయంగా మారడం కాదు.మన చుట్టూ తిరుగుతాయి.అవి ఒకదానికొకటి పరివర్తన చెందుతాయి.మనం ఒక సమయంలో ఇష్టపడేది మరొక సమయంలో ఇష్టం పడం.

నిర్లిప్తత: దూరం లేదా నిశ్చల స్థితి. వీరు మానసికంగా అంతగా ప్రమేయం లేనివారు.మరింత భౌతికమైన నిర్లిప్తత అనేది ఏదైనా విచ్ఛిన్నం అయినప్పుడు లేదా విడిపోయినప్పుడు వాస్తవం వేరుగా ఉంటుంది.ఇక భావోద్వేగ ప్రమేయాన్ని నివారించడం,ఒంటరిగా లేదా వేరు చేయబడిన స్థితి.అటాచ్ మెంట్ లేదా కనెక్షన్ నుంచి విడుదల చేసే చర్య
” నాకు జన్మ నిచ్చి
“కవిత్వ ఖండల జ్వలిత హృదయమిచ్చి
“నన్నొక ఉద్వేగ భూమికను చేసి
“ఇక్కడికి విసిరేసిన మా ఊరిని
“నా సమస్త బాల్యానుభవ సారాన్ని
సారవంతమైన భూమిలో రైతు చక్కటి పంటను పండిస్తాడు.కవి హృదయం రగిలినప్పుడు పదునైన భావాలతో కూడిన కవిత్వం ఉబికి వస్తుంది.కణ కణ మండే నిప్పు కణికెల వంటి అద్భుతమైన భావజాలంతో సమాజంలోని దుర్నీతిని ప్రక్షాళన చేయగలిగిన స్పందించే హృదయ సంస్కారంను
పెంపొందించుకున్న తీరు ప్రశంసనీయం.నన్నొక ఆవేశపూరితమైన వ్యక్తిగా, స్థావరంగా మలిచిన నా ఊరు జీవిత పోరాటంలో నన్ను నగరానికి విసిరేసింది.నా సమస్త బాల్యం లోని అనుభవ సారం తీపి గుర్తులు గా మిగిల్చింది.
“అపుడెపుడో
“మెదడుపై మోసిన పుస్తకాలని
“క్లాసులో పలకడం మరచిపోతే
“ఎర్ర మందారాలైన అరచేతులను
“వాగు చెంపలు పైన ఆనించే కదా ఊరడిల్లాను.
పల్లె బడిలో చదువుతున్న రోజుల్లో సారు చెప్పిన పాఠం అప్ప చెప్పకపోవడం జరిగినట్లుగా తెలుస్తోంది.పాఠాలను అప్పచెప్పని వాళ్లకు శిక్ష ఉంటుందని మనకు తెలుసు.ఎందుకు చదవలేదు అని ప్రశ్నించి సార్ బెత్తంతో కొట్టిన దెబ్బలకి చేతులు ఎరుపెక్కి ఎర్రమందారాలుగా కమిలినాయి.అట్టిఎర్ర మందారాలైన కమిలిన చేతులకు కలిగిన నొప్పిని వాగులో ప్రవహించే నీటి చెంపల పైన ఆనించి ఉపశమనం పొందాడు అని తెలుస్తోంది.
వాగు నీరు అర చేతులకు తాకగానే దుఃఖం
నుండి ఊరడిల్లాను అనే అనుభూతిని పంచుకోవడం చక్కగా ఉంది.ఆనాటి పల్లెలోని పాఠశాల జ్ఞాపకాలను ఒక మధురస్మృతిగా చెప్పుకుంటున్న తీరు అద్భుతంగా ఉంది.
“స్వప్నాల స్మృతి పరిమళాలను తలచుకుంటూ
“రేపు వీణను ఒక స్వరంగా మీటుదామని
“వసంత రాగాల చిగురు గాలులని భోంచేస్తూ’

రచయిత కాంచనపల్లి

“ఈ మామిడి చెట్టు మీదనే కదా
“ఒక కోయిల పాటనై వీచాను
నిద్రలో వచ్చేవి కలలు.కలలో వచ్చే జ్ఞాపకాల సుమ పరిమళాలను కవి తలచుకుంటున్నారు.ఈరోజు వాస్తవం అని మనందరికీ తెలుసు.రేపటి రోజు గురించిఎవరికీతెలియదు.వీణ చదువుల తల్లి సరస్వతి మాత చేతిలో ఉండే వాయిద్యం.సంగీత వాయిద్యాలలో వీణ శ్రేష్టమైనది.రేపు వీణను ఒక స్వరంగా మీటుతుంటే పాటై పలుకుతుంది.మనసు పాటల తోటలో ఉయ్యాలలూగుతుంది.వసంత రాగం వసంత ఋతువు సాయంత్రం వేళల్లో పాడుకునేందుకు అనువుగా ఉంటుంది మరియు శుభప్రదమైనరాగంగాపరిగణించబడుతుంది.వసంత ఋతువు ఆమని ఆగమనంతో ఇంపైన రాగాలు పలుకుతోంది లోకం.వసంతంలో పుడమి సరికొత్త రంగులని పులుముకుంటుంది.వసంత ఋతువును ఋతువుల రాణిగా చెబుతారు.వసంత కాలంలో చెట్లు చిగురుస్తాయి.పువ్వులు వికసిస్తూ పరిమళాన్నివెదజల్లుతుంటాయి.ప్రకృతి పులకరిస్తుంది. జీవరాశికి ఈ కాలం ఆహ్లాదకరంగాఉంటుంది.వసంతంలో మామిడిచెట్టుమీది కోయిల కుహు కుహుమంటూ రాగాలు ఆలపిస్తుంది.కోయిల ఒక రకమైన నల్లని పక్షి. కోయిల స్వరం మధురంగా ఉంటుంది.కోకిల స్వరం వింటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది.కోయిల,మైనా లాంటి ఒక పక్షి. కోకిల మామిడి చెట్ల చిగుర్లను తింటుంది.ఈ మామిడి చెట్టు మీదనే కదా ఒక కోయిల పాటనై వీచాను అని సరికొత్తగా భావాన్ని వ్యక్తం చేసిన తీరు అబ్బుర పరుస్తుంది.
“చితాగ్ని దేహపు జీవిత సత్యం
“కళ్ళల్లో బూడిద విసురుతున్నప్పుడు
“చావు పుట్టకల పొలిమేరల గురించి
“అర్థ రాత్రి ఈ పొలం గట్టునే కదా
“చెలికాండ్రను చర్చనై స్పృశించాను
“జూలపల్లీ,జూలపల్లీ
ఏ మనిషి అయినా చివరి అంకం ముగింపు చావు.చనిపోయిన వ్యక్తి దేహాన్ని చితిని పేర్చి చితాగ్నికి అర్పించి ఆహుతి చేస్తాం.చివరికి మనిషి పిడికెడు బూడిదగా మిగిలిపోతాడు.చితాగ్ని దేహపు జీవిత సత్యం మన మెరిగినదే.స్మశాన వాటికలో గాలి వీచి కళ్ళలోకి బూడిద విసురుతున్నప్పుడు చావు పుట్టుకల పొలిమేరల్ని గురించి అర్ధరాత్రి పొలం గట్టున కూర్చుండి స్నేహితులతో చర్చించాను.ఆనాటి జ్ఞాపకాల దొంతరలను పల్లె జూలపల్లీ లోనే కదా తన్మయత్వంతో వ్యక్తీకరించిన భావాల్లో నిజాలు దాగి ఉన్నాయి అని తోస్తుంది.
“ఎన్ని నిశ్శబ్దపు రాత్రుల్ని నాలో
“లీనం చేశావు జూలపల్లీ
పుట్టి పెరిగిన పల్లెలో ఎన్నో రాత్రులు శబ్దం లేకుండా నిశ్శబ్దంగా గడపడం జరిగింది.మనుషుల జీవితాల్లో కొన్ని నిశ్శబ్ద రాత్రులు కూడా ఉంటాయి.పల్లె జూలపల్లీ నిశ్శబ్ద రాత్రుల్ని నాలో లీనం చేశావని పరవశంతో పల్లెను గుర్తు చేసుకుంటున్నాడు.
“నేనిపుడేమై పోతున్నాను
పల్లెను గుర్తు చేసుకుంటూ నేనిపుడు ఏమైపోతున్నాను అని.పల్లె జూలపల్లీని తలుచుకుంటున్నాడు.పల్లె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు.పల్లెతో మూగగా సంభాషిస్తున్నాడు.పల్లె గురించి తనలో తను మధన పడిపోతున్నాడు.పల్లెతో పెనవేసుకున్న బంధానికి సాక్ష్యంగా ఈ కవిత నిలుస్తుంది.
“ఖండిత హృదయంలో ఊరుతున్న
“రక్త నది నయ్యాను కదా జూలపల్లీ
ఖండిత హృదయంలో ఏం ఊరుతుంది? కారిన రక్తంతో హృదయం ఏరులై పారుతుంది.రక్తంతో తడిసి రక్త నది కాక మరి ఏమవుతుంది? రక్త నది నయ్యాను కదా పల్లె జూలపల్లీ అని పల్లె తో సంభాషిస్తున్న తీరు పట్ల ఆవేదన కలుగుతుంది.
“నగర ఖడ్గాన్ని నమ్మిన మేక పిల్లనై
“ఎడ్పులను నవ్వుతున్నాను కదమ్మా
మనిషి జీవన గమనంలో ఎక్కడ పనిచేస్తాడో,ఎక్కడ ఉంటాడో,ఎవరికీ తెలియదు.కొందరు ఉన్న ఊళ్లోనే వ్యవసాయం మరియు కూలీ పనులు చేస్తూ ఉంటారు.కానీ కొందరు చదువుకొని ఉద్యోగాల పేరిట ఏ నగరంలో అవకాశం ఉంటే అక్కడ ఉంటారు.నగర ఖడ్గాన్ని నమ్మిన మేక పిల్లనై ఉద్యోగం చేస్తూ నగరంలో నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్టు అర్థమవుతున్నది.మేక పిల్లను పెంచి పెద్ద చేస్తారు.దేవుని పేరిట మేక పిల్లను బలి ఇచ్చే అనాచారం కొనసాగుతున్నది.కొందరు బలవర్ధకమైన ఆహారంకొరకుమేకమాంసంతింటారు.ఉద్యోగం పేరిట నగరమనే ఖడ్గాన్ని నమ్మి మోసపోయాను.కాని ఆ నగరంలో నేను సుఖంగా సంతోషాలతో జీవించడం లేదు.ఎడ్వ లేక నవ్వుతున్నాను అని బాధతో పల్లెతో ఏకరువు పెడుతున్న తీరు పల్లె జూలపల్లీ పట్ల ఆయనకు ఉన్న అపారమైన అనురాగం తెలియజేస్తోంది.
“నా కోటి శరత్తుల జ్ఞాపకమా
“ఊపిరి ధార స్రవించినంత వరకు
“నిన్ను స్మరిస్తాను
శరదృతువు అంటే ఆశ్వయుజ,కార్తీక మాసంలో వస్తుంది.మంచివెన్నెల కాయు కాలం.వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.దసరా మరియు దీపావళి పండుగలు ఈ ఋతువులోనే వస్తాయి.అందుకే పల్లె జూలపల్లీ నా కోటి శరదృతువుల జ్ఞాపకం గా నిలిచిన నిన్ను నాలో ఊపిరి ధార స్రవించినంతవరకు నిన్ను స్మరిస్తాను.పల్లె గురించి సంతోషంగా వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“సమస్త దేహాన్ని చేతులుగా మలుచుకొని
“నీకు నమస్కరిస్తాను
ఏ పల్లెలో జన్మించానో ఆ పల్లె జూలపల్లీ ని సమస్త దేహాన్ని చేతులుగా మలుచుకుని సాష్టాంగ నమస్కారం చేస్తాను అని ప్రతిన పూనిన తీరు అద్భుతంగా ఉంది.పవిత్రమైన పల్లె జూలపల్లీ పునీతమైందని అర్థమవుతుంది.పల్లె జూలపల్లీకి తలవంచి నమస్కరించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని భావిస్తున్నాడు..కవి గోవర్ధన్ రాజు పల్లె జూలపల్లీ కవితను సార్థకం చేశారు.గోవర్ధన్ రాజు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

You may also like

Leave a Comment